మట్టి తొవ్వ

మట్టిని
పాదాలు ముద్దాడక
ఎన్ని ఏండ్లు అయిపోయాయి

సిమెంటు ఇల్లు తారు రోడ్డు
కాలు తీసి కాలు బయట పెడితే
సూది మొన సందు లేకుండా
సిమెంటు నిర్మాణాలు

రామప్ప గండి మధ్యలో
రాత్రంతా హోలీ ఆడుకున్న సూర్యుడు
అంతటా కుంకుమ పొడి చల్లినట్టు
వెలుగుపూల మహోత్సవం

ఇరువైపులా నీరు
నడుమ పాపిట తీసినట్టు మట్టి తొవ్వ
ఒకవైపు కొంచెం దూరంలో
కోతకు వచ్చిన
బంగారు వన్నె పంట పొలాలు
మరోవైపు పచ్చని చెట్లు
ఉషోదయపు కాంతిలో
ప్రకృతి అంతా అత్యద్భుతం

2 గుట్టలకు తాళ్లు కట్టి
వేలాడదీసిన ఉయ్యాలలో వేసిన
పసికందు సూర్యుడు
గాలి గుణ గుణాంచుకున్నట్టు
బారసాల బృంద గానం
కర్మసాక్షి కి 21 వ దినం చేస్తున్న
పచ్చి బాలింత ఆవరణం

ఒకటా రెండా పెయ్యంతా రోగాల కుప్ప
తప్పనిసరి ఉదయపు నడక
మొదటి నుంచీ
నా అడుగులన్నీ సూర్యుని వైపే
శ్రమ మరచిన శరీరానికి
చెమటతో షెవర్ స్నానం చేయించాలె

ఉక్కపోత బతుకు
ఓహో
గుండెలనిండా నిండుతున్న ప్రాణవాయువు
ప్రాణం లేచి వచ్చి
ఉల్లాసంతో పులకాంకిత అయిపోతుంది

ప్రపంచం చిన్నబోతుంది
వాలకం అంతా
సౌకర్యాలతో కళకళలాడుతుంది అని సంకలు కొట్టుకునే సరికి
మనిషి ఎంత ఇరుకులో
బెరుకులా మనగలిగాడో తెలుస్తుంది

లోకాన్ని ఒక్కటి చేసింది అనుకునేసరికి
ఏమి ఇచ్చిందో ఏమి తెచ్చిందో
ప్రపంచీకరణ మాత్రం అన్ని దేశాలకు
ఒక రోగం అయితే అంటించింది

కూర్చున్న కొమ్మను నరుక్కున్న వ్యక్తి హైరానా హైరానా
సమస్తాన్ని అమ్ముకుంటే
సంపద పోగు అవుతుంది అనేకునేసరికి
లాభం గువ్వలకు వచ్చింది

అన్నిటినీ అదుపు చేసుకున్నామనే
విజయంతో సంబర పడుతుంటే
అంతా సరిసమానం అయిపోయింది

పాదాలు పరవశించి
మట్టి ఒక జానపద పాటను ఎత్తుకుంది

తోవలో పోతూ పోతూ ఉంటే
ఇటీవల పోగొట్టుకున్న
ఆణిముత్యం లాంటి కవిత దొరికింది

మనసుతో కళ్లకు అద్దుకుని
జేబులో వేసుకున్నాను

పుట్టింది కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి గ్రామం. కవి. కోపరేటివ్ విద్యుత్ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రచనలు: చిలుక రహస్యం, తారంగం, ఒకరోజు పది గాయాలు, పిడికెడు కన్నీళ్లు దోసెడు కలలు, పాతాళ గరిగె, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా డాట్ కామ్, బొడ్డుతాడు, తల్లి కొంగు, రాజపత్రం, చెట్టుని దాటుకుంటూ, పస, ఊరు ఒక నారు మడి.. 14 కవితా సంపుటాలు, 'వైఫణి'( నైపుణ్యం) కథల సంపుటి ప్రచురించారు.

One thought on “మట్టి తొవ్వ

  1. ఒకప్పుడు మట్టి అంటని బతుకు లేదు. ఇప్పుడు మట్టి అంటే ముట్టేది కాదని అర్థం. బాగుంది సర్ పోయెం

Leave a Reply