పతనం అంచుల్లో భారత ఆర్థిక వ్యవస్థ

భారత ఆర్థిక వ్యవస్థను దట్టమైన చీకట్లు కమ్ముకొన్నాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా క్షీణించిందనేది చేదు నిజం. ప్రస్తుత వాస్తవ పరిస్థితి గురించి చెప్పాలంటే నేడు జరుగుతున్నది. ‘ఆర్థిక వినాశనం’ అని చెప్పవచ్చు. అధికారిక ప్రాథమిక అంచనాల ప్రకారం భారత దేశపు జిడిపి వృద్ధిరేటు ఏప్రిల్‍-జూన్‍ 2020 త్రైమాసికానికి గతేడాది అదే కాలపు (2019 ఏప్రిల్‍-జూన్‍) జిడిపి వృద్ధిరేటుతో పోల్చితే 24 శాతం పడిపోయింది. కాస్త లోతుగా విషయాలు తెలిసిన ఆర్థిక నిపుణులు మాత్రం జిడిపి పతనం ఇంతకన్నా వాస్తవంగా ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఎందువల్లనంటే వ్యవసాయరంగం మినహా ప్రతిరంగం, ముఖ్యంగా ఎక్కువ ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు చాలా వేగంగా క్షీణించాయి. వీటికి తోడు రవాణా, నిర్మాణ రంగం కుదేలయ్యాయి.

మాజీ గణాంక అధికారి ప్రణబ్‍ సేన్‍ అంచనా ప్రకారం జిడిపి వృద్ధి రేటు 32 శాతం పడిపోయింది. మరికొంతమంది ఇతరులు అంతకన్నా కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. ఈ క్షీణత కొవిడ్‍-19 కారణంగానే ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు బుకాయిస్తున్నాయి. ప్రపంచమంతా కరోనా వ్యాపించినా, ఆసియా దేశాలలోనే కాక జి-20 దేశాల్లో కూడా ఏ దేశమూ ఇంత ప్రతికూల ప్రభావానికి గురవ్వలేదు. కొన్ని ప్రధాన దేశాల స్థూల జాతీయ ఉత్పత్తులు మనం చూస్తే అమెరికా 9.5 శాతం. ఇంగ్లాండ్‍ 20.7 శాతం, ఇటలీ 17.3 శాతం, జపాన్‍ 10 శాతం, ఫ్రాన్స్ 20.4 శాతం, కెనడా 12 శాతం, జర్మనీ 10.1 శాతం పతనమవగా చైనా మాత్రం 3.2 శాతం వృద్ధ నమోదు చేసింది.

ఆర్థిక వ్యవస్థ సంక్షోభస్థితికి రావడానికి దేశంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు, ఉపాధి రహిత వృద్ధి మూలానా నిరుద్యోగం పెరిగి ప్రజల ఆదాయాలు తగ్గి వస్తుసేవల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. దీనివల్ల డిమాండ్‍ తగ్గి, వాటి అమ్మకాలు మందగిస్తాయి. ఫలితంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు తగ్గిస్తారు. ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల మరి కొంతమంది కార్మికులు కొలువులు కోల్పోతారు. ఫలితంగా నిరుద్యోగం మరింత పెరిగి ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇదొక ‘విష వయలం’లా పనిచేస్తుంది. దీనికి తోడు 2016 నుంచి మోడీ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు నోట్ల రద్దు, జిఎస్‍టి వంటి చర్యలవల్ల అప్పటిదాకా సవ్యంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ముఖ్యంగా బ్యాంకింగ్‍ వ్యవస్థ పరిస్థితి పెనం మీది నుంచి పోయ్యిలోకి పడినట్లయింది.

బ్యాంకుల్లో అక్రమాలను అరికట్టడానికి కేంద్రం, ఆర్‍బిఐ ఎన్ని చర్యలు తీసుకున్నా, బ్యాంకుల్లో మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా బ్యాంకుల్లో ద్రవ్య కొరత ఏర్పడింది. రైతాంగానికి, చిన్న పరిశ్రమలకు కావల్సిన రుణాలను బ్యాంకులు ఇవ్వలేక పోయాయి. రుణాల కొరకు ప్రైవేట్‍ వ్యక్తులను, సంస్థలను ఆశ్రయించవలసి వచ్చింది. ఇది కాకుండా, అమ్మకాల్లో క్షీణత, వ్యవసాయ దిగుబడుల తగ్గుదల, 100 రకాలకు పైగా వృత్తుల వారికి ఉపాధి కల్పిస్తున్న స్థిరాస్తి రంగం దెబ్బతినడం ఫలితంగా వినియోగం తగ్గడం, ఇన్ఫాస్ట్రక్చర్‍ లీజింగ్‍ • ఫైనాన్షియల్‍ సర్వీసెస్‍ లిమిటెడ్‍ (ఐఎల్‍ఎఫ్‍ఎస్‍) సంస్థ కుప్పకూలడం, అమ్మకం కాక మిగిలిపోయిన సరుకు నిల్వలు, ఆటో మోబైల్‍, సిమెంట్‍, ఐరన్‍ వంటి పరిశ్రమల్లో కార్మికుల తొలగింపు వంటి ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా పయనిస్తోందని పలువురు ఆర్థిక నిపుణులు రెండు సంవత్సరాలుగా హెచ్చరికలు చేస్తూనే వచ్చారు. నోట్ల రద్దు, జిఎస్‍టి ప్రభావానికి గురైన వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు మాత్రమే కాకుండా, వినియోగం తగ్గడం, స్మాల్‍ బిజినెస్‍ ఫైనాన్స్ క్రెడిట్‍ (ఎస్‍బిఎఫ్‍సి) ఇండియా సంక్షోభం, తగ్గిన పెట్టుబడులు, ఎగుమతుల క్షీణత, తగ్గిన పారిశ్రామిక ఉత్పత్తి, అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక సంక్షోభం వంటి ప్రతికూల పరిణామాలు తోడయ్యాయి. మొత్తంగా గత ఆరు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం యొక్క ఉదాసీనత, దుర్భలత్వం, ఆశక్తత వలన మాత్రమే నేటి జిడిపి క్రాష్‍కు దారితీశాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్‍ నేడు అత్యంత అధ్వాన్నంగా నిర్వహించబడిన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో చోటు సంపాదించుకుంది.

2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటిలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి. సంక్షోభ పరిస్థితుల నుంచి ఏ దేశం కూడా పూర్తిగా కోలుకోలేకపోతున్నది. ఉద్దీపన పథకాలు, క్వాంటిటేటివ్‍ ఈజింగ్‍ లాంటి చర్యలు ఎన్ని తీసుకున్నా వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదు. ఏదైనా ప్రయోజనం కలిగితే అది కార్పొరేట్లకు, ధనవంతులకు మాత్రమే కలుగుతున్నది. ప్రభుత్వ విధానాలు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేవిధంగా ఉన్నాయి. 60శాతానికి జీవనోపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేయబడింది. దేశం మొత్తంలో 45 కోట్ల మంది కార్మికులు ఉండగా, వారిలో 42 కోట్ల మంది (90 శాతం) అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు అమలు జరగడం లేదు. సామాజిక భద్రత లేదు. కార్మిక హక్కులు వీరికి వర్తించవు. వీరంత దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. జనాభాలో 1శాతం వద్దనే సంపద కేంద్రీకృతమవుతున్నది. సామాన్యులూ కార్మికులూ మరింతగా చితికిపోతున్నారు. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతోంది.

కరోనా వైరస్‍ వ్యాప్తి జరగకముందే భారత ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలో కూరుకుపోయింది. 2015-16 ఆర్థిక సంతవ్సరంలో భారత్‍ జిడిపి వృద్ధిరేటు 8.2 శాతం ఉండగా, 2016-17లో 7.1 శాతానికి, 2017-18లో 6.7 శాతానికి, 2018-19లో 6.1 శాతానికి, 2019-20లో 4.2 శాతానికి క్రమంగా పడిపోయింది. ఈ సందర్భంలో కరోనా వచ్చింది. కరోనా ప్రభావంతో మార్చి 24 నుండి అనాలోచితంగా ఆదరాబాదరగా దేశవ్యాప్తంగా లాక్‍డౌన్‍ ప్రకటించడంతో అనేక ఉత్పాదక కంపెనీలు మూతపడ్డాయి. నిర్మాణరంగం, సేవారంగం, రవాణా రంగం మూతపడ్డాయి. పనులు కోల్పోయి ఎక్కడివారు అక్కడ చిక్కుబడి పోయారు. రవాణా సౌకర్యం లేదు. ఆదుకునేవారు లేక ఆకలితో వలస శ్రామికులు అలమటించారు. వందలాది మంది వారి స్వస్థలాలకు వెళ్తూ మార్గమధ్యంలోనే మరణించారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల పట్ల నిర్ధయతో వ్యవహరించింది.

లాక్‍డౌన్‍ కాలంలో వెంటనే పనులు కోల్పోయిన లక్షలాది కార్మికులకు ప్రభుత్వం ఏ విధమైన ఊరటనూ కల్పించలేకపోవడం ఈ లాక్‍డౌన్‍లో వ్యక్తమైన ప్రధాన లక్షణం. పలు ఇతర దేశాల్లో సార్వత్రికంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. అందరికీ నగదు చెల్లించారు. కాని ఇక్కడ ప్రభుత్వం అటువంటిదేమీ చేయలేదు. తలకు 5 కిలోల చొప్పున అదనపు ఆహార ధాన్యాలను దేశంలోని 80 శాతం ప్రజానీకానికి అందిస్తామని తొలుత ప్రకటించారు. కాని వాస్తవ పంపిణీలో గుర్తింపు కార్డులు చూపాల్సిందేనని నిబంధన పెట్టారు. చాలామందికి గుర్తింపు కార్డులు లేక ఈ అదనపు ఆహార ధాన్యం అందలేదు. ఇక నగదు చెల్లిస్తామన్న హామీని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అమెరికా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ తన జిడిపిలో 10 శాతం సహాయ కార్యక్రమాల ప్యాకేజీకి కేటాయించింది. జర్మనీ 5 శాతం కేటాయించింది. జపాన్‍ అంతకన్నా ఎక్కువే కేటాయించింది. కాని మన ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో జిడిపిలో ఒక్క శాతం కూడా కేటాయించలేదు. ఆ విధంగా అత్యంత కర్కశంగా లాక్‍డౌన్‍ అమలు జరిపి, అత్యంత హీనంగా సహాయ కార్యక్రమాన్ని చేపట్టిన దేశం మనది.
నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఇస్తూ మోడీ ప్రభుత్వం మార్చి 24న లాక్‍డౌన్‍ ప్రకటించింది. ఈ హడాహుడి ప్రకటన ఆర్థిక కుదేలు కావడానికి దారి తీసింది. కరోనా కట్టడి కాలేదు కానీ ఉత్పత్తి నిలిచిపోయింది. కోట్లాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు ఉపాధి దెబ్బతినడంలో నిరుద్యోగం ఎన్నడూలేని రీతిలో పెరిగిపోయింది. ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టిందే తప్ప వారిని ఆదుకోలేకపోయింది. తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వం అందించిన సహాయం నామమాత్రమే. ప్రభుత్వ తీరు పట్ల ఆర్బీఐ మాజీ గవర్నర్‍ రఘురామ్‍ రాజన్‍ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ విధానాలు పూర్తి నిర్లక్ష్యం వహించాయని విశ్లేషించాడు. ఆర్థిక వ్యవస్థ పథనాన్ని నిరోధించేందుకు, పునరుజ్జీవింప చేసేందుకు ఏ ప్రయత్నం చేయకుండా మోడీ సర్కార్‍ నిష్క్రియాపరత్వం వహించిందని పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి మాజీ చైర్మన్‍ కె. సుబ్రమణియన్‍ మరింత తీవ్రంగా మోడీ విధానాలపై విమర్శలు చేశాడు.

మొత్తం ఆర్థిక వ్యవస్థను నెలల తరబడిగా స్తంభింపజేసే కరోనా లాంటి విపత్తులు ఎదురైనప్పుడు ఉత్పత్తులు నిలిచిపోయి, ఉపాధులు కోల్పోయి, కొనుగోలు శక్తి దారుణంగా సన్నగిల్లిపోయి కూడు, గూడు, గుడ్డకు దూరమై కఠిక దారిద్య్రంలోకి అత్యధికులు కూరుకుపోవడం సహజమే. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి పేదరికంలోకి చేరుకుంటారని ప్రపంచ బ్యాంకు కూడ తెలిపింది. ఆదాయాలు లేక చేతిలో చిల్లిగవ్వ కరువైనందున కొనుగోలు శక్తి అడుగంటిపోయిన సందర్భంలో మోడీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన 20.9 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో నిరుపేదల పెదవులపై చిరునవ్వు తెప్పించేదేమైనా ఉన్నదా? అంటే నామమాత్రం అని చెప్పవచ్చు. కరోనా లాక్‍డౌన్‍ను అవకాశంగా మలుచుకొని ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం పెట్టుబడి అనుకూల భారీ ఆర్థిక సంస్కరణలకు తెరలేపింది.

కార్పొరేట్‍ సంస్థలకు ఆర్థిక రాయితీలు, కార్మిక హక్కుల అణచివేత, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను ప్రైవేటీకరించడం, రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లు, విద్యుత్‍ సంస్కరణలు, పర్యావరణ చట్టం సరళీకరణ, బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి చర్యలు ఈ సంక్షోభానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి దశాబ్ధకాలం పట్టవచ్చుని కొందరి ఆర్థికవేత్తల అంచనా. ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త కార్మిన్‍ రీన్హార్ట్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కనీసం ఐదు సంవత్సరాలు పడుతుందన్నారు. కరోనా కాలంలో ఆదాయాలు లేక అప్పులు చేసి జీవితాలు గడిపారు. పొదుపు అసలే లేకుండా పోయింది. లాక్‍డౌన్‍ ఎత్తివేశాక కూడ పూర్తిస్థాయిలో ఉత్పత్తి పుంజుకోలేదు. అరకొర పనులు దొరుకుతుంటే వాటితో బతుకులు వెళ్లదీస్తున్నారు. అప్పులు ఏలా తీర్చాలి? అన్నది ప్రజలకు ఆందోళనగా ఉంది. పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసినా డిమాండ్‍ లేకుంటే ఫలితం ఉండదు. అంటే లాక్‍డౌన్‍కు ముందున్న ఉత్పత్తి స్థాయికి చేరుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఫలితంగా నిరుద్యోగం గతంలో ఏనాడు లేనంతగా పెరుగనుంది. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అంచుకు చేరుకుంటుంది. ద్రవ్యరంగం నిరర్థక ఆస్తుల సంకెళ్లలో చిక్కుకున్నది. ఇది కూడ ఆర్థిక వ్యవస్థ దిగజారుడుకే దారితీయనున్నది.

పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం చేసే వ్యయం, ప్రైవేట్‍ వ్యయం, ఎగుమతులు, వినియోగం వంటి నాలుగు అంశాలను ఆర్థిక వృద్ధికి ‘గ్రోత్‍ ఇంజన్‍’ అంటారు. ఇవి నాలుగు సమిష్టిగా ముందుకు వెలితేనే వృద్ధి సాధ్యమవుతుంది. గత సంవత్సర కాలంగా ఈ నాలుగు మన దేశంలో క్షీణించాయి. 2019-20లో మన జిడిపి వృద్ధి 4.2 శాతమే. ఇది దాదాపు ఒక దశాబ్దంలోనే అతితక్కువ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జిడిపి మైనస్‍ పదిశాతం వరకు కుంగిపోయే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. 1947 తర్వాత ఎన్నడూ చూడని కని విని ఎరుగని రీతిలో సంక్షోభానికి దారి తీస్తుందనీ, ఈ ఆర్థిక సంక్షోభం చాలా లోతుగా, దీర్ఘకాలికంగా ఉంటుందని ఆర్థికవేత్తలు ముందుగానే సూచించారు. అయినా, మోడీ ప్రభుత్వం పట్టించుకొక పోవడంతో ప్రస్తుతం దేశం అనూహ్యమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తున్నది.

2025 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థగా భారత్‍ను మారుస్తామన్న మోడీ ప్రభుత్వ ప్రకటన ప్రకటనగానే మిగిలిపోనుంది. అది ఇప్పట్లో సాధ్యపడదని.. చేరుకోలేదని బ్లూమ్‍బర్గ్ తాజాగా ఓ కథనంలో విశ్లేషించింది. ఇలాంటి సంక్షోభాల నుండి బయటపడడానికి కనీసం పదేళ్లు పడుతుందని ఎస్‍బిఐ చీఫ్‍ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్‍ పేర్కొనడం గమనార్హం. భారత్‍లో ప్రతి ఏడాది కొత్తగా కోటి మంది యువత ఉపాధి మార్కెట్‍లోకి వస్తున్నారని, వారికి ఉపాధి కల్పించాలంటే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. అందుక•నుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. అయితే ప్రభుత్వం ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థలో జరిగిన నష్టాన్ని గుర్తించనేలేదని జాతీయ గణాంకాల శాఖ మాజీ చీఫ్‍ ప్రణబ్‍ సేన్‍ వ్యాఖ్యానించాడు.

మోడీ ప్రభుత్వ పాలనలో శ్రామిక, బడుగు, బలహీనవర్గాల ప్రజలను తీవ్ర నిరాశ నిస్పృహలోకి నెట్టేస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయి, నిరుద్యోగం శ్రుతిమించిన పర్యవసానమే ఇదంతా జరుగుతుంది. రాజకీయాలను, ఆర్థికాన్ని వేరుచేసి చూడలేం. ఆర్థికరంగ అభివ్యక్తీకరణే రాజకీయాలు. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ప్రయోజనాల కోసం మోడీ రాజకీయ విధానాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పెట్టుబడి అనుకూల విధానాలను అనుసరిస్తున్నందున దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దేశ ఆర్థిక మూలాలను ధ్వంసం చేసేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కుటిలయత్నాలు చేస్తున్నారు. రైల్వేలు, విమానాశ్రయాలు, ఎల్‍ఐసి, పోస్టల్‍ తదితరాలనే కాదు, ఏకంగా అంతరిక్ష పరిశోధన సంస్థలో కూడా ప్రైవేటుసంస్థలకు ద్వారాలు తెరిచేందుకు తెగపడ్డారు. ఆత్మనిర్భర భారత్‍ అంటూనే ఆత్మ దుర్భర భారత్‍ను ఆవిష్కరించే చర్యలకు దిగజారుతున్నారు.

భారత ఆర్థికవృద్ధి పతనం రంగాలవారీగా చూసినప్పుడు నిర్మాణ (కన్‍స్ట్రక్షన్‍) రంగం 50 శాతం, వాణిజ్య(ట్రేడ్‍) రంగం 47 శాతం, తయారీరంగం (మ్యానుఫ్యాక్చరింగ్‍ )39 శాతం, మైనింగ్‍ 22శాతం, సర్వీస్‍ సెక్టార్‍ 20 శాతం పతనమయ్యాయి. కేవలం వ్యవసాయ రంగం మాత్రం 3.4 శాతం వృద్ధి నమోదు చేసింది. జిడిపిలో ఇప్పుడు ఏర్పడిన నెగటివ్‍ గ్రోత్‍ మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే నిలిచిపోయిన వ్యవహారాల పునరుద్ధరణకు ఇప్పటివరకు ఏ ఒక్క ప్రణాళికా వేయలేదు. నిత్యావసర వస్తువుల వ్యాపారాలు తప్పా మిగతావన్నీ దాదాపు మూతబడ్డవి. నోట్ల రద్దు సృష్టించిన భయాందోళనల వల్ల డిజిటల్‍ చెల్లింపులు పెరిగి ఉండవచ్చు, కానీ బ్యాంకులు నగదు విత్‍డ్రాలపై ఆంక్షలు పెట్టడం వంటివి జరిగాక పట్టణ ప్రాంతపు సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి (ఎమ్‍ఎస్‍ఎమ్‍ఇ) రంగాల్లో మునుపటి స్థాయిల్లో లావాదేవీలు జరగడం లేవన్నది వాస్తవం.

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయటానికి ఉద్ధేశ్యపూర్వకంగా ఆశ్రితులకు అక్రమంగా భారీగా రుణాలు ఇప్పించి, వాటిని పారుబాకీలుగా చూపి, నిరర్ధక అప్పుల భారాన్ని బ్యాంకుల తలపై మోపటం, అవి కుప్పకూలే పరిస్థితి దాపురించిన తరువాత, వాటిని ఉన్నకాడికి ప్రైవేటు పరం చేయటం జరుగుతుంది. బ్యాంకులను సరైన పద్ధతుల్లో నియంత్రించకుండా దివాళ తీసాయన్న సాకుతో ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ప్రైవేటీకరిస్తే అవి ప్రైవేటు, విదేశీ కార్పొరేట్‍ సంస్థల చేతుల్లోకి వెళతాయి. కార్పొరేట్లు, విదేశీ సంస్థలు మోసపూరితంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహించటం ద్వారా ప్రజల, ప్రభుత్వ సొమ్మును హరించటంలో ముందుంటాయి. తమ లాభం మినహా దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం వీరికి పట్టదు. తమకు లాభం వస్తే ప్రజలను ముంచటానికి వారేమాత్రం వెనుకాడరు. వారి కార్యకలాపాలలో ఏ మాత్రం నిజాయితీ ఉండదు.

విదేశీ పెట్టుబడి స్వయం సమృద్ధి భావనకు ప్రతికూలమైంది. విదేశీ పెట్టుబడి మౌలికంగా జాతీయ పెట్టుబడికి, దేశ అభివృద్ధికి వ్యతిరేకమైనదిగా ఉంటుంది. జాతీయ పెట్టుబడిని అణచివేసి తానే పెత్తనం చేస్తుందనీ అన్ని దేశాల చరిత్ర చెబుతుంది. విదేశీ పెట్టుబడి దేశంలో దోపిడీని శాశ్వతం చేస్తుంది. అందువలన మనదేశాన్ని శక్తివంతమైన స్వతంత్ర దేశంగా పునర్నిర్మించాలంటే విదేశీ పెట్టుబడిని తిరస్కరించడం తప్ప మరో మార్గం లేదు. నిజానికి దేశీయ వనరులను, శ్రామికులను ఉపయోగించుకుంటూ, స్థానిక అవసరాలు, వినియోగం కోసం సరుకులను ఉత్పత్తి చేసుకోవడమే స్వావలంబన వెనక ఉన్న ప్రాథమిక సూత్రం. స్వయంసమృద్ధి అనేది విధానపరమైన మార్పుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. బహుళజాతి సంస్థల ప్రయోజనాల్ని నిరుత్సాహపరిచే, ప్రజలే కేంద్రంగా, వికేంద్రీకృత పారిశ్రామికీకరణ పద్ధతులతో, స్థానిక ఆర్థిక వ్యవస్థల వృద్ధి, ఉద్యోగ కల్పన, ప్రభుత్వ పరిశోధన, నవకల్పనల మెరుగదలతో కూడిన విధాన నిర్ణయాలతోనే స్వావలంబన సుసాధ్యమవుతుంది.

మోడీ ప్రభుత్వం అచ్చేదిన్‍, స్కిల్‍ ఇండియా, స్టార్టప్‍ ఇండియా, మేక్‍ ఇన్‍ ఇండియా, సబ్‍కాసాత్‍, సబ్‍కా వికాస్‍(ఇప్పుడు సబ్‍కా విశ్వాస్‍), స్థానిక ఉత్పత్తులు, చివరిగా ఆత్మ నిర్భరతలాంటి వాగాడంబర నినాదాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. విదేశీ పెట్టుబడులు, సాంకేతికలతో దేశంలో ఉత్పత్తి జరిగితే అది స్వదేశీ ఉత్పత్తి ఏలా అవుతుందో పాలకులకే తెలియాలి. పెట్టుబడులు పెట్టడం అంటేనే లాభాలు సంపాదించుకోవడానికన్నది యధార్థం. ఒకవైపు పద్ధతి ప్రకారం దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ ఆర్థికవ్యవస్థను ధ్వంసం చేస్తూ స్వావలంబన నినాదాలతో ప్రజలను మోసగిస్తున్నారు. ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు అనేక రాయితీలు ఇస్తున్నారు. ఆత్మ నిర్భర్‍ భారత్‍ గురించి మోడీ మాట్లాడుతూ మన భూమిని, మన నీటిని, మన శ్రమను, అడవులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు.

ప్రజల కొనుగోలు శక్తి పెంచే దిశగా ఏ ఒక్క చర్యనూ ప్రభుత్వం తీసుకోవడం లేదు. అసలు ఈ సంక్షోభానికి మూల కారణం ప్రజల కొనుగోలు శక్తి తగినంత లేకపోవడమే అన్న విషయం ఈ ప్రభుత్వానికి ఏ మాత్రమూ అర్థం అయినట్టు లేదు. మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ ప్రజల కొనుగోలు శక్తిని మరింత కుంగదీస్తున్నాయి. దాని వలన సంక్షోభం మరింత తీవ్రం అవుతుంటుంది. సంక్షోభం తీవ్రం అవుతున్నకొద్దీ ప్రభుత్వం మరింత నియంతృత్వంగా వ్యవహరిస్తూ, కార్మిక వర్గాన్ని అణచివేస్తూ, ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ, నాయకులను నల్ల చట్టాలతో నిర్భందిస్తుంది. ప్రజలను చీల్చడానికి తన మతోన్మాద అజెండాను మరింత ఉధృతం చేస్తూ పోతుంది. దీనివల్ల సంక్షోభం తగ్గకపోగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక సంక్షోభం సామాజిక సంక్షోభంగా మారనుంది. పర్యవసానాలు ఆలోచించని మోడీ నైజం ఏ విపరిణామాలకైన దారితీయవచ్చు.

ఈ సంక్షోభం నుంచి బయట పడాలంటే ప్రభుత్వం చేసే ఖర్చును పెంచాలి. అదే సమయంలో కార్పొరేట్‍, ప్రైవేటు సంస్థలపై అదనపు పన్నులు విధించాలి. ఆ పనిచేయకుండా ప్రజలపై పన్నుల భారం పడే చర్యలకు పాల్పడుతున్నారు. సంపద సృష్టికర్తలైన పారిశ్రామిక కార్మికులు, ఇతర శ్రమజీవుల నిజవేతనాలు హరించుకుపోతుంటే పట్టించుకోని ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తలు మాత్రమే ‘సంపద సృష్టికర్తల’నే సంకుచిత అభిప్రాయంతో ముందుకెళుతున్నది. పారిశ్రామిక వేత్తలు సమాజానికి ఎంతగా దోహదం చేస్తున్నారో ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించాలి. ప్రజలకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టిపెడితే ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. పర్యవసానంగా వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ఉత్పత్తులు క్రమంగా వృద్ధి చెందుతాయి. అందుకు తగినట్లుగా ప్రభుత్వ ఆలోచన, విధానాల్లో మార్పు రాకుండా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం తొలగిపోయే అవకాశాలు తక్కువ. కాబట్టి దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే స్వదేశీ మార్కెట్‍ వృద్ధిపై ప్రభుత్వం కేంద్రీకరించటం అవసరం.

కరోనాను కట్టడి చేసి ప్రజలను కాపాడితేనే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకుంటుంది తప్ప కార్పొరేట్లను కాపాడడం వలన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోలేమని మోడీ ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తిస్తే దేశానికి అంత ప్రయోజనం ఉంటుంది. దేశాభివృద్ధి జరగాలన్నా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా, పేదరికం పోవాలన్నా, గ్రామీణ అభివృద్ధి జరగాలన్నా, వ్యవసాయం లాభసాటిగా మారాలన్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‍డిఐ)లను పక్కన పెట్టి మన దేశంలోని అక్రమ సంపాదనను (నల్లధనం) బయటకు తీసి ప్రజలశ్రేయస్సు కొరకు ఉపయోగించాలి. అందుకు ప్రభుత్వం కార్పొరేట్‍ అనుకూల విధానాలు మార్చుకునేలా ప్రజలు సంఘటితమై ఒత్తిడి తేవలసి ఉంది. ఈ సందర్భంలో లౌకిక, ప్రజాస్వామ్య, అభ్యుదయ శక్తులన్నీ ఐక్యమై బలమైన శక్తిగా రూపొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply