భాగ్యరెడ్డి వర్మ నుంచి అంబేద్కర్ దాకా – 2

భాగ్యరెడ్డివర్మ నిజాం రాష్ట్రంలో దళిత సమస్యపై పనిచేస్తూనే అనంతపురం (1925), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం (1929), బెజవాడ(1930), విజయనగరం (1936), తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాళ్లరేవు (1938) వంటి ప్రాంతాలలో జరిగిన ఆది ఆంధ్ర సభలలో అధ్యక్షత వహించి, ఉపన్యాసాలుచేసి దళిత ఆత్మగౌరవ ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించాడు.

1922 లో హైద్రాబాద్ లో అఖిలభారత ఆదిహిందూ సోషల్ కాన్ఫరెన్స్ నిర్వహణలో భాగ్యరెడ్డివర్మ క్రియాశీల భాగస్వామ్యం జాతీయస్థాయి దళితఉద్యమ నిర్మాణం లో ఆయన పాత్రను సూచిస్తుంది. 1930 లో అలహాబాద్ లోను 1931 లో లక్నో లోనూ జరిగిన అఖిలభారత నిమ్నవర్గాల సదస్సుల లో ఆయన పాల్గొన్నాడు. ఈ సదస్సులకు ఒక చారిత్రక ప్రాధాన్యం వుంది. అలహాబాద్ సదస్సునాటికి రౌండ్ టేబిల్ సమావేశానికి నిమ్నవర్గాల ప్రతినిధులుగా డాక్టర్ అంబేద్కర్, రావూబహదూర్ శ్రీనివాసన్ నియమితులయ్యారు. దానికి హర్షం వ్యక్తంచేస్తూ ఈ సదస్సులో శాసన సభలకు నిమ్నవర్గాల ప్రతినిధులను నామినేట్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్ తో తమవారిని ఎన్నుకొని శాసన సభలకు పంపే హక్కు ను కోరుతూ ఒక తీర్మానం, ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు, ఒకవేళ అది సాధ్యం కాకపోతే, తగినంత ప్రాతినిధ్యం, వయోజన ఓటుహక్కు వంటి మరికొన్ని తీర్మానాలు చేశారు.

1930లో జరిగిన రౌండ్ టేబిల్ సమావేశంలో మైనార్టీ ఉప సంఘం ముందు అంబేద్కర్ వాదన ఈ తీర్మానాల ప్రాతిపదిక మీదనే జరిగింది. శాసనసభలో దళితుల ప్రాతినిధ్యం నామినేషన్ పద్ధతిలో కాక ఎన్నికల ద్వారా జరగాలని స్పష్టంగా ప్రకటించాడు. సమాన పౌరసత్వం, సమాన హక్కుల స్వేఛ్ఛానుభవం, అంటరానితనాన్ని నేరంగా పరిగణించటం, శిక్షించటం, వివక్షకు వ్యతిరేకంగా కల్పించవలసిన భద్రత, శాసన సభలో తగినప్రాతినిధ్యం, సేవా రంగంలో తగిన ప్రాతినిధ్యం, దళితుల ప్రయోజనాలకు భంగకరమైన పరిస్థితులకు వ్యతిరేకంగా పరిహారం – మొదలైన అంశాలమీద ఆయన చర్చించాడు. సిఫారసులు చేసాడు. వాటికి మద్దతు ప్రకటిస్తూ భారతదేశంలోని ఏడుకోట్ల మంది అంటరానివాళ్లకు ఏకైక ప్రతినిధిగా అంబేద్కర్ ను పేర్కొంటూ తీర్మానం చేసిన సదస్సు 1931 నాటి లక్నో సదస్సు. దీనికి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షుడు.

ఈ విధంగా అంటరానితనం ఒక సామాజిక సమస్య మాత్రమే కాదు, అది ఒకరాజకీయ సమస్య కూడా అని, దానికి రాజకీయ పరిష్కారాలను అన్వేషించే దిశగా సాగిన ప్రయాణంలో అంబేద్కర్ తో పాటు నడచినవాడు భాగ్యరెడ్డివర్మ. అయితే ఆయన అంబేద్కర్ ను ఎక్కడా కలిసినట్లు కనబడదు. 1936 లో లక్నోలోనే అంబేద్కర్ అధ్యక్షతన జరగనున్న అఖిలభారత ఆదిహిందూ సభకు ఆహ్వానం వచ్చినా అనారోగ్య కారణాల రీత్యా పోలేకపోయాడు.

మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ వాదనల ఫలితం అన్నట్లుగా 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డ్ ప్రకటించారు. దాని ప్రకారం అగ్రవర్ణాలకు, దళితులకు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లోఇండియన్లు , యూరోపియన్లు మొదలైన మైనారిటీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు జరుగుతుంది. ఈ కమ్యూనల్ అవార్డ్ షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటుచేయడం ద్వారా హిందువులను చీలుస్తున్నది అని నిరసిస్తూ గాంధీ ఎరవాడ జైలు నుండి నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. దానిని విరమింపచేయటానికి అగ్రవర్ణ హిందూ ప్రతినిధులకు అణచబడిన వర్గాల ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చల ఫలితంగా వచ్చిందే పూనా ఒడంబడిక (1932 సెప్టెంబర్ 24 ). అగ్ర వర్ణ హిందూ ప్రతినిధిగా మదన్ మోహన్ మాలవ్యా, దళితుల ప్రతినిధిగా అంబేద్కర్ దానిమీద సంతకం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక వర్గాల స్థానంలో హిందూ నియోజక వర్గాలలోనే జనాభా కు తగినట్లు స్థానాలను కేటాయించటానికి నిర్ణయం జరిగింది. దళితఉద్యమ చరిత్రలో మొదటిదశ ఈ రకమైన రాజకీయ పరిష్కారంతో ఒక ముగింపుకు వచ్చింది. ఈ దశలో వచ్చిన ఒక రాజకీయ నవల ‘హరిజన నాయకుడు’. రచయిత ఆచార్య రంగ.

ఆచార్య జి ఎన్ రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (1900- 1995) ఉన్నవ లక్ష్మీ నారాయణ వలెనే జాతీయోద్యమ రాజకీయాలలో క్రియాశీల భాగస్వామి. మాలపల్లి నవల ప్రభావం ఆయనపై ఉంది. గాంధీ నిర్వహిస్తున్న అస్పృశ్యతా నివారణో ద్యమం పట్ల విశ్వాసం ఉంది. అందుకే తానూ అందులో భాగమయ్యాడు. పూనా ఒడంబడిక ద్వారా గాంధీ సాధించిన విజయం బహుశా ఆయనను ఉత్సాహ పెట్టి ఈ నవల రాయటానికి కారణమై ఉంటుంది. అయితే ఆయన ఈ నవలలో దాని ప్రస్తావన తీసుకురాలేదు. 1916 నుండి 1928 వరకు పన్నెండు ఏళ్ల కాలం మీద కథను నడిపి సైమన్ కమిషన్ రాక భారత జాతీయోద్యమ రాజకీయాలలో కలిగించిన అలజడి ప్రస్తావనతోనే ఆ ప్రయోజనాన్ని సాధించాడు.

దౌర్జన్యం, ద్వేషపూరితమైన ప్రవుత్తి వదులుకొంటూ పై వర్ణాలవాళ్ళు క్రమంగా అలవరచుకొనే సంస్కార దృక్పథం వల్ల హరిజనాభ్యుదయం సమకూరుతుంది. అందుకు వాళ్ళను సిద్ధం చేస్తూ ఉండాలి తప్ప దళితులు ఆందోళనలకు దిగరాదు అన్న గాంధీ ఆదర్శాన్ని మానవ సంబంధాలలో నిరూపించే ప్రయత్నం హరిజన నాయకుడు నవల. అందుకే అంటరానితనం ఒక సమస్యే కాదు, కమ్మ భూస్వాములు, శూద్ర రైతులు, మాల, మాదిగ రైతుకూలీలు అందరూ స్నేహ సమభావ సంబంధాలలోనే ఉన్నారన్న భ్రమను సత్యమనుకొనే మనుషులున్న ఒక ఊరిని సృష్టించి కథ నడిపాడు. అంటరానితనం వల్ల అనుభవానికి వచ్చే నొప్పి ఏదో లేకపోతే తల్లిదండ్రులకైనా చెప్పకుండా ఆ ఊరిని వదిలి బెజవాడ వెళ్లి మిషనరీ ని ఆశ్రయించి చదువుకోవాల్సిన పరిస్థితి ముత్తయ్యకు ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు ఇందులో సమాధానం దొరకదు.

ముత్తయ్య వంటివారు చదువుకొంటున్నారు. ఆత్మగౌరవ చైతన్యంతో కొత్త మనుషులు అవుతున్నారు. కొత్త ఆకాంక్షలను వ్యక్తీకరిస్తున్నారు. నాయకులుగా ఎదిగుతున్నారు. తమజాతి ఉద్ధరణకోసం పూనుకొంటున్నారు. అది వర్తమాన వాస్తవికత. అది అగ్రవర్ణ వర్గ హిందూ సమాజంతో తీవ్ర ఘర్షణగా మారకుండా చూడటమే గాంధీ హరిజనోద్యమ లక్ష్యం. ఆ దిశగా అభివృద్ధి చేయబడిందే ‘హరిజన నాయకుడు’ నవల ఇతివృత్తం. అందుకనే అంటరానివారికి దేవాలయప్రవేశం, బడులలో ప్రవేశం మొదలైనవాటిని సమస్యాత్మకంగా మారకుండా సాధించటంలో అటు దళిత నాయకులు, ఇటు అగ్రవర్ణ, శూద్ర జాతులు చొరవ చూపటాన్ని, సామరస్యపూర్వక సర్దుబాటు ధోరణితో ప్రవర్తించటాన్ని అనేక సందర్భాలను, సంఘటనలను కల్పించి చూపాడు రచయిత.

మాలపల్లి నవల కానీ, హరిజన నాయకుడు నవల గానీ ప్రధానంగా కమ్మ భూస్వామ్య వర్గానికి దళితులకు మధ్య వైరుధ్యాలను, సంఘర్షణలను , సర్దుబాట్లను చిత్రించినవే. వాళ్ళ మధ్య వుండే ఉత్పత్తి సంబంధంలోని సేవ్య సేవక లక్షణం తరచు అందుకు కారణమవుతుంటుంది. హరిజన నాయకుడు నవలలో అటువంటి వైరుధ్యాలు సెల వేయకుండా జాగ్రత్తపడే జీవితవిధానం ఒకటి వేల్పూరులో సఫలమైన ఒక ప్రయోగంగా కనిపించినప్పటికీ గ్రామాలలో దళితులపై దోపిడీ పీడనలు, దౌర్జన్యం దాచేస్తే దాగని సత్యాలే. అలా గొల్లపూడి, రామవరప్పాడు, కొండూరు గ్రామాలలో దళితులపై జరిగిన దాడులు కోర్టులో విచారింప బడుతున్న ఒక సందర్భాన్ని ఈ నవలలో చూస్తాం.కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళ సంభాషణలను బట్టి ఆ కేసుకు ముందు జరిగిన ఘటనలను ఊహించవచ్చు. దళితులు హక్కుల కోసం అడిగారు. అవి ఆత్మగౌరవానికి సంబంధించినవి కావచ్చు, అస్పృశ్య నివారణకు సంబంధించిన డిమాండ్లు కావచ్చు. కూలి రేట్ల పెంపుదలకో, పని గంటలకో సంబంధించినవి కావచ్చు. వీళ్ళు అడిగే వాళ్ళా అని అహంకరించి అగ్రవర్ణ ఆసాములు వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఇళ్ళు తగలబెట్టారు. పైగా వాళ్లనే నిందితులను చేసి పోలీసు ఠాణాలో పెట్టించారు. కోర్టులకు ఎక్కించారు. బసవలింగయ్య దళితుల పక్షాన ఈ కేసులో వాదించి ప్రతిపక్షాన్ని రాజీకి దిగివచ్చేట్లు చేయటం అది నవలలో విషయం. ఆదాల ఉంచితే నవలలో ఈ సంఘటన, సంభాషణ కారంచేడు, చుండూరు ఘటనలను గుర్తు చేస్తాయి. ఎన్ని కారంచేడులు, ఎన్ని చుండూరులు ఇలా చరిత్ర గర్భంలో ఉన్నాయో తలచుకొంటే గుండెలు అవిసిపోతాయి. ఎన్ని కారంచేడులు, ఎన్ని చుండూరుల దుఃఖాగ్ని నుండి పదునెక్కిందో ఈ నాటి దళిత ఉద్యమ చైతన్యం అని తెలిసి వస్తుంది.

ఈ కేసులో రాజీకి సానుకూలం చేసిన దళిత మహిళల పాత్ర ప్రస్తావించబడింది. దళితుల మీద దౌర్జన్యం చేసిన రైతుల భార్యలు బాధిత దళితుల భార్యల దగ్గరకు పోయి పనిపాటలలో, పెట్టుపోతలలో తమకు వాళ్లకు ఉన్న స్నేహాన్ని గుర్తుచేసి తమ తమ భర్తలను జైలు పాలు కానీకుండా చూడమని కోరిన కోరికకు స్పందించి దళిత మహిళలు బసవలింగయ్య దగ్గరకు వచ్చి తమ అభిప్రాయం చెప్పినట్లుగా ఒక ఘటన కల్పించబడింది. అగ్రవర్ణ భూస్వామ్య పురుషులు దళితుల హృదయాలను చూరగొనే పనులు చేయలేక అనవసరపు సమస్యలలో ఇరుక్కుంటుంటే వాళ్ళ స్త్రీలు మాత్రం దళిత స్త్రీల హృదయాలను గెలుచుకోగలిగిన స్థితిలో ఉన్నారన్న ఒక కోణాన్ని ఇది చూపుతుంది. ఈ ఘటన దళిత స్త్రీల మీద తమపురుషులు అత్యాచారాలు చేస్తుంటే సమ్మతిని తెలుపుతున్నట్లుగా మౌనంగా ఉండిపోతున్న, ప్రోత్సహిస్తున్నట్లు ప్రవర్తిస్తున్న అగ్రవర్ణ స్త్రీలపై ఈ నాటి దళిత మహిళల ఆగ్రహం లోని న్యాయం తప్పక గుర్తించవలసినదే.

హరిజనులు హిందూ సంఘంలో భాగంగానే ఉండాలన్న గాంధీ ఆకాంక్షకు ఆచరణ ముఖంగా ఇందులో బసవలింగయ్యగా పేరు మార్చబడిన ముత్తయ్య ప్రవృత్తి తీర్చి దిద్దబడింది. క్రైస్తవం తీసుకుంటేగానీ మిషనరీ నుండి తన పై చదువులకు సహాయం లభించదని తెలిసినప్పుడు అవకాశాలనైనా వదులుకొనటానికి సిద్ధపడ్డాడుకానీ హిందూమతాన్ని వదులుకోనన్నాడు. స్వజాతి ఉద్ధరణ ప్రచార కార్యక్రమాలలో గానీ, జాతీయోద్యమ రాజకీయ ప్రచార కార్యక్రమాలలో గానీ పంచములు హిందువులేనని , వారి హృదయాలలో హిందూమత సాంఘిక సాంప్రదాయ జ్ఞానం జీర్ణమై ఉందని, వాళ్ళు హిందువులకంటే భిన్నమైన జాతిగా ఉండాలనుకొనటం తప్పని చెప్తూ రావటం ఆ నాటికే చాతుర్వర్ణ వ్యవస్థలో లేని పంచములు హిందువులెట్లా అవుతారని తలెత్తిన ప్రశ్నకు తయారుచేయబడిన సమాధానం ఇది.

ఈ నవలలో మరొక ముఖ్యాంశం – జాతీయోద్యమ లక్ష్యం అయిన ‘ బాధ్యతాయుత స్వపరిపాలన’ లో దళితుల స్థానం గురించిన చర్చ. పూనా ఒడంబడికతో ఏ చర్చ అయితే ఒక కొలిక్కి వచ్చిందో దాని ప్రారంభం 1909 మింటో మార్లే సంస్కరణల లో ఉంది. ఆ చట్టం ప్రకారం మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు కావటంతో సాంఘిక ప్రాతినిధ్య భావన అభివృద్ధి చెందింది. దళితుల ప్రాతినిధ్యం ఎంపిక ప్రకారం జరుగుతూ వచ్చింది. ఈ నవలలో బసవలింగయ్యను కౌన్సిల్ సభ్యుడిగా నియమించటానికి అలాంటి ప్రతిపాదనే వచ్చింది, దానిని అతను తిరస్కరించాడు. ఎంపిక ప్రకారం కాక ఎన్నిక ప్రకారం శాసనసభలకు గౌరవకరం అన్న దళితుల భావనకు అభివ్యక్తి అతని తిరస్కారం. అంతవరకు బాగానే ఉంది. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు అన్నఆ నాటి దళిత ఉద్యమ ఆకాంక్ష ను మాత్రం బలపరచలేకపోయాడు. 1928లో బ్రిటిష్ ఇండియాలో ప్రాతినిధ్య సంస్థల పని తీరును సమీక్షించి సంస్కరణలు సూచించటానికి వచ్చిన సైమన్ కమిషన్ ముందు భారత రాజకీయవేత్తలు, సంఘ పెద్దలు ఎవరూ తమ అభిప్రాయలు చెప్పకూడదని కాంగ్రెస్ తీర్మానించింది, కానీ జస్టిస్ పార్టీ వారు, దళితుల పక్షాన యం. సి. రాజా వంటివారు తమ అభిప్రాయాలను చెప్పారు. దళితులకు ప్రత్యేక ప్రాతినిధ్యం, ప్రత్యేక నియోజకవర్గాలు అన్న ప్రతిపాదనలు అక్కడ ముందుకు వచ్చాయి. అయితే కాంగ్రెస్ వాదిగా రంగా బసవలింగయ్య ముఖంగా వాటిని ఖండించాడు. సైమన్ కమిషన్ ను బహిష్కరించమన్న కాంగ్రెస్ పిలుపుకు స్పందించి నిర్వహించిన ఒక సభలో బసవ లింగయ్య ఎంపిక పద్దతిని, పంచములే పంచమ ప్రతినిధులను ఎన్నుకొనే పద్ధతిని నిరసిస్తూ మాట్లాడటం సభానంతరం 144వ సెక్షన్ ఉల్లంఘించాడన్న కారణంగా పోలీసులు అరెస్ట్ చేయటంతో ఈ నవల ముగుస్తుంది.

పూనా ఒడంబడిక నేపథ్యంలో వచ్చిన ఈ నవల మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ వాదనలను గానీ, కమ్యునల్ అవార్డును గానీ, దానిపై వచ్చిన భిన్నాభిప్రాయాలను గానీ ప్రస్తావించకుండానే పూనా ఒప్పందం ద్వారా కాంగ్రెస్ సాధించిన విజయం 1928 నాటి నుండి కాంగ్రెస్ కట్టుబడి ఉన్న విధానం యొక్క ఔచిత్య ఫలితమే అని సూచించినట్లయింది.
ఇది కాంగ్రెస్ స్వరం, అగ్రవర్ణ హిందూ స్వరం. ఈ సైద్ధాంతిక రాజకీయ పరిణామాలపై దళితుల స్వరం ఏమిటో తెలిపే సాహిత్య రచన ప్రస్తుతానికి లేదు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply