మణిపూర్‌లో మంటగలిసిన మానవత్వం

బిజెపి స్వార్థ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మెజారిటీ మెహితీలను క్రిస్టియన్‌ మైనారిటీ కుకీ, నాగా, జోమి తెగలపైకి ఎగదోసింది. ఫలితంగా మణిపూర్‌ మూడు మాసాలుగా నెత్తురోడుతోంది. మణిపూర్‌ మంటలకు అగ్గి రాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది పెనుమంటగా మార్చింది ఎవరు? రెండు తెగల (మెహితీ, కుకీ) మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? అంటే, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. మణిపూర్‌ తగులబడుతుంటే భారత్‌లో ప్రజాస్వామ్యం నరనరాల్లో జీర్ణించుకుపోయిందని దండోరావేస్తూ నాలుగు (అమెరికా, ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌, యుఎఇ) దేశాల పర్యటనలో మునిగి తేలిన ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి మణిపూర్‌ వైపు తొంగి చూడలేదు, నోరు విప్పలేదు. మణిపూర్‌లో మానవ హక్కులు హరించే వ్యక్తికి ఇక్కడ స్వాగతం లేదు అని అమెరికా, ఫ్రాన్స్ లో సామాజిక కార్యకర్తలు, ప్రజాతంత్రవాదులు గళమెత్తినా, మణిపూర్‌లో మానవ హక్కుల హననంపై యూరోపియన్‌ పార్లమెంటు తీర్మాణం చేసినా మోడీ ఖాతరు చేయలేదు. ఎందువల్లనంటే మణిపూర్‌ భీకర హింస వెనుక బిజెపి మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌), ఇతర హిందూత్వ సంఘాల హస్తముంది. మూడు నెలలుగా హత్యలు, రేపులు, గృహదహనాలు జరుగుతుంటే మోడీ సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదు. దీన్ని బట్టి చూస్తే హింసను  ప్రోత్సహిస్తున్నది, ప్రేరేపించి చోద్యం చూస్తున్నది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలేనని ఇట్టే బోధపడుతుంది.

మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చిస్తే తనకు ఇబ్బందికరంగా ఉంటుందని, పార్లమెంటు వేదికపై పారదర్శక చర్చను అడ్డుకుంటున్నది ఎవరు? ఈ వ్యవహారంలో కేంద్ర పాలకుల డొల్లతనం, దాటవేత ధోరణి విస్పష్టంగా తెలిసిపోతున్నది. అసమర్థ డబుల్‌ ఇంజిన్‌ పాలన వల్లనే కదా మణిపూర్‌ వల్లకాడులా మారింది. తెగల తరతరాల తగాదాలో మతోన్మాద విషాన్ని రంగరించి తయారు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఫార్ములా ఊపిరాడనివ్వడం లేదు. కండ్లముందరే ఘోరకలి నిత్యం ఆవిష్కృతమవుతున్నా ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ గద్దె పట్టుకొని వేలాడుతున్నారు. మూడు నెలలుగా సంక్షోభం తీవ్రమవుతున్నా మూతిముడుపే మోడీ సమాధానమైంది. ఇప్పటికే రాష్ట్రంలో 350కి పైగా చర్చీలు దహనమయ్యాయి. ఆదివాసి గూడాలు దహనమయ్యాయి. 160కి పైగా మృతి చెందారు. ఎందరో మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అధికారిక వర్గాలు వెల్లడిస్తున్న హతులు, బాధితుల సంఖ్యలను ఎవరూ విశ్వసించడం లేదు. ఈ అల్లర్ల తీవ్ర బాధితులు మహిళలేనని మరి చెప్పనవసరం లేదు. ఘర్షణల ప్రాంతంలో దుర్బల ప్రజలను అవమానించడానికి, భయపెట్టడానికి మహిళలపై అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. చాలా మంది ఇటువంటి అవమానాలకు గురయ్యారు.

మణిపూర్‌లో 90 శాతం అడవులు, కొండలే. ఇక్కడ కుకీ, నాగా ప్రజలు వందల ఏండ్లుగా నివసిస్తున్నారు. ఇక్కడి కొండలు, గుట్టల్లో నికెల్‌, కాపర్‌, పాట్లినం తదితర విలువైన ఖనిజాలు అపారంగా ఉన్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వేలో వెల్లడైంది. సెక్షన్‌ 42, ఎస్సీ, ఎస్టీ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ చట్టాల కారణంగా ఈ ప్రాంతాలను కొనుగోలు చేయడం గిరిజనేతరులకు సాధ్యం కాదు. అయితే, ఎస్టీ హోదా కలిగిన వారు మాత్రం గిరిజనుల నుంచి భూములను కొనుగోలు చేయవచ్చన్న మినహాయింపు ఉన్నది. దీంతో ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి వచ్చిన మెహితీల్లోని కొందరు బిజెపి నేతలు తమ వర్గానికి ఎస్టీ హోదా కోసం చిచ్చు రాజేసినట్టు అర్థమవుతోంది. మెహితీలకు ఎస్టీ హోదా వస్తే, కుకీల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి కార్పొరేట్లకు కట్టబెట్టాలని కుట్రలకు పాల్పడుతున్నట్టు వాదనలున్నాయి. ఈ హింసాత్మక ఘటనలకు ఇదే కారణమని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కుకీలపై మెహితీల హింసకు మూలాలు :

ఈశాన్య భారతదేశంలో దాదాపు 200 పైగా తెగల ప్రజలు నివసిస్తున్నారు. ఒక్క మణిపూర్‌లోనే 33 తెగలు ఉన్నాయి. ప్రతి తెగలోను ఉపతెగలు ఉన్నాయి. మణిపూర్‌ జనాభా 33 లక్షలు. వీరిలో మెజారిటీ మెహితీలు 53 శాతంగా ఉన్నారు. ప్రధానంగా వీరు మణిపూర్‌లోని అభివృద్ధి చెందిన మైదాన ప్రాంతమైన ఇంపాల్‌, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తారు. మెయితీలు కొన్ని థాబ్దాలుగా ఎస్టీ స్టేటస్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. కుకీలు దానిని వ్యతిరేకిస్తున్నారు. కానీ మార్చి 27వ తేదీన మణిపూర్‌ హైకోర్టు కొన్ని పిటిషన్లను విచారిస్తూ మెహితీల రాజ్యాంగపర హక్కులు హరింపబడుతున్నాయని, కనుక రాష్ట్ర ప్రభుత్వము నాలుగు వారాలలోపు మెహితీలను ఎస్టీల జాబితాలో చేర్చే విషయంపై ఒక నివేదికను కేంద్రానికి పంపాలని ఆదేశించింది. మెహితీలకు ఎస్టీ హోదా వస్తే అటవీ, కొండ ప్రాంతాల భూములపై వారి ఆధిపత్యం పెరిగి తమ జీవనోపాధి దెబ్బతింటుందని, ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతుందని కుకీల వాదన. కుకీలు (16 శాతం), నాగాలు (24 శాతం) వెనుకబడిన కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. మణిపూర్‌లో గిరిజన జాతులు థాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నాయి. అభివృద్ధికి దూరమయ్యారు. అందుకే కుకీ-జోమి-నాగ జాతులు తమకు శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని చాలకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. తమ బతుకులు తమను బతకనివ్వమని అడుగుతున్నారు.

హింసకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ప్రోత్సాహం :

ఎస్టీ కెటగిరిలో చేర్చాలన్న మెహితీల డిమాండ్‌ను నిరసిస్తూ ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ మణిపూర్‌ పిలుపు మేరకు మే 3న ఇంఫాల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ రోజు నుంచి మెహితీలు కుకీలపై దాడులు చేస్తోన్నారు. మెహితీ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారంటూ ఓ ఫేక్‌ వీడియోను ప్రజల్లో ప్రచారంలో పెట్టారు. దీంతో ఆగ్రహం చెందిన మెహితీలు ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌ పోస్కె జిల్లాలో ఒక గ్రామానికి చెందిన 1000 మంది మే 4వ తేదీన మరో గ్రామంపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. వారి నుంచి రక్షించుకునేందుకు ఓ కుటుంబానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల అతని కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె, మరో ఇద్దరు మహిళలు అడవిలోకి పారిపోతుండగా.. వాళ్లను వందల మందితో కూడిన గుంపు అడ్డగించి దాడికి పాల్పడింది. 21 ఏళ్ల యువతిని వివస్త్రను చేస్తున్న అల్లరి మూకను అడ్డగించిన 19 ఏళ్ల ఆమె తమ్ముడిని, 50 ఏళ్ల తండ్రిని చంపేశారు.

ఆ తరువాత బిజెపి ప్రొద్భలంతో పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న మానవ మృగాలు కుకీ తెగకు చెందిన ముగ్గురు ఆడతల్లులపై అఘాయిత్యాలకు పాల్పడడం, మే 4నాటి ముగ్గురు మహిళలపై అత్యాచార ఘటన మణిపూర్‌లోని విషమ పరిస్థితులకు అద్దం పడుతోంది. అన్నింటికి మించి తమని పోలీసులే దుండగులకు అప్పగించారంటూ ఒక బాధిత మహిళ చెప్పిన మాటలు మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తున్నాయి. దుండగులు తమను బలవంతంగా తీసుకువెళుతుండగా పోలీసులు చూస్తూ ఉండిపోయారని బాధిత మహిళల్లో మరొకరు ఆరోపించారు. అయితే బాధితులు మే 18న మాత్రమే కేసు దాఖలు చేయగలిగారు. మరో కేసును జూన్‌ 21న దాఖలు చేశారు. తమపై దౌర్జన్యానికి దిగిన గుంపులో కొంత మందిని గుర్తించానని ఒక బాధితురాలు పేర్కొన్నారు.

ఈ ఘటనలో 75 రోజుల వరకు దోషులపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎస్‌పి, డిజిపి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏమీ చేయలేదు. మే 4 ఘటన విషయమై జాతీయ మహిళా కమీషన్‌కు అమెరికన్‌ మణిపూర్‌ అసోసియేషన్‌ ఒక లేఖ రాసింది. ఆ విషయాన్ని జూన్‌ 19న మణిపూర్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డిజిపిలకు జాతీయ మహిళా కమీషన్‌ తెలియజేసింది. జాతీయ మానవ హక్కుల కమీషన్‌ దృష్టి ఈ సంఘటన పైకి పోనేలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అటువంటి సంఘటన జరిగినట్టు తనకు తెలియనే తెలియదని బుకాయించారు! దేశానికి సిగ్గుచేటుగా పరిణమించినా అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి జూలై 19న వైరల్‌ అవడంతో అందరూ కలత నిద్ర నుంచి మేల్కొన్నారు. ఈ వీడియో దేశంలోని మహిళా లోకాన్ని కలవరపరిచింది.

మనదేశంలో కులమైనా, మతమైనా, దేశమైనా- సమాజంలోని ఏ ప్రధానమైన అంశంలోనయినా బలమైన వర్గం బలహీన వర్గంపై దాడి చేయాలంటే అందుకు అనువుగా దొరికేది ముందుగా స్త్రీలు. వారి ద్వారా ప్రత్యర్థి వర్గం మీద పైచేయి సాధించడం ఆటవిక సమాజాల స్వభావం. అది ఇప్పటికీ సాగుతూనే ఉంది. అయితే ఏ స్త్రీలు ప్రధానంగా బాధితులు అన్నది గ్రహించడం చాలా ముఖ్యం. పై మహిళల విషయానికి వస్తే వారి చుట్టూ కొల్లగొట్టదగిన ఖనిజ, అటవి సంపదలు ఉన్నాయి. వారు కుకీ తెగ గిరిజనులు కనుక, ఈ అస్తిత్వాలు క్రిస్టియన్‌ మైనార్టీ కనుకనే వారి మీద వందలాదిగా తరలివచ్చి దాడి చేశారు.

మణిపూర్‌లో బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం అల్లర్లు మొదలు కాగానే ఇంటర్‌నెట్‌పై నిషేధం విధించి కుకీలపై జరుగుతున్న దారుణాలు కప్పి పుచ్చడానికి ప్రయత్నించింది. అయితే కేంద్ర రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు చేసిన కుట్రలు ఎంతో కాలం కొనసాగలేదు. ఇంటర్నెట్‌పై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలని మణిపూర్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి  ఇచ్చిన ఆదేశాలలో మణిపూర్‌ ఆందోళనల మాటున మానవత్వాన్ని మంటగలిపిన అనేక ఘటనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేయగా, మరిన్ని ఘటనలు సోషల్‌ మీడియాతో పాటు పలు ఇతర మార్గాల్లో బయటి ప్రపంచానికి వెల్లడవుతున్నాయి. ఇందులో మహిళలపై లైంగిక దాడులు, అఘాయిత్యాల తర్వాత హత్య చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటనపై వీడియో బైటికి వచ్చేవరకు మణిపూర్‌ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటు. ఏ నాగరిక ప్రభుత్వమైన అంత దారుణంగా వ్యవహరిస్తుందని ఊహించగలమా? వారం రోజులుగా వర్షాకాల పార్లమెంటు ఉభయ సభలు దీనిపై స్తంభించిపోయాయి. యావత్‌ భారత్‌ ప్రజానీకాన్ని కలచివేసిన మణిపూర్‌ దారుణాలపై చర్చకు మోడీ ప్రభుత్వం ససేమిరా అంది. మరోవైపు మహిళలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడేవారిపై ముఖ్యమంత్రులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ పార్లమెంటు వెలుపల బిజెపి సుద్దులు చెబుతున్నది. ఇది వంచన కాదా?

నిజానికి మణిపూర్‌ హింస ప్రమాదవశాత్తూ జరిగినది కాదు. లేదా, ద్వైపాక్షికమూ కాదు. ప్రభుత్వ ప్రొద్భలంతోనో, ఆశీస్సులతోనో, కుమ్మక్కుతోనో, మెహితీ ఆధిక్యవర్గం బలహీనులైన కుకీ, నాగా తెగల మీద చేస్తున్న దాడి. ఇది బిజెపి హిందూత్వ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా క్రిష్టియన్లు అయిన కుకీ తెగలపై జరుగుతున్న జాతి హననం లాంటిది. మణిపూర్‌లో సంభవిస్తున్నది అప్పుడప్పుడు జరిగే కొట్లాటలు కానేకావు, సంఘ వ్యతిరేక శక్తుల నేరాలు అంతకన్నా కావు, యాదృచ్ఛిక హత్య, అత్యాచార ఉదంతాలూ కావు, దొమ్మీలు కావు, దోపిడీలు కావు. కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలంటే మణిపూర్‌ విషాదం జాతి సంహారం లేదా జాతి ప్రక్షాళనకు ఆరంభమే.

హత్యలు, లూఠీలు, ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు :

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం కాంగో ఫోస్కె జిల్లాలోని సైకుల్‌ పోలీస్‌స్టేషన్‌కు 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోకి సుమారు 1000 మంది సాయుధ గూండాల మూక మే 4న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రవేశించింది. వీరి చేతిలో ఎకె రైఫిల్స్‌, ఎస్‌ఎల్‌ఆర్‌, ఐఎన్‌ఎస్‌ఎఎస్‌, 303 రైఫిల్స్‌ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. గూండాల మూక ప్రవేశించడంతోనే గ్రామంపై విరుచుకుపడింది. విధ్వంసం సృష్టించింది. ఇళ్లను తగులబెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడింది. అన్ని చరాస్తులను లూటీ చేసి ఒకచోట నేల మీద వేసి తగులబెట్టింది. ఇళ్లలోని నగదు, ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆహార ధాన్యాలు ఇలా అన్ని వస్తువులను తగులబెట్టారు. ఈ దాడితో భయపడి ఐదుగురు గ్రామస్తులు సమీప అడవిలోకి పారిపోయారు. వారిని పోలీసులు రక్షిస్తే వారి వద్ద నుంచి కూడా ఆ గ్రామస్తుల్ని ఈ గూండాల మూక ఎత్తుకెళ్లింది.

మణిపూర్‌లో మరో షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలసరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌గా మారింది. ఈ దారుణ సంఘటన జూలై 2న బిష్ణుపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మెహితీ వర్గానికి చెందిన వారు దారుణంగా చంపారు. డేవిడ్‌ థీక్‌ అనే వ్యక్తి తల నరికి, ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు తలను వేలాడదీశారని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ముగ్గురు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించడం, మరో మహిళను ఆటబొమ్మను ఆడించినట్లు ఆడించి, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కిరాతక చర్యపై సర్వత్రా నిరసనాగ్రహాలు వ్యక్తమయ్యాయి. మణిపూర్‌లో జరిగిన ఈ ఘోరాతి ఘోరంపై ప్రధాని మొసలి కన్నీరు కార్చగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఒక టీవి చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుస్సాకరంగా ఉన్నాయి. మణిపూర్‌లో ఇటువంటి ఘోరాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే ఇంటర్నెట్‌ను నిషేధించామని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం హేయాతి హేయం. మణిపూర్‌లో మానవత్వాన్ని మంటగలిపిన ఆ దాష్టీకంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి వై చంద్రచూడ్‌ సరిగానే స్పందించారు. ఈ అమానుష ఘటనకు కారకులైన వారిపై చర్య తీసుకుంటారా, లేక మమ్మల్నే ఆ పని చేయమంటారా అని కేంద్ర, మణిపూర్‌ ప్రభుత్వాలను భారత ప్రధాన న్యాయమూర్తి నిలదీసిన తరువాత కూడా ఏలికల తీరు మారలేదు. బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం కనీసం పాటించవల్సింది  చట్టబద్ధ పాలన. అంటే ప్రభుత్వం సమాజంలోని ఏ ఒక్క వర్గాన్నీ, సమూహాన్నీ, బృందాన్నీ ప్రేమతోగానీ, ద్వేషంతో గానీ చూడకూడదని, తటస్థంగా ఉండాలని ఆధునిక నాగరిక సమాజపు రాజనీతి శాస్త్రం ప్రబోధిస్తుంది. మణిపూర్‌ అల్లర్ల విషయంలో కింది నుంచి పైదాకా గ్రామస్థాయి పోలీసు నుంచి రాష్ట్రపతి దాకా తమ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమయ్యారని మణిపూర్‌ మారణకాండ తెలియజేస్తున్నది.

నీరోను మించిన మోడీ :

మోడీ ధోరణి గమనిస్తే నీరో చక్రవర్తి గుర్తుకువస్తాడు. ఒకవైపు రోము తగలబడిపోవడం, రెండోవైపు సంగీత సాధన చేయటం. నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఎప్పుడూ చెప్పుకుంటున్న పాతపోలికే. మణిపూర్‌లో ఒకవైపు ప్రాణాలు పోతూ  మంటలెగుస్తూ ఉంటే, తన అధికార రాజకీయ ఎత్తుల్లో, ప్రతిపక్షీయులను చిత్తుచేయడంపై తీరికలేకుండా తిరుగుతున్న మన అధినాయకుడి తీరు నీరోకన్నా మరీ దుర్మార్గంగా కనిపిస్తూ ఉన్నది. ఆయన ఆందోళనంతా రాబోయే 2024 ఎన్నికలలో తన గ్రాఫ్‌ తగ్గినదానిపైనే ఏకాగ్రమై ఉంది. ఒకచోట తగ్గితే, ఇంకోచోట పెంచుకోవటమెలాగోనని ప్రణాళిలు వేస్తూ తీరిక లేకుండా ఉన్నాడు. ఇలాంటి నాయకుడికి నీరో పోలిక కొద్దిగా తేలికైనదిగానే ఉందనిపిస్తుంది. ఇంకో దుష్టపోలికనేదో వెతుక్కోవాలేమో! మణిపూర్‌ గత మూడు నెలలుగా మారణ హోమం జరుగుతోంది. మణిపూర్‌ మారణకాండకు సంస్కృతిపరమైన వైవిధ్యాల కారణం, ఆర్థికపరమైన వ్యత్యాసాలూ స్పర్థలకు తావిస్తున్నప్పుడు సావధానంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వాటిని మరింత పెంచి పోషించడం దీనికి ప్రధాన కారణం. అయితే ఇంకోవైపు దేశమంతా ఒకే విధమైన సాంస్కృతిక జీవనముండే విధంగా ఉమ్మడి పౌరస్పృతిని తీసుకువస్తామని గొప్పలు చెబుతున్నారు. ఒక చిన్న రాష్ట్రంలో రెండు సమూహాల మధ్య వచ్చిన వివాదాన్ని, విధ్వంసాలు జరగకముందే పరిష్కరించలేని నాయకులు అనేక వైవిధ్యాలతో సంస్కృతులతో జీవనం సాగించేవారిని ఏకరూపంలో తెస్తామని చెప్పి, సాంస్కృతిక విద్వేషాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ముగింపు :

ప్రపంచ వేదికల మీద ప్రజాస్వామ్య ప్రవచనాలు వల్లించే విశ్వగురుకు సొంత దేశంలో సమస్యలు పట్టవు. మంటల్లో మలమల మాడుతున్న మణిపూర్‌పై ప్రధాని మోడీ పెదవి విప్పరు. పైగా అక్కడున్నది ఆయన సొంత పార్టీ సర్కారే. తెగల సెగలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ మారణకాండపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రధాని ముఖం చాటేయడం ఏమిటి? పార్లమెంటులో చర్చించేందుకు అంతకుమించిన సమస్య ఏముంటుంది? ఇవాళ యావత్తు భారతదేశం మణిపూర్‌ గురించి కలత చెందుతున్నది. మణిపూర్‌ దావానలం నాగాలాండ్‌కు, అటునుంచి మొత్తంగా ఈశాన్యానికి వ్యాపించే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని మాత్రం ఈ సమస్యపై పార్లమెంటును ఎదుర్కొనేందుకు వెనుకాడుతున్నారు.

ఈ నేపథ్యంలో నీరో చక్రవర్తికి మించిన మోడీని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కడో మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్నది. మనకు చాలా దూరమని అనుకుంటే రేపు మనముందుకూ వస్తుంది. మణిపూర్‌ హింసను ఆపమని యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ తీర్మానం చేసిందంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో అర్థం చేసుకోవాలి. దేశ ప్రజలంతా నిలదీసి అడగాలి. దేశానికి నేతగా ఎన్నుకోబడినవాడు సమస్యను పరిష్కరించేందుకు పూనుకోవాలి, కనీసంగా మాట్లాడాలి. ”ఈసారి అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం మొత్తం మణిపూర్‌లా మండుతుంది” అని అన్న కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మాటలు అక్షర సత్యాలు. దేశంలో ఉన్న అన్ని తెగలను, జాతులను సమదృష్టితో చూడకపోవడం ఒకవైపు, మరోవైపు జాతుల మధ్య వైరుద్యాలు పెంచి పోషిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడం దేశానికి క్షేమకరం కాదు. మణిపూర్‌ మంటల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా తన రాజకీయం తనే చేసుకుంటూ పోతుంటే ప్రజలు క్షమించరు, ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు, చరిత్రలో ఎందరో నియంతలు ప్రజా ఉద్యమాలతో మట్టిగరిచారు. మోడీకి ఆ పరిస్థితి తప్పదు.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

One thought on “మణిపూర్‌లో మంటగలిసిన మానవత్వం

  1. Correct observation /clear review —u r right reddy garu
    I agree with ex governor sathyapal moulik opinion –
    Democracey in India — big joke —family rulings —same names /their sons and daughters are kings and queens -BY THE FEW FAMILIES /OF THE FAMILIES /BY THE FAMILIES

Leave a Reply