“బ్రాహ్మణీకం” బలి పశువు సుందరమ్మ! 

“బ్రాహ్మణీకం” చలం రాసిన ఏడో నవల. ఈ నవలని చలం 1937లో రాశాడు.   నవల పేరే చెబుతుంది నవల కథాంశమేమిటో!  శశిరేఖ, దైవమిచ్చిన భార్య, మైదానం, వివాహం నవలల్లో కథానాయికలు బ్రాహ్మణ కులానికి చెందిన వారైనప్పటికీ అవేవీ కుల ప్రధాన నవలలు కావు.  “బ్రాహ్మణీకం” మాత్రం పూర్తిగా కులం ఆధారిత నవలే.  చివరిలో వచ్చే గవళ్ల రామయ్య మినహా మిగతా ప్రధాన పాత్రలన్నీ బ్రాహ్మణ పాత్రలే.  చలం మిగతా నవలల బ్రాహ్మణ కథానాయకలందరూ ప్రేమికులు.  సాహసికులు.  కుటుంబ పరిధిని దాటడానికి ప్రయత్నించిన వారే.  మంచి వ్యక్తిత్వమున్న వారు.  తమ చుట్టూ వున్న కుటుంబ, సంఘ వాతావరణాన్ని ధిక్కరించిన వారు.  కానీ “బ్రాహ్మణీకం” నవల కథానాయకి సుందరమ్మది అందుకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం.  సనాతన సంప్రదాయంలో పుట్టి పెరగడమే కాదు ఆ సనాతనత్వాన్ని తన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, అవగాహనల్లో పూర్తిగా నింపుకున్న మనిషి సుందరమ్మ.  విపరీతమైన దైవ భక్తితో, సనాతనత్వంతో వుండే ఆమెకి ప్రేమ, స్వేచ్ఛ అంటే తెలియదు.  వ్యవస్థతో పోరాడి, గాయపడి నేలకొరిగిన స్త్రీ పాత్రల్ని ఎంత బలంగా సృష్టించాడో అంతే బలంగా ఎలాంటి పోరాటమూ చేయకపోగా దానికి అనుగుణంగా బతికిన సుందరమ్మ జీవితం అదే వ్యవస్థకి ఎలా బలిపశువుగా మిగిలిపోయిందో మన కళ్లకి కట్టినట్లు చూపిస్తాడు చలం.  

కథ:

చలం ఈ నవలని సుందరమ్మ ఇంటిని, అందులోని వాతావరణంని పరిచయం చేయదంతో మొదలెడతాడు.  “వాళ్లింట్లో వాళ్లకి వారానికి ఒకసారైనా ఒక్క దెయ్యమన్నా కనిపిస్తుందిట. ఆ వంశంలో చచ్చిన వాళ్లకెవరికీ ఊర్ధ్వలోక నివాసంగాని, పునర్జన్మలుగాని వున్నట్లు లేవు.  అందరు అ ఇంటి చుట్టుపక్కలే చూర్లనూ, చెట్లనూ పట్టుకు గబ్బిలాల వలె వేళ్లాడుతూ వ్యూహాల ప్రకారం, జ్యోతిషాలలోనూ, సోదెలలోనూ, పొనడాలలోఎనూ తమ సంతతివారితో సంభాషిస్తూ, తమ కోర్కెలు తెలుపుకుంటూ, తమ కోపాలకీ, శాపాలకీ కారణాలు వివరించుకుంటూ వుంటారు. మొత్తానికి ఆ ఇంట్లో వాళ్లు బతికివున్న మనుషులతోకన్న చచ్చినవాళ్లతో ఎక్కువ కాలం గడుపుతారు” అని వర్ణిస్తాడు.  ఆమె వంశం వారందరూ గర్విష్టులు, అధికారవంతులు, ప్రపంచ సంబంధం పెట్టుకోరు.  కానీ సమాజంలో మిగతా అందరినీ తక్కువ చేసి, చులకనగా మాట్లాడుస్తుంటారు.  పూజలతో, కర్మ కలాపాలతొ ముణిగిన ఆ పల్లెటూరి కుటుంబంలో కాలమాగిపోయింది అంటాడు చలం. ఇలాంటి మూఢ వాతావరణం కల్పించే అంధ విశ్వాసమే, భయంకర అజ్ఞానమే ఆ కాలపు బ్రాహ్మణీకపు ఆయువుపట్టు.  అదే సుందరమ్మ జీవితాన్ని నాశనం చేస్తుంది కూడా.  దేవతలు అంటే ఆమెకి నిజమైన వ్యక్తులే. తనెంత నిజమో దేవుళ్లూ అంతే నిజమనుకొని, వారికీ కోపతాపాలు, ఆగ్రహ, అనుగ్రహాలు, శపించడాలు, వరాలు ప్రసాదించడాలు…అన్నీ వున్నాయనుకునే ఓ పురాతన మానసిక స్థితిని కలిగి వుంటుంది. ఒక మూర్ఖమైన, నిక్కచ్చితనంతో కూడిన ఆచరణతో సనాతనత్వాన్ని ఆమె తన జీవితంలో ఒక ముఖ్య భాగం చేసుకోవడం కాదు, అసలు సనాతనత్వాన్నే తన జీవితం చేసుకుంటుంది ఆమె.   మడి, తడి, ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు, నోములు, వ్రతాలు, నైవేద్యాలు, ముహూర్తాలు, వర్జ్యాలు, కర్మ కాండలు, మొక్కుకోవడాలు, పాతివ్రత్యం…ఇలా ఛాందస బ్రాహ్మణీయ సంస్కృతిలో మూఢ నమ్మకాలతో రూపొందిన వ్యక్తిత్వం ఆమెది.

సుందరమ్మ ఎనిమిదో ఏటనే మేనత్త కొడుకునిచ్చి పెళ్లి చేస్తారు.  పెళ్లి కాగానే అతను  సంస్కృత విద్యాభ్యాసం కోసం మైసూరు వెళ్లి, అక్కడే ఆరేళ్లు గడిపి వస్తాడు.  మైసూరు నుండి అతను సరాసరి మామగారింటికొచ్చి, కార్యము చేసుకొని సుందరమ్మని తనతో తీసుకెళ్లిపోతాడు.  సుందరమ్మ బహు సౌందర్యవతి.  ఆ ఇంటి వారు విశ్వసించే పురాణాల్లో వర్ణించబడిన దేవతల సౌందర్యమంతా సుందరమ్మలో మూర్తీభవించిందా అనిపించేలా వుంటుంది.  పండితుడు, రసికుడు, సౌమ్యుడు ఐన ఆమె భర్తకి సుందరమ్మ అంటే ఎంతో మోహం.  వారిద్దరూ కొత్తగా కట్టించుకున్న మేడ మీద గదికే పరిమితమవుతారు.  భోజనానిక్కూడా కిందకి దిగరు.  సుందరమ్మే భోజనం తీసుకొని హడావిడిగా పైకెళ్లి పోతుంటుంది.  అతను రోగ్రస్తుడైనాడని కొన్నాళ్లకి బైటి ప్రపంచానికి తెలుస్తుంది.  సుందరమ్మ తల్లిదండ్రులొచ్చి వారిద్దరినీ తీసుకెళ్లి బాగు అల్లుడి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారు.  ఐతే వైద్యుడు కొన్నాళ్లు భార్యాభర్తలిద్దరూ దూరంగా వుండాలని చెబుతారు.  సుందరమ్మ తల్లిదండ్రులిద్దరూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారిని ఆపలేకపోతారు.  ఎందుకని గట్టిగా నిలదీస్తే అతని జాతకం ప్రకారం అతనికి ఎక్కువ ఆయుష్షు లేదని చెబుతుంది సుందరమ్మ.  సుందరమ్మ భర్త చనిపోతూ “యాడవకు, కాలగతికి మనమేం చెయ్యలేము.  ఈ రెండేండ్ల స్వర్గం తరువాత(వివాహమైనప్పటి నుండి) చావంటే నాకు వ్యసనం లేదు.  నిన్ను వొదలడమే నా విచారమల్లా.   కాని నిన్ను వొదలను నా చావు తరువాత కూడా.  నిన్నే అంటిపెట్టుకొని వుంటాను.  ప్రతి నిమిషం నీతోనే వుంటాను.  నీ జన్మానికంతా నేనే నీ భర్తని” అంటాడు.  తాను మరణించినా సుందరమ్మలోనే జీవిస్తానని, అందుచేత ఆమెని వికారం చేయొద్దని (గుండు గీయించడం వగైరా) వేడుకొని అత్త మామల నుండి కూడా మాట తీసుకొని మరీ పోతాడు. 

భర్త మరణం తరువాత కొన్నాళ్లకు ఆమె తండ్రి కూడా చనిపోతాడు.  ఆర్ధిక కారణాలతో సుందరమ్మ, ఆమె తల్లి అనాధలవుతారు.  అప్పుడు బెజవాడలో వుండే ఆమె మేనమామ వెంకట్రామయ్య వారిద్దరినీ తన దగ్గరకు వచ్చేయమంటాడు.  ఇంటి నుండే పెద్దగా బైటకి రాని సుందరమ్మ జీవితంలో మొదటిసారి ఊరు దాటి బెజవాడకి రైలెక్కుతుంది.  ఆ తల్లీ కూతుళ్లిద్దరికీ బైత ప్రపంచంతో ఎలా వ్యవహరించాలో తెలియదు.  తమ పక్కనే కూర్చున్న అన్య కులస్తులు తమ కంటే తక్కువ వారైనందున సుందరమ్మ అభ్యంతర పెడుతుంది.  తమ దేవతా సామాగ్రిని ముట్టుకున్నందుకు మరియమ్మ అనే క్రైస్తవురాలితో గొడవ పడుతుంది.  బెజవాడ స్టేషన్లో దిగాక సామాను మోయడంలో సహాయం చేయడనికి సోమయాజులు అనే కుర్రాడు ముందుకొస్తే “బ్రాహ్మలా?” అని ప్రశ్నించి మరీ అతని సహాయం తీసుకుంటుంది సుందరమ్మ.  సుందరమ్మ స్థాయి అలాంటిది.

వెంకట్రామయ్య చాలావరకు లౌకికుడు.  ఆయన మీద “బ్రహ్మసమాజం” ప్రభావం వుంది.  కులాన్ని వదులుకోకపోయినా ఆచార వ్యవహారాలు అనేవి అసౌకర్యంగా వుండనంతవరకే ఆచరించే కుటుంబం వారిది.  అక్కడ తల్లీ కూతుళ్లిద్దరూ సర్దుకోక తప్పలేదు.  వెంకట్రామయ్య పదేళ్ల కూతురుకి చదువు, సంగీతం నేర్పడం కోసం చంద్రశేఖరం అనే బీద యువకుడు వారింటిలోనే వుండేవాడు.  వెంకట్రామయ్య సుందరమ్మని కూడా సంగీతానికి కూర్చోమన్నాడు కదాని ఆమె అతని దగ్గర సంగీతం నేర్చుకునేది.  సుందరమ్మ అందం చూసి చంద్రశేఖరం మోహ పరవశుడౌతాడు.  ఎలాగైనా ఆమెని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తాడు.  ఆమె ఆదరణ కోసం, స్పర్శ కోసం పరితపిస్తుంటాడు.  సుందరమ్మ అతన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది.  తన తమ్ముడిలాంటివాడంటుంది.  కానీ అతను వినిపించుకోడు. రకరకాల వ్యూహాలు పన్నుతాడు.  ఆమెని సానుభూతి ద్వారా లొంగదీసుకోవాలని చూస్తాడు.  స్వతహాగా పిరికివాడైన చంద్రశేఖరం ఈమె విషయంలో మాత్రం మోహ, కామ వివశత్వంతో తెగిస్తుంటాడు.  ఎలాగో ఒక రాత్రి ఆమెలోని స్త్రీని మేల్కొలిపి లొంగదీసుకోగలుగుతాడు.  అలాగే మరోసారి కూడా చేస్తాడు.  కొన్నాళ్లకి సుందరమ్మ గర్భవతి అవుతుంది.  చంద్రశేఖరం పారిపోతాడు.  అసలు విషయం తెలుసుకున్న వెంకట్రామయ్య మానవీయ కోణంలో ఆలోచిస్తాడు.  వయసులో వున్న అమాయకురాలైన సుందరమ్మకి ఏదో మేరకి న్యాయం జరగాలంటే చంద్రశేఖరం ఎంతటి హేయమైన వ్యక్తి ఐనప్పటికీ అతనితో పెళ్లి చేయక తప్పదని భావించి, చంద్రశేఖరం ఊరెళ్లి అతన్ని బెదిరించి లాక్కొచ్చి, సుందరమ్మతో వివాహం జరిపి, అతనికి బాంకులో ఉద్యోగమిప్పించి వేరు కాపురం పెట్టిస్తాడు.  సుందరమ్మ తల్లి యాత్రలకని వెళ్లిపోతుంది.  

వేరు కాపురం పెట్టిన ఆరు నెలలకి సుందరమ్మ ఓ ఆడపిల్లని కంటుంది.  ఇంక సుందరమ్మకి ఆ పిల్లే లోకమై పోతుంది.  ఐతే ఆ లోకంలో ముద్దు మురిపాల కన్నా భయాందోళనలే ఎక్కువగా వుంటాయి.  బిడ్డల పెంపకంలో ఆమెకి ఎలాంటి అనుభవం కానీ, జ్ఞానం కానీ లేవు. పెద్దల మార్గ దర్శకత్వం లేదు. వితంతు పునర్వివాహం కారణంగా చుట్టుపక్కల వారి సహకారం బొత్తిగా లేదు.  చుట్టూ వున్న ముత్తయిదువులందరూ ఆమెనేదో అవాంఛనీయ వ్యక్తిగా చూస్తుంటారు.  తమ పవిత్ర ఇలాకాలోకి ఏదో అపవిత్రమైన శక్తి వచ్చినట్లు భావిస్తుంటారు.  దానిక్కారణం ఆమె పునర్వివాహిత.  ఇంక చంద్రశేఖరం సంగతి చూస్తే అతనికి సుందరమ్మని వివాహం చేసుకోడం ఏ మాత్రం ఇష్టం లేదు.  తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది.  పూర్వం ఆమె కోసం వెంపర్లాడిందంతా మర్చిపోయి తానేదో గొప్ప త్యాగం చేసి ఆమెని వివాహం చేసుకున్నట్లుగా భావిస్తుంటాడు.  సుందరమ్మని చేసుకోడం ద్వారా తను పెద్ద మొత్తంలో కట్నం సొమ్ము కోల్పోయినట్లు బాధ పడుతుంటాడు.  ఆమె కోసం ఓ మంచి చీర కొనడం కూడా దండగని తేల్చేస్తాడు.  ప్రతిదాన్ని రూపాయిల్లో కొలుస్తుంటాడు.  అతనికి సుందరమ్మ పట్ల ఇప్పుడు ఎలాంటి ఆకర్షణా లేదు. ఎప్పుడైనా రాత్రి పూట తన పక్కలోకి వస్తే చాలు.  పైగా తన మోసాలకి లొంగిన అందమైన సుందరమ్మ మరొకరికి లొంగకుండా వుండగలదా అనే అనుమానం కూడా పెంచుకుంటాడు.  

సుందరమ్మ అజ్ఞానం, మాతృత్వానికి సంబంధించిన సరైన అవగాహన లేని సహజాత ధోరణులతో పిల్లకి ఎక్కువగా పాలిచ్చి అనారోగ్యానికి గురి చేస్తుంటుంది. ఆమెకి పిల్ల ఎక్కువ నిద్రపోయినా భయమే, మెలకువగా వున్నా ఆందోళనే.  బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలివ్వడం ఒక్కటే పరిష్కారమనుకుంటుంది.  పిల్ల అనారోగ్యానికి తాను మొక్కులు తీర్చకపోవడమే కారణమని భావించిన సుందరమ్మ గుళ్లో అమ్మవారికి చీర పెట్టాలనుకుంటుంది. ఆమె ఎంత బతిమిలాడినా చీర కోసం చంద్రశేఖరం డబ్బులివ్వడు.  ఆమె చాదస్తాన్ని భరించలేని అతను ఇంటికి ఆలస్యంగా వస్తూ బైట చీట్ల పేకలో మునిగిపోతుంటాడు.  ఎలాగోలా ఓ కొత్త చీరని సంపాదించి అమ్మవారికి పెట్టాలని చూస్తే ఆమె పునర్వివాహిత అయినందున అక్కడి పూజారి, ఇతర గుడి సిబ్బంది ఆ చీరని అమ్మవారికి సమర్పించడానికి తిరస్కరిస్తారు.   ఆమెకి తన మొక్కు తీర్చుకోవడం ఎలాగైనా ఒక జీవితావసరంగా మారుతుంది.  ధైర్యం చేసి చీకట్లో వెళ్లి అమ్మవారి విగ్రహానికి ఆ చీర కప్పి వస్తుంది.  సుందరమ్మలోని మరో అజ్ఞానపు మథనం ఏమంటే చచ్చిపోయి ఆత్మ రూపంలో వున్న తన మొదటి భర్త తన పునర్వివాహం వల్ల ఆగ్రహంగా వున్నాడని, తాను అతనికి ద్రోహం చేసిందనీ అపరాధ భావనతో కుమిలిపోతుంటుంది.  

సుందరమ్మ ఎంత మొక్కులు తీర్చుకున్నా ఆమె బిడ్డ రోజురోజుకూ క్షీణించుకొస్తుంది.  డాక్టర్ని తీసుకొచ్చి చూపిద్దామంటే ఆమె దగ్గర చిల్లి గవ్వ వుండదు. మీద పడి తన శరీరాన్ని అనుభవిస్తున్న చంద్రశేఖరాన్ని “డాక్టర్ని పిలవరా?” అని దీనంగా ప్రాధేయపడుతుంది.  చివరికి అతను పట్టించుకోకుండా వెళ్లిపోతాడు.  వ్యభిచారికి దక్కే ప్రతిఫలం కూడా తనకి దక్కలేదని కుమిలిపోతుంది.  ఎలాగో డాక్టర్ని పిలుచుకొచ్చి చూపిస్తే అతను మందులు రాస్తాడు.  మందుల దుకాణం వాడు ఆమె దగ్గర డబ్బులు లేవని మందులు ఇవ్వడు.  ఆమె దుస్తితిని గమనించిన గవళ్ల రామయ్య అనే తాలూకా బోర్డు సభ్యుడు రహస్యంగా ఆ మందులు కొని ఆమెని చేరుకొని పలకరిస్తాడు.  ‘ఎవరమ్మా మీరు?” అంటే “బ్రాహ్మలం” అంటుంది.  ఆ గర్వపు పలుకు ఒక్కటి బ్రాహ్మణ ద్వేషి ఐన రామయ్యలోని ఉచితానుచిత శక్తిని చంపేస్తుంది.  బ్రాహ్మణులు శూద్రులకు యుగయుగాలుగా చేస్తున్న అన్యాయం, ద్రోహం పట్ల అతనిలో పేర్కొని వున్న కసి తాను ఎప్పటికైనా ఓ బ్రాహ్మణ స్త్రీని లైంగికంగా అనుభవించాలనే లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది.  ఆ లక్ష్యం చేరుకునే క్షణం ఇదేననిపిస్తుంది అతనికి.  తనని సుందరమ్మ డాక్టరుగా అనుకునేలా చేసి బిడ్డ సంగతి చూస్తానని ఆమెతో ఇంటికెళతాడు.  బిడ్డని రక్షించాలంటే తనతో శారీరికంగా గడపాలన్న షరతు పెట్టి ఆమెని అనుభవిస్తాడు.  అనంతరం తాను డాక్టరుని కానని చెబుతాడామెకి.  నిస్పృహలో ఆమెకి పట్టరాని ఆగ్రహం కలుగుతుంది.  ఆమెని చూసి భయంతో వెనకడుగు వేసిన రామయ్య పంచెకి కిరసనాయలు దీపం బుడ్డిలోని మంట అంటుకొని అతని కాళ్ల మధ్య నుండి జ్వాల లేచి భస్మమైపోతాడు.  సుందరమ్మ స్పృహ తప్పి బిడ్డ మీద నిలువునా పడిపోతుంది.  “బ్రాహ్మణ కడపటి మహత్యం బ్రాహ్మణీకం.  ఈ కలియుగాన సుందరమ్మతో అంతమైంది” అని నవలని ముగిస్తాడు చలం.
****

చలం రచనల్లోకెల్లా అత్యంత విషాదాంత రచన “బ్రాహ్మణీకం” అని చెప్పొచ్చు.  ఇందులో తిరుగుబాట్లు, తెగింపులు, వీరత్వం, కదిలించే మోహావేశపు వర్ణనలు, కట్టిపడేసే ప్రేమ తాలూకు భావోద్వేగ భావనలు, ప్రకృతి చిత్రణలు ఏవీ వుండవు.  వున్నదల్లా పితృస్వామ్య భావజాలంతో బలిసిన బ్రాహ్మణీకపు భీకర ప్రవృత్తికి బలైపోయిన ఓ స్త్రీ కథ మాత్రమే!   వర్ణ సమాజంలో ఐనా, కుల సమాజంలో ఐనా పురాతన కాలం నుండి నిచ్చెన మెట్ల సంఘ నిర్మాణం ద్వారా మనుషుల మధ్య వర్గాంతరాలను సృష్టించి, సామాజిక హింసకి, ద్వేషాలకి పాల్పడి, పురికొల్పిన బ్రాహ్మణ కులం నిజానికి తన అంతర్గత నిర్మాణంలో కూడా దుర్మార్గంగానే వున్నది.  అది ముఖ్యంగా స్త్రీ వ్యతిరేకమైనదని ఈ నవలలో స్పష్టం చేస్తాడు చలం.  అది తన స్త్రీలని పురుషులకి బానిసలుగా, పరాధీనులుగా అజ్ఞానులుగా, ప్రాపంచిక జ్ఞానం లేని వారిగా, ఆత్మగౌరవ రాహిత్యంతో బతికే వారిగా మారుస్తుంది. నవల మొత్తం బ్రాహ్మణీకపు వికృతత్వపు విశ్వరూపం చూపిస్తాడు చలం.  సుందరమ్మని అమాయకత్వంలో, అజ్ఞానంలో, మూఢవిశ్వాసాలలో వుంచి ఆమె జీవితాన్ని నాశనం చేసింది కర్కశమైన బ్రాహ్మణీకమే.  (ఇది 87 సంవత్సరాల క్రితం నవల.  ఇప్పటికి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చి వుండొచ్చు)  ఆ నాటి బ్రాహ్మణ కుటుంబంలో మానవ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలు, చుట్టుపక్కల సంఘంతో వారికుండే అంటీ ముట్టని సంబంధాలు, తాము అధికులమనే అహంకారపూరిత ధోరణులు…వీటన్నింటినీ చలం సజీవంగా ప్రదర్శిస్తాడు.  

చలం సుందరమ్మ పాత్ర సృష్టి ద్వారా ఒక భిన్నమైన రచనా శైలిని అవలంభించాడు ఈ నవలలో.  వ్యక్తిత్వం నిలుపుకోవడం కోసం పోరాటం చేసిన ఆయన మిగతా నాయికలు ఆయన ఊహల్లోంచి పుట్టిన వారు అయ్యుండొచ్చేమో కానీ సుందరమ్మని మాత్రం ఆయన సమాజం నుండే తీసుకున్నారు.  తిరగబడ్డ స్త్రీల ధైర్య సాహసాల్ని, వారి ఆకాశమెత్తు వ్యక్తిత్వాల్ని, బలమైన మోహాన్ని, ప్రేమని వ్యక్తం చేస్తూ స్వేచ్ఛ కోసం పరితపిస్తూ, కుల పంజరాల్ని, నాలుగ్గోడల్లోని యాంత్రికతని, ప్రేమ రాహిత్య వాతావరణాన్ని బద్దలు కొట్టుకొని బైటపడే తన బ్రాహ్మణ నాయకలకు భిన్నంగా ఆయన సుందరమ్మని మన ముందుకు తెస్తాడు.  అలాగని చలం కలంలో సృజనాత్మకతకి ఏమీ లోటు లేదు.  అతను సుందరమ్మ మనసులోకి దూరి అలాంటి వ్యక్తుల థాట్ ప్రాసెస్ని చదివినట్లు మన ముందు పరుస్తాడు.  సుందరమ్మ అభద్రత, దుఃఖం, అంతస్సంఘర్షణ మనల్ని కమ్మేస్తాయి.  ఆమె దయనీయ స్థితి మనల్ని తడిపేస్తుంది.   నిజానికి ఈ నవలలోని ఒక్క సుందరమ్మ ఆ కాలపు లక్షలాది సుందరమ్మలకి ప్రతినిధి.  ఈమె చలం ఊహా సుందరి కాదు. సుందరమ్మ ఒక వాస్తవం.  “సుందరమ్మలు వున్న సమాజంలో తిరుగుబాట్లు ఎందుకు రావు?  అసలెందుకు రాకూడదు?” అనే ప్రశ్నలు వేయించగల సత్తా బ్రాహ్మణీకం నవలకుంది.  

బ్రాహ్మణీక వ్యవస్థలో భాగమై, బ్రాహ్మణ్యాన్ని మనసా వాచా కర్మణా అవలంభించినప్పటికీ సుందరమ్మ జీవితం ఎందుకు నాశనమైంది?  స్త్రీ పురుష సంబంధ రూపంలో సుందరమ్మ జీవితంలోకి ముగ్గురు పురుషులు వస్తారు.  మొదటి పురుషుడు ఆమె భర్త.  రెండు సంవత్సరాలు ఆమెతో స్వర్గ సౌఖ్యాలు అనుభవించిన భర్త  తన జాతకం ప్రకారం అల్పాయిష్కుడు కాబట్టి రోగం వస్తే వైద్యం తీసుకోకుండా చావుని కొనితెచ్చుకోడమే కాకుండా తన మరణానంతరమూ ఆమెకి భర్తగానే కొనసాగుతానని ఆమెలో ఒక అంధ విశ్వాసాన్ని నాటుతాడు.  ఆ రకంగా మనిషి మరణించినా భర్త అనే అధికారం మరణించక అతను ఆమె అస్తిత్వంలో భాగమై పోయే చేస్తుంది బ్రాహ్మణీకపు పితృస్వామ్యం.  రెండో పురుషుడు చంద్రశేఖరం.  మాయ మాటలతో, ఎమోషనల్ బ్లాక్మెయిల్ తో ఆమెని శారీరికంగా లోబరుచుకొని, ఆమెకి గర్భం రాగానే పారిపోయి, తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ తిరిగి వచ్చి, ఆమెని పెళ్లి చేసుకున్న చంద్రశేఖరంలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనబడక పోవడానికి, ఆమె పట్ల నిర్లక్ష్యంగా, బాధ్యతా రాహిత్యంగా వుండగలగటానికి కారణం కూడా ఆ కులంలో దట్టించిన పితృస్వామ్యమే.  విధవా పునర్వివాహం ఆమెకి వరం కాగా తనకి చేయాల్సిన ఒక త్యాగంగా భావిస్తాడతను.  భార్య అంటే వండిపెట్టేది, పడక సుఖాన్నిచ్చేది అనే భావజాలం ఈ శ్రామికేతర కులంలో వున్నంతగా మరే కులంలోనూ కనబడదని చంద్రశేఖరం నిరూపిస్తాడు.  ఇంక మూడో పురుషుడు. గవళ్ల రామయ్య నాయుడు.  ఇతరత్రా ఉదాత్తుడైన రామయ్య బ్రాహ్మణ కులం పట్ల ద్వేషాన్ని పెంచుకుంటాడు.  సమాజంలోని ఘోర పర్యవసనాలకి కృతయుగం నాటి నుంచి వచ్చే వర్నబేధము, ఆ బ్రాహ్మణ వర్నస్తులు  కారనమని అతను నమ్ముతాడు/  తన తండ్రి జవానుగా నౌకరీ చేసే ఇంట్లోనూ రామయ్య ఆ బ్రాహ్మణుల నించి పొందిన నీచానుభవం అతని ద్వేషానికి అసలు ప్నాదని, అతని ద్వేషం ఇంటలెక్చువల్ మాత్రమే కాదు ముఖ్యంగా ఎమోషనల్ అని చలం రాస్తాదు.  అతని ద్వేషం ఎటు తీసుకెళ్లింది అతన్ని అంటే ఆ కులం మీద తన కసి తీర్చుకోడానికి అతనికి స్త్రీనే సాధనమైంది.  అతనిలో కుల ద్వేషానికి బ్రాహ్మణీకం కారణం కాగా ఆ ద్వేషాన్ని తృప్తి పరిచే ప్రతీకార చర్యగా సుందరమ్మని ఎర వేసింది స్త్రీని మనిషిగా కాక అనుభవించదగ్గ వస్తువుగా భావించేలా చేసే పితృస్వామ్యం! అందుకే సుందరమ్మని బ్రాహ్మణీకానికి బలి పశువు అన్నది.  

చలం మిగతా కథానాయకలు అందరూ సంప్రదాయం, కుటుంబ బంధాల్ని దాటి, బైటికెళ్లి కష్టాలు పడ్డారని దెప్పిపొడిచే సంప్రదాయవాదులు  అదే సంప్రదాయ పరిధిలో ఎంతమంది సుందరమ్మలు నిత్య జీవన హింసని ఎదుర్కుంటున్నారో, మృత్యువాత పడుతున్నారో లేదా జీవచ్ఛవాల్లా బతుకుతున్నారో గమనిస్తున్నారా?  సమాజాన్ని లెక్క చేయక వ్యక్తిత్వ పరంగా ఎంచుకునే స్వేచ్ఛలో రిస్కు వుంటే వుండొచ్చేమో కానీ అప్పటి సంప్రదాయ కుటుంబ జీవన శైలిలో హింస తాలూకు ప్రమాదమైతే ఖచ్చితంగా వుంది. 

ఈ నవలలో వెంకశ్ట్రామయ్య ఒక భిన్నమైన వ్యక్తి.  సంస్కరణోద్యమాల ప్రభావం వ్యక్తుల సంస్కారం మీద ఎలా వుంటుందో చెప్పే పాత్ర వెంకట్రామయ్యది.  ఆ కాలంలో ఇంటి పెద్ద చనిపోవడంతో తోబుట్టువుల, దగ్గర బంధువుల కుటుంబాలు వారు ఆదరించడం అత్యంత సహజం.  ఇది చలం “వివాహం” నవలలో కూడా కనబడుతుంది.  బ్రాహ్మణీకం దగ్గరకొస్తే సుందరమ్మని, ఆమె తల్లిని మేనమామైన వెంకట్రామయ్య దగ్గర తీసి తన ఇంట్లోనే ఆశ్రయమిస్తాడు.  ఇంతకుముందే చెప్పినట్లు ఆయన చాలావరకు లౌకికుడు.  అతనిలో బ్రాహ్మణీకం తాలూకు చాదస్తం బొత్తిగా లేదు.  అసౌకర్యంగా వుండే ఏ ఆచారానికి ఆ ఇంట్లో తావు లేదు.  అందుకే బైట నుండి వచ్చిన బట్టలతోనే ఇంట్లో తిరిగేస్తుంటారు.  స్వంతంగా క్షవరం చేసుకోవడం, కంచాలలో తినడమూ చేస్తుంటారు.  ఆధునికతని ఆమోదించి, జీవనంలో అంతర్భాగం చేసుకున్న వెంకట్రామయ్యలో ఉచితానుచితాల విచక్షణా శక్తి మెండు.  అందుకే చంద్రశేఖరం వల్లనే సుందరమ్మకి నెల తప్పిందని నిర్ధారించుకోగానే ఎంతో బాధపడతాడు.  సుందరమ్మని తప్పు పట్టి, చ్చీవాట్లు వేయడం చేయకుండా ఆమె పట్ల దయగా వ్యవహరిస్తాడు.  సానుభూతి చూపిస్తాడు.  భరోస ఇస్తాడు.  “ఆ ఈశ్వరుడికేమీ జోక్యంల్ లేదా? 
 మానావులే ఈ సంఘ స్థితులను కల్పించింది!…. ఆ నీచుడికి ఈ దీనురాల్ని కట్టడం కన్న వేరు గతి లేకుండా చేసింది ఈ లోకం. 

పాపం.  ఆ వీరేశలింగం గారి వల్ల ఈ మాత్రం మార్గం లభించింది ఈ ఆంధ్ర లోకానికి!  లేకపోతే ఏం చెయ్యాలి ఈ సుందరమ్మని, గొంతు పిసకడం తప్ప?” అని అనుకుంటాడు వెంకట్రామయ్య.  చంద్రశేఖరానికి సుందరమ్మని వివాహం చేసుకునే అర్హత లేకున్నా, ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో తనలోని వ్యవహార్తని బైటకి తీసి, నయానో భయానో చంద్రశేఖరాన్ని తీసుకొచ్చి సుందరమ్మకిచ్చి వివాహం చేస్తాడు.  చలం నవలల్లో సంస్కరణోద్యమాల ప్రసక్తి వస్తుంటుంది.  సంస్కరణోద్యమాల మీద కొన్ని అనుమానాలు వున్నా, కొద్దిపాటి విమర్శలు చేసినా మొత్తానికి చలానిది వాటి పట్ల సానుకూల దృక్పథమే.  ఐతే ఈ నవలలో కూడా సంఘ సంస్కర్తల ద్వంద్వ స్వభావం మీద ఓ చిన్న చురక వేస్తాడు చలం.  సుందరమ్మ తల్లితో కలిసి బెజవాడకి రైల్లో వెళుతున్నప్పుడు ఓ సంస్కర్త తారసపడతాడు.  సుందరమ్మ ఇబ్బందిని గమనించకుండా విధవా పునర్వివాహం తప్పులేదని, ఆమె కూడా చేసుకోవచ్చని వాదిస్తుంటాడు.  అప్పుడు చలం “తన కులాభిమానమూ, శాకాహార నియమమూ, శివార్చనా అన్నీ కూడా హేతువాదానికి నిలబడవని అతను పరిక్షించుకోలేదు.  వృధాపోయే ఆమె యవ్వనం మీద దయే గాని, అటువంటి భావమే లేని ఆమె మనసులో తాను కదిలిస్తున్న వికారాన్ని గురించి తలుచుకోడు>” అంటాడు.  

చలం రచనా శైలి కూడా ఉత్కృష్ట స్థాయిలో సాగిన నవల “బ్రాహ్మణీకం”.  నవల మొత్తాన్ని ఒక ఉధృత ఉరవడిలో నడిపిస్తాడాయన.  సుందరమ్మ ఇంటి వాతావరణాన్ని మనకి తనదైన వ్యంగ్య శైలిలో పరిచయం చేస్తాడు.  వున్నట్లుండి ఒక చోట చలం తానే దిగబడిపోతాడు.  సుందరమ్మ భర్త మరణించాక “సౌందర్యాన్ని, ముఖ్యంగా కళ్లలో ప్రకాశించే ఆత్మ ముఖానికిచ్చే సౌందర్యాన్ని వొదలక వెర్రిపడే నేను ఆమెని చూసి ‘అక్కడే ఆ చీకటిలోనే ఆమెని చూస్తో ఆరాధిస్తో కూచోడానికి వీలవుతుందా?  ఆ శరీరంలోకి కొత్త బలాన్ని, ఆ కళ్లల్లోకి కొత్త వుత్సాహాన్ని తెప్పించే మార్గమునందా?’ అని తపనపడ్డాను” అని రాస్తాడు.  ఆయన తనే సృష్టించిన పాత్రల్ని ఎంతగా అంతరీకరించుకుంటాడో, ఎంతగా ప్రేమిస్తాడో, ఆ పాత్రల ఉనికిని ఎంతగా విశ్వసిస్తాడో మనకి అర్ధమవుతుంది.  చలం మళ్లీ ఈ నవలలో ఎక్కడా కనబడడు.  

మెదడు మూలాలోకి వెళ్లి మనిషి అసలు స్వభావాన్ని పట్టుకొని దాన్ని అక్షరీకరించడం చలానికి తెలిసినంతగా మరొకరికి చేతకాదేమో అనిపిస్తుంది.  వెంకట్రామయ్య ఇంట్లో చంద్రశేఖరం సుందరమ్మ అంటే పడి చచ్చిపోతూ “నువ్వు లేకుంటే నేను బతకలేను” అన్నప్పుడు సుందరమ్మ అతను తనకి తమ్ముడని, తనకో తమ్ముడు కావాలని తన తల్లి కంటే తనకే ఎక్కువ ఆశ అంటుంది.  ఆ సందర్భంలో “కాని, ఎంత అగ్నిని మూటకట్టుకుంటుందో ఆ దయ వల్ల ఆమె యేరగదు.  ఒకసారి పురుష హృదయంలో మోహం మొలకెత్తిన తరువాత అది మచ్చే.  కనబడక యెండ కన్న యెండాలి, లేక కాలు కింద నలగనన్నా నలగాలి. కాని ఇట్లా నీళ్లు పోసి, ఇంకో తోవన తిప్పుదామంటే యెవరి తరమూ కాదని తెలీదు ఆమెకి.  యెటువంటి క్షుద్రుడికి తన హృదయ సామీప్యాన స్థలమిస్తుందో ఆమెకెట్లా తెలుస్తుంది?  ఈ సోదర ప్రేమ, పితృ ప్రేమ, అంకుల్ ప్రేమ…ఇట్లాంటి విభజనలన్నీ మాటల్లోనేగాని హృదయాలలో వాస్తవం లేని విషయాలని తెలుసుకోగలదా?  దొంగతనానికి, మోసానికి ఉపయోగించే చక్కని తెరలనే సంగతి తెలీనే తీదు.” అని రాస్తాడు చలం.  అన్ని మోసపు తెరల్ని తగలబెట్టడమే చలం సాహిత్యం సాదించే గొప్ప ప్రయోజనాల్లో ఒకటి. 

స్త్రీల కష్టాలన్నీ స్వయంకృతాలు కావు.  అవి స్త్రీ పురుషులకు వేరు వేరు నైతిక సూత్రాలు, నిబంధనలతో రూపొందించిన ద్వంద్వ విలువల ద్వారా వారి మీద రుద్దబడేవే.  మోసపోవడం అపరాధమైనట్లు, అనైతికమైనట్లు, అది స్త్రీల స్వయంకృతమైనట్లు, అందుకుగాను వారిని న్యూనతా భావంతో చూసినా తప్పు లేనట్లు భావిస్తుంటుంది భారతీయ సమాజం.   సుందరమ్మ దీనస్థితిని వివరిస్తూ “ఏ నింద వచ్చినా స్త్రీ కదా మొదట భరించవలసింది?  ఆమె తన బాధ చెప్పుకున్నా తప్పు ఆమెదే అంటారు కదా!  పురుషుడు దౌర్జన్యం చేసినా పవిత్రుడే.  పతిత అయ్యేది ఆమే కదా?  సృష్టి తన ముద్రను ఆమె ఉదరం మీదనే కదా లిఖించేది!  పురుషుడి కన్నా జిత్తులలో టక్కరన్నా కావాలి. అతనికి స్థలమివ్వని పాషాణమన్నా చేసుకోవాలి హృదయాన్ని.  ఎక్కడా బైటపడని మోసగత్తే, అబద్ధీకురాలన్నా కావాలి లోకంలో కీర్తిని పొందాలంటే!  మంచివారని కీర్తిని పొందిన స్త్రీలందరూ ఈ జాతిలో ఒకదానికి చెందినవారే.  దయ, రసన, న్యాయము, సత్యము – ఈ సుగుణాలే స్త్రీని అధోగతికి లాగే గుణాలు.  అటువంటి అధోగతికి తెచ్చింది స్త్రీని ఈ పాతివ్రత్యాదర్శము, ఈ పవిత్ర నిబంధనలు.” అంటాడు.  ఎంత గొప్ప వాక్యాలు నిజంగా ఇవి! కొరడాతో తగిలినట్లు లేదూ?     

సుందరమ్మతో వివాహమైన తరువాత తన పూర్వ స్థితిని మరిచి తనని తాను అధికుడనని, ఆఫీసులో తన పైన అధికారి వున్నట్లే సుందరమ్మకి తాను అధికారినని భావిస్తుంటాడు.  ఈ సందర్భంలో “గొప్ప పదవుల్ని ఇతరుల అనుగ్రహం వల్ల సంపాయించిన వాళ్లు ఆ అనుగ్రహించిన ఉపకారుల్ని త్వరలో మరిచిపోవడానికి ప్రయత్నిస్తారు.  కృతజ్ఞతాభారాన్ని మనుష్య స్వభావం భరించలేదు.  కనుక తమలో వున్న ఆధిక్యతే తమకా పదవిని ఇచ్చిందని, అనుగ్రహాన్ని సంపాయించిన తమ వివేకమే తమకి సహాయం చేసిందని సమర్ధించుకుంటారు.” అని రాస్తాడు చలం.  వివాహం తరువాత చంద్రశేఖరంలో బైటపడిన అసలు స్వభావాన్ని ఇలా వివరిస్తాడు “తాను దూరాన్నుంచి చూసి, మురిసి తామరపువ్వులతో పోల్చి భ్రమసి వర్ణించిన ఆమె చేతులు తాకగానే తన వొళ్లంతా పులకరింపచేసిన ఆమె వొళ్లు – ఇప్పుడా చేతులే – ఆ వేళ్లే కాయలు కాసేట్లు రుబ్బుతున్న కంది పచ్చడి రుచి మీద నిలిచింది అతని మనస్సు.  ఆమె చర్మపు బంగారు నునుపు కన్నా ఆమె అంట్లు తోమకపోతే దాసీదానికి ఖర్చయ్యే వెండి రూపాయి ఎక్కువ విలువగలదయింది.”  అవసరం తీరిన తరువాత ప్రతి మోహము, వ్యామోహము, ప్రేమ ఆర్ధిక సంబంధాల వైపే దారి తీస్తాయని ఈ వాక్యాలు చెబుతాయి.  

చివరిలో రామయ్య నాయుడు సుందరమ్మతో శారీరికంగా కలిసినప్పుడు చలం రాసిన విధానం మనల్ని చకచ్చకితుల్ని చేస్తుంది.  

“సుందరమ్మ రక్తంలో కలసిజీవించిన బ్రాహ్మణ ఆత్మలు, జపాలు, శ్రోత్రియం, యజ్ఞాలు, ఆధ్యాత్మిక సంపద, అధిక్య గర్వం, శూద్రుణ్ని గుమ్మమవతల – జ్ఞానానికి అవతల – శాస్త్రాధికారానికి అవతల నుంచోబెట్టిన అధికారం “అయ్యో అయ్యో” అని అరుస్తున్నాయి.  

“బ్రాహ్మల నించి అన్యాయాన్ని, అవమానాన్నీ, తృణీకారాన్నీ వోపికతో, యుగాలు భరించిన శూద్రులు అంధకారం, మౌధ్యం, క్రూర శిక్షలకూ, పక్షపాతాల కూపాలై నశించిన మనుశ్రుతి నాటి శూదర్ ఆత్మల క్రౌర్యం, సేవలో, దాస్యంలో కుంగి, తోవ తెలియక పెనుగులాడుతున్న వేదన, నిరాశ, బ్రాహ్మణ చేతుల్లో చిక్కి, మానాల్ని, ప్రాణాల్ని అర్పించిన శూద్ర వనితల అవమానం-కసి-అన్నీ అతని రక్తంలో తాండవమాడుతో తృప్తి నొంది అనంతకాలంలోని నిద్రకై పరుగులెత్తుతున్నాయి” 

తమ పూర్వీకుల ఏ కీర్తికి, పాండిత్యానికి, ఘనకార్యాలకి, గొప్పతనాలకి తాము వారసులమని నెత్తికెత్తుకుంటున్నారో ఆ కీరి, పాండిత్యం, ఘన కార్యాలు, గొప్పతనాల సాధనకై తమ పూర్వీకులు చేసిన దుష్కార్యాలకు పర్యవసనాలను కూడా అలానే నెత్తిన మోయాల్సి వస్తుందనేది బ్రాహ్మణీకం నవల ముగింపు ఇచ్చే సందేశం.  ఈ సందేశం ఇప్పటికీ తాము అధికులమని భావించే వారికి అవసరమైన సందేశమే!  కొన్ని పైపై మార్పులే తప్ప సమాజం మూల విలువలు అలానే వున్నాయి.  అందుకే “బ్రాహ్మణీకం” ఇంకా తన రిలవెన్స్ ని కలిగే వున్నది. 

చదవండి చలం మాస్టర్ పీస్ “బ్రాహ్మణీకం” అలాంటి సబ్జెక్ట్ ఆ కాలంలో ఎంచుకోడానికి అవసరమైన సాహసం చలం ఒక్కడిలోనే వుంది.  అలా రాయగలగడమూ ఒక్క చలానికే సాధ్యం!  ద వన్ అండ్ ఓన్లీ చలం! 

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

5 thoughts on ““బ్రాహ్మణీకం” బలి పశువు సుందరమ్మ! 

  1. ఒక నవల మీద ఇంత సాధికారికమైన విశ్లేషణ నిజంగా అభినందనీయం. ఒక ప్రామాణిక పరిశోధన పత్రానికి ఏమాత్రం తక్కువ కాకుండా అనేక కోణాలను అద్భుతంగా పట్టుకున్నారు వ్యాసకర్త. సామాజిక చలన సూత్రాల వెలుగులో చలం దృష్టి కోణాన్ని అరణ్య కృష్ణ గారు అద్భుతంగా ఆవిష్కరించారు. మనుషుల మానసిక పరివర్తన వల్లనే సంఘ పరివర్తన సాధ్యం అవుతుంది అన్న గౌతమ బుద్ధుని మాటలు గుర్తుకు వచ్చాయి. తప్పకుండా బ్రాహ్మనీకం చదవాలి అనిపించింది. సామాజిక పరిణామాల నేపథ్యంలో ఆధిపత్య కులాల్లో సంఘసంస్కరణ తొలి రోజుల్లో కలిగిన మానసిక సంఘర్షణను చలం ఎంత గొప్పగా పట్టుకున్నారో, విమర్శకుడిగా అరణ్య కృష్ణ గారు అంతే సజీవంగా ఆవిష్కరించారు. అరణ్య కృష్ణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రచురించిన కొలిమికి ధన్యవాదాలు.
    – పసునూరి రవీందర్

  2. ఈ నవలలో ఆలోచించ వలసిన కోణాలు చాలా ఉన్నాయి. బహుశా మైదానం తలా తోకా నాకర్థం కాకపోవడం వల్లేమో మైదానం కంటే ఇది మంచి నవల అనిపిస్తుంది

  3. బావుందండీ. నవల ముగింపులో రామయ్య చర్యను ప్రేరేపించిన బ్రాహ్మణ అహంభావం, అతడు ఎదుర్కొన్న అవమానాలు, ప్రతీకారేచ్ఛ గురించి చలం విశ్లేషించిన వాక్యాలను కోట్ చేసి మంచిపని చేశారు. ఇక్కడ చలం టోన్ ను పట్టించుకోకపోతే ఆయన ఏం చెబుతున్నాడో అర్థంకాదు.

  4. బావుందండీ. నవల ముగింపులో రామయ్య చర్యను ప్రేరేపించిన బ్రాహ్మణ అహంభావం, అతడు ఎదుర్కొన్న అవమానాలు, ప్రతీకారేచ్ఛ గురించి చలం విశ్లేషించిన వాక్యాలను కోట్ చేసి మంచిపని చేసారు. అక్కడ చలం టోన్ ను పట్టించుకోకపోతే ఆయన ఏం చెబుతున్నాడో కూడా అర్థంకాదు.

Leave a Reply