భ్రమల గూడు కడుతున్న బహుజన రాజకీయాలు

మార్టిన్ లూథర్ కింగ్ కు భారతదేశంలో పర్యటించాలనేది ఒక చిరకాల కోరిక. అక్కడ స్వాతంత్య్రోద్యమంలో ప్రజలు అనుసరించిన పోరాట మార్గాలను, వాటి ఫలితాలను పరిశీలించి అవి అమెరికాలో నల్ల జాతి విముక్తికి ఎలా ఉపయోగపడుతాయో అర్థం చేసుకోవాలని అతని తాపత్రయం. చివరికి 1959లో ప్రధాని నెహ్రూ ఆహ్వానం మేరకు తన సహచరి కొరెట్ట స్కాట్ కింగ్ తో కలిసి ఇండియా వచ్చాడు. అతను ఢిల్లీ చేరగానే విలేకరులతో మాట్లాడుతూ “నేను ఇతర దేశాలకు పోతే ఒక టూరిస్టులా పోతాను, కానీ ఇండియాకు ఒక యాత్రికునిగా వచ్చాను” అన్నాడు. అతను ఇండియాను ఒక “పుణ్యక్షేత్రం”గా భావించడానికి కారణం అది గాంధీ పుట్టిన గడ్డ కావడం. మార్టిన్ లూథర్ కింగ్ కు గాంధీ అంటే విపరీతమైన అభిమానం, గౌరవం. అమెరికాలో నల్ల జాతి విముక్తికి గాంధీ అహింసా మార్గం ఒక ఆయుధమని భావించాడు.

భారతదేశంలో కేవలం గాంధీ శాంతియుత రాజకీయాలను మాత్రమే కాదు, భారతదేశ సామాజిక వ్యవస్థలో తరతరాలుగా అట్టడుగుకు తొక్కబడిన “అంటరాని” ప్రజల జీవితాలను కూడా చూడాలనుకున్నాడు. దేశ ప్రధాని ఆహ్వానం మేరకు రావడంతో అతను ఎక్కడ పోయినా అధికార మర్యాదలకు, సౌకర్యాలకు కొదువలేదు. అంతేకాదు, ప్రతిచోట తన ఆటోగ్రఫీ తీసుకోవడానికి ప్రజలు గుంపులుగా ఎగబడేవారు. అధికార ఆర్భాటాల మధ్య దేశంలో పర్యటిస్తే ప్రజల నాడీ అర్థం కాదని తాను, తన సహచరి ఇద్దరే కలిసి కేరళలోని త్రివేండ్రం పోతారు. అక్కడ ఒక దళితవాడలోని స్కూల్ కి పోయి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ తో మాట్లాడి, విద్యార్థులతో సంభాషించే అవకాశం ఇవ్వమని కోరుతారు. దానికి ఆ హెడ్ మాస్టర్ ఒప్పుకొని వారిని ఒక క్లాస్ రూంలోకి తీసుకుపోయి “విద్యార్థుల్లారా…. మీకు అమెరికా నుండి వచ్చిన మీ తోటి అంటరానివాడిని పరిచయం చేయాలనుకుంటున్నాను” అనే పరిచయ వాక్యతో మొదలు పెడతాడు. ఒక్కసారిగా తనను అంటరానివాడిగా పరిచయం చెయ్యగానే మార్టిన్ లూథర్ కింగ్ కు ఎట్లా స్పందించాలో కూడా అర్థం కాలేదు. “నాది ఈ దేశం కాదు. ఈ ఖండం కాదు. ఈ కుల వ్యవస్థతో సంబంధం లేదు. అయినా నేను ఇక్కడ అంటరానివాణ్ణి ఎట్లయిన?” అనే ప్రశ్నలతో ఆశ్చర్య పోతాడు. “తాను అమెరికాలో జ్యాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నా, నెహ్రూ ఆహ్వానంతో భారతదేశ అతిథిగా వచ్చినా ఆ హెడ్ మాస్టర్ దృష్టిలో అంటరానివాడిగా ఎలా మారాను” అని బాధ పడతాడు. కానీ కొంత లోతుగా ఆలోచిస్తే “నిజమే, అమెరికాలో నేను అంటరానివాడినే కదా! నేనే కాదు, కోట్లాది నల్ల జాతీయులందరూ వందల ఏండ్లుగా బానిసలుగా, అంటరానివాళ్ళుగా బతుకుతున్నారు కదా” అనే అభిప్రాయానికి వస్తాడు. (ఈ సంఘటనను 2020లో ఇసబెల్ విల్కెర్సన్ అనే ప్రముఖ నల్లజాతి జర్నలిస్టు జాతివివక్ష మీద రాసిన తన పుస్తకం “Caste: The Origins of Our Discontents”లో ప్రస్తావించారు. అమెరికాలో జాతి వివక్ష గురించి రాసిన ఈ పుస్తకానికి “కులం” అనే శీర్షిక పెట్టి కులానికి, జాతివివక్షకు ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. కుల వివక్షను, జాతివివక్షను ఒకే గాటన కట్టడం సరైనది కాదు అనే విమర్శ కూడా వుంది. అది వేరే చర్చ)

**

గత సంవత్సరం ఒక మిత్రుడి తల్లిదండ్రులు అమెరికా వచ్చారు. వాళ్ళు “అగ్ర”కులస్తులు. ఒకసారి వాళ్ళను కలిసినప్పుడు మా మిత్రుడి తండ్రి తన బుర్రను ఎప్పటినుండో తొలిచేస్తున్న ఒక ప్రశ్న అడిగాడు. “ఈ దేశంలో వున్న నల్లోళ్ళు అంతా మన దగ్గర మాల, మాదిగోళ్ళ మాదిరిగానేనా?” “నల్లోళ్ళు కూడా అంటరానివాళ్ళేనా?” అనేది ఆయన ప్రశ్నలోని సారాంశం. దానికి సమాధానంగా నేను “అంకుల్, ఈ దేశంలో తెల్ల జాత్యహంకారుల దృష్టిలో నల్లోళ్ళు మాత్రమే కాదు, మనమందరం మాల మాదిగోళ్ళమే” అని చెప్పిన. ఆ మాటకు ఆ పెద్దాయన మొఖంలో రక్తం గడ్డకట్టినట్లు అయ్యింది. “ఇంత బతుకు బతికి మనం మాల మాదిగోళ్ళం కావడం ఏంది” అన్నాడు. నేను వెంటనే “ఎంత బతుకు బతికినా వాడి దృష్టిలో మనం మాల, మాదిగోళ్ళమే” అని మళ్ళీ అదే మాట చెప్పిన. గుండె పలిగిలినంత పనయినట్లుంది. అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయిండు.

**

ఈ రెండు సంఘటనలలో కులం ఏ విధంగా ఆధిపత్య భావనను నిర్మాణం చేస్తుందో తెలుస్తుంది. అంతేకాదు, కులం ఏ విధంగా ఒక అపరిపక్వ మానసిక స్థితిని, అహేతుక సామాజికతను, అపసవ్య ప్రాపంచిక దృక్పథాన్ని తయారుచేస్తదో అర్థమవుతుంది. అయితే కులం కేవలం వ్యక్తుల మీద జరిగే హింస, అణిచివేత, అవమానం మాత్రమే కాదు. అది ఒక వ్యవస్థీకృత నేరం. అది అట్టడుగు కులాలకు ఒక ఊపిరాడని స్థితిని తయారుచేస్తుంది. పిడికెడు ఆత్మగౌరవం కోసం గొంతెత్తడం కూడా నేరం చేస్తుంది. న్యాయ, సామాజిక, పౌర స్పందనలలో కూడా ఆధిపత్య కుల నాలికలే పలికేలా చేస్తుంది.

కుల హింస, దోపిడీ నిత్య జీవితంలో భాగమై ఉన్నా “ఈ కాలంలో కులమెక్కడుందండి?” అని అజ్ణానంతోనో, అహంకారంతోనో అడిగేవాళ్ళు కొందరైతే, “మాది ఫలానా కులం, కాని మాకు కులపట్టింపులు లేవండి” అని ఉదారవాదాన్ని చాటుకునేవాళ్ళు ఇంకొందరు. కానీ కులమనే సామాజిక తెగులు పోవాలంటే ఇప్పుడు కావాల్సింది ఉదారవాద మానవీయత కాదు. నీళ్ళు నమలని కుల వ్యతిరేకత (anti-casteism). కుల వ్యతిరేకత లేకుండా కుల నిర్మూలన జరగదు. అయితే కుల వ్యతిరేకత కేవలం ఒక వ్యక్తిగత, నైతిక విలువగా ఉంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. వ్యవస్థీకృత కులాన్ని కూల్చడానికి కులవ్యతిరేకత కూడా వ్యవస్థీకృతంగానే (systemic anti-casteism) ఉండాలి. అది సామాజిక, రాజకీయ ఉద్యమ వ్యక్తీకరణై ఉండాలి. ఆ ఉద్యమాలే కుల వ్యతిరేకులను (anti-casteists) తయారుచేస్తాయి. ఆ స్ఫృహ కుల పునాదులను (రాజకీయార్థిక అంశాలను ) దాని వ్యక్తీకరణగా వుండే ఉపరితల అంశాలను (విద్య, సంస్కృతి, మతం, న్యాయం, విలువలు, కళలు, సాహిత్యం… ) ప్రశ్నిస్తుంది.

కుల వ్యతిరేకులు లేదా కుల నిర్మూలనా ఉద్యమకారులు చరిత్ర పొడవునా వున్నారు. అనేక సాహసోపేతమైన ఉద్యమాలు చేశారు, చేస్తున్నారు. అనేక సంఘాలు, వ్యక్తులు కుల నిర్మూలనా పోరాటాలు చేస్తున్నా మొత్తంగా సమాజంలో రావాల్సిన చలనం ఎందుకు రావడం లేదు? చివరికి ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు వచ్చే మానవీయ స్పందనలు కూడా రోజు రోజుకు కరువవుతున్నాయి. కుల హింస సాధారణీకరింపబడుతుంది. దీనికి కారణం ఏమిటి?

వాస్తవానికి ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. అంబేద్కర్ కాలం నుంచీ వున్న ప్రశ్న. అంబేద్కర్ ఈ సమస్యకు రెండు రకాల కారణాలు అన్వేషించాడు. మొదటిది, graded inequality. ఒక అసమాన సమాజంలో విప్లవకర పరిస్థితుల్లో దోపిడీ వర్గాలను పీడిత వర్గాలు కూలదోసి అధికారం చేబట్టి సమసమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ graded inequality ఉన్న సమాజంలో పీడితులంతా ఒక వర్గంగా ఏకం కాలేరు. ఎందుకంటే వాళ్ళు కులాలుగా, ఉపకులాలుగా విడదీయబడి ఉంటారు. ఆ కులాలు, ఉపకులాలు వైరుధ్యభరితమైన జీవన విధానంతో నిచ్చెన మెట్ల మాదిరిగా నిర్మాణం అవుతాయి. ఆ నిర్మాణాలను “సహజీకరణం” (naturalization) చేయడానికి , “సాధికారత” కల్పించడానికి వర్ణాశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేసి దానిని హిందూ మతానికి వెన్నెముకగా చేశారు. ఇది యాదృచ్ఛికంగానో, సంఘటనాత్మకంగానో జరిగింది కాదు. ఇదంతా అగ్రవర్ణ ఆధిపత్యం కోసం కుట్రగా జరిగింది. ప్రధానంగా బ్రాహ్మణీయ ఆధిపత్య నిర్మాణం కోసం జరిగింది. అదే కొనసాగుతుంది. కాబట్టి హిందూ మతంలోకి కూరుకుపోయిన పీడిత కులాలను మూకుమ్మడిగా కదిలించడం (general mobilization of oppressed castes), వాళ్ళను ఒక్కటి చేసి బ్రాహ్మణీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబెట్టడం అంత సులభమైన పని కాదు అని అంబేద్కర్ గ్రహించాడు. అందుకే కులాన్ని నిర్మూలించకుండా భారతదేశంలో కేవలం వర్గ పోరాటాల ద్వారా సోషలిస్టు విప్లవం విజయవంతం కాదని ప్రకటించాడు. కుల నిర్మూలనే విప్లవానికి మొదటి మెట్టని భావించాడు. (అయితే ఒకటి ముందు, మరొకటి వెనుక అని కాకుండా కులానికి, వర్గానికి మధ్య వుండే గతితార్కిక సంబంధాన్ని అర్థం చేసుకున్న విప్లవ పార్టీలు తర్వాతి కాలంలో కులాన్ని విప్లవాంతర (post-revolution) సమస్యగానో లేక విప్లవం విజయవంతమైతే కులం దానికదిగా పోతుందనో భావించకుండా కులానికి ఉండే వర్గ పునాదులను, ఉపరితల భావజాల అంశాలను ఏక కాలంలో ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆ పనిని కొంతైనా తమ ఉద్యమ ప్రాంతాలలో చేయగలిగాయి).

ఇక అంబేద్కర్ వెతికిన రెండవ కారణం పీడిత కులాల దగ్గర వారి విముక్తికి కావాల్సిన ఆయుధాలు (weapons of emancipation) వారి దగ్గర లేకపోవడం. దానికి తోడు తరతరాల బానిసత్వం మూలంగా ఆధిపత్య కుల, వర్గాలతో ప్రత్యక్షంగా కలబడి పోరాడే శక్తి వాళ్ళకు వాళ్ళుగా లేకపోవడం (“disabled for direct action”) అని భావించాడు. పీడిత కులాల చేతుల్లోకి వారిని వారు విముక్తి చేసుకునే ఆయుధాలు రావాలంటే ముందు వాళ్ళకి రాజ్యాధికారం రావాలని అనుకున్నాడు అంబేద్కర్. అయితే అంబేద్కర్ విమర్శకులు అనేదేమంటే ఒక సామాజిక విప్లవానికి కావాల్సిన ఆయుధాలు ప్రజల దగ్గర లేనప్పుడు ముందు ఆ కావాల్సిన ఆయుధాలు సమకూర్చుకోవాలి కాని ఒక్కసారిగా గరిష్టస్థాయి (maximalist) ప్రజాతంత్ర విప్లవం, రాజ్యాధికారం గురించి మాట్లాడటం ఎంతవరకు ఆచరణాత్మకమైనది అని. అంబేద్కర్ కూడా తన స్వీయ అనుభవాల ద్వారా తెలుసుకున్నదేమంటే సామాజిక విముక్తి (social emancipation) చెందని పీడిత కులాలు రాజకీయ విముక్తి పొందినా ప్రయోజనం వుండదని. అంతేకాదు, రాజకీయ విముక్తికి కూడా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నిరంతరంగా అడ్డుపడుతూనే వుంటదని.

అందుకోసమే కుల వ్యవస్థను పెంచి పోషించే బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని, దానికి సత్తువనిచ్చే హిందూమత శాస్త్రాల సాధికారతను ధ్వంసం (“destroy the authority of Shastras”) చేయాలని పిలుపునిచ్చాడు. చివరికి హిందూమతం అట్టడుగు కులాలకు ఒక మరణశాసనం లాంటిదని, దానిని వదులుకోవడం ఒక్కటే మార్గమని నమ్మి సమతను, అహింసను బోధించే బౌద్దాన్ని స్వీకరించాడు. (ఇక్కడ అహింస గురించి ఒక్క మాట చెప్పుకోవాలి. అంబేద్కర్ కు గాంధీ మాదిరిగా అహింస ఒక విలువ కాదు. ఒక మత విధానంలో భాగం అంతకన్నా కాదు. అతనికి అది కేవలం ఒక రాజకీయ వ్యూహం మాత్రమే.) అనేక ఆటుపోట్ల మధ్య అంబేద్కర్ కుల నిర్మూలన కోసం అన్ని రకాల వ్యూహాలను, ఎత్తుగడలను ఉపయోగించాడు. తన మేధోశ్రమనంతా పీడిత కులాల విముక్తి కోసమే ధారపోశాడు. అయితే తాను చేసిన శ్రమను వాస్తవికవాద (pragmatic) దృష్టితో చూసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఉదారవాద అవకాశవాదంగా విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఎవరి అంచనాలు ఏమైనా వాస్తవానికి అంబేద్కర్ రాజ్యాధికారం కోసం చేసిన రాజకీయ ప్రయోగం, మత మార్పిడితో కుల నిర్మూలన కోసం చేసిన ప్రయత్నం రెండూ కూడా పెద్దగా ఫలితాలను ఇవ్వలేదని చరిత్ర చెబుతుంది.

ఇప్పుడు తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించాలని కొత్త రాజకీయ సమీకరణాలు, కొత్త నాయకత్వం ముందుకొస్తుంది. అందులో ముఖ్యంగా మాజీ పోలీస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరడం, నాయకత్వ బాధ్యతలను తీసుకోవడం బహుజనులలో కొత్త ఆశలను పుట్టిస్తున్నాయి. ఈ రాజకీయ సమూహాలలో “దళిత్” (= oppressed, broken people) అనే పదం వాడడం కూడా సరైనది కాదు. ఎందుకంటే అది గత కాలం నాటి పీడన, హింస, అణిచివేత చిహ్నంగా ఉండి సామాజిక చైతన్యానికి ప్రతికూలంగా మారుతుందని, దాని స్థానంలో “బహుజన్” అనే పదాన్ని వాడుతున్నారు. భాషా పరమైన, భావోద్వేగమైన అభ్యంతరాలే కాకుండా బహుజన్ అనే పదం దళిత్ అనే దానికన్నా విశాలమైనదని, అది అన్ని అట్టడుగు కులాలను, మత మైనారిటీలను కలుపుకుపోయేలా చేస్తుందనే ఒక రాజకీయ ఎత్తుగడ కూడా అందులో వుంది. కానీ వాస్తవానికి దళిత్ పాంథర్స్ “దళిత్” అనే పదాన్ని కేవలం ఒక భాషా సాధనంగా చూడలేదు. వారు దళితవాదాన్ని పీడిత కులాల చారిత్రక పోరాట క్రమాన్ని, వర్తమాన ఉద్యమాలను కలుపగలిగే ఒక భౌతికవాద జ్ణాన మార్గంగా (materialistic epistemology) చూశారు. దళిత్ అనే సామాజిక కేటగిరీలో అన్ని “కింది” కులాలు, శ్రామిక వర్గాలు, ఆదివాసులు, మహిళలను కూడా కలిపి చూశారు.

ఏది ఏమైనా పెట్రేగుతున్న హిందుత్వ ఫాసిజం సందర్భంలో బహుజన రాజకీయాలు బలపడటం అవసరమే, కాని అది (అంబేద్కర్ పదే పదే చెప్పినట్లు) సామాజిక వాస్తవికత (social reality) మీద ఆధారపడి జరగాలే కాని భ్రమల గూడు కట్టే విధంగా ఉండకూడదు. సనాతన ధర్మం పేరుతో హిందూత్వ, నయాఉదారవాద రూపంలో సామ్రాజ్యవాదం సమాజంలోని అన్ని వ్యవస్థలను కైవసం చేసుకొని హింసను కొనసాగిస్తున్నాయి. ఇవి రెండూ ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకుంటూ పీడిత కులాల, వర్గాల, లింగాల, ఆదివాసుల, మత మైనారిటీలపై అణిచివేతను, దోపిడీని కొనసాగిస్తున్నాయి. ఇది ఒక సామాజిక వాస్తవం. ఈ సందర్భంలో వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా “ముందు రాజ్యాధికారం రానివ్వండి. తర్వాత అన్నీ మార్చేస్తాం” అనడం వాస్తవ విరుద్దమే అవుతుంది. ఇలాంటి మాటలు సభల్లో చప్పట్లు కొట్టిస్తుండొచ్చు. సొషల్ మీడియాలో లైకులు కురిపిస్తుండొచ్చు. కానీ ఎన్నికల్లో ఓట్ల పంట పండించవు. దేశ ఎన్నికల రాజకీయాలను పరిశీలించే ఎవ్వరికైనా మతం, కులం, మత్తు, డబ్బు ఎలా పనిచేస్తాయో, ఎన్నికల బూటకత్వం, విలువలు లేని తనం ఏమిటో చెప్పనక్కరలేదు. అణగారిన ప్రజలను కేవలం బహుజనులు, మహాజనులు అని ఒక పెద్ద సంఖ్య కిందికి కుదించి వాళ్ళను ఓటర్లుగా చూసి మురిసిపోకుండా, నిబద్దతతో కూడిన నిర్మాణాత్మక ఉద్యమాలు చేయడం అవసరం. ఆ ఉద్యమాలకు హిందూత్వం, సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయాలు లేకపోతే అవి దళిత, బహుజనులను మోసగించడానికే దారితీస్తాయి.

వీటికి తోడు నాయకుల వ్యక్తి పూజ, వారి జనరంజకవాద (populist) ప్రచార ఎత్తుగడలు దళిత బహుజన రాజకీయాలను మరింత పలుచన చేసేవిగా వున్నాయి. ఈ ధోరణులు ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ తన పోలీస్ పదవికి రాజీనామా చేసి బహుజన రాజకీయ జెండాను ఎత్తుకున్న తర్వాత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ సోషల్ వెల్ ఫేర్ గురుకులాల సారధిగా చేసిన కృషిని దృష్టిలో పెట్టుకొని ఆయనను “అభినవ అంబేద్కర్” అని ఆకాశానికి ఎత్తే వాళ్ళున్నారు. ఆయన మీద ఎలాంటి విమర్శ వాలనీయకుండా అభిమాన కోట ఒకటి నిర్మితమయ్యింది. వీళ్ళకి ప్రవీణ్ కుమార్ కుల నిర్మూలన ఉద్యమాలకు ఏమైనా చేశాడా లేదా అనేది సంబంధం లేదు. ఆయన పోలీస్ అధికారిగా ప్రజా ఉద్యమాల అణిచివేతలో ఎంత దూకుడుగా వ్యవహరించాడో, ఆయన ఇప్పుడు “జనజీవన స్రవంతి”లోకి వచ్చి “దొర ఏందిరో వాడి పీకుడేందిరో” అని ఎగిరెగిరి పాడుతుండు. కానీ అలాంటి పాటలతో, రాజకీయ చైతన్యంతో తెలంగాణలో దొరతనం మీద యుద్ధం చేసిన ఎందరిని “ఎన్ కౌంటర్” పేరిట చంపడానికి బాధ్యుడయ్యిండో ఇప్పుడు ఆయనలో బహుజన మొఖాన్ని చూసే వాళ్ళకు అర్థమయ్యే అవకాశం లేదు. అర్థమయిన వాళ్ళు ఆ “ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్” తన “ఉద్యోగ ధర్మాన్ని” నిర్వహించాడని సుతిమెత్తగా చెబుతున్నారు. (నిజానికి పోలీసులకు “ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్” అని టైటిల్ పెట్టి “గౌరవించడం” మన సమాజ పతన స్థితికి అద్దం పడుతుంది. దొరికిన మనుషుల్ని దొరికినట్లు చంపేవాడికి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం లేదు. కేవలం నరహంతుకుడు అయివుంటే చాలు.) “ఉద్యోగ ధర్మంలో” భాగంగా ప్రవీణ్ కుమార్ చేసిన ఎన్ కౌంటర్ హత్యల గురించి పౌరహక్కుల సంఘాలు, ఉద్యమ సమాజమే ఈ తరానికి వివరించాలి. శంభూకుడిని చంపిన రాముడు రాజుగా చతుర్వర్ణ వ్యవస్థను కాపాడానికే తన రాజ ధర్మంలో భాగంగానే ఆ పని చేశాడని చెబితే అంగీకరిద్దామా? ఈ ప్రశ్న నేను వేస్తున్నది కాదు. స్వయంగా అంబేద్కర్ తన “కుల నిర్మూలన” ఉపన్యాసంలో చెప్పిందే.

కాని ప్రవీణ్ కుమార్ అభిమానులకు చరిత్రతో గానీ, వర్తమాన వాస్తవికతతో గానీ పనిలేదు. వాళ్ళకు కేవలం ఆయన గురుకులాలకు చేసిన “సేవ” ఒక్కటే కావాలి. నిజానికి వాళ్ళు ప్రవీణ్ కుమార్ జీవితాన్ని ముక్కలు చేసి కేవలం తమకు నచ్చిన ముక్కను ఆరాధిస్తున్నారు. అతనిలో ఒక విముక్తికారున్ని (savior), రక్షకుడిని చూస్తున్నారు. వాస్తవానికి రిజర్వేషన్లు కాని, ప్రత్యేక గురుకులాలు కాని, మరే ఇతర ఉపాధి పథకాలు కాని ఒకరి దయా దాక్షణ్యం అనుకోవడంలోనే లోపముంది. అవన్నీ కూడా అణగారిన ప్రజలు హక్కుగా పొందేవి. అవన్నీ సవర్ణ రాజ్యం తారతరాల దోపిడీకి, చేసిన నష్టానికి ఇచ్చే పరిహారం (reparation). ఆ పరిహారాన్ని చిత్తశుద్దితో ప్రవీణ్ కుమార్ అందించి వుంటే అందుకు అభినందనీయుడే! ఎందుకంటే మన సమాజంలో తాము రాజ్యాంగబద్దంగా చేయాల్సిన “ఉద్యోగ ధర్మాన్ని” చేసినా గొప్పే కదా!

నిజమైన అంబేద్కర్ వాదులు ఈ గురుకులాల విషయంలో సౌకర్యాలు, ఫలితాలు కాకుండా ఇంకో అడుగు ముందుకేసి లోతైన ఆలోచన చేస్తారు. అసలు అంబేద్కర్ విద్య గురించి ఏమన్నాడో, ఎలాంటి విద్య అందరికి అందాలని కోరుకున్నాడో, పిల్లలు ఎలాంటి మానసిక వికాసం చెందాలని బావించాడో ఆలోచిస్తారు. అంబేద్కర్ పిల్లలకు విద్య వారి సామాజిక, సాంస్కృతిక ఆవరణలో జరగాలని కోరుకున్నాడు. ఎందుకంటే పిల్లలను తమ మనుషుల నుండి, తాము ఎరిగిన భౌతిక, సామాజిక వాతావరణం నుండి దూరం చేసి సార్వజనీయత, ఆధునికత పేరిట కొత్త విలువలను, కొత్త అలవాట్లను వాళ్ళ మీద రుద్దడం మూలంగా వారి నుండి వారే పరాయీకరణ చెందుతారు. నా స్వీయానుభవంలో ఆరేండ్ల నా గురుకుల బాల్యం కూడా ఇదే విషయాన్ని రిజిస్టర్ చేసింది. అమెరికా, కెనడాలో ఆదివాసీ పిల్లలను రెసిడెన్షియల్ విద్యా విధానంలోకి నెట్టడం మూలంగా వాళ్ళు మానసికంగా ఎట్లా కుంగిపోయారో, ఎట్లా ఆత్మన్యూనతకు గురయ్యారో, తమ మూలాల నుండి ఎట్లా దూరమయ్యారో అనేక ఉదంతాలు, పరిశోధనలు వున్నాయి. విద్య అనగానే ఒక పరిమిత నిర్వచనానికి, విజయం అనగానే మార్కెట్ నిర్థేశించే ప్రమాణాలకు కుదించి చూడడం అలవాటయ్యింది. అందుకే మనం ఇంకా గురుకులాలను మించి ఆలోచించడం లేదు.

అన్నింటిని మించి బహుజనులు అనే ఒక పెద్ద సామాజిక కేటగిరీలో ఇంకా నిచ్చెన మెట్లు పదిలంగానే ఉన్నాయి. అంతరాలు పెరుగుతున్నాయి. జెండర్ కు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి (మిత్ర, శత్రు) వైరుధ్యాలు ఉన్న పెద్ద సమూహంలో విమర్శలు సహజం. విమర్శ రాగానే మనోభావాలకు అగ్గి పెట్టుకొని ఊరు, వాడ తగలబెడితే సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య హిందూత్వ ఫాసిజం (అందులో ప్రధాన భాగమైన కుల వ్యవస్థ) దానితో మిలాఖత్ అయ్యి బలపడుతున్న సామ్రాజ్యవాదం. ఈ రెండింటిని కనీసం సూత్రబద్ధంగానైనా ఎదిరించకుండా, వాటిని ఎదిరించే శక్తులతో కలిసి నడవకుండా “నేను అందరి వాడిని” అని అమాయకంగా నటిస్తే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచినట్లే. బహుజన వాదానికి నష్టం చేసినట్లే. అందుకే బహుజన వాదాన్ని భ్రమల్లో బంధీ కాకుండా చూద్దాం. ప్రశ్నలు నాటి, ప్రజాస్వామ్య సంస్కృతిని చిగురింపజేద్దాం.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

13 thoughts on “భ్రమల గూడు కడుతున్న బహుజన రాజకీయాలు

 1. ఆలోచనాత్మక వ్యాసం. కుల వ్యవస్థ పునాదుల మీదే హిందూ మతం అలరారుతోంది. దానిని, దానికి అంట కాగే మత రాజకీయాలను దునుమాడ కుండా బహుజన ఐక్యత దుర్లభమే.

 2. Correct analysis, elevating Mr. Praveen Kumar indicates few things : 1. Oppressed people are looking upto someone to fill their political void, 2. The paucity in understanding vote-bank politics and the social limitations of participation in the industrial-political-beaurocratic atmosphere. 3. Inability to shun GOD by the Bahujans and continued participation/acceptance of HINDU hierarchy.

 3. Something missing in your article, మీరు రాసిన దానిలోనే ఉన్నది ‘…. ఈ దేశంలో వున్న నల్లోళ్ళు అంతా మన దగ్గర మాల, మాదిగోళ్ళ మాదిరిగానేనా?” “నల్లోళ్ళు కూడా అంటరానివాళ్ళేనా?” అనేది ఆయన ప్రశ్నలోని సారాంశం. దానికి సమాధానంగా నేను “అంకుల్, ఈ దేశంలో తెల్ల జాత్యహంకారుల దృష్టిలో నల్లోళ్ళు మాత్రమే కాదు, మనమందరం మాల మాదిగోళ్ళమే” అని చెప్పిన ‘ ….

  ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా ఆలోచించాలి.. in general your article is excellent

 4. చాలా బాగుంది వ్యాసం. దళిత వాదాన్ని మభ్య పెట్టి లభ్దిపొందాలని చూస్తున్నారు చాలా మంది రాజకీయులు/ రాజకీయ పార్టీలు. అందులో బహుజనపార్టి మినహాయింపు కాదు. అదేమి ప్రత్యామ్నాయ రాజకీయాలు నడపడం లేదు. అన్నీ మెయిన్ స్ట్రీం పార్టీ లకంటే భిన్నంగా లేదు. అధికారం దక్కించుకోవడానికి అన్ని పార్టీ లు ఏమి చేస్తున్నాయో అదికూడా అదే చేస్తుంది.అధికారం వచ్చాక అన్ని పార్టీ లు ఏమిచేస్తున్నాయో అదే చేస్తుంది. చివరికి దళితుల కో / బహుజనులకో వచ్చే ది ఏమి లేదు. కాకపోతే కొంత మంది బహుజనులు బూర్జువా వర్గం లో చేరుతారు. అది చూసి బహు జనులు/ దళితులు తృప్తి పడాలి. మనవాళ్ళు కూడా గొప్ప బూర్జువా లుగా వున్నారని.

 5. పోలీసులకు “ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్” అని టైటిల్ పెట్టి “గౌరవించడం” మన సమాజ పతన స్థితికి అద్దం పడుతుంది. దొరికిన మనుషుల్ని దొరికినట్లు చంపేవాడికి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం లేదు. కేవలం నరహంతుకుడు అయివుంటే చాలు. కఠోర సత్యం. మన నరహంతకుడు కనీసం అది తప్పు అని ప్రకటించాడా? అశోకుడు కళింగ యుద్దం తరువాత తన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. తదనంతరమే ప్రజల మనిషి అయినాడు.

  1. వర్తమాన నేతలోని గత ప్రతినాయకుడిని ప్రొజెక్ట్ చేయటానికి మీ దృష్టిని కేంద్రీకరించినట్టుగా అనిపించింది.మొత్తంగా వ్యతిరేఖత అంతర్లీనంగా పెల్లుబుకుతుంది.

 6. Ashok ji —madam andharam Mala – madigollame —-excellent answer for peddayina
  Praveen ji joined bahujana samaj party —-c.m maayavathi is not honest and sincere sir— she wasted lot of peoples money on statues —she is goda meedhi pilli

Leave a Reply