మట్టి మనుషుల గుండె తడి

ప్రజా కళాకారులకి, కవులకు పుట్టినిల్లైన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎఱ్ఱ ఓబన్న పల్లెలో 1962లో రాజు, సంతోషమ్మలకి పుట్టిన ముద్దు బిడ్డ ఎజ్రా. ఒడిదుడుకుల విద్యాభ్యాసంలో వెనుక బెంచి విద్యార్థి. నాటి విద్యావిధానంలో పదో తరగతి గట్టెక్కటం గగనం. స్వతహాగా వెనుక బెంచి విద్యార్థి అయిన ఎజ్రా పదో తరగతి తప్పాడు.

తండ్రి రాజు పద్య కవి. తండ్రి స్ఫూర్తితో కవిత్వం రాయడం మొదలెట్టారు. కవిత్వం సమాజంపై సంధించిన అస్త్రాలే. లక్ష్మీ నరసయ్య, శ్రీరామకవచం సాగర్ గార్లు గురువులుగా ప్రస్థానం సాగించారు. తన సాహిత్య ఒరవడిలో మూడు నవలలు 1) ‘మా ఎర్ర ఓబన్నపల్లె 2) ధనుస్సు 3) చంద్రవంక, నాలుగు కవితా సంపుటాలు 1. ఏరువాక, 2. పంచమాగ్ని, 3. ఉత్తర, 4. ఇంకెంతదూరం. రెండు దీర్ఘ కవితలు 1. నిప్పుల్లో నడిచే తప్పెట, 2. కర్రముక్కలను చేర్చుకున్నారు.

ఎజ్రా గారి ‘ఏరువాకై తిరిగిలేస్తా’ పై చెన్నై విశ్వవిద్యాలయంలో మాడభూషి సంపత్ కుమార్ గారి సారధ్యంలో గీతా పరిశోధన చేసింది. ఇంకా అనేక కవితలు , ఆర్టికల్స్, సాహిత్య వ్యాసాలు అన్ని పత్రికల్లో వందకు పైగా అచ్చయినవి. ఎజ్రా గారు వర్తమాన సమకాలీన సమస్యలపై కలాన్ని ఝుళిపిస్తున్నారు. కాలాన్ని ప్రశ్నిస్తున్నారు చరిత్ర పునాదులపై కసిగా.

ఘర్ వాపస్

నాదేహం విస్తరిస్తే
ఈ దేశమయ్యింది
ఈదేశపు పునాదులు నిర్మించి
భూగోళానికి రూపమిచ్చిందీ మేమే !!
రక్తం, స్వేదం, దేహం,
పిండితే పంటవుతుంది!

ఖండాంతరాలు దాటొచ్చినవాడికి
ఆద్యుడు అంటరానివాడచ్చినట్లు
మహాశక్తిని మనువాడి
భరతమాతకు పురుడు పోసి
త్రిమూర్తులను
పరమాత్ములుగా తీర్చిదిద్దిన
జాంబవతనయులం
నేను భూమిని, ఆకాశాన్ని, అనంతాన్ని, అరుంధతిని !!

నా దేహం పలకైతే
నీవు అక్షరాలుగా నడిచావు…
నేను వీణైతే రాగాలై పులకించావు !

గీత గీసేవాడెవడు
ఇంటోడు సాలైనోడైతే !
పక్కదారులెందుకు ?

మట్టి మర్మాన్ని శోధించి
మనిషి మనుగడకు మెతుకై
మొలకెత్తిన వాడిని

నా ఉనికే ఈ దేశం
నా దేహమే ఈ దేశం
నా తల్లి సవతి ప్రేమ చూపినా ,
ఏ పరపంచనో
పొర్లాడి వెంపర్లాడింది లేదు

నదులు వేదాలైనా
వేదాలు నదులైనా
నా తెరచాపను జాతీయ జెండాలా
ఎగరేసిన వాణ్ణి ….!

కాందిశీకుణ్ణి కాను…
హిందూ మహాసముద్రానికి మూలం
అఖండ భూమండలాన్ని
సృజించినవాణ్ణి …. నేనే !!

నేను నా భూమిని నా దేశం నా గృహం
నేను గడప దాటింది లేదు
మై నహీ ….. తూ… ఘర్ వాపస్
ఆజావ్….!!!

ఎజ్రా గారు తన ఘర్ వాపస్ కవితలో దేహాన్ని విస్తరింప జేసి రక్తం చెమట శరీరాన్ని పిండి పంట పండించి దేశ పునాదుల నిర్మాణంలో మూలవాసుల పాత్రని హృదయం ద్రవించేలా వ్రాసారు. కవి దేశానికి పునాది శ్రమించే శక్తులనే తాత్విక చింతనని వంట బట్టించుకున్నారు. నేను భూమిని /ఆకాశాన్ని/ అనంతాన్ని /అరుంధతి ని అని ఈ నేలపై పుట్టి పరాయి ప్రాంత వలసదారుల కుట్రలో శిథిలమౌతున్న బతుకుల ఆక్రందనని ఎలుగెత్తారు. మట్టి మర్మాన్ని శోధించి మనిషి మనుగడ కై మొలకెత్తిన వాడినంటూ కాందిశీకుణ్ణి కాను /హిందూ మహాసముద్ర మూల వాసినని గర్జించారు. తాను ఎదిగిన సామాజికార్ధిక పరిస్థితి నుండి పుట్టిన గర్జన ఇది. నాదేశం నా గృహం /నేను గడప దాటింది లేదని మూలవాసి చరిత్రను ఖరాఖండిగా చెప్పారు.

వలస కూలీగా జీవితాన్ని ప్రారంభించిన ఎజ్రా గారు పదో తరగతి తప్పితే ఫీజు కట్టి చదువుకొమ్మని ప్రోత్సహించిన తెలుగు మాష్టారు పేరు శాస్త్రిని కలం పేరుగా తన పేరు చివరన చేర్చుకుని కృతజ్ఞత చాటుకున్న మట్టి మనిషి ఎజ్రాశాస్త్రి. పదోతరగతి పాసై ఐటిఐ చదివి ఇరిగేషన్ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించారు.

నేను వలసకూలీనే !

నిన్ను నువ్వు వెతుక్కుంటూ
నిన్ను నువ్వు చేరుకోవాలంటే
రోజులు సరిపోవు !
పొట్టచేతపట్టుకొని పట్టణానికి
వచ్చినవాడవు

అర ఫర్లాంగ్ దూరానికే
ఆటో వెతుక్కుంటున్న రోజులివి
నడవడమంటే రాస్తాను కొలవడమే కదా ?
ఎన్ని కోసులని అడుగులోఅడుగే
స్తావు !? నేస్తం!

నీ ప్రాణానికి నా ప్రాణం
అడ్డేద్దామనుకుంటి
నీ పాదాలకు నా పాదాలు
తొడుగుదామంటే గడప
దాటలేని దుస్థితి మాటలకే పరిమితమా
వుతున్నా మన్నించు నేస్తం

మోసపోతునే ఉన్నావు నేస్తం
కట్టుకున్నవాడే కడతేర్చినట్టు
దారిచూపించినవాడే దారికాచినట్టు
ఆదరించాల్సిన వాడే వదిలించుకున్నాడు !

పనివాడు ఎప్పడు పస్తులే
ఇదేం కొత్తకాదు ఇదో విఫత్తు
కావొచ్చు ఉన్నఫలంగా కాదంటే
నిలువ నీడేది ? కడుపుకు కూడేది

కన్నవారికి, కట్టుకున్నదానికి,
గుప్పెడు మెతుకులు దొరికే
దారేది అంటావా? వద్దు పొమ్మంటే
నన్నెత్తుకోమన్నట్టు ఎవరినని
ప్రాదేయపడతావు ? అవున్లే !

పొయ్యిలో పిల్లి లేవాలంటే
చాటలో బియ్యం పోసేవాడేడని
నిలువనీడ ఏదని, ఆకలి పొద్దు పొడిసి
ఆఖరి పొద్దు కుంకాలంటే గుప్పెడు
బియ్యం ఉండాలి కదా? పిడెకెడు
మెతుకులు వండాలి

బహుశా అందుకే కాబోలు
కాలినడకన ఎంచుకున్నావు
బయటకు రాలేక దుఃఖాన్ని
దిగమింగుతున్నా నేస్తం!

పొట్టచేతపట్టుకొని ప్రపంచమంతా
తిరిగొచ్చిన వాడిమీద పేడనీళ్ళు
పోసినట్టు ,నీ మీద రసాయనాలు
కుమ్మరించి సంస్కరిస్తున్నందుకు
నేను సిగ్గుపడుతున్నా నేస్తం!

ఒకప్పుడు నేను వలస కూలీనే !!

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీల వెతల చిత్రీకరణలో తానూ వలసకూలీ ననే తన గతాన్ని నెమరేసుకుంటూ నిన్నునువ్వు వెతుక్కుంటూ నిన్ను నువ్వు చేరుకోవాలంటే రోజులు సరిపోవంటూ అంతర్వేదనను ఒలికించారు. ఎన్ని కోసులని అడుగులో అడుగేస్తావ్?!నేస్తం ! లో ప్రాచీన కొలమానాన్ని జొప్పించి కష్టజీవుల భాషని వ్యక్తీకరించారు. సాయం చేద్దామన్నా చేయలేని పరిస్థితిలో వున్న వైనాన్ని భావోద్వేగంతో నీ పాదాలకు నా పాదాలు తొడుగుదామన్నా బయటకు రాలేను /మాటలకే పరిమితం అవుతున్నా క్షమించమని వేడుకున్నారు కవి. పొయ్యిలో పిల్లి లేవాలంటే చాటలో బియ్యం పోసే వాడేడని సూటిగా ప్రపంచీకరణని ప్రశ్నించారు. చేతి వృత్తులని నాశనం చేసిన ప్రపంచీకరణ సరళీకరణ పై కోపం నుండి ధ్వనించిన పొలికేక. ఏలిక తప్పిదాలను ఎండగట్టే క్రమంలో కట్టుకున్నవాడే కడతేర్చినట్టు /దారిచూపించిన వాడే దారి కాచినట్టు/ఉన్నపళంగా కాదంటే నిలువ నీడేది /కడుపుకి కూడేదని ఆకలికి మలమాలమాడుతున్న ప్రేవుల ధ్వనులను వినిపించారు. ఆకలిపొద్దు పొడిసి ఆఖరి పొద్దు కుంకాలంటే పిడికెడు మెతుకులు వండాలిగా అని అంతర్లీన వ్యధ ని వ్యక్త పరిచారు. కాలినడకన ఊర్లకెళ్తున్న కూలీలపై రసాయనాలు చల్లుతున్న తీరుని గర్హిస్తూ నీ మీద రసాయనాలు కుమ్మరించి సంస్కరిస్తున్నందుకు సిగ్గు పడుతున్నానంటూ కవి హృదయాన్ని ఆవిష్కరించారు.

సమాజ ప్రక్షాళన దిశగా సాగుతున్న ఎజ్రా శాస్త్రి గారి కలం మరెంతో సాహిత్యాన్ని అందించాలని ఆశిస్తూ కలానికి వందనాలు.

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply