మనువుగారి మనోగతం

నేను నిప్పుల గీతలు గీసిన మహర్షిని
తరతరాలుగా సుఖాల సొంతాస్తిని
సమస్త శ్రమను దోచే సౌకర్యంని
వర్ణ సంకరానికి యమ కింకరుడిని
పతివ్రతా ప్రవచనాన్ని
ఉత్తమ కుటుంబాన్ని
ఉన్నత కులాన్ని
సూపర్ మేనుల సృష్టికర్తని
కామన్ మేనుల కర్మరాతని

ప్రభుత్వాలు ఎన్ని మారినా
రాసుకున్న రాజ్యాంగాలకి మినహాయింపుని
బరితెగించిన ఫెమినిస్టు పిల్ల
విమర్శనారాళ్లు విసిరినా
కడుపు మండిన ఏ చండాలుడో
చితి పేర్చి చంపాలని చూసినా
నేను ఎటర్నల్ మోనార్క్ని
నన్నెవరూ ఏమీ చేయలేరు

నేనీ దేశం అంతరాత్మని
నిత్య కుల ఆరాధనా తత్వంని
నేను అసమాన ఆలోచనా అగ్గిని
మారని సామజిక ఆచరణని
సనాతన ధర్మాన్ని
రాజదండాన్ని
బానిసల మెడపై
నిత్యం మెరిసే కత్తిని
నేను మోనార్క్ని !


వెంటాడే దెయ్యం

జుట్టిరగబోసుకున్న రాత్రి
తెల్ల చీర కట్టుకున్న చీకటి
గుప్పుమన్న మల్లెలు
దారంతా ఘల్లు ఘల్లుగా
నడిచెల్లుతున్న గజ్జెలు
గుండె ఝల్లు మనేలా
భయం పాట వినేలా
గర్భగుడిలోకెళ్ళి గడి పెట్టుకున్న దేవుడు
ఆసామి ఆగానికి అర్ధాంతరంగా
ముగిసిన దెయ్యం ఆత్మకథ
దెయ్యం కథలంతా నిండిపోయిన ఆడోళ్ళు
చింతచెట్టు దగ్గర
కామాంధులని వదలకుండా పట్టుకోడం కోసం
కాపుకాసిన లంబాడీ దెయ్యం
మోసం చేసినోడిని వెతుకుతూ
కారడవిలో కొరివి దెయ్యం
కోరికలు తీరని కన్నె దెయ్యం
కులం పరువు కోసం
ఫ్యానుకేలాడిన పరువాల దెయ్యం
స్టోరీస్ అఫ్ ఎండ్లెస్ మిసెరీస్ అఫ్ దెయ్యమ్స్
ఊరుచివర పొలిమేరల్లో
జొన్నచేనుల మొదుగుల్లో
పాడుబడ్డ బంగ్లాల్లో దెయ్యాల కాన్ఫరెన్సులు
దెయ్యాల ప్రతీకార తీర్మానం
అందరూ ఆదమరిచిన క్షణం
విరగబడి నవ్వుతున్న దెయ్యం
చీకట్లో తెల్లచీరై
గజ్జెల ఘల్ల సవ్వడై
విరబోసుకున్న జుట్టయి నడుస్తుంటే
ఆంబోతు ఆసాములూ
కరుకు కట్టుబాట్లూ
కట్నం కాట్లు
కాముకుల క్రూర కోరికలూ
పరువు కులాలూ
భయంతో ఒకటే వణుకు…
దెయ్యం దెయ్యమంటూ కలవరింతగా…

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

2 thoughts on “మనువుగారి మనోగతం

  1. మనువు మనోగతాన్నీ,వెంటాడే దెయ్యాన్ని చక్కగా చెప్పారు సర్…కవితలు చాలా బావున్నాయి..అందరూ చడవాల్సినవి…

  2. రెండు కవితలు బాగున్నాయి. అభినందనలు

Leave a Reply