మనం చూస్తుండగానే
ఒక స్వేచ్ఛాగీతం బందీ అయిపోయింది
ఎందుకో నేరమనిపిస్తున్నది
ఒకింత ద్రోహమనిపిస్తున్నది
మనసు కలచినట్లవుతున్నది
మనమింత దుర్భలులమైపోయామా అనిపిస్తున్నది
ఇక్కడ అభాగ్యుల అంతర్వేదనకి
చలించి జ్వలించిన అక్షరం అతడు
ఎలుగెత్తిన అడవిబిడ్డల గాయాల గళం
ఆపాద మస్తకం కరుణాంతరంగం
మన సంస్కృతిని రథచక్రాలు గీసిన
వక్ర రేఖలను బట్టి కాదు
ఫుట్ పాత్ బతుకుల ఆకలిని బట్టి
కొలవాలన్నందుకే అతడు అపరాధి అయ్యాడు
అన్యాయాన్ని ఎదురించినవాడు
ఆధిపత్య వర్గాలకు
అతడు అపరాధి అయ్యాడు
తన కలలు భవిష్యత్ చిత్రపటం
మసకబారొద్దని
గుజరాత్, గెర్నికా ఘోర రక్త చిత్రం కావద్దని
ఊరు వాడై ఊరేగింపై
నిప్పుల తొవ్వనే నడిచి వచ్చాడు
“గొప్ప శాంతికోసం మహా సంక్షోభంలో
స్వేచ్ఛను కోల్పోయిన
సముద్రాన్ని నేను
స్వచ్ఛమైన స్వేచ్ఛను
నిత్యం వెతుకుంటున్న నీటి చుక్కను నేను”…
అంటూ
రక్తసిక్తమైన ముళ్ల బాటలోనే నడుస్తున్నాడు
అనాదిగా నడకే ఈ నేల మీద
నూతన నాగరికతలను రాస్తూ వచ్చింది
ఈ నడక నేటి కవిత్వం
రేపటి చరిత్ర
(వీవీ, ఇతర సామాజిక స్పృహను మేల్కొలిపే మేధావుల నిర్బంధాన్ని నిరసిస్తూ…)