మణిపూర్ మారణహోమం వెనుక హిందుత్వ ఎజండా

ప్రజల మధ్య వైరుధ్యాలను, ప్రాంతీయ వనరుల అసమానతలను ప్రజాస్వామిక కోణంలోనుంచి పరిష్కరించడం కాక, వాటినుంచి లబ్ది పొందడం దోపిడీ పాలకులు ఆనవాయితీగా అనుసరిస్తున్న విధానం. మణిపూర్ లో మైతేయి, కుకీ జాతుల మధ్య ఉన్న వైరుధ్యాల పునాది మీద ఆరెసెస్, బిజెపి తమ ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలను పొందడంతోపాటు ఈశాన్య రాష్ట్రాలలో హిందూ మత ఆధిపత్యం సాధించడం కూడా వాటి ఎజెండాలో ఉంది.

డబుల్ ఇంజన్ సర్కారు ఆశీర్వాదంతో మణిపూర్ లో అరాచక పాలన కొనసాగుతోంది. హిందు మిలిటెంట్ సంస్థల సారధ్యంలో మైతేయి మూకలు జరపని అకృత్యాలు, అరాచకాలు లేవు. తమకు అడ్డు అదుపు లేవన్నంత ధీమాతో చెలరేగిపోతూ హింసాకాండకు పాల్పడుతున్నాయి. సజీవ దహనాలు, హత్యలు, అత్యాచారాలు, ఆయుధాల లూటీలు, ఆస్తుల విధ్వంసం, గృహ దహనాలు ఆరెసెస్ దాని అనుబంధ సంస్థలకు తెలిసిన హింసా పద్ధతులన్నీ అమలవుతున్నాయి. గోద్రా ఘటనలను మించిన దారుణాలు మరోసారి మణిపూర్ లో పునరావృతమవుతున్నాయి. అక్కడ ముస్లింలు ఇక్కడ ఆదివాసులు అంతే తేడా. అదే కోవకు చెందిన అసత్యాలు, దుష్ప్రచారం, హింసాకాండ. మైనార్టీ వర్గానికి వ్యతిరేకంగా మెజారిటీ వర్గంలో విద్వేషాన్ని రగిలించి ఉన్మాదంతో దాడులు చేయించడం, తమ సంకుచిత అధికార రాజకీయ ప్రయోజనాలకు స్త్రీలను వాళ్ళ శరీరాలను లక్ష్యం చేసుకోవడం ఆరెసెస్ దాని అనుబంధ సంస్థలకు తెలిసిన ఫార్ములా. ఈ ఫార్ములాకు మణిపూర్ నేడు వేదికయ్యింది. రాజ్యాధికారమే పరమావధి అయినచోట ఎంత రక్తం పారినా, ఎన్నివందలమంది హతులయినా, ఎంతమంది స్త్రీల వలువలు ఊడదీసి ఊరేగించి వాళ్ళ మాన ప్రాణాలను హరించినా పాలకులకు ఇవన్నీ పైకి ఎదిగే సోపానాలే. 2002 గోద్రాలో, 2013 ముజఫర్ నగర్ లో ముస్లింలపై జరిగిన అత్యంత అమానవీయమైన హింసాకాండ అనంతరం బిజెపి రాజకీయ గ్రాఫ్ పెరగడం ఈ అంశాన్నే రుజువుచేస్తోంది. పాలకుడు అయిన అధినేత ఎంత కర్కోటకుడు దుర్మార్గుడు, మానవత్వంలేని వాడు అయితే అంత శక్తివంతుడిగా, సమర్ధవంతుడిగా పరిగణించి అధికారాన్ని మళ్ళీ మళ్ళీ కట్టబెడుతున్న మానసిక, రాజకీయ దౌర్భల్యం ఉన్న సమాజంలో గోద్రాలు, మణిపూర్ లు పదే పదే పునరావృతం అవుతూనే ఉంటాయి. గోద్రాలో అల్లర్లు సద్దుమణగడానికి రెండు వారాలు పడితే, మణిపూర్ హత్యాకాండ మొదలై నాలుగు నెలలు కావస్తున్నా సద్దుమణగకపోగా ఇంకా రావణకాష్టంలా రగులుతూ ఈశాన్య రాష్ట్రాలను కూడా చుట్టుముడ్తోంది. మిజోరంలో నివశిస్తున్న మైతేయిలను అక్కడనుంచి వెళ్ళిపొమ్మని మిజో సాయుధ గ్రూపులు వారిని హెచ్చరించాయి. మిజోలో ఉన్న అనేకమంది మైతేయిలు ప్రాణభయంతో అక్కడినుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. బిజెపి అధికారంలో ఉన్న అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్టాలు మణిపూర్ లోని కుకీలకు వ్యతిరేకంగా స్పందిస్తూ వ్యాఖ్యానిస్తున్నాయి. మిజోరం రాష్ట్రంలో మంత్రులతో సహా లక్షలాదిమంది ప్రజలు కుకీలకు అండగా ప్రదర్శనలు జరిపారు.

పోలీసు స్టేషన్లనుంచి వేల సంఖ్యలో అత్యంత ఆధునిక ఆయుధాలను మందుగుండు సామాగ్రిని లూటీ చేసి లెక్కలేనన్ని నేరాలకు ఘోరాలకు పాల్పడుతూ, ఒక జాతి హననం జరుగుతూ ఉంటే వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవు. ఆరువేల ఎఫైఆర్లు నమోదయితే అయిదుగురిని మినహా ఎవరినీ ఇంతవరకు అరెస్టు చేసిన దాఖలాలు లేవు. అన్నింటినీ మించి ఎప్పుడూ అదేపనిగా దేశ ప్రజలకు సందేశాలు ఇవ్వాలని ఉవ్విళ్ళూరే ప్రధాని మోది, దేశంలో ఒక రాష్ట్రం తగలబడిపోతుంటే దాని గురించి నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. పారిస్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న చందంగా ఉలుకు పలుకు లేకుండా 78 రోజులపాటు చాలా నింపాదిగా ఉన్న ఈదేశ ప్రధాని వైఖరిని ప్రపంచం విస్తుపోయి చూసింది. మణిపూర్ లో ఇప్పటికీ జరుగుతున్న పరిణామాలు, నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు, డబుల్ ఇంజన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి ఇవన్నీ మోది మౌనం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటో చెప్పకనే చెపుతోంది. మైతేయి, కుకీ జాతుల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయి అక్కడ శాంతి భద్రతలు నెలకొనడం కాక, ఆ సమస్యలు వీలైనంత జఠిలంగా మారి, వారి మధ్య ఉన్న సంబంధాలను శాశ్వతంగా శత్రుపూరితంగా మార్చడమే ఢిల్లీ పెద్దల రహస్య ఎజండా అనేది స్పష్టమవుతోంది. అందుకు తెరవెనుకనుండీ ఒక పధకం, ప్రణాళిక ప్రకారం అరంబై తెంగోల్, మెయిటీ లిపున్ వంటి హిందు మిలిటెంట్ సంస్థలను ప్రోత్సహిస్తూ ఆ రెండు జాతులమధ్య రాజుకున్న నిప్పు చల్లారకుండా ఎగదోస్తున్నట్లు అర్ధమవుతోంది. మోది నోరు విప్పకుండా తన మౌనం ద్వారా జరుగుతున్న నరమేధానికి హింసాకాండకు ఆమోదాన్ని తెలుపుతూ మిలిటెంట్ సంస్థలకు సంకేతాలను పంపుతున్నాడు. ఇది స్టేట్ స్పాన్సర్షిప్ తో జరుగుతున్న మారణకాండ. పోలీసుస్టేషన్ల నుంచి జరిగిన ఆయుధాల లూటీకి కొన్నిచోట్ల స్తానిక పోలీసులే ఆయుధాగారాల తాళాలు తెరిచి దుండగులకు సహకరించడం, మందుగుండు సామాగ్రి, మైతేయి మిలిటెంట్ మూకల రవాణాకు ప్రభుత్వ అంబులెన్స్ వాహనాలు సాధనాలుగా మారడం, కుకీలను కాపాడడానికి కేంద్ర బలగాలు ప్రయత్నించిన ఒకటి రెండు చోట్ల స్థానిక పోలీసులకు మిలిటరీకి మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం, పోలీసుల సమక్షంలోనే స్త్రీలపై మూకుమ్మడి లైంగిక దాడులు హత్యలు జరగడం వంటివన్నీ ఆర్గనైజ్డ్ గా ఒక పధకం ప్రకారం జరుగుతున్నవనే విషయం స్పష్టమవుతోంది. లూటి అయిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని హింసను అరికట్టేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకూ ఎటువంటి చర్యలు లేవు. ప్రపంచ మైతేయి కౌన్సిల్ అధినేత హైగ్రుజం నబష్యాం 2024 మే నెలలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలవరకు ఈ హత్యాకాండ కొనసాగుతుందని బహిరంగంగా ప్రకటించాడు.

కేంద్ర పెద్దల విభజించి పాలించే విధానంవల్ల మణిపూర్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి కుకీల పట్ల మైతేయి సమూహం పగవిద్వేషాలతో రగిలిపోతూ నేడు ఆ రెండు జాతులమధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే వాతావారణం ఏర్పడింది. మూడు నెలల క్రితం వరకు సఖ్యతతో మెలిగిన మైతేయి కుకీ-జోమి జాతుల ప్రజలు ఈ నాడు కత్తులు దూసుకుంటూ చంపుకుంటున్నారు. జాతులకు అతీతంగా సాంఘిక దురాచారాలను, రాజ్యహింసను ఐక్యంగా ప్రతిఘటించిన మణిపూర్ మహిళలు, ఈ నాడు రెండువర్గాలుగా చీలిపోయి తమ తోటి మహిళలపై అత్యాచారాలు చేయమని దుండగులను రెచ్చగొడుతూ వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. కుకీలు ఇంతకాలం ఎంతగానో ఆరాధించి అభిమానించిన మైతేయి గాయకుడు ‘తక్తా ‘ ఇప్పుడు ‘ప్రతి కుకీని చంపేంతవరకూ మనకు శాంతిలేదు ‘ అంటూ పాడిన పాటలు, కుకీలను ద్వేషిస్తూ తయారైన రింగ్ టోన్లు తాజాగా ఇంటింటా మోగుతున్నాయి. మణిపూర్ లో ఉన్న వాతావరణం యుద్ధభూమిని తలపిస్తోంది.

పరిస్థితి ఇంతగా దిగజారడానికి, అసలు కుకీ మైతేయి జాతుల మధ్య ఉన్న సమస్యలు, కుకీల పట్ల మైతేయిల ఆరోపణలు, డిమాండ్లు ఏమిటి? ఈ రెండు జాతుల మధ్య ఏర్పడిన శత్రుత్వానికి మూలం ఏమిటి?

అందరూ భావిస్తున్నట్లు మైతేయి, కుకీ జాతుల మధ్య ఘర్షణలు మే 3వ తేదిన చురాచాంద్పూర్ లో జరిగిన ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రదర్శనతో మొదలవలేదు. ఈ కుట్రకు ఎంతో ముందే తెరలేచింది. మణిపూర్ చరిత్రను వక్రీకరించడం, కుకీల నుంచి నాగాలను వేరుచేయడం, తప్పుడు గణాంకాలతో వండిన కట్టుకథలను కుకీలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి, మైతేయిలలో తీవ్ర అభద్రతాభావం కల్పించి కుకీలను హతమార్చో వెళ్ళగొట్టో వాళ్ళ భూములను, అడవులను స్వాధీనం చేసుకోవడం, పనిలో పనిగా రాబోయే ఎన్నికలలో మైతేయిల మెజారిటీ ఓట్లను దండుకుని అధికారాన్ని నిలబెట్టుకోవడం ఈ కుట్రవెనుక హైందవ శక్తులు ఆశిస్తున్న ప్రయోజనం. మణిపూర్ హైకోర్టు తీర్పుకి నిరశనగా మే 3వ తేదిన జరిగిన ప్రదర్శనకు ముందు, ప్రదర్శన జరిగిన తర్వాత మణిపూర్ లో జరిగిన అనేక సంఘటనల క్రమాన్ని పరిశీలిస్తే ఈ హింసాకాండ హఠాత్తుగా చెలరేగింది కాదని అర్ధమవుతుంది.

మణిపూర్ కొండలు లోయలతో వృత్తాకారంగా ఉంటుంది. మధ్యలో ఉన్న 10 శాతం భూమి ఉన్న లోయ ప్రాంతంలో మైతేయిలు, చుట్టూ 90 శాతం భూమి ఉన్న పర్వత ప్రాంతంలో కుకీ, నాగా మరో 34 సబ్ తెగలకు చెందిన ఆదివాసులు నివశిస్తున్నారు. మణిపూర్ మొత్తం జనాభాలో మైతేయిలు 53 శాతం కాగా మిగిలిన 47 శాతం మంది ఆదివాసులు. మైతేయిలలో 8 శాతం మంది ఉన్న ముస్లింలు మినహాయించి మిగిలిన వారంతా వైష్ణవ మతాన్ని ఆచరించే హిందువులు. ఓబిసి లుగా, బ్రాహ్మణులుగా, సనామహా లుగా వివిధ సామాజిక శ్రేణులలో ఉన్నారు. విద్యా, ఉద్యోగ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉండి ఆర్ధికంగా సామాజికంగా మిగిలిన జాతులకంటే బాగా ఎదిగిన వర్గం. మణిపూర్ అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్లేలలో 40 మంది మైతేయి వర్గానికి, 10 మంది కుకీ, 10 మంది నాగా జాతికి చెందిన వాళ్ళు. ఇంతవరకూ మణిపూర్ ని పరిపాలించిన 12 మంది ముఖ్యమంత్రులలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీరేన్ సింగ్ తో సహా 10 మంది మైతేయీలే. 10శాతం ఉన్న లోయ ప్రాంతం వివిధ కార్యాలయాలతో బాగా అభివృద్ధి చెందిన కేంద్రం. చురాచాంద్పూర్ లో మైతేయిలు ప్రధాన వర్గం కాగా కాంగ్పోకి జిల్లాలో కుకీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

కుకీ, నాగా జాతులు నివశించే 90 శాతం భూమి ఉన్న కొండ ప్రాంతం ఎత్తు పల్లాలతోనిండి స్థిర వ్యవసాయానికి పూర్తిగా అనుకూలమైనది కాదు. క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన ఈ జాతులన్నీ పోడు వ్యవసాయం చేస్తున్నాయి.

తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని మైతేయిలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అదే డిమాండును కోరుతూ హైకోర్టుకు వెళ్ళారు. మైతేయిలకు ఎస్టీ హోదా కల్పించవలసిందిగా రికమెండ్ చేస్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నాలుగు వారాలలోపు లేఖ రాయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఏప్రిల్ 27న హైకోర్టు తీర్పు ఇచ్చింది. నిజానికి ఇటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం ఏ కోర్టుకు లేదు. ఎస్సీ, ఎస్టీ జాబితాలో కొంతమందిని చేర్చమనో, మరికొంతమందిని తొలగించమనో లేదా జాబితాను సవరించమనో సూచించే అధికారం ఉన్నత న్యాయస్థానంతో సహా దేశంలో ఉన్న ఏ కోర్టుకు లేదని 2000 సంవత్సరంలో ‘ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సస్ మిలంద్ ‘ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని ఖాతరు చేయకుండా మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కుకీ, నాగా జాతులను తీవ్ర అభద్రతాభావంలోకి నెట్టింది. తమకున్న కొద్దిపాటి వనరులను, జీవనోపాధిని కోల్పోతామని ఆదివాసులు సహజంగానే ఆందోళన చెందారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో 60 వేలమంది ఆదివాసులు చురాచాంద్పూర్ లో శాంతియుత ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనకన్నా రెండున్నర నెలల ముందు ఫిబ్రవరి 15వ తేదీన కుకీ ఇతర ఆదివాసులు సాగుచేసుకుంటున్న 28 గ్రామాలలోని భూములను రిజర్వ్ ఫారెస్టు కింద ప్రకటించి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా వాళ్ళను అక్కడినుంచి బీరేన్ సింగ్ ప్రభుత్వం కాళీ చేయించింది. ఈ చర్యతో భూములతోపాటు కుకీలు తమ నివాసాలను కూడా కోల్పోయారు. హిల్స్ నుండి తమను గెంటివేసే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని ఆదివాసులు గ్రహించారు. దీనికి నిరసనగా చురాచాంద్పూర్ ధిభాంగ్ లో ఉన్న ఫారెస్టు రేంజ్ కార్యాలయాన్ని ఏప్రిల్ మాసంలో ఆదివాసులు తగలబెట్టారు.

మే 3వ తేదీ ప్రదర్శనకు అయిదు రోజులముందు ఏప్రిల్ 28వ తేదీన మైయిటీ లిపున్ సంస్థ అధినేత ప్రమోద్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో కుకీలను ఉద్దేశించి ‘కొండలపైన ఉన్న మన సంప్రదాయ ప్రత్యర్ధులను నిర్మూలించి ప్రశాంతంగా జీవిద్దాం ‘ అని పోస్ట్ చేశాడు. కుకీలు మణిపూర్ – వాసులే కాదని, బర్మా, మయన్మార్ దేశాలనుంచి అక్రమంగా ఈ దేశంలోకి ప్రవేశించిన చొరబాటుదారులని, భారతదేశ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేస్తున్న దేశద్రోహులని కుకీలపై ఇంకా అనేక నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మెయిటీ లిపున్ సంస్థ సామాజిక మాధ్యమాలలో, బయటా ప్రచారం చేపట్టింది. మణిపురి పురాతన సంస్కృతిని పరిరక్షించడం, మైతేయి హిందువులను ఐకమత్యంతో ఒక తాటిమీద నెలబెట్టడం తమ లక్ష్యం అని ప్రకటించుకుంటున్న ఈ సంస్థ, ఆ ముసుగులో మైతేయి యువకులలో హిందుత్వభావజాల ఉన్మాదాన్ని ఎక్కిస్తూ తమ సభ్యులకు అనేక ఇతర విద్యలతోపాటు కర్రసాము, తుపాకులను ఉపయోగించడంలో శిక్షణ కూడా ఇస్తోంది. మెయిటీ లిపున్ సంస్థ అధినేత ప్రమోద్ సింగ్ గుజరాత్ లో విద్యార్ధి దశలో ఉన్న సమయంలో కరడుగట్టిన ఎబివిపి నాయకుడు.

మే 3వ తేదీ ఆదివాసుల ప్రదర్శన తర్వాత నుంచీ చురాచూంద్పూర్, కాంగ్పోకి జిల్లాలలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. మొదటి రెండురోజులలో 74 మంది మరణిస్తే అందులో 60 మంది కుకీలే. మైయిటీ లిపున్, అరంబై తెంగోల్ కి చెందిన వందలాదిమంది కార్యకర్తలు, యువకులు నల్లదుస్తులు ధరించి మోటార్ బైక్స్ మీద గ్రామాలమీదపడి తుపాకులతో ఆదివాసులపై దాడులు చేశారు. కుకీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారాలు, హత్యలు చేశారు. ఎంతోమంది కుకీలను ఆటవికంగా కొట్టి చంపారు. బయటినుంచీ తలుపులకు గొళ్ళాలు బిగించి ఇళ్ళల్లో ఉన్నవాళ్ళను సజీవదహనం చేశారు. ఎంతమందిని చంపారో, ఎన్ని ఇళ్ళను లూటీ చేశారో, ఎన్ని గృహాలను బుగ్గిపాలు చేశారో తెలియచేస్తూ అనేక గణాంకాలు వస్తున్నాయి. వేల సంఖ్యలో కుకీలు నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో చర్చిలను, పాస్టర్ల నివాస భవనాలను, క్రిస్టియన్ కార్యాలయాలను, మిషినరీ పాఠశాలలను ధ్వంసం చేశారు. దాడుల నుంచి కాపాడుకునే క్రమంలో పరుగెడుతూ నదిలోపడిపోయిన ఎంతోమంది పిల్లలు శవాలై తేలారు. హత్యగాబడ్డ వారి శవాలకు అంతిమ సంస్కారాలు జరగక మార్చురీలలో పడి ఉన్నాయి. తుపాకులు వెంటపడుతుంటే పరుగెడుతూ గర్భిణీ స్త్రీలు బిడ్డలకు ప్రాణం పోశారు. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకూడదనే ఉద్దేశ్యంతోనే మే 3వ తేదీ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ తీసివేశామని ప్రభుత్వం చెబుతున్నా అది వాస్తవం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. గుజరాత్ లోని గోద్రా లాగా అత్యంత అమానుషంగా, క్రూరాతి క్రూరంగా జరిగిన సంఘటనలు బయటకు పొక్కకుండా నిందితులను కాపాడే లక్ష్యంతోనే ఇంటర్నెట్ కనెక్షన్ ను రద్దుచేసినట్లు అర్ధం అవుతోంది. సామాన్య కుకీలే కాదు, బిజెపి కుకీ ఎమ్మెల్లేలు, వాళ్ళ ఆస్తులు కూడా దాడులకు గురయ్యాయి. ట్రైబల్ కమిటీ సలహాదారు, ఎమ్మెల్లే అయిన Vungzagin ValTe కు కరెంట్ షాకులిచ్చి మతిస్థిమితం కోల్పోయేంతగా హింసించి అవిటివాడిని చేసారు. కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనను ప్రస్తావిస్తూ ఈ 70 రోజులలో ఇటువంటివి వందల సంఖ్యలో జరిగాయని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అనాలోచితంగా పత్రికలముందు అంగీకరించి కుట్ర లోతులను బట్టబయలు చేశాడు.

తమను షెడ్యుల్ ట్రైబ్స్ గా గుర్తించి ఆ జాబితాలో చేర్చాలనే మైతేయిల ప్రధానమైన డిమాండ్ ను నెరవేరుస్తామనే హామీతోనే బిజెపి మణిపూర్ లో అధికారంలోకి వచ్చింది. ఆర్ధిక, సామాజిక రంగాలలో మిగిలిన వర్గాలకంటే అభివృద్ధిలో వెనుకబడి కుల, తెగ, జాతి రీత్యా వివక్షత ఎదుర్కుంటున్న వర్గాలను ఎస్సి, ఎస్టీ వర్గాలుగా భారత ప్రభుత్వం గుర్తించి మిగిలినవారితోపాటు సామాజికన్యాయం పొందేందుకు వీలుగా విద్యా, ఉద్యోగ రంగాలతోపాటు వారికి కొన్ని ప్రత్యేక హక్కులను దఖలు పరిచింది. ఆ హక్కులను పరిరక్షించడానికి చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ఆదివాసులు నివశించే ప్రాంతాలను షెడ్యుల్డ్ ప్రాంతాలుగా ప్రకటించి ఇక్కడ గిరిజనేతరులెవరూ భూమి క్రయవిక్రయాలు జరపకుండా 1960 లో మణిపూర్ ల్యాండ్ రెవెన్యు అండ్ ల్యాండ్ రిపాంస్ చట్టాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ జాబితాను, అందుకు అవసరమైన విదివిధానాలను రూపొందించేందుకు మొదటిసారి 1956 లో కాకా కలేల్కర్ కమీషన్ ను ఏర్పాటు చేసింది. 1965 లో లోకుర్ కమిటీ ఈ జాబితాలో రెండవ దఫా మార్పులు చేర్పులు చేస్తూ సవరింపులు చేసింది. ఈ రెండు సందర్భాలలోను భారతదేశంలో ఉన్న అనేక తెగలు ఈ జాబితాలో నమోదు చేయించుకున్నాయి. నిజానికి ఈ రెండుసార్లు షెడ్యుల్ ట్రైబ్స్ గా గుర్తించబడడానికి, ఆ జాబితాలో చేరడానికి మైతేయిలు ఉత్సాహం చూపించలేదు. పైగా అందులో చేరడం తమ సామాజిక, ఆర్ధిక హోదాకు తక్కువగా, నామోషిగా భావించి తిరస్కరించారు. ఈ వాస్తవాన్ని మరుగుపరుస్తూ 1949 కి ముందు తాము ఎస్టీ క్యాటగిరిలో ఉండేవాళ్ళమని తర్వాత కాలంలో అందులోనుంచి తమని తొలగించారనే ప్రచారం చేస్తున్నారు. మణిపూర్ భారతదేశంలో విలీనమయ్యింది 1949 సంవత్సరంలో. 1956 కన్నా ముందు ఎస్సి,ఎస్టీ జాబితా అన్న అవగాహన ఉనికిలోనే లేదు.  అసలు ఎస్సీ, ఎస్టీ చట్టం నిభందనలు, ప్రమాణాలరీత్యా మైతేయిలు ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఏవిధంగానూ అర్హులుకారు.

మణిపూర్ ల్యాండ్ రెవెన్యు అండ్ ల్యాండ్ రిపాంస్ చట్టం ప్రకారం హిల్స్ లో మైతేయిలు భూములను కొనుగోలు చేయడానికి అనర్హులు. జనాభారీత్యా తమకంటే తక్కువ సంఖ్యలో ఉన్న ఆదివాసులకు భూపరిధి ఎక్కువగా ఉండడంపట్ల మైతేయిలలోని సంపన్నులకు, రాజకీయనాయకులకు తీవ్ర ఆక్షేపణ ఉంది. తమను కూడా ఎస్టీలుగా గుర్తిస్తే పర్వతప్రాంతంలోని భూమిపై హక్కు పొందవచ్చనేది వారి ఆలోచన. అంతేకాక మైతేయిలలోని సంపన్నులు, రాజకీయనాయకులు ఆదివాసుల భూములను లీజుకి తీసుకుని ఇతర పంటలతోపాటు గంజాయి పంటను కూడా పండిస్తున్నారు. పాపి కల్టివేటర్స్ కుకీలు నాగాలే కాదు మైతేయిలు కూడా. పాపి కల్టివేషన్లో 60 శాతం మైతేయిలదే. పాపి కల్టివేషన్ కి స్వయంగా ముఖ్యమంత్రి బీరేన్ సింఘ్ అండదండలున్నాయని పోలీసు అధికారి వెల్లడించింది. కుకీ ఇతర ఆదివాసులలో ఎక్కువమంది ఈ సంపన్నులకు లీజుకిచ్చిన భూములలో పంట పండించే కూలీలే తప్ప ఆ పంటలకు యజమానులు కారు. 2017-22 మధ్య డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నల్లమందు వ్యాపారం, ఆయుధాల వ్యాపారం, కలప రవాణా ఇవన్నీ ఆర్ధికంగా రాజకీయంగా బలపడిన మైతేయిలు, అధికార యంత్రాంగం, రాజకీయనాయకులు, పెట్టుబడిదారులు అంతాకలగలిసి నిర్వహిస్తున్నట్లు రుజువయ్యింది. ఈ కాలంలో నార్కోటిక్స్ శాఖ అరెస్టు చేసిన వారిలో 381 మంది మైతేయిలు, 1083 మంది ముస్లింలు, 873 మంది కుకీలు 181 మంది ఇతరులు ఉన్నారు. అంతకంటే ముఖ్యమైన విషయం కేంద్ర గనులశాఖ జరిపిన ఒక సర్వేలో కుకీలు నివశించే ప్రాంతాలలో గాస్ నిక్షేపాలు, 42 రకాల అతివిలువైన ఖనిజ వనరులు ఉన్నాయని బయటపడింది. వీటిమీద రాజకీయనాయకుల, కార్పోరేట్ల కన్నుపడింది. అక్కడి నుంచి కుకీలను వెళ్ళగొట్టి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలనే కుట్ర మొదలయ్యింది. అందుకు అవసరమయిన పధక రచన, కార్యక్రమం రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుతం మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండ ఈ పధకంలో భాగం. ఎస్టీ రిజర్వేషన్ల వల్ల కుకీ, నాగా జాతి ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా పొందడం, అధికార యంత్రాంగంలో స్థానం సంపాదించుకుని ఆర్ధికంగా ఎదగడం, రాజ్యాధికారంలో భాగం కావడం హిందుత్వవాదులైన మైతేయిలకు మింగుడుపడని మరొక విషయం. మణిపూర్ మారణహోమానికి ప్రధాన బాధ్యుడైన బీరేన్ సింఘ్ ను భుజాన మోస్తూ మరోవైపు జరిగిన అల్లర్లను సాకుగా చూపి కుకీ జాతికి చెందిన డిజిపి Doungel ని వేలెత్తి చూపుతూ అమిత్ షా ఆ అధికారిని విధులనుంచి తొలగించాడు. కేంద్ర ప్రభుత్వానికి కుకీలపట్ల ఉన్న వ్యతిరేకతకు, అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

కుకీలు అసలు మణిపూర్ మూలవాసులే కాదని 19వ శతాబ్దంలో బర్మా, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మణిపూర్ లోకి చొరబడ్డారని, గత 5-10 సంవత్సరాల కాలంలో ఇలా చొరబడుతున్న కుకీల సంఖ్య లక్షలలో ఉందని మైతేయిలు చేస్తున్న మరొక తప్పుడు ప్రచారం. కుకీల జనాభా ఇలా పెరగడం వల్ల గ్రామాల సంఖ్య పెరిగిపోయి భౌగోళికంగా మార్పులు చోటుచేసుకుని, 2026 సంవత్సరంలో కేంద్ర్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో కుకీల అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగి ఇప్పుడున్న దానికంటే ఎక్కువమంది రాజ్యాధికారంలోకి వస్తారని, భూములు, ఉద్యోగాలు, అధికారం అన్నీ కుకీల వశమై పోతాయని ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మైతేయిలు తమ దేశంలోనే తాము మైనారిటీ కాబోతున్నారని, మణిపురి భాష, సంస్కృతి, కళలు, క్రీడలు అన్నీ ప్రమాదంలో పడి తమ ఉనికినే కోల్పోబోతున్నాయనే జాతీయ దురహంకార ప్రచారంతో మైతేయిలలోని అన్ని శ్రేణులను రెచ్చగొడుతూ కుకీలకు వ్యతిరేకంగా సమీకరిస్తున్నారు. భారత ప్రభుత్వం 1901 లో నిర్వహించిన జనాభా గణాంకాల ప్రకారం మణిపూర్ మొత్తం జనాభా 2,84,488 మంది. ఇందులో కుకీల సంఖ్య 41,262 మంది అంటే 14.5 శాతం. మొత్తం జనాభాలో మైతేయిల శాతం 57.7 శాతం. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 2011 లో జరిపిన సెన్సస్ సర్వే ప్రకారం మొత్తం జనాభా 28,55,794 మంది. ఇందులో కుకీల సంఖ్య 4,48,214 మంది అంటే 16 శాతం. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనాభా సర్వే ప్రభుత్వం వాయిదా వేయడం వల్ల 2021 లో జరగలేదు. 1901 నుంచి 2011 వరకు 110 సంవత్సరాల కాలంలో కుకీల జనాభా పెరిగింది కేవలం 1.5 శాతం. మణిపూర్ లోని అన్ని జాతుల జనాభా సంఖ్య సహజంగా పెరిగిన దామాషాలోనే కుకీల జనాభా సంఖ్య కూడా పెరిగింది. ఇందులో అసహజంగానో హఠాత్తుగానో కుకీల జానాభా సంఖ్య పెరిగిన చిహ్నాలు ఏమి కనపడవు. 2011 తర్వాత బర్మా, మయన్మార్ నుంచి శరణార్దులుగా వచ్చిన కుకీల సంఖ్య అయిదారువేలమందికి మించి ఉండదని బిజెపి ఎమ్మేల్లేలు చెబుతున్న విషయం. ఈ సంఖ్యను లక్షలలో పెంచేసి స్తానిక కుకీలను కూడా శరణార్దుల జాబితాలో వేసి అందరినీ అక్రమ చొరబాటుదారులుగా, విదేశస్తులుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఆరోపణలను మరో స్థాయికి తీసుకువెళ్తూ కుకీలు తమకు ప్రత్యేక క్రిస్టియన్ దేశం కావాలంటున్నారని, కుకీల వెనుక చైనా, అమెరికా దేశాల విదేశీ హస్తాలు ఉన్నాయని కుకీలపై అంతార్జాతీయ కుట్రను ఆపాదిస్తున్నారు. చర్చ్, డ్రగ్స్ మాఫియా కుకీలకు నిధులు, ఆయుధాలు సమకూరుస్తున్నాయంటూ గోబెల్స్ ప్రచారానికి పూనుకున్నారు. ఈ వాదనలను వినిపిస్తూ ఫేక్ వీడియోలను, కధనాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందువల్ల 1951 సంవత్సరాన్ని కట్ ఆఫ్ సంవత్సరంగా ప్రకటించి NRC సర్వే నిర్వహించాలని మైతేయి హిందుత్వ మేధావులు డిమాండ్ చేస్తున్నారు. 1951 తర్వాత వచ్చినవాళ్ళను చొరబాటుదారులుగా ప్రకటించి ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని కోరుతున్నారు. NRC ప్రకారం 1951 ముందు ఉన్నవాళ్ళు తమ స్థానికత్వాన్ని దృవీకరించే వివిధ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ డాక్యుమెంట్స్ లభించడం అంత సులువు కాదు కాబట్టి ఆ సాకుతో కుకీలందరిని వెళ్ళగొట్టి ఫారెస్టు భూములను స్వాధీనం చేసుకోవచ్చు. కార్పోరేట్ మిత్రుల సేవకు అంకితమైన దిల్లీ పెద్దలు, మణిపూర్ మైతేయి పాలకులు, వారి వనరులపై మూలాలపై దాడి చేయడం మాత్రమేకాదు, క్రిస్టియన్ మత ప్రభావం కింద ఉన్న ఈశాన్య రాష్ట్రాలలోని ఆదివాసీ జాతులను హైందవ మత ఆధిక్యత పరిధిలోకి తీసుకురావడం కూడా ఆరెసెస్, బిజెపి ఆశిస్తున్న లక్ష్యాలలో ప్రధానమైనది. గత యాబై ఏళ్ళుగా ఒక ప్రణాళిక ప్రకారం ఇందుకోసం ప్రయత్నిస్తూ మోదీ అధికారం లోకి వచ్చిన తర్వాత దీన్ని ముమ్మరం చేసి ఇండియా అంటే హిందు, హిందు అంటే జాతీయత అనే నినాదం కింద ఆదివాసీ జాతులను సమీకరిస్తూ హిందుత్వ శక్తులు విస్తరిస్తున్నాయి. ఆదివాసీ జాతుల ప్రత్యేక సంస్కృతులకు, ఆచార మత విశ్వాసాలకు దైవ సంబంధ ప్రతీకలకు హిందుత్వ దేవుళ్ళతో చుట్టరికం కలిపి, వారి సంస్కృతిలోకి హైందవ విలువలను ధర్మాలను చొప్పిస్తూ విధ్వంసానికి పాల్పడుతూ ఈశాన్య రాష్ట్రాలను సంపూర్ణంగా కాషాయ జెండాకిందకు లాగే కుట్ర చేస్తోంది. క్రిస్టియన్లైన కుకీలపై జరుగుతున్న దాడులను ఈ కోణంలోనుంచి కూడా చూడడం విస్మరించకూడదు.

ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరింపుల పేరిట చట్టాన్ని బలహీనపరుస్తూ ఆదివాసుల హక్కులకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు. మణిపూర్ ప్రభుత్వం 1988 లో చేసిన మణిపూర్ లాండ్ రెవెన్యూ అండ్ లాండ్ రిఫాంస్ చట్టం అయినా, 2018 లో తీసుకువచ్చిన మణిపూర్ పీపుల్స్ ప్రొటెక్షన్ చట్టం అయినా వాటి సారాంశం క్రమంగా ఆదివాసులను వాళ్ళ భూములనుంచి, అడవులనుంచి వెళ్ళగొట్టడమే. ‘అభివృద్ధి ‘ ముసుగులో అడవులను ఈ ప్రాంతాలలో ఉన్న సహజవనరులను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడమే నరేంద్రమోది, ఆయన ప్రభుత్వం కోరుకుంటున్నది.

ప్రభుత్వాలమీద విశ్వాసం కోల్పోయిన కుకీలు తమ ఆదివాసులకు యూనియన్ టెరిటరి లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు తప్ప మైతేయిలు ప్రచారం చేస్తున్న విధంగా క్రిస్టియన్ రాజ్యాన్ని కాదు.

One thought on “మణిపూర్ మారణహోమం వెనుక హిందుత్వ ఎజండా

  1. చాలా బాగా రాసరు. కుకి ల పై రాజ్యం చెస్తున్న హింసాత్మక దాడీ

Leave a Reply