భూమితో మాట్లాడిన నవల

‘జీవితంలో ఇటువంటి నవల రాయగలిగితే అంతకన్నా సార్ధకత ఏముంటుంది?’ అన్నాడట అమరుడు పురుషోత్తం ఈ నవల చదవగానే. ‘అయినా అటువంటి జీవితమేదీ నాకు రాయడానికి’ అని కూడ వినమ్రంగా ఆ మాట పూర్తిచేసాడట.

‘అంటరాని వసంతం’ పుస్తక రూపంలో కూడ రావడానికికన్నా ముందు – అంటే ఏడాది క్రితమే రాయవలసిన వాణ్ణి, ‘అరుణతార’లో సీరియల్ ముగియగానే రాయవలసిన వాణ్ణి, ఏడాది పట్టింది. ఈలోగా నవల ఏప్రిల్‌లో మొదటిసారి, డిసెంబర్‌లో మరోసారి గత సహస్రాబ్దిలోనే అచ్చయిపోయి బహుశా మూడో ముద్రణకు సిద్ధమై ఉంటుంది. ఆర్థిక ఆటంకాలు తప్ప ఇప్పటికే మూడో ముద్రణ రాకపోవడానికి ఆదరణకు కొదువలేదు.

ముప్పై ఏళ్ళ విరసం చరిత్రలో, కొత్త సహస్రాబ్దిలోకి తెరచుకొన్న విరసం చరిత్రలో, విరసం మహాసభల రోజే ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహినగర్‌లో వెలువడిన ‘ఝంఝ’ కవితాసంకలనానికి మాత్రమే ఇటువంటి చరిత్ర ఉన్నది. అది నరుడైన భాస్కరుని చరిత్ర. ధూలా రూపంలో పాటను విరసం వేదికమీదికి తెచ్చిన చరిత్ర. ‘రాయని’ భాస్కరులను రాసే బుద్ధి జీవులు తలదాల్చిన చరిత్ర.

మూడో ముద్రణకు వెళ్ళకముందే ‘ఝంఝ’ని ప్రభుత్వం నిషేధించింది. మొదటి ముద్రణనే నిషేధించింది గానీ ప్రభుత్వాలకు సహజమైన బ్యూరాక్రటిక్ ప్రొసీజర్ వల్ల రెండో ముద్రణ కాపీలు కూడ అయిపోయాక నిషేధపుటుత్తర్వులు వెలువడినాయి.

‘అంటరానివసంతం’ సందర్భంగా ఈ ప్రస్తావన ఎందుకు? రాళ్ళబండి మొదలు యగళ్ళ రామకృష్ణ వరకు హృదయానికి హత్తుకున్నారు. ఆలిండియా రేడియో మొదలు హైదరాబాదు యూనివర్సిటీ వరకు ఆకాశానికెత్తారు. జయధీర్ తిరుమలరావు మొదలు సంపత్‌కుమార్ వరకు ఇందులోని జానపద సౌకుమార్యానికి, మౌలికతకు జోహార్లు అర్పించారు. మో కవిత్వం, చేరా సాహిత్య విమర్శల సరసన ప్రతిష్ఠాత్మకమైన అవార్డుకు వెలువడీ వెలువడగానే ఎన్నికైంది. కళ్యాణరావుగారు వినమ్రంగానే కాని దృఢంగా విరసం సంప్రదాయానికి అనుగుణంగా ఆ అవార్డును తిరస్కరించారు.
అయితే మరి ‘ఝంఝ’ పోలిక ఎందుకు?

‘అంటరానివసంతం’ గురించి చెప్పడానికి కళ్యాణరావు గారివే తప్ప ఏ మాటలూ పనికిరావు. ఏమైనా ఉంటే వ్యాఖ్యలుగా అతికించాల్సినవే.
ఇన్ని ప్రశంసల మధ్యన, ఇన్ని చర్చల మధ్యన ఈ వసంతం ఇప్పటికీ నిషేధమే.

ఈ వసంతం అప్పుడూ నిషేధమే
ఇప్పుడూ నిషేధమే
పుట్టిన కులం నిషిద్ధం. కోరుకున్న
పోరాటం నిషిద్ధం.
అది నిన్న కావచ్చు. ఈరోజు కావచ్చు
కాలం ఏదైనా కావచ్చు…

ఒక కులం. అది వసంతం. కాని వ్యవస్థకు అంటరానిది. సమాజానికి మొత్తం ప్రాణవాయువునిచ్చేది. పంచేంద్రియాలకు దృశ్య, రుచి, శ్రవణ, స్పర్శ, వాసనానుభవాలనిచ్చేది, అంతకన్న కొత్త జీవితాన్నిచ్చేది అయిన వసంతం – అంటరానిది.

అది మూల జాతి. చరిత్ర చీకటి కోణాల నుంచి, క్రోమాన్యన్ గుహల నుంచి వెలుగులకు ప్రస్థానం చేసిన జాతి.

రాత కూడా నేర్చిన రూతు చెప్పిన కథ వలె. ఎల్లయ్య పల్లవి కూడ అయిన సుభద్ర ఎదురుచూపు వలె. అంతకన్న ముందు బూదేవి అంతరంగం వలె.

చరిత్ర:
నవలలో నూరేళ్ళ చరిత్రే కావచ్చు. నూరేళ్ళ పోరాటచరిత్రే. కాని వేల ఏళ్ళ సాంస్కృతిక అణచివేత చరిత్ర. ఒక బూదేవి చరిత్ర – ఈదేశంలోకి ఈస్టిండియా కంపెనీ వచ్చి ఇంకా బ్రిటీష్‌వాడు గుంటూరుదాకా రాని ప్యూడల్ భూస్వామ్య రాజకీయార్థిక పునాదిగా, వేల సంవత్సరాల బ్రాహ్మణీయ మడికట్టిన దడి – ఎల్లయ్య పాటల్లో వెల్లడయిన చరిత్రే. ఎల్లయ్యకు గుండెదరువు నేర్పిన చంద్రయ్య చరిత్రే.

అయినా మనకు చరిత్ర ఏది? చరిత్ర నిర్మించేవాళ్ళు చరిత్రను అల్లగలరు గానీ రాయలేరు. మనకు వెనుకట పుక్కిటిపురాణం తెలుసు. ఇప్పుడు చరిత్ర రచన తెలుసు. చరిత్రను చేతులతో అల్లుతారని తెలియదు – చెప్పులకు నగిషీలు అల్లినట్లు. వస్త్రాలకు పోగులల్లినట్లు, బుట్టలు, తట్టలు అల్లినట్లు, పూలు అల్లినట్లు చరిత్రను అల్లుతారని తెలియదు. అందుకే మనం జానపదుడు అల్లేపాటను, కవి కట్టే పాటను – కవిత్వంలో, సాహిత్యంలో చేర్చలేదు. చరిత్ర రచనలోకి అల్లికచరిత్ర అక్షరబద్ధం కాకముందే అది ఎన్నిమార్లు విధ్వంసం చేయబడింది. రూతు జ్ఞాపకాలనుంచి తప్ప మనకీ వందేళ్ళ చరిత్ర అయినా మిగిలిందా?

మాలబైరాగి (ఎల్లన్న, ఆటెల్లడు, పాటెల్లడు) గొంతు, యానాది రమణయ్య డప్పుపై పుల్ల లయ, కుమ్మరి పెదకోటేశ్వరుడి రాత, కురిసే వెన్నెల. తడిసే ప్రకృతి. కలిసే పిల్లగాలి.

ఏది జరుగుతోంది యిక్కడ? ఈ దాలిగుంట వెలుతురు సాక్షిగా, ఏ సాహిత్యం? ఏ సంగీతం? ఎందుకింత అద్భుత సృష్టి? సత్యం అంటారు. శివం అంటారు. సుందరం అంటారు. ఈ త్రిత్వం ఎందుకు అంటరానిదయింది.

ఆనెమీద అద్భుత ఆకారాన్ని పొందే మట్టికుండకు ఎంత గుండెకోత. ఆ వేడికి దూరం కావాలని ఎంత ఆరాటం. తాను మట్టిగా వున్నప్పుడు, కేవలం మట్టిగానే వున్నప్పుడు ఎంత ప్రాణం దాని ప్రతి అణువులో. ఎంత గొప్ప నేస్తం కట్టేది అది పూలతో, చెట్లతో, రెల్లుగడ్డితో. అవును కదూ ఆ మట్టేకదూ ఈ పాటలు. ఆ సజీవమే కదూ ఈ గానం. అంత సహజత్వాన్ని, అంత నిండు ప్రాణాన్ని ఎందుకు బతకనీరు. శాస్త్రీయమంటూ ఎందుకింత దారుణంగా హత్యచేసారు.

ఎల్లడు అల్లినపాటలు, అల్లుకున్న పాటలు, సుభద్ర పల్లవిగా అల్లుకుంటున్న పాటలు కుమ్మరి పెదకోటేశ్వరుడు రాసాడు. ఆ పాటల్లో ఎన్నెలదిన్ని కత. నాగయ్య, మాతయ్య, నారిగాడు – వీరుల కథ. ఎన్నెలపిట్ట కథ.

కాని మనకు రూతు జ్ఞాపకాల్లో ఇన్నాళ్ళకు కళ్యాణరావు అందించింది తప్ప ఆ నూరేళ్ళ కథ కూడ మిగలలేదు.

కుమ్మరి పెదకోటేశ్వరుడిపై దాడిచేసి చంపేసారు. అగ్రవర్ణాలవాళ్ళు. అతని చేతుల్లోని రాతప్రతుల్ని తగులబెట్టారు.

నెత్తురు మడుగులో కుమ్మరి పెదకోటేశ్వరుడు. మండుతున్న మాలబైరాగి ఎల్లన్న పాటల చివ్వరి రాత ప్రతి.

ఒక అనాది సంస్కృతి మట్టి, గాలి, నిప్పు, నీరు, ఆకాశాలనుంచి ఆహారాన్వేషణ చేస్తున్న మనిషి చేతుల్లో నిర్మాణమవుతుంది. స్మృతికి, జ్ఞాపకానికి ఇంకొకరూపం రాకముందు మనుషుల్లో అది అట్లాగే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహానికి ఆనకట్టలు వచ్చి, రూపాలు మారి జ్ఞానమే కాదు, అనుభవమే కాదు, అనుభూతి కూడ ఆధిపత్య భావజాలంగా మారినపుడు వసంతం అంటరాని వసంతమవుతుంది.

నాకు తెలుసు. ‘అరుణతార’లో మొదలయిన దగ్గర్నించీ ఆ సీరియల్ చదవగానే ఒక ఆశ్చర్యం, ఒక ప్రశంస. ఏదో అలజడి. గుండె గొంతుకలోన కొట్లాడి నిలవనీని ఒక తపన తప్ప విశ్లేషణకు అందని నవల అది. ఎప్పుడు కాగితం మీద కలం పెట్టినా రాయగలిగేది అంతే. సీరియల్‌గా వచ్చినపుడు మళ్ళీ వచ్చే ‘అరుణతార’ కోసం ఎదురుచూడడం – మొదట బూదేవి, తర్వాత సుభద్ర ఎల్లన్న కోసం ఎదురుచూసినట్లు. రూతు, సువార్తలు జెస్సీ కోసం ఎదురుచూసినట్లు.

ఇపుడు రాయడానికి చదువుతున్నపుడు – విశ్లేషణ కోసమూ పుస్తకంలోని మాటల కోసమే వెతకడం. ఒక్క శీర్షికతో, ఒక్క ముందుమాటతో ఆ విశ్లేషణ రచయితయే చేసాడు. ఇది వసంతం – అంటరానిది. ఇది వసంతం – అప్పుడూ ఇప్పుడూ నిషేధమే.

చలం అన్నట్లు ఇంక అనుభవించి పలవరించడమే.

ఆశ్చర్యమేమంటే ముత్తాత నుంచి ముని మనుమని వరకు ఏడుతరాల కథ ఉంది ఇందులో. వసంతం మాత్రమే కాదు, వరద ఉంది కరువు ఉంది. నిజం చెప్పాలంటే ఆకురాలుకాలం ఎక్కువగా ఉంది – రూతు తప్ప ఎవరు మిగిలారని. ఎన్నడు ‘ఎన్‌కౌంటర్’ వార్త వినాల్సివస్తుందో తెలియని జెస్సీ. మహిళా సంఘంలో పనిచేస్తున్న రూబీ. వీళ్ళను, వీళ్ళలో ఏడు తరాలను, అటు ఏడు తరాలను, ఇటు ఏడు తరాలను జ్ఞాపకం చేసుకుంటున్న, ఊహించుకుంటున్న మరణంలేని రుతువు వంటి రూతు. అనృతంకాని రుతం లాంటి రూతు.

కాలం:
ఈ నవలలోని రెండవ అద్భుతం కాలం. గత చరిత్రను తారీఖులు, దస్తావేజుల్లో కాకుండా (ఆశ్చర్యంగా బ్రౌను వేమన గురించి చేసిన దానికన్న ఎక్కువ పరిశోధనతో కుమ్మరి కోటేశ్వరుని గురించి, మాల ఎల్లయ్య గురించి జనపదాల రక్తంలో, అస్థికల్లో దాగిన రహస్యాల వెల్లడి ఈ నవలలో ఉంది. 1920లో రూబేను రాసుకున్న డైరీలోంచి ఎన్నెన్నో పేజీలున్నాయి.) మట్టితో, మనుషులతో పరిచయం చేసిన కాలజ్ఞానం ఇందులో ఉంది.

అది నిన్న కావచ్చు. ఈరోజు కావచ్చు. కాలం ఏదైనా కావచ్చు.

ఇవ్వాళ రూతు జ్ఞాపకం చేసుకుంటున్న నిన్న. ఇవ్వాళ రూతు కలకంటున్న రేపు. వర్తమానాన్ని గతానికి, భవిష్యత్తుకు ఒక సంభాషణగా చిత్రించిన ఒక సమకాలీన నవల ఇది.

కరణాల చేతినుంచి రెడ్లకు భూమిపై అధికారం మారి, బకింగ్‌హాం కాలువ వచ్చి, క్రైస్తవ మిషనరీలు వచ్చి, క్రైస్తవంలోకి కూడ హిందూకులాలు ప్రవేశించి, ఇంగ్లీషు వచ్చి, ఇంగ్లీషు చట్టంలోకి మంచినీటికి చేప వలె బ్రాహ్మణీయ శాస్త్ర సంస్కృతం ప్రవేశించి, క్రైస్తవ మిషనరీలకు ఆస్తులు పోగుబడి, సిలువ ఒక అలంకారమై – రూబేన్ వంటివాళ్ళు జీసస్ బోధనలను కమ్యూనిజంలో వెతుక్కునే క్రమమంతా – అంతేనా – నక్సలిజం దాకా ఈ నవలలో ఉన్న – కాలం పునాది అంతా జీవితంలోనూ, పోరాటంలోనూ, ఆకురాలు కాలమంతా వసంతంలోనూ ఆవిష్కరించిన అపూర్వమైన అల్లిక ఈ నవల.

మట్టి మనుషులకు మట్టితో ఉండే సాన్నిహిత్యం వల్ల మట్టికి మనసుకు మధ్యన దూరం ఉండదు. పనికి, పాటకు మధ్య విరామం ఉండదు. జీవితానికి పోరాటానికి మధ్య కాలవిభజన ఉండదు. అందువల్ల వాళ్ళకు ఒక్కటే రుతువు. అది వసంతం. అక్కడ జననం ఎరుపే. అస్తమయం ఎరుపే. అనురాగం ఎరుపే. వియోగం ఎరుపే. ఎరుపంటే వసంతరుతు ఎరుపు. గ్రీష్మరుతు ఎరుపు. వానాకాలం కన్నీటి జ్ఞాపకాల కాంతి. చలికాలం కోతపెట్టే అనుభూతి వెచ్చదనం. శిశిరానికీ వసంతానికీ ఎడమెంత? అక్కడ జననం మరణం టాగోరు వర్ణించిన శిశువు నోట్లోని, చేతిలోని తల్లిపాలు. ఆ పాలుమాత్రం ఎక్కడివి. అది బిడ్డకోసం తల్లి ప్రాణాలుపెట్టి పాలుగా మార్చిన శ్వాస, రక్త, మాంసాలు.

జీవితం – పోరాటం – భూమిక:

నూరేళ్ళ చరిత్ర అన్నాక – వరదలుంటాయి, కరువు ఉంటుంది. ప్లేగు ఉంటుంది.

ఎన్నెలదిన్నె – కేవలం రచయిత రొమాంటిక్ కల్పనకాదు. ఊరికి దిగువన విసిరేయబడ్డ మాలపల్లి. మాదిగపల్లి. చంద్రునిలోని వరదగూడు కాస్త వరదగా మారి దానిని ముంచెత్తినపుడు ఆ దిన్నెమీద మాలమాదిగలు ఎదురీది అగ్రవర్ణాలకు ఎగువన దిబ్బమీద ఆవాసాలు ఏర్పరుచుకున్నారు.
అందుకు నారయ్య బలికావలసి వచ్చింది.

కాలం ఈ నవలలో ఎట్లా అవిభాజ్యమో, పోరాటం కూడ జీవితం వలె పరచుకొని వ్యక్తమవుతుంది. ఎక్కడా స్థలకాలాలు విడివిడిగా వ్యక్తం కాకపోవడం వల్ల ఈ నవల మనకొక కళాఖండంగా, చంద్రకళ వలెనే వ్యక్తమవుతూ ఉంటుంది.

వరద నుంచి ప్రాణాలు దక్కించుకుని తలదాచుకోవడం మాత్రమే కాదు – అందుకు దిగువన ఎన్నెలదిన్నె నుంచి ఎగువన దిబ్బకు ఎదురీదాలి. అంటరానివాళ్ళ ఎదురీత నీళ్ళకే కాదు, వరదకే కాదు – వర్ణానికి కూడ. అగ్రవర్ణానికి కూడ. అప్పుడు కాలుమోపడానికి ఎక్కడికి పరుగెత్తాలి. నేలమీదికి. మాలమాదిగలకు నేలవిడిచిన సాములేదు.

ఈ వరదఘట్టం చదువుతుంటే నాకు స్టీన్‌బెక్ ‘గ్రేప్స్ ఆఫ్ రాత్’ నవలలోని ఎడతెరపిలేని మూడురోజుల వానలో తల్లీ, బిడ్డా, తండ్రీ చేసిన నిరంతర ప్రయాణం గుర్తుకొచ్చింది. నడచి, నడచి, నడచి కొండ ఎక్కి అలసి పడిపోయినా అలసిపోని మానవత్వం గుర్తుకొచ్చింది. అక్కడ వాళ్ళను సామ్రాజ్యవాదం తరిమింది. శిథిల ద్రాక్షలు తరిమినవి. ఇక్కడ బ్రాహ్మణీయ భూస్వామ్యం తరిమింది. వసంతాన్ని ఓర్వలేని అంటరానితనం తరిమింది.

తలదాచుకోవడానికి చేసిన సాహసం నారయ్య త్యాగాన్ని కోరితే నారయ్య హత్యకు ప్రతీకారం మాతయ్య తీర్చుకున్నాడు. పెదకరణాన్ని – అతడు లొంగదీసుకున్న అతని పాలేరు సుబ్బిరెడ్డి భార్య రంగాయి చూడగా, ఆమె గుండెలు కూడ కసిదీరిన ఆనందంతో చల్లబడగా మాతయ్య నరికేసాడు.
దెయ్యాల దిబ్బగా పిలవబడే మాలాడి దిబ్బ మాలమాదిగల సేద్యానికి రావడానికి ఈ పోరాటాల, త్యాగాల చరిత్రే నేపథ్యంగా ఉన్నది.

దాదాపుగా గత శతాబ్ది ఆరంభంలో ఇంకా బకింగ్‌హాం కాలువకూడ రావడానికన్నా ముందు అప్పుడు గుంటూరుజిల్లాలో ప్యూడల్ భూస్వామ్యంలో వస్తున్న మార్పులను రచయిత ఎంత నిశితంగా పట్టుకున్నాడో చూడాలంటే ‘అంటరానివసంతం’ 10వ అధ్యాయం మొత్తం ఇక్కడ ఉటంకించాల్సిందే.
ఈనాం భూములు కరణాలు తమ భూముల్లో ఎట్లా కలిపేసుకున్నారో, మాలమాదిగల్లో కదలిక మొదలుకాగానే దయ్యాలపేరు మీదనో, భూతాల పేరుమీదనో దూరదృష్టితో తామే వాళ్ళ సేద్యానికి ఒప్పగించినట్లు ఎట్లా నటించారో ఈ అధ్యాయం చదివితే – ఒక జానపద ఏక్‌తార వసంతగానంగా కనిపించే నవలలో ఎంతలోతుగా పునాది భూమి సమస్య చర్చ ఉందో అర్థమవుతుంది-

ఈనాం భూముల అసలు భాగోతం ఎన్నెలదిన్నె జనానికి అర్థంకాని విషయం కూడ. ఎన్నెలదిన్నెలోనే కాకుండా చుట్టుపట్ల గ్రామాల్లో కూడ కరణం ఈనాం క్రింద పెద్దకరణం ఎంత సొంతం చేసుకుంది లెక్కలు చెప్పగలిగే సత్తా ఎవ్వరికీ లేదు.

ఇక్కడ కూడ కరణమో, రెడ్డో ఇచ్చిందికాదు ఆ భూమి.

అయితే వాళ్ళను పిలిచి మాలాడిదిబ్బ మీరు చేసుకోండ్రా అని పిల్లకరణం వాళ్ళకివ్వలేదు. ఎన్నెలదిన్నె చింతగుంట పొలిమేర గొడవరోజు అషామాషీగానే పిట్టోడు నాగన్న చాల విషయాలు మాట్లాడుకున్నారు. పిట్టోడిలో చిన్న అలజడి బయల్దేరింది. తన ఈడువాళ్ళతో కదిపి చూశాడు. కాస్త ఆశ కన్పించింది. మాదిగ కుర్రాళ్ళని కదిలిస్తే బాగుందిరా పిట్టోడా అన్నారు. మాదిగపల్లెల్లో కుర్రాళ్ళు సిద్ధమయ్యారు. ముసలయ్య పోలడు ముందుకొచ్చారు.

పథకం నాగన్న గీశాడు. ముందు మాలాడిదిబ్బలో చెట్లు కొట్టాలను కున్నారు. కొట్టేటప్పుడు కరణం అడిగితే, అచ్చిరెడ్డిలాంటి రైతులు అడిగితే కట్టెపుల్లలకని చెప్దామనుకున్నారు. ముందురోజు బెరుగ్గానే వెళ్ళారు. రెండు మూడు చెట్లు కొట్టి ఆగారు. ఆరోజు వెళ్ళింది అంతా కుర్రాళ్ళే. వాళ్ళతో వుంది నాగన్న ఒక్కడే. చెట్టు కొట్టకపోయినా నాగన్నతోపాటు ఎల్లన్న ఉండిపోయాడు.

రెండో రోజు కుర్రాళ్ళ సంఖ్య పెరిగింది. రెండోరోజు మధ్యాహ్నందాకా కొట్టారు. రైతులెవ్వరూ ఆ విషయం పట్టించుకున్నట్టు లేదు. మూడోరోజు సంఖ్య పెరిగింది. దాదాపు సగం దిబ్బ చెట్లూ, ముళ్ళకంపా కొట్టేసారు.

అప్పుడు ఆలోచించింది ఊరు. ఊర్లో పెద్దలు రచ్చచేసారు.

ఈ నవలలో తలదాచుకోవడానికి భూమి, దున్నుకోవడానికి భూమి, ఆ భూమికి నీళ్ళు – అంతా ఒక ప్రాసెస్ వలె – ఇట్లా తప్ప జరిగి ఉండడానికి వీల్లేనంత పోరాటచరిత్రగా కళ్ళకు కడుతుంది. తమ భూముల్లోకి నీళ్ళు మళ్ళించుకున్న ఘట్టం కూడ ఇంతకాన్న వివరంగా పన్నెండవ అధ్యాయంలో ఎంతో విశ్వసనీయంగా రూపుకడుతుంది. మొదలు నీళ్ళు దొంగతనం చేద్దామనుకుంటారు. చుక్కరాత్రి అదేపని చేస్తారు. అయినా ఆసాములు కనిపెడతారు. మాలపల్లిలో మహాపిరికిగొడ్డు చంద్రయ్యని గొడ్లకొట్లో కట్టేసి చింతబరికెలతో కొడితే వాడు అంతా చెప్పాడు.

అచ్చిరెడ్డి ఉగ్రుడైపోయాడు. మందిని మాలాడిదిబ్బ మీదికి దండెత్తించాడు. పిట్టోడ్ని, పోలడ్ని పట్టుకొన్న వాళ్ళను పట్టుకున్నట్లు కిందపడేసి కర్రల్తో కొట్టారు. పిట్టోడికి చెయ్యి విరిగింది. పోలడి నడుంమీద బలమైన దెబ్బే తగిలింది. మల్లయ్య తప్పుకున్నాడు. ముసలయ్యకి దెబ్బతగిలింది.

ఆ నెత్తుటి మధ్య సుభద్ర ఉంది. ఆ కన్నీటి మధ్య సుభద్ర ఉంది. పక్కనే ఉన్న పార తీసుకుంది. అంతాచూస్తూనే ఉన్నారు. కోక బిగదీసి గోచి పెట్టింది. అంతా గుడ్లప్పగించి చూస్తున్నారు. పవిట వోతిప్పు తిప్పి దోపుకుంది. ఎండలో మెరిసే పచ్చని బంగారం తీగలా వుంది. కళ్ళు మండుతున్న కొలిమిలా వున్నాయి. పారతీసుకొని ముందుకు కదిలింది. ఇంక అక్కడినుంచి 106, 107, 108 పేజీలు చదవాల్సిందే. మాల సుభద్ర మాలమాదిగల భూమి సేద్యాన్ని తన సాహసంతో సాధ్యం చేసింది.

భూమి ఆస్తి పరవర్గాల చేతులు మారుతున్నది. ఈ ఆస్తిపర వర్గాలు భావజాలం వల్ల, అధికారం వల్ల రాజ్యంలో కూడ భాగమవుతూ వస్తున్నారు. మొదట కరణాలు, తర్వాత రెడ్లు, ఆ తర్వాత ఈ దేశమే బ్రిటిష్ ఇండియాలో భాగమైంది కనుక మారిన కాలానికి అనుగుణంగా క్రైస్తవులయిన బ్రాహ్మణులు, రెడ్లు.
మూడో దశ భూ సంబంధాల ఘర్షణ కూడ ఈ నవలలో ఉంది. ఇంత నిశితంగా, ఇంత చారిత్రక దృక్పథంతో కల్పనలో భాగంగా భూ సంబంధాలను చిత్రించిన రచయితలు నా ఎరుకలో వట్టికోట ఆళ్వారుస్వామి తప్ప మరొకరు లేరు.

నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అమెరికన్ బాప్టిస్టు మిషన్, లోన్‌స్టార్ (ఒంటరిచుక్క) పేరుతో ముందుకొచ్చింది. అంటరానిజనం చాలమంది క్రైస్తవులయ్యారు. కొందరు పెద్దకులాల వాళ్ళు బ్రాహ్మలు, రెడ్లు కూడ అయ్యారు. వాళ్ళు తమ అంటరానితనం పోతుందని అయితే వీళ్ళు తమ ఆస్తులు కాపాడుకోవడానికయ్యారు.

ఈ పరివర్తన అంతా పద్నాలుగవ అధ్యాయంలో ఎంతో ప్రామాణికంగా వ్యక్తమవుతుంది.

ఈ నేపధ్యంలో శివయ్యను సీమోన్‌గా మార్చిన మార్టిన్ వుంటున్న వలసపాడులో కాలవకు పక్కన ఉన్న బంజరు భూమి సమస్య వచ్చింది. పాతిక ఎకరాలకు మించి ఉంటుంది. క్రైస్తవులుగా మారిన మాలమాదిగలు స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు మార్టిన్. దానిమీద చాల రాద్ధాంతమే జరిగింది. అప్పటికే ఆవులపాడు పిల్లకరణం అల్లుడు క్రైస్తవం పుచ్చుకొని యిమ్మానుయేలు శాస్త్రి అయి, ఆ భూములు ఆక్రమించుకున్న రైతుల తరపున అది బంజరు కాదని కోర్టులో దావా వేసాడు. తీరా విచారిస్తే ఆక్రమించుకున్న రైతులూ క్రైస్తవులే, కమ్మలైతేనేమి రెడ్లయితేనేమి.

క్రైస్తవ కరణం అండతో క్రైస్తవరైతులు ఆక్రమించుకున్న భూమిని కోర్టులో, ప్రభుత్వం దగ్గర పోరాడి సాధించుకోవడానికి క్రైస్తవమాల అయిన మార్టిన్ ప్రాణాలు బలిపెట్టవలసి వచ్చింది. అన్నదమ్ములే అయినా విసునూరు దొరబంట్లయిన అబ్బసలీ నుంచి తన భూమిని దక్కించుకోవడానికి బందగీ పన్నెండేళ్ళు పోరాడి ప్రాణాలు ఒడ్డినట్లు. పేదక్రైస్తవులకు దక్కినభూమి అగ్రకులాలకు మింగుడుపడలేదు. చౌదర్లు, రెడ్లు ఏకమయ్యారు. క్రిస్‌మస్ దినాల్లో డిసెంబర్ 24 రాత్రి ఇంకా క్రీస్తు పుట్టకముందే ముఖ్యమైన ఊళ్ళన్నీ తిరిగివస్తున్న మార్టిన్, సీమోన్‌లపై దాడిచేసి మార్టిన్‌ను చంపేసారు. వలసపాడు వల్లకాడు అయింది. శారమ్మ, శశిరేఖలు కూడ శవాలయ్యారు.

కరువు – ప్లేగు:
నూరేళ్ళ నవల అయినపుడు ఎంత సమగ్రమయిన జీవితం ఉండాలి. ఈ నవలలో జీవస్మరణ సంగ్రామానికి సంబంధించిన ఏ అంశమూ విస్మరణకు గురికాలేదు. ప్రకృతి ఒడిలో పెరిగినపల్లె బడిలోంచి వచ్చిన పుస్తకం కనుక ఇందులో ఈతిబాధలూ, ప్రకృతి వైపరీత్యాలూ వదలలేదు. ధాత కరువుగా తెలుగనేల మీద ఇప్పటికీ చెప్పుకునే కరువు వచ్చింది. ఒకరకంగా తమ పోరాటాల వలన మాలమాదిగలు కాస్త తలెత్తుకొని ఎన్నెలదిన్నె బతుకుతున్నకాలంలో. ఎల్లన్న ఎక్కడ పోయాడో తెలియక వెతుకుదామని రెడ్డేనాదిగుట్టకు పోయి సుభద్ర కోడలు శశిరేఖను తెచ్చుకున్న తర్వాత.
కాలం దాని రపాన అది కొట్టుకపోతోంది.

ఎక్కడో మొదలైన కరువు ఎన్నెలదిన్నెని తాకీ తాకనట్టు తాకుతోంది. గాలి కొత్తగా వీస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం సముద్రంమీద వీచేగాలిలో ఏదో మార్పు కనిపిస్తోంది. అచ్చిరెడ్డికే యిబ్బందికరంగా వుంది. కిందిరెడ్ల పరిస్థితి దిగజారుతోంది. సన్నకారు అయితే ఈ రోజుల్ని తట్టుకోలేమని భయంలోకి వెళ్ళిపోయారు.

మాలమాదిగల పరిస్థితి యిక చెప్పనవసరం లేదు.
ఆకలిచావులు ఎన్నెలదిన్నెనీ చుట్టుముట్టాయి.

ధాతకరువు దక్షిణాదిలో లక్షలాదిమందిని బలితీసుకుంది. వర్షాల్లేవు. పంటలు లేవు. నెర్రులుబారిన నేలమీద పనీపాటా లేదు. ఆకులుతిన్నారు. అలములు తిన్నారు. చింతకాయలు ప్రాణాలు నిలబెట్టలేదు. నాగజెముడు కడుపులో మంటలు రేపింది. బురదనీళ్ళు ప్రాణం పోస్తాయనే తాగారు. అయినా ఆకలిచావులు తప్పలేదు. కాళ్ళు కొట్టుకుంటూ చచ్చారు. కడుపులు బిగదీసుకొని చచ్చారు. విరోచనాలు పట్టుకొని చచ్చారు. ఎండిన డొక్కల్ని మాడ్చి మాడ్చి మరీ చచ్చారు.

దానికితోడు దూము (ప్లేగు) తోడైంది.
ఆవులపాడులో ఆరంభంలోనే చచ్చినవాళ్ళలో ఆశ్యర్యంగా అచ్చిరెడ్డి కూడ ఉన్నాడు.

ఎల్లన్న వున్న ప్రాంతంలో చావగా మిగిలిన జనం వలసలు వెళ్తున్నారు. బకింగ్‌హాం కాలవ తవ్వకం జరుగుతోందని అక్కడ కూలిదొరుకుతుందని, బతుకొచ్చని ప్రాణాలు చేతిలో పట్టుకొని దారి అడుక్కుంటూ వెళ్తున్నారు.

13వ అధ్యాయమంతా ఈ కరవు వలస. దారిలో సంపంగిపూల సమాధి, కుమ్మరి పెదకోటేశ్వరుడు, యానాది రమణయ్య గుర్తుకొచ్చినా ఆకలిపేగులు అవి చూడడానికి శ్రమతీసుకోవడానికి సిద్ధంగా లేవు. శివయ్య సంపెంగపూల సమాధి దగ్గరకి చేరాడు. అక్కడ జ్ఞాపకాలు తప్ప ఎవరూ మిగలలేదు. యానాదులు, మాలలు మాదిగలు ఎక్కడికి వలసవెళ్ళారో, దూరంగా మెరుపు. మెరుపులాంటి భ్రమ.

ఇంత కరువు, దూము సమయంలోనే రెండు అత్యంత మానవీయమైన సంఘటనలు జరిగాయి. తన ఊరికి తిరిగిపోదామని సుభద్రను కలవరిస్తూ బయల్దేరిన ఎల్లయ్య కరువు ప్రయాణంలోనే ఉన్న సుభద్ర, శివయ్య, శశిరేఖలకు ఎదురయ్యాడు. శివయ్య చస్తున్నవాళ్ళ కోసం గోతులు తవ్వుతున్నాడు. ఒకగోతి ఇద్దరి శవాలు పట్టేంత పెద్దగా తవ్వాడు. అనుకున్నాడు కూడ. ఆ ఆలోచనే ఎందుకో ఆయనకు భయంవేసింది. కలిసి మరణించడానికే అన్నట్లుగా ఎల్లయ్య, సుభధ్ర పాట పల్లవి వలె ఏకమయ్యారు శబ్దంలోనూ నిశ్శబ్దంలోనూ. తల్లిదండ్రులను శివయ్య ఆ బొందలో పూడ్చాడు.

మట్టికింద పాట, పల్లవి. మట్టిపైన వాటి ప్రతిధ్వనులు.

ఇంకా సాగుతున్న కరువుయాత్రలో గుంపులో కుర్రాడు. శివయ్యను పలకరించాడు. పక్కన ఓ పిల్లకూడ వుంది. అతడు బయ్యారం మాదిగోడు. ఆ ఆడకూతురు దార్లో తోడయింది. పడమటి పిల్లలాగుంది. అతనివలెనే ఒక్కతే మిగిలింది. కాలవ దాటి బతికుంటే కాపరం పెడ్దామనుకున్నారు. మద్దెలో ఎవరుసచ్చినా బతికినోళ్ళు గుంటలు తవ్వాలనుకున్నరు. అతనిపేరు జింకోడు, ఆ పిల్లపేరు తెలీదు. కులం తెలీదు. పిల్లకు మాటల్రావు. అంతా సైగే – ఆ మాటలంటూ జింకోడు నవ్వాడు.

ఆ పిల్లకి విరోచనాలయితే అతడు గుట్టచాటుకో చెట్టుచాటుకో తీసుపోయేవాడు. అతను వెళ్తేనే ఆ పిల్ల వెళ్ళేది. ఆ పిల్లకి అతని మీద అంత విశ్వాసం ఎట్లా కలిగిందో శివయ్యకు ఆశ్చర్యం.

తమ ఆకలికి ఊళ్ళో రెండుసార్లు దొంగతనం చేసాడు ఆ పిల్లవాడు. మూడోసారి శివయ్యను కూడ వెంటబెట్టుకొని వెళ్ళి ఒక మరణించిన ముసలివాడు సగం తిని వదిలేసిన అన్నాన్ని దొంగిలించాడు. ఆ వదిలేసిన అన్నాన్ని తీసుకొని తినడానికి లేవడానికి శక్తిచాలని ముసల్ది వీళ్ళవెంటబడ్డది. జింకోడితో వింతజంతువులా పోరాడి పడిపోయింది. కుక్కలు ఆ ముసలిదానివెంటబడ్డాయి. ఆమెను కుక్కలు చంపేసినయి.

ఆ రెండుదయ్యాల కూడును శివయ్య శశిరేఖలు తినడానికి ఇష్టపడకపోతే జింకోడు, మూగపిల్లలే తిన్నారు. దొరువులో నీళ్ళు పళ్ళెంనిండా ముంచి తాగారు.

ఆ రాత్రంతా ఆ పిల్లకు విరోచనాలు అవుతూనే వున్నాయి. శివయ్యకు ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. దాదాపు చుక్కపొద్దునాడే శివయ్య నిద్రలేసి చూస్తే జింకోడి ఏడ్పు వినిపించింది. ఆ పిల్లకేసి చూసాడు శివయ్య. శాశ్వతంగా అలుపుతీర్చుకొంటూంది.

“మీరెళ్ళండి. అనుకున్నమాట పూర్తిచేసి బతికుంటే వత్తా’’ – జింకోడు.

కరువు, ప్లేగు ప్రబలిన ప్రాంతంలో అంకురించిన ప్రేమ. ఎడారిలోని లైలామజ్నూల ప్రేమకన్నా క్రూరంగా బలియైపోయిన ప్రేమ.

స్త్రీ పాత్రలు:
ఒకరకంగా ఈ నవల బూదేవి తీర్చిదిద్దిన నవల. బూదేవి ఎర్రెంకని చెల్లెలు. ఎర్రెంకని కొడుకు ఎల్లయ్య. మేనత్త బూదేవి ముక్కుతో ఊడిపడ్డాడు. వాడికి పేరు పెట్టినదగ్గర్నించి ఆటల్తో, పాటల్తో పెంచింది. అల్లుడ్ని కాళ్ళమీద పడుకోపెట్టకొని నీళ్ళు పోస్తూ కామమ్మ కథ పాడింది. జోకొడుతూ లక్ష్మమ్మ కథ పాడింది. వాడు పాటవింటూ ఆడాడు. పాట వింటూ తిన్నాడు. పాటతోనే నిద్రపొయ్యాడు. మూలజాతుల మూలుగుల్లో పాటపుట్టిందనుకుంటే – ఆ మూలజాతి స్త్రీల దేహాలే పాటలు. అవి ఎప్పుడూ పనిలేకుండా ఉండలేనివి. పని సాగినంత సేపూ పాటే. అలసిన నిద్రలో పాటలే. పనీపాట లేనిరోజుల్లోనూ పాటలే.

బూదేవి నిండువ్యక్తిత్వం గల స్త్రీ. చెల్లెలి మీది, అభిమానంతో ఎర్రెంకడే కాదు మాలపల్లెలో ఎవ్వరూ ఆమె మాటకు ఎదురాడలేరు.

ఎర్రగొల్లలు వీధినాటకాలు వేస్తే అల్లుడ్ని ఎత్తుకొని చూపేది బూదేవి. ఎర్రగొల్లల గుడారంలోకి వెళ్ళి మాలాడు గనుక చావతన్నులు తిన్నాడు ఎల్లడు. ఆ దెబ్బలకు ఇంక ఊరినుంచి వెళ్ళిపోయాడు. ఏమయిపోయాడో తెలియని తన మేనల్లుని కొరకు ఎదురుచూస్తూ బూదేవి తిండి తినలేదు. ఆడబిడ్డను తోడుతీసుకొని తిరగాల్సిన చోటంతా తిరిగింది. ఎర్రగొల్లల గుడారాల దగ్గర ఏం జరిగిందో ఆనోటా ఈనోటా పాకి మాలపల్లెకి తెలిసింది. బూదేవి తట్టుకోలేకపోయింది. వాళ్ళ అంతుతేలుస్తానని బయల్దేరింది. ఎందుకు మీ పెద్దరికమని పెద్దల్ని నిలేసింది.

బూదేవి తెగించిందంటే ఎంతైనా చేస్తుంది.

ఈ నవలలో పాట, తెగింపు రెండూ బూదేవితోనే ప్రారంభమయ్యాయి.

ఆ పాట ఎల్లయ్యనోట ఆకాశమూ, భూమి ఆవరిస్తే ఆ పాటకు పల్లవి అయింది సుభద్ర. సౌందర్యానికి, సాహసానికి, ప్రేమకు, నిరీక్షణకు ఆమె ప్రతీక.
చుక్కల్ని ఏర్చి కూర్చి ముగ్గు కర్ర గియ్ – ఎట్లా వుంటుంది. అట్లా వుంటుంది సుభద్ర. చుక్కల ముగ్గుకర్ర. అట్లా వుంటుందని ఎల్లన్నే పాట అల్లాడు.
సుభద్ర రూపానికి ముగ్దురాలై ఆమె చిన్నపిల్లగా ఉన్నపుడు ఎవ్వరూచూడటం లేదనుకొని పాలిచ్చిన చాకలివెంకాయి అమితమైన ప్రేమ ఘట్టాన్ని చదివితే రచయితకే సుభద్రపట్ల ఎంత ప్రేమో తెలుస్తుంది.

మన మధురమైన గీతాలు విషాదమైన జ్ఞాపకాలనుంచి పుడతాయన్నట్లుగా సుభద్ర ఎల్లన్నల జీవితమంతా వియోగమే. కాస్త పనుంది వెళ్ళొస్తానన్నవాడు కరువులో కడసారి చూపులో మాత్రమే కలిసాడు. ఈ వియోగకాలమంతా సానబట్టిన సాహసంగా గడిపింది సుభద్ర.

తమ పొలాలకు నీళ్ళు దొంగతనంగా మళ్ళీంచాలని మాల మాదిగలు ప్రయత్నించినపుడు దొరికిపోయి చావుదెబ్బలు తింటే సుభద్ర ఎట్లా సాహసించిందో పైన చెప్పుకున్నాం.

సుభద్ర సాహసం సుభద్రను దేవతను చేసింది.

అయితే నిజానికి సుభద్ర దేవత కాదు. శివయ్య కోసం శ్రమించే తల్లే. ఎల్లన్నకోసం ఎదురుచూసే ఇల్లాలే. పొద్దున్నే లేస్తుంది. మాలాడిదిబ్బకేసి వెళ్తుంది. రోజంతా అక్కడ కయ్యల్లో గడ్డ కొడుతూనో, కలుపు తీస్తూనో ఏదో ఒకటి చేస్తూనే వుంటుంది.

వలసకొచ్చిన రెడ్డేనాది సినసుబ్బన్న కూతురు శశిరేఖ కోతలుకోస్తూ ఎల్లన్నపాట పాడుతూనే మనకు పరిచయమవుతుంది. ఆ పరిచయమే సుభద్రకు కోడలవుతుంది. ఒక పాట సంప్రదాయం ఇట్లా బూదేవి నుంచి శశిరేఖ దాకా కొనసాగుతూనే ఉంటుంది.

శశిరేఖ జీవితం కరువులోంచి క్రైస్తవంలోకి మారింది. ఎల్లన్న నేర్పిన పాటలు, సుభద్ర నేర్పిన జీవితం ఆమె ఆపూర్వంగా ఆఖరిశ్వాసదాకా కాపాడుకున్నది.
మాలాడిదిబ్బ వీరగాథ పూర్తిగా పాడగల వ్యక్తి అన్వేషణ శశిరేఖ, సిమోన్‌ల కొడుకు రూబేన్‌ను హనుమకొండకు చేర్చింది. అక్కడ జీవితం అనుకోని మలుపే తిరిగింది. తాత రాసిన వీరగాథ వినడమే కాదు తనతోడు రూతును కూడ అక్కడే పొందగలిగాడు.

రూతు ఫ్రాన్సిస్ కూతురు. తాను కథలు రాస్తుంది. రూబేన్ తన తాత పాటలు అల్లేవాడని చెప్తే తన అమ్మమ్మ కథలు అల్లుతుందని గుర్తుచేసుకుంటుంది. రాయటానికి అల్లటానికి వున్న తేడా వూహించింది రూతు. అల్లటమే గొప్ప అని గ్రహించింది.

రూతు పెరిగిన క్రమశిక్షణలో ఆమె తలిదండ్రుల చాటుబిడ్డగా, అమ్మమ్మ కథల అల్లికలోనే. తనకు ఫలానా ఇష్టమంటూ ప్రారంభం కాలేదు. కాని రూబేన్‌తో వివాహం ఆమెకొక జీవితాన్ని ఇచ్చింది. ఆ జీవితకాలం చాలా స్వల్పం. జ్ఞాపకం – ఆమె జ్ఞాపకాలే ఈ నవలంతా.

రూతు పెళ్ళయ్యాకే నర్సు ట్రైనింగు చేసింది. మిషన్ ఆస్పత్రిలోనే నర్సుగా చేరింది. రూబేన్ మిషన్ ఆస్పత్రి బోధకుడుగా, తాను నర్సుగా ఆ ప్రదేశంతో గొప్ప అనుబంధాన్నే పెంచుకున్నారు.

అయినా సరే ఎన్నెలదిన్నె తన సొంతమనుకొని, ఎండల్లోనైనా అక్కడ గడపగలిగితే చాలునని అక్కడ పడిపోయిన గోడలు లేపి ఇల్లు కట్టారు. ఎండల్లో ఒక్కర్తే వెళ్ళి అక్కడే ఇమ్మాన్యేలును కన్నది.

రూతు వ్యక్తివికాసంలోంచి ఆలోచనలు మూలాల్లోకి వెళ్ళినవి.

సినసుబ్బి తర్వాత లచ్చిమి. లచ్చిమి తర్వాత లింగాలు. లింగాలు తర్వాత సుభద్ర. సుభద్ర తర్వాత శశిరేఖ. శశిరేఖ తర్వాత రూతు. రూతు తర్వాత మేరీ. మేరీ తర్వాత రూబీ.

తరం ఏదైనా కావచ్చు. జీవితం ఎవరిదైనా కావచ్చు. తాకకుండా పోలేదు. అంటరానితనం కాటెయ్యకుండా పోలేదు. వీళ్ళు మామూలు మనుషులు కావచ్చు. కవులు కావచ్చు. కళాకారులు కావచ్చు… కాస్తో కూస్తో మడిచెక్కకు ఆసాములు కావచ్చు. కాని-
అంటరానితనం. అది అతక్కుండా మాత్రం వుండదు.

రూతు అట్టా ఆలోచిస్తుంది.

రూతు కొడుకు ఇమ్మానుయేలు మేరీ సువార్తను ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాడు. మేరీ సువార్త రూతు పెదనాన్న కొడుకు కూతురు. ఇమ్మానుయేలు గురించి అంతా తెలిసే ఆమె చేసుకుంది.

రూతు క్రైస్తవం నుంచి, ఎన్నెలదిన్నె నుంచి, తెలంగాణ రైతాంగపోరాటం నుంచి, తన కొడుకు ఇమ్మానుయేలు నక్సలైటు అయిన శ్రీకాకుళం దాకా సాక్షీభూతంగా మారింది. తన భర్త రూబేన్ క్రైస్తవుడయినా కొడుకు ఇమ్మానుయేలు అమరత్వంతో తామిద్దరూ హృదయంలోనే కామ్రేడ్ ఇమ్మానుయేలుకు జోహార్లు అని చెప్పుకున్నారు. మనుమడు జెస్సీ కూడ రహస్యజీవితానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేముందే మేనత్తకూతురు రూబీ తలిదండ్రుల్ని ఎదురించి అతని సాహచర్యాన్ని ఎంచుకున్నది. మహిళాసంఘంలో పనిచేస్తూ బయటనే వున్నది.

ఇట్లా ఈ నవలంతా పురుషపాత్రలు ఎట్లా ‘ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పరుగుతీసిన ఎల్లన్న మొదలు ప్రజలకోసం సాయుధమైన జెస్సీ దాకా’ వ్యక్తిత్వవికాసాలో, అట్లాగే స్త్రీ పాత్రలు కూడ “మడవ మీద కాలుపెట్టి పార పైకెత్తిన సుభద్ర మొదలు నీళ్ళలో చేపలా జనంలో కలిసిపోయిన రూబీ” దాకా ఒక యుద్ధంలో, ఒక సుదీర్ఘ పోరాటంలో వికసించిన వ్యక్తిత్వాలు.

ఈ వ్యక్తిత్వ వికాసమంతా వ్యక్తిగా, రచయితగా రూతులో పలికింది.

అంటరానితనం – ఆత్మగౌరవం:

ఈ నవలలో ఉత్పత్తిసంబంధాల్లో, పునాది ఉపరితలాల్లో ఉన్న ఘర్షణంతా ఆత్మగౌరవం గల ఉత్పత్తిశక్తులు – అంటరానివారుగా చూపబడిన ఈ దేశచరిత్ర చిత్రణే. వసంతం ఆత్మగౌరవానికి ప్రతీక అయితే – ఆత్మగౌరవం గల దళితుల సమస్త శక్తులకు ప్రతీక అయితే అంటరానితనం – ఈ చరిత్రలోని ఒక క్రూరవాస్తవం.

ఎల్లయ్య ఎర్రగొల్లల గుడారంలోకి వెళ్ళి పారిపోయిన దగ్గర్నించి – చివరన రూతు జ్ఞాపకాల్లో – ఎన్ని చిన్నచిన్న మార్పులు వచ్చినా అతుక్కుని తొలగని అంటరానితనం గురించిన ప్రస్తావన – ఒక ఆవేదనగా, ఒక ఆగ్రహంగా కొనసాగుతూనే ఉంటుంది.

ఎన్నెల యిసుకదిబ్బల మీద భాగోతం జుట్టుకట్టి చెంచులక్ష్మి నాటకం ఆడినప్పుడు మాలపల్లిలో నాటకం ఆడిందానికన్న నాటకానికన్న ముందు పెదమాల, పెదమాదిగ వచ్చారా అని ప్రారంభించడం ఆత్మగౌరవ వ్యక్తీకరణ అయింది. అగ్రకులాలకు అదే కన్నెర్ర అయింది. ఈ నాటక ప్రదర్శనే ఆ గ్రామంలో భూసంబంధాల ఘర్షణకు బీజం వేసింది.

వాళ్ళ ఊళ్ళో గికియు భాషలో – ఆ గ్రామీణప్రజలే పాత్రలుగా పొలాలే రంగస్థలంగా గూగీ ఆడించిన నాటకాలు కెన్యాలో తెచ్చిన సంచలనం, అదే కాలంలో (1978-80) సిరిసిల్లాలో లక్ష్మీరాజం దొరల గడీలముందు కాకుండా దళితవాడల్లో ఆడించిన బతుకమ్మ ఆట – ఒక సాంస్కృతిక వ్యక్తీకరణ ధిక్కారంగా ఎట్లా పునాదిని ప్రభావితం చేసిందో ఒక వందసంవత్సరాల ముందు చరిత్ర నుంచి కళ్ళకు కట్టాడు రచయిత.

ఎల్లన్న తాను పాడాడు. పాట పాడడానికి యిప్పటిదాకా ఆనందమే ఆత్మసంతృప్తే కారణం. దానికి ప్రేరణ ఎక్కడుంది. ఎక్కడో ఉంది. ఆ అన్వేషణే ఇదంతా. చెట్టు, పుట్ట, కాకి, కోయిల, కన్నీళ్ళు, పన్నీళ్ళు, ఆకలి, చేను, చెలక… మళ్ళీ అనుకుంటే… ఆకలి, చేను, చెలక… యింకా… యింకా చేను, చెలక, ఆకలి, ఆత్మగౌరవం… అక్కడే ఆగింది. అంతా అక్కడే ఆగింది. యిక్కడి గట్టు అక్కడ పడాలి… అక్కడ పడాలి… అచ్చిరెడ్డి చేలదగ్గర. సరిగ్గా అక్కడ, నిజంగానే. అక్కడే, అక్కడే పడాలి… పెద్దల్ని, పెద్దమాలని, మాదిగపెద్దని, కరణానికన్న మిన్నగా, అచ్చిరెడ్డి కుళ్ళుకు చచ్చేలా పిలవాలి. పిలిచితీరాలి. అట్టా పిలవనప్పుడు, పిలువలేనప్పుడు ఆట, మాట, పాట… అన్నీ ప్రశ్నలే.

నిజానికి బయానా తీసుకున్న నాటకం ఆడడం కుదరలేదు గానీ యిక్కడి గట్టు అక్కడ పడే భూపోరాట సాహసం ఆ అంటరానివాళ్ళు చేసారు. సాధించుకున్నారు.

కుమ్మరి కోటేశుని హత్యచేసి ఎల్లన్న పాట రాతప్రతుల్ని తగులబెట్టిన ఘట్టం, కరువుయాత్రలో బకింగ్‌హాం కాలువ పనికి శివయ్య, శశిరేఖలకు అంటరానితనం అడ్డొచ్చిన ఘట్టం అన్నీ ఆత్మగౌరవంకోసం చేసిన పోరాటంలో పడిన దెబ్బలే.

అక్కడ ఆత్మగౌరవాన్ని నిలుపుతానని ప్రవేశించింది సిలువ.

కాని ఇక్కడ సిలువ కూడ నాగలి అయి అంటరానివాని భుజాలకెక్కింది. ఆ నాగలి మోసి, ఆ నాగలితో దున్నే అంటరానివాడు పోరాటంలో బలియైన తన శరీరాన్ని తానే సిలువవలె మోసుకునే వివక్షకు గురయ్యాడు.

అంటరానితనం పోవాలని ఆత్మగౌరవంకోసం క్రైస్తవుల్లో చేరిన మాలమాదిగలపై గ్రామాల్లో, ముఖ్యంగా ఈ నవలలో గుంటూరుజిల్లా అంతటా అగ్రకులాలు దాడులు చేసాయి. బ్రిటీష్ ఇండియాలో క్రైస్తవం పాలకమతం కూడ అయింది కనుక అగ్రవర్ణాలు కూడ క్రైస్తవులయ్యారు. హిందూమతంలోని అంటరానితనమే కాదు, హిందూ భూస్వామ్య వ్యవస్థలోని భూసంబంధ ఘర్షణలు కూడ ఈ మార్పులవల్ల యధాతథంగా కొనసాగాయి. మార్టిన్ హత్యలో, వలసపాడు విధ్వసంలో ఈ దృష్టాంతాలన్నీ మనం చూసాం.

ఆవులపాడు చెరువులో దళితులు నీళ్ళు తెచ్చుకునే సందర్భంగానీ, దేవాలయ ప్రవేశ ప్రయత్నం గానీ – భూమి, రంగస్థలం, దేవాలయం, చెరువు – ఏ స్థలంగానీ, ఏ సందర్భం గానీ అంటరానివాడు తల ఎత్తడానికి చేసే ఒక ప్రయత్నం – ఒక నిరంతర ఆత్మగౌరవ పోరాటం. ఆ పోరాటం ముగిసిందని కాదు. బకింగ్‌హాం కాలువ తవ్వకంలో క్రైస్తవం దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది. వందిళ్ళ మాలపల్లిలో చెరువునీళ్ళ కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆ ప్రయత్నం జరిగింది. ఆ చెరువులో నీళ్ళు మాలాళ్ళు ముంచుకోరాదన్నది మాత్రం 1947కు ముందూ ఉన్న స్థితే. 1947 తర్వాతా ఉన్న స్థితే.

పునాది – ఉపరితలం:
ఆర్థిక సంబంధాలు పునాది అయితే అవి ప్రభావితం చేసే రాజకీయాలు, సామాజిక అంశాలు, సంస్కృతి, కళలు – అన్నీ ఉపరితలాలని మార్క్సిజం చెప్తుంది. ఈ పునాది ఉపరితలాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటాయనీ, పునాదియే భూమిక అయినప్పటికీ ఉపరితల ప్రభావం ఒక్కొక్కసారి చాలా ప్రధానం కూడ అవుతుందని చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం నిరూపించింది. నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల ప్రేరణతో ఆవిర్భవించిన విప్లవరచయితల సంఘంలో ఈ పునాది ఉపరితలాల మేలుకలయికను ఇంత కళాత్మకంగా చిత్రించిన నవల మరొకటి లేదు. బహుశా పనికీ, పాటకూ, భూమికీ – బాగోతానికీ, వీథికీ, నాటకానికీ, శ్రమకూ సంగీతానికీ ఉన్న అవినాభవ సంబంధాన్ని ఇంత అపూర్వంగా చిత్రించిన నవల విప్లవసాహిత్యంలోనే కాదు మొత్తం తెలుగు సాహిత్యంలోనే ఉన్నదేమో నాకు తెలియదు.

జానపద సంస్కృతి, జానపద కళలు –
మూలజాతుల ఆహారాన్వేషణ నుంచి, భూపోరాటం నుంచి, ఆత్మగౌరవ పోరాటం నుంచి, ప్రకృతితో నెరపే స్నేహం నుంచి, పని నుంచి, పనిలోని విరామం నుంచి, అలసట నుంచి, చెమట నుంచి, ఒక్కొక్కసారి నెత్తురుగానే చిందకతప్పని నెత్తురునుంచి – ఎట్లా ఆట, మాట, పాటలుగా రూపొందుతాయో – ఈ నవలలో కళ్యాణరావు పాత్రలద్వారా, సందర్భాల ద్వారా, కథ ద్వారా చెప్పవలసినంత, చెప్పగలిగినంత చెప్పి కూడ తృప్తి పడక తాను ప్రవేశించి కూడ చెప్పాడు. ఈ చెప్పే క్రమంలో కాలాన్ని విభజించకుండా వర్తమానంలో నిలబడి గతంలోకి, భవిష్యత్తులోకి నిష్కర్షగా వస్తూ పోతూ ఒక అవిశ్రాంత ప్రయాణం చేసాడు. చేస్తూనే ఉన్నాడు.

గూగీ రాసిన ‘రివర్ బిట్విన్’ నవల చదివి నదికి ఈవల తెల్లవాళ్ళు, ఆవల నల్లవాళ్ళు – ఆఫ్రికాలో మరి ఈ దేశంలో నా స్థానం ఎక్కడ – ఇది కేవలం ఈ గట్టు.. ఆ గట్టు ప్రశ్న కాదు. ఏ గట్టుమీదనైనా వెలివేసిన వెన్నెల ప్రశ్న.

ఉత్పత్తి మూలాలు వెతికినట్లే మెరుపులనృత్యం మొదలు, పాట, నాటకం సమస్తకళల మూలాలు జానపదుల్లో ప్రామాణికంగా అన్వేషించి ఒక కల్పనాసాహిత్యంలో కథలో ఒదిగేట్లు రాయడమనేది గొప్ప శిల్పం. అంటే మళ్ళా కళ్యాణరావుకు కోపం తెప్పించే శిష్టులు పేర్కొనే శిల్పం కాదు. అల్లిక, పాటలోని అల్లికను, కథలోని అల్లికను కళ్యాణరావు గూగీ ‘మాటిగరీ’ నవలలో ఒక వీరగాథను orature (మౌఖికసాహిత్యం)గా చెప్పినట్లు ఈ నవలను అల్లారు. అంటరానివసంతాన్ని ఎవరన్నా భయపడి తుడుచుకుందామన్నా, కడుక్కుందామన్నా తొలగనంత గాఢంగా చల్లారు.

రచయిత్రి అయిన రూతు – అంటే ఎల్లయ్య అల్లికసాహిత్యం నుంచి రూతు లిఖిత సాహిత్యం దాకా జరిగిన పరిణామంలో కూడ కళ్యాణరావు – రాతమీద ఆధారపడలేదు. ఎంత కాన్షస్‌గా ఉన్నాడంటే – చాల పెద్ద అక్షరాల్లో మొదటగా మీకు రూతును పరిచయం చేస్తాను. తర్వాత కథలోకి వెళ్తాను. అంటూ యిప్పుడు పరిచయం చేస్తోంది రచయిత్రి రూతుని, ఆమె రచనల్ని కాదు, కేవలం రూతును, నాకు తెలిసిన రూతుని… అని

ఇక నవలంతా ఆమె జ్ఞాపకాలు.

మొత్తం నవలలో లిఖిత రూపంలో ఉన్నవి రూబేన్ డైరీలోని కొన్ని పేజీలు. ఆఖర్న రూతు జెస్సీకి రాసిన లేఖ. అది కూడ పొన్నంగి పిట్టకు ఎన్నెలపిట్ట ఆకాశంలో గాలివేళ్ళతో రాసిన చెరిగిపోని కలల పాట.

పారిశ్రామిక విప్లవ కాలపు క్లాసిక్‌గా వచ్చిన నవలను, తాను స్వయంగా లిఖితరూపంలో రాసిన నవలను ఒక చరిత్ర అంటే ఒక వీరగాథ ఒక జ్ఞాపకం, ఒక స్మృతి… ముఖ్యంగా అగ్రవర్ణాలు ధ్వంసం చేసిన, చేయాలనిచూసిన – ఒక ప్రాచీనమైన అద్భుతమైన కళాసంపద, ఇవ్వాళ ఉద్ధేశపూర్వకంగా విస్మృతపథంలో తొక్కేయాలని చూస్తున్న జనపదాల కదలికగా ఒక మౌఖికరూపంలో చెప్తునట్లే రాయడం నిజంగా ఒక అల్లికనేర్పు.

వర్గరహిత సమాజంలో వ్యక్తీకరణ ఉన్నతీకరింపబడిన ఆవేశ ఉద్వేగాలుగా ఉంటుందని, అందుకే ఆదివాసీ సమాజంలో వాళ్ళ సంభాషణ, ఆట పాటలు అన్నీ కవిత్వంగా కళలుగా అబ్బురపరుస్తాయని అంటారు. ఏ మాండలికమూ కాకుండా, ఏ ప్రాంతీయమూ కాకుండా ఈ నవలలోని భాషలో, శైలిలో అటువంటి ఉన్నతీకరింపబడిన ఆవేశోద్వేగాలు ఒక ప్రవాహం వలె తోసుకొస్తాయి. అందుకే కొందరికీ నవల కవిత్వభాష వలె కనిపించింది.

ఇంత గొప్ప జానపద కళాసంపదను పోరాటాలలో భాగంగా చూసిన వందేళ్ళ చరిత్ర చాలా సహజంగా తెలంగాణా రైతాంగపోరాటంలోకి, శ్రీకాకుళ పోరాటంలోకి, ఈ సహస్రాబ్ది అంతాన తెలంగాణ వీరుల త్యాగాల్లోకి ఎట్లా గుణాత్మకంగా ఉరుకులు పరుగులుగా ప్రవేశించిందో కూడ అంతే ఉరుకులు పరుగులుగా నవల చివరి అధ్యాయాల్లో కళ్యాణరావుగారు చిత్రించారు.

అంటరానితనం – కమ్యూనిజం:
వేల సంవత్సరాలుగా బ్రాహ్మణీయభావజాలం దళితులను అస్పృశ్యులుగా చూస్తున్నది. వసంతంపట్ల అంటరానితనాన్ని పాటిస్తున్నది. ఈ భావజాలాన్ని ప్రతిఘటిస్తూ దళిత, బహుజనులు కూడ వేలసంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. పోరాటకళల్ని సృష్టిస్తున్నారు. నిజానికి ఆహారాన్వేషణ, ఉత్పత్తి, పోరాటం వాళ్ళకు మాత్రమే తెలిసినట్లు కళాసృష్టి కూడ వాళ్ళకే తెలుసు. ఒక జాతి సంస్కృతి అంటే శ్రమలో పాల్గొంటున్న జాతికి మాత్రమే సంస్కృతి వుంటుంది. ఈ నేపధ్యంలో 1870 ప్రాంతాల నుంచి కోస్తా, రాయలసీమల్లో దళితుల పోరాటాలను, సాహిత్య సాంస్కృతిక సంపదలను తన నవలలో తరగని గనినుంచి తవ్వి సంచయం చేసాడు కళ్యాణరావు.

ఇది చరిత్ర కాబట్టి సహజంగానే 1920లలో కమ్యూనిస్టు ఉద్యమం కూడ వీళ్ళ జీవితాల్లోకి ప్రవేశించింది. నవలలో కమ్యూనిస్టు పాత్ర రామానుజం. రామానుజం ఇమ్మాన్యుయేలుతో పాటు స్కూల్లో పనిచేస్తున్నాడు. గాంధీగారి హరిజన ఉద్యమాన్ని, దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని కమ్యూనిస్టుల అవగాహనతో విశ్లేషించి, దాని పరిమితులను, వర్గసామరస్యాన్ని ప్రజల దృష్టికి తెచ్చినవాడు రామానుజం.

చెరువులో మంచినీళ్ళ కోసం ప్రవేశాన్ని కమ్యూనిస్టుల నాయకత్వంలో సంఘటితం చేసినవాడు రామానుజం. ఆయనకింకా ఎందరో యువకులు తోడయ్యారు. రామిరెడ్డి వంటి విద్యావంతులు కూడ తోడయ్యారు.

కథలో భాగంగా హనుమకొండ రూతు రూబేన్ భార్య కావడం వల్ల తెలంగాణాతో పరిచయం ఏర్పడింది. ఆవులపాడులో చెరువులో ప్రవేశంనాటికి పాలకుర్తి అయిలమ్మ తమ పొలం కాపాడుకోవడానికి చేసిన పోరాటం గురించి వాళ్ళు విని ఉన్నారు.

పదహారో అధ్యాయం నుంచి ఆవులపాడులో, పరిసరాల్లో జరిగిన అన్ని సంఘటనలపై తెలంగాణా రైతాంగ పోరాట ప్రభావం ఉన్నది.

1947కు ముందే కమ్యూనిస్టులు ఆ ఊళ్ళో అడుగుపెట్టారు. పార్టీమీద నిషేధం పెట్టినపుడు ఆ పల్లె అగ్రనాయకులకు ఆశ్రయంగా ఉండేది. పార్టీ మాలపల్లెలోనే కాదు చాకలిపాలెంలో కూడ ఉండేది. రెడ్లలో సన్నకారురైతుల్లో కూడ ఉండేది. రూతుకు కమ్యూనిస్టు పదం ఎప్పుడూ దూరంగా లేదు. దగ్గరిపదంలా వుంటుంది.

తెలంగాణాలో దొడ్డికొమురయ్య మరణాన్ని గుర్తుచేసుకుంటూ కోస్తాలో ఆవులపాడులో సభ జరిగింది. అది మాలపల్లి మధ్యలో జరిగింది. సభలో రామిరెడ్డి మాట్లాడాడు. మాలపల్లి నుంచి, చాకలిపాలెం నుంచి జనం వచ్చారు. రామిరెడ్డి తాలూకు రెడ్లు వచ్చారు. అంతా కలిసే కూర్చున్నారు. ముఖ్యమైన మనుషులకి రాత్రి భోజనాలు అక్కడే జరిగాయి. భోజనాలయ్యాక చెర్లో మాలోళ్ళు నీళ్ళు ముంచడం చర్చకొచ్చింది. చెర్లో నీళ్ళు ముంచటం కోసం చాల నెలలు, దాదాపు ఓ సంవత్సరం ఎదురుచూడాల్సి వచ్చింది. కాని ఆ సంవత్సరకాలం వుట్టినే పోలేదు. అనేక చెదురుమదురు సంఘటనలు జరిగినా మాలపల్లెలో గొప్ప ఆత్మస్థయిర్యాన్ని అవి పెంచుతూనే వచ్చాయి. పల్లెల్లో కుర్రాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవటం మొదలుపెట్టారు. చదవటం రాయటం నేర్చుకున్నారు. ప్రతిరోజూ పనుల నుండి వచ్చాక రాత్రి కూళ్ళు తిని పల్లెమధ్యకు చేరేవాళ్ళు. వెన్నెల రోజులైతే గొప్ప సందడిగా వుండేది. కోలాటం ఆడేవాళ్ళు. కొత్త పాటలు నేర్చుకున్నారు. జానపద బాణీల్లో ప్రజాపాటలు మొదలయ్యాయి.

చింతల్ల చెలరేగే, చింతల్ల చెలరేగే
చింతల్లు మనకేల, చింతల్లు మనకేల
సుత్తి కొడవలి వచ్చె సాగవోయి కూలీ

అంతా కొత్తపాట. నాట్ల పాటలు మారాయి. కోతల పాటలు మారాయి. అంతా కొత్త.

నరసిమ్మ, సినసుబ్బరాయుడు పెత్తందార్లతో కమ్యూనిస్టులుగా పోరాడారు. వాళ్ళవెనుక ఊళ్ళో కుర్రవాళ్ళంతా ఉన్నారు. చేన్లమీద, చెలకల మీద, భూమి మీద పోరాటం చేస్తూ, ఆత్మగౌరవ పోరాటం చేస్తూ కర్రసాము నేర్చుకున్నారు. ముఖ్యంగా మాలపల్లిని పార్టీకి గుండెకాయగా చేసారు.

దొంగ గడ్డి కోస్తుంటే పల్లెలో ఆడాళ్ళను పట్టుకొని చౌదరి యాతం దగ్గర కట్టేసారనే వార్త పల్లెలో గుప్పుమంది. పల్లెపల్లె కదిలింది. ఆడాళ్ళను తీసుకొని పల్లెజనం పల్లెకొచ్చారు. వెంకటచౌదరి టౌన్లో పోలీసుస్టేషన్‌కెళ్ళాడు – ఆవులపాడు జీవనం మరో మలుపు తిరుగుతోంది. స్టేషన్‌కెళ్ళటం వాళ్ళ తొలి ఓటమి అన్నాడు రామానుజం.

ఇంక చెర్లోకి దళితులు దిగిన ఘట్టం ఒక అనుభవం, ఒక ఉద్వేగం.
దొరల అణచివేతనుంచి పోలీసుల దాడులలోకి గ్రామీణసంబంధాలు మారాయి.
అటు తెలంగాణాలో పోలీసుయాక్షన్ పేరుతో నాలుగువేలమంది కమ్యూనిస్టులను కాల్చివేసారు. అది తెలంగాణాకే పరిమితం కాలేదు. కోస్తా జిల్లాల దాకా ఆ దాడులు సాగాయి.

పదిహేడవ అధ్యాయానికే రామానుజంతో పాటు ఇమ్మానుయేలు నిన్నటి కమ్యూనిస్టే కాదు ఇవ్వాల్టి నక్సలైట్లు కూడ అయ్యారు. సినసుబ్బరాయుడు ఇమానుయేలును సానా మంచోడు, నక్సలైట్ అన్నాడు.

రామానుజం శ్రీకాకుళం వెళ్ళాడు. కోస్తా ప్రాంతం నుండి యువకులు, మేధావులు, విద్యార్థులు శ్రీకాకుళం వెళ్ళారు.

206, 207 పేజీలు యధాతథంగా తప్పక చదవాలి – నక్సల్బరీ పోరాటం – అదో నిప్పురవ్వ. వీచిన పోరాటగాలి. ‘భూమితో మాట్లాడు. అది జ్ఞానాన్ని ఇస్తుంది’ – అని చాలసార్లు చదువుకున్న వాక్యాన్ని కొత్త అర్థంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది రూతు. ‘అట్టా పడివుంటుంది ఇమ్మానుయేలు అడుగు శ్రీకాకుళం వేపు’.

ఇమ్మానుయేలు జైలుకెళ్ళాడు. పోరాటంలో అమరుడయ్యాడు. వేలగొంతులు వేలహస్తాలు. రెపరెప జెండాలు. జెస్సీ చేతిలో జెండా. రూబీ చేతిలో జెండా. రూబేన్ రూతుల గుండెల్లో కూడ జెండా.

వసంతమేఘ గర్జన:
ఇమ్మానుయేలు కొడుకు జెస్సీ సాయుధపోరాటంలోకి పోయాడు. అతడు ప్రేమించిన మేనత్తకూతురు రూబీ ఆ రాజకీయాలకే అంకితమై తల్లిదండ్రుల నెదురించి అతని సహచర్యాన్ని ఎంచుకున్నది. బయట ఉండి మహిళా సంఘంలో పనిచేస్తున్నది.

‘వసంతమేఘ గర్జన’ గా కోట్లాదిమందిని ఉత్తేజపరచిన నక్సల్బరీ పోరాటం తర్వాత ఏర్పడిన సిపిఐఎంఎల్ పార్టీ తన మానిఫెస్టోలో ఈ వ్యవస్థను అర్థవలస అర్థభూస్వామ్య దళారీ నిరంకుశపాలనగా విశ్లేషిస్తూ – స్వాతంత్య్రం వచ్చిందని చెప్తున్న ఇరవై ఏళ్ళ తర్వాత కూడ ఈ దేశంలో అంటరానితనం ఉన్నదన్న ఒక అంశం చాలు ఇది అర్థభూస్వామ్యం అనడానికి అని పేర్కొన్నది.

కళ్యాణరావు తన నవలను సహస్రాబ్ది అంచున కూర్చొని రూతు విన్న ఈ శతాబ్ది చివ్వరి రోజుల్లో వీరుల త్యాగాల్ని, క్రూరుల దుర్మార్గాన్ని తలచుకున్న లేఖతో ముగించారు. అంటరాని వసంతం వసంత మేఘ గర్జనయింది.

అమ్మనాన్నలు రక్తమాంసాలతో శ్వాసతో ఇచ్చిన పుట్టుక, అనుభవం, అంటరానితనం వాళ్ళతో పాటు పోరాట చైతన్యాన్ని, ప్రాపంచిక దృక్పథాన్ని ఇచ్చిన శ్యాం మహేశ్ మురళి లక్ష్మిరాజంలకు అంకితమైంది. వాళ్ళకు అంకితమైన చోట అంటరానితనం లేదు.

అది ప్రేమతో కూడిన వసంతం.

————-

జి. కళ్యాణరావు నవల ‘అంటరాని వసంతం’ పరిచయం, 2001

(భూమితో మాట్లాడు… “కల్పనా సాహిత్యం – వస్తు వివేచన” లోంచి… )

జననం: వరంగల్లు జిల్లా లోని చిన్నపెండ్యాల. ఉద్యోగరీత్యా వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు కార్యదర్శిగా పనిచేశాడు. 1983లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా, 1993 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. రచనలు: చలినెగళ్లు (1968), జీవనది (1970), ఊరేగింపు (1973), స్వేచ్ఛ (1977), స్వేచ్ఛ (1977), భవిష్యత్ చిత్రపటం (1986), ముక్త కంఠం (1990), ఆ రోజులు (1998), ఉన్నదేదో ఉన్నట్లు (2000), ఉన్నదేదో ఉన్నట్లు (2000), బాగ్దాద్ చంద్రవంక (మార్చి 2003), మౌనం యుద్ధ నేరం (ఏప్రిల్ 2003).

Leave a Reply