భీమా నది అల్లకల్లోల అంతరంగం

ఇది భీమాకోరేగావ్‌ గుండెఘోష. రక్తసిక్తమైన భీమా నది గుండెలయ. రెండు వందల ఏళ్ల కింద ఎగసిన యుద్ధభూమి చరిత. ఎన్నెన్ని శిశిరాలు దాటినా వసంతాన్ని కలగనే వీరగాధ. దేశమే జైలైనపుడు ‘ముక్తకంఠం’తో నినదించే స్వేచ్ఛాగీతిక. ఆధిపత్యంపై తమ దేహాల్నే ఆయుధంగా ఎక్కుపెట్టి నేలకొరిగిన యుద్ధవీరుల పాదముద్రల అన్వేషణ. వాళ్ల అమరత్వ జాడల్లో జయకేతనమై ఎగసిన లక్షలాది మూలవాసీల పోరుకేక. కవి మిత్రుడు శ్రీరామ్‌ రాసిన దీర్ఘకవిత ‘1818’. ఇదొక అన్వేషణ. చరిత్ర పునాదుల్లో నెత్తురూ కన్నీళ్లింకిన మూలవాసుల ఆర్తనాదాల అన్వేషణ. ఇది రక్తసిక్త గాయాల్లోంచి పెల్లుబికిన భీమా నది అల్లకల్లోల అంతరంగం. దేశ విముక్తి కోసం గొంతెత్తిన వేలాది స్వేచ్ఛాగీతికల జయకేతనం. ఈ కవితా పాదాలు హోరెత్తుతున్నాయి. చరిత్రలోంచి వర్తమానంలోకి. వర్తమాన పోరాటాల్లోకి. విముక్తి దారుల్లోకి. ఒక్కో వాక్యమూ నెగడై మండుతోంది. కొలిమై రాజుకుంటోంది.

‘‘నేను భీమా నదిని మాట్లాడుతున్నాను
చరిత్ర కన్నుల్లోంచి
దు:ఖపు చెమ్మనై చిప్పిల్లుతున్నాను
మూగబోయిన అలల తీగలపై
పురిటి బిడ్డల తొలి ఏడుపునై (శ్రీరామ్‌ పుప్పాల, 1818; 2022, పు.9)
పెల్లుబికుతున్నాను…’’ అంటూ చరిత్రను తవ్వుతున్నాడు. నెత్తుటితో తడిసిన మట్టిని దోసిళ్లకెత్తుకున్నాడు. చరిత్ర కన్నుల్లో మలగని దీపాలను వెతుకుతున్నాడు. చెకుముకిరాయై ఆరిన దీపాలను అంటించే మూలవాసుల గుండె లయల్ని వింటున్నాడు. ఇది పురిటి బిడ్డల తొలి ఏడుపు. అడవి మాదన్నందుకు తలలు తెగిపడుతున్న ఆదివాసీ ఆఖరి ఏడుపు. ఈ దీర్ఘ కవితను పదహారు భాగాల విల్లులా వంచాడు. సింగిడై మెరిపించాడు. పాలపిట్ట పాటలా. పదహారు పాలపుంతల్ని భీమా నది అలలపై ఆరేశాడు. అది- వీరుల నెత్తురు పారిన నది. బ్రాహ్మణీయ పీష్వాల ఊచకోతలకు మౌన సాక్షిగా నిలిచిన నది. మళ్లీ ఇన్నేళ్లకు తన నెత్తుటి గాయాలను తడుముకుంటోంది.

‘‘నేను భీమా నదిని
ఇన్నేళ్ళ తరువాత మళ్లీ, పెళ్ళగిస్తున్న
పక్కటెముకల్లోంచి నేల కథనై మూల్గుతున్నాను…’’ అంటూ గాయమైపోయిన గతాన్ని గుర్తుచేస్తున్నాడు. శ్రీరామ్‌ కోరేగావ్‌ దళిత ప్రతిఘటన చరిత్రలోకి నడిచాడు. అది వర్తమానంతో చేస్తున్న సంభాషణ విన్నాడు. ఆ ప్రతిఘటన వెనక ఉన్న సామాజిక, రాజకీయార్థిక కారణాలను తెలుసుకున్నాడు. భీమాకోరేగావ్‌ యుద్ధక్షేత్రం లోతుల్లోకి వెళ్లాడు. అక్కడ అతనికో స్థూపం కనిపించింది. అది మహర్‌ వీరుల స్మృతిలో నిర్మితమైన స్థూపం. అక్కడ ఏటా జనవరి 1న జనసంద్రమవుతుంది. ఆ జనసంద్ర హోరు అతణ్ని ఆలోచింపజేసింది. అన్వేషణకు దారులేసింది. ఈ వెతుకులాటలో అతనికో మైలురాయి కనిపించింది. అక్కడ ఆగాడు. చరిత్రలో మునిగాడు. వెతికాడు. చరిత్ర పునాదుల్లో అతని మునివేళ్లకంటిన నెత్తురూ, కన్నీళ్లనూ కలంలో నింపుకొని వర్తమానంలో తేలాడు. అతనికి కనిపించిన ఆ మైలురాయి 1 జనవరి, 1818. అది చరిత్రను మలుపుతిప్పిన సందర్భం. ఈస్టిండియా కంపెనీకి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధ సందర్భం. ఇదే ఆంగ్లో మరాఠా యుద్ధం. కోరేగావ్‌ వద్ద ఈస్టిండియా కంపెనీ బెటాలియన్‌, మరాఠా పీష్వా సైన్యాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మహర్‌లు ఈస్టిండియా కంపెనీ తరఫున వీరోచితంగా పోరాడి నేలకొరిగారు. ఆ సైనికుల స్మృతిలో బ్రిటిష్‌ అధికారులు 1851లో భీమా నది ఒడ్డున అరవై అడుగుల ఎత్తైన స్మారక స్థూపం నిర్మించారు. ఇది మహర్‌ వీరుల స్మృతి చిహ్నం.

ఏటా డిసెంబర్‌ 31, జనవరి 1న అక్కడ మృతవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తారు. వేలాది జనం అక్కడికి వచ్చి మృతవీరుల్ని తలుచుకుంటారు. ఈ క్రమంలో 31 డిసెంబర్‌, 2017న ఆ స్మారక స్థూపం వద్ద దళిత మృతవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సభపై సంఘ్ పరివార్‌ దాడిచేసింది. ఈ దాడివెనక మావోయిస్టులున్నారని కథలల్లింది. ఈ కట్టుకథల వెనక భారత రాజ్యం కుట్ర ఉన్నది. పోలీసులు డిల్లీ, నాగపూర్‌లో విప్లవ ప్రజాసంఘాల నాయకులు, మేధావులను అరెస్టు చేశారు. రోనా విల్సన్‌ (రాజకీయ ఖైదీల విడుదల కమిటీ), సురేంద్ర గాడ్లింగ్‌ (ఐఏపీఎల్‌), సుధీర్‌ ధావ్లే (రిపబ్లికన్‌ పాంథర్స్‌), ప్రొ.షోమాసేన్‌ (నాగపూర్‌ యూనివర్సిటీ), మహేష్‌ రావత్‌ (విస్థాపన్‌ విరోధి కమిటీ)లను యూఏపీఏ కేసులో నిర్బంధించారు. ఈ అబద్ధాల కుట్రకేసును రోజుకో మలుపు తిప్పారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలు, ఆదివాసీల హక్కుల కోసం పనిచేస్తున్న బుద్ధిజీవుల్ని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే అభియోగం మోపారు. మావోయిస్టులకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాడనే ఆరోపణతో విప్లవ రచయితల సంఘం వ్యవస్థాక సభ్యుడు కామ్రేడ్‌ వరవరరావును అరెస్టుచేసి జైల్లో (17 నవంబర్‌, 2018)పెట్టారు. ఐదుగురిపై మొదలైన ఈ కుట్రకేసు ఆరోపణలు పదహారుకు చేరింది. వెర్నన్‌ గొంజాల్వేస్‌ (అర్థశాస్త్ర అధ్యాపకుడు; ముంబై), అరుణ్‌ ఫెరేరా (మానవ హక్కుల న్యాయవాది; ముంబై), సుధా భరద్వాజ్‌ (మానవ హక్కుల న్యాయవాది; ఢిల్లీ), గౌతం నవలఖా (పాత్రికేయుడు, మానవ హక్కుల కార్యకర్త), ప్రొ. ఆనంద్‌ తేల్తుంబ్డే (కమిటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌ జనరల్‌ సెక్రటరీ; మహారాష్ట్ర), ఫాదర్‌ స్టాన్‌స్వామి (సామాజిక కార్యకర్త; రాంచీ); ముంబైలోని గోద్రెజ్‌ కంపెనీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన వలస కార్మికులు మారంపల్లి రవి, సైదులు, గుండె శంకర్‌, సత్యనారాయణ, బాబు శంకర్‌)లను అరెస్టు చేశారు. ఈ అసంఘటిత కార్మికులు ఇప్పటికీ జైల్‌లోనే మగ్గుతున్నారు. దేశమే జైలైపోయిన సందర్భమిది. ఇట్లాంటి ఫాసిస్టు సందర్భాన్ని శ్రీరామ్‌ లోతుగా అర్థంచేసుకున్నాడు. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజాన్ని ఎదుర్కొనే శక్తులతో గొంతుకలిపాడు. అతణ్ని కోరేగావ్‌ రణస్థలి ఆలోచింపజేసింది. భీమా నదీ ప్రవాహంలోకి నడిపించింది. ఆ ప్రవాహంలో పారిన నెత్తుటిని అక్షరాల్లోకి ఒంపాడు శ్రీరామ్‌. ఒక్కో చారిత్రక సంఘటనా కలిసి ‘1818’ అయింది. ఇదీ ఈ దీర్ఘ కవితకు నేపథ్యం.
వీరోచితంగా పోరాడి నేలకొరిగిన మహర్‌ వీరుల స్మృతి చిహ్నమిపుడు రాజద్రోహమైంది. నిషిద్ధ రణస్థలైంది. ఎప్పటిదీ నిషేధం! ఎక్కడి నుంచి మొదలైన నిషేధమిది? ప్రశ్న ఊపిరిపోసుకున్నపుడే మొదలైన నిషేధమిది. ఇది తిరగబడ్డ ప్రశ్న. మర్లబడ్డ ప్రశ్న. నాటి చార్వాకులు, లోకాయుతులు ఎక్కుపెట్టిన ప్రశ్న. చరిత్ర పొడవునా అగ్గిలా రాజుకుంటున్న ప్రశ్న. ఆధిపత్యం, దోపిడీ, పీడన, అణచివేతలపై ఎక్కుపెట్టిన ప్రశ్న. ప్రశ్నను సహించలేని పాలకవర్గానికి చేతనైంది ఒక్కటే. అణచివేత. రక్తపాతం. అది కీలవేణ్మణి, చుండూరు, కారంచేడు, పాదిరికుప్పం, , వేంపెంట, లక్షింపేటల్లో పునరావృతమైంది. ఈ కవితలో దళితుల్ని భూమికి ప్రతీకగా చెప్పాడు. వాళ్ల పట్ల ఈ దేశం ఎట్లా వ్యవహరించిందో చెప్పాడు.

‘‘ఈ దేశం నేలని ఊళ్ళ చివర నిల్చోబెట్టింది
ఈ దేశం నేలని గుళ్ళోకి రానీయలేదు
నీళ్ళ తావుల్ని కన్నీళ్ళతో నింపి
నేల కంచంలో దేశం ఎంగిలిముద్ద పడేసింది…’’. ఇదీ ఈ దేశ క్రూరత్వం. ఆధిపత్య వర్గాల క్రౌర్యం. ఈ దేశమంతటా ప్రతీ ఊరి చివరా వాడలు. వెలివాడలు. వెలుతురు సోకని వాడలు. అట్లాంటి వాడ మనుషులకు ఈస్టిండియా కంపెనీ ఉద్యోగాలిచ్చింది. ఈ ఉద్యోగాల సాధన వెనక ఎన్నో పోరాటాలున్నాయి. త్యాగాలున్నాయి. యుద్ధభూమి నుంచి వెనుదిరగని వీరులు మహర్‌లు. అందుకే వాళ్లకు కంపెనీలో ఉద్యోగాలిచ్చింది. ఈ యుద్ధంలో మహర్‌ వీరులు బ్రాహ్మణ పీష్వాల సైన్యాలను ఎదిరించి పోరాడారు. నేలకొరిగారు. వాళ్ల అమరత్వంతో కోరేగావ్‌ నెత్తుటితో తడిసింది. భావితరాలకు పోరాట స్ఫూర్తిగా నిలిచింది.

‘‘నేలపై మోపిన నేరాలేమిటో
పేనిన ఉరితాళుళ లెక్కచెబుతాయి
పెడరెక్కలు విరిగిన పందిరి గుంజలు చెబుతాయి
దిసమొలలేసుకున్న అధికరణలు చెబుతాయి
యుద్ధంలో రక్తమోడిన ఒక చిన్న గ్రామం చెబుతుంది
ఆ ఊరి పిడికెడు మట్టిలోంచి (పు.16)
తొలి మానవుడి గుండె లయనై పల్లవిస్తున్నాను…’’ అంటూ వెలివాడలపై అంతులేకుండా సాగిన దాడుల్ని చెప్పాడు.
కోరేగావ్‌… రెండు వందల ఏళ్ల తర్వాత దళిత విముక్తి ఆకాంక్షల స్వప్నం ఫీనిక్స్‌లా రెక్కవిప్పింది. దళిత, విప్లవ శక్తుల ఏకీకరణ ఆకాంక్షల్ని ఎలుగెత్తింది. బ్రాహ్మణీయ సామ్రాజ్యవాదంపై సంఘటిత పోరాటమే విముక్తి మార్గమని స్పష్టం చేసింది. ఈ విముక్తి ఆకాంక్షల హోరును విన్నాడు శ్రీరామ్‌. తలకిందుల చరిత్రను మార్క్సిజం వెలుగులో అర్థం చేసుకొనే ప్రయత్నం చేశాడు. బ్రాహ్మణీయ పీష్వాల ఆధిపత్యంపై మహర్‌ల పోరాటాన్ని అర్థంచేకున్నాడు. ఆ పురాగాయాన్ని హత్తుకున్నాడు. రెపరెపలాడే జెండాలా ఎత్తుకున్నాడు. అందుకే… ‘‘పిగిలిన పెదవులతో ఆ ఊరు పాడిన అమర గానాన్నై దిక్కుల్లో పిక్కటిల్లుతున్నాను…’’ అన్నాడు. దేశమంతటా పరీవ్యాప్తమైన అమరగానవిది. కోరేగావ్‌ మృతవీరుల అమర గానమిది.

‘‘నేను భీమా నదిని, సత్యమే చెబుతున్నాను
మరాఠా పీష్వాలు దేశభక్తులు కాదు
ఆ చిత్పవన బ్రాహ్మణ యుద్ధం స్వాతంత్య్రోద్యమం కాదు’’. అది మరాఠా పీష్వాల సామ్రాజ్య విస్తరణ కోసం జరిగిన యుద్ధం. దాన్నే స్వాతంత్య్రోద్యమ పోరాటంగా స్థిరీకరించిన తప్పుడు చరిత్రను దుమ్ము దులపాలని చెప్పే వాక్యాలివి. చరిత్రలో నమోదుకాని రక్తసిక్తమైన పాదముద్రల లెక్కతేలాలంటున్నాడు. తెగిన తలలు, ఆ క్షణానికి ముందు ఏం మాట్లాడాయో అర్థం చేసుకోవాలంటున్నాడు కవి. మనది కాని చరిత్రను మనచేతే చదివించే కుట్రల్ని ధ్వంసం చేయాలని పిలుపునిస్తున్నాడు. ఈస్టిండియా కంపెనీ బెటాలియన్‌లో అత్యధికంగా ఉన్నది మహర్‌ వీరులే. బ్రాహ్మ ణీయ పీష్వాలతో వీరోచితంగా పోరాడి నేలకొరిగిందీ వాళ్లే. కోరేగావ్‌ స్మృతిలో నిర్మించిన స్మారక స్తూపంపై గుండెలపై చెక్కిన పేర్లలో సగం దాకా మహర్‌ సైనికులవే. ఆ పేర్లు ఎట్లా ఉన్నాయో చెప్తున్నాడు చూడండి…
‘‘స్థూపాల మీద చెక్కిన అక్షరాల్లో
అమ్మ గుండెలపై పొడిపించుకున్న నాన్న పేరుంటుంది (పు.27)
ఇల్లొదిలి వెళ్లినపుడు పూసిన తమ్ముడి ఆఖరి చిరునవ్వుంటుంది’’. ఈ కవితా పాదాల్లో ఎంత దు:ఖమున్నది! ఎన్ని కన్నీళ్లున్నాయి! గుండెల్ని తాకేలా రాసిన వాక్యాలివి. గుండె తడి వున్న వాక్యాలివి. కళ్లు తడవకుండా ఈ వాక్యాల్ని దాటి ముందుకు పోలేం. స్తూపాలపై పేర్లై జ్ఞాపకాలుగా మిగిలింది ఒక్క కోరేగావ్‌ సందర్భమేనా? కాదు. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎగరేసిన నెత్తుటి జెండాలు కూడా. నక్సల్బరీ నుంచి నాగేటి సాళ్లలో రగిలిన పోరాటాల్లో ప్రాణాలిచ్చిన వీరులు కూడా. ఊరూరా నింగికెగసిన రెపరెపలాడే జెండాలా నిలబడ్డ స్తూపాలపై వీరుల జ్ఞాపకాలు కూడా. మళ్లీ వస్తానని చెప్పి మాటిచ్చి వెళ్లి, నిర్జీవంగా తిరిగివస్తున్న వేలాది వీరయోధులు కూడా.
‘మై డియర్‌ ఇండియా!’ అంటూ భారతదేశ నగ్న స్వరూపాన్ని చెప్తున్నాడు కవి. గత వైభవాల మాటున దాగిన చీకటి కోణాలను బహిర్గతం చేస్తున్నాడు.

‘‘ఇండియా!
నువు కేవలం
జలియన్‌వాలా బాగ్‌ దురాగతానివనుకుంటావ్‌
తిరగబడ్డ షాహీన్‌బాగ్‌వి,
రైతుల మహా నాగలి యాత్రవి కూడా
కశ్మీర్‌ యాపిల్‌ పండువనుకుంటావ్‌
కశ్మీరియత్‌ హంతకురాలివి
పౌరసత్వ జాబితాలో గల్లంతైన చిరునామావి
నువు తల తెగిన బాబ్రీ మసీదువే ! ఇండియా ! (పు.60)
గోద్రా పట్టాలపై కాలిబూడిదైన రైలు పెట్టెవే !!’’ అని చరిత్రను దృశ్యమానం చేస్తున్నాడు. మతమే రాజ్యమై ఫాసిజంగా మారిన కల్లోల కాలాన్ని చిత్రించాడు. కల్లోల కాలాన మౌనంగా ఉండటం యుద్ధనేరమని తెలిసిన కవి కదా! అందుకే నదిలా ప్రవహించే అక్షరాల్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ఎరుపెక్కిన ఈ నదీ ప్రవాహమంతటా…పదహారు పాయలున్నాయి. అవి : చారిత్రక సందర్భం, దళితుల జీవితం, కోరేగావ్‌ యుద్ధ నేపథ్యం, సంఫ్‌ు పరివార్‌, భారత రాజ్యం కుట్ర, ఆంగ్లో మరాఠా యుద్ధం చారిత్రక నేపథ్యం, మహర్‌ వీరుల స్మృతిచిహ్నం, రెండువందల ఏళ్ల తర్వాత ఫీనిక్స్‌లా ఎగసిన చైతన్యం (జనవరి 2018), పదహారుమంది చెరసాల చందమామలు, ఆదివాసీలపై భారతరాజ్యం సాగిస్తున్న యుద్ధకాండ, యూఏపీఏ కుట్రకేసులు, అండర్‌ ట్రయల్‌ ఖైదీల అంతరంగం, ఈ దేశంలో ప్రజలకెప్పటికీ అందని న్యాయం, జైలు గోడల నడుమ జంగు సైరన్‌ రాజేసే రాజకీయ ఖైదీల గుండెలయలు, బెయిల్‌ కోసం నిరీక్షించే అలసిన దేహాలు, పెనుప్రమాదమై ముంచుకొస్తున్న బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం, సొంత బిడ్డలపై భారతరాజ్యం కొనసాగించే అధర్మయుద్ధం ఉన్నాయి. ఈ పాయలన్నీ మళ్లీ ప్రవాహమై విస్తరించాయి. గుండె గుండెనూ తాకే పాటై. ఎప్పటికైనా పాడక తప్పని యుద్ధగీతమై.

దేశమంతటా కవిలోకం అకాడమీ అగాధాల్లోకి జారుతున్నపుడు, ఈ కవి ఈ వస్తువునే ఎందుకు ఎంచుకున్నాడు? చరిత్రను ఎందుకు తవ్వుతున్నాడు? చరిత్ర పునాదుల్లో ఇంకా తడితడిగా అంటుకునే నెత్తుటి జాడల్ని ఎందుకు వెతుకుతున్నాడు? ‘దారి పొడవునా గుండె నెత్తురులు తర్పణ చేసిన’ వీరయోధుల పాదముద్రల్ని ఎందుకు పావురంగా ప్రేమిస్తున్నాడు? చితికిన బతుకుల గురించి ఇంత వలపోత ఎందుకు? బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం గురించి ఇతనికేమి బాధ? ఎక్కడో కారడవుల్లో ఏ గుడిసె గుండెలో తూటా పేలిందో ఇతనికెందుకు? ‘భద్రజీవన నౌకరీ’ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ జాతరల్లో తప్పిపోక, ఈ జనజాతరల గొడవెందుకు? అనే ప్రశ్నలు మీలో చాలామందికీ రావొచ్చు. కానీ, శ్రీరామ్‌కు స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉన్నది. ఆ వర్గపోరాట దృక్పథమే వస్తువును ఎంచుకున్నది. విముక్తి తొవ్వల్లో వెలుగులెవరో అతనికి తెలుసు. మనమంతా నడవాల్సింది వెలుగు దారుల్లోనేననీ తెలుసు. మనం ఏ జనం కోసం రాయాలో చెప్తూ… కామ్రేడ్‌ వరవరరావు రాసినట్టు…
‘‘మట్టిచేతులు నిన్ను మేధావిగా మలిస్తే
ఆ చేతులు కట్టిన రక్తగాయాలతో
నువ్వెవరిపై గేయాలు కట్టావని అడుగు…’’ అనే ప్రశ్న ఎదురయ్యే ఉంటదీ కవికి. ముఖ్యంగా తాను తింటున్న బువ్వలో మెతుకు మెతుక్కీ, కోట్లాది శ్రమజీవుల నెత్తురంటుకునే వున్నదన్న ఎరుక ఉన్న కవి శ్రీరామ్‌. అందుకే కోరేగావ్‌ రణస్థలి అతణ్ని కలవరపెట్టింది. భీమా నది అల్లకల్లోల అంతరంగం అతణ్ని ‘ప్రవాహం’లోకి నడిపించింది.

భీమా నది అల్లకల్లోల అంతరంగాన్ని ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్తూ… ‘‘కోరేగావ్‌ చరిత్ర నన్ను మానవ జీవితం చుట్టూ మళ్లీ మళ్లీ తిరిగేట్టు చేసింది. అది ఎన్నిసార్లో లెక్కవేసుకోలేదు గానీ, ప్రతిసారీ ఒక కొత్త ప్రపంచంలోకి మాత్రం నన్ను నెట్టివేసింది. చాలా ఇబ్బందికి గురయ్యాను. ఒక కవిత రాయడం కన్నా వ్యక్తిత్వపరంగా నాకు నేను పూరించుకోవలసిన ఖాళీలను గుర్తించాను. ఈ దేశపు అట్టడుగు వర్గాలు అనుభవించిన దుర్మార్గమైన దుర్భరమైన కాలాన్ని గురించి, పీష్వాల గురించి, ఛత్రపతి శివాజీ గురించి అనేక సత్యాలను తెలుసుకున్నాను. గతాన్ని వర్తమానాన్నీ తరచి తరచి నేను జీవిస్తున్న దేశాన్ని ఇష్టంగా చూసేందుకు ఒక అద్దం ముక్క కోసం వెంపర్లాడాను. అది భీమా నది రూపంలో దొరికింది. ప్రజా పోరాటాలు తోడొచ్చాయి. ఊళ్ళల్లో స్మారక స్తూపాలు కల్లోకొచ్చాయి. వివక్షల నడుమ కన్నీళ్లలో తడిసిన చుండూరులు, కంచికచెర్లలు దారిచూపించాయి. ఈ దేశపు న్యాయవ్యవస్థ తీరుతెన్నులు, ఇక్కడి చెరసాలలు, ఉరికొయ్యలు, ఎవరు నన్ను బంధిస్తున్నారు, ఎక్కడ నా స్వేచ్ఛ హరించబడుతోందీ ఇంకాస్త లోతుగా తెలుసుకొనే ప్రయత్నం చేశాను. ఆ అన్వేషణే 1818వ సంవత్సరంలోకి తీసుకువెళ్ళి నన్నీ దీర్ఘ కవితగా రూపాంతరం చెందేలా చేసింది’’ అని రాసుకున్నాడు శ్రీరామ్‌. తాము జీవిస్తున్న కాలంలోనే ఉజ్వలమైన పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను గొంతెత్తి గానం చేయడమే ప్రజా కవుల కర్తవ్యం. ఆ పోరాటాల్లో ఓ నినాదమవ్వడం కవుల బాధ్యత. క్రిస్టఫర్‌ కాడ్వెల్‌లా. సుద్దాల హనుమంతు, బండి యాదగిరిలా. లోర్కా, పాష్‌లా. సుబ్బారావు పాణిగ్రాహిలా. ఈ నేల విముక్తి కోసం గొంతెత్తి నెత్తురు చిందించిన ఎందరెందరో విప్లవ కవుల్లా. ఇట్లాంటి కవుల పోరాట వారసత్వాన్ని అర్థంచేసుకొని అక్షరాలను సాయుధం చేయడమే కావాల్సిందిప్పుడు. అట్లాంటి వెలుగు దారిని తన అక్షరాల్లో ఎప్పటికీ సజీవంగా నిలుపుకుంటానని, ఈ దీర్ఘ కవిత ద్వారా వాగ్దానం చేస్తున్నాడు కవి శ్రీరామ్‌ పుప్పాల. ఊరంచు వెలివాడల గుడిసెల్లోకి, అడివంచు తొవ్వల్లోకి అతని అక్షరాలింకా నడవాల్సే వున్నది.
‘‘నిజానికి
మట్టైపోయిన పక్కటెముకలే
స్థూపాలై తలెత్తుకు నిలబడుతాయి’’ అని తలెత్తే అక్షరాల్ని రాజేసిన కవి మిత్రునికి లాల్‌ సలామ్‌.

‘‘ఉద్యమాలు ఒరుసుకొని కన్నీళ్లింకా ప్రవహించి
కంటి ఎర్రజీరలో కవిత్వమింకా ఎరుపెక్కనీ…’’

-అలిశెట్టి ప్రభాకర్‌

(1818 (పద్దెనిమిదొందల పద్దెనిమిది), కవి : శ్రీరామ్‌ పుప్పాల; మొదటి ముద్రణ : 2022, ప్రచురణ : హోరు పబ్లిషర్స్‌, పేజీలు : 66, వెల : రూ.100, ప్రతులకు : శ్రీరామ్‌ పుప్పాల, ఫోన్‌ : 9963482597)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

4 thoughts on “భీమా నది అల్లకల్లోల అంతరంగం

  1. చాలా బాగా విశ్లేషించారు 💓🍒💐

  2. శివరాత్రి సుధాకర్ భీమా నది అల్లకల్లోల అంతరంగం విశ్లేషణ బాగుంది. మహర్ల చారిత్రక వారసత్వని చేరిపివేసే కుట్రను బాగా విషదీకరించినాడు. మహర్లకు దళిత పాంథర్స్ పోరాట వారసత్వవం ఉంది.వారి ఐక్యత మిలిటెన్సీ రూపం తీసుకుంటుందేమోనన్న భయం ఏలికలను పట్టి పీదిస్తున్నది. అందుకే సమాధుల తవ్వివేత, స్మారక సమావేశల మీద నిగురాని.

  3. సామాజిక వర్గాల చారిత్రక ప్రాధాన్యత కలిగిన వస్తువుకు చక్కని దీర్ఘ కవిత 1818 ని సుధాకర్ గారు చారిత్రక సంఘటనలు తెలిసేలా కవిత సారాంశాన్ని విశ్లేషాత్మక వ్యాసం చేశారు.

  4. చరిత్రను మలుపు తిప్పిన ఒక సాహసోపేత పోరాటాన్ని,ఆ పోరాట ఫలితంగా వెల్లువెత్తిన దళిత చైతన్యాన్ని,ఆ చైతన్యం సంఘటిత శక్తిగా మారితే తన అస్తిత్వానికి కలిగే భంగపాటుకు కలవర పడిన రాజ్య స్వభావాన్ని, నిర్వీర్యమవుతున్న న్యాయవ్యవస్థ వైఫల్యాల్ని, ఆదివాసీ పోరాటాల్ని..మొత్తానికి గాయపడుతున్న సమకాలీన సామాజిక జీవన చిత్రాన్ని దీర్ఘ కవితగా మలచిన శ్రీరాం కవిగా తన కర్తవ్యాన్ని గొప్పగా ప్రకటించుకున్నాడు.
    ఈ కవిత్వంలోని వస్తు వైశిష్ట్యాన్ని, శిల్ప సౌందర్యాన్ని అన్నింటికీ మించి ఈ కావ్యం రావాల్సిన ఆవశ్యకతను గొప్పగా విశ్లేషించిన సుధాకర్ గారికి అభినందనలు.

Leave a Reply