నాడు సమాజం ఒంటరి చేసిన సాదత్ హసన్ మంటోకు నేటి సాహితీ ప్రపంచ నివాళి – మంటో జీవిత చరిత్ర

ఈ ప్రపంచంలో తాము నిర్దేశించుకున్న దారిలో నడిచేవారు ఎప్పుడూ తీవ్ర పరీక్షలకు గురి అవుతూ ఉంటారు. ప్రపంచానికి లొంగని వ్యక్తి అంటే ఒక శత్రుభావన తో చూడడం మానవ నైజం. తనకి తలవంచని మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేసి అతన్ని కాళ్ల దగ్గర పడవేసి ఆనందించే నైజం ప్రపంచానిది. ఆ వ్యక్తి పూర్తిగా ఈ ప్రపంచం నుండి మాయమయిన తరువాత అతన్ని తరువాత గౌరవ మర్యాదలతో గుర్తు చేసుకుంటుంది సమాజం. మనకు లొంగని వ్యక్తి పై బ్రతికి ఉన్నప్పుడు ఉన్న కసి కోపం, అతని మరణం తరువాత గౌరవంగా మారతాయి కాబోలు. ప్రపంచం గౌరవించే సాహిత్యకారుల కథలు ఇంచుమించు ఇలానే ఉంటాయి. తెలుగు సాహిత్యంలో చలం కావచ్చు, ఉర్దూ లో మంటో కావచ్చు, ఇంగ్లీషు సాహిత్యంలో ఆస్కర్ వైల్డ్, డీ.హెచ్.లారెన్స్, పంజాబి భాషలో పాష్, అమ్రితా ప్రీతమ్ ఇలాంటి గౌరవాన్ని పొందుతున్న వారే. మనిషికి మరణం ఉండవచ్చు కాని సత్యానికి, నిజాయితీకి మృత్యువు ఉండదు. కొందరు ఎలాంటి భయంకరమైన జీవితాలు జీవించి ఉండవచ్చు, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినందుకు సమాజం విధించిన శిక్షను అనుభవించవలసి వచ్చి ఉండవచ్చు. వారు మరణించిన మాత్రాన, వారి మాటలలోని సత్యం ప్రకాశించడం మానదు. ఏదో రోజు అది శక్తి పుంజుకుని, జనం తలలు వంచి తీరుతుంది. ఇంతటి తేజోవంతమైనది కాబట్టే సత్యం అసత్యవాదులని అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. ఆ సత్యాన్ని పలికిన వ్యక్తి బ్రతికిలేనంత మాత్రాన అది మరుగున పడిపోదు. ప్రకాశిస్తూనే ఉంటుంది. చివరికి దానికి దక్కవలసిన గౌరవం దొరికి తీరుతుంది. అప్పుడు తాము శిలువ వేసిన వ్యక్తిలో దేవుడు కనిపిస్తాడు ప్రపంచానికి. ఇదే సత్యానికున్న బలం, దీన్నే ఉద్యమ లేదా జీవన స్ఫూర్తి అంటారు. ఆ స్ఫూర్తే మానవ సమూహానికి దారి చూపించగలదు. దాన్ని రగిలించడానికే కొందరు బలి అవుతూ ఉంటారు. ఎంతో వేదనను అనుభవించి తమను ఆదరించే వారులేని ఒంటరితనంలో జీవిత ప్రయాణాన్ని ముగిస్తారు. బ్రతికి ఉన్నప్పుడు వారిని ఒంటరిని చేసిన ప్రపంచమే వారు మరణించిన తరువాత వారి స్మృతికి వెలకట్టలేని గౌరవాన్ని ఇస్తుంది. ఇది తెలిసే ప్రపంచాన్ని లోతుగా పరిశీలించిన వారు ఇక్కడి గౌరవ మర్యాదల కోసం పాటు పడరు. తాము నమ్ముకున్న దారిలో ప్రయాణిస్తూ ఒంటరి ప్రయాణాన్నీ తమ జీవిత ధ్యేయం గా మార్చుకుంటారు.

సాదత్ హసన్ మంటో జీవితం దీనికి గొప్ప ఉదాహరణ. ప్రపంచం అబ్బురపడే రచనలు చేసిన మహా మేధావిగా నేడు గుర్తించిన సమాజం ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో ఆయనని పిచ్చి ఆసుపత్రి పాలు చేసింది. ఒక మేధావిని పిచ్చివానిగా మార్చింది. కథలలో అశ్లీలత ఉందనే నెపంతో భారతదేశంలో, పాకిస్తానులోనూ కోర్టుల చుట్టూ తిప్పించింది. నమ్మిన స్నేహితులు అక్కరకు రాలేదు. మంటో కథలలోని వేడి, నాడి తెలిసిన వారు కూడా అతనిలోని రచయితను, మనిషిని బ్రతికించుకోవాలని అనుకోలేదు. సహజమైన అక్కసు, అసూయలను వీడి తోటి సాహిత్యకారుడిని ఆదుకొని ఉత్తమ సాహిత్యాన్ని బ్రతికించుకునే ప్రయత్నం సాహితీ ప్రపంచంలోని సాహిత్యకారులే చేయలేకపోయారు.

వారందరికి మంటో లోని మొండివాడు, అహంకారి, ఇతరులకు లొంగని పొగరుబోతు, తాగుబోతు, వేశ్య వాటికలకు వెళ్ళే తిరుగుబోతు కనిపించాడు. కారణం మంటో తనలోని బలహీనతలను కప్పిపుచ్చుకుని మంచివానిగా నాటకం ఆడడం తెలియని వ్యక్తి. నోటి నుండి వచ్చే బూతులను మనసుకు నచ్చినట్లుగా మాట్లాడం తెలుసు కాని తడి గుడ్డలతో గొంతులు కోయడం తెలీదు. ఇతరులను సంతోషపెట్టడానికో, తన పనుల కోసం ప్రాకులాడుతూ మంచి వానిగా చెలామణి అవ్వడానికో ఇష్టపడలేదు అతను. చనిపోయే కొన్ని క్షణాల ముందు కూడా తనకు విస్కీ కావాలని అడిగి మరీ ఆఖరి రెండు పెగ్గులు తాగి మరణించిన వ్యక్తి ఆయన. అప్పుడు కూడా తన మనసు ఏం చెప్పిందో అదే చేసాడు తప్ప, తన చుట్టూ ఉన్నవారిని మోసపుచ్చే మాటలు మాట్లాడలేకపోయాడు. చస్తున్నానని అప్పటికప్పుడు భక్తుడుగా మారలేదు. చచ్చేదాకా ఎలా ఉన్నాడో, చనిపోయేటప్పుడూ అవే కోరికలతో అవే బలహీనతలతో కనిపించాడు. కథలలో మంటో వాడిన పదజాలం తెలుగు పద్య సాహిత్యంలో శ్రీ శ్రీ గారి భాషను పోలి ఉండేది. ‘దొంగ లంజకొడుకులు మసిలే లోకంలో” అంటూ శ్రీ శ్రీ గారు రాస్తూ బూతు రాస్తున్నాను అనుకోలేదు. అక్కడ ఆ పదం అవసరం అనుకుని రాసారు అన్నది అర్థం అవుతుంది వీరి మహాప్రస్థానంలో కొంపెళ్ళ జనార్ధన్ గురించి రాసిన కవిత చదువుతుంటే. కాని ప్రోగ్రెసివ్ రైటర్స్ అన్న విభాగం మొదలవనపుడే దేశ విభజన, మనుష్యుల స్వార్థానికి సంబంధించి ప్రస్తావించవలసి వచ్చినప్పుడు, మనిషి సెక్స్ ని చూసే విధానం, ఆ సమయంలో అతని చర్యలను చెప్పవలసి వచ్చినప్పుడు ఆ పాత్రల స్థాయిని బట్టి భాషను ప్రయోగించి సంచలనం సృష్టించాడు మంటో. అతని మాటల తూటాలు తమలోని కుళ్ళును బైటకు తీసుకు రావడం భరించలేని మత ఛాందసులు, సోషలిస్టులు, గాంధేయవాదులు అందరూ కూడా మంటోని ఆ నిజాయితీ కారణంగానే విపరీతమైన ఒత్తిడికి గురి చేసారు.

భారత దేశంలో విభజన రగిల్చిన విద్వేషం, సినీ పరిశ్రమలోని అవకాశవాదం. తనను మితృడిగా కన్నా ముస్లింగా చూసే మిత్ర బృందం, వీటితో మనసు గాయపడి పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడి మత ఛాందసానికి లొంగలేక, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానలేక పూర్తిగా ఒంటరివాడయి శారీరిక మానసిక ఆరోగ్యం పాడయి కేవలం 42 సంవత్సరాలకే చనిపోయిన మేధావి మంటో. కాశ్మీర్ నుంచి అమృత్సర్ వలస వచ్చిన కుటుంబం మంటోది. ఇతని అన్నలు ఆఫ్రికాలో పెద్ద లాయర్లు. చిన్నప్పటి నుండి ఒక రెబెల్ గానే బ్రతికిన మంటొ ఎవరికీ అర్ధం కాని ఒక పజిల్. హై స్కూల్ లో ఉర్దూ లో ఫెయిల్ అయి చదువు అబ్బని విద్యార్ధి గా పేరు తెచ్చుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంగ్లీషు సాహిత్యం నుంచి ఉత్తమ నవలలను ఉర్దూ లోకి అనువాదం చేయడం తో తన లోని రచయితను పదును పెట్టుకున్నారు. ఇతని జీవితంలో లభించిన గొప్ప అదృష్టం భార్య సఫియా. ఆవిడ గురించి ఎంత మంది రాసినా ఎంతో గౌరవంగా ప్రస్తావించారు. సఫియా మంటో తో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆఖరి దాకా అతని సహచరిగా, ఆత్మీయురాలిగా ఉంటూ చివరి క్షణం దాకా మంటో చేయి వదలని గొప్ప ప్రేమికురాలు. కాని మంటో కి విశ్వమంతా ప్రేమమయం గా ఉన్నప్పుడే ఆనందం లభిస్తుంది. అందుకే సఫియాను ఎంత గౌరవించినా లోకంలోని కుల్లుని, ద్వేషాన్ని చూసి సహించలేక ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ నలుగురి లో మొండివాడని, మూర్ఖుడని పేరు తెచ్చుకున్నాడు. అతన్ని ప్రేమించే వారే విపరీతంగా ద్వేషించే వారు కూడా. అతని కథలలోని పదునుకు భయపడే వారు కూడా. అతని స్థాయిలో రచనలు చేయాలని రహస్యంగా తిండీ నిద్రా మాని ప్రయత్నీంచేవారు కూడా.

తన వ్యక్తిగత సమస్యను కూడా విశ్వంతో పోల్చి చూసుకునే వాడు మంటో. అతని మొదటి బిడ్డ రెండేళ్ళకే చనిపోతే అతని అకస్మాత్ చావుని వికాసం చెందకుండా చనిపోయిన కొత్త ఆలోచనతో పోల్చి తన బాధ ప్రపంచం బాధగా అనుభవించి తనలోని దుఖాన్ని ఇంకా పెంచుకున్న విశ్వ మానవుడు మంటో. ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోకి వంద నాటకాలు పైగా రాసినా అతని వైఖరి కారణంగా అతనికి రావల్సిన గుర్తింపు రానివ్వలేదు సాహిత్య సమాజం. “కాలీ సల్వార్”, “ధువా” ‘బూ’ అనే కథలపై విభజనకి ముందే హిందుస్థాన్ లో కేసులు నడిచాయి. పాకిస్తాన్ లో “ఠండా గోష్త్,” “ఊపర్ నీచే ఔర్ దర్మియాన్” ల పై కేసులు వేసారు. “ఖోల్ దో” కథపై కేసు నడవలేదు కాని దీన్ని ప్రచురించారని “నుక్రుష్” పత్రికను ఆరు నెలలు నిషేధించారు. అన్ని కేసులు లాహోర్ కోర్టులో నడిచేవి. భారతదేశంలో ఉన్నప్పుడూ ఎన్నో సార్లు డబ్బు లేని సమయాలలో కూడా బొంబాయి నుండి లాహోర్ కేసులకోసం వెళ్ళవలసి వచ్చేది. మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డ రోజులు అవి. భారతదేశంలో ఇతనితో పాటు ఇస్మత్ చుగ్తాయి కథ “లిహాఫ్” పై కూడా కేసు నడిచింది. ఈ కేసుల సమయంలో ప్రోగ్రెసివ్ రచయితలు, అతని మిత్రులు తటస్థంగా ఉండిపోవడం అతని హృదయం పై లోతైన గాయం చేసింది. ఈ జీవిత కథలో రచయిత, మంటో ఈ రెండు సందర్భాలలో కూడా కోర్టుకిచ్చిన వాంగ్మూలాన్ని యధావిధిగా రాసారు. ఒక రచయితగా ఈ అంక్షలు ఏ స్థాయిలో అతన్ని బాధ పెట్టాయో మంటో మాటలలో తెలుస్తుంది. భారతదేశంలో మితృరాలిగా సోదరిగా ఉన్న ఇస్మత్ చుగ్తాయి కూడా తనను పాకిస్తాన్ నుంఛి హిందుస్తాన్ పిలిపించుకొమ్మని మంటో ఉత్తరం రాస్తే స్పందించపోవడం అతనికి తగిలిన మరో దెబ్బ. అలాగే ఉపేంద్రనాధ్ అష్క, రాజేంద్రసింగ్ బేడి, లాంటి మిత్రులు కూడా అతనిలోని మొండివాడిని గుర్తుపెట్టుకున్నారు తప్ప, మంటోలో స్వచ్చమైన నిజాయితీ గల రచయిత కనిపించినా, ఆ రచయితకు చేయూతనిచ్చి అతన్ని బ్రతికించే ప్రయత్నం చేయలేదు.

కిషన్ చందర్ ఒక్కడే చివరి దాకా మంటో ప్రసక్తి వచ్చినప్పుడు అతని పక్షాన మాట్లాడిన మిత్రుడిగా కనిపిస్తాడు. కాని వీరిద్దరి మధ్య కూడా విభజన కల్పించిన దూరం చాలా సమస్యలను తెచ్చిపెట్టింది. మంటో ని ఎందరు ద్వేషించినా, అర్ధం చేసుకోనట్లు నటించినా మంటో చివరి దాకా తనలోని స్నేహ హ్రుదయాన్ని చాటుతూనే ఉన్నాడు. అందుకే పాకిస్తాన్ లో తన కేసును చిన్న జరిమానా తో తేల్చివేసిన జడ్జి మెహందీ అలీ సిద్దికీకి 1954 లో అచ్చయిన తన కథా సంకలనాన్ని అంకితం ఇచ్చి తన కృతజ్ఞత ను చాటుకున్నాడు. 1953 లో రెండవసారి చికిత్స కోసం పిచ్చాసుపత్రిలో చేరి బైటకి వచ్చిన మంటో “చిన్న పిచ్చాసుపత్రి నుంచి బయటకి పెద్ద పిచ్చాసుపత్రికి వచ్చాను” అని అనడం వెనుక అతనిలోని సంఘర్షణ అర్ధం అవుతుంది. అతని గురించి కిషన్ చందర్ అప్పుడే “ఈ ఎక్సెంట్రిక్ పిచ్చి సమాజంలో ఉండే కంటే ఎంతో తెలివి గల మంటొ పిచ్చాసుపత్రికి వెళ్ళడమే ఎంతో మేలైన పని” అని అన్నాడంటే మంటో లోని వేదనను అతనే అర్ధం చేసుకున్నాడని చెప్పవచ్చు. ఆ స్థితిలోనే పాకిస్తాన్ లోని అప్పటి అభ్యుదయ రచయితల సంఘం కూలీల పక్షపాతిగా, పెట్టుబడిదారీ వ్యవస్థకి విరుద్ధంగా పోరాడుతున్న కమ్యునిస్టుగా మాట్లాడుతున్నా, వారి సిద్ధాంతాలకు కార్యాచరణకు మధ్య ఉన్న దూరాన్ని, అంతర్ విరోధాన్ని, ద్వంద్వ వైఖరిని సహించలేకపోయాడు. “మార్క్స్ నేడు జీవించి ఉండి ఉంటే ఈ రకమైన సామ్యవాదానికి ఊహల సామ్యవాదం అని పేరు పెట్టి ఉండేవాడు’ అని చెప్పి వారిని శత్రువులుగా చేసుకున్నారు.

మనిషిలోని హిపోక్రసిని గుర్తించినప్పుడల్లా ఫ్రాడ్ అని పిలుస్తూ దాన్ని ఊతపదంగా మార్చుకున్నాడు మంటో. అతను ఒక చోట స్పష్టంగా ఇలా రాసాడు “ఎంత సేపటికి రష్యాను ప్రశంశిస్తూ, రష్యా క్రెమిలిన్ నుండి బొంబాయి ఖేత్వాడి దాకా అక్కడి నుండి మైక్ లోడ్ రోడ్డు దాకా ప్రయాణం చేస్తూ పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తూ చర్చలు చేసే వారంటే నాకు కోపం, రష్యాలో ఫలానా దానిశ్వర్ పుట్టాడనో ఆయన అది రాసాడనో, ఇది రాసాడనో అని వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళందరు ఏ నేల మీద శ్వాస తీసుకుంటున్నారో ఆ భూమి గురించి చెప్పరేం?” ఈ సూటి ప్రశ్న అతన్ని కమ్యునిస్టుల కు దూరం చేసింది. పాకిస్తాన్ అభ్యుదయ సంఘం అతడిని బహిష్కరించింది.

మంటో ఏ వ్యక్తికి ఏ, పార్టీకి. ఏ సంఘాలకీ లోబడి బ్రతకలేదు. అతడు అభ్యుదయవాదులను వదలలేదు. ప్రతిక్రియవాదులను అంతకంటే వదలలేదు. ఇద్దరి మధ్య ఉన్న రెందు రకాల వైఖరిని కేవలం సిద్దాంతాల ఆధారంగా కాకుండా ఎంతో సంవేదనతో వ్యక్తపరిచాడు. వాళ్ల బలహీనతలను వారికే చెప్పి ఒంటరివాడయ్యాడు. అతని శైలి గురించి తరువాతి తరం “ఆయన అసహ్యతలో ప్రేమ ఉంది. నగ్నత్వంలో ఆవరణ ఉంది. చరిత్రహీనులైన స్త్రీ కథలలో అతడి సాహిత్యంలోని సచ్చరిత్రత దాగి ఉంది” అని ఇప్పుడు అంటున్నారు కాని అతను సృష్టించిన సాహిత్యం కారణంగానే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆయన్ని ద్వేషించారు. మంటో చివరి దాకా అంటిపెట్టుకునున్నది తాగుడు, రచన. అతని భార్య ఒక సందర్భంలో అతను తాగడం కోసమే రాస్తున్నాడని బాధపడి రచన చేయడం మానమని అడిగానని కూడా చెబుతారు.

మంటో చనిపోయిన తరువాత అతని సాహిత్యాన్ని అతడు బతికి ఉన్నప్పటి కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే రచయిత ఒక సందర్భంలో ఈయనని గాంధి తో పోలుస్తారు. “నైతికత విషయంలో, ఆలోచనా పద్దతిలో ఆచరణ వ్యవహారంలో ఇద్దరి మధ్య ఎంతో తేడా ఉంది. కాని ఇద్దరు జీవితాలలోని చరమాంకాలలో ఎంటో సమానత ఉంది. ఇద్దరి పట్ల వాళ్ళ వాళ్ళే నమ్మకద్రోహం చేసారు. గుండెలలో గునపాలు గుచ్చారు. ఇద్దరు ఒంటరివారయ్యారు. ఇద్దరికి విభజన కేవలం ఒక దుర్ఘటన మాత్రమే కాదు. మనసును కలచివేసి ఇద్దరిలో ధైర్యం కోల్పోవడాకికి క్షోభకు కారణం అయింది” అంటారు. బ్రతికి ఉన్నప్పుడు సమాజ క్రూరత్వానికి బలయ్యి, ఇప్పుడు విశేష గౌరవాన్ని పొందుతున్న మంటో రచనలు సాహిత్యంలో నిజాయితీ కున్న బలాన్ని సూచిస్తాయి. ఇప్పుడు వీరి కథలు చదివిన పాఠకులు మంటోకి భక్తులు కాకూండా ఉండలేరు. ఆ శైలిలో పదునికి చలించకుండా ఆలోచించకుండా ఉండిపోలేరు. మనిషిలోని ద్వంద్వ ప్రవుత్తిని చూసి అనుభవించి, దాన్నే తన కథావస్తువుగా తీసుకున్న సాదత్ హసన్ మంటో ప్రపంచ స్థాయులోనే ఒక గొప్ప రచయిత. అతన్ని అన్ని బాధలు పెట్టి ఇప్పుడు పూజిస్తున్న సమాజంలోని హిపోక్రసిలో ఈ జీవిత చరిత్ర కూడా ఒక భాగం కావచ్చు. కాని డా. నరేంద్ర మోహన్ ఈ పుస్తకాన్ని రాయడం ఒక బాధ్యతగా తీసుకున్నారు. హిందీలో మంటో జీందా హై అన్న పేరుతో ఈ ఆత్మ కథను 2012 లో ప్రచురించారు. శ్రీమతి టీ.సీ. వసంత గారు దీన్ని తెలుగులోకి అనువదించిన తరువాత 2020 లో ఇది తెలుగులో ప్రచురించబడింది.

మంటో చనిపోయిన తరువాత సుమారు ఒక ముప్ఫై పుస్తకాలు హిందీ ఇంక ఉర్దూ భాషలలో వారి మిత్రులు రాయగా వచ్చాయి.ఇవే కాక డజన్ల సంఖ్యలో ఆర్టికల్స్ ఉన్నాయి. 1955 లో మరణించిన ఈ రచయిత ఇప్పుడు విశేష ఆదరణ పోందుతున్నాడు. బహుశా సాహిత్య ప్రపంచం తాను చేసిన తప్పులను ఇంత మెల్లగా దిద్దుకుంటుందేమో మరి. పచ్చి తాగుబోతు, వ్యసనపరుడు, అశ్లీల రాతల రచయిత అని నిందల పాలయిన మంటో ఇరవయ్యి కథా సంకలనాలు, వంద దాకా ప్రచురించని కథలు, ఒక నవల, నాలుగు నాటక సంకలనాలు, ఇంకా ఎన్నో విడి నాటకాలు, ఒక వంద దాకా ఇతర ఆర్టికల్స్, ఉర్దూ భాషకు అందించారు. ఇప్పటికి కూడా ఉర్దూ భాష రచయితలలో అతని స్థానాన్ని మరొకరు చేరుకోలేకపోవడం వారి సాహిత్య సృజన లోని తీవ్రత ను తెలుపుతుంది. తెలుగు సాహితీకారులకు, పాఠకులకు కూడా మంటో సుపరిచుతుడు. వీరి కథలు తెలుగులో అనువాదం అయ్యి విశేష ఆదరణ అందుకున్నాయి. వీరి ఆత్మకథను తెలుగులోని అనువదించి వసంత గారు ఒక గొప్ప సాహిత్యకారుని సాహితీ ప్రస్థానానికి న్యాయం చేసే ప్రయత్నం చేసారు. ఈ పుస్తకంలో కొన్ని వాక్యాలు, పదాలు రిపీట్ అవుతూ కనిపించాయి. అచ్చులో కొన్ని పొరపాట్లు జరిగాయి. అవి మలి ముద్రణలో సరి చేసుకోవడం అవసరం. “మంటో జీవిత చరిత్ర” ఒక మంచి ఆత్మకథగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే రచన.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

2 thoughts on “నాడు సమాజం ఒంటరి చేసిన సాదత్ హసన్ మంటోకు నేటి సాహితీ ప్రపంచ నివాళి – మంటో జీవిత చరిత్ర

  1. మంచి పరిచయం జ్యోతిగారూ… నిత్యం ఆలోచనల్లో మునిగి ఊహల్లో తేలే మహా మేధావులైన రచయితలను సగం పిచ్చోళ్ళనగా విన్నాను గాని ఇలా సమాజం కర్కషంగా ఓ గొప్ప రచయితను పిచ్చాసుపత్రి పాలు చేయటం చాలా దయనీయం…

Leave a Reply