మచ్చ

విలువలు వాడికి పాదరక్షలు
ఆమెకి ముళ్ళ కిరీటాలు
**

తప్పిపోయిన పిల్లల్ని వెతుక్కున్నట్లు
రోజూ అద్దంలో తమ ముఖాల్ని వెతుక్కునే ఆ స్త్రీలని చూడండి
కాలిపోయింది వాళ్ళ చర్మమే
వాళ్ళ ముఖాల్ని నిప్పుల మీద కండెల్లా కాల్చిన సంస్కృతి మాత్రం
శవాలు తగలబడుతున్న కంపు కొడుతున్నది
**

చర్మం మీద కనపడదు కానీ
ఆమె ఉనికి మొత్తం మీద యాసిడ్ మచ్చలుంటాయి

తనలో ఆడతనం వుందన్న ఆలోచనే లేని పసిపాపల మీద
మారణాంగాలు హైనాల్లా దాడి చేసి లేలేత అవయవాల్ని చీల్చినప్పుడు
ఆ చిట్టి హృదయం మీద సీసాలతో యాసిడ్లు ఎత్తి పోసినట్లుంటుంది
బతికినన్నాళ్ళూ మనసు మీద ఆ అనుభవాలు నిప్పుల్లా దొర్లుతూనే వుంటాయి
బహుశా చితి మీద శరీరం కాలినప్పుడే ఆ మంటలు చల్లారతాయి
పసిబిడ్డల కాన్వెంట్ ఫ్రాకులు నెత్తురు వీర్యంతో కలగలిసిన దృశ్యం
ఈ దేశ పటం మీద దట్టమైన తేనెరంగులో కమిలిపోయిన పెద్ద యాసిడ్ మచ్చ

వయసు పెరిగుతూన్న కొద్దీ ఇంటా బైటా నిరంతరం
పురుషుల్నీ ఆయుధాల్ని సమానంగానే ఎదుర్కొంటుంది
ఎప్పుడూ ఏదో తాకుతూన్న భావన
కత్తిలా గాయపరుస్తూనే వుండొచ్చు
ఎప్పుడూ ఏదో ఒక తీర్పు ఉనికి మీద
ఏదో ఒక ఆయుధం మెడ మీద
వేటు వేయడటానికి సిద్ధంగా వుందనిపించొచ్చు
చర్మం మీద గాయాల గుర్తుల కన్నా
లోలోపలి జ్ఞాపకాల ఊచకోతలే మరింత హానికరం
మచ్చలు మరకలు మిగల్చని గాయాలే ఎక్కువ నొప్పి కలగచేస్తాయి కదా

కట్టడి శరీరం మీద ఏ యాసిడ్ మచ్చనూ చూపించదు కానీ
తాళిబొట్టు ఊగిసలాడే గుండె లోపల
కదలికల్ని బంధించిన తాడు మరకలు
కాలిన గాయాల కన్నా వికృతంగా పడతాయి
ఒళ్లు కాలినప్పుడో చర్మం నెత్తురోడినప్పుడో తప్ప
దహించుకుపోతున్న జీవన పార్శ్వం కనిపించదు
**

ఇది ద్రావక భారతం

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply