మగవాడి దౌర్జన్యం

నేను: కథ విన్నావుగా

ఆమె: ఊఁ, నాకు కొన్ని విషయాలు నచ్చలేదు.

నేను: ఏమిటవి?

ఆమె: అసలు కథలో చెప్పదలుచుకున్న విషయమే నాకు నచ్చలేదు.

నేను: ఏం చెప్పదలుచుకున్నారంటావ్?

ఆమె: మగాళ్లు ఆడవాళ్లని కొట్టక తప్పని పరిస్థితులుంటాయని చెప్తున్నట్టనిపించింది, ఏమోలే, ఆ కాలంలో అలా అనుకునే వాళ్లు చాలా మంది ఉండి ఉంటారు, కానీ ఒక పక్క ఒక చెంపదెబ్బ కొట్టాడని, విడాకులు ఇవ్వాలని ఒకమ్మాయి నిర్ణయించుకున్నట్టు కథలు రాసి, సినిమాలు తీస్తూ ఉంటే – 1930ల్లోని కథ చదివి మనం ఏం తెలుకునేట్టూ? ఏమన్నా అర్థం ఉందా?

నేను: బాగా గుర్తు చేసేవ్, నువ్వు చెప్పిన సినిమా – థప్పడ్ (చెంపదెబ్బ) మీద చర్చలని చదువుతూంటే – నాకు ఈ కథ గుర్తుకొచ్చింది, దానితో పాటే గురజాడ కథ దిద్దుబాటు కూడా.

ఆమె: వీటిలో ఒక దానికి మరో దానికీ  ఏం సంబంధం కనిపించడం లేదే?

నేను: చెప్తాలే. ముందు నీ అభ్యంతరాలు చెప్పు.

ఆమె: శ్రీరాములు భార్య ముఖ లక్షణాలని బట్టి – ఆమె మొహంలో కోపమూ, అసూయా, కుళ్లుమోతుతనమూ ఇల్లు కట్టుకుని ఉన్నాయి అని చెప్పడం, చప్పిడి దవడలతో ముసిలిదానిలా అందవికారంగా ఉందని వర్ణించడం నేలబారుగా లేదూ? దుష్టపాత్రలు వికారంగా ఉంటాయనే పురాతన శైలిని కొకు కూడా అనుసరించాలా?

నేను: అవును అది బాగులేదు. అతను స్ఫురద్రూపి, అమిత తెలివైన వాడని మనకి చెప్పి నరేటర్‌కి, ఆమె ఏ విధంగానూ అతనికి తగదని నిర్ద్వంద్వంగా నమ్మకం. అలా పాఠకులను కూడా నమ్మమనడం మీదనే, కథ ముందుకు సాగుతుంది. కానీ అక్కడే మనకు ఇబ్బంది. ఒకరికొకరు సరిపోరని చెప్పడం వేరు, ప్రత్యేకించి ఆమెను క్షుద్రురాలిగా చిత్రించడం వేరు. అది ఈనాటి మన సంస్కారానికి సరిపడదు. కానీ దానిని ఉపేక్షించి, కథని లోతుగా పరిశీలిస్తే, కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారని నాకనిపించింది.

శారీరక హింసనీ, పరాయి వారితో శారీరక సంబంధాలని నేరంగా పరిగణించాక – వాటి ఆధారంగా విడాకులు లభించబోతాయని తెలిసి – “అటువంటి నియమాలు పెడితే ఒక్క సంసారమన్నా నిలుస్తుందా మన దేశంలో” అని గుండెలు బాదుకునే సంస్కర్త శివానందం. అంటే నూటికి తొంభై శాతం అలా ఉన్నారని తెలిసినా, పరిస్థితి అలా ఉన్నందుకు చింతించడం మాని – అలాటి అవకాశం వల్ల, ఆ తొంభై శాతం వివాహాలూ నిలబడవేమోనని బెంగపడడం అతని ప్రత్యేకత, ఎలాగోలా వివాహాలు నిలబెట్టడమే – మనం చేయగలిగిన గొప్ప సమాజసేవని అతని ఆలోచన.

మరో అంశం – కళ్లకి కనిపించే హింస వెనకాతల – కంటికి కనిపించని హింసలు చాలా ఉన్నాయని/ఉంటాయని, నీటిలో మనకి చిన్న మంచు ముక్కలా కనిపిస్తున్నది అతి పెద్ద పర్వతం యొక్క శిఖరం మీది కొన మీద ఉన్న హిమశకలం మాత్రమేనని  (tip of the iceberg) చెప్పినట్టు తోచింది. నువ్వు చెప్పిన థప్పడ్ సినిమాలో హీరోయిన్ అలాగే మాట్లాడుతుంది – “ఆ చెంపదెబ్బ నన్ను నా నిద్రలోంచి మేల్కొనేలా చేసింది” అంటుంది. నన్ను ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదని అనిపించేలా నేను అతనికి  కనిపించి ఉంటాను, కాబట్టే అలా దెబ్బ వెయ్యగలిగాడు, నాకు తెలియకుండానే నేనలా మారిపోయి ఉంటాను” అని తలపోస్తుంది. అందుకే ఆ లెంపకాయని గృహహింసగా ఆమె కూడా పరిగణించదు. ఆ దెబ్బకి తనదే బాధ్యత అనుకుని -ఆత్మవిమర్శలో పడుతుంది. తన వ్యక్తిత్వాన్ని కోల్పోయానని, స్వంత ఇష్టాయిష్టాలనీ కూడా మరిచిపోయిన దుస్థితిలో ఉన్నానని గుర్తించుకుంటుంది. అక్కడ చెంపదెబ్బ ఒక ప్రమాద సూచికలా చిత్రించారు. అలాగే ఈ కథలో కూడా భర్త భార్యని కొట్టడం అనేది – భర్తకున్న దురలవాటుగానో, బలహీనతగానో భావించి, చెప్పి వొప్పించి మార్చేసేటంత సరళమైన అంశం కాదనీ, ఆ శారీరక హింసని మించిన హింస ఆ ఇంటిలో నిత్యం జరుగుతోందని – మనకి చెప్పడంలో కృతకృత్యులయ్యారు కొకు.  

మరొక ముఖ్యమైన అంశం – పాఠశాలల్లో పిల్లల మీద జరిగే హింస గురించిన ప్రస్తావన – శివానందం భార్యలని కొట్టడం అనేదాని మీద ఉపన్యాసం చెయ్యబోతే “ఆడదాన్ని మొగవాడు కొట్టటం కంటే కూడా వీధి బడి మాస్టర్లు పిల్లల్న కొట్టటం ముందు విచారించదగిన సమస్య అని ఉపపాదించి, వెనక పంతులుగా పని చేసి రిటైరయిన కామయ్య చేత సెకండు చేయించుకున్నాడు” అని రాస్తారు. ఆడదాని మీద మగవాడు చెయ్యిజేసుకోవడం అనే ఒక ధోరణి వెనక – బలహీనుడి మీద నిర్లజ్జగా బలవంతుడు దౌర్జన్యం చెయ్యడం అనే అనాగరిక లక్షణం ఉందనీ, అది పిల్లల మీద పెద్ద వాళ్లు, పనివాళ్ల మీద యజమానులూ, నేరస్తుల మీద పోలీసులు – ఇలా అనేక రూపాలతో మన కళ్ల ముందు ఉందనీ, దానిని గుర్తిస్తే తప్ప ఈ సమస్యకి సంపూర్ణ పరిష్కారం లభించదనీ నాకు తోచింది.

                   ***********               **********               **********        

ఆమె: ఎటువంటి మొగుడికీ ఎటువంటి పెళ్లాన్నైనా కొట్టటానికి అర్హత లేదు అని శివానందం అన్నమాట తప్పని, అతని చేతే ఆమెను కొట్టించడం ద్వారా – మనకి కథలో నిరూపించారు. శ్రీరాములు లాంటి ఉత్తముడు – భార్యని కొట్టేడంటే నమ్మడానికి కూడా ఈ నరేటర్‌కి ఇష్టం లేదట, అయినా సరే, కొడుతున్నాడన్న సంగతి నమ్మకంగా తెలిస్తే – దానికి తగిన కారణం ఉంటుందని నమ్మి ఊరుకోవాలట. ఏమిటీ ఈ దురహంకారం?

అప్పట్లో గనక అది నడిచిపోయింది కానీ… అంత చులకనగా ఎవరైనా ఇప్పుడు రాస్తే –  అది కుసంస్కారమని చెప్పడానికెవ్వరూ సంకోచించరు. 

నేను: వారి సంసారం కుళ్లిన శవంలా దుర్గంధ భూయిష్టంగా ఉందని చెప్పడం కొకు ఉద్దేశం అయ్యుంటుంది. కానీ అది సాధించడానికి రచయిత ఎన్నుకున్న వృత్తాంతంలో సమతౌల్య దృష్టి లోపించింది, నిజమే.

కానీ ఈ సంభాషణని చూడు:
శ్రీరాములు తన పెళ్లాన్ని కొడతాట్ట! చేతులో ఏముంటే చేతులో ఏముంటే అది ఆవిడ మీద పాపం, గిరవాటేస్తాట్ట! ఒకసారి కట్టెపేడు తీసుకుని —”

“ఆయన భార్యగారి సత్తా ఆయనకే తెలియాలి”  

“ఏడిచినట్టుంది! ఎవరు మట్టుకు కట్టెపేడు పట్టుకు కొడితే —?”

“చెప్పవేం? ఆడది శక్తి స్వరూపిణి. ఎందుకు కొడతాట్ట శ్రీరాములు పెళ్లాన్ని?”

కథలో ఆమెను విక్టింలా, కేవలం దెబ్బలు తినే మనిషిగా చూపించలేదు. హింసకి ఏమాత్రం వెనుదియ్యని క్రూరమైన మనస్తత్వం కల పాత్రలా కనిపిస్తుంది. కట్టెపేడులు పెట్టి కొట్టుకునీ, కొట్టవస్తే పీక కొరికీ – మధ్యలో పిల్లలను చావగొట్టే పరమ అనాగరికమైన కుటుంబాన్ని చూపిస్తారు మనకి. అలాంటివి ముమ్మరంగా ఉండేవన్న విషయంలో నాకు సందేహం లేదు. అటువంటి భార్యాభర్తలు విడిపోవడమే సర్వదా శ్రేయస్కరమని మనకి అనిపించడం రచయిత లక్ష్యం అనుకుంటాను.

ఒకమాట చెప్పక తప్పదు – ఈ రోజుల మీద నీ అంచనా కాస్త గురి తప్పింది. కొందరు ఆడవాళ్లని కొట్టడం మినహా మరో మార్గం లేదని అర్ధం స్ఫురించేలా రాస్తే అసహ్యంగా ఉంది మనకి, కొందరు ఆడవారు దెబ్బలు తినడాన్ని కోరుకుంటారనీ, ఆత్మగౌరవం అందరికీ నిత్యావసర సరుకు కాదనీ – థియరీలు ప్రచారంలో ఉన్నాయి, నువ్వు వినలేదేమో గానీ. అలా మనసుల్లో ఉన్న భావాలు మురగబెట్టుకునే కంటే, ఇలా కథల్లో ఏదో విధంగా బయటపడడమే మంచిది. వాటిని నీ వంటివారు ప్రశ్నించడం, తద్వారా చర్చలు జరగడం ఒక రకంగా మంచిదే నన్నడిగితే.

ఆమె: ఔను గానీ, కథ చివరిలో నరేటర్ అన్న ఈ మాటలకి అర్థం ఏమిటి?  “మొగుళ్లు పెళ్లాలను కొట్టటంవల్ల తప్ప విడాకులు లభించకపోయే పక్షంలో శ్రీరాములు గారికి పెళ్లాన్ని కొట్టడానికి ఉన్న అర్హత ఇంక ఎవరికి ఉందో చెప్పు! అటువంటి వాళ్లందరినీ నువ్వు సంస్కరించి నీ విడాకుల చట్టాన్ని ఎట్లా సదుపయోగం చేస్తావు!”

నేను: భార్యలని కొట్టే ఒక దురభ్యాసం కారణంగా సంసారాలు కూలిపోయే ప్రమాదం నుంచి తప్పించడానికి – శ్రీరాములు వంటి వారిని సంస్కరించడానికి శివానందం ప్రయత్నిస్తున్నాడు కదా – ఇలాటి సంసారాలు సంస్కరణ స్థాయిని ఏనాడో దాటిపోయాయనీ, వారికి విడాకులు దొరకడంలో ఇప్పటికే ఎంతో ఆలస్యమైందనీ, అటువంటి వారిని సంసారాల్లో ఇంకా ఇరికించి ఉంచాలని ప్రయత్నిస్తే – లాభం కన్నా నష్టమే ఎక్కువని, వారికి సర్దుబాట్లు కాదు, సంబంధం నుంచి విముక్తి అవసరమని – చెప్తున్నారు.  

అందుకే కథలో ‘విడాకులు’ అనే అంశం ప్రధాన వస్తువు అనిపించింది. అది అమలు జరగడంలోని సాధ్యాసాధ్యాలు, తర్వాత దాని ఫలితాలు ఎలా ఉండబోతాయి అనే దాని మీద వ్యాఖ్యానంగా తోచింది.

ఆమె: విడాకుల చట్టం వచ్చేసాక ఈనాడు దాని ప్రాసంగికత ఏమిటంటావ్?

నేను: మన దేశంలో 1955కి గానీ విడాకుల చట్టం అమలులోకి రాలేదు కదా – దానికి రెండు దశాబ్దాలకు ముందు, అప్పటి సమాజంలో దాని పట్ల చాలా భయాలు ఉండి ఉంటాయి. కథలో చెప్పినట్టు – విడాకులు ఏ గ్రౌండ్ మీద ఇవ్వవచ్చు అని ప్రశ్నలు వచ్చి ఉంటాయి. ఏది తీసుకుందామన్నా – అవి మెజారిటీ సంసారాల్లో ఉన్నవేనాయె. ఆ వంకన ప్రతీ రెండో జంటా విడిపోతుందని ఊహాగానాలు చేశారని విన్నాను. చిత్రమైన విషయం ఏమిటంటే – కేవలం అవి అందుబాటులో ఉన్నంత మాత్రాన ప్రతీ ఒక్కరూ ఆ దారి పడతారని, అప్పుడు భయపడ్డట్టే – ఒంటరిగా బ్రతకగలరు కాబట్టి సద్దుబాటులు చేసుకోకుండా విడాకుల దారి పట్టడం ఎక్కువైపోయిందని ఈనాడు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఎందుకు విడిపోవాలనుకుంటారనేదాని కంటే, దేని కోసం కలిసి ఉండాలనుకుంటారనే దాని గురించి ఆలోచిస్తే ఎక్కువ ఉపయోగకరం అనిపించింది.

                   ***********               **********               **********       

నేను: వివాహ సంబంధాలు ఏర్పరుచుకునే స్థాయికి మనం ఎదగనే లేదనిపిస్తుంది నాకు. మన సమాజంలో సహజీవనమే గొప్ప అవాస్తవికత అని కొకు ఎగతాళి చేస్తున్నారా అనిపించింది.

కథను ముందుకు నడిపే ప్రధాన సంభాషణలు కాకుండా, యధాలాప వ్యాఖ్యలు నాకు బాగా గుర్తుండిపోయాయి. వాక్యాల మధ్య ఖాళీలను కూడా కలిపి చదివితే – వాటిలోని ఐరనీ లోతుగా గుచ్చుకుంటుంది.

విడాకుల చట్టాన్ని తీసుకురాగల ధీరులూ, తీసుకురావలసిన అవసరమూ, దాన్ని వినియోగించుకోగల ఆత్మవికాసమూ హిందువులకు ముఖ్యంగా ఆంధ్రులకు జత పడినవనీ మావాడి దృఢనమ్మకం! (మనకుఆత్మవికాసమే కొరపడిందని చెప్పకనే చెప్తున్నారు కదా)

సంఘసంస్కరణ యావత్తూ మగవానికే చేయవలసి ఉందని శివానందం నమ్మకం. (ఇది మరో వ్యంగ్య బాణం, సమస్య ఏర్పడేది ఇద్దరి మధ్య అయినప్పుడు – ఒక్కరినే సంస్కరించాలనుకోవడం పాక్షిక జ్ఞానం అనిపించుకుంటుంది)

ఏయే విషయాలని కొకు అధిక్షేపించారో ఆ బాణాలన్నీ ఈరోజున కూడా గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి – నీకొక ఉదంతం చెప్తాను, గుర్తు పట్టగలవేమో చూడు. ఒక పెద్దమనిషి తన ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం సమయాన్ని కేటాయించాలనుకుని, తాను చేసే ప్రసంగాలు మానెయ్యాలని నిర్ణయించుకున్నాట్ట. హైదరాబాదు నుండి ఒక పెద్ద లాయర్ నుండి ఫోన్ వచ్చిందట – అయ్యా మీరు వివాహం, దాంపత్యం అనుబంధం అన్నీ కలిపి ప్రవచనాలు చెప్తున్నారండీ – ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు, రోజుకు ముప్పై విడాకులౌతున్నాయండీ హైదరాబాదులో – ఈ లెక్కన సంవత్సరానికి ఎన్నుంటాయో చూసుకోండి, ఇంత తీవ్ర పరిస్థితుల్లో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు అని వాపోయిందట. ఎలాగైనా మీ ఉపన్యాసాలతో  సమాజాన్ని ఉద్ధరించాలని మరీ మరీ ప్రాధేయపడిందట. ఈ సంగతి ఆయన టీవీ ఇటర్వ్యూలో చెప్తూ ఉంటే…

ఆమె: హ హ హ! పాపం, నీకు మన శివానందం గుర్తొచ్చాడా? కొకు రాయలేదు గానీ, శివానందాన్ని కూడా ఇలాగే ప్రజలు బలవంతం చేసి ఉంటారు. అందుకే తెలిసినా తెలియకపోయినా – ఘాటుగా ఉపన్యాసాలు ఇస్తూ ఉండి ఉంటాడు. 

నేను: హ హ హ! ఏదో ఒక అభిప్రాయం హడావిడిగా ప్రకటించకపోతే, ప్రపంచం తల్లకిందులైపోతుందనుకునే శివానందం వారసులు తండోపతండాలు ఇప్పుడు. వారి గురించే కదా కొకు ఇది రాసింది – తనే ఇటువంటి విషయాల్లో అయోమయంగా ఉంటే తక్కిన తక్కువ వాళ్లకు వికాసం కలిగేదెట్లా? తను ఏదో నిర్ణయానికి రావటం యావదాంధ్రదేశానికీ కూడా చాలా ఎక్కువ సంగతి అని గ్రహించి, ఆ సమస్యను గురించి తను గట్టిగా ఆలోచించవలసిన బాధ్యత తన మీద – ఆంధ్రులందరిచేతా తన మీద ఉంచబడినట్టు భావించుకుని మరీ ఆలోచించేవాడు. నిజంగా పరీక్ష చేస్తే – మీద పడి కొట్టడానికి తెగపడ్డాడు శివానందం, అలాటి పరిస్థితుల్లో వీరే ఉంటే ఏం చేస్తారో ఊహించడం పెద్ద కష్టం కాదు.   

ఆమె: సమస్య గురించి కనీస పరిజ్ఞానం, బాధ్యతా లేని వాచక జ్ఞానుల వ్యాఖ్యానాలూ ప్రవచనాల డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తున్నాయి ఈ మాటలు, నిజమే.

                   ***********               **********               **********         

నేను: ప్రతీ ఒక్కరికీ ఒక (pet theory) పెంపుడు సిద్ధాంతం ఉంటోంది. విడాకులను ఎంత వీలైతే  అంత తప్పించాలనో, లేదా విడాకులే అంతిమ పరిష్కారమనో వారి భావజాలానికి తగ్గ కళ్లద్దాల నుంచి చూడడమే తప్ప వస్తుగత దృక్కోణంతో చేసే విశ్లేషణ నాకు కనపడడం లేదు. ఇది తప్పు అది ఒప్పు అని కాక అది అలా ఎందుకుంది అని ఆలోచించాలి.

దానిలో మానసిక, పారంపరిక, సామాజిక, సాంస్కృతిక కోణాలుంటాయనే స్పృహగానీ, వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం గానీ కనపడడం లేదు ఎవరి మాటల్లోనూ. నిజంగా సమస్య మీద శ్రద్ధ ఉన్నవారైతే దానిని కూలంకషంగా పరిశీలించాలి.

విడాకుల దాకా వెళ్లాలా వద్దా, లేదా ఏదన్నా సద్దుబాటు చేసుకోవాలా, చేసుకోగలరా అనేది సంక్లిష్టమైన విషయం. ఎవరు దేని కోసం, ఎంత రాజీ పడాలో, ఎంత పోరాడాలో కేవలం వారే నిర్ణయించుకోగలరు. ఆ సంబంధానికి బయట ఉన్న ఏ మూడో మనిషికైనా అది పూర్తిగా అర్థమయ్యే అవకాశం లేదు. అది ఇప్పటికీ మన సమాజానికి అర్థమౌతున్నట్టు లేదు.

ఆమె: ఒక మాట చెప్పు, విడాకులు వ్యక్తిగత వ్యవహారమా సమాజానికి సంబంధించిన వ్యవహారమా?

నేను: బాధ్యతగా వ్యవహరించడం, ఒకరి స్వేచ్ఛ పట్ల మరొకరికి గౌరవం ఉండడం, సంబంధం పట్ల నిజాయితీ కలిగి ఉండడం, సామరస్య ధోరణిలో ఆలోచించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం – ఇలాంటి కొన్ని అంశాలని సహజీవనానికి కావలసిన మౌలిక అర్హతలుగా గుర్తించగలం. అంటే కేవలం వీటి వల్లనే ‘సంబంధం‘ నిలబడుతుందని చెప్పలేక పోవచ్చు గానీ – ఇవి లోపిస్తే మాత్రం సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండవనీ, అవి వ్యక్తుల అభ్యున్నతికి దోహదపడవనీ చెప్పగలం. అటువంటి సంబంధాలు కాలక్రమేణా జీవితాల మీద అనవసరమైన బరువుగా మారతాయి. ఈ మౌలిక విలువలకు ప్రజామోదం లేకపోలేదు కానీ, అవి తప్పనిసరి అనేంతగా ప్రజలు పరిపక్వం కాలేదు.

ఆమె: అదేమిటి? ప్రేమా, ఆకర్షణా – ఇవి కదా జంటగా జీవించాలనే కోరికకి ముఖ్య ప్రేరకాలు – వాటి గురించి ఏం చెప్పవేం?

నేను: హ హ హ, అందులో చెప్పడానికేం ఉంది, వాటిని గురించి అనాది కాలం నుంచీ పుంఖానుపుంఖాలు రాశారు. అవి ఉన్నవారి మధ్య కూడా నేను చెప్పే సద్గుణాల వల్ల సత్ఫలితాలు ఉంటాయి, అవి లోపిస్తే వారి జీవితాలలో కూడా ఇబ్బందులు కలుగుతాయి. అయినా సహజాతంగా మనలో ఏర్పడే ప్రేమ, ఆకర్షణల కన్నా, ప్రయత్నపూర్వకంగా అలవర్చుకోవలసిన ఈ గుణాలకు ఎక్కువ ప్రచారం దొరకాలి న్యాయంగా.

ఆ మేరకు సమాజం – ఈ విషయంలో సహాయపడగలదు – వాటి ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించేలా, వాటిని పెంపొందించేలా ఆ వైపుగా ప్రయాణించేలా.

అయితే అలాటి సంస్కారాన్ని సాధించుకోడం ఎలాగా అనే దాని గురించి కాక – ‘విడాకులు తగ్గించడమే’ మన తక్షణ కర్తవ్యమన్నట్టు, దానికి ఎవరెంత సద్దుబాట్లు చేసుకోవాలో, ‘సుద్దులు’ చెప్పే ‘ప్రబుద్ధులు‘  పెరిగిపోయారు. అందుకే చర్చ పూర్తిగా పక్కదారి పడుతోంది, ఒక్కొక్క సారి వెనక్కి తిరుగుతోంది. సరిగ్గా అప్పుడే నాకు ఈ కథ గుర్తొచ్చింది. అలాటి ప్రబుద్ధుడే శివానందం – మగవాడు ఇతరత్రా సంబంధాలు పెట్టుకుంటూనే ఉంటాడు, కనీసం కొట్టడాన్ని గనక మనం నివారించగలిగితే, సంసారాలు నిలుస్తాయని వాదిస్తాడు.

ఆమె: కొట్టడం అయితే బయటకి కనిపించే అంశం. అది తప్పని స్పష్టంగా చెప్పగలం. నువ్వు చెప్పిన సద్గుణాల విషయంలో – ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది ఎలా తెలుస్తుంది?

నేను: ఆ మాట నిజమే, చాలా సటిల్‌గా ఉంటాయి సంబంధాలు. కానీ ఆలోచిస్తే మామూలు సంభాషణల్లోంచి కూడా కొన్ని సూచనలు వస్తాయి. నా స్నేహితుడు ఒక విషయం చెప్పాడు, నవ్వుతూనేలే. కొన్ని నెలల క్రితం, ఎయిర్ పోర్ట్‌కి వెళుతున్నారట భార్యాభర్తలిద్దరూ. ఇతను కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఊహించనంత ట్రాఫిక్ ఉండడంతో, కొద్దిగా కంగారు పడుతున్నారట. ఇంతలో భార్య చెప్పిందట – ఫలానా రూట్‌లో వెళదాం, అటైతే ట్రాఫిక్ తక్కువుంటుందని. మామూలుగా అయితే ఇతను వాదించే వాడే కానీ, అప్పుడు మాత్రం ఆమె చెప్పిన రూట్‌లోనే బయలుదేరాడట. దారిలో మాత్రం చాలా సార్లు అనిపించిందట – ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయితే బాగుండును, నువ్వే చెప్పావు, ఇటు రమ్మని, చూడు ఇప్పుడేమయిందో అందామని.

ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం. తర్వాత నేనడిగాను అతన్ని, ఇలా ఆమె విషయంలోనే అనిపించిందా లేక అందరితోనూనా అని. ఆలోచించి చెప్పేడు – అలా మరెవ్వరితోనూ అనిపించలేదని. సహచరుల తప్పును ఎత్తి చూపించి, వారిని నిరుత్తరులను చెయ్యాలన్న కోరిక – అప్పుడప్పుడూ – చాలా మందిలో కలుగుతుందేమో కానీ, అది సహజం అయితే కాదు. అలాటి కోరిక తలెత్తుతోందంటే, ఎక్కడో ఏదో తప్పు బీజరూపంలో ఉందన్నమాట. అదేమిటన్నది ముందుగా ఎవరికి వారు గమనించుకోగలగాలి, తర్వాత ఒకరికొకరు వివరించుకోగలగాలి. ఇంత సున్నితమైన విషయం గురించి మనం పబ్లిక్ చర్చల్లో తీర్మానాలు చెయ్యడం ఎంత హాస్యాస్పదం!

                   ***********               **********               **********        

ఆమె: శారీరక హింసగా పరిగణనలోకి రాని హింస కూడా సంబంధాలలో ఉంటుందని అన్నావు – అంటే అనుమానించడం, అవమానించడం, మోసగించడం – ఇలాటివనేనా?

నేను:  అవి మానసిక హింసలు, కానీ అవి ప్రజలు గుర్తించగలిగేవే. సంబంధాల దిగువన, మన కంటికి కనిపించకుండా పేరుకుని వాటిని కలుషితం చేసి, వ్యక్తుల జీవన విలువలని దిగజార్చే అంశాలు ఉంటాయి. వాటిని మనం ఇంకా గుర్తించనే లేదనిపిస్తుంది నాకు. సంబంధాలను ఎలాగైనా నిలుపుకోవాలని – రాజీ పేరుతో మానసిక దాస్యం చేస్తున్న వ్యక్తులు కనిపిస్తుంటారు నాకు. వైజాగ్‌లో ఉండే స్నేహితురాలు పద్మ ఈ మధ్యనే ఒక జంట గురించి చెప్పింది. భార్యది విచిత్రమైన మనస్తత్వం. వాళ్ల అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో – ‘లిఫ్ట్ మేం వాడం కనక మెయింటెనెన్స్ ఛార్జీల్లో సగమే ఇస్తాం’ అంటుందట. ఎంత మంది ప్రయత్నించినా ఒప్పించలేక పోయారట. తర్వాత భర్త వచ్చి ఆమెకి తెలియకుండా మిగిలిన సగం ఇచ్చి పోయాడట. అప్పటి నుండీ ప్రతీ నెలా ఇదే తంతు. దీనికే నేను వింత పడుతూ ఉంటే – అతని ఊడిగం ఎంత దాకా వెళ్లిందో ఇంకా ఇలా చెప్పింది. ఎవరో ఇంటికి చుట్టాలో బంధువులో వస్తే వాళ్లతో ఆ భర్త ఇలా చెప్తున్నాడట – “మేమివేళ ఇలా కాస్త పచ్చగా బాగున్నామంటే ఆమే కారణం, ఆమె పొదుపు, చాకచక్యం వల్లనే మా సంసారం నడుస్తోంద”ని – పొగడడం పద్మ చెవిని పడిందట. దీనినేమంటాం – రాజీ అనాలా లేక హిపోక్రసీ అనాలా?

అయితే ఇలాటి ఇబ్బందులున్న వాళ్లందరూ విడిపోవాలని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఎవరికి ఏది సరైనదనితోస్తుందో, ఏది చేయగలమనిపిస్తుందో అది చేస్తారు – అది పూర్తిగా వ్యక్తిగతం. కానీ ఇలాంటివి కనిపించినప్పుడు –  అనారోగ్య ధోరణి, దీని వల్ల మనుషులు సమాజానికి దూరమౌతారు, లేదా వారి స్వయంశక్తులు వినియోగమయ్యేలా జీవించలేకపోతారు లేదా మానసిక వేదనకు గురౌతారని మనం – సమాజం గుర్తిస్తూ రావాలి. ఇక్కడ ఇంకో సంగతేమిటంటే – ఆ భార్య ‘అసాంఘిక ప్రవర్తన’ని గడుసుతనంగా భావించి, మెచ్చుకునే వాళ్లుంటారు మనలోనే.

ఆమె:  ఔను, అలాటి విరుద్ధాభిప్రాయాలు కూడా విస్తృతంగా చర్చల్లోకి వస్తే మంచిదని అనిపిస్తుంది. అస్పష్టంగా ఉన్న ధోరణులని స్పష్టపరచడం, భవిష్యత్తు గురించి ఊహలు చెయ్యడం – ఈ పనులు సాహిత్యం సమర్ధవంతంగా చెయ్యగలదు కదా?

నేను: ఆ విషయానికే నాకు గురజాడ దిద్దుబాటు జ్ఞాపకం వచ్చింది. సమాజంలో ఉన్నదాని కంటే కాస్త మెరుగైన సంస్కారాన్ని రచనల్లో చిత్రించడం, తద్వారా పాఠకులకి ఉన్నతమైన ఆశయాలను పరిచయం చేయడం రచయితలు చేస్తూ ఉంటారు. మొదటి కథలోనే ఆ దారిలో వెళ్లారు గురజాడ. అందులో గోపాల్రావు మీటింగులనీ, లోకోపకారం చేస్తున్నాననీ అబద్ధాలాడి – రాత్రుళ్లు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉంటాడు. దాని మీద భార్య కమలిని ఇలా వ్యాఖ్యానిస్తుంది : ‘నేనింట నుండుట వల్ల కదా మీరు కల్లలు పలుకవలసి వచ్చె. నేను పుట్టింటనున్న మీ స్వేచ్ఛకు నిర్బంధమును, అసత్యమునకు అవకాశమును కలుగకుండును.’   

అతనింటికి రాకపోవడం కన్నా, అతను అబద్ధమాడడం పట్ల – ఆమెకు ఎక్కువ అసమ్మతి ఉంది. అదే ఆమె తన ఉత్తరంలో వ్యక్తం చేస్తుంది. నేను పుట్టింటికి వెళిపోతానని బెదిరించడం అనేది, ఈనాడు ఒక పరిష్కారంగా కనిపించకపోవచ్చు. కానీ నన్ను ఆకర్షించినది మాత్రం – అబద్ధాలకు ఆస్కారం లేని ఉన్నత స్థాయి సంబంధాన్ని ఆమె అపేక్షించడం 1910లో సమాజానికి ఒక ఉన్నతాదర్శం.

నిజజీవితంలో అలాటి సమస్యలతో సతమతమయ్యే  వారికి ఈ సూక్ష్మాలు ఆలోచించే సావకాశం ఉండకపోవచ్చు. కానీ దంపతుల సమస్యల గురించి వ్యాఖ్యానం చేసే ‘థింకర్’లకు ఆ దృక్పధం ఉండాలి అని నా ఉద్దేశం. మౌలికమైన దిద్దుబాటు ఎక్కడ జరగాలన్న ఆ వివేచనని మనం అలవరచుకోవాలంటాను. లేదంటే గాయం ఒక చోటైతే మందు పూసేది వేరొక చోట అవుతుంది.

ఆమె: ఈ కథలో కూడా – సమస్య ఎంత తీవ్రమైనదో, ఎన్ని రూపాల్లో పాతుకుని ఉన్నదో చూపించి దాని వికృతత్వాన్ని మనం గుర్తించేలా చేశారు. దానితో పాటూ, ఏదో బుద్దులు చెప్పి సద్ది పుచ్చే సమస్య కాదనీ, అలా అనుకునే వారి దృష్టిలోపాన్ని ఎత్తి చూపేరు. అది చదివేక మనం ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు మరి?

నేను: దీనికే గొడవ పడాలా, దానికే విడిపోవాలా అని ఒక వైపూ, ఇంకా ఇలా పట్టుకుని ఎందుకు దేవులాడతారనే నిరసనా, సమాజపు భయానికో, అవసరార్ధమో కలిసి బతుకుతున్నారనే జడ్జిమెంట్లు మరో వైపు – ఇవేవీ సహజీవనాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడలేవు. దాని స్థానే, పెళ్లిళ్లు చేసుకునే ముందే – నేనిందాక చెప్పిన అర్హతలను -సాధించుకునేలా వ్యక్తులను ప్రోత్సహించాలి. క్లాసురూములకీ, ఆఫీసులకీ -సరైన వాతావరణం ఉండాలనే ప్రాతిపదిక ఉన్నట్టే – కుటుంబ జీవితానికి కూడా ఉండాలంటాను. సహజీవనానికి సంబంధించిన అంశాలలో – మంచి ధోరణులకీ, చెడ్డ ధోరణులకీ విభజనని స్పష్టం చేయడం మంచిదంటాను. ఆ ‘గడుసు’భార్యలా కుటుంబాన్ని తమ మొండితనంతో నియంత్రించే వాళ్లని వీలైనప్పుడల్లా ఎత్తి చూపించాలంటాను. విడిపోతున్న వాళ్లనీ, విడిపోవాలనుకునే వాళ్లనీ వదిలి – కలిసి బతుకుతున్న వాళ్ల జీవితాలను పట్టించుకోవాలంటాను, వారి సాధకబాధకాలేమిటనేది చూసి, వాళ్లు మరింత సుఖంగా బతికే మార్గాలని అన్వేషించాలంటాను.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

12 thoughts on “మగవాడి దౌర్జన్యం

  1. Hello !! కళ్యాణి గారు ముందస్తుగా అభినందనలు .. కో .కు గారి వ్యంగ్య రచన ని ఆమూలాగ్రం ఆకళింపు చేసుకొని ఎంతబాగా చదివారంటే ..నవ్వాపుకోలేకపోయాను . ఇకపోతే ఈ సమయం లో ( అంటే థప్పాడ్ లాంటి సినిమా వచ్చిన ) ఇలాంటి కధని ఎంచుకుని నాణానికి రెండు వైపులా వున్న arguments ని అంతే చక్కగా విశదీకరించిన తీరు బహు ముచ్చటగా అనిపించింది..
    మీరిచ్చిన సమగ్రమైన ముగింపువాక్యాలకతో నేనూ ఏకీభవిస్తున్నాను..- “దీనికే గొడవ పడాలా, దానికే విడిపోవాలా అని ఒక వైపూ, ఇంకా ఇలా పట్టుకుని ఎందుకు దేవులాడతారనే నిరసనా, సమాజపు భయానికో, అవసరార్ధమో కలిసి బతుకుతున్నారనే జడ్జిమెంట్లు మరో వైపు – ఇవేవీ సహజీవనాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడలేవు. దాని స్థానే, పెళ్లిళ్లు చేసుకునే ముందే – నేనిందాక చెప్పిన అర్హతలను -సాధించుకునేలా వ్యక్తులను ప్రోత్సహించాలి. క్లాసురూములకీ, ఆఫీసులకీ -సరైన వాతావరణం ఉండాలనే ప్రాతిపదిక ఉన్నట్టే – కుటుంబ జీవితానికి కూడా ఉండాలంటాను. “

    1. Thank you శుభ, నిజమే – thappad సినిమా మీద చర్చలు చదివినప్పుడు ఈ కథ పదే పదే జ్ఞాపకం వచ్చింది. శివానందం మాట్లాడినట్టే దాదాపు శతాబ్దం తర్వాత మనుషులు కూడా మాట్లాడడం దురదృష్టకరం కదూ
      😒

  2. చాలా నిశితమైన పరిశీలన. ఇద్దరి వ్యక్తుల మధ్య ఆరోగ్యకర సహజీవనం, వారికి సమాజంతో ఉండే సంబంధ స్వభావం మీద ఆధారపడి ఉంటుందేమో.

    1. ధన్యవాదాలు కరుణాకర్. I totally agree with your opinion. వ్యాసం రాస్తూ ఉంటే నాకూ అలాగే అనిపించింది- సమాజం నుంచి విడిపోయిన సంబంధాలు wholesome గా ఆరోగ్యం గా ఉండలేవేమో అని.

  3. కథ ద్వారా ఒక విషయాన్నీ చెప్పడం ఎంత ముఖ్యమో, అత్యవసరమైన విషయాన్నీ ప్రస్తావించడం అంత కన్నా అవసరంగా భావిస్తా, మీరు చెప్పిన కథ కూడా అలాంటిదే. 2020లో అవసరమైన విషయాలు ఏమైనా ఉంటె అవి “కంటికి కనిపించని హింసలు”.

  4. Thank you నరేష్, సరిగ్గా చెప్పారు. కంటికి కనిపించని హింసల గురించి మాట్లాడే సమయం వచ్చింది

  5. కల్యాణి గారు అభినందనలు.మీరు ఎంచుకున్న కథ, కథ చదివిన తీరు ఎప్పటిలానే అమోఘం. మీ స్వరంలో భావాలు చాలా చక్కగా వినిపించాయి, మమ్మల్ని మీ వెంట నడిపించాయి. వివాహబంధంలో suffocation ni, ఉదాహరణలతో వివరించటం చాలా బాగుంది. అప్పటికి ఇప్పటి కూడా చర్చించాల్సిన విషయాలను వదిలేసి, టిప్ ఆఫ్ ద అయిస్ బర్గ్
    గురించే ఇంకా మాట్లాడుతున్నాం. ఈ మాట రాస్తుంటే నాకు ఇక్కడ రావికొండల రావు గారి కథ రెండు శవాలు గుర్తొస్తుంది. మన ఆలోచనలను condition చేసే సమాజంలో వున్నాం మనం. సమాజం, కుటుంబం వ్యక్తిపైన పెట్టే expectations unlimited. సమాజాన్ని please చేయటానికి కాకుండా, సాటి మనిషి పట్ల, మానవసంబంధాల పట్ల బాధ్యత, కరుణ కలిగివునప్పుడు మాత్రమే ఈ కథ outdated అవుతుంది..

  6. కల్యాణి చాలా అవసరమైన చర్చ.చాలా అర్దవంతంగా వివరించారు.చాలా బాగుంది

  7. Thank you హరితా, 3 ‘చాలా’లు ఇచ్చి నన్ను చాలా హ్యాపీ చేశారు
    😊😍

  8. కొ.కు. ‘మగవాడి దౌర్జన్యం’ కథ విషయంలో నాకు ఎప్పటినుంచో అభ్యంతరాలూ, సందేహాలూ ఉన్నాయి. వాటినే మీరు లేవనెత్తి అర్థవంతంగా, సాధికారికంగా విశ్లేషించారు. కథ పరిధిలో ఉన్న అంశాలను ఆసక్తికరంగా సంభాషణల రూపంలో చర్చించారు.

    థప్పడ్ సినిమా ప్రస్తావనతో ఈ కథకున్న వర్తమాన ప్రాసంగికతను అనుసంధానించి చెప్పటం బాగుంది.

    భార్యాభర్తల ఎయిర్ పోర్ట్ ప్రయాణం ఉదంతం మొదట ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఇలా సహచరులను నిందించే అవకాశాలను కోరుకునే స్వభావం అరుదైనదేమీ కాదు.

    గురజాడ ‘దిద్దుబాటు’ కథలోని ‘అబద్ధాలకు ఆస్కారం లేని ఉన్నత స్థాయి సంబంధాన్ని అపేక్షించడం’ అనే కీలకమైన పాయింటును గ్రహించి చెప్పటం ఎంతో బాగుంది.

    1. Thank you Venu garu, its really nice to get back to the subject after 4 years.
      Getting motivation bit by bit to continue the column once again.

  9. good. ఇది తప్పు అది ఒప్పు అని కాక అది అలా ఎందుకుంది అని ఆలోచించాలి.-మంచి వాక్యం, లోతైన వాక్యం. కష్టమైన పని కూాడా.

Leave a Reply