గ్రామీణ జీవితాల్లో మత చొరబాటును చిత్రించిన నవల – ‘భూమి పతనం’

పూర్వకాలపు మన సమాజం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఒక ప్రత్యేకస్థానాన్ని కలిగివుండి గ్రామీణ ప్రజల జీవితాలతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండేది. ఒక జీవనాధార వృత్తిగా, జీవన విధానంగానే కాక, వ్యవసాయం మన ప్రజల సామూహిక జీవనానికి పునాదిగా కూడా వుండేది. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల మధ్యన వుండే సన్నిహిత సంబంధం, భూమిపై సామూహిక ఆధిపత్యం ఈ సామూహిక జీవనాన్ని బలోపేతం చేయడమే కాకుండా గ్రామ ప్రజలకు కావలసిన అన్ని వస్త్రాలు, ఇతర వస్తువులను ఉత్పత్తి చేసుకొంటూ స్వయం సమృద్ధిని చేకూర్చేవి.

బ్రిటిష్‍ పరిపాలనా కాలంలో మన వ్యవసాయరంగంలో ప్రముఖమైన మార్పులు వచ్చాయి. భూస్వామ్య సంబంధాలు అప్పటికే కొన్ని శతాబ్దాలుగా కొంతవరకు వృద్ధిచెందినా కూడా బ్రిటిష్‍ వారు తమ పాలనా ప్రయోజనాల కొరకు ఒక సాధారణ వ్యవస్థగా భూస్వామ్యాన్ని మనదేశంలో చట్టపరంగా స్థాపించారు. ఫలితంగా సామూహిక ఆధిపత్యం, గ్రామ కమిటీల పర్యవేక్షణలో వుండే వ్యవసాయ భూములు, చాలావరకు రాచరిక కుటుంబాలు, జమిందార్లు, భూస్వాముల యాజమాన్యంలోకి వెళ్ళిపోయినాయి. దీనితో కొద్దిమంది భూస్వాముల వద్ధ భూకేంద్రీకరణ జరిగి, కోట్లాది సాగుచేసే ప్రజలకు భూమిలేక కౌలుదార్లుగా మారి, భూస్వాములు, వడ్డీవ్యాపారుల దోపిడితో దారుణమైన పేదరికంలోకి నెట్టివేయబడ్డారు.

నేడు దేశంలో రైతన్నలు తెగువ కనబరుస్తున్నారు. మట్టి మనుషులు నాగరిక ప్రభుత్వాలపై పిడికిళ్లు బిగిస్తున్నారు. సర్కారు మీద కర్షకలోకం కదం తొక్కుతున్నది. కడుపులెండిన కష్టజీవులు రోడ్డెక్కి ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. గుండె మండిన బక్క రైతాంగం మొండిగా పోరాడుతున్నది. అన్నదాతల తలపై లాఠీలు మోగాయి. నాగలి పట్టిన చేతులకు బేడీలు పడ్డాయి. కాడి మోసిన ఎడ్లు రైతులకు మద్ధతుగా రంకెలు వేస్తున్నాయి. తెలుగు నేల మీద నేడు ఏ రోజు విన్నా రైతుల కాలే కడుపులు, మండే గుండెల నుంచీ వినిపిస్తున్న సమర నినాదాలే. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణానికి కొన్ని నెలల ముందు అంటే మార్చి 2021లో గూండ్ల వెంకటనారాయణ రాసిన ‘‘భూమి పతనం’’ నవల వచ్చింది.

రచయితది పల్నాటి వీరభూమి కారంపూడి 15 కి.మీ. దూరాన చిన్న పల్లెటూరు గరికపాడు. గుంటూరు ప్రాంతానికి చెందినవాడు. తన ఇరవై ఏళ్ళ జీవిత కాలంలో నేటి కాలం కన్నా ఆ పదేళ్ళ పాతకాలపు గుర్తులే తనపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయని చెప్పాడు. నాగిలేరు నది ప్రస్థావన. జాషువా జన్మించిన వినుకొండ గురించి, రైలును కూబండిగా, విమానం తెల్లపిట్టగా చూసిన తన అమాయకత్వాన్ని పరిచయం చేశాడు. రచయితగా ఎదగడానికి వ్యక్తిత్వానికి భూమిక అమాయకత్వమే అంటాడు.

గరికపాడులో పుట్టి ఉండకపోతే ఈ నవల రాసేవాన్ని కాదన్నాడంటే ఆ ఊరి ప్రభావం ఎంతగా తన మీద ప్రసరించిందో మనం అర్థం చేసుకోవాలి. తన రచన నదీ ప్రవాహం లాగా అది మనుషుల చేతుల్లో ప్రవహిస్తూ వారి బుర్రల్లో నిలిచిపోవాలని కడలిలో కలిసినట్టుగా అంటాడు. రచయిత తన ఊరి రెండు కాలాల జీవితాన్ని ప్రతిబింబించిన ఆకాశం లాంటిది అని ఈ నవలని వారి ఊరుగా భావించాడు. కాని అన్ని ఊళ్ళ పరిస్థితిగా మనం భావించాలి.

ఆధునిక యుగంలో కల్పనా సాహిత్యానికి సంబంధించిన ప్రధాన పక్రియలలో నవల ఒకటి. నవల ఆవిర్భావానికి ఉండే ఆర్థిక, సామాజిక, తాత్విక భూమికలను బట్టి, పారిశ్రామిక యుగ ఇతిహాసమని, మధ్య తరగతి – ఆధునిక ఇతిహాసంగా సాహితీవేత్తలు నవలను నిర్వచించారు.

ఆధునిక జీవన విధానం, ఆలోచనలు వాటిలో భాగంగా వైవిధ్యం, వైరుధ్యం, ఘర్షణల వల్ల నిత్యం కదలిక స్థితిలో కొనసాగుతుంది. మధ్య తరగతి పక్రియగా తెలుగు నవల ఆవిర్భవించిందంటారు. అందుకే మధ్య తరగతి జీవితం, సమస్యలు వస్తువుగా తెలుగు నవల ప్రారంభం జరిగింది.

ఆ కోవలోనే భూమి పతనం నవల గూండ్ల వెంకటనారాయణ రాశారు. రచయితగా ఎదగడానికి చిన్నగా కవిత్వం రాయటం, కథలు రాయటం మొదలుపెట్టి నవలా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దాని పరిధి పెద్దది కాబట్టి. కాని గూండ్ల వెంకటనారాయణ మొట్టమొదలే చిన్న వయస్సులోనే నవల రాయటం, చెయ్యి తిరిగిన రచయితలాగా రాయటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రచయిత కృషి, పట్టుదల అర్థం చేసుకోవచ్చు.

నవలా విషయానికొస్తే ‘భూమి పతనం’ వాస్తవిక చిత్రణ. రచయిత అనుభవం నుండి రాయబడ్డా ! అనేక మంది రైతుల జీవితాల సారమే. ఒక పేద సన్నకారు రైతు ప్రధాన పాత్రగా తీసుకొన్నాడు. అతడు కౌలుదారుడిగా వ్యవసాయం చేసిన తీరు, ఆ తర్వాత తన సొంత భూమిని సాగు చేసిన తీరు అనుభవించిన కష్టనష్టాలను చిత్రిస్తూ ఈ నవల రాశాడు.

నవల ఎత్తుగడ ప్రారంభమై మొదటి పేజీ తిప్పగానే రోశయ్య పాత్ర పరిచయం అవుతుంది. ఆ గ్రామంలో ఉన్న ప్రజల్ని, సన్నకారు రైతుల్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న తీరు పెద్ద మోసపూరితమైన చర్య, అంతేగాక రోశయ్య ఆధీనంలో అప్పుపడిన వారందరి పంట భూముల్ని అప్పు కింద జమచేసుకోవటం. అలా విశాలమైన సుక్షేత్రం ఏర్పాటు చేసికొని పెద్ద భూస్వామిగా చలామణి అవుతూ దోపిడీ చేసిన పద్ధతి బాగా చిత్రించాడు.

రోశయ్య కొడుకే నరసింహరావు. తండ్రి చనిపోవటం కొడుకు చేతిలోకి భూములు రావటం. భూముల విలువ తెలుసుకోలేక వ్యాపారం వైపు మల్లుతాడు. చివరికి అప్పులపాలై ఆత్మహత్య చేసుకొంటాడు.

చంద్రకొండలు ఒక సన్నకారు రైతు. అతనికి కొంత భూమి ఉన్నప్పటికీ వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవటం వల్ల నరసింహరావు అనే భూస్వామి దగ్గర కొంత భూమిని కౌలుకు తీసుకొని దాన్ని సాగుచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య నాగలక్ష్మి, కొడుకు అనిల్‍, కూతరు సాలమ్మ.

చంద్రకొండలతో పాటు రామయ్య కూడా కౌలుదారే. ఈ రామయ్య చంద్రకొండలు చేసే కౌలు పొలం కూడా తన కిందకే గుంజుకోవాలని కుట్రపన్నుతాడు. నరసింహరావు భూస్వామి, రామయ్య ఇచ్చే మద్యం, మాంసంకి మళ్ళి పోయి చంద్రకొండలు కౌలుభూమిని రామయ్యకే ఇస్తాడు. దాంతో జీవనాధారమైన కౌలుభూమి కాకుండా పోతుందని బాధ, భూమిని వదులుకోలేక నాగలక్ష్మి రామయ్య మీదికి గొడవకి దిగుతుంది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ పెద్దగా అవుతుంది. దీని పర్యవసానంగా నాగలక్ష్మి హింసకు గురవుతుంది. చంద్రకొండలు భూమి పోయిందనే బాధ, రామయ్యను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నాగలక్ష్మిని కొడ్తాడు. ఆమె ఒంటిమీద పడ్డ దెబ్బలకంటే భూమి పోతుందనే బాధ ఎక్కువ వేదనకు గురిచేస్తుంది. సమాజంలో జరిగే ఏ సంఘటన అయినా హింస రూపంలో స్త్రీలపైనే పడుతుందనడానికి ఇదొక నిదర్శనం.

వేరే వాళ్ళ దగ్గర కౌలుకు తీసుకునే బదులు వారికున్న మూడెకరాల భూమినే సేద్యం చేయాలనే నిర్ణయానికి వస్తారు. పొలాన్ని, కూలీలను పెడ్తె ఖర్చవుతుందని ముగ్గురు కలిసి బాగు చేసుకుంటారు. ఆఖరికి నీటి వసతి లేకపోవడం వల్ల అప్పు చేసి బోర్‍ వేయిస్తారు. నీళ్ళు కూడా పడ్తాయి. ఈ విధంగా చంద్రకొండలు కుటుంబానికి ఆసరా దొరికినట్టవుతుంది. కొన్ని అప్పులు చేసినా సొంత భూమినే నమ్ముకొన్నారు. భార్యాభర్తలు వారి రెక్కలను ముక్కలు చేసికొని జీవనం సాగిస్తుంటారు. అనిల్‍ కాలేజీ చదువుతో పాటు, తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తుంటాడు.

చంద్రకొండలు, తండ్రి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసిన తీరు. తనకి ఆ భూమిని అప్పగించటం. అన్ని విషయాలు పంట భూమి గొప్పతనం అనిల్‍కి చెబుతూ ఉండేవాడు. ఈ భూమిని ఏ కష్టం వచ్చిన వదులుకోవద్దని పొలమనేది పసిపిల్లలాంటిది. అమ్మలా సాకాలి అంటాడు. అప్పుడు అనిల్‍ పొలం చూసినప్పుడల్లా అది నా గుండెలా అగుపిస్తుంది అంటాడు. అప్పుడు కొండలు గర్వపడ్తాడు. రైతు బిడ్డగా మట్టిని ఆరాధించాలి. మన చేతి మట్టితో ఎందరో ఆకలి తీర్చటం. ఇది అదృష్టం అంటాడు. మన వంశ రక్తమంతా ఈ నేలలోనే ఉంది. మన పూర్వుల అడుగుజాడలన్నీ ఈ మట్టిపై అంతే నిల్చున్నాయి. ఈ పొలంలో నడిచే ప్రతిసారి ఆ అడుగుల స్పర్శే నన్ను రైతుగా ఉత్తేజితున్ని చేస్తుంది. రేపు నేను చనిపోయినా నా అడుగులూ ఇందులోనే ఉంటాయి. ఎంత చదివినా జ్ఞానం సంపాదించటానికే, ప్రాణం పోయినా పొలం వదులుకోవద్దు. రక్తం ధారపోసిన ఈ పొలం నీకు కానుకగా ఇస్తానని కొండలు చెప్పటం గమనిస్తే ప్రతి రైతు ఆలోచించేది ఇదేనని అర్థం చేసుకోవచ్చు. రైతుకి మట్టికి ఉండే అనుబంధం. మట్టిని ప్రేమించే తీరు ప్రస్ఫుటం అవుతుంది. భూమి కోసం ప్రాణాలు సైతం తృణప్రాయంగా భావించే తత్త్వం. రక్తాన్ని ధారపోసి పంటపండిచటం ఎంత గర్వించదగ్గ విషయం. పదిమందికి కడుపునింపే పని. కాని కడుపు కొట్టటం కాదు కదా ! రైతు పస్తులుండైనా ఇతరుల కడుపు నింపేవాడు రైతు.

నరసింహారావు తన రెండెకరాల మంచి పంట భూమి గుడికిస్తానంటే కొండలు సేద్యపుభూమి పనికి రాకుండా పోతుందే. ఎంత మంచి భూమి అని బాధ వ్యక్తపరుస్తాడు. నరసింహారావు వెధవ రెండకరాలు అన్నందుకు కూడా కొండలు మండిపడ్తాడు. భూమిని చులకన చేసి మాట్లాడ్తాడా ! అని బాధ వ్యక్తం చేస్తడు. భూమి పట్ల రైతుకున్న ప్రేమ, గౌరవం అర్థమవుతుంది.

ఒక పురుషుడు, ఒక స్త్రీ ఆర్థిక పరిస్థితి, దైన్య స్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నాడు. దానివల్ల ఇద్దరి స్త్రీల మధ్య గొడవ జరగటం. మార్తమ్మ పాత్ర చిత్రణ. ఒక తప్పుచేసి పదిమందిలో అది రచ్చ రచ్చ అయినప్పుడు, ఇంతేకదా ఏమైంది అని ఒక తెగింపు చోటు చేసికొని ఇంకా తప్పులు చేస్తూనే ఉండే స్థితి. మార్తమ్మ చర్చి, పాస్టర్‍ను దగ్గరనుండి చూసి దానిద్వారా ఎలా బ్రతకొచ్చో అర్థం చేసుకొని తనే స్వయంగా చర్చి ఏర్పాటు చేసి బ్రతకటం నేర్చుకున్న తీరు. ఈ నవలలో పొందుపర్చబడింది.

క్రైస్తవ మతం గురించి, మార్తమ్మ గురించి స్నేహితుల ద్వారా విన్న అనిల్‍, ‘‘దేవుడి పేరు చెప్పి ఒకళ్ళ మీద బతికే వాళ్ళకన్నా వ్యవసాయం చేసే మా నాన్న వెయ్యిరెట్లు మేలు. ఎప్పుడూ కష్టపడ్తుంటాడు. వ్యవసాయం చేస్తూ ఎంతమంది కడుపునింపుతున్నాడు. ఒకరి కడుపు కొట్టి బతకడం, ఒకరి కడుపు నింపటం ఎంత తేడా !’’ మతం లొసుగుల్ని, వ్యవసాయం గొప్పతనాన్ని ఎత్తి చూపాడు రచయిత.

ఏ మతమైనా కావచ్చు దాని ప్రభావం మనుషుల మీద ఎంతగా ప్రసరిస్తుందో ఎలా మలచబడ్తారో పరిస్థితులు ఎలా ఉంటాయో గొర్రెమందలాగా ఎలా నెట్టుకుపోబడ్తారో అర్థం చేయించిన తీరు పాఠకుల్ని విస్మయానికి గురిచేసిన అంశంగా చూడొచ్చు. సాంస్కతికాంశాలు కూడా కనిపిస్తాయి. హనుమాన్‍ జాతర, గంగమ్మ జాతర, గుడిపేరుతో అధికారంలోకి రావాలనే కుట్ర. కష్టకాలంలో ఉన్న ప్రజల్ని చూసి మత ప్రచారం చేసికొనే వైనం. పండుగలు, పబ్బాలు నీళ్ళ కరువు, నీళ్ళ కోసం తగాదాలు ఇలా చాలా విషయాలు నవలలో ప్రస్తావించబడ్డాయి. ప్రధానంగా నేను పరిశీలించింది ఏంటంటే ఒకవైపు కిస్టియన్‍ మతం గురించి, మరో వైపు వ్యవసాయం గురించి రెండు సరళరేఖల్లా కొనసాగాయి.

చంద్రకొండలు వ్యవసాయ కుటుంబ విషయం. చంద్రకొండలు కౌలు భూమి కోల్పోయి, తన భూమినే బాగుచేసికొని బోరు వేయించి ఎన్నో ఇబ్బందులతో పంట వేస్తే మిరప పంటకి బొబ్బర తెగులు సోకి దిగుబడి లేకుండా పోతుంది. తమ కష్టాలు ఈ ఏటితోనన్నా తీరుతాయని కలలు కన్నారు. ఇంకా నిండా కష్టాల్లోకి కూరుకుపోయారు. అప్పులు రెండింతలు అవటం. అప్పు ఇచ్చినవాళ్ళు తీర్చమని వేదించటం. ఇల్లు రాసివ్వమని, లేదా పొలం రాసివ్వమని అంటారు. పొలాన్ని మాత్రం పోగొట్టుకునేది లేదు. పొలం పోయిన క్షణమే తమ వంశం సర్వం నాశనమైపోయినట్టే. పొలం పోయిన క్షణం ఊపిరి కూడా పోవాల్సిందే కొండలు అనటం. పాలేరుగా పని చేసైనా అప్పు తీర్చుతానని చెప్పటం వ్యవసాయ భూమి వల్ల రైతులకుండే అనుబంధం మాటలకందనిది. ప్రాణాల కంటే విలువైనదిగా భూమిని చూడటం మనం అర్థం చేసుకోవాలి.

అప్పులిచ్చిన వాళ్ళు కూడా రైతుల పరిస్థితి చూసి కొంచెం కూడా మానవత్వం చూపరు. నోటికి మెతుకులు పెట్టేవాడని ఇంగితం కూడా ఉండదు. చిట్టీల పేరుతో, స్కామ్‍ల పేరుతో ముంచినవాళ్ళను గురించి బయటికి చెప్పరు పరువు పోతుందని. రైతుపట్ల దుర్మార్గంగా ప్రవర్తించే తీరు చాలా బాధాకరంగా ఉంటుంది.

అప్పులు బాగా పెరిగి ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు, ఇంటితో వారికి ఉన్న అనుబంధం వాళ్ళు గడిపిన సమస్తం అన్ని తలపోసుకుంటుంది నాగలక్ష్మి. తన జీవితం ఆ ఇంట్లో అణువణువునా నిండిపోయినట్టు తలచుకొని దు:ఖిస్తుంది. మొదలు చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయటం.

మరో సంవత్సరం కూతుర్ని అల్లుడ్ని వాళ్ళ ఊరికే పిలుపించుకొని భూమిని కౌలుకు తీసికొని సొంత భూమి, కౌలు భూమి సేద్యం చేస్తారు. నష్టపోతారు కొండలు కుటుంబం గడవటం కష్టంగా మారుతుంది. కూతురు, అల్లుడు తమ సంసారాన్ని మూటగట్టుకొని వాళ్ళూరికి వెళ్ళిపోతారు. ఆశతో రూపాయి సంపాదించాలని వచ్చిన కూతురికి ఏం చెయ్యలేక పోయామని తల్లడిల్లడటం గమనించవచ్చు.

కాస్త వర్షాలు పడగానే కొండలు వ్యవసాయం చేయడానికి తన జత ఎద్దుల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. కొండలు బాధ పడ్తూ తిండి సహించక ఏం చేయలేని పరిస్థితి. నాగలక్ష్మి బయటికి ఏమి మాట్లాడలేక నోట్లోనే ఎప్పుడూ ఏవో గొణుక్కుంటూ ఉంటుంది. కిందటేడు బొబ్బర సోకి పోతే ఈ యేడు ముందుగానే బోరు నీళ్ళు తగ్గి పంట పండే సూచన లేక పోయేనా ఏదో ఆశ ముందుకు నడిపింది వాళ్ళని.

వర్షాలు అడపాదడపా కురవటం, చేలో కాయ ఒక కోతను మించి ఎక్కువ లేని స్థితి కనిపిస్తుంది. తాలుగాయలు ఏరిచ్చి మండెబోయటం. ఏరవలిసిన మిగితా కాయలు కళ్ళం మీదే ఉన్నాయి.

ఎండమరీ ఎక్కువైందని ఇంటికొచ్చి మధ్యాహ్నం భోజనం చేస్తుండగానే ఉన్న పళంగా మబ్బుపట్టి చినుకులు ప్రారంభమయ్యాయి. తింటున్న పళ్ళెం పక్కకి నెట్టి పటం నెత్తిన పెట్టుకొని పరుగులు తీస్తారు.

తడుస్తూ చినుకుల ఉధృతి, ఎదురుగాలి, కిందపడ్తూ లేస్తూ కళ్ళంలో కాయలు, తడుస్తూ ఉండొచ్చు, కొట్టుకు పోయి ఉంటాయని తలుస్తూ, వాళ్ళు పడిన వేదన వర్ణనాతీతం.

తెచ్చిన పట్ట చెరో అంచు పట్టుకొని కప్పడానికి ప్రయత్నించినా కష్ట సాధ్యంగా ఉంది. కళ్ళముందే సంవత్సరం సాంతం పండించిన పంట వానకి కొట్టుకు పోతుంటే గుండె విలపించింది. చెల్లా చెదురైన కాయలవైపే చూస్తు ఉండి చేసేదేమి లేక ఇంటిదారి పట్టారు.

పంట చేతికొచ్చే సమయానికి నేలపాలు కావడంతో దిగులుతో కొండలు ఆరోగ్యం క్షీణించి తనువు చాలించాడు. నాగలక్ష్మి మతిస్థిమితం కోల్పోయింది.

రైతును తోటి మనుషులే మోసం చేస్తా ఉంటే, చివరికి ప్రకృతి కూడా పగబట్టింది. కోలుకోలేని దెబ్బతీసి చివరికి ప్రాణాలు తోడేసింది. కొన్నాళ్ళకి అనిల్‍ మార్తమ్మ కూతుర్ని పెళ్ళి చేసికొని పెద్దిళ్ళు కట్టుకున్నాడు. తల్లిదండ్రి కట్టిన ఇల్లు అమ్మేశాడు. పదేపదే కొండలు భూమి గురించి కలవరించి, పలవరించి ఇచ్చిన, వారసత్వ మూడెకరాల పొలంలో పెద్ద చర్చి నిర్మించాడు. పెద్ద హోదా కలిగిన పాస్టరయ్యాడు. నాగలక్ష్మి పిచ్చిదయింది. ఇల్లిల్లు తిరిగి అన్నం అడుక్కొని తింటుండగా ఆమెను కుక్కలు కరిచి చంపేస్తాయి. ఆ ఊళ్ళో ఆంజనేయ స్వామి తిరునాళ్ళు చేయటం ప్రజలు మర్చిపోయారు. గుడి శిథిలావస్థకు చేరింది. ప్రతి యేటా ‘మేరీమాత’ తిరునాళ్ళు ఘనంగా జరగటం మొదలయ్యాయి.

ఇలా పంట భూములు గుడి చర్చీల నిర్మాణం జరుగుతుంటె చివరికి పంటలు పండించడానికి భూమి మిగలదు. నాగలక్ష్మి తిండి పండించిన చేతుల్తోనే అడుక్కొని తిని చచ్చింది. చాలా మంది రైతుల పరిస్థితి ప్రస్తుతం దేశంలో అలాగే ఉంది. పురుషులు పురుగుల మందు తాగటం, ఉరిబెట్టుకొని చావటం లేదా నాగలక్ష్మి లాగా అడుక్కుతినటం. ఇదీ నేటి రైతుల దీనస్థితి.

ఈ నవలలో మరొక వైరుధ్యమైన అంశం. అనిల్‍, శామ్యూల్‍ మంచి స్నేహితులు. శామ్యూల్‍ క్రిష్టియన్‍ మతం పట్ల అభిమానం, సేవా దృక్పధం కలిగినవాడు. ప్రతిరోజు బైబిల్‍ చదవటం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంటాడు.

అనిల్‍ పూర్తిగా వ్యవసాయ కుటుంబం. హిందూ సంప్రదాయం కలిగినవాడు. ఎన్నో రకాలుగా క్రిస్టియన్‍ మతం గురించి వాదోపవాదాలు చేసిన వ్యక్తి. రకరకాల ప్రభావాలతో శామ్యూల్‍ అమ్మమ్మ తాతయ్య సంపాదించి ఇచ్చిన వ్యవసాయ భూమివైపు వెళ్తాడు. వ్యవసాయం చేస్తూ పశువులతో, భూమితో చక్కని అనుభూతి చెందుతూ జీవిస్తుంటాడు.

మొదటి నుండి వ్యవసాయ భూమితో, పశువులతో అనుబంధం ఉన్న అనిల్‍ క్రిస్టియన్‍ మతంలోకి చేర్తాడు. ఈ ఇరువురి జీవితాన్ని చిత్రించిన తీరు వైరుధ్యభరితమైన అంశం. చివరికి ఊహించని మలుపు తిరిగే సరికి పాఠకులుగా ఆశ్చర్యం కలగక మానదు.

బ్రిష్‍ కాలంలో కూడా వారి అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి పేదబలహీన వర్గాలకు క్రిస్టియన్‍ మిషనరీ స్కూల్స్ ఏర్పాటు చేశారు. విద్య నేర్పించే నెపంతో అనేక మందిని క్రిస్టియన్‍ మతంలోకి మార్చుకున్నారు. క్రిస్టియన్‍ మత వ్యాప్తి అలా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి పాలకవర్గాలు కూడా అది ఏ మతమైనా కావచ్చు అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. శామ్యూల్‍ మతం విడిచి వ్యవసాయంలోకి రావటం, అనిల్‍ వ్యవసాయం నుండి మతంలోకి మారటం వీరిద్దరి వైరుధ్యాన్ని గమనిస్తే భావ వాదం నుండి భౌతిక వాదంలోకి, భౌతికవాదం నుండి భావవాదంలోకి మారిన తీరు రచయిత దృశ్యమానం చేశాడు.

రచయిత ఈ నవలలో వాడిన సామెతలు, ఉపమానాలు సందర్భాన్ని బట్టి ప్రయోగించిన తీరు పరిణితిని చూపిస్తుంది. రచయితది ఇది మొదటి నవలారచనగా నమ్మశక్యం కాని అంశంగా తోస్తుంది. సన్నకారు రైతు అనుభవించే వేదన, మత మార్పిడిలు ఎందుకు జరుగుతాయో కూడా రచయిత స్పష్టపర్చాడు.

రచయిత నవల పేరు ‘‘భూమి పతనం’’ అని పెట్టారు. భూమి ఎప్పుడూ పతనం కాదు. మోసం చేయదు. భూమిని నమ్ముకున్న మనుషులే రోజు రోజుకూ పతనమవుతున్నారు.

పొలం లేని రైతు రెక్కలు నరికేసిన పక్షిలాంటివాడు, రైతులేని భూమి అసలు భూమేనా ? అనే ప్రశ్న రచయిత సంధించాడు. కాబట్టి అందరం ఆలోచించాలి. భూముల్ని వాటిని నమ్ముకున్న రైతుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే ఆలోచన కలిగించింది ఈ నవల.

పాపయ్యపేట, మండలం చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు. ఎం.ఏ., పి. హెచ్.డి, ఎం.ఏ, సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012)పై పరిశోధన చేశారు. రచనలు: 'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాస సంపుటి)-2015, 'వ్యాస శోభిత' (వ్యాస సంపుటి) - 2015, 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' - 2018. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

Leave a Reply