బ్రేవ్… బ్రేవ్!

“అతడు అమిత్ శుక్లా కాడు!”

“మరి?”

“సాక్షాత్తు ఆ ఆదిశంకరాచార్యుడే మళ్ళీ పుట్టాడు!”

‘”ఆహారానికి మతం లేదు, ఆహారమే ఓ మతం!”

“ఆ మాట చెప్పి దీపీందర్ గోయల్ చక్కగా తన వ్యాపారం పెంచేసుకున్నాడు!”

“లేదు, గోయల్ పబ్లిక్కుగానే చెప్పాడు… ‘విలువలకు విరుద్దంగా వ్యాపారం జరగాలంటే, దాన్ని కోల్పోయేటందుకు కూడా మేం చింతించం’ అని!”

“ఎందుకు చెప్పడు? అలా చెప్పడం వల్ల చాలామంది నీలాంటి లోత్తక్కువ లౌకికవాదులు ఆ కంపెనీ యాప్ ని యినిస్టాల్ చేసేసుకున్నారు!”

“నీలాంటి కొందరు సింధువులు అన్ యినిస్టాల్ కూడా చేసుకున్నారు!”

“కార్పోరేట్ కంపెనీలుగా తమని నిన్నటి వరకు వ్యతిరేకించే వాళ్ళని కూడా గోయల్ మంత్రం వేసినట్టు యెంచక్కా తనవైపు తిప్పేసుకున్నాడు!”

“అలా అయితే జమ్మూ కాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంతటివాడే స్వయానా ట్వీట్ చేశాడు… ‘కంపెనీని అభినందించేందుకు నాకో కారణం దొరికింది… యాప్ ను ప్రేమిస్తున్నాను’ అని!”

“ఆ కారణం మతం! మతం మతాన్ని సపోర్ట్ చేస్తుంది… అభిమతాన్ని అది పట్టించుకోనప్పుడు యింక యెలా ట్వీట్ చేస్తారు?”

“అలా అయితే మాజీ యెలక్షన్ కమీషనర్ ఖురేషి అయితే యేకంగా దీపీందర్ గోయల్ కు సెల్యూటే చేశాడు! ‘అసలైన భారతీయుడివి నువ్వే… నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని!”

“మొత్తానికి జొమాటో కంపెనీకి కాణీ ఖర్చు కాకుండా అద్భుతమైన పబ్లిసిటీ దొరికింది! ప్రోగ్రసీవ్ ప్రముఖులందరూ ఫ్రీ ప్రమోటర్సే!”

“ఆ పని చేయించింది అమిత్ శుక్లానే!”

“ఇందులో శుక్లా చేసిన తప్పేముంది? శ్రావణ శుక్రవారంనాడు ముస్లిమ్ నుంచి ఆహారం స్వీకరించడం యిష్టం లేకనే తానిచ్చిన ఆర్డర్ తనే రద్దు చేసుకున్నాడు!”

“ఇది అన్యమతస్తుల్ని అవమానించడం కాదా?”

“ఎలా అవుతుంది?, భీఫ్ తినడం మీ ఛాయస్ అయినట్టే ముస్లిమ్ నుండి డెలివరీ స్వీకరించకపోవడం అతని ఛాయస్! బీఫ్ తినడం, జాతీయగీతాన్ని అవమానించడం, శబరిమలలో మహిళల ప్రవేశం… యిలాంటివి మాత్రమే భావప్రకటనా స్వేఛ్చ కిందకు వస్తాయా? ఇదేం హిపోక్రసీ?”

“ఇంజనీర్ అవిరాళ్ శర్మలా మాట్లాడకు, యిది తినే తిండి! ఆకలి రుచి యెరగదు… నిద్ర సుఖమెరగదు అని సామెత! మేత పెట్టకుండా శుక్లాని నాల్రోజులు మాడిస్తే యెవరు వండినా వడ్డించినా తినక చస్తాడా?”

“చస్తాడు!”

“ఆమాట నువ్వెలా చెప్పగలవ్?”

“అందరు దేవుళ్ళూ మనకి వొక్కటే కదా? దేవుడు వొక్కడే కదా? మరి అలాంటప్పుడు మనం మన మతానికి సంబంధించిన దేవుళ్ళ దగ్గరికే యెందుకు వెళుతున్నాం?”

“అర్థం కాలేదు!”

“సర్వ మతాలూ సమానమే అని చెప్పినవాళ్ళు వాళ్ళు హిందువులయితే మందిరానికి- ముస్లింలయితే మసీదుకి- క్రిస్టియన్సయితే చర్చికి- మాత్రమే యెందుకు వెళుతున్నారు, యెవరు యెక్కడికయినా వెళ్ళొచ్చు కదా?”

“అదెలా?”

“అంటే యీ వారం చర్చికి వెళితే వచ్చే వారం మసీదుకి, అవతలి వారం ఆలయానికి వెళ్ళొచ్చు కదా? తినే తిండి మార్చినట్టు దేవుణ్ణి కూడా బోరుకొట్టకుండా మార్చొచ్చును కదా?”

“తినే తిండికీ దేవుడుకీ యేమిటి సంబంధం?”

“అన్నం పరబ్రహ్మ స్వరూపం! తిండిని మారిస్తే దేవుణ్ణి మార్చినట్టే!”

“అయితే తినే తిండినీ దేవున్నీ మార్చనంటావ్?”

“నేను కాదు, మీరు సమర్ధించే మైనారిటీలే!”

“ఎక్కడా?”

“కళ్ళు  తెరచి చూడు… మీ యింట్లో పరమాన్నం బూరెలూ గారెలూ పొంగలీ పులిహోరా యేదైనా చేసి దేవుని ప్రసాదం కదా యివ్వు… తింటారేమో చూడు!”

“నువ్వు చెప్పేది క్రిస్టియన్స్ గురించా?”

“వాళ్ళే కాదు, ముస్లింలు మాత్రం హలాల్ చేసిన మాంసం మాత్రమే తింటారు! మనం అమ్మోరికి వేట వేసింది పెడితే తినరు! అయినా వాళ్ళంతా చేస్తే ఆచారం… మేం చేస్తే వ్యభిచారమేలే!”

“అసలు ఆహారానికి మతమేమిటో నీ వాదన నాకు అర్థం కావడం లేదు!”

“ఆహారానికి మతం వుంది… దాన్ని మనం కాపాడుకోవాలి!”

“ఇంకా వేటివేటికి మతం వుంది?”

“దేనికి లేదో అడుగు?”

“నువ్వే చెప్పు!”

“మనం మాట్లాడే మాటకి మతం వుంది! నీ బాషని బట్టి నీ మతం తెలిసిపోతుంది! నీ చదువుకు కూడా మతం వుంది!”

“చదువుకా?”

“లేదా? సరస్వతీ నమస్తుభ్యమే కాదు, జాతీయగీతమే పాడమన్నారు కదా?”

“అక్కడ హిందూ దేవతల ఆధిపత్యం వుంది కదా?”

“నిజమే! నేనే చెపుతున్నా, హిందూ పబ్లిక్ స్కూళ్ళలో సంస్కృత శ్లోకాలు చెపుతున్నారు! క్రిష్టియన్ పబ్లిక్ స్కూళ్ళలో జీసస్ ప్రార్ధనలు చేయిస్తున్నారు! మదరసాలలోకా మనం తొంగి చూడలేం, అయినా అక్కడ కూడా యేమి చెపుతున్నారో మనకు తెలుసు!”

“బాడ్!”

“బాడ్ కాదు గుడ్! రియల్ గుడ్! అంతెందుకు అన్ని స్కూళ్ళలో సెలవులు వొక్కలానే వున్నాయా? జీవోలో వుండొచ్చు! కాని హిందూ స్కూళ్ళలో దసరాకీ దీపావళికీ లేదా సంక్రాంతికీ యెక్కువ సెలవులిస్తే, క్రిస్టియన్ స్కూళ్ళలో క్రిస్మస్ కి సెలవులు యెక్కువ యిస్తున్నారు! మిగతా పండగలకు యిచ్చినన్ని సెలవులు రంజానుకు యివ్వరేం?”

“మతాధిపత్యం!”

“యస్… యెవరికి యెక్కడ ఆధిపత్యం వుంటే అక్కడ చెల్లుబాటు అవుతుంది… అంతే!”

“పోన్లే యీ నిజమైనా వొప్పుకున్నావు!”

“మరి?”

“అయినా మెజారిటీ వున్న హిందువులదే కదా ఆధిపత్యం?”

“ఏదో మోడీ సర్కారు వచ్చి ఆమాత్రం!”

“మరి మోడీనో అమిత్షానో జుమాటో అన్యమత డెలివరీని ఖండించారా?”

“ఇవాళ ఖండించక పోవచ్చు… రేపు తప్పక ఖండిస్తారు! కావాలంటే హిందువులకు హిందువులే ఆహారం వండాలి… సప్లై చెయ్యాలి అని చట్టం కూడా చేస్తారు!”

“ఏమిటి అంత నమ్మకం?”

“మతాన్ని నమ్మి అధికారంలోకి వచ్చారు! మనలో మనమాట… యాంటీ ముస్లిమ్ ఫీలింగు యెన్నికల్లో మాబాగా పని చేసింది!”

“ఎందుకిదంతా?”

“మనం హిందువులం! మనది హిందూ దేశం!”

“…………………………………………………”

“మతాన్ని నువ్వు కాపాడు! మతం నిన్ను కాపాడుతుంది!”

“దేవుడు కూడా నిన్ను రక్షించలేడు!”

“నన్ను కాదు, నిన్ను!”

“అదికాదు, అమిత్ శుక్లాకి ఆర్డర్ తీసుకువెళ్ళినవాడు తనపేరు ఫయాజ్ అని చెప్పకుండా వేరే హిందూ పేరు చెప్పి వుంటే?”

“ఓకే!”

“అదేంటి? నిజానికి ఆతను ముస్లిమ్ కదా?”

“హిందూ పేరు పెట్టుకున్నాడు కదా?, మాకది చాలు!”

“దాని వల్ల యేమి సాధిస్తారు?”

“హిందూ రాజ్యం!”

“అంతేలే… యధారాజా తదాప్రజ!”

“నీకో విషయం చెప్పనా?, ముస్లిమ్ పాపులారిటీ వున్నచోట హలాల్ మాంసపు వంటకాల్ని జుమాటో అందిస్తోంది కదా?”

“వ్యాపారం మతాన్ని వాడుకుంటుంది!”

“మతసామరస్యాన్నీ వాడుకుంటుంది!”

“కావచ్చు!”

“ఆ మతంలో పుట్టిన మనిషి యెందుకు వాడుకోకూడదు?”

“మళ్ళీ అదే మాట… యింత మతపిచ్చి పనికి రాదు!”

“మతమంటేనే పిచ్చి! అది అజయ్ గౌతమ్ ని చూసి నేర్చుకోవాలి! చూశావా… న్యూస్ 24 ఛానెల్లో చర్చ జరిగినంతసేపు కూడా హిందూయేతర యాంకర్ని అస్సలు కన్నెత్తి చూడలేదు! అందుకే అతను ‘హమ్ హిందూ’ సంస్థకు అధ్యక్షుడయ్యాడు!”

“కళ్ళకు రెండు అరచేతులూ అడ్డం పెట్టుకున్నాడు కానీ రెండు కళ్ళూ పొడుచుకోవాల్సింది!”

“ఆ కళ్ళతో ఆ హిందూయేతరుణ్ణి చూసుంటే అలానే చేసి వుండేవాడు!”

“పోన్లే నువ్వు అతణ్ణి అనుసరించకు!”

“లేననా?”

“ఏం రైళ్ళూ బళ్ళూ యెక్కడం మానేస్తావా?”

“ముస్లిమ్లు నడిపితే విమానమైనా యెక్కను!”

“హిందువులు నడిపినా అందులో వాడిన పెట్రోలూ డీజిలూ ముస్లిమ్ దేశాల నుండే వస్తోంది కదా?”

“ఎడ్లబళ్ళ మీద వెళతాను!”

“అప్పుడు నువ్వు వెళ్ళేది ముందుకు కాదు… వెనక్కి!”

“ఔను, నా మతంలోకి నావేళ్ళలోకి!”

“సరే, ముస్లిమ్లు వున్న వూళ్ళో?”

“ఉండను!”

“ముస్లిమ్లు పండించిన పంట?”

“తినను!”

“ముస్లిమ్లు తవ్వించిన బావి…”

“తాగను!”

“ముస్లిమ్లు అల్లిన బట్ట?”

“కట్టను!”

“ముస్లిమ్లు తీసిన చర్మంతో చేసిన చెప్పులు?”

“వెయ్యను”

“ముస్లిమ్లు కట్టిన యిల్లు?”

“ఉండను!”

“ముస్లిమ్లు వుపాధ్యాయులైతే?”

“పిల్లల్ని బడికే పంపను!”

“ముస్లిమ్లు డాక్టర్లే వుంటే?”

“రోగంతో చస్తాను!”

“ముస్లిమ్లు పురుడుబోసిన బిడ్డ”

“బతకనివ్వను!”

“ముస్లిమ్లు పీల్చిన గాలి?”

“పీల్చను!”

“సారీ!”

“ఎందుకు?”

“ముస్లిమ్లు వదిలిన గాలి నేను పీల్చాను!”

“నువ్వు పీల్చావేమో గాని నేను పీల్చను!”

“కాని… నేను వదిలిన గాలి నువ్వు పీల్చావుగా?”

“…………………………………………………….”

“అదేంటి అలా ముక్కు మూసుకున్నావ్? మూడు నిముషాల్లో గాలి మెదడుకి అందకపోతే చస్తావ్!”

“…………………………………………………….”

“ఊపిరి తీసుకోవయ్యా… అరే అలా కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నావేంటి?”

“…………………………………………………….”

“బలవంతంగా వుసురు తీసుకుంటున్నావు!”

“హిం..దు..వు..గానే… జీ..వించు… హిం..దు..వు..గానే… మ..ర..ణించు…!”

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

Leave a Reply