భాగ్యరెడ్డి వర్మ నుంచి అంబేద్కర్ దాకా…

20వ శతాబ్ది ప్రారంభానికి కుల వివిక్ష, మరీ ముఖ్యంగా అంటరానితనం అనేవి మనుషుల మధ్య ఎంత దుర్మార్గమైన అసమానతలను, హద్దులను ఏర్పరచాయో తెలిసిరావటం మొదలైనది. అప్పటికే మహారాష్ట్రలో జ్యోతిబా ఫూలే (1827-1890) కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని ‘గులాంగిరి’ వంటి రచనలలో విమర్శకు పెట్టాడు. కుల వ్యవస్థ గీసిన హద్దులను చెరిపేసి భార్య సావిత్రీబాయి( 1831-1897)తో కలిసి ఒక ఆచరణ కార్యక్రమాన్ని నమూనాగా ఇచ్చాడు.

ఫూలే సమాజంలో అణచివేతకు గురయిన శూద్ర దళిత మహిళా జన జీవన హక్కుల కోసం 1873లో సత్యశోధక్ సమాజాన్ని ఏర్పరచే నాటికి ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం(1848 – 1919 ) సామాజిక సంస్కరణల దిశగా తొలి అడుగులు వేస్తున్నాడు. అతనిని అనుసరిస్తూ రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862 – 1939 ) వచ్చాడు. బాలికల విద్య, స్త్రీ పునర్వివాహ విషయాలలో పని చేయటంతో పాటు అంటరాని తనాన్ని ఇద్దరూ వ్యతిరేకించారు. దానిని ప్రచారం చేయటానికి సభలు పెట్టి ఇతోధికంగా పనిచేశారు. అంటరాని వారి పిల్లలకు విద్య ను అందుబాటులోకి తెచ్చే చొరవ చూపించారు. ఇళ్లను, బడులను, బ్రహ్మసమాజాన్నికూడా వారికి తెరిచి ఉంచారు. అంతకు మించి కుల వివక్ష మూలలను గురించి, బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని గురించి వాళ్ళు చర్చించలేక పోయారు. ఉదారవాద సంస్కర్తలు గానే మిగిలిపోయారు.


క్రైస్తవ మిషనరీలు ఏర్పరచిన పాఠశాలల నుండి అయితనేమి, వాళ్ళ సహకారంతో దళితులు ఏర్పరచిన పాటశాలల నుండి అయితేనేమి, కందుకూరి, రఘుపతి వెంకటరత్నం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం మొదలైన వాళ్ళు ఏర్పరచిన బడులనుండి అయితనేమి, పట్టాభి సీతారామయ్య, కాశీనాథుని నాగేశ్వర రావు, నల్లపాటి హనుమంతరావు, ఉన్నవ లక్ష్మీ నారాయణ వంటి వాళ్ళు చేసిన దోహదం వల్ల అయితనేమి 20వ శతాబ్ది ప్రారంభానికి దళితుల నుండి చదువుకున్న యువతరం తయారైంది.

బ్రిటిష్ వలస ప్రభుత్వం 1901లో జరిపిన ‘జనగణన’ లో ప్రజల కులాలను అధికార శ్రేణిలోని సామాజిక హోదాతో సహా నమోదు చేయటం కుల సమూహాల సమీకరణకు, పై స్థాయిలో ఉన్న కులాలు తమకు నిరాకరించిన సామాజిక హక్కులు, హోదా మొదలైన వాటి గురించి ఆలోచించుకొనటానికి, ఆకాంక్షల వ్యక్తీకరణకు అవకాశం కల్పించింది. అందువలన 20 వశతాబ్ది ప్రారంభం అంటే దళితుల ఆత్మవికాసానికి దళితులే ప్రారంభించిన ప్రయాణం. హైద్రాబాదులో 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించి అందుకు తొలి అడుగు వేశాడు భాగ్యరెడ్డి వర్మ. (1888 – 1939) తల్లిదండ్రులు జూలియా రంగమాంబ, మాదిరి వెంకయ్య అతనికి పెట్టిన పేరు బాగయ్య. కుల గురువు భాగ్యరెడ్డీ అని పిలవటం తో అదే అతని పేరు అయింది. 1913లో ఆర్యసమాజం ఇచ్చిన బిరుదు ‘వర్మ’.

1906లో జగన్ మిత్రమండలి ఏర్పడి, అంటరాని ప్రజల జీవన స్థితి గతులలో మార్పు కోసం ప్రయత్నాలు మొదలైతే 1909 కల్లా “ఎట్టాగు యెక్కువ బ్యామ్మర్లు మాకంటే/ ఎట్టాగు యెక్కువ యేరైన మాకంటే” అంటూ దళితులు ధిక్కార బాణం ఎక్కుపెట్టారు. 1909 భాద్రపద మాసపు ఆంధ్రభారతి పత్రికలో వచ్చిన – రచయిత ఎవరో తెలియని- ఒక పాటలోని పదునెక్కిన మాటలివి. “ అందారు పుట్టిరీ హిందమ్మ తల్లీ కి / అందారు ఒక్కటై ఉందారి సక్కంగ” అని ప్రారంభమయ్యే ఈ పాటలో “వర్ణాలు యెక్కువ పుట్టంగ లేదయ్య” అనటంలో వర్ణాల ఎక్కువ తక్కువలు కూట సృష్టి, కృత్రిమమే కానీ సహజసిద్ధం కాదన్న కవి అవగాహన కనబడుతుంది. “…. …. మావోరు / పదాలు మావోరు ఇంగ్లీషు చదివారు / ఎగబడుతు ఉన్నారు ఎట్టీ వృత్తులకైనా” అన్న పాదాలలో ఎవరికంటే కూడా తాము ఎందులోనూ తక్కువ కాదు అన్న ఆత్మగౌరవ ప్రకటన వినబడుతూనే ఉంది. “మతముచ్చుకుంటేను మావోడవంటారు”అంటూ హిందూ వర్ణవ్యవస్థలో భాగంగా ఉన్నప్పుడు అంటరానివాడు అని దూరం పెట్టిన వాడిని, ఆ చట్రాన్ని దాటి మతం మార్చుకొన్నప్పుడు అంటు దోషం లేదంటూ ఆదరించే బ్రాహ్మణీయ మత ద్వంద్వ వైఖరిని సవాల్ చేయటం చూస్తాం. “హిందూలమై యిప్డు ముందూకు వస్తాము / తమ్మూలమని మీరు మామ్మూల జూడండి” విజ్ఞప్తి వలే కనిపించే ఈ ముగింపు వాక్యాలలో కనిపించేది ఇంకా తరిగిపోని దళితుల సహనమే.

1906లో జగన్ మిత్రమండలి ని ప్రారంభించిన భాగ్యరెడ్డివర్మ దళితులలో ఆత్మగౌరవ వికాసానికి చదువు సరిఅయిన సాధనం అని భావించాడు. 1910 నుండి హైద్రాబాదులో వేరువేరు ప్రాంతాలలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పరచాడు. 1911 లో జగన్ మిత్రమండలి ‘మాన్య సంఘం’ అయింది. మాన్య అంటే గౌరవింప దగినవాళ్లు అని అర్ధం. మీరు ఎవరినైతే అంటరానివాళ్ళు అని తిరస్కరిస్తున్నారో వాళ్ళు గౌరవించదగినవాళ్లు అని సువర్ణ హిందూ సమాజానికి ఎరుక పరచటం, మనం మనుషులమే, గౌరవంగా జీవించే హక్కు ఉన్నవాళ్ళమే అన్న ఆత్మగౌరవ చైతన్యం దళితులలో మేల్కొల్పటం అనే రెండు ప్రయోజనాలను ఏకకాలంలో నెరవేర్చటాన్ని ఉద్దేశించిన పేరు ‘మాన్య సంఘం’. కులాలవారీగా ప్రజలు సమీకరించబడటం, శూద్రులతో కలిసి దళితులు హిందూ వర్ణవ్యవస్థ లో గౌరవకరమైన సమాన భాగస్వామ్యానికి ప్రయత్నించటం అవసరమని భాగ్యరెడ్డి వర్మ ఆశించాడు. అందుకోసం హిందూమత సంస్కరణలుగా వచ్చిన ఆర్యసమాజ్, బ్రహ్మ సమాజ్లతో సంబంధాలు పెట్టుకొనటానికి కూడా ఆయన వెనుకాడలేదు. అయితే అది వ్యర్ధ ప్రయత్నమని 1928 నాటికి ఆయన గ్రహించాడు. వాటి నుండి బయటకు వచ్చాడు. అదలా ఉంచితే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో దళిత ఉద్యమ చైతన్య పరివ్యాప్తికి భాగ్యరెడ్డివర్మ చేసిన కృషి గొప్పది.

అంబేద్కర్ కన్నా వయసులో మూడేళ్లు పెద్దవాడు భాగ్యరెడ్డివర్మ. అంబేద్కర్ 1919 మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణల డ్రాఫ్ట్ కమిటీ ముందు అంటరానివారికి ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు గురించి వాదించే నాటికి పదమూడేళ్ల ముందే దళితాభ్యున్నతికి భాగ్యరెడ్డివర్మ కృషి మొదలైంది. 1906 నుండి ఆ దిశగా చేసిన కృషి 29 ఏళ్ల వయసులో ఆయనను 1917 నవంబర్ 4,5,6 తేదీలలో బెజవాడ లో జరిగిన ఆంధ్రదేశ మొదటి పంచమ సభకు అధ్యక్షత వహించే స్థాయికి తీసుకువెళ్ళింది. ‘పంచమ’ కులం అనేది వేదాలలో, పురాణాలలో లేనేలేదని, హిందూ అగ్రవర్ణ ప్రయోజనాలకోసం కల్పించబడిన ఆ మాటతో మనలను మనం వ్యవహరించుకొనటం గౌరవకరం కాదని, ‘ఆది ఆంధ్రులం’ మనమేనని ఆయన చేసిన వాదన ప్రభావం మర్నాడు ‘పంచముల సదస్సు’ అని రాసి వున్న బానర్ల స్థానంలో ‘ఆది ఆంధ్రుల సదస్సు’ అని రాసిన బానర్లు రావటానికి కారణమైంది.

విజయవాడ సదస్సుకు వెళ్లివచ్చిన మరుసటి నెలలోనే భాగ్యరెడ్డివర్మ దివ్యజ్ఞాన సమాజం సదస్సులో పాల్గొనటానికి కలకత్తా వెళ్లాడు. అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ వేదికపై జరుగుతున్న అఖిలభారత హిందూ సంస్కరణల సదస్సుకు ఆహ్వానం మీద వెళ్లి అంటరాని వర్గాల గత చరిత్రను చెప్పి దానితో పోల్చి వర్తమాన దుస్థితిని వివరించి హిందూ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించే హక్కు దళితులకు ఉందని నొక్కి చెప్పాడు. దీనిని గురించి ఇంతగా చెప్పటం ఎందుకంటే ఆ సభలో గాంధీ ఉన్నాడు. ఉపన్యాసాన్ని విన్నాడు. కాకతాళీయమే కావచ్చు కానీ ఆ కలకత్తా కాంగ్రెస్ వేదికపైనే తొలిసారిగా ‘బడుగు వర్గాలను అసౌకర్యానికి, కష్టనష్టాలకు గురిచేసే సంప్రదాయం పేరిట అమలయ్యే అన్నిరకాల అన్యాయాలను, అక్రమాలను నిర్మూలించాలని, కాంగ్రెస్ తీర్మానించింది. దళితుల ప్రతినిధిగా భాగ్యరెడ్డివర్మ చేసిన ఉపన్యాసానికి దళిత సమస్యపై తొలి దేశీయ రాజకీయ తీర్మానంవెలువడటానికి మధ్య ఆ విధంగా ఒక సంభావ్యత సమకూరింది. తలెత్తి నిలబడుతున్న ప్రజాసమూహాలు ముందుకు తెస్తున్న కొత్త ఆకాంక్షలను పార్టీలు , ప్రభుత్వాలు ఇష్టంగానో ,అయిష్టంగానో వినకతప్పని ఒక చారిత్రక దశ రూపొందుతున్న దృశ్యం ఇది.


1918లో ‘మాన్య సంఘం’ పక్షాన తొలి దళిత పత్రిక ‘ది పంచమ’ వచ్చింది. ‘మాన్య సంఘం’ సెక్రటరీగా ఉన్న ఎస్. ముత్తయ్య సంపాదకుడుగా ఆంగ్లంలో వచ్చిన పత్రిక అది. అంబేద్కర్ మూక్ నాయక్ పత్రిక కంటే రెండేళ్లు ముందుగా ఈ పత్రిక ప్రారంభమైందన్నమాట. అయితే 1917 నాటి సభలోనే పంచమ పదప్రయోగాన్ని తర్కబద్ధంగా ఖండించి బానర్లు మార్చటానికే కారణమైన భాగ్యరెడ్డివర్మ ‘మాన్య సంఘం’ కార్యనిర్వాహక కార్యదర్శిగా అయిఉండి ఈ పత్రికకు ‘ది పంచమ’ అన్న పేరును ఎట్లా అంగీకరించాడో తెలియదు. ఏమైనా భాగ్యరెడ్డి వర్మ వంటివారి వాదనలకు ఫలితంగానే 1922 నాటికి మద్రాస్ ప్రభుత్వం పంచమ అన్న పదానికి బదులు తెలుగు జిల్లాలలో ‘ఆది ఆంధ్ర’ అనే మాటను తమిళ జిల్లాలలో ‘ఆదిద్రవిడ’ అనే మాటను వాడాలని ఆర్డర్ జారీచేసింది.( జిఓ నెం. 817, మార్చ్ 25)

1919లో కృష్ణాజిల్లా మచిలీపట్నంలోను, 1920లో గుడివాడలోను, 1921లో బందరు, భీమవరం, ఏలూరులలోనూ జరిగిన ఆది ఆంధ్రుల సదస్సులకు ఆయన అధ్యక్షుడుగా ఆహ్వానించబడటం – దళిత ఉద్యమ నాయకుడుగా ఆయన ఎంతగా గుర్తించబడ్డాడో, గౌరవించబడ్డాడో సూచిస్తాయి. ఆ క్రమంలోనే ఆయన సాహిత్య నాయకుడు కూడా కాగలిగాడు. అందుకు ఉదాహరణలుగా రెండింటిని పేర్కొనవచ్చు. అవి -ఒకటి కుసుమధర్మన్న రాసిన ‘మాకొద్దీ నల్ల దొరతనము’ (1921) గేయం. రెండు ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన ‘మాలపల్లి’ (1922).
1

”మా కొద్దీ తెల్ల దొరతనం…” అంటూ బ్రిటిష్ వలస పాలనపై నిరసన గళమెత్తి గరిమెళ్ల సత్యనారాయణ స్వరాజ్య ఉద్యమానికి తనకలం, గళం ఇచ్చిన 1921లోనే కుసుమ ధర్మన్న తెల్లదొరతనం సంగతేమో కానీ రోజువారీ అనుభవంలో ఉంటూ, దళితుల మీద స్వారీచేసే నల్ల దొరతనం మాత్రం ఖచ్చితంగా నిరసించవలసినదే నంటూ, నిర్మూలించ వలసినదే నంటూ రాసిన గేయం ”మాకొద్దీ నల్లదొరతనము”. ఒక దళితుడు ఆత్మగౌరవ చేతనతో దళితులందరికీ తనను ప్రతినిధిగా చేసుకొని సమూహపు సమస్యలను తనవిగా చేసుకొని ”మాకొద్దీ నల్ల దొరతనం” అని చెప్తున్నాడు కనుక ఇది ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన గేయం.

కుసుమ ధర్మన్న 1900 లో రాజమండ్రిలో జన్మించాడు. వైద్యవిద్వాన్ పరీక్ష లో ఉత్తీర్ణుడయినాడు. రోగులకు చేయవలసినవాడు ,సామాజిక రోగాలను కుదర్చవలసి ఉన్నదని ఆ వైపుకు దృష్టి మరల్చాడు. గుడివాడలో గూడూరి రామచంద్రరావు స్థాపించిన సేవాశ్రమంలో శిక్షణ పొందాడు. జస్టిస్ పార్టీ పట్ల ఆకర్షితుడైనా , జాతీయవాదిగా కాంగ్రెస్కు దగ్గరైనా అనతి కాలంలోనే ఆయన అంబేద్కర్ మార్గంలోకి వచ్చాడు. అటు వైద్యసేవలను అందిస్తూ ఇటు అంబేద్కర్ ఆశయాలను ప్రచారంచేస్తూ అనేకవూళ్ళు తిరిగాడు. దళితుల సమీకరణకు, అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాడు. తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన జాలా రంగస్వామితో కలిసి అంటు దోషము మానరేలా? అంటూ ఆది హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమం చేపట్టాడు. ఆ క్రమంలో సాహిత్యాన్ని ఆయుధంగా మలచుకొన్నాడు. వాటిలో తొలి రచన మాకొద్దీ నల్ల దొరతనము. “ మాకొద్దీ నల్లదొరతనము -దేవ మాకొద్దీ నల్లదొరతనము- బాబు మాకొద్దీ నల్లదొరతనము”పల్లవి. “మాకు పది మందితో పాటు -పరువు కలగకయున్న -మాకొద్దీ మాకొద్దీ నల్ల దొరతనము అనుపల్లవి ప్రతిచరణం తరువాత పల్లవి అనుపల్లవి కలిసి పునరావృత్తం అవుతుంటాయి. యాభై ఆరు (56) చరణాలు ఉన్నాయి.

ఇందులో దళిత సమస్య అనే నాణానికి ఒక ముఖం అంటరానితనం, మరొక ముఖం ఆర్ధిక దోపిడీ అన్న కవి అవగాహన కనబడుతుంది. పదిమందితో పాటు పరువు లో తమకు వాటా లేకపోవటానికి మూలమైన వివక్ష రూపాలను ధర్మన్న గుర్తించి చూపాడు ఈ దీర్ఘ గేయంలో. “ కుక్క నక్కలకంటె -తక్కువగాజూచి /పెక్కూ బాధలు బెట్టె దారు/ పిల్లికంటె పాపిష్టూలంటారు /కాకికంటేను కొరగామంటారు /పందూలనింట తిరుగనిస్తారు / దున్నాలనూ వాకిండ్లనుంచేరు / మానవులైన మమ్మంటుకోరు/ వారి పాపమేమొ గాని పండి పోయిందయ్యొ”–(6) పక్షులకన్నా, పశువులకన్నా కులం పేరున మనుషులను హీనంచేసిన బ్రాహ్మణీయ మత వ్యవస్థ స్వరూపాన్ని పై ఏడు పాదాలలో వివరించిన కవి ఆ స్థితి పై తన కోపాన్ని “వారి పాపమేమొ గాని పండి పోయిందయ్యొ”– అన్న చివరి పంక్తిలో ప్రకటించాడు. వివక్ష ఒక అమానవీయ స్థితి. వేల ఏళ్లుగా దానిని వ్యవస్థీకరించి అమలుచేస్తున్న వర్గం ఇన్నాళ్లుచేస్తున్నది మహా పాపం. పాపం పండింది అనే జాతీయ పద ప్రయోగం ద్వారా కవి ఆ వర్గం అంత్యకాలాన్ని సంభావించాడు.

గుడులు , బడులు, బావులు, రైళ్లు, పడవలు, కోర్టులు, గ్రామ కచ్చీరులు మొదలైన పబ్లిక్ ప్రదేశాలలో అస్పృశ్యతను పాటిస్తూ సాటిమనుషులను అవమానపరిచే సామాజిక నిర్మాణాన్ని కుసుమ ధర్మన్న ఏవగించుకొన్నాడు. “దారిలో మము జూచి దూరదూరముగాను /తొలగి పోయెదరయ్యొ రామ / మేము మీతోటి నరులాము గామా / తరమికరిచే తాచు బాములామ / పట్టి లాగే రేగు కంపలామ / భయము పుట్టించె దయ్యములామ /కసి గుట్టే కందిరీగలమ?అయ్యొ / చిన్నబుచ్చెదరేల ఇది మీకు ధర్మామ?”(16) అని సవర్ణులను నిలదీశాడు. “మీకు మాకు పుట్టుక నొకటేకాద?/ రక్తమాంసాలు నొకటేగాద” (33)అని తర్కించాడు. “ వారు వీరను వాద భేదమేమి లేక/ భూమి మోయుచున్నదండి /గాలి మీకు మాకు ఒకటేనండి ..” (32) అంటూ సృష్టిలో లేని భేదం జీవితంలో భాగమై మానవ సంబంధాలను శాసించటాన్ని గర్హించాడు.

అస్పృశ్యులంటూ చదువుకూ, జ్ఞానానికీ తమను పరాయీకరించిన వర్ణ ధర్మం అధర్మధర్మం అన్నాడు. “ అచ్చరాలునేర్వ – ముచ్చటున్నగాని / చదువుబడిలో జేరనీరు/ చదువు చదివితె సహించుకోరు” ( 26) అని బ్రాహ్మణ వర్గం తమ పట్ల చేస్తున్న అపచారం గురించి ఆవేదన చెందాడు. తమను అంటరానివారిగా చేసి ముస్లిములను, క్రైస్తవులను అక్కునచేర్చుకొనే బ్రాహ్మణీయ ద్వంద్వనీతిని నిరసించాడు.

దళితులు వర్ణవ్యవస్థలో పీడనకు గురికావటం ఇది వర్గ వ్యవస్థ కూడా కనుక ఆర్ధిక దోపిడీకి గురి కావటం . శ్రమచేసి సంపదలు సృష్టిస్తారు కానీ ఆ సంపదకు పరాయీకరించబడతారు. ఆ ఎరుక కలిగిన కవి కుసుమ ధర్మన్న. ప్రారంభం లోనే “ పన్నెండు మాసాలు పాలేరుతనమున్న /పస్తుబడుచు బ్రతుకాలండి /ఆలీ కూలి జేసి తీరాలండి /పిల్లగాడు పశువుల గాయలండి” అని ఉన్న స్థితిని చెప్తాడు. “పాడిపంటలుమేము కూడబెట్టితేను / కూర్చొని తింటారు వారు /” (4) అనటంలోనూ, మాకష్టమంతాయు తింటారు /కూడుగుడ్డాకు లోటు జేసేరు /(37) అనటంలోనూ, “ మా కళ్ళదుమ్మేసి మాకున్న మాన్యాలు /గదుమూకోని కలుపూ కుంటారు / అప్పులిచ్చి కొంప ముంచుతారు / పిచ్చకుంచాలతో మాకిస్తారు /హెచ్చుగా వారు పుచ్చుకుంటారు” (38) అనటంలోనూ – శ్రమదోపిడీకి గురిఅవుతూ దళితులు ఇంటిల్లిపాదీ ఆరుగాలం పనిచేసినా కనీస అవసరాలు తీరని దుర్భరపరిస్థితులలో మిగిలిపోతున్న దృశ్యమే ఆవిష్కరించబడింది. ‘సుంతపొలము కాసంతైన’ లేని (38) దళితుల స్థితి గురించి ఆలోచించవలసిన అవసరంలేదా అని ప్రశ్నిస్తాడు. దళితులు శ్రమ చేసి పండించిన ధాన్యపు రాసులకు (17), కాయగూరలకు, పండ్లకు లేని అంటూ తాము ముట్టిన ధనానికి లేని అంటు (13) వాళ్లకు ఎలా వచ్చింది? అన్న ప్రశ్నను రేకెత్తించి అది ఎంత మాయో ఆలోచించమంటాడు ధర్మన్న.

మానవులుగా హక్కులు, గౌరవకరమైన జీవితం పొందటానికి అవకాశంలేని దళితులకు స్వాతంత్ర్య ఉద్యమం తో పనేమిటి? అన్నది ధర్మన్నసందేహం.
“ స్వారాజ్యమంటారు – సభలెన్నో జేసేరు / గాంధీకి జయ్ జయ్ యంటారు – దేవ /హిందూ ముసల్మాను లేకమైయుందామంటారు /మన ఖద్దారు గట్టామంటారు /శాంతమే స్వారాజ్యమంటారు / శాంతి సైన్యామంటూ నిలుపుతారు / మా మాలల సంగతియేమి మహిమీద చెప్పారు” ( 23) మాలమాదిగల స్థితిగతులలో మార్పు గురించి మాట్లాడని స్వారాజ్య ఉద్యమం పట్ల గాంధేయవాది అయినప్పటికీ ధర్మన్నకు అంత అసంతృప్తి. పీడితులు, బాధితులు శాంతిగా ఉండటం సాధ్యం కాదని కూడా ఆయన అభిప్రాయం. శాంతమే స్వరాజ్యమంటే దళితులకు శాంతం బోధించే అధికార రాజకీయం తప్ప అది మరొకటి కాదు. “ స్వారాజ్యమనుచు సర్కారుతో పోరాడి / స్వాతంత్రీయ మడుగుతారు / మాకు స్వాతంత్రీయ మివ్వబోరు / గుడిగోప్రాలకైన రానీరు / సత్రమూలందు మమ్ముండ నీరు / నూతినీళ్లన్న తోడుకోనీరు / మాల లంటె హక్కు లేదంటారు / మాకు హక్కు లేదంటే స్వరాజ్యమెక్కడ దక్కు” (40) దళితులకు స్వతంత్రం, సమానహక్కులు ఇయ్యలేక పోతే ఆ స్వరాజ్య ఉద్యమానికి దళితుల అవసరాలు,ప్రయోజనాలరీత్యా ఏ పరమార్ధమూ లేనట్లే. కుసుమ ధర్మన్న వేసిన 1921 నాటి ఈ ప్రశ్నలు అస్తిత్వ ఉద్యమాల సందర్భం నుండి మనకు తరచు వినబడేవే.

ఈ గేయానికి మరొక చారిత్రక ప్రాధాన్యత ఉంది. 42 వ ఖండిక నుండి చివరిదైన 56 వ ఖండికవరకు అది దళితుల ఆత్మగౌరవప్రకటన. మాలమాదిగ కులాలలో పుట్టి ప్రసిద్ధులైన పురాణపురుషులు, చారిత్రిక వ్యక్తులు, దళితాభ్యుదయాన్ని కోరి పనిచేస్తున్న దళిత ఉద్యమనాయకులను, దళితేతరనాయకులు, సాహిత్యకారులు, దళితఉద్యమానికి మద్దతుగా ఉన్నజమిందారులు , సంస్థానాధీశులు అరవై నలుగురు పేర్లతో ప్రస్తావించబడ్డారు. సమూహాలుగా పేర్కొనబడిన వాళ్ళు కూడా ఉన్నారు. పౌరాణిక చారిత్రక వ్యక్తులను మినహాయించి మిగిలిన వాళ్ళ జీవిత విశేషాలను, దళితాభ్యుదయ దృక్పథాన్ని, క్రియాకలాపాల చరిత్ర తో సహా ఒకదగ్గరకు చేర్చగలిగితే 1920 నాటికి వికసించిన దళిత ఉద్యమ స్వరూప స్వభావాలను నిర్ధారణకు అది పెద్ద ముడిసరుకు అవుతుంది. “మా జాతిలో బుట్టి మాకు నాయకులైన / మా చెంత నీడై యుండె /యం. సి. రాజ చెన్నపురిలో నుండె/ ఏలూరు పురమందు దేవేంద్రుడుండె /హైదరాబాదూనా భాగ్యరెడ్డుoడె” (51) అంటూ ఒక జాబితానే ఇచ్చాడు ధర్మన్న. తనను కూడా కలుపుకొని కుసుమ ధర్మన్న పల్లాటి శేషయ్య, మాదిరి ఆదయ్య, అరిగె రామస్వామి,బత్తుల వెంకటరావు, మువ్వల చిన్న కృష్ణయ్య,గడ్డం సేవకదాసు, మాదిరి వెంకట స్వామి మొదలైన వాళ్ళను ప్రస్తావించాడు.

“హైదరాబాదూనా భాగ్యరెడ్డుoడె” అని ఇక్కడ చెప్పిన కవి మళ్ళీ చివరి ఖండికలోచివరి నాలుగు పంక్తులలో మళ్ళీ భాగ్యరెడ్డివర్మను ప్రస్తావించాడు. “ జాతి భేదంబులడుగంటు వఱకు / అంటు మంటై మండిపోయే వఱకు / భాగ్యరెడ్డి హితము నరయువరకు / మా ధర్మన్న బోధ మీరామోదించే వరకు” మాకొద్దీ నల్లదొరతనము అనిప్రకటించాడు. భాగ్యరెడ్డివర్మ దళితుల హితమును గురించి విచారిస్తున్నాడు. మార్గాలు వెతుకుతున్నాడు. ఆయన ఆ మార్గంలో చేస్తున్న కృషి , వ్యక్తిత్వం ఎంత ప్రభావశీలమైనవి అంటే సమకాలంలోనే కుసుమ ధర్మన్నవంటి ఒక సామాజిక రాజకీయ కార్యకర్త , కవి వాటిని గుర్తించి, గౌరవాన్ని అంతకంటే ఎక్కువ నమ్మకాన్నిపెంచుకొని అతనినే ఒక ప్రమాణంగా ప్రతిపాదించగలిగినంతటిది.1917 నుండి ఆదిఆంధ్ర అభ్యుదయాన్ని కోరి ఆంధ్రాప్రాంతాలకు రాకపోకలు ప్రారంభించి, సభలు, సమావేశాలలో ప్రసంగిస్తున్న భాగ్యరెడ్డివర్మ వ్యక్తిత్వాన్ని, దళిత తత్వాన్నిగురించి 1921 నాటికే ధర్మన్న ఒక అంచనాకు రావటం విశేషం.
2

“అంటరానితనమును రూపుమాపుటకు ప్రయత్నించి నిమ్నజాతుల అభివృద్ధికి తోడ్పడవలెను.” అని 1921లో జరిగిన అహ్మదాబాద్ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. ఆ సమావేశంలోనే వాలంటీరులు సంతకంచేయవలసిన ఒక ప్రమాణపత్రం లో “ …. అంటరానితనము దోషమనీ, అన్యాయమనీ నాకు తెలుసును. అది తొలగించబడవలెనని హిందువుడనైన నా అభిప్రాయము. అవకాశము కలిగినప్పుడెల్ల నిమ్నజాతులతో కలిసిమెలసి పనిచేసి వారికి సహాయమొనర్చుటకు నేనిష్టపడుదును.” అన్న వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాల సారాన్ని జీవితత్వంగా మలచుకున్న స్వచ్ఛంద సేవకుడువంటి అగ్రవర్ణ భూస్వామి రామానాయుడు , స్వజాతి ఉద్ధరణ కోసం నిత్యమూ ఆలోచించే, పనిచేసే మాల కులస్తుడు సంగదాసు పాత్రలుగా, వారిద్దరిమధ్య స్నేహం ప్రతిపాదికగా వర్ణ వర్గ సంబంధాలపై నిర్మించిన ఇతివృత్తంతో ఉన్నవ లక్ష్మీనారాయణ (1877-1958) ‘మాలపల్లి’ నవల రాసాడు. 1922 లో ఇది ప్రచురించబడింది. ఈ నవల ఇతివృత్తంలో సమకాలీన స్వరాజ్య ఉద్యమం కూడా ఒక ప్రధానభాగమే.

దళిత సమస్య గురించిన గాంధీ అవగాహనలోని రెండు అంశాలు మాలపల్లి నవలలో ప్రధానమైనవి. అవి – ఒకటి బళ్ళు పెట్టి, చదువులు చెప్పి, వృత్తులు నేర్పి అంటరానివాళ్ళ అభివృద్ధికి తోడ్పడటం. రెండు – హిందూ సంఘంలో భాగంగానే వాళ్ళు ఉండేట్లు చూడటం. ఈ పనులు చేయవలసినది ఇన్నాళ్లు వాళ్ళు జ్ఞానానికి, గౌరవానికి, మర్యాదపూర్వకమైన జీవితానికి పరాయీకరించబడటానికి బాధ్యులైన సవర్ణ హిందువులు. ఆత్మగౌరవ చైతన్యం రెక్క విప్పుకొంటున్న దళితులు. రామా నాయుడు ,సంగదాసు ఆ రెండు వర్గాలకు ప్రతినిధులు. అస్పృశ్యతను పాటించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ, సంగదాసును తాను సంబోధిస్తున్నట్లుగానే అతను కూడా తనను ఏకవచనంలో సంబోధించాలని ఆశిస్తూ , దళిత జన సంక్షేమానికి పాటుపడటానికి సంసిద్ధత కనబరచే రామానాయుడు, దళితుల సాంఘిక హక్కులు ఎంత ముఖ్యమైనవో – కూలీ నాలీ జనంగా ఆకలి తీరని, శ్రమకు తగిన ఫలితాలు పొందలేని స్థితిలో ఉన్న- దళితుల ఆర్ధిక హక్కుల గ కూడా అంతే ముఖ్యమైనవి అనుకునే సంగదాసు కలిసి బెజవాడలో జరుగుతున్న పంచముల సభకు, ఆది మాంధ్రుల సభకు వెళ్లినట్లుగా చిత్రించటం ఈ నవలలో కీలకమైన విషయం.
ఒక అగ్రవర్ణ ఆసామీ, సంగదాసు కలిసి వెళ్తున్న సభ గురించి స్టేషన్లో మునసబు ఆరా తీస్తున్నట్లు దానికి సభాపతి ఎవరు అని అడిగినప్పుడు రామానాయుడు వెంకటరెడ్డిగారు అని చెప్పాడు. అయితే మా రెడ్ల సభా ఏమిటీ అని మునసబు మరొక ప్రశ్న వేసాడు. దానికి సమాధానంగా రామానాయుడు కాదు, అది పంచముల సభ అని చెప్పి వెంకటరెడ్డి రెడ్డి గాడు, వూరక పెట్టుకొన్న పేరు అని వివరణ ఇచ్చాడు. బెజవాడలో జరుగుతున్న సభ, ఆది మాంధ్రుల సభ, సభాపతి వెంకటరెడ్డి రెడ్డిగాడు … ఈ మొదలైన అంశాలను బట్టి అది 1917 నవంబర్ 4,5,6 తేదీలలలో జరిగిన సభ అని, సభాపతి వెంకటరెడ్డి భాగ్యరెడ్డి వర్మే అని నిర్ధారించుకోవచ్చు. ఊరికే ప్రస్తావించి వదిలెయ్యటం కాక దళిత ఉద్యమ నిర్మాణంలో నిర్ణయాత్మకమైన ఆ సభను, సమగ్ర స్థాయిలో నవల ఇతివృత్తంలో భాగం చేయటం ద్వారా ఉన్నవ సమకాలీన సామాజిక పరిణామాల వాస్తవికతను ‘డాక్యుమెంట్’ చేసినట్లయింది.

ఆ సభను అగ్రవర్ణ హిందూ సంస్కరణవాది గూడూరు రామచంద్రరావు ఏర్పాటు చేసాడు. ఈయనే నవలలో నిర్వహణ కార్యదర్శులలో ఒకరుగా చెప్పబడిన రామేశ్వరరావు అయివుంటాడు. సంగదాసు సభాపతి వెంకటరెడ్డి కి రామానాయుడిని పరిచయం చేస్తూ’వారికి మన సంఘము మీద గల అభిమానం ఇంతని చెప్పటానికి వీలు లేదు’ అని చెప్పాడు. ఆ సందర్భంలో వెంకటరెడ్డి రామేశ్వరరావు తో పాటు రామచంద్రయ్య చౌదరి ,రామజోగి , భీమసేనరావు వంటి అగ్రవర్ణులు ఆది ఆంధ్రుల అభ్యున్నతికి అంకితమైన తీరును అభినందన పూర్వకంగా ప్రస్తావిస్తాడు. అందుకు స్పందిస్తూ రామానాయుడు “ మా అభిమానం యెంత, ఇదివరకు మా సంఘాలు ,దిగువజాతులకు చేసిన అపకారాన్ని బట్టి చూస్తే ఇది ఉపకారమే కాదు. పాపపరిహారానికి మేము ప్రయత్నపడుతున్నాము” అన్న మాటలు గమనించదగినవి.

అగ్రవర్ణుల ఆత్మవిమర్శను వ్యక్తీకరించిన ఈ మాటలను ఇద్దరూ పంచములే అయినప్పటికీ ,సంగదాసు,వెంకటరెడ్డి స్పందించిన తీరు భిన్నంగా కనబడుతుంది. బుద్ధిపూర్వకంగా అపకారం చేశారని నేనను అని సంగదాసు దానిని ‘ఉపేక్ష’కు కుదించి చెప్పాడు. వెంకటరెడ్డి దానిని ఆమోదించక ‘పై కులాలు మనకు బుద్ధిపూర్వకంగా అన్యాయం చేశారనే నా అభిప్రాయం.’ అన్నాడు. అది గతమే కాదు , వర్తమానం కూడా అన్నది అతని దృఢమైన విశ్వాసం. వర్ణాశ్రమ వృత్తివిభజనను సమర్ధిస్తున్నట్లుగా సంగదాసు మాట్లాడిన దానిపట్ల కూడా వెంకటరెడ్డికి అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరి ఇష్టం వచ్చిన వృత్తులను వారు అవలంభిస్తారు అని వృత్తి సౌకర్యాన్ని అతను ప్రతిపాదిస్తే వృత్తిసాంకర్యం సమాజనిర్మాణ వినాశనకరం అని సంగదాసు భావించాడు. బ్రాహ్మణులకు ఏ వృత్తిని కేటాయించక సంఘమే వాళ్ళను పోషించవలసిందని చెప్పిన బ్రాహ్మణీయ మనుధర్మం పట్ల సంగదాసుకు వలే వెంకటరెడ్డికి సానుభూతి లేదు. ‘సోమరులుగా కూర్చోమన్నారు’ అని ఆ స్థితిని వ్యాఖ్యానిస్తాడు.అందులో నిరసన గర్భితమయ్యే ఉంది.

సంగదాసు మొత్తం హిందూ సంఘం బాగు గురించి మాట్లాడుతుంటే ‘మన సంఘం బాగయ్యే యేర్పాటు ముందు జూడండి. వుట్టి కెక్కిన తరువాత స్వర్గాని కెక్కవచ్చు’ అని వెంకటరెడ్డి జోక్యం చేసుకొని చెప్పిన మాటలు దళిత ఉద్యమ సిద్ధాంతం ,ఆచరణ రెండూ దళిత ప్రజల ప్రయోజనాల కేంద్రంగా మాత్రమే జరగాలని సూచిస్తున్నాయి. అయితే తల్లి సంఘం యొక్క క్షేమం విడిచి పిల్ల సంఘాల క్షేమానికి మాత్రమే పూనుకొనటం సరైంది కాదన్న సంగదాసు అభిప్రాయం అస్తిత్వ ఉద్యమాలు ఈ నాటికీ ఎదుర్కొంటున్న సవాళ్ళను గుర్తుచేస్తుంది.

దళిత జనాభ్యు దయం గురించిన సంగదాసు దృక్పథం హిందూమత తాత్విక పరిధికి లోబడినది కాగా వెంకటరెడ్డి దృక్పథం దానిని ధిక్కరించటం నుండి రూపొందింది కావటం ఈ భిన్నత్వానికి కారణం. 1913 నుండే బుద్ధ జయంతులు జరుపుతూ హిందూ వర్ణవ్యవస్థ పైన, వర్ణాశ్రమ వృత్తివిభజన పట్ల, ధర్మాలపట్ల హేతు బద్ధ ప్రశ్నలతో విమర్శనాత్మక వైఖరిని అభివృద్ధి చేసుకొంటూ వస్తున్న భాగ్యరెడ్డివర్మ స్వభావాన్ని వెంకటరెడ్డి పాత్ర వ్యక్తిత్వంలో భాగం చేయటంలో ఉన్నవ ఆ మేరకు విజయం సాధించినట్లే. అయితే ఉన్నవ లక్ష్మీనారాయణగారి దళిత జనాభ్యుదయ దృక్పథానికి ప్రాతినిధ్యం వహించే పాత్ర సంగదాసే కానీ వెంకటరెడ్డి కాదు. అందువల్లనే సంగదాసు చర్చించిన విషయాలు విన్న తరువాత ‘కొన్ని అభిప్రాయములు మారినవి’ అని అతనిచేత అనిపించి సంగదాసుది పైచేయిగా చేసాడు.

1917 బెజవాడ సభలో భాగ్యరెడ్డి వర్మ పంచమ కులం అనే భావనను ఖండిస్తూ వర్ణవ్యవస్థలో అయిదవ తరగతి ప్రస్తావన లేదని నిరూపించి అంటరాని వర్గాలను అఖిలభారత స్థాయిలో ఆది హిందువులు అనీ, తెలుగు ప్రాంతాలలో ఆది ఆంధ్రులు అనీ వ్యవహరించాలని చేసిన ప్రతిపాదనల ప్రస్తావన ఈ నవలలో వెంకటరెడ్డి ఉపన్యాసంలో భాగం కానేలేదు. అట్లాగే దేవాలయ ప్రవేశం వృధా ప్రయాస అనీ ఆ ఉద్యమం వల్ల అంటరానివారికి ఒనగూడే ప్రయోజనాలు ఏవీ లేవని కూడా ఆయన ఈ సభలో అన్న మాటలు కూడా అతని ఉపన్యాసంలోకి రాలేదు. దిగువజాతుల చరిత్రను, ప్రస్తుత దీనస్థితిని, దళిత ఉద్యమ అవసరాన్ని , వ్యాప్తిని గురించి వెంకటరెడ్డి మాట్లాడాడని ఒక మాట చెప్పి రష్యాలో వచ్చిన సోషలిస్టు విప్లవ విజయాల గురించే ప్రధానంగా అతని ఉపన్యాసం సాగినట్లుగా కల్పన చేసాడు ఉన్నవ.

1917 నాటి ఆ సదస్సులో 18 తీర్మానాలు ఆమోదించబడ్డాయి. సభాపతి అప్పగించిన బాధ్యత మేరకు సంగదాసు తీర్మానాల చిత్తుప్రతులు రాసి సభలో సమర్పించినట్లు నవలకు అనుకూలమైన కల్పన మరొకటి చేసాడు లక్ష్మీనారాయణ. అయితే ఇందులో తీర్మానాలు 14 మాత్రమే. అయినప్పటికీ సారంలో ఇవి 1917 సదస్సు తీర్మానాలకు ఎడంగా పోయినవి మాత్రం కాదు. దళితులు నీచమైన పేర్లు పెట్టుకోకూడదు. అన్న, అక్క, అమ్మ, అయ్య వంటి మర్యాద వాచకాలను పేర్ల చివర చేర్చుకొనాలని చేసిన తీర్మానం మనుస్మృతిపై మొదటి తిరుగుబాటు. ప్రభుత్వ నిధులను ఉపయోగించి నిర్మించిన విద్యాలయాలు, దేవాలయాలు , బావులు,చెరువులు, సత్రాలు మొదలైన వాటిని ఉపయోగించుకునేందుకు నిమ్నజాతుల హక్కును ఆమోదించి అనుమతించాలని చేసిన తీర్మానం నాటి ఉద్యమం ముందుకు వచ్చిన ప్రజల ఆకాంక్షల ఫలితం. ఆది ఆంధ్రుల పిల్లలకు ఉచిత విద్యను అందించే ప్రత్యేక పాఠశాలలను, వసతిగృహాలను ఏర్పరచాలన్న తీర్మానం అందులో భాగమే. ఆదిఆంధ్రులకు బంజరు భూములియ్యాలన్నఆ నాటి తీర్మానంఅడవులలో వ్యవసాయానికి పనికి వచ్చే భూములను దరఖాస్తు పెట్టుకొన్న పంచములకు ఇయ్యాలనీ , అలా ఇచ్చేటప్పుడు పంచమ క్రైస్తవులకే అవి పోకుండా హిందూ పంచముల సంఖ్యను బట్టి వారికి రావలసిన భూములు వారికే ఇప్పించవలసిందనీ, ఇల్లుకట్టుకొనటానికి స్థలం కేటాయింపు,ద్రవ్యసహాయం ఇయ్యాలనీ కొంత విస్తృత స్థాయిలో ఈ నవలలో భాగమైంది.

మున్సిపాలిటీలు, శాసన మండలి, జిల్లా తాలూకా బోర్డులు – మొదలైన వాటిలో దళితులను సభ్యులుగా నియమించాలన్న 1917 నాటి సభా తీర్మానాలు ఇందులోకి అసలు రాలేదు. ఆ స్థానంలో పోలీసు, రెవిన్యూ, ఫారెస్ట్, సివిల్, మిలటరీ మొదలైన శాఖలలో కిందిస్థాయి ఉద్యోగాలు దళితులకు కేటాయించవలసినదన్న తీర్మానం వచ్చింది.
జీతగాండ్లకు ,ఇతర కూలీలకు ఓటుహక్కు, మద్యపానాది దుర్వాసనాలను మానుకొనటం, స్నానం మొదలైన శౌచ పద్దతులను పాటించటం, బహిరంగ ప్రదేశాలలో పంచములను దూరస్థులను చేసే అస్పృశ్యత, వ్యవసాయరంగంలో పనివాళ్ళ కూలిరేట్ల పెంపు మొదలైన అంశాలపై తీర్మానాలు నవలలో కొత్తగా వచ్చి చేరాయి.
1917 నవంబర్ నాటి ‘మొట్టమొదటి ప్రాదేశిక పంచమ సదస్సుగా పేరొందిన’ విజయవాడ సదస్సును నాలుగేళ్ల తరువాత ఇతివృత్తంలో భాగంచేసి, భాగ్యరెడ్ది వర్మను నమూనాగా చేసుకొని వెంకటరెడ్డి పాత్రను సృష్టించి, తన ఆదర్శ నమూనా అయిన సంగదాసు సరసన నిలబెట్టి మాలపల్లి నవల కథను నడిపిస్తూ ఆ నాటి సభతీర్మానాలతో సహా అన్నిటినీ ప్రస్తావిస్తూ ఉన్నవ చేసిన ఈ ప్రయోగం – దళిత ఉద్యమ గతిక్రమంతో సమాజం లోని భిన్నవర్గాలు చేసే సంభాషణను, సంవాదాన్ని సజీవ మానవ సంబంధాల నుండి అధ్యయనం చేయటానికి అర్ధం చేసుకొనటానికి కూడా పనికి వస్తుంది.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply