కార్పొరేట్ల మితిమీరిన దోపిడి వల్లే మనీషా క్రూరమైన హత్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లా, బుల్ గడీ గ్రామానికి చెందిన 19 ఏండ్ల దళిత యువతి మనీషాపై నలుగురు ఆధిపత్యకుల ఠాకూర్లు 14-09-2020న సామూహిక అత్యాచారం చేసి, నాలుక కోసి, మెడ, వెన్నెముక విరిచి, మర్మాంగాన్ని ఛిద్రం చేసి కొనవూపిరిలో వదిలేశారు. ఆసుపత్రిలో చేర్చిన మనీషాకు డాక్టర్లు సరైన వైద్యపరీక్షలు, చికిత్స చెయ్యకపోవడం వల్ల 10 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది. శవం కూడా సాక్ష్యాలు చెబుతుందనుకున్న యోగి ఆదిత్యనాథ్ BJP ప్రభుత్వం కేసు నమోదు చెయ్యకుండా, బాధితకుటుంబాన్నే నిర్బంధించి మనీషా శవాన్ని అర్థరాత్రి రెండుగంటలకు తగలబెట్టింది. సంబంధిత డాక్టర్లతో ఆమెపై అత్యాచారం జరగలేదని నివేదిక ఇప్పించింది. ప్రతిపక్షాలు రాజకీయ లబ్దికోసమే మనీషా అత్యాచారహత్యపై కట్టుకథలు అల్లుతున్నారని పోలీసులతో మాట్లాడించింది. జిల్లా కలెక్టర్ తో మనీషా కుటుంబాన్ని బహిరంగంగా బెదిరించింది. కుటుంబమే మనీషాను చంపుకుందని కుటుంబ సభ్యులను టెర్రర్ చేసిన వార్తలు మీడియా ద్వారా బయటకి వచ్చాయి. ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ప్రతిపక్ష మహిళా నాయకుల జాకెట్లు చింపించి, రాహుల్‌గాంధీతో సహా పురుషులను పోలీసులతో తొక్కించింది. బుల్ గడి గ్రామం చుట్టూ బారికేడ్లు కట్టించి మీడియాను వెళ్ళకుండా చేసింది. ఊరునంతా ఏకంచేసి, ఆ నలుగురు నిరపరాధులని, మంచి క్యారక్టరుగల వారని “వాడ”ను ఒంటరి చేసి ధర్నాలు చేయించింది.

ఇంతవరకు జరిగిన పరిణామాలన్నీ ఈ దేశంలోని దళితస్త్రీలు వేల సంవత్సరాలుగా నిరంతరం అనుభవిస్తున్నావే. కానీ బాధిత కుటుంబాన్ని కలెక్టర్ చేత బహిరంగంగా బెదిరించడం, మీరే మీ అమ్మాయిని చంపుకున్నారని ఉల్టా ప్రచారం చెయ్యడం, కుటుంబ సభ్యులను టెర్రర్ చేయడం యోగీ పాలనలో కొత్తగా చూస్తున్నాం!! కీలవేణ్మణి, లక్ష్మపూర్ బాతీ, కారంచేడు, చుండూరు, వేంపెంట, గుజరాత్, బాబ్రీ విధ్వంసం మొదలైన దుర్మార్గాలలో నామమాత్రంగానైనా నిందితులపై కేసులు నమోదు కావడం, దోషులు కొర్టుల వరకు వెళ్ళడం చూశాం. కానీ మనీషాది కేసుకూడా నమోదు కాలేదంటే, BJP బహిరంగ చట్ట ఉల్లంఘన చెయ్యడం వెనుక చాతుర్వర్ణ వ్యవస్థ వెలుపల “పంచములు” గా వెలివాడల్లో బతుకుతున్న అంటరాని ప్రజలను భయపెట్టి లోబర్చుకునే “మనువాద బ్రాహ్మణీయ రామరాజ్య” వ్యూహం వుంది. వర్ణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యం వుంది. అగ్రకుల భూస్వామ్య హంతకమూకలకు అండగా వుంటామనే బరితెగింపు వుంది. వారి రామరాజ్యంలో దళితుల స్థితి ఈ విధంగానే వుండబోతుందనే హెచ్చరిక వుంది. “ఓట్లు మావి, సీట్లు మీవా, దళిత బహుజనులకే రాజ్యాధికారం” అనే నినాదంతో బహుజన సమాజ్ వాదీ పార్టీ పదేండ్లు అధికారంలో వున్న ఉత్తరప్రదేశ్ లో గత కొంత కాలంగా దళితులపై నిత్యం హింస జరుగుతుంది అంటే, మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా వుందో వూహించనవసరంలేదు. మనీషాపై జరిగిన ఆత్యాచారం, కూరమైన హత్యపై దేశంలోని దళితులు, సంఘాలు పెద్దగా కదలలేకపోయాయి. అంతేకాక వివిధ అగ్రకుల రాజకీయపార్టీలు ఎదిగిన దళిత నాయకత్వాన్ని తమకనుకూలంగా మార్చుకుంటున్నాయి. మరోపక్క దలిత పేదల జీవన్మరణ పోరాటాలకు అనుకూలంగా పనిచేసే దళిత నాయకత్వాన్ని కార్యకర్తలను అగ్రకుల రాజకీయ పార్టీలు హత్యలు చేస్తున్నాయి. వారివైపు నిజాయితీగా నిలబడే ప్రజాస్వామిక వాదులను జైళ్లలో నిర్బంధిస్తున్నాయి.

ఈదేశ అగ్రకుల బ్రాహ్మణీయ భూస్వామ్యం వేల సంవత్సరాలుగా దళితుల శ్రమను అడ్డంగా దోచుకోడానికి మహిళలపై లైంగిక హింసను, పురుషులను హత్యలు చెయ్యడం తమ ఆయుధాలుగా ఎంచుకుంది. దానికి తోడు నాటి బ్రిటిష్ సామాజ్యవాదులు, నేటి బహుళజాతి సామ్రాజ్యవాద కంపెనీలు కుమ్మక్కై ఈ అత్యాచారాలను హత్యల స్థాయికి, హత్యలను సామూహిక హత్యల స్థాయికి చేర్చాయి. దళిత స్త్రీలపై జోగిని, బనవిని, మాతంగి వ్యవస్థ యధావిధిగా కొనసాగడమే కాక “భవిష్య వాణి” పేరుతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను చెప్పిస్తున్నారు. ఈ దుర్మార్గాలే కాక దళితులను భూమి, భుక్తికి దూరం చేసింది. వీరు అవి సాధించుకోడానికి విప్లవమార్గాన్ని ఎంచుకోవడంతో కొద్దిమందికి భూములు (అసైన్డ్) ఇచ్చింది. దేశంలో నూతన ఆర్థిక విధానాల అమలు అనంతరం ఈ దళారీ పాలకవర్గాలు అసైన్డ్ భూమిని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే పనిలో పడ్డారు. అందుకే దళిత స్త్రీలపై సామూహిక అత్యాచారాలు, హత్యలు తారా స్థాయికి చేరాయి.

1990 అంబేద్కర్ శతజయంతి సందర్భంలో చురుగ్గా పనిచేసిన అంబేద్కర్ సంఘాలు, మండల కమీషన్, కారంచేడు, బాబ్రీ కూల్చివేత, గుజరాత్ మారణహోమం మొదలైన ఘటనల అనంతరం ఏకమైన SC, ST, BC, మైనారిటీ మతస్తుల ఐక్యతను, సంఘ్ పరివార్ రూపంలోకి మారిన అగ్రకుల భూస్వామ్య శక్తులు “కమండల్ యాత్ర”, “రామాలయ నిర్మాణం” అనే కుట్రలతో విచ్ఛిన్నం చేశాయి. అంతేకాక 2014 నుండి పార్లమెంట్‌లో పూర్తిసాయి మెజారిటీ సాధించిన పరివార్ శక్తులు హిందూమతాన్ని బహిరంగంగా తమ రాజకీయాల్లోకి లాగి, మెజారిటీ ప్రజలకు “హిందువులందరం బంధువులం” అనే నినాదంలో చాతుర్వర్ణ వ్యవస్థకు కవచంగా వున్న హిందూమతం మత్తులో ముంచేస్తున్నాయి. ప్రభుత్వరంగాలైన విద్య, వైద్యం, రక్షణ, న్యాయం మొదలైన వాటితో పాటు మేధావులను, మీడియాను తన గుప్పిట్లో పెట్టుకొని ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయి. సమానత్వ భావనను బద్దశత్రువుగా చూస్తున్నాయి. గణతంత్ర స్ఫూర్తిని నీరుగారుస్తున్నాయి. పార్లమెంటులో నిరంకుశ చట్టాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. ఈ నియంతృత్వ పోకడలన్నీ ఫాసిజంలో భాగమే. BJP అధికారంలోకి వచ్చాక ఫాసిజం పెరిగిపోయిందని ప్రగతిశీలవాదులు భావిస్తున్నారు గానీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసిన బ్రాహ్మణిజం వేలసంవత్సరాలుగా దళితులపై చేసే దాష్టీకమంతా ఫాసిజంలో భాగమే! అందుకే ప్రపంచ ఫాసిజాలన్నిటికన్నా హిందూ ఫాసిజం అత్యంత ప్రమాదకరమైంది , దుర్మార్గమైంది.

మనుధర్మాన్ని నేటికీ తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఈ దేశ అగ్రకుల దళారీ పాలకవర్గాలు దళితులపై అత్యాచారాలు, హత్యలు చెయ్యడమే కాదు, కరోనా వ్యాధిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించక పోగా, లాక్‌డౌన్ ను అడ్డం పెట్టుకొని LLC, BSNL, రైళ్ళు, రోడ్డు రవాణా, వాయు, విద్యుత్తు ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టి లక్షలాది ఉద్యోగులను రోడ్ల పాలుచేశారు. ఇదే సమయంలో పార్లమెంట్‌లో మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు చేసి వ్యవసాయ రంగాన్ని, సహజ వనర్లను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు. హత్రాస్ ఘటన సృష్టించి దేశవ్యాపిత రైతుల ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారు. మళ్లీ ఎన్నికలలో గెలుస్తామో లేదోనని కుల, మత వైషమ్యాలు రెచ్చగొట్టి తీవ్రమైన హింసను ప్రయోగిస్తున్నారు.

మనీషా ఘటనలో పీడిత ప్రజలంతా స్పందించక పోవడం ఒక అంశమైతే, ఆకాశంలో సగం వున్న స్త్రీలు కూడా ఆయా కులనిచ్చెనమెట్లలోని పురుషుల పక్కనవుండి దళిత స్త్రీల శ్రమను దోచుకోవడంలో, ఆణిచివేయడంలో వీరి పాత్ర కూడా వుంది. అందుకే దళిత స్త్రీలపై జరిగే హింసపై పై కులాలు ఏనాడూ స్పందించరు. పైగా తమ పురుషులను రెచ్చగొడ్తారు. అందుకే ఎవరి విముక్తి వారి చేతిలో వుందన్నట్టు ఆకలి, అంటరానితనం, ఆడతనం అనుభవిస్తున్న అన్ని దళిత ఉపకులాల (60) స్త్రీలు ముందు ఐక్యం కావాల్సి వుంది. నంగేలీ అమ్మ, పూలన్ దేవి, జల్కారీబాయిల వీరోచిత పోరాట వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతోవుంది…

పాక జయమ్మ. పుట్టింది నల్లగొండ జిల్లా, హాలియా మండలం, రంగుండ్ల గ్రామం. అధ్యాపకురాలు. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మహిళా మార్గం' వర్కింగ్ ఎడిటర్. కుటుంబం నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్లపల్లి మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి వలస వచ్చింది. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మండలం, వెల్జెర్లలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

Leave a Reply