మనుషుల్రా మనుషులు!

1
అతను అన్నం గురించి మాట్లాడుతున్నాడు. నేను గింజల గురించి ఆలోచిస్తున్నాను. అన్నం, కూరలు, రుచుల గురించి చెబుతున్నాడు. శ్రమ, కష్టం, ఆకలి, కన్నీళ్ల గురించి నా బాధ.
వెలుతురు గురించి అతను చెబుతున్నప్పుడు లోపల సుడులు తిరిగే చీకటి.

2
స్వరం లేనివాళ్ళు, స్వేచ్ఛ అంటే తెలియనివాళ్ళు, చీమూనెత్తురు కలగలిసిన గాయంలాంటి వాళ్ళు, పురానాపూల్ మీద విరిగిన అరుగులా మారినవాళ్లు, అర్ధరాత్రికి శరీరాన్ని అప్పగించి పాలకోసం గుక్కపట్టి ఇంటి వసారాలో చిరిగిన చీరఉయ్యాల లోంచి దబుక్కున పడి ఏడ్పు ఆగి స్థాణువులా మారిన పిల్లాడి గురించి కూడా ఆలోచించలేని అమ్మలు, జుమ్మేరాత్ బజార్ లో విరిగిన వస్తువుల మధ్య ఆకలిని అమ్ముకునేవాళ్లు
పడి లేస్తున్నవాళ్లు, లేచి పడుతున్నవాళ్లు

హోటళ్ల ముందు విదిల్చే అన్నం మెతుకుల కోసం పొట్టల్ని కళ్లుగా చేసుకుని కూచున్నవాళ్ళు వీళ్ళూ మనుషులే కదూ!

3
జరిగేదంతా బాహాటం. దొంగలా జొరబడి చెమటోడ్చి దాచుకున్న మనుషుల్ని విడదీసి, నాలుగు మాటలు వాళ్లపై గుమ్మరించి ఎత్తుకుపోయే ఎత్తుల్ని గురించే అందరూ మాట్లాడుతారు, వినబడని మాటల్లో.

4
నీ ఒంటరితనం నటన. నీ మాటలు అబద్ధం. నీ ప్రదర్శన కట్టుకథలోని కల్పిత దృశ్యం. నీ చరిత్ర కనికట్టు మాయ. నీ రాకపోకలు నిచ్చెనమెట్లు. నీ కలయికలు కాలుష్య కేంద్రాలు.

5
ఇప్పుడు పౌరసత్వం సమస్య కానేకాదు. మనుషుల్ని ఎలా చూస్తున్నారనే చర్చంతా. ఆకలి గురించి కాదు, ఆ అన్నాన్ని ఎలా తిన్నామనే బాధంతా. చీము గురించి కాదు, దేహం అంతా అదే అయినందుకు అసహ్యం. అక్షరం తలవంపులగురించి కాదు, దాన్ని అవసరానికి టిష్యూ పేపర్ లా వాడుతున్నందుకే కంపు.

6
వస్తువులు కాదు, మనుషుల్రా మనుషులు.
మనసున్న మనుషులు. మాయలు తెలియని మట్టిలాంటి మనుషులు.కొంచెం ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు. ఇంకా మనిషి మీద నమ్మకంతో బతుకుతున్నారు. అది కూడా కోల్పోయి పగిలిపోతారెప్పుడో, హ్యాండిల్ విత్ కేర్.

1962 లో పుట్టారు. తెలుగు సాహిత్య విమర్శపై డాక్టరేట్ చేశారు. తొమ్మిది పుస్తకాలు అందులో ఐదు కవితా సంపుటాలు ప్రచురించారు. ఎనిమిదేళ్లుగా కవిసంగమం ''కవిత్వ వేదిక''ను నిర్వహిస్తున్నారు. ''రొట్టమాకురేవు పోయెట్రీ స్పేస్ ఫౌండేషన్'' ను స్థాపించి కవులకు అవార్డులు ఇస్తున్నారు. ముప్ఫై ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు.

2 thoughts on “మనుషుల్రా మనుషులు!

Leave a Reply