మన కాల్పనిక శక్తినంతా వెచ్చించి రాయాల్సిన కాలమిది : పాణి

(చివరి భాగం)

వస్తువు, శిల్పం, దృక్పథం గురించి మీరు చెప్పిన ఈ అవగాహన విప్లవ సాహిత్య విమర్శలో భాగమైనంతగా సృజనాత్మక సాహిత్యంలోకి వచ్చిందా? ఈ అనుమానం బైట చాలా మందిలో ఉన్నట్లుంది. మీరు చెప్పిన దానికి ఉదాహరణలు ఇస్తారా?

దండకారణ్య సాహిత్యానికంటే ఉదాహరణ అక్కరలేదనుకుంటా. 1980ల ఆరంభం నుంచి తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా కథ, నవల ప్రక్రియలను విప్లవోద్యమం మౌలికంగా మార్చేసింది. విప్లవ రచయితల నుంచి, అజ్ఞాత విప్లవోద్యమ రచయితల నుంచి కొత్త తరహా కథలు, నవలలు రావడం మొదలైంది. ఇంతక ముందు అన్నట్లు ఒక కొత్త జీవన ప్రపంచాన్ని నిర్మించుకోడానికి జరుగుతున్న విప్లవాత్మక ప్రయోగాల నుంచి వస్తువు, శిల్పం, దృక్పథం మేళవించిన సాహిత్యం విస్తృతంగా వచ్చింది. దీన్ని గుర్తించగల సాహిత్య విమర్శ పరికరాలు బైటి విమర్శకుల దగ్గర లేకపోవడం విషాదం. వస్తువు, శిల్పం, దృక్పథం మధ్య విడదీయలేని సంబంధం ఉంటుందని ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత కావాలంటే వ్యూహాత్మకంగా దేన్నయినా వేరు చేసి పరిశీలించవచ్చు. ఒక రచన వస్తువు వల్ల సాహిత్యమైందా? లేక శిల్పం వల్ల అయిందా? దృక్పథం వల్ల అయిందా? అనే చర్చ యాంత్రికమైనది. మన సంప్రదాయ సాహిత్య విమర్శ అంతా అదే. అకడమిక్‌ సాహిత్య విమర్శ దానికి కొనసాగింపే. ఈ చర్చ విమర్శా రంగానికి మాత్రమే వర్తించదు. సాహిత్య వ్యవస్థ మొత్తానికి సంబంధించింది. కాబట్టి ఈ అవగాహన విప్లవ విమర్శ రంగంలో ఉందనీ, కాల్పనిక సాహిత్యంలో లేదనీ వేరు చేయలేం. మొత్తంగానే తెలుగు సాహిత్య రంగానికి ఇది వర్తిస్తుంది. అందువల్ల గత నలభై ఏళ్లలో ఈ కొత్త సాహిత్యం అనేక పాయలుగా విస్తరించింది. ఇందులో ఒకటి దండకారణ్య సాహిత్యం. వస్తు శిల్పాలు, దృక్పథం వేరు చేయలేని విధంగా కలిసిపోవడం ఒక్కటే ఈ సాహిత్యం ప్రత్యేకత కాదు. అందువల్లే ఇది కొత్త సాహిత్యంగా గుర్తింపు సంపాదించుకోలేదు. నూతన సామాజిక శక్తుల వికాసం వల్లనే ఈ కొత్త సాహిత్యం మొదలైంది. దండకారణ్య సాహిత్యం రచయితల నేపథ్యాన్నే మార్చేసింది. కొత్త రచనా సందర్భాలను తీసుకొచ్చింది. కొత్త పాఠకులను ఈ సాహిత్యం తయారు చేసుకుంది. అప్పటి దాకా ప్రగతిశీల సాహిత్య శిబిరంలో ఉన్న రచయితల కంటే భిన్నమైన సాంస్కృతిక జీవన మూలాలు ఉన్న రచయితలు దండకారణ్య కథలు రాయడం మొదలు పెట్టారు. విప్లవోద్యమం వల్ల ఈ కొత్త రచయితలు బయల్దేరారు. పాఠకులూ మారిపోయారు. అంటే మొత్తంగా సాహిత్య ఆవరణే మారిపోయింది. ఇది 1970ల్లోనే ఆరంభమైనప్పటికీ 1980లలో ఉధృతమైంది. ఆ కాలంలో పీడిత అస్తిత్వవాద సాహిత్య ధోరణులు ఇంకో పాయగా మొదలయ్యాయి. అంత వరకు సాహిత్యంలోకి రాని జీవన సంస్కృతులు అద్భుతంగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సాంస్కృతిక అస్తిత్వ చిత్రణతోపాటు మిగతా అన్ని సాహిత్యపాయల్లోకీ దండకారణ్య సాహిత్యం చాలా భిన్నమైనది. ఎందుకు భిన్నమో చెప్పే ప్రయత్నం చేయగలిగితే తెలుగు సామాజిక సాహిత్య సాంస్కృతిక విమర్శా పద్ధతిని చాలా ముందుకు తీసికెళ్లినవాళ్లం అవుతాం. అది మొత్తంగానే ఈ కాలపు తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి కూడా పనికి వస్తుందని నేను నమ్ముతున్నాను. దేనికంటే 2010 తర్వాత తెలుగు సాహిత్యంలోనే ఒక కొత్త దశ నడుస్తున్నది. ముందు దాన్ని సమగ్రంగా చూడాలి. తెలుగు సాహిత్యంలోని అన్ని పాయల్లో గత పదిహేనేళ్లలో కొత్త నేపథ్యాల నుంచి రచయితలు వచ్చారు. చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. దృక్పథపరంగా చర్చించవలసిన కొత్త అంశాలు ఉన్నాయి. అంగీకరించేవీ, చర్చించేవీ ఎన్నో ఉన్నాయి. సారాంశంలోకి వెళితే విప్లవ కల్పనా సాహిత్యం ఎప్పటికప్పుడు కొత్త అవగాహనలతో వస్తున్నది.

దండకారణ్య సాహిత్యాన్ని కేవలం సాయుధ పోరాట సాహిత్యంగానే చూసేవాళ్లు ఉన్నారు. ఈ సమస్య ఎందుకు వచ్చింది? అట్లా చూస్తే మీరు చెప్తున్న ప్రత్యేకతలు అర్థమవుతాయా?

దండకారణ్య సాహిత్యాన్ని కేవలం సాయుధ పోరాట సాహిత్యంగానే చూసే వాళ్లకు అసలు సాహిత్యమంటే ఏమిటో తెలియదని అనుమానించాలి. నిస్సందేహంగా దండకారణ్య సాహిత్యంలో సాయుధ పోరాట అంశ ఉన్నది. అది ఆ సాహిత్యానికి ఉండే రాజకీయ పార్శ్వం. నిజానికి వందలాది దండకారణ్య కథల్లో ఈ రాజకీయ పార్శ్వంతోపాటు ఇంకా అనేక రకాల కథలు వస్తున్నాయి. ఒకే కథలో రాజకీయ కోణమని, సాంస్కృతిక కోణమని, జీవన చిత్రణ అని వేరు చేయలేని అద్భుత కలయికతో రాస్తున్నారు. ఆ రచయితలందరూ సాయుధ పోరాట ప్రత్యక్ష ఆచరణలో తలమునకలై ఉన్నప్పటికీ రచనలోకి దిగినప్పుడు తాము సాహిత్యం రాస్తున్నామనే ఎరుక పుష్కలంగా ఉంది. మానవ జీవితాన్ని విప్లవోద్యమ చూపుతో కాల్పనీకరిస్తున్నామనే స్పష్టత వాళ్లకు ఉంది. అందులో సాయుధ రాజకీయ కోణం ఉన్నప్పటికీ జీవన చిత్రణే ప్రధానం. జీవితాన్ని ఇలా చిత్రించినప్పుడే సాయుధ రాజకీయ కోణం ఒప్పుకోలుగా ఉంటుందని వాళ్లకు తెలుసు. సాహిత్య ప్రయోజనం నెరవేరుతుందని తెలుసు. ఈ విషయంలో వాళ్ల తరపున మరెవరూ వకాల్తా తీసుకోనవసరం లేకుండా ఆ కథలే ఈ సంగతి చెబుతాయి. అయితే మీరన్నట్లు ఈ కథలను సాయుధ పోరాట కథలుగానే కొందరు గుర్తిస్తున్నారు. ఎందుకంటే వాళ్లు రాజకీయాల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉన్నారు. ఆ రాజకీయాలపట్ల విసుగో, వ్యతిరేకతో ఏదో ఉంటుంది. దాని వల్ల ఆ కథలను సాయుధ పోరాట కథలని కుదించాలని అనుకుంటారు. నిజానికి అట్లా గుర్తించడమంటే వాటి విస్తృతిని అంగీకరించినట్లని వాళ్లకు తెలియకపోవచ్చు. మన సాహిత్యరంగంలోని అనేక అమాయకత్వాల్లో ఇదొకటి. విప్లవ సాహిత్యం గురించి ఇట్లా మాట్లాడుతున్న వాళ్లకు విప్లవం గురించీ తెలియదు.. సాహిత్యం గురించీ తెలియదని అనుకోవాల్సి వస్తుంది.

పోనీ విప్లవ సాహిత్య శిల్పం మీదైనా సానుకూల అభిప్రాయాలు ఉన్నాయంటారా?

బహుశా మీరు అంటున్నట్లు సానుకూలత లేకపోవడం కేవలం శిల్పానికి సంబంధించే కాదనుకుంటా. విప్లవ సాహిత్య శిల్పంలోని కొత్తదనం పఠనీయంగా లేక ఈ మాట అంటున్నారా? లేక వాళ్లకు అలవాటైన పఠన సౌకర్యాన్ని విప్లవ సాహిత్య శిల్పం డిస్ట్రబ్‌ చేస్తున్నందు వల్ల అంటున్నారా? ఎందుకు విప్లవ కథల్లోని శిల్పంపట్ల సానుకూలతను ప్రదర్శించడం లేదో పరిశీలించాలి. విప్లవ సాహిత్యం నిరంతరం కొత్త భావాలను, కొత్త అనుభవాలను, కొత్త సామాజిక క్రమాలను తీసుకొస్తూ ఉంది. యథాతధ, వ్యవస్థీకృత దృక్పథాన్ని ప్రశ్నిస్తున్నది. రచనలోనేగాక, దాని పఠనీయతలో కూడా కొత్తదనాన్ని తీసుకొస్తున్నది. యథాతధ భావజాలంతో ఉన్న వాళ్లు ఈ కొత్తదనానికి సన్నిహితం కాలేరు. అందువల్ల అది పఠనయోగ్యం కాదని నిరసిస్తారు. అన్ని రకాల వాచకాలను చదవాల్సిన విమర్శకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటారు. ఇది నేరుగా వస్తువు దగ్గరికి వెళుతుంది. ఇంకొద్దిమంది విమర్శకులు తమ ప్రగతిశీలతను కాపాడుకోడానికి ఏమంటారంటే వస్తువు మంచిదే, శిల్పమే బాగా లేదని అంటారు. కానీ విచిత్రం ఏమంటే శిల్పం వల్లనే మరే సాహిత్యానికి లేనంత మంది పాఠకులు విప్లవ సాహిత్యానికి ఉన్నారు. మిగతా సాహిత్యానికి చాలా వరకు తోటి రచయితలు, సాహిత్యం గురించి తెలిసిన వాళ్లు మాత్రమే ప్రధాన పాఠకులు. విప్లవ సాహిత్య పాఠకులు చాలా భిన్నంగా ఉంటారు. ఉదాహరణకు ఈ మధ్య వచ్చిన తల్లులు బిడ్డలు, సైరన్‌ నవలలకు, ఏది నేరం, అపురూప వంటి కథా సంకలనాలకు ఊహించని వైపు నుంచి పాఠకులు ఉన్నట్లు తెలిసింది. అంత వరకు సాహిత్యం చదివే అలవాటు లేని సమూహాల నుంచి, మారు మూల ప్రజల నుంచి, కొత్త తరం నుంచి ఈ పుస్తకాలు బాగా చదివారు. ఒకసారి చదవడం అలవాటయ్యాక అభిరుచిని, దృక్పథాన్ని మెరుగుపరుచుకుంటూ మిగతావి కూడా తప్పక చదువుతారు కదా.

ఈ వైపు నుంచి చూస్తే… మారుతున్న సామాజిక, ఉద్యమ అవసరాలు తీర్చడంలో విప్లవ సాహిత్యానికి ఏదైనా పరిమితిని మీరు గుర్తించారా?

ఒక పరిమితి కాదు. అధిగమించాల్సినవి చాలానే ఉన్నాయి. ఓపికగా, విమర్శనాత్మకంగా చూస్తే అన్నీ కనిపిస్తాయి. దేనికంటే మానవ జీవితంలో, సామాజిక రాజకీయ ఉద్యమంలో సాహిత్యం తీర్చవలసిన అవసరాల గురించే మన ఎరుక ఎప్పటికప్పుడు పెరుగుతున్నది. ఉద్యమమనే మాటనే మనం మొదటి నుంచీ చాలా విస్తారంగా చెప్పుకుంటున్నాం. మానవ జీవితాన్ని, సామాజిక చరిత్రనూ పురోగమింపజేయడానికి కళా సాహిత్యాలకు ఏదో ఒక్క పాత్ర మాత్రమే ఉండదు. కాబట్టి ఒక రకం సాహిత్యమే సరిపోదు. ఏ భాషా సమూహానికైనా ఈ విషయాల్లో ఎంత విశాలమైన దృష్టి ఉన్నదీ ఆ ప్రజలు రాసుకొనే సాహిత్యాన్నిబట్టి అంచనా వేయవచ్చు. 1970ల మధ్య నుంచి వచ్చిన విప్లవ సాహిత్యమే ఈ విశాల దృక్పథానికి ఉదాహరణ. రచన అనేది మానవుల భౌతిక, మేధో, కాల్పనిక ఆచరణ రూపాల్లో భాగం.

ఇంత చెప్పుకున్నా… గత యాభై ఏళ్లుగా విప్లవోద్యమమే ఈ సమాజంలో తీసుకొచ్చిన మార్పులన్నిటినీ గతితార్కికంగా విప్లవ సాహిత్యం పట్టుకోగలిగిందా? అనే మౌలిక సందేహం కలుగుతోంది. విప్లవోద్యమం సృష్టించిన సామాజిక సంచలనాల స్వభావాన్ని, వాటికి ఉండే భిన్న తలాలను సమగ్రంగానే గుర్తించిందా? లక్షలాది మంది ప్రజలు వ్యక్తులుగా, సామూహికంగా, వర్గంగా, పీడిత అస్తిత్వాలుగా గడిరచిన అనుభవాల్లోని సామాజిక అర్థాలన్నిటినీ విడమర్చి చెప్పగలిగిందా? అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ మొత్తాన్ని సామాజిక, సాంస్కృతిక కోణాల్లో అర్థం చేసుకోవడం సరే. ఇందులో సాహిత్యం కాగల అంశాలన్నిటినీ విప్లవ రచయితలు గుర్తించారా? రాస్తున్నారా? అనే మదింపు జరగాలి. ముఖ్యంగా విప్లవాచరణకు ఉండే సామూహిక, వైయుక్తిక అనుభవ కోణాలను ఎంత వరకు రాయగలుగుతున్నారు? వ్యక్తులు అసాధారణ మానవ ఆచరణకు సిద్ధం కావడం, ఈ ప్రపంచాన్ని మార్చాలనే నైతిక శక్తిని సంతరించుకోవడం, తమ వ్యక్తిత్వాన్నే సమూలంగా మార్చుకొనే ప్రక్రియల్లో భాగం కావడం, ఈ క్రమంలో పరిసరాలను మార్చే పనిలో కఠోరమైన అనుభవాలు గడిరచడం అనే మనో, నైతిక, సాంస్కృతిక, తాత్విక కోణాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ రచయితలు చాలానే రాశారు. కానీ మొత్తంగానే మన కాలపు విప్లవోద్యమ యుగ స్వభావమంతా, పరిణామంతా, మరే రకంగా వ్యక్తంకాని జీవన వాస్తవికత అంతా సాహిత్యంలోకి వచ్చిందా? అత్యున్నతమైన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమవుతున్న ప్రజల మన:స్థితిని రాయగలిగారా? దాని వెనుక రూపొందుతున్న తార్కిక, హేతుబద్ధ విలువల సారాన్ని చిత్రించగలిగారా? వాటిని ఎప్పటికప్పుడు ఉన్నతీకరిస్తున్న చారిత్రక క్రమాలను రాశారా? దేనికంటే ఈ ప్రయాణం కేవలం కొందరు వ్యక్తులదే కాదు. లక్షలాది ప్రజలు మూడు తరాలుగా గడిస్తున్న అనుభవం. అంటే సామాజిక సాంస్కృతిక సంబంధాల్లో పోగుబడుతున్న అనుభవం. ఇది పూర్తిగా మనం జీవిస్తున్న చారిత్రక యుగానికి సంబంధించింది. దీనికి ఇరుసుగా ఉన్న మానవ సంఘర్షణను, మానవ సంబంధాల సంక్షోభాలను వర్గపోరాటంలోని పలు రూపాలుగా గుర్తించి రాసిన దానికన్నా రాయవలసిందే చాలా ఉన్నది. ఇది మన సమాజం మొత్తానికి సంబంధించిన అనుభవమని ఒప్పించగలిగేలా ఇంకా బాగా రాయాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలు వేసుకోవాలి. ఈ దిశగా విప్లవ సాహిత్యం మొదటి నుంచి అన్వేషిస్తున్నది. తర్జనభర్జన పడుతున్నది. ఈ మధనలోంచే పైన చెప్పిన పరిమితిని ఎప్పటికప్పుడు అధిగమిస్తోంది. కానీ ఇంకా అర్థం చేసుకోవలసిందీ, రాయవలసిందీ చాలా మిగిలే ఉన్నది.

ఇంత అవగాహన ఉన్నప్పటికీ రాజకీయ పరిమితుల వల్లనే సాహిత్య సాంస్కృతిక కర్తవ్యాలను విప్లవ సాహిత్యోద్యమం సాధించలేకపోతున్నదనే అభిప్రాయం ఉంది కదా.

బహుశా సాయుధ విప్లవోద్యమాన్ని అంగీకరించడం, అందులోనూ ఒకానొక రాజకీయ స్రవంతిని ఎక్కువ పట్టించుకోవడం బహుశా వాళ్ల ఉద్దేశంలో రాజకీయ పరిమితి కావచ్చు. నిజానికి ఇది రాజకీయ పరిమితి కాదు. ఇదే విప్లవ సాహిత్యోద్యమ విస్తృతి. దీని వల్లనే మిగతా రచయితలకంటే విప్లవ, విప్లవోద్యమ రచయితలు ప్రజా జీవితానికి సన్నిహితంగా ఉంటున్నారు. సమాజంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించగలుగుతున్నారు. గాలివాటాన పూటకో వైఖరి తీసుకోవడం లేదు. రోజుకో సిద్ధాంతాన్ని వండటం లేదు. కళ్లకు కనిపించేదే సత్యమని అనుకోవడం లేదు. భాషలోకి ఒదిగిన ప్రతి ఒక్కటీ దానికదే వాస్తవమని భ్రమపడటం లేదు. ఒక చారిత్రక యుగావధిలో భాగంగా ప్రతి చిన్న పరిణామాన్ని, తక్షణ సమస్యలను, వాటి సంక్లిష్ట సంబంధాల్లో భాగంగా అర్థం చేసుకోగులుగున్నారు. నేను పైన చెప్పిన వెలితిని కూడా ఈ మార్గంలోనే అధిగమించగలరు.

అయితే ఇప్పుడున్న నిర్బంధ పరిస్థితులు, ఫాసిస్టు దాడులు, విప్లవోద్యమ ఆటుపోట్లలో ఇవన్నీ సాధ్యమేనా?

సాధ్యమే. ప్రజా ఉద్యమాలు వెల్లువగా సాగుతున్న రోజుల్లో ఒక తరహా సాహిత్యం వస్తుంది. ఫాసిజం, రాజ్య నిర్బంధం పెరిగినప్పుడు, ఉద్యమం ఆటుపోట్లకు గురైనప్పుడు ఇంకో రకం సాహిత్యం వస్తుంది. బహుశా రచయితల్లోని దాగి ఉన్న కాల్పనికశక్తినంతా, ఆక్రోశాన్నంతా, ప్రయోగశీలతనంగా పెకలించుకొని ఇలాంటి సంక్షోభ కాలంలోనే శక్తివంతమైన సాహిత్యం వస్తుంది. మిగతా రంగాల్లో ఈ కాలానికి తగిన మేధా కృషి కూడా ఇట్లాంటప్పుడే జరుగుతుంది. ఈ పనులు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులను నిర్బంధం వైపు నుంచే చూడ్డానికి వీల్లేదు. ప్రజల వైపు నుంచి, పోరాటాల వైపు నుంచి చూడాలి. ప్రస్తుత విప్లవోద్యమ దశ వైపు నుంచి, ఫాసిసిజం వైపు నుంచి చూస్తే అణచివేతే కాదు. అవకాశాలు కూడా కనిపిస్తాయి. బహుశా మనం ‘ఇప్పుడున్న పరిస్థితి’ అనే మాటను చాలా సూక్ష్మస్థాయిలో చూడాలి. అన్ని వైపుల నుంచి చూడాలి. అన్ని శక్తుల బలాబలాలవైపు నుంచి చూడాలి. అప్పుడు మూసుకపోయిన తలుపులే కాదు. తెరుచుకోగల తలుపులూ ఎక్కడక్కెడ ఉన్నాయో కనిపిస్తాయి. వాటిని చూడగల సాహసికమైన, సృజనాత్మకమైన చూపు మనకు ఉండాలి. ఒక వేళ అననుకూల సమయం అనుకుంటే కూడా అలాంటప్పుడు ఎలా ఉండాలో తేల్చుకోవాలి. ఏ వైపు నుంచి కొత్త పోరాట శక్తులు తలెత్తగలవో గమనించాలి. ఏ కాంక్షలతో, ఏ నినాదాలతో, ఏ పోరాట రూపాలతో కొత్తశక్తులు రంగం మీదికి వచ్చి ఫాసిజాన్ని ఓడిరచగలవో తెలుసుకోవాలి. విప్లవోద్యమాన్ని ముందుకు నడిపించగలవో గుర్తించాలి. వాటికి తగిన వాతావరణం భౌతిక పరిస్థితుల్లోంచి అనుకూలించడమే కాదు. ప్రయత్నపూర్వక రాజకీయ కృషి వల్ల కూడా అనుకూల వాతావరణం వస్తుంది. ఆ పని కోసం ఇప్పటికి ఉన్న శక్తినంతా కూడగట్టుకొని నిలబడాలి. చెప్పవలసిన మాట చెప్పకుండా, చేయాల్సిన పని చేయకుండా చుట్టూ తిరిగి తప్పించుకొనే వ్యర్థ వ్యూహాలను విసర్జించాలి. మనల్ని మనం రక్షించుకొనే మాటలు, వాదాలు ఉంటాయనే భ్రమలుంటే ఫాసిజం బద్దలు కొడుతున్నదని తెలుసుకోవాలి. గత ఏడెనిమిదేళ్లుగా మనం దేశమంతా విప్లవోద్యమం సహా అన్ని పోరాటాల మీద నిర్బంధాన్ని చూస్తున్నాం. దేశంలోనే లబ్ధప్రతిష్టులైన మేధావులతోనే పాలకులు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నాం. కాబట్టి ఇక దాక్కోవడానికి అవకాశమే లేదని తేలిపోయింది. ఒక్కోసారి ఉద్యమాల్లో నిలబడ్డానికి మన నైతికశక్తి తప్ప మరే ఆధారం దొరకకపోవచ్చనే ఎరుక అవసరం. అలాంటప్పుడు కూడా చెప్పవలసిన మాట చెప్తామా? లేక చుట్టూ తిప్పి మాట్లాడి ఇది కూడా అదే అంటామా? తేల్చుకోవాలి. ఈ పని ఎవరైనా ఉదారవాదులు చేస్తే చేయవచ్చు. విప్లవశక్తులకు ఆ అవకాశం లేదు. ఈ ఎరుక నుంచి ఇప్పుడు ఎవరైనా సాహిత్యం రాయాలి. ఇందులో ప్రచండమైన శక్తి ఉంటుంది. గతంలో ఎన్నడూ రాయలేనంత శక్తివంతంగా సాహిత్య రచన చేయవలసిన అవసరమే కాదు, అవకాశం కూడా ఇప్పుడే ఉంది. ఎవరు ఏ రూపంలో రాస్తారో, ఎవరికి ఏది పట్టుబడుతుందో, ఎవరి రచనా వ్యక్తిత్వానికి దేనికి సన్నిహితమో తేల్చుకొని రాయవలసిన సమయం ఇది.

ఇప్పుడు వస్తున్న ప్రగతిశీల సాహిత్యంలో మీరు వ్యతిరేకించే అంశాలు ఏమైనా ఉన్నాయా?

వ్యతిరేకించేవి అనేకంటే సీరియస్‌గా చర్చించాల్సినవి ఉన్నాయనిపిస్తోంది. వాటిలో ముఖ్యమైనది ఏమంటే, రచయితలు గతం ఎట్లా దెబ్బతింటున్నదో చెప్పినంత బలంగా, రూపొందుతున్న వర్తమానాన్ని చెబుతున్నారా?..భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. నాస్టాల్జియా సాహిత్య రచనకు ప్రేరణ కావచ్చు. అది మనుషులను సెన్సిటైజ్‌ చేయవచ్చు. కానీ ఆధునిక సాహిత్య లక్షణం అదొక్కటే కాదు. పాత రోజుల్లో సాహిత్యం మనుషుల ఆలోచనలను, స్పందనలను గతానికి కట్టిపడేసేది. కానీ ఆధునికతలోని విమర్శనాత్మకత అనేది సాహిత్య స్వభావాన్నే మార్చేసింది. గతాన్ని విమర్శనాత్మకంగా చూడ్డంతోపాటు వర్తమానంలో రూపొందుతున్న కొత్త జీవితాన్ని అర్థం చేసుకోడానికి ఇది దోహదపడుతుంది. ఒక వేళ గతాన్ని చెప్పినా దానికి వర్తమానంతో లింకు పెడితే భవిష్యత్తులోకి చేరుకొనే అవకాశం ఉంటుంది. మూలాలను క్రిటికల్‌గా అన్వేషించడం కూడా ఆధునిక లక్షణమే. కానీ మూలాల అన్వేషణ గతంలోకి జారిపోయేలా ఉండకూడదు. ఈ ధోరణి పెరిగింది. ఈ సమస్యను విమర్శనాత్మకంగా చూడకపోవడం వల్ల ఇప్పుడు వస్తున్న సాహిత్యంలో అంతా మంచే కనిపిస్తోంది. పైగా కొత్త తరం రచయితలు విరివిగా రాస్తున్నారు. ఇంతక ముందు సాహిత్యరంగంలోకి రాని సమూహాల నుంచి రచయితలు వస్తున్నారు. ఇది చాలా గొప్ప పరిణామమే. అయితే ఈ మొత్తంలో ఏది కొత్తగా రూపొందుతున్నదో, అందులో ఏది ప్రగతిదాయకమో పట్టింపు లేదు. ఎంత వెనుకటి బొమ్మను చూపితే దానికదే గొప్ప అయిపోయింది. వాస్తవానికి సాహిత్యం పాత్ర ఇక్కడే ఉంది. మనం ఎక్కడెక్కడ వెనుక చూపుతో ఉన్నామో, ఎందుకు అట్లా ఉన్నామో ఆధునిక సాహిత్యం ఎరుక కలిగిస్తుంది. ఆ అర్థంలో ఆధునిక సాహిత్యం గతాన్ని అర్థం చేసుకొనే సాధనమే కాదు. గతం నుంచి విముక్తి కలిగించి వర్తమానంలోకి, భవిష్యత్తులోకి నడిపించేది కూడా.

కానీ తెలుగు సాహిత్యంలో చాలా వరకు దీనికి భిన్నంగా ఉంది. వర్తమాన జీవితాన్ని చిత్రించిన సాహిత్యం చదివినప్పుడు డిస్ట్రబ్‌ కావాలి కదా. అది లోపిస్తోంది. గతం విధ్వంసమైపోతూ వర్తమానం ఎట్లా రూపొందుతున్నదో చూడలేకపోవడమే సమస్య. వీటి పక్కనే దండకారణ్య కథలు చాలా వరకు కొత్త సంబంధాలు, కొత్త మనుషులు తయారవుతున్న క్రమాన్ని చిత్రిస్తున్నాయి. గతం దెబ్బతినిపోవడం గురించి చిత్రించినా, ఆ సాహిత్యంలోని ప్రధాన లక్షణం కొత్తను చిత్రించడం. అసలు కొత్త ప్రపంచాన్ని చిత్రించడమే ఆ సాహిత్య ఇతివృత్తం. ఇలాంటి చర్చ ఏదో లోతుగా జరగాల్సిన అవసరం ఉంది.

(ఐపోయింది)

Leave a Reply