భారతీయ శిక్షాస్మృతిలో ప్రమాదకరమైన మార్పులు

శిక్షాస్మృతి అనగా నేరం, శిక్షతో అనుసంధానించబడిన చట్టాల వ్యవస్థ. ‘వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అనేది న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యంగా ఉండాలని న్యాయ కోవిదులు చెపుతారు.

బ్రిటీష్‌ కాలం నాటి భారతీయ క్రిమినల్‌ న్యాయ వ్యవస్థ ఇక మారనుంది. ఈ మేరకు కేంద్రం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 1960(ఐపిసి), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1898 (సిఆర్‌పిసి), భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872 (ఎవిడెన్స్‌ యాక్ట్‌)లను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆగష్టు 11న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో వివాదస్పద మూడు నూతన క్రిమినల్‌ న్యాయ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టాడు. ఒకటి, ఐపిసికి బదులుగా భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌) అమల్లోకి రానుంది. రెండు, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సిఆర్‌పిసి)కి బదులుగా భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌) అమల్లోకి రానుంది. క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌ 1973లో రి-ఎనాక్ట్‌ చేయబడింది. మూడు, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో భారతీయ సాక్ష్య (బిఎస్‌) రానుంది. దీంతో పాటు పాత సెక్షన్లు కూడా మారిపోనున్నాయి.

ఐసిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్‌ యాక్టులను సంస్కరించేందుకు కేంద్రం 2020 మే లోనే క్రిమినల్‌ లా సంస్కరణల కోసం నిపుణుల కమిటీని నియమించింది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌యు) అప్పటి ఉపకులపతి ప్రొఫెసర్‌ రణ్‌బీర్‌సింగ్‌ సారథ్యంలో అప్పటి ఢిల్లీ ఎన్‌ఎల్‌యూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ బాజ్‌పాయ్‌, డిఎన్‌ఎల్‌యూ వీసీ ప్రొఫెసర్‌ బలరాజ్‌ చౌహాన్‌, సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ, ఢిల్లీ మాజీ జిల్లా-సెషన్స్‌ జడ్జి జిపి తరేజాలను ఇందులో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ తన అధ్యయన నివేదికను 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నిపుణుల సంఘం ప్రభుత్వానికి సమర్పించి సిఫార్సుల్ని ప్రజా క్షేత్రంలో పెట్టలేదు. కాని ఈ బిల్లులకు ఢిల్లీ ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్స్‌లర్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీకృష్ణదేవరావు ఆధ్వర్యంలోని కమిటీ అనేక కీలక మార్పులు సూచించింది.

ప్రభుత్వం బ్రిటీష్‌ కాలం నాటి మూడు చట్టాలను మారుస్తున్నామంటూనే ఆ చట్టాలను అంతకన్నా కిరాతకంగా తయారు చేయడానికి సిద్ధమైంది. మునుపటి చట్టాలకన్నా ఈ బిల్లులు మరింత కర్కోటకంగా కనిపిస్తున్నాయి. వీటిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ స్థాయీ సంఘ పరిశీలనకు పంపి ఆ తరువాత పార్లమెంటు ఆమోదం పొందుతారట. అలాగే, ప్రస్తుతం ఐపిసిలో ప్రస్తుతం ఉన్న 511 సెక్షన్లు రాబోయే భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌)లో 356కు కుదించారు. సిఆర్‌పిసిలో 484 సెక్షన్లు ఉండగా రాబోయే నాగరిక్‌ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)లో 533కి పెంచారు. ఇక భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో 167 సెక్షన్లు ఉండగా రాబోయే భారతీయ సాక్ష్య (బిఎస్‌)లో 170కి పెంచారు.

తాజాగా తీసుకువస్తున్న ఐపిసి, సిఆర్‌పిసి చట్టాల్లో మార్పులు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా, భవిష్యత్తు తరాల స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయి. నూతన బిల్లులలో ప్రతిపాదించిన కొన్ని మార్పులు ఆందోళన రేపుతున్నాయి. ప్రధానంగా వివిధ కేసుల్లో పోలీసు కస్టడీని 15 రోజులకు మించకుండా ప్రస్తుత చట్టాల్లో ఉండగా కొత్త చట్టాల్లో 15 రోజుల నుంచి 45 రోజులకు, తరువాత 90రోజులకు పెంచుకునే వెసులుబాటు ఉండటం వల్ల పోలీసు రాజ్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 90 రోజులు పోలీసు కస్టడిలో ఉంచుకోవడమంటే ప్రత్యర్థులపై రాజకీయంగా కక్ష సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గత తొమ్మిదేళ్లలో రచయితలు, కళాకారులు, హక్కుల సంఘల కార్యకర్తలు, సామాజిక మేధావులు, పత్రికా రిపోర్టర్లు కేంద్రం వేధింపులకు, అక్రమ కేసులకు గురై విచారణ జరుపకుండా, బెయిల్‌ మంజూరు చేయకుండా నిర్బంధించిన సందర్భాలు మనం చూశాం.

మారింది రాజద్రోహ చట్టం కాదు- పేరు మార్పే :

వాస్తవానికి రాజద్రోహ చట్టాన్ని అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ఏడాది కిందట (11 మే 2022) ఎన్‌.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రమణతో పాటు న్యాయమూర్తులు సూర్యకాంత్‌, హిమాకొహ్లీతో కూడిన బెంచి తీర్పు చెప్పింది. ఆ తీర్పులో 124(ఎ)ను అమలు చేయకుండా ఉండడంతో పాటు దీన్ని సమీక్షించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. అప్పటికే ఉన్న కేసులలో బలాత్కారానికి పాల్పడకూడదని కూడా చెప్పింది. అప్పటి నుంచి 124(ఎ) సెక్షన్‌ను అమలు చేయకుండా పక్కన పెట్టారు. ఇప్పుడు సుప్రీం తీర్పును వమ్ముచేసి ఆ అంశాలకు మించిన అంశాలను చేర్చి అమలు చేయడానికి వీలుగా భారతీయ న్యాయ సంహితలో వెసులుబాటు కల్పించారు. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, తరచి చూస్తే పేరు మార్పే తప్ప గుణంలో మార్పు ఏమీ లేదని కొత్త రూపంలో ఉన్న భారత న్యాయ సంహితలోని సెక్షన్‌ 150ని చూస్తే అర్థమవుతుంది. వలస కాలం నాటి అణచివేతకన్నా మరింత ఎక్కువ అణచివేతే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ఈ సెక్షన్‌ను (కొత్త దేశద్రోహ నిబంధనను) తీసుకొచ్చినట్లుగా స్పష్టమవుతున్నది.

కొత్త బిల్లుల్లో అమిత్‌ షా చేసిందల్లా దేశద్రోహం లేదా రాజద్రోహం అన్న మాటను తొలగించడమే. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడాన్ని దేశద్రోహంగా పరిగణించే పార్టీ నుంచి అంతకన్నా ఏం ఆశించగలం! దేశద్రోహ నిబంధనకు బదులు భారతీయ న్యాయ సంహితలో 124(ఎ) సెక్షన్‌లో ఉన్న దానికన్న ఎక్కువ కఠినమైన అంశాలను 150 సెక్షన్లలో చేర్చారు. 124(ఎ)లో ఇదివరకు ఉన్న అంశాలకు తోడు ప్రస్తుత కాలంలో ఎలాక్ట్రానిక్‌ పద్ధతి లాంటి మార్పులను చేర్చి ఈ బిల్లులను మరింత వికృతీకరించారు. భారత న్యాయ సంహిత బిల్లులోని సెక్షన్‌ 150 ప్రకారం… ‘మాటలు, రాతలు, సంజ్ఞల ద్వారా గానీ, ప్రతినిధులు, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌, ఆర్థిక కార్యకలాపాల ద్వారా భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతకు ప్రమాదకరంగా మారే ఏ చర్య అయినా దేశద్రోహమే అవుతుంది. వేర్పాటువాదం, విభజన, సాయుధ తిరుగుబాటుకు ఉద్దేశించిన చర్యలన్నీ దేశద్రోహమే. వీటికి ఏడేళ్ల నుంచి జీవితకాలం జైలు శిక్ష ఉంటుంది’ అని పేర్కొంటోంది.

ప్రస్తుత దేశద్రోహ చట్టం ప్రకారం ఉన్న కనిష్ఠ శిక్ష మూడేళ్ల జైలును భారత న్యాయ సంహిత బిల్లులోని సెక్షన్‌ 150 ఏడేళ్లకు పెంచింది. అంతేకాదు, క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి) స్థానంలో తీసుకొచ్చిన భారతీయ నాగరిక్‌ సురక్షా సంహీత బిల్లులో కూడా దేశద్రోహం కేసులకు సంబంధించిన వివరణ ఉంది. దాని ప్రకారం, నిందితుడు/నిందితురాలు దేశద్రోహానికి పాల్పడినట్లుగా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌కు సమాచారం అందితే చాలు. ఏలాంటి ఆధారాలు చూపనవసరం లేదు. ఆ మేరకు ‘విచారణ ప్రక్రియ’ను ప్రారంభించవచ్చు. అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఉన్న చట్టానికి మరిన్ని కోరలు చేర్చి తీసుకొచ్చిందని హక్కుల సంఘాల నేతలు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 124(ఎ) దేశ ద్రోహానికి సంబంధించింది. ఇది బ్రిటీష్‌ హయాంలో అమలులోకి వచ్చింది. బాల గంగాధర్‌ తిలక్‌, మహాత్మాగాంధీ లాంటి వారిమీద ఈ సెక్షన్‌ ఆధారంగానే దేశద్రోహ ఆరోపణలు మోపారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టంలో దేశద్రోహానికి ఇంకా అవకాశం ఉండడం అత్యంత గర్హనీయమే. కానీ ఇప్పటిదాకా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దేశద్రోహ చట్టాన్ని మాత్రం తొలగించలేదు. ప్రభుత్వ వ్యతిరేకతే దేశ ద్రోహంగా చలమాణి అయింది. ఇప్పుడు దాన్ని తొలగిస్తున్నామని అమిత్‌ షా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ భారతీయ న్యాయ సంహిత బిల్లులోని 150వ సెక్షన్‌ బ్రిటీష్‌ హయాం నాటికన్నా కఠినంగా ఉంది. అంటే వలసవాద చట్టాలను మార్చేస్తున్నామని అమిత్‌ షా చెప్పడం పచ్చి మోసమే. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని (యుఎపిఎ) అంశాలన్నీ కూడా కొత్త బిల్లులో చేర్చారు. అమిత్‌ షా చెప్తున్న మార్పు ఎంత మాత్రం సంస్కరణ కాదు. అది కేవలం ప్రతీకాత్మమైన మార్పే. ఇంగ్లీషు పేరు పోయి హిందీ పేరు వస్తుంది. ఆ హిందీ కూడా సంస్కృత భూయిష్టమైంది. అంటే మార్పు మోసపూరితమైందే.

ప్రత్యర్థుల నోరు మూయించడానికే నూతన చట్టాలు :

అనేక దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి. కొన్ని దేశాల్లో రద్దు చేయకపోయినా విధించడం లేదు. కానీ అమిత్‌ షా ప్రవేశపెట్టిన బిల్లుల్లో మరణశిక్ష విధించే వెసులుబాటు ఉండడం గర్హనీయం. తీవ్రమైన శిక్ష విధిస్తే నేరాలను అదుపు చేయవచ్చునన్న తప్పుడు అవగాహనకే ఇది సంకేతం. మన దేశంలో సహా మరణశిక్ష విధించే అవకాశం ఉన్న ఏ దేశంలోనూ హత్యలు, ఘోరమైన నేరాలు తగ్గిన దాఖలాలు లేవు. మరణ శిక్ష విధించడం అంటే రాజ్య వ్యవస్థ దోషులనుకున్న వారిని హతమార్చడానికి అనుమతించడమే. బ్రిటీష్‌ వలసవాదులు భారతీయులను తమ శత్రువులుగా భావించారు. కఠిన శిక్షలు విధించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజలను శత్రువులుగా భావించి మరణశిక్ష విధించడమంటే, బ్రిటిష్‌ పాలకుల కంటే భిన్నం కాదని అర్థమవుతుంది. పైగా ఈ కొత్త బిల్లులు శిక్షించడానికి కాదనీ, ప్రజలకు న్యాయం చేయడానికేనని అమిత్‌ షా వాఖ్యానించడం పూర్తిగా మోసపూరితం.

బిజెపి తమ పాలనను భారతీయత అని బాకా ఊదుకుంటున్నా సారంలో వలసవాద ప్రజావ్యతిరేక విధానాలను ఏ మాత్రం విడనాడలేదు. ప్రజల హక్కులను కాలరాయడం మానలేదు. ప్రజలను బిజెపి శత్రువుల్లాగే భావిస్తోంది. కొత్త బిల్లులో ఉన్న వేర్పాటువాదం అన్న మాటకు నిర్వచనం ఎక్కడా లేదు. అంటే తమకు అనువుగా ఆ మాటను విడమర్చడానికి అవకాశాన్ని బిజెపి ప్రభుత్వం అట్టి పెట్టుకుంది. అలాగే సార్వభౌమాధికారానికి హానికారక చర్యలు శిక్షార్హమంటూ కొత్త మాట తగిలించారు. ఏ చర్యలు ఈ నేరమనేది స్పష్టత లేదు. దీంతో పోలీసులు ఇష్టారాజ్యపు అరెస్టులకు అవకాశం కలుగుతుంది. ఇప్పటిదాక ఐపిసిలో లేని వ్యవస్థీకృత నేరం, తీవ్రవాద నేరాలు, మూకదాడి లాంటివీ నూతనంగా చేర్చారు. వివాదస్పద ‘ఉపా’ చట్టంలోని సెక్షన్లను తీసుకుని ఇందులో చేర్చింది.

తీవ్రవాదం అంటే…

తీవ్రవాదం అంటే ఏమిటో కేంద్రం తొలిసారి నిర్వచించింది. కొత్త బిల్లులో దాని పరిధిని నిర్దేశించింది. ‘భారతదేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా దేశం బయట లేక లోపల ఉండి ప్రయత్నించేవారంతా తీవ్రవాదులే. దేశ విచ్ఛిన్నంలో భాగంగా జనజీవనాన్ని లేక అందులోని ప్రధాన సమూహాన్ని భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడాన్ని తీవ్రవాద చర్యలుగానే పరిగణించాలి. తీవ్రవాద చర్యలకు పాల్పడినా.. తద్వారా మరణాలు సంభవించినా… మరణశిక్ష లేదా పెరోల్‌ లేకుండా జీవిత ఖైదు విధించవచ్చు. రూ.10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. ‘తీవ్రవాద నేరం రుజువై యావజ్జీవ శిక్ష పడినవారి శిక్షాకాలం తగ్గించే అంశాన్ని ఏడేళ్ల శిక్ష అనుభవించిన తర్వాత పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నేర చర్యలకు పాల్పడిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు హత్యానేరాన్ని ఐపిసి సెక్షన్‌-302 కింద నమోదు చేస్తుండగా ఇకపై అది బిఎన్‌ఎస్‌ 99గా మారనుంది. దర్యాప్తు జరుగుతున్నదంటూ పోలీసులు నిరవధికంగా ఆలస్యం చేయడానికి గల అవకాశాలను తొలగిస్తున్నట్టు హోం మంత్రి తెలిపారు. వారు ప్రాథమిక అభియోగ పత్రాన్ని (చార్జిషీట్‌) దాఖలు చేయడానికి గరిష్టంగా 180 రోజుల వ్యవధి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగే నేర పరిశోధనలో భాగంగా సోదాలు, స్వాధీనాలు జరిపేటప్పుడు పోలీసులు తప్పనిసరిగా వాటిని వీడియో తీయాలని, అది లేకుండా చార్జిషీట్‌ను అనుమతించడం జరగదని ఈ బిల్లు పేర్కొంటుంది. ఇకపై ఎఫ్‌ఐఆర్‌ నుంచి కేసు డైరీ వరకు, చార్జ్‌షీట్‌ నుంచి న్యాయం వరకు అన్నీ డిజిటలైజ్‌ అవుతున్నాయని పేర్కొన్నారు. అయితే, సాక్ష్యాల సేకరణ, విశ్లేషణ, వాటిని కోర్టులో వినియోగించే తీరుపై స్పష్టత లేదు.

బెయిల్‌ నిర్ణయంలో చేపట్టాల్సిన సంస్కరణల్ని పట్టించుకోలేదు. విచారణ పేరుతో జైళ్లలో మగ్గుతున్న ఖైదీల గురించి, కిక్కిరిసిన జైళ్ల లాంటి సమస్యలను పట్టించుకోలేదు. కానీ న్యాయ సమీక్షకు అందకుండా నిరవధికంగా జైలు పాలు చేసేందుకు అవకాశమున్న ప్రతిఒక్క సెక్షన్‌ను, చట్టాన్ని మానవీయ కోణంతో సవరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తీవ్రవాదులను శిక్షించే పేరిట ప్రభుత్వం తనకు గిట్టని వ్యక్తులను, మేధావులను జైల్లో పెట్టేందుకు వాడుకొంటున్న ‘ఉపా’ వంటి శాసనాలను కూడా పునఃపరిశీలించవలసి ఉంది. బెయిల్‌ కుడా నిరాకరిస్తూ నిరవధిక నిర్బంధానికి అవకాశం కలిగిస్తున్న చట్టాలను మార్చవలసి ఉంది.

అత్యాచారం నిందితులకు కనీసం పదేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదు విధిస్తారు. సామూహిక అత్యాచారాలకు కనీసం 20 ఏళ్లు, లేదంటే జీవించి ఉన్నంత వరకు కారాగారం విధిస్తారు.అత్యాచార బాధితులు మరణించినా, కోమాలోకి వెళ్లినా నిందితుడికి గరిష్టంగా 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. జీవిత ఖైదుకు కూడా పెంచే అవకాశం ఉంది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికపై అత్యాచారాలకు పాల్పడితే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. మరణిశిక్ష కూడా విధించవచ్చు. ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారి, సాయుధ బలగాల సభ్యుడు అత్యాచారానికి పాల్పడితే కనీసం 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. జీవిత ఖైదుకు కూడా మార్చవచ్చు. ఎన్నికల నేరాలకు కూడా శిక్షలున్నాయి. ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం నేరంగా భావిస్తారు. ఓటర్లకు ఇచ్చే ఎన్నికల హామీని బహిరంగంగా ప్రకటించడం నేరం కాదు. సంస్థాగత నేరాలకు పాల్పడినా, అందుకు ప్రయత్నించినా, దానివల్ల ఎవరైనా మరణించినా మరణశిక్ష, లేదంటే జీవిత ఖైదు అనుభవించాల్సి ఉంటుంది. అలాగే, రూ. 10 లక్షల జరిమానా కూడా చెల్లించుకోవాలి.

పాలనాపరమైన చర్యలను లేదా ప్రభుత్వ చర్యలను విద్వేషం రెచ్చగొట్టడానికి, ఏహ్యభావం పెంచడానికి, అసంతృప్తి వ్యక్తం చేయడానికి వాడుకోనంత కాలం కొత్త బిల్లు కింద నేరంకాదని అమిత్‌ షా చెప్పడం సన్నాయి నొక్కులు నొక్కడమే. ఇప్పటి వరకు మోడీ షా హయాంలో మోపిన దేశద్రోహ కేసులు ఏవీ ఈ సంయమనాన్ని పాటించిన ఉదంతమేలేదు. ఉన్న వెసులుబాట్లలోని సందిగ్ధతను తమకు అనుకూలంగా మార్చుకునే పాలకవర్గాలు చట్ట స్ఫూర్తిని గ్రహిస్తాయని చెప్పలేం. రాజకీయ ప్రాబల్యం ఉన్న నేరస్థులకు ప్రభుత్వం ఇష్టానుసారంగా శిక్ష తగ్గించడానికి వీలు లేకుండా ఈ బిల్లులు రూపొందించామని చెప్పడానికి అమిత్‌ షా బీహార్‌లో ఆనంద్‌ మోహన్‌ విడుదలను ఉదహరించారు. కానీ 2002 నాటి గుజరాత్‌ మారణకాండలో మూకుమ్మడి అత్యాచారానికి బలైన బిల్కిస్‌ బానో వ్యవహారంలో శిక్షపూర్తి కాకుండానే దోషులను విడిచిపెట్టింది బిజెపి ప్రభుత్వమేనన్న వాస్తవాన్ని అమిత్‌ షా మరుగుపరిచారు. చట్టం ఎంత కఠినమైంది, సవివరమైంది అన్న దానికన్నా దాన్ని వినియోగిస్తున్న వారి ఉద్దేశం ఏమిటి అని చూసినప్పుడు బిజెపి చట్టస్ఫూర్తిని పట్టించుకున్న దాఖాలాలే లేవు. అమిత్‌ షా ప్రతిపాదించిన బిల్లులు కాయకల్ప చికిత్స కన్నా హీనం.

ముగింపు :

నేర న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమే కాని, వట్టి చట్టాలు మారిస్తే సరిపోదు. నేరాలకు కఠిన శిక్షలు విధించడం, వాటిని నిర్దాక్షిణ్యంగా అమలు పరచడం ఒక పార్శ్వం. ఇప్పటికే నిర్భయ చట్టం వంటి తీవ్రమైన శిక్షలను ఉద్దేశించిన శాసనాలు ప్రభుత్వాల అమ్ములపొదిలో ఉన్నాయి. అంతమాత్రాన ఆ నేరాలు ఆగడం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వ్యవస్థకు, పౌరులకు మధ్య బంధంలో మార్పు తేవాలి. ఎందుకంటే నిత్యం మహిళలపై ఎన్నెన్ని అక్రమాలు సంభవిస్తున్నాయో చెప్పడం కష్టం. 2021 నాటి జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో సమాచారం ప్రకారం ఆ ఏడాది దేశంలో 31,677 రేప్‌ కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 86 కేసులు. 2020లో 28,046 కేసులు, 2019లో 32,033 కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. మహిళలపై అత్యాచారాలు ఏటేటా పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు.

అత్యాచారాలు చేసే వారికి చట్టం గురించి తెలియదా? తెలిసీ దానిని ఖాతరు చేయకుండా నేరాలకు పాల్పడుతున్నారా? అదే జరుగుతుంటే అందుకు గల మూల కారణాన్ని శోధించి తగిన పరిష్కారాన్ని కనుక్కోవాలి. సాంస్కృతిక ఆధిపత్యం, సామాజిక ఆర్థిక అంతరాలు ఉన్నంతవరకు, స్త్రీని ద్వితీయ శ్రేణి పౌరురాలిగా పరిగణించే ధోరణి ఉన్నంత వరకు శిక్షాస్మృతులను ఎంత కఠినంగా తీర్చిదిద్దినా ఆశించిన ప్రయోజనం ఉండదు, అన్ని నేరాల సందర్భంగానూ వాస్తవ స్థితిని తెలుసుకొని శాస్త్రీయమైన దృష్టితో చట్టాలను సవరించే వైఖరి సమాజానికి మేలు చేస్తుంది. న్యాయ వ్యవస్థపైన విశ్వాసాన్ని పెంచుతుంది.

దేశంలో, రాష్ట్రంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానాలలోనే సరైన సిబ్బంది నియామకం చేయకుండా కోర్టులను నిర్వహిస్తూ సత్వర న్యాయమంటూ చిలుక పలుకులు పలకడం ఏలిన వారికి చెల్లింది. అంతేగాక ఉన్న చట్టాల పేరు మార్చి ఏదో జరుగుతోందని ప్రజలను భ్రమింపజేయడం ఎప్పటిలాగే వారి దిగజారుడుతనానికి నిదర్శనం.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply