మన భారతదేశం గర్వించదగిన ముగ్గురు అద్భుతమైన మహిళా దర్శకులు!  (రెండవ సినిమా) 

అమ్మాయిలు అంతరంగాలలో ప్రేమాస్పదులే!  

‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ అనే ఈ చిత్రం ఇండియా-ఫ్రెంచ్ సహ నిర్మాణంలో 2024 లో వచ్చింది. దీని రచన , దర్శకత్వం శుచి తలాటి నిర్వహించింది. దీని నిడివి 118 నిమిషాలు. ఇంగ్లీష్, హిందీ భాషలలో, అమెజాన్  ప్రైమ్ లో విడుదల అయింది.

ఇతివృత్తం; శుచి తలాటి తొలి చిత్రం “గర్ల్స్ విల్ బి గర్ల్స్”, ఒక భారతీయ బోర్డింగ్ పాఠశాల నేపథ్యంలో, కౌమార ప్రేమలు – సామాజిక అంచనాల వాతావరణంలో తల్లి-కూతుళ్ల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని అన్వేషిస్తుంది. మహిళల మధ్య వైరుధ్యాలు – సంఘీభావాలను  ఈ చిత్రం వాస్తవికంగా చిత్రీకరించినందుకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది.

గృహాల్లోనూ, బయట ప్రపంచంలో కూడా అనాది నుంచి సనాతన ధర్మాల ఊబిలో కూరుకు పోయిన సమాజంలో బాలికలు, స్త్రీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికీ ఎంతగా పోరాడాలో, వారు తమ జీవితాలు, హృదయాలు, శరీరాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలపై ఎంత నిఘా, నియంత్రణలు ఉంటాయో దృశ్యమానం గావిస్తుందీ సినిమా.  అబ్బాయిలకు లాగే అమ్మాయిలకు కూడా యుక్త వయసులో లైంగిక మేలుకొలుపులు, లైంగిక అవగాహనలను ఆన్వేషించాలని ఉంటుందని ధైర్యంగా సంప్రదాయ భావనలకు విరుద్ధంగా ఈ సినిమాను నిర్మించింది దర్శకురాలు శుచి తలాటి. కథానాయిక మీరా ప్రకాష్ (ప్రీతి పాణిగ్రాహి) నియమాల ఉచ్చును దాటుకుని వెళ్ళడానికి ఎలా ప్రయత్నిస్తుందనేదే  “గర్ల్స్ విల్ బి గర్ల్స్” సినిమా కథాంశం.

ఈ చిత్ర కథ హిమాలయాలలోని ఒక కఠినమైన బోర్డింగ్ పాఠశాలలో జరుగుతుంది. అక్కడ 16 ఏళ్ల మీరా శ్రద్ధగా చదివాలనే తపనతో ఉన్న విద్యార్ధినిగా తరగతిలో అగ్రస్థానంలో ఉంటుంది.  ఆమె ఆ పాఠశాలలో హెడ్ ప్రిఫెక్ట్‌ గా ఎన్నికైన మొట్టమొదటి అమ్మాయి. మీరాకు పాఠశాలలో, దాదాపు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. పాఠశాల సనాతన ధర్మాలకు సంబంధించించిన అత్యంత కఠినమైన నియమ నిబంధనలను విధించి, వాటిని క్రమశిక్షణగా పాటించాలని ఆదేశిస్తుంది. మీరా వాటిని భక్తి, శ్రద్ధలతో  పాటించడమే కాక విద్యార్ధులందరినీ వాటికి పూర్తిగా కట్టుబడి ఉండేలా చూడవలసిన నైతిక బాధ్యతను కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉంటుంది. పాఠశాల విద్యార్ధులందరూ కూడా ప్రారంభ సన్నివేశాలలో మీరా పట్ల ఆరాధనాభావంతో ఆమె చెప్పినట్లే నడుచుకుంటారు. తెలివైన ప్రతిభావంతమైన విద్యార్థినిగా ఆమెపై ఉన్నఆశల వల్ల  ఉపాధ్యాయులు కూడా మీరాను బాగా అభిమానిస్తుంటారు!  

మీరా పాఠశాల హెడ్ ప్రిఫెక్ట్‌ గా ఆమె నియామకం వెనుక ఆమెకు  అంతర్లీనంగా ఒంటబట్టిన సంప్రదాయ వాదమే ప్రధాన కారణం కావచ్చు. ఆమె విధుల్లో ఉదయం సమావేశాలలో ప్రమాణం చేయడం – ప్రమాణంలో “భారతీయ విలువలను” నిలబెట్టడం గురించి కూడా ఉంటుంది. తోటి విద్యార్థులకు హద్దులు నిర్ణయించడం, కొన్నిసార్లు అవి దాటినందుకు అక్షరాలా మందలించడం, క్రమశిక్షణ పట్ల ఆమెకున్న బానిస భక్తి వల్ల  మీరాకు తన తోటి విద్యార్ధులలో ఆదరణ ఉండదు, కానీ అబ్బాయిలను మాత్రం ఇది చాలా ఆకర్షిస్తుంది.   

పాఠశాల డేటింగ్‌ను నిషేధిస్తుంది. అమ్మాయిలను అబ్బాయిల నుంచి దూరంగా ఉంచేందుకు అది తన శక్తిమేరకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక ఉపాధ్యాయురాలు, ఒక విద్యార్థినిని పొట్టి స్కర్ట్ వేసుకుందనే కారణంతో గట్టిగా మందలించి తర్వాత, మోకాళ్ల కింది వరకు ఉన్న మీరా యూనిఫామ్ లాగా అందరూ ధరించాలని ఆమెను ఆదర్శంగా చూపిస్తుంది.  

మీరా తల్లి అనిల (కని కస్రుతి) అదే పాఠశాలలోనే 12వ తరగతి వరకు చదువుతుంది. వారి ఇల్లు స్కూలుకి దగ్గర్లోనే ఉన్నప్పటికీ మీరా హాస్టల్ లో ఉండడానికే ఇష్టపడుతుంది. ఈ కాలం టీనేజ్ పిల్లలు తల్లుల్ని భరించ లేమంటారు, మీరా కూడా అదే భావాలతో ఉంటుంది. ఆమె తండ్రి (జితిన్ గులాటి) వ్యాపార నిమిత్తం ప్రయాణిస్తూ, వారితో లేకపోవడం కూడా ఆమె టీనేజ్ ఆందోళనలను మరింత పెంచుతుంది. తల్లీ-కూతుళ్ళు సుదీర్ఘకాలం విడిగా ఉండడం వల్ల ఇద్దరూ ఒక విషయం పట్ల స్పందించే తీరులు వేరు వేరుగా ఉంటాయి. ఈ సినిమా బోర్డింగ్ పాఠశాలల తీరుతెన్నుల్ని విశదీకరిస్తుంది. ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థుల పట్ల వాత్సల్యాభిమానాలతో ఉంటారు. అబ్బాయిలు కొందరు చిలిపిగా, పరాచి కాలాడుతూ అమ్మాయిలకు ‘ప్రపోజ్’ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఉపాధ్యాయులు మాత్రం పాఠశాల నియమ, నిబంధనలను అమలు చేయడంలో గర్వపడుతుంటారు.  ఉదాహరణకు, శ్రీమతి బన్సాల్ (దేవికా షహాని) ఒక మోడల్ టీచర్. ఆమె బాలికలను షార్ట్ స్కర్టులు విషయంలో నియంత్రిస్తుంది, కానీ అబ్బాయిలతో ‘స్నేహపూర్వకం’ గా, ఉండి వారికి ఏ నిబంధనలూ అమలు చేయదు!

కఠిన నిబంధనలన్నీ అమ్మాయిలకే ఉంటాయి. అబ్బాయిలకు ఏవీ వర్తించవని ప్రేక్షకులకు అర్ధమవుతుంది.  పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు అనిల, మీరాను ఇంటికి తెచ్చి తన ఎదురుగానే ఉండేలాగా సాధ్యమైనంతవరకు తన దృష్టి నుంచి తప్పించుకోకుండా కనిపెట్టుకుని ఉంటుంది.  

హాంగ్‌కాంగ్ నుంచి వచ్చి పాఠశాలలో కొత్తగా ఒక దౌత్య ప్రతినిధి కుమారుడు శ్రీనివాస్ (కేశవ్ బినోయ్ కిరోన్) చేరతాడు. అతను మనోహరమైనవాడు, బాగా మాట్లాడతాడు, ఆప్యాయతగా  ఉన్నాడని అతని గురించి అభిప్రాయపడుతుంది మీరా. శ్రీ ఖగోళ శాస్త్రం లాంటి సైన్స్ విషయాలు చెప్తుంటే కళ్ళప్పగించి చూస్తుంది. 

టీనేజర్లందరి మాదిరిగానే, మీరాకు కూడా తన శరీరంలోని మార్పుల గురించి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆమెకు కొత్తగా వచ్చిన అబ్బాయి శ్రీ మీద ఇష్టం కలుగుతుంది.  మీరా శ్రీ (నివాస్) ఒకరికొకరు దగ్గరవుతున్న కొద్దీ, మీరా ప్రేమ, లైంగిక అనుభూతుల తొలి భావనలను అనుభవిస్తుంది.  కానీ అతను తన గతం గురించిన కొన్ని విషయాలను దాచినప్పుడు ఆమె బాధపడుతుంది. అయినప్పటికీ, అతనితో స్నేహం గానే ఉంటుంది.  అయితే శ్రీకి తన తల్లితో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చూసి మీరా అసూయపడుతుంది. మీరా ఇంట్లో శ్రీ పుట్టినరోజు వేడుకల సమయంలో ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి. అక్కడ వారి స్నేహంలో తన తల్లి ఉనికి వల్ల తాను ప్రాధాన్యత కోల్పోతున్నానని మీరా భావిస్తుంది. తమ సంబంధం వృద్ధి చెందాలంటే అనిల నమ్మకాన్ని పొందడం చాలా ముఖ్యమని శ్రీ, మీరాకి  నొక్కి చెబుతాడు. అతని పరిణతి చెందిన ప్రవర్తన అనిలని కూడా ఆకర్షిస్తుంది

మీరా, అనిలతో శ్రీ ప్రజల నుండి తాను కోరుకునేది పొందడం గురించి తన దృక్పథాన్ని పంచుకుంటాడు. “నేను ఆమెను భరించలేను” అని మీరా శ్రీ తో చెబుతుంది. నిశ్శబ్దంగా ఒంటరి జీవితాన్ని భరిస్తున్న తల్లికి అండగా ఉండవలసిన బాధ్యత  ఉందని శ్రీ,  మీరాకు విడిగా నచ్చ చెప్తాడు.   

మీరా పాఠశాలలో శ్రద్ధగా చదివి ప్రధమ శ్రేణిలో నిలుస్తున్న విద్యార్థిని కాబట్టి చదువు అనే మిషతో క్రమం తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్తుంటాడు శ్రీ. వారిరువురి మధ్య వ్యామోహం, లాలసలు, ప్రేమ ప్రకంపనలు ప్రారంభమవుతాయి. అనిలకు వయసు ఆకర్షణల గురించి తెలుసు కానీ ఆమె కూడా అతని పట్ల కొన్ని అస్పష్టమైన భావాలను పెంచుకుంటున్నందు వల్ల శ్రీని ఇంటికి రాకుండా ఆపలేదు. నిజానికి తన వయస్సుకు మించిన తెలివి మీరిపోయిన శ్రీ ఇద్దరి స్వభావాల గురించి పూర్తిగా అర్ధం చేసుకున్న వ్యక్తిగా ఇద్దరితోనూ సన్నిహితంగా ఉంటూ ఇద్దర్నీ లైంగికంగా వాడుకోవడానికి మంచి అవకాశంగా భావించి వారితో నటిస్తూ ఉంటాడు.    

చెంపపై పెట్టిన ఒక చిలిపి ముద్దే మీరాకి దాటకూడని ఒక పెద్ద హద్దు అవుతుంది. శరీరంలో వస్తున్న మార్పులు ఆమెను రక రకాల గందరగోళాలకు గురి చేస్తాయి. శ్రీ పరిచేయంతో ఊహించని ఈ స్పార్క్ ఆమె స్థిరపడిన ప్రపంచాన్ని గొప్ప కుదుపులకు గురి చేస్తుంది. దానివల్ల ఆమె ఊహల్లో తేలిపోతూ మొదటి ముద్దుకోసం రహస్య ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. కానీ మీరా కోరుకునే వ్యక్తిగత స్థలం ఆమెకు అసలు ఎక్కడా అందుబాటులో ఉండదు. అనిల వెంటనే ముందుకు వచ్చి పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడం ప్రారంభిస్తుంది. ఆరంభమవుతున్న ఆ స్నేహాన్ని దగ్గర నుంచి గమనిస్తూ నియంత్రించడమే ఆమె లక్ష్యం. తనకు చాలా తక్కువ స్వేచ్ఛ మాత్రమే ఉన్న పరిస్థితుల్లో, మీరా తన లైంగిక ఆకాంక్షలను, శ్రీ తో దొంగచాటుగా గడిపే క్షణాలను సాధ్యమైనంత యుక్తిగా, సాధించుకోవడానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సంకోచంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. తన కుమార్తె మేలే హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని సహజంగానే నమ్మే తల్లి తప్పనిసరిగా జోక్యం చేసుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకుని, మీరా ఆ జోక్యం నుంచి తన వ్యవహారాన్ని దూరంగా మళ్లించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.

అనిల “నా నుంచి ఏదైనా దాచాల్సిన అవసరం నీకు లేదు,” అని మీరాతో అంటుంది. కానీ అదే సమయంలో, కౌమార దశలో ఉన్న తన కుమార్తెకు అలా దాచుకోవడానికి ఎన్నో కారణాలను కూడా ఆమే కలగజేస్తుంది. తాను ఎదుగుతున్న రోజుల్లో, తాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి-అంటే మీరా తండ్రిని ప్రేమించిన సమయంలో ఆమె తలి తండ్రుల నుంచి అనిల ఎదుర్కొన్న అదే ప్రవర్తనా నియమాలను బలవంతంగా మీరా మీద ప్రయోగిస్తుంది.  మీరా – అనిల ఇద్దరూ వారి కోరికలు, కలలతో పోరాడుతుంటారు.

ఇంటి వంట భోజనం కోసం ఆశపడే ఒంటరి హాస్టల్ నివాసి శ్రీ (నివాస్) తో తల్లి-కూతుళ్ల సంబంధం అభివృద్ధి చెందుతున్న క్రమాన్ని ఆసక్తిగా చూస్తారు ప్రేక్షకులు. పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంలో మీరా-శ్రీ లను కలిసి చదువుకోవడానికి అనిల అనుమతిస్తుంది. తన ఇంటికి ఆహ్వానించే “మంచి యువకుడు” కోసం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది అనిల. ఆమె శ్రీ ని తొలిసారి కలిసినప్పుడే, “నేను స్నేహం కన్నా ఎక్కువగా ఏదీ అనుమతించను” అని స్పష్టంగా చెప్తుంది. ఆ ఆదేశాన్ని పాటించాలనే మానసిక స్థితిలో మీరా గానీ, శ్రీ  గానీ కనిపించరు. అయితే వారు ఏం చేస్తున్నారో తనకు తెలుసని అనిల ఎప్పుడూ వారికి గుర్తు చేస్తూనే ఉంటుంది!

మీరాపై ఆమె తల్లి, ఉపాధ్యాయులు, అలాగే సహ పాఠశాల విద్యార్ధుల ఎడతెగని నిఘా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. శ్రీ తో మీరా సాగిస్తున్న ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమేనని సూచిస్తూ ఆమె సహచర విద్యార్ధిని ప్రియా (కాజోల్ చుగ్) “మీరా, నాక్కూడా కళ్ళున్నాయి,” అని మీరాతో అంటుంది.  తర్వాత శ్రీ వాళ్లింట్లోనే ఒక రాత్రి ఉండిపోయినప్పుడు, మీరా మరొక రహస్య కలయిక కోసం ఆలోచన చేయబోతే, “ఏం జరుగుతోందో నాకు కనిపించడం లేదనుకుంటున్నావా?” ఎప్పుడూ నిఘా కళ్ల కింద ఉండే ఈ పట్టణంలో అమ్మాయిలు అజ్ఞాతంగా ఉండడం అసాధ్యం అని అనిల, మీరాతో అంటుంది.

ఇంతకుముందు మీరా పట్ల ఎంతో గౌరవంగా ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్ధులలో కూడా మీరా శ్రీతో సాగిస్తున్న ప్రేమ కలాపాల వల్ల పాఠశాలలో, హెడ్ ప్రిఫెక్ట్‌ గా మీరా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆమె చెప్తున్న ప్రమాణాన్ని పట్టించుకోకుండా, ఆమె మాట వినడానికి బదులు చులకనగా చూస్తూ అల్లరి చేస్తారు.  ఇక ఆమెకు భరించలేని పరిస్థితిలో  ఒంటరిగా ఉండటానికి మేడ మీదకు  వెళుతుంది, శ్రీ ఆమెను అనుసరిస్తాడు. కొంతకాలం ముందు ఒక విద్యార్ధి మీరాకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఆమె పట్టించుకోదు. అతని గుంపు ఆమెతో ఘర్షణకు దిగి వెంబడిస్తుంది.  గత్యంతరం లేని మీరా బాలికల హాస్టల్‌ లోకి చొరబడి, అక్కడే తలుపులు బిగించుకొని ఉండి  తనను ఇంటికి తీసుకెళ్లమని తల్లిని ఫోన్ లో పిలుస్తుంది. ఈ సంఘటన అనిల – మిస్ బన్సాల్ మధ్య ఘర్షణకు దారితీస్తుంది, మీరా చదువులో వెనకబడుతోందని, శ్రీతో ఆమె సంబంధం పట్ల అనిల శ్రీని తన ఇంటికి అనుమతించే విచ్చలవిడి వైఖరిని విమర్శిస్తుంది. కానీ అనిల “నా ఇంటికి ఎవరు రావాలో నేనే తేల్చుకుంటాను”  అని చెప్తూ మీరాను గట్టిగా సమర్థిస్తుంది.

మీరా చివరకు శ్రీ తారుమారు చేసే స్వభావాన్ని అర్థం చేసుకుంటుంది.  ఆమె తన తల్లి భావాలను, త్యాగాలను తక్కువ అంచనా వేశానని తెలుసుకుంటుంది. మరుసటి శనివారం తిరిగి కలవ గలరా అని శ్రీ అడిగినప్పుడు, మీరా “లేదు”  అని స్పష్టంగా  సమాధానం చెప్తుంది. చివరి సీన్ మీరా ప్రేమగా తన తల్లి జుట్టుకు సున్నితంగా, నూనె రాస్తూ కనిపించడంతో కథ ముగుస్తుంది.  చివరికి వారు ఆమోదయోగ్యం కాని స్థితికి వ్యతిరేకంగా ఒక ఉత్తేజకరంగా కలిసిపోయారని ప్రేక్షకులకు అర్ధమై హాయిగా ఊపిరి పీల్చుకుంటారు!   

                                              ప్రతిష్టాత్మక చిత్రనిర్మాణం

శుచి తలాటి మొట్ట మొదటి ఫీచర్ ఫిల్మ్ ఇది. దర్శకురాలు ఎదిగే వయసులో తన పాఠశాలలోని ఒక అనుభవం నుండి ప్రేరణ పొందింది. ప్రధానంగా మూడంటే మూడే పాత్రల మీద దృష్టి పెట్టి సినిమాని చిత్రీకరించింది. మిగిలిన స్నేహితులున్నప్పటికీ వాళ్ళ పాత్రలు చాలా తక్కువ ప్రాధాన్యతతో ఉంటాయి. దర్శకురాలు సెటప్ లో ప్రారంభ సీన్ లను చాలా అందంగా చూపిస్తుంది.

ఆకట్టుకునే కెమెరా పనితనం ఈ చిత్రాన్ని నిజంగా చాలా ప్రత్యేకంగా నిలిపింది. ప్రతి సన్నివేశాన్నీ గొప్ప శ్రద్ధాసక్తులతో  నిర్మించారు. మీరా ఇల్లు అయినా లేదా బోర్డింగ్ స్కూల్ అయినా పాత్రలు వారి పరిసరాలలో సంపూర్ణంగా కలిసిపోవడం చాలా ఆకర్షణీయంగా ఉంది. సినిమా సెట్టింగ్‌ను, అందులోని  పాత్రలను ప్రతీకాత్మకంగా రూపొందించడానికి ఎలా ఉపయోగించుకుంటుంది అనే విషయాన్ని ముఖ్యంగా ఈ సినిమా తెలుపుతుంది.  

మీరాపై అనిల నిరంతరం నిఘా ఉంచుతూ ఉంటుంది. “నా కుమార్తెనే నా ప్రాధాన్యం,” అని ఆమె స్పష్టంగా చెప్తుంది. ఒక దృశ్యంలో, తొలి ప్రేమ అనుభూతిని రుచి చూసిన మీరా తన డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు కూర్చుంటుంది.  రేడియోలో సంగీతం వినిపిస్తూ ఉంటుంది. మృదువైన పాట లయకు ఆమె ఒయ్యారంగా హొయలు పోతుండగా, అనిల గదిలోకి ప్రవేశించడాన్ని కెమెరా చూపిస్తుంది.  అనిల  కూడా నాట్యం చేస్తూ, మీరా వ్యక్తిగత స్థలంలో ప్రవేశించి పెత్తనం చేస్తున్నట్లు, అకస్మాత్తుగా నాట్యం ఆపేసి, సంగీతాన్ని నిలిపివేస్తుంది.

భావోద్రేకాల హోరులో నలిగిపోతున్నట్లు  నిశ్శబ్ద  తిరుగుబాటు తత్వంతో,  రగిలిపోతున్న హార్మోన్లు  తమ తమ దారిలో సాగుతూ, తన ఇష్టానికి విరుద్ధంగా కొన్ని పరిమితుల్లో బంధించబడకూడదనే ఒక అమ్మాయి దృఢ సంకల్పాన్ని హృద్యంగా, సూక్ష్మంగా గమనించి, సహానుభూతితో గాఢమైన, లోతైన అవగాహనతో చిత్రించిన ప్రభావవంతమైన చిత్రం ఇది. వ్యక్తిగతంగా దర్శకురాలు మీరాని సహృదయంతో అర్ధం చేసుకుంటున్నట్లు చిత్రీకరించింది. 

ఈ సినిమాలో మాటలు చాలా తక్కువగా ఉండి దృశ్యాలలో అనేక పొరలుగా భావాలు వ్యక్తమవుతాయి. సినీ విజ్ఞాన పండితుడు జాన్ రీడ్ (John Reed) సంభాషణలు, డైలాగులతో కాకుండా దృశ్యాల ద్వారా వ్యక్తం చేసేదే మంచి సినిమా అన్నాడు. ఆయన చెప్పిన దృశ్యలక్షణాలలో చక్కగా ఒదిగిపోతుందీ చిత్రం. ప్రారంభం నుంచి చివరి వరకు భావాలను దృశ్యాల ద్వారా చెప్పే సన్నివేశాలతో నిండిపోయి ఉంటుంది. స్క్రీన్‌ నుంచి ఒక్క క్షణమైనా కళ్లు తిప్పితే, ఒక ప్రపంచాన్నే కోల్పోతారు ప్రేక్షకులు. అత్యంత సూక్ష్మంగా మంత్ర ముగ్ధులను చేసే విధంగా చిత్రీకరించిన సినిమా ఇది. అదే సమయంలో విశ్వవ్యాప్తంగా హృదయాలను  తాకేలా ఉంటుంది.

మీరా – శ్రీల బాల్య ప్రేమ, ఆమె చెప్పినట్లుగా, ‘పెద్దల ప్రేమ’గా పరిణామం చెందుతున్న క్రమంలో, శుచి తలాటి వారి సంబంధానికి ఒక సరికొత్త, గాఢమైన కోణాన్ని పరిచయం చేస్తుంది. శ్రీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ సమయం గడపడం ప్రారంభిస్తాడు. క్రమంగా, అనిలకు కూడా మరింత దగ్గరవుతున్నట్లు కనిపిస్తుంది. ఇది అమాయకంగా ప్రారంభమవుతుంది, వారు మీరాతో సంబంధం లేకుండా స్వతంత్రంగా సంభాషించుకోవడం, మీరా తన గదిలో ఒంటరిగా చదువుకుంటున్నప్పుడు స్నాక్స్-టిలు కలిసి తినడం, అనిల కొన్ని సందర్భాల్లో తన కుమార్తెను దాదాపుగా విస్మరించినట్లు కనిపిస్తుంది. కానీ కొన్ని వారాల తర్వాత వారి పరస్పర చర్యలు అపసవ్యమైన మార్గాన్ని తీసుకుంటాయి. ముఖ్యంగా స్లీప్‌ఓవర్ సమయంలో మీరా పట్టుబట్టి తన గదిని వదులుకోవడానికి నిరాకరించినప్పుడు వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తారు.  తల్లీ కూతుళ్ల మధ్య మనస్ఫర్ధలు  పెరిగిపోతున్న సమయంలో – వారిరువురికీ అసలు ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి అవసరమైన భాష గానీ, వివేచన గానీ ఉన్నట్లు కనిపించదు. ఆ పరిస్థితిలో శుచి తలాటి ఖచ్చితమైన సినిమా నిర్మాణ శైలే ప్రేక్షకులకు చాలా విషయాలను తెలియజేస్తుంది!

ఈ టైట్ రోప్ వాక్ అనుభవజ్ఞులైన చిత్రనిర్మాతలను తడబాటుకు గురిచేసి ఉండేది. కానీ శుచి తలాటి  తన కథ చెప్పడంలో అద్భుతమైన సంయమనాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె సినిమా చివరి భాగంలో శ్రీ, అనిలల గురించి ఏ రకంగానూ తీర్పు చెప్పదు. పాఠశాలలో, ఇంట్లో కూడా మీరాను పితృస్వామ్య వ్యవస్థ విడిచిపెట్టనట్లు చూపించింది. దానికి బదులుగా, అత్యంత ఊహించని పరిస్థితులలో మానవ సంబంధాలను  ప్రేరేపించే ఒంటరితనాన్ని హైలైట్ చేస్తూ, ఆమె ప్రేక్షకుల నుండి విస్తృత సానుభూతిని  లక్ష్యంగా పెట్టుకుంది.

శుచి తలాటి తన కథకు కేంద్రంగా ఉన్న అమ్మాయి మీరా పట్ల ఆప్యాయత, ప్రేమతో ప్రతి సన్నివేశాన్నీ చిత్రీకరించింది. దీనిని బట్టి మీరా పాత్ర దర్శకురాలు శుచి తలాటికి ఎంత ముఖ్యమైనదో స్పష్టంగా తెలుస్తుంది. మీరా జీవితంపై చాలా ఆలోచన చేసింది. ఆమెను నియంత్రించే తల్లితో ఆమెకు ఉన్న వైరుధ్యం కథకు కేంద్ర బిందువు అయినప్పటికీ, ఆ రెండు పాత్రలు వాస్తవికంగా సున్నితమైన చేతితో జాగ్రత్తగా తీర్చిదిద్దినట్లుగా డైరెక్టర్, స్క్రీన్‌రైటర్  గొప్ప శ్రద్ధ తీసుకున్నట్లు అనిపిస్తుంది.  

భారతదేశం వంటి లింగ వివక్ష అధికంగా ఉన్న సమాజంలో, అబ్బాయిలు అబ్బాయిల్లాగే ఇష్టమొచ్చినట్లుగా ఉంటారు. కానీ అమ్మాయిలు మాత్రం స్వచ్ఛంగా, అమాయకంగా, నిశ్శబ్దంగా సర్దుకుపోయే స్వభావంతో ఉండాలని మన సమాజం ఆశిస్తుంది. శుచి తలాటి ఈ నియమాలను ఎగతాళి చేస్తూ, కౌమారదశలో ఉన్నవారు ప్రపంచంలో ఎక్కడైనా ఒకేలా ఉంటారని, టీనేజర్లు ప్రతిచోటా టీనేజర్లేనని, బాలికలకి మాత్రం లైంగికతపై ఉండే ఆసక్తి కొన్నిసార్లు వినాశనకరంగా భరించడానికి కష్టంగా ఉంటుందని చూపిస్తుంది. మీరా పాత్రలో ప్రీతి పాణిగ్రాహి చాలా చక్కగా నటించడంతో ఈ సినిమా లక్ష్యం స్పష్టంగా ఉంది. “ప్రతి ఒక్కరి వద్ద ఒక కీ ఉంది” అనే ప్రకటన వారి సంబంధాన్ని సూచిస్తుంది.  ఇక్కడ తల్లి – కుమార్తె ఇద్దరూ

తమ ఆందోళనలను వ్యక్తం చేయడాన్ని వాస్తవికంగా చిత్రీకరించింది శుచి తలాటి.

ఫ్రెంచ్ స్వరకర్త పియరీ ఒబెర్‌క్యాంఫ్ రూపొందించిన సౌండ్‌ట్రాక్ కూడా అందంగా ఉంది, సంగీతం ప్రారంభం నుండి ముగింపు వరకు కలవరపెడుతుంది, మృదువైన, మధురమైన పియానోను వింతైన శబ్దాలతో వినిపించేలా రూపొందించింది పియరీ ఒబెర్‌క్యాంఫ్.

‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ చిత్రాన్ని సంప్రదాయాలను పక్కనపెట్టి, పురుషాధిక్య భారతదేశంలో మహిళల జీవితానికి సంబంధించిన కఠినమైన, విశిష్టమైన నీయంత్రణలను ప్రభావవంతంగా ఆవిష్కరించింది శుచి తలాటి. ఆమె  ఈ కథను ఎంతో సానుభూతితో రూపొందించారు. తనను తాను తెలుసుకోవడం లోని సంక్లిష్టమైన సత్యాన్ని, దాని చుట్టూ తిరుగుతున్న భావోద్వేగ తుఫానుల సంవేదనలను అద్భుతంగా చిత్రీకరించింది. ఈ చిత్రం నడుస్తున్నకొద్దీ తీపి, చేదు అనుభవాల ఎదుగుదలలను సున్నితంగా దృశ్యీకరించింది. అత్యంత లోతైన మానసిక ప్రయాణాలు సామాజిక అంచనాలకు మించి ఉంటాయని ఈ చిత్రం వెల్లడిస్తుంది.

రచయిత/దర్శకురాలు, శుచి తలాటి, పితృస్వామ్య ఆలోచనలను, కొన్ని నిర్దిష్ట ప్రవర్తనల గురించి భారతీయ సమాజం మహిళలపై ఉంచిన అంచనాలను అద్భుతంగా ఎదుర్కొన్న  విధానం బాగుంది.  

ప్రధాన స్రవంతి కథ చెప్పే మూస సంప్రదాయాలకు కట్టుబడి ఉండకుండా ఈ చిత్రం సున్నితంగా నిరాకరించడం మహిళా ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. చక్కని తీర్మానాలను అందించడానికి తొందరపడే అనేక కథనాల మాదిరిగా కాకుండా, గర్ల్స్ విల్ బి గర్ల్స్ అస్పష్టత గురించిన అందాన్ని స్వీకరిస్తుంది, స్వీయ అమాయకత్వం, స్వీయ  గుర్తింపుల గురించిన గొప్ప సంక్లిష్టతలను లోతుగా పరిశోధించడానికి మనల్ని శుచి తలాటి ఆహ్వానిస్తుంది. స్వీయ-విముక్తి వైపు ప్రయాణం తరచుగా సున్నితమైన నీడలలో, నిశ్శబ్దమైన లోతులలో, మనం  హాయిగా ఉండే గదులలో, మన హృదయాల ఓదార్పు పరిమితులలో విప్పుతుందని చెప్తుందీ చిత్రం. మన గుర్తింపులు కెలిడోస్కోప్ లాగా బహుముఖంగా ఉన్నాయని, నిజమైన బలం సంక్లిష్టతను స్వీకరించడంలో ఉందని అందంగా వివరిస్తుంది శుచి తలాటి.

స్క్రిప్ట్‌ లో అనిలకు మీరాతో ఉన్న సంబంధాన్ని శుచి తలాటి చిత్రీకరించిన విధానం చాలా సవాలుతో కూడుకున్న అంశం. మూస విధానాలను అనుసరించకుండా పితృస్వామ్యం బలంగా చెప్పే “స్త్రీలకు స్త్రీలే శత్రువులు” అనే విషయాన్ని ప్రచారం చేయకుండా, ఈ మహిళల మధ్య సంఘీభావాన్ని సూచించి అపారమైన తెలివితేటలు, నైపుణ్యాలను ప్రదర్శించిన విధానానికి శుచి తలాటి, ఆమె ఎడిటర్ అమృతా డేవిడ్  ఎంతైనా ప్రశంసనీయులు!

                                                       సినిమా ప్రత్యేకతలు 

పుషింగ్ బటన్స్ ఫిల్మ్స్‌ కు చెందిన రిచా చద్దా, డోల్స్ వీటా ఫిల్మ్స్‌ కు చెందిన క్లైర్ చస్సాగ్నే, క్రాలింగ్ ఏంజెల్ ఫిల్మ్స్‌ కు చెందిన సంజయ్ గులాటి నిర్మాతలుగా, అలీ ఫజల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. సినిమాటోగ్రాఫర్ గా జిహ్-ఇ పెంగ్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవ్యక్త కపూర్, ఎడిటర్ గా అమృతా డేవిడ్‌లతో కూడిన పూర్తి మహిళా బృందం నిర్మించింది.  శుచి తలాటి ఉద్దేశపూర్వకంగానే ఈ చిత్రంలో ప్రధానంగా మహిళా సిబ్బందితో పని చేయించుకోవడం కూడా నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సినిమా టైటిల్ సూచించినట్లుగా, సాధ్యమైనంత ఉత్తమమైన  మార్గంలో, అమ్మాయిలు అమ్మాయిలుగా ఉండే సురక్షితమైన స్థలాన్ని ఆమె సృష్టించగలగడం చాలా ఆహ్లాదం  కలిగిస్తుంది.

మనిషి కళ్ళు, యంత్రాల వీక్షణ పరికరాలు, పాఠశాల ఖగోళశాస్త్ర క్లబ్‌ లోని టెలిస్కోప్, జీవశాస్త్ర ప్రయోగశాల లోని సూక్ష్మదర్శిని, అల్లరి పాఠశాల అబ్బాయిలు అనుమానాస్పదంగా వినియోగించిన ఫోన్ కెమెరాలు మొదలైన పరికరాలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తాయి.

                                                                 నటీ నటులు

కొత్తగా వచ్చిన ప్రీతి పాణిగ్రాహి ఒక అద్భుతమైన నటి. ఆమె కేవలం నటించడమే కాదు, తన పాత్రలో జీవించేస్తుంది. చివరి సన్నివేశం ఆమె పాత్రకు మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. అందులోనూ ఆమె నేటి అత్యుత్తమ నటి కని కుస్రుతి, సరసన దీటుగా తనను తాను మర్చిపోయి పాత్రలో లీనమైపోయింది.  మీరా ఒక తెలివిగల గొప్ప విద్యార్థినిలాగే, లైంగిక పరిపక్వతను కూడా అంతే ఉత్సాహంతో ఎదుర్కొంటుంది. ఈ సినిమాలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. అతని స్పర్శ కలిగించిన పారవశ్యంతో మేల్కొని, తర్వాత తన అమాయకత్వాన్ని కోల్పోవడాన్ని గుర్తించే విధంగా సన్నివేశాలను దర్శకురాలు సన్నివేశ దృశ్యీకరణ చేసింది. దానికి దీటుగా అంతే ప్రతిభావంతంగా ప్రీతి పాణిగ్రాహి తన భావాలు పలికించడంలో శరీర భాషలో జరుగుతున్న భావావేశాలు, ఉద్విగ్నతలు, అపరాధ భావం, హృదయ వేదన, చెప్పనలవికాని ఆనందం సజీవంగా అద్భుతంగా నటించింది. సౌందర్యపరంగా చిత్రీకరించబడిన సన్నివేశాలలో ఎటువంటి ఉత్కంఠభరితమైన అంశం లేదు.

ఒక సన్నివేశంలో ఆమె నమ్మశక్యం కాని రీతిలో నటించింది. శ్రీ మొదటిసారి చెంపపై ముద్దు పెట్టిన మరుసటి రోజు ఉదయం స్నానం చేస్తున్నప్పుడు ఆమెకు సంబంధించిన ఒక అద్భుతమైన సన్నివేశాన్ని శుచి తలాటి దృశ్యీకరించింది. ఈ సన్నివేశంలో, మీరా తన చేతిని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగుతుంది, శ్రీ ముఖంపై తన పెదవుల స్పర్శ ఎలా ఉంటుందో స్వయంగా అనుభూతి చెందుతుంది. ఆమె కళ్ళు, నాలుక స్పష్టంగా ఫోకస్‌లో ఉన్నాయి, ఆమె మణికట్టు కొద్దిగా అస్పష్టంగా ఉంది. చిత్రంలోని ప్రతి షాట్‌లో మన దృష్టిని ఆకర్షించే గుణం, ఆకర్షణ ఆమెలో ఉన్నాయి. ప్రీతి పాణిగ్రాహి ముందు ముందు ఒక గొప్ప ప్రామిసింగ్ నటి అవుతుంది. తలుపులోని పగుళ్లలోంచి తొంగి చూసే తల్లి వైపు  ప్రీతి కళ్ళతోనే కోపాన్ని ప్రదర్శిస్తున్న తీరు చాలా ఉత్తేజకరంగా ఉంటుంది.  

సినిమాలో అనిల పాత్రలో కని కుస్రుతి చాలా మామూలుగానే ఉంది కానీ లైంగికంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.  ఆ కారణంగానే అది కూతురిని కలచివేస్తుంది. ఒకవైపు ప్రేమగల తల్లిగా, కూతురి పట్ల బాధ్యత, ప్రేమ, మామతానురాగాలతో ఉంటూనే, మరోవైపు తనకంటూ సొంత అవసరాలు ఉన్న మహిళగా ఉండే ఈ ద్వంద్వ స్వభావాన్ని కని కుస్రుతి తన అద్భుతమైన నటన ద్వారా సజీవంగా ఆవిష్కరించింది.

అనిల ఉల్లాసంగా, విశాల దృక్పథంతో  ఉంటుంది, కానీ ఒంటరి జీవితాన్ని దుర్భరంగా భరిస్తూ ఉంటుంది.  ఎందుకంటే ఆమె భర్త, కుమార్తెతో విందు చేస్తున్నప్పుడు, టేబుల్ దగ్గర సంభాషణ జరుగుతున్న సమయంలో ఆమె ముఖంలో క్షణికమైన బాధను  గమనించిన ప్రేక్షకులు దాన్ని గ్రహిస్తారు. తన స్వంత జీవితం పట్ల ఆమెకున్న అసంతృప్తి, మీరా పట్ల ఆమెకున్న చింతలు ఇబ్బందికరమైన, వింతైన ప్రవర్తనలో వ్యక్తమవుతాయి. కానీ ఆమెలో ఒక భాగం తన కూతురి ద్వారా తన బాల్యాన్ని పరోక్షంగా మళ్ళీ అనుభవించాలని కోరుకుంటుంది.  బహుశా తన సొంత తల్లిదండ్రుల వల్ల తనకు దక్కకుండా పోయిన బాల్యం అది. కని కుస్రుతి సంక్లిష్టమైన ఈ తల్లి పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రశంసలు పొందిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రంలో కని కుస్రుతి అద్భుతంగా నటించినట్లుగానే,  ఆమె ఈ చిత్రంలో ఒక వెంటాడే ఉనికిని కలిగి ఉంటుంది.   

ప్రీతి పాణిగ్రాహి, కని కస్రుతి లిద్దరూ  నిజ జీవితంలో కనిపించే అసలైన తల్లి-కూతుళ్ళ జంటగా తమని తాము మర్చిపోయి పాత్రల్లో జీవించారు.

కేశవ్ బినోయ్ కిరోన్ కూడా ఈ త్రికోణానికి సహజంగా అమిరి పోయాడు. అతను తన “మంచి యువకుడు” దినచర్యకు అస్పష్టత పొరను జోడించగలిగాడు.  

మీరా తన తల్లిని అస్సలు భరించలేనని శ్రీతో చెప్పినప్పుడు వారిద్దరి మధ్య శ్రీ వల్ల కలుగుతున్న  కనిపించని మనస్పర్థలు మొదటిసారిగా ప్రేక్షకులకు అర్ధమవుతాయి. అనిల తన జీవితంలోని శూన్యతతో సతమత మవుతున్నప్పటికీ, మీరా విషయంలో తల్లిగా అతిగా జోక్యం చేసుకోవడం ఆపదు. తల్లి-కూతుళ్ల సంబంధం ఈ సినిమాకు చాలా కీలకమైనది, అది నిజంగానే ప్రేక్షకులు చూస్తున్నట్లుగానే అది మసకబారుతున్నట్లు అనిపిస్తుంది. అయితే, ఆ నిర్లిప్త ప్రవర్తనల  వెనుక, దాగి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ వాస్తవాన్ని మీరా క్రమంగా గ్రహించడమే సినిమా విజయం!

మానవ మనస్సుల  విభిన్న ఛాయలను, బయటికి కనిపించే చూపుల వల్ల  ఎలా నిర్ణయాత్మకంగా చేస్తాయో శుచి తలాటి  చిత్రీకరించి చూపించిన అద్భుతమైన చిత్రం ఇది. మూడు ప్రధాన పాత్రల నటన కూడా సినిమా విజయానికి కీలకంగా పని చేసింది. పొరలు, పొరలుగా అందమైన సన్నివేశాల ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా భౌగోళికంగా చాలా ప్రత్యేకమైనది అయినప్పటికీ, దీని ఇతివృత్తం చాలా విశ్వజనీనమైనది. మనలో చాలామందికి ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు సుపరిచితమైన లింగ రాజకీయాలను లోతుగా పరిశీలిస్తుంది.

టీనేజర్ల ప్రపంచం కాదనలేని విధంగా ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పాత్రలు కౌమారదశలోని ఒడిదుడుకులను ఉల్లాసం, దుర్బలత్వాల మిశ్రమంతో యవ్వనంలోని సంక్లిష్టతలను ప్రతిబింబిస్తూనే తిరుగులేని విధంగా ఆకట్టుకుంటాయి. అతి సాధారణ అమ్మాయిలలోని దృశ్యానుభవాల నుంచి నేటి సమకాలీన కథల వరకు, తెరపై టీనేజ్ అమ్మాయిల చిత్రణ, వారి సాహసాలు, స్నేహాలు మరిన్నింటి కోసం మనల్ని తిరిగి మన గత లోకంలోకి వెళ్ళి పరవశించిపోయే వెలుగునిస్తాయి!

స్వీయ అన్వేషణ, ఎదుగుదల గురించిన సరళమైన,  విశ్వ జనీనమైన కథ కోసం ఈ సినిమాను చూడాలి. ఇద్దరు  ప్రధానమైన  నటీమణుల  అద్భుతమైన నటన మిమ్మల్ని మరింత చూడాలని కోరుకునేలా చేస్తుంది. తొలిసారి దర్శకత్వం వహించి ఇంత హృద్యమైన, సున్నితమైన చిత్రాన్ని రూపొందించినందుకు శుచి తలాటిని  ఎంతైనా అభినందించాలి!

తల్లీ-కూతుళ్ళిద్దరూ మొదట్లో ముఖ్యంగా శ్రీ విషయంలో ఒకరంటే ఇంకొకరికి పడనట్లుగా, విరోధులుగా అత్యధిక స్థాయిలో కనిపిస్తారు. కానీ ముగింపు సీన్ లో ఇద్దర్నీ చాలా ఆత్మీయంగా, ఒకర్ని మరొకరు ఇష్టపడే ప్రేమాస్పదులుగా చూస్తారు ప్రేక్షకులు!

                                                       సాధించిన అవార్డులు  

2024 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ సినిమా డ్రామాటిక్ ప్రేక్షకుల అవార్డు

 2024 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీతి పాణిగ్రాహి (మీరా) నటనకు వరల్డ్ సినిమా డ్రామాటిక్ స్పెషల్ జ్యూరీ అవార్డు

 MAMI ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో NETPAC అవార్డు

 MAMI ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో యంగ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు

 MAMI ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఫిల్మ్ క్రిటిక్స్ గిల్డ్ జెండర్ సెన్సిటివిటీ అవార్డు

 గోతం ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో బ్రేక్‌త్రూ డైరెక్టర్ నామినేషన్

ఇండిపెండెంట్ స్పిరిట్ జాన్ కాసావెట్స్ అవార్డు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది

గోథెన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ  ప్రదర్శనకు ఎంపికైంది

ఈ చిత్రం ప్రశంసలతో, ఇండిపెండెంట్ స్పిరిట్ జాన్ కాసావెట్స్ అవార్డును గెలుచుకుంది. ఫెస్టివల్ సర్క్యూట్‌లో ప్రాచుర్యం పొంది బాగా ఆడుతోంది.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply