మణిపూర్ మంటలకు కారణం ఎవరు..?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటు కూర్చున్నాడట. సరిగ్గా అలాగే భారత దేశ ప్రధాని పరిస్థితి ఉన్నది. గత కొన్ని నేలలుగా మణీపూర్ మంటల్లో మండుతోనే ఉన్నది. అసలు మణిపూర్ మంటలకు కారణం ఏంటి..? మణిపూర్ అనగానే అసలు ఇది భారత భూభాగంలో ఉన్నదా అనే కోణం నుంచి ఆలోచన చేసే వాళ్లు కూడా లేక పోలేదు. ఇలా మణిపూర్, మేఘాలయ,అస్సాం, మిజోరాం, నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాలతో పాటు కాశ్మీర్ లాంటి రాష్ట్రం భారత దేశంలో భూభాగం కాదనుకుంటారు. అక్కడి ప్రజలతో ఉండాల్సిన సోదర భావం మిగితా వాళ్లకు అంతగా పట్టదు. ఎందుకు ఇంతలా భారత భూభాగంలో ఉండే ప్రజల మధ్య ఈ వ్యత్యాసం అనుకుంటే ఇది ముమ్మాటికీ ఆర్.ఎస్.ఎస్ రాజకీయ క్రీడలో భారత దేశ పాలక వర్గమైన బిజెపి మరియు బిరెన్ సింగ్ సర్కార్లదే పూర్తి తప్పిదం.

నాటి బ్రిటీష్ వలస పాలనలో భారత దేశాన్ని విభజించు పాలించు అనే సూత్రీకరణతో సాగిన కాలం. ఆ వలస పాలకుల పాలనలో కొనసాగించిన విధానాలనే నేటికీ అదే విధంగా విధ్వంసకర అభివృద్ధి భారత దేశ పాలక వర్గం అనుసరిస్తుంది. భారత దేశ ఔనత్యాన్ని చాటడానికి చెప్పే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇప్పటికీ పాలక వర్గ ప్రభుత్వాలు ఆ భిన్న సంస్కృతులను, ఆచారాలను అంగీకరించ లేని పరిస్థితిలో ఉన్నారు. ఆలాంటి కాలంలోనే కదా భారత భూభాగంలో ఈ విద్వేషాలు, ఈ మారణ హోమాలు, మానవత్వానికి మంటలు పులమడాలు అనేవి అందరం అంగీకరించాల్సిన అంశాలే.

మనం మణిపూర్ మంటల్లో తగలబడుతున్నది అనేది ఈరోజు జరుగుతున్నది కాదు. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మిజోరాం, కాశ్మీర్ ,ఈశాన్య రాష్ట్రాల ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా జాతి విముక్తి కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. జాతి విముక్తి పోరాటాల కోసం వారు చేస్తున్న ఉద్యమాలను అణచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను కూడా రూపొందించింది.AFSPA (Armed Force Special Power Act) ఇదే ఆ ప్రత్యేక చట్టం.అక్కడి నేలలోని మహిళలపై, ప్రజలపై ఆర్మీ , ఈ స్పెషల్ ఫోర్స్ చేసే ఆగత్యాలు చెప్పలేనివి. వీటికి వ్యతిరేకంగా 16 సం||రాలుగా పోరాడిన ఇరోమ్ షర్మిలను సాక్ష్యంగా చెప్పవచ్చు. అయితే ఈ అంశాలు ఇలా కొన్ని ఉండగా. ఎందుకు మణిపూర్ లాంటి రాష్ట్రాలు మండుతున్నాయి.

మణిపూర్ రాష్ట్రం రెండు విధాలుగా ఉంటుంది. కొండ ప్రాంతం, లోయ ప్రాంతం. ఈ రాష్ట్రంలో మేయితిలు , కుకీలు, నాగాలు, ముస్లింలు, బుద్దిస్టులు, సిక్కులు తదితరులు ఉంటారు. అయితే జనాభా ప్రకారం మేయితిలు ఎక్కువగా ఉంటారు. వారిదే అధికారం. వీళ్ళు లోయ ప్రాంతంలో నివసిస్తారు. కుకీలు ఎక్కువగా కొండ ప్రాంతంలో ఉంటారు. వీరు ఆదివాసీలు. మేయితిలును హిందువులుగా చూస్తారు. వారు ఆచరించే విధానం, అలాగే వారు గతంలో చెప్పుకున్నదే. కుకీలు ఆదివాసీలు అయిన వారు క్రిస్టియన్ ఆచారం కొనసాగిస్తున్నారు. రాజ్యాంగంలో ఆదివాసులకు ఇచ్చిన హక్కుల ప్రకారం అడవిలోకి ఆదివాసేతర ప్రజలని అడుగుపెట్టనివ్వరు. అలా రాజ్యాంగం ప్రకారం వారికున్న హక్కుల మూలంగా నేటికీ అడవిలో ఉన్న సహజ వనరులకు రక్షణ కవచంగా ఆదివాసులు నిలుస్తున్నారు. అలాగే మణిపూర్ లో కూడా కుకీలు అక్కడి నేలలోని సహజ ఖనిజ వనరులను రక్షిస్తున్నరు. అక్కడి నేలలో లభ్యమైయే ఖనిజాలు ప్రపంచంలోనే అత్యంత అరుదైన సర్పంటైటిస్ (ఆకు పచ్చ గ్రానైట్, ఏమరాల్డ్ గ్రీన్) ప్లాటినం గ్రూప్ మెటల్స్, ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్, నికల్, లైమ్ స్టోన్ (సుద్దపు రాయి), క్రోమైట్, కాపర్, మెలచైట్, మెగ్నటైట్ ఉన్నట్లుగా ప్రభుత్వం చేయించిన జీ.ఎస్.ఐ సర్వే ద్వారా తెలిసింది.ఈ ఖనిజ వనరులను కార్పోరేట్లకు ధార దత్తం చేయడం కోసం ప్రభుత్వాలు పాటుపడ్డాయి.ఆ కోవలోనే ఈ వనరులపైన కార్పొరేట్ల డేగకన్ను పడింది.

మణిపూర్ లో ఉన్న ఖనిజ సంపదను ఎలాగైనా తమపరం చేసుకోవాలని చూస్తున్న కార్పొరేట్లకు ఎన్నికలు ఒక వరంగా మారాయి. మణిపూర్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు 34 బిజెపి గెలిచింది.20 స్థానాలకు ఇతర పార్టీ గెలిచి, బిజెపికి అనుకూలంగా మారింది అన్ని రంగాల్లో మేయితిలు మేజారిటీగా ఉన్న కానీ వారు వారిని ST జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఉన్నది. ఇదే అదునుగా భావించిన కార్పొరేట్లకు ఒక మార్గం దొరికిందని భావించి మణిపూర్ అల్లర్లకు ఆజ్యం పోసిండ్రు. మేయితిలకు ST జాబితా హోదా ఇవ్వడం అంటే అది కుకీల జీవన మరణ పోరాటమే. భిన్న సంస్కృతులకు నిలయం అయిన దేశంలో, భిన్న జాతుల మధ్య, సంస్కృతుల మీద, భాషల మీద, భిన్న విధానాల మీద దాడులకు సర్కార్ పాల్పడుతున్నది. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజంలో భాగంగానే ఇదంతా సర్కార్ కేవలం కార్పొరేట్లయిన అదాని, అంబాని, బానియాల కోసం పాటుపడుతున్నదని మనం గ్రహించాలి.

ఈక్రమంలోనే మే 4న మణిపూర్ లో జరిగిన ఘటన. ఇది కాంగ్పొకి జిల్లా బి.ఫైనాం గ్రామంలో ఇద్దరు కుకీ మహిళలను దిగంబరంగా ఊరేగించిన అంశం యావత్ భారత వనిని తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రపంచ దేశాల నుండి వెల్లువెత్తుతున్న నిరసనలకు భారత కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేకుండా పోయింది.ఈ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ రేఖ శర్మ చేతులు దులుపుకోవడం వరకే పరిమితం అయ్యారు. ఇలా రోజుకో ఘోరం వెలుగు చూడాల్సిన పరిస్థితి మనం మణిపూర్ లో చూస్తున్నాం.ఈ ఘటన మరువక ముందే మరో 18 ఏండ్ల యువతి మీద అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. “బెటి పడావ్ బెటి బచావో ” నినాదం ఎక్కడికి పోయిందో. నేటీ దృతరాష్ట్రా పాలనలో అందరూ గమనిస్తూనే ఉన్నారు.

మణిపూర్ మారణ కాండ మీద ప్రధాని మౌనం, హోంమంత్రి చిరునవ్వులు దేనికి సంకేతం.? ప్రతిపక్ష పార్లమెంటరీ పార్టీలు డిమాండ్ చేస్తున్న రూల్ 267 ద్వారా ఎందుకు చర్చ చేయడం లేదు..? రూల్ 176 ద్వారా ఏదో నామ మాత్రంగా చర్చించి వదిలేద్దాం అనుకోవడం ఏంటి.? అసలు మణిపూర్ భారత భూభాగం కాదని వాళ్ల అభిప్రాయమా..? లేదా అక్కడి ప్రజలు దేశ పౌరులు కారా..? వారికి మణిపూర్ భూభాగం కావాలి కానీ అక్కడి ప్రజలు ప్రభుత్వానికి మాత్రం పట్టరు.

ఆర్టికల్ 370ని రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి లేకుండా చేసింది. ఇప్పటికీ అక్కడ నిత్య నిర్భంధాన్ని కొనసాగిస్తున్నది. అక్కడి నేలలోని ఆపిల్ తోటలను కార్పొరేట్ సంస్థలకు, అదానికి కట్టబెట్టుతుంది. జాతి పేరు చెపుతూ, జాతి విద్వేషాలకు పూనుకుంటుంది. ఇప్పుడు అదే మణిపూర్ లో ఆర్టికల్ 371 ను రద్దు చేయడం కోసమే ఈ మారణ కాండను సృష్టించింది. ఎత్తనిక్ గ్రూప్ ల మధ్య గొడవలకు కారణం పాలక వర్గ ప్రభుత్వాలదే. పౌర సమాజంలో పౌరులంత సమానమనే భారత రాజ్యాంగం చెపుతున్న కానీ భారత పాలక వర్గాలకు అధికారం మీద ఉన్న శ్రద్ధ ఈ పౌర సమాజం గూర్చి పట్టదు. అందుకే వారు ఈ సమాజంలో ప్రజలు కలిసి జీవించడాన్ని సహించలేని ఈ దేశ పాలక వర్గ ప్రభుత్వాల దుస్థితి.

ఇప్పుడు కేవలం ఇది మణిపూర్ వరకు మాత్రమే పరిమితమైనది కాదు. రేపు రేపు అఖండ భారత్ అంటూ దేశాన్ని హైందవీకరించడానికి కంకణం కట్టుకొని బయాలుదేరిని బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజానిది . ఇది అందరినీ హతమార్చక పోదు. నేడు ప్రశ్న నేరమైంది, పాట కుట్ర అయింది, అక్షరపు అల్లిక రాజ్య ద్రోహంగా మారింది. ఇలాంటి పరిస్థితులను మోషాల పాలనలో నిత్య నిర్బంధంలో దేశం మండుతూనే ఉన్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బాసటగా నిల్చిన మణిపూర్, కాశ్మీర్ , నాగాలాండ్, మిజోరాం, అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాలకు బాసటగా నిలుస్తూ,జాతి విముక్తి పోరాటాలకు అండగా నిలబడుదాం, కలబడదాం.

పుట్టిన ఊరు సిద్ధిపేట, పూర్వపు మెదక్ జిల్లా.  కవి, రచయిత, విరసం సభ్యుడు. ఎమ్మెస్సీ(భౌతికశాస్త్రం) చదివారు.  విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వివిధ పత్రికల్లో కవిత్వం, వ్యాసాలు, పాటలు ప్రచురితమయ్యాయి. రచనలు: వసంత మేఘం(కవిత్వం)

 

 

 

Leave a Reply