ప్రపంచ కవిత్వ దినోత్సవం కరోనా సందర్భంలో. ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా అంతర్జాతీయ కవిత్వ దినోత్సవం రోజు కవిత్వాన్ని గురించి కొన్ని మాటలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. పోయిన సంవత్సరం పెద్ద వ్యాసమే రాశాను. ఇప్పుడు ఏం రాయాలీ! రాసిందే రాయలేంకదా. పదే పదే ఒకే మాట చెప్పలేం కదా. మాట విలువైందయితే మార్చి మార్చయినా మళ్లీ మళ్లీ చెప్పు అంటాడు కన్ఫ్యూసీయస్. మత సాహిత్యం లో ఇది స్తోత్రం రూపంలో నిలిచిపోయింది. మనం కనీసం ఒకటిచేయొచ్చు. మనం మాట్లాడే సందర్భాన్ని బట్టి పాత విషయాల గురించి కొత్త ఆలోచనలు చెప్పొచ్చు. కవిత్వం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఈ సమయ సన్నివేశాల దృష్ట్వా దాని అనుగుణ్యతని చర్చిస్తున్నామనమాట.
కవిత్వం గురించి ఒక విషయాన్ని మాత్రం నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు. మనుషులతో పాటే ఈ నేలమీద కాలిడింది కవిత్వం. అది మనుషులతో కలిసే శ్వాసిస్తుంది. మనుషులున్నంతవరకూ కవిత్వం ఉంటుంది. ఒక షేక్స్పియరో, రూమీయో, ఠాగూరో, నెరూడాయో, మాయా ఏంజిలా యో, శ్రీశ్రీయో, దేవులపల్లో జాషువాయో, శివసాగరో, నగ్నమునో లేని మానవ సంస్కృతి ని ఊహించగలమా. ఊహించలేం. కవిత్వానికి మానవ జీవితంతో విడదీయరాని అనుబంధం వుందనడానికి ఇదే నిదర్శనం.
సాహిత్యంలో అన్ని రూపాలకీ ఇది వర్తించినప్పటికీ మనుషులకి కవిత్వంతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. దానికి కారణం? మనిషిలో ఉన్న భావుకతని కవిత్వం మెరుగ్గా ప్రతిఫలిస్తుంది. వ్యక్తీకరణ తాలూకూ సులువుతనాన్నీ, వెసులుబాటునూ కవిత్వం కలిగి ఉంటుంది. కవిత్వ గృహానికి తలుపులూ కిటికీలూ ఎక్కువ. కవిత్వ ఆవరణలో లోతైన బావులెక్కువ.
ఢిల్లీ హింస గురించి , కరోనా మహమ్మారి గురించీ రైతుల ఉద్యమం గురించీ చక చకా కవితలొచ్చాయి. అంత ఫాస్ట్ గా కథలూ, నవలలూ నాటకాలూ రాలేదూ. రావు కూడా. కవిత్వానికున్న ఫ్లెక్సీబిలిటీ అలాంటిది. అందుకే కవిత్వాన్ని తక్షణ సామాజిక డైరీ అన్నారు కొంతమంది. సామాజిక చరిత్రనీ, వర్తమాన జీవిత ప్రవాహాలనూ రికార్డ్ చేయడంతో సరిపెట్టుకోదు కవిత్వం. వీటితోపాటు ఆకస్మిక ఘటనల్నీ, సంఘర్షణల్నీ అలవోకగా చిత్రిస్తుంది. నడుస్తున్న బతుకు బండికి సంబంధించిన కళాత్మక రన్నింగ్ కామెంట్రీగా పనిచేస్తుంది. సంఘటనల మీదా, అనూహ్య ఉత్పాతాలమీదా వచ్చే కవిత్వం సెకండ్ రేట్ కవిత్వమని చెప్పేవాళ్ళు కరెక్ట్ కాదు. కవిత్వ స్వభావంలోనే సంఘటనల స్పందించే ధోరణి ఉంది. ఇది కవిత్వ బలమే కానీ బలహీనత కాదు. ఊళ్ళో కొట్లాటలు జరిగితే మా బాబాయి అనేవాడు: ‘ఈ బురద ఇప్పుడల్లా ఆరేటట్టు లేదబ్బాయ్’ అని. ఇది ఘటన పట్ల ఆయన కవితాత్మక స్పందన కాదని అనగలమా. నిజానికి ఈ వాక్యం నా మైండ్ లో నిలిచిపోయిన కారణంగానే నేను కులవివక్షా దాని తాలూకు మారణహోమాల గురించి రాస్తూ
“ఈ దుమ్ము ఇప్పుడల్లా సద్దుమనిగేట్టు లేదు
ఈ బురద ఎంతకీ ఆరేట్టులేదు
ఈ ఇనప గొలుసు తెగేట్టులేదు”
అని రాయగలిగాను.
ఢిల్లీ హింసాత్మక ఘటనల గురించి మాట్లాడుతూ ఒక మధ్య తరగతి ఇల్లాలు, ‘ఈళ్లకెప్పుడూ ఏదొకటి తగలబడతా ఉండాల్సిందే’ అంది. ఇది కవిత్వం కాదని అనగలమా. జనతా కర్ఫ్యూ గురించి స్పందిస్తూ ‘ఈ
పొగెన్నాళ్ళో ఏమో’ అని ఒక ఆటో అతను యాష్టపోవటం నేను విన్నా. కనుక ఘటనల పట్ల కవితాత్మకంగా స్పందించడం కొత్తగా కవులు తీసుకొచ్చింది కాదు. అది జనంలో జీవితంలో ఉన్నదే. కాకపోతే కవిత్వం దాన్ని సునాయాసంగా పుణికిపుచ్చుకోగలిగింది.
ఇలా మనుషుల బాహ్యవ్యక్తీకరణకు సృజనాత్మక అనుసరణగా ఉంటుంది కవిత్వం. ఇంతేకాక మనుషులు పైకి చెప్పకుండా లోలోపల ఊహించుకునే అంతర్ వ్యక్తీకరణనీ కవిత్వం పలికిస్తుంది. దాన్నే మనం భావుకత అంటాం. ‘Poetry catches up human imagination more than any other form of literature does’ అని అందుకే అన్నారు పరిశీలకులు.
తాడిచెట్టి కోటేశ్వరరావు అని నా చిన్ననాటి స్నేహితుడొకడుండేవాడు. వాడు పెద్ద ఇంట్రావర్ట్. నా దగ్గర అప్పుడప్పుడూ ఓపెనయ్యేవాడు. సాయంత్రం పూట చెరువు గట్టుమీద కూర్చొని సూర్యుడివంక తదేకంగా చూసేవాడు. ఏదో ఆలోచిస్తున్నట్లు కనపడేవాడు. ఏందిరా అనడిగితే ‘సూర్యుడి మీద చిన్న గుడిశేసుకుంటే ఎంత బాగుండుద్దో కదరా’ అనేవాడు. వాడిలోని ఊహాబలం నేను పెద్దయినాకగానీ నాకు అర్ధంకాలా. ఇటీవల ఒక సిరియన్ కవి కవిత్వాన్ని ఇంగ్లీష్ అనువాదంలో చదువుతుంటే నాకు మావాడి మాట గుర్తొచ్చింది.
You can set up camp on the forehead of the sun, and say to your armies of images and your power of visualization to stand guard at night protecting the earth.
చచ్చి ఎక్కడున్నాడో మా కోటేశ్వరరావు వాడి మాటే పైవ్యక్తీకరణలో తొలి వాక్యంగా కనపడి నన్ను బిత్తరపోయేట్టు చేసింది. కవిత్వంలో భావుకత అలా విశ్వాన్ని చుట్టుముడుతుంది. మనుషుల మస్తిష్కంలోని విభిన్న విచిత్ర వైవిధ్య ప్రపంచాలను మనుషులకు చేరువచేస్తుంది.
No star exists that your imagination has not penetrated.
No sky exists that has not pronounced your name.
కవిత్వ ఊహాబలం గురించి ఒక కవి పైవిధంగా స్పందించాడు.
ఇతర సాహిత్య రూపాలతో పోలిస్తే కవిత్వానికి మరొక విశిష్టత ఉంది. వస్తు వైశాల్యం, ఇతివృత్త విస్తృతీ కవిత్వానికి ఎక్కువ. ఎక్కడ ఉండి ఏ మూల ఏమి జరిగినా కవి జోక్యం చేసుకునే వీలుంది. సిరియా పరిస్థితి గురించి తెలుగులో కధ రాయలేం. నవలా, నాటకమూ రాయలేం. వాటి రూప పరిమితి అది. కానీ కవిత్వానికి ఆ పరిమితి లేదు. తెలుగు కవి విశ్వంలో సంభవించే ప్రతి కంపనకూ స్పందించగలిగే అవకాశం కవిత్వ రూపం అందిస్తుంది.
You can, poet, poke your nose in everything,
and shove what concerns you into the nose of your era.
ప్రతిదాంట్లో వేలుపెట్టగలిగే అవకాశాన్ని కవికి అందించడంలో ఒక సాహిత్య ప్రక్రియ గా కవిత్వానికున్న మెరిట్ ఇది.
అందుకే మనుషుల్తో కలిసి పుట్టిన కవిత్వం మనుషుల్తో ఉండి తీరుతుంది.