భిన్న వర్ణాల అద్భుత శైలి.. WH ఆడెన్ (1907-1973) కవిత్వం

1907 లో ఇంగ్లాండ్ లో, సంపన్న ఎగువ మధ్యతరగతి విద్యావంతుల కుటుంబంలో జన్మించిన ఈ అద్భుతమైన 20 వ శతాబ్దపు కవి, మొదట ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యలో చేరి, తరువాత తనకు ఇష్టమైన ఇంగ్లీష్ సాహిత్యం లోకి మారిపోయాడు. ఆక్స్ ఫర్డ్ నుండి పట్టా పొందిన 21 ఏళ్ళ వయసులోనే తన మొదటి కవితల పుస్తకం వెలువడింది. ఆ తరువాత, ప్రఖ్యాత కవి టి ఎస్ ఇలియట్ సహకారంతో 1930 లో ఆడెన్ వెలువరించిన కవితా సంపుటి, 20 వ శతాబ్దపు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసింది. తదనంతరం 1930 లలో ఆడెన్ రాసిన కవిత్వమంతా రాజకీయంగా చిన్నాభిన్నమైన దేశాలలో అతడు చేసిన ప్రయాణాలను ప్రతిఫలించింది.

‘A Poet before anything else, a person who is passionately in love with language’ (కవి అన్నవాడు, అన్నింటికన్నా ముందు, భాషతో పిచ్చిగా ప్రేమలో పడినవాడు) అన్న ఆడెన్ మాట, కవిత్వ ప్రపంచంలో చాలా పాపులర్. ‘ఏ కవితా సంపూర్ణంగా రూపుదిద్దుకోదు, ఏదో ఒక దశలో మనం దాన్ని వొదిలేస్తాము’ అని చెప్పిన ఆడెన్ కు తన కవితలను తిరిగి తిరిగి దిద్దుకునే అలవాటువుండేది.

అప్పటిదాకా రాజకీయ అంశాలను విస్తృతంగా ప్రతిఫలించిన ఆడెన్ కవిత్వం, అతడు అమెరికాలో స్థిరపడిన తరువాత ఆధ్యాత్మిక అంశాలను ఎక్కువగా ప్రతిఫలించింది అని విమర్శకులంటారు. 1930 ల వరకు ఆడెన్ ను అభిమానించిన ఇంగ్లాండ్ లోని వామపక్ష భావజాల అభిమానులకు, అతడు అమెరికాలో స్థిరపడడం ఎంతమాత్రం నచ్చలేదు. చివరకు అతడు ఇంగ్లాండ్ విడిచి వెళ్లిపోవడం బ్రిటీషు పార్లమెంటులో కూడా ప్రస్తావనకు వొచ్చింది.

ఆడెన్ వివిధ దేశాలలో విస్తృతంగా పర్యటించి వుండడం వలన అనేక ప్రాంతాలకు సంబంధించిన పదబంధాలు అతడి కవిత్వంలో విరివిగా కనిపిస్తాయి అని కూడా అంటారు. కవిగానే కాదు, నాటక రచయితగా కూడా ఆడెన్ సుప్రసిద్ధుడు. తన ‘ఏజ్ ఆఫ్ యాంగ్జయిటీ’ కవితల పుస్తకానికి 1948 లో పులిట్జర్ బహుమతి అందుకున్నాడు. 1939 లో అమెరికా చేరిన ఆడెన్, 1972 లో ఆక్స్ఫర్డ్ కు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ చివరి రోజులు మాత్రం ఆస్ట్రియా రాజధాని వియన్నా లోని తన సొంత ఇంట్లో గడిపాడు. అన్నట్టు, 1994 లో వొచ్చిన పాపులర్ హాలీవుడ్ సినిమా ‘ఫోర్ వెడ్డింగ్స్ అండ్ ఎ ఫ్యూనరల్’ సినిమాలో ఆడెన్ విఖ్యాత కవిత ‘స్టాప్ ఆల్ ద క్లాక్స్’ వినబడుతుంది.

ఆడెన్ రాసిన ఈ రెండు కవితలు చదవండి (Unknown Citizen , refugee blues ). ఒక కవిత ప్రస్తుత భారతదేశ పరిస్థితులలో నిర్లిప్తంగా వున్న పౌర సమాజాన్ని గుర్తు చేస్తే, మరొక కవిత ఆఫ్ఘనిస్తాన్ పౌరుల దుస్థితిని గుర్తు చేస్తుంది. కవి సృజించిన కవిత్వం, అతడు జీవించిన కాలాన్ని దాటి జీవించడం అంటే యిది కదా !

  1. అపరిచిత పౌరుడు

అధికారిక ఫిర్యాదులేవీ లేని వ్యక్తిగా అతడున్నట్లు
అధికారిక గణాంకాల సంస్థ అతడిని గుర్తించింది
అతని సత్ప్రవర్తనను అన్ని నివేదికలూ గుర్తించాయి
పాత మాటల్లో చెప్పాలంటే – అతనొక సాధువని తెలిపాయి
చేసిన ప్రతి పనిలో అతడు గొప్ప సమూహాలకు సేవ చేశాడు
యుద్ధ సమయంలో తప్ప, ఉద్యోగ విరమణ వరకు అతడు
కర్మాగారంలో పనిచేశాడు, ఏ రిమార్కూ లేకుండా
యాజమాన్యం సంతృప్తి చెందేలా
అయినప్పటికీ, అతడి అభిప్రాయాలు గజిబిజిగా వింతగా లేవు
మా సామాజిక మానసిక విశ్లేషణ బృందం ప్రకారం
అతడు తన సహచరులందరికీ రాత్రి పార్టీలలో బాగా తెలుసు
అతడు శ్రద్ధగా రోజూ వార్తా పత్రిక కొనేవాడని పత్రికల వాళ్ళ నమ్మకం
ప్రకటనల పట్ల అతని స్పందనలు అతి సాధారణంగానే వుండేవన్నారు
అతని పేరుతో వున్న పాలసీలను బట్టి అతను పూర్తిగా బీమా చేయబడ్డాడు
అతని హెల్త్ కార్డ్ నివేదిక ప్రకారం, అతనొకసారి ఆసుపత్రిలో చేరి కోలుకున్నాడు
వాయిదాల పద్ధతిలో తెలివిగా వస్తువులను సమకూర్చుకోవడంలో
అతడు ఆధునిక మానవుడని పరిశోధనలో తేలింది
ప్రజాభిప్రాయ సేకరణ చేసిన మా పరిశోధకులు సంతృప్తి వెలిబుచ్చారు
శాంతి వున్నపుడు శాంతి పట్ల, యుద్ధమున్నపుడు యుద్ధం పట్ల
ఆయా సంవత్సరాల పాపులర్ అభిప్రాయాలతో అతడున్నాడు
అతడు పెళ్లి చేసుకుని, దేశానికి ఐదుగురు పిల్లలనిచ్చాడు
అతడి తరంలో అది సరయిన చేర్పు అని మా శాస్త్రవేత్తల మాట
అతడు తమ బోధనలో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని టీచర్లు అన్నారు
అతడు స్వేచ్ఛగా వున్నాడా? సంతోషంగా వున్నాడా? ప్రశ్నలు పనికిమాలినవి
ఏదైనా తప్పు జరిగి వుంటే, ఖచ్చితంగా మాకు తెలిసి వుండేది.

  1. శరణార్థి శోకగీతం

ఈ నగరంలో పది మిలియన్ల ఆత్మలు వున్నాయంటారు
భవనాలలో నివసిస్తూ కొందరు, పిచ్చుక గూళ్లలో నివసిస్తూ అనేకులు
అయినా, ఇక్కడ మనకింత చోటు లేదు ప్రియా! .

ఒకప్పుడు మనకొక దేశం వుండేది
దాని నిజాయితీని విశ్వసించాము
ప్రపంచపటంలో చూస్తే కనిపిస్తుంది
కానీ, ఇప్పుడు మనం అక్కడికి వెళ్లలేము ప్రియా!

గ్రామంలోని చర్చి ఆరుబయట ఒక పాత మొక్క పెరుగుతోంది,
ప్రతీ వసంత కాలంలో అది కొత్తగా విరబూస్తుంది
కానీ, పాత పాస్ పోర్టులు అట్లా విరబూయవు ప్రియా!

దౌత్య కార్యాలయ అధికారి దబాయించి చెప్పాడు-
“పాస్‌పోర్ట్ లేకపోతే మీరు అధికారికంగా మరణించినట్టు లెక్క”:
కానీ, మనం ఇంకా సజీవంగా వున్నాము ప్రియా!

ఒక కమిటీ ముందుకు వెళ్ళి దీనంగా అర్థించాము
వొచ్చే సంవత్సరం తిరిగి కనిపించమని మర్యాదగా చెప్పారు వాళ్ళు
అది సరే గానీ, ఈ రోజు ఎక్కడికని వెళ్ళేది ప్రియా!

ఒక బహిరంగ సభకు వొచ్చాము ; వక్త లేచి హెచ్చరించాడు-
“ఇవాళ వాళ్ళను అనుమతీస్తే, రేపు వారు మన తిండిని దొంగిలిస్తారు”
అతడు, నీ గురించీ నా గురించీ మాట్లాడుతున్నాడు ప్రియా!

ఆకాశంలో పెద్ద ఉరుము శబ్దం విన్నాము;
యూరప్‌లోని హిట్లర్ మాట -“వాళ్ళు చనిపోక తప్పదు”
ఆహా! మనం అతడి మనసులో వున్నాము ప్రియా!

జాకెట్ లో పొదుముకున్న బుజ్జి కుక్కను చూసాము
ఒక తలుపు లోనికి పంపించిన పిల్లిని చూసాము
కానీ అవి జర్మన్ యూదులు కాదు ప్రియా!

నౌకాశ్రయంలో దిగి, గట్టు మీద నిలబడ్డాము
చేపలు స్వేచ్ఛగా ఈత కొట్టడం కనిపించింది
కేవలం పది అడుగుల దూరంలో ప్రియా!

అడవి దారుల వెంట నడిచాము, చెట్ల మీద పక్షులను చూసాము
వాటికి రాజకీయ నాయకులు లేరు, ఇష్టంగా పాటలు పాడుకుంటున్నాయి
అవి మనిషి జాతికి చెందనివి ప్రియా!

వెయ్యి కిటికీలు, వెయ్యి తలుపులు వున్న
వెయ్యి అంతస్తుల భవనాన్ని చూసినట్టు కలగన్నాము
వాటిలో ఒక్కటీ మనది కాదు ప్రియా!

మంచు కురిసే విశాల మైదానమ్మీద నిలబడ్డాము
పదివేల మంది సైనికులు, అటూ యిటూ కవాతు చేశారు
నాకోసం, నీ కోసం వెతుకుతున్నారు ప్రియా!

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply