బోయి భీమన్న నాటక గమనంలో మూడు మజిలీలు

పాలేరు – కూలిరాజు జంటనాటకాలు అని బోయి భీమన్నే చెప్పాడు. పాలేరు నాటకానికి కూలిరాజు నాటకానికి ఎడం ఏడాదే. భీమన్న 1942 లో కూలిరాజు నాటకం వ్రాసాడు. పాలేరులాగే అదీ ప్రదర్శించబడుతూ వచ్చింది. అప్పుడు దానిపేరు ‘కష్టజీవి’. తరువాత కొన్ని మార్పులతో ‘ధన్యజీవి’ అయింది. 1947లో ‘నవజీవన’అనే పత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది. వ్యవసాయ కూలీ ఉద్యమాన్ని బలపరచడం లక్ష్యంగా మరికొన్ని మార్పులు చేసిన తరువాత సిద్ధమైన ప్రతి కూలిరాజు పేరుతో 1948లో ప్రచురించబడింది.( మొదటి ముద్రణ ముందుమాట) పాలేరునాటకం వలెనె ఇది కూడా అనేక ప్రదర్శనలు, ప్రచురణలు పొందింది. భీమన్న ఈ నాటకాన్ని వేముల కూర్మయ్యకు అంకితం ఇచ్చాడు.

వేముల కూర్మయ్య ఉన్నతవిద్యావంతుడైన దళితుడు. 1920 -30 మధ్య ఆది ఆంద్ర ఉద్యమంలో పనిచేశాడు.జాతీయోద్యమ రాజకీయాలలో అభినివేశంతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. వ్యక్తి సత్యాగ్రహంలో భాగమయ్యాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఆది మాంధ్ర ఉద్యమాన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా నడిపాడు. వ్యవసాయకూలీ ఉద్యమ నిర్మాణ నిర్వహణలలో చురుకైన పాత్ర పోషించాడు .1937లో , 1946 లో రెండుసార్లు ఆయన మద్రాస్ శాసన సభకు ఎన్నికయ్యాడు . 1946-1949 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో హరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు.( పి. బాలకృష్ణ – హరిజనాభ్యుదయం, 1947). అప్పటికి సహాయ ప్రచురణ శాఖాధికారిగా మద్రాస్ లోనే ఉన్న బోయి భీమన్న ఆయన తోనూ, మరికొందరు దళిత ఉద్యమ మిత్రులతోనూ చేసిన చర్చల ఫలితంగా ధన్యజీవి కూలిరాజుగా మార్పు చెందింది. ( జులై 1995 ప్రచురణ ముందుమాట)

కూలిరాజు నాటకంలోనూ సమానతా సూత్రమే కీలకం. కుల సమానత కన్నా ఆర్ధిక సమానతపై దృష్టి ఎక్కువ. అదికూడా ఎన్నికలలో నిలబడి ఓటు ద్వారా సంపాందించే రాజ్యాధికారం తో ముడిపడిన సమానత్వం. దాని మూలం రైతుకూలీ ఉద్యమంలో ఉంది. కుల మత వర్గ రహితమైన స్వామ్య సమాజాన్ని గాంధేయ కార్యక్రమంద్వారా సాధించటం ఇతివృత్తంగా 12 రంగాల మీద విస్తరించిన నాటకం ఇది. ఇందులో పరంజ్యోతి, మిత్ర, మధుమూర్తి ,కూలి వర్గపు యువతీయువకులు. చదువుకున్నవాళ్లు. కవిత్వం అల్లగలరు, పాటలు పాడగలరు. మరీ ముఖ్యంగా వ్యవసాయకూలీ ఉద్యమ నిర్మాతలు .” రాజ్యము స్వరాజ్యము జేసి పేదల బాధ లార్ప” డానికే నిబద్ధులు. ఆ ఉద్యమ ప్రచారకుడు నిష్కుల్ . ఉద్యమానికి గురి భూస్వామ్య దోపిడీ. ఆ వర్గానికి ప్రతినిధి విశ్వనాథరావు. అతని కొడుకు విద్యావంతుడు ప్రేమకుమార సుందర దివాకర లావణ్యమూర్తి తండ్రిని కాదని వ్యవసాయకూలీ ఉద్యమానికి మద్దతుగా నిలబడిన యువకుడు. విశ్వనాధరావు ను ఆశ్రయించి అతని వ్యవహారాలు చక్కబెడుతూ తాను లాభపడే గుమస్తా శివరామకృష్ణ బ్రహ్మం. కూలీ వర్గానికే చెందినా ఆ గుమస్తా చేతి సాధనమై విశ్వనాథరావు ప్రయోజనాలకై పనిచేసే భయంకర్ ఉన్నాడు. వ్యవసాయకూలీల పట్ల సానుభూతి గల రైతాంగం కూడా ఉన్నారు. వీరందరిమధ్య జరిగే జీవన సంఘర్షణమే కూలిరాజు నాటకం. సమకాలపు దళిత ఉద్యమ ఆకాంక్షలు,పరిణామాల నేపథ్యంలో ఇతివృత్తం విశిష్టంగా రూపొందింది.

నాటక కథ నడిచే వూరు ప్రజాపురం. ఇది కల్పిత గ్రామం. భీమన్నకు కల్పన చాలా ఇష్టం. ఇతివృత్తాన్నీ, పాత్రల స్వభావాలను సూచించేట్లు పేర్లు నిర్ణయిస్తాడు ఆయన. చైతన్యవంతు లవుతూ సమాజంలో మార్పుకు సమాయత్తమవుతున్న ప్రజలు ఉన్న వూరు కనుక అది ప్రజాపురం అయింది. కూలీసంఘాలనిర్మాణ ప్రచారకుడి పేరు నిష్కుల్. కులం లేనివాడు,లేదనే వాడు అని అర్ధం. కులం లేదన్న ప్రచారం కాదు అతనిది. అసలు కులం మాట్లాడవలసిన అంశమే కాదనటం నాటక కథా సందర్భం. అందరినీ ఇబ్బందిపెట్టే దుష్టలక్షణాల రౌడీకి భయంకర్ అని పేరుపెట్టాడు. తన భూస్వామ్య అగ్రకుల అహంకార అధికార స్వభావాన్ని వదులుకొన్న యువకుడు ప్రేమకుమార్ అయ్యాడు. సుందర, లావణ్య మూర్తి వంటి సంబోధనలు కూడా చేరిస్తే గానీ ప్రేమకుమార్ పాత్ర పరిపూర్ణం అయినట్లు ఆయనకు తృప్తి కలగలేదు. ఇందులో హరిజన యువతీ , కథా నాయిక పరంజ్యోతి. పురాణాలలో మాలమాదిగ మహిళ గా ప్రసిద్ధి గన్న అరుంధతి ఆకాశాన నక్షత్రపుంతలో చేరి ఆరంజ్యోతి గా గౌరవాన్ని పొందింది. పెళ్లి అవుతూనే నూతన దంపతుల చేత ఆరంజ్యోతికి మొక్కించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నదే. సర్వజనుల గౌరవానికి పాత్రమైన ఆరంజ్యోతిని స్ఫురింపచేసే పరంజ్యోతి అన్న పేరును తన నాయికకు ఇచ్చాడు భీమన్న.

                                      1.

బానిసకు తాను బానిసనని తెలియటం బానిసవిముక్తికి మొదటి మెట్టు అంటాడు లెనిన్. ఈ నాటకంలో పరంజ్యోతి మొదలైన వాళ్ళు ఆర్ధిక అసమానతల స్వరూపస్వభావాలు ఎరిగినవాళ్ళే. ఐశ్వర్యం ఒకదగ్గర పేదరికం మరొకదగ్గర పోగుపడ్డ వ్యత్యాసాల సమాజంగురించి ఆవేదన పడ్డవాళ్లే. అటువంటి సందర్భాలు అన్నీ గమనిస్తే రచయిత సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమ చైతన్యంతో ఉన్నట్లు అనిపిస్తుంది. బంగారం పండే పంటభూములు బీడునేలలు , అద్దాలమేడలు ,పాడుపడ్డ నిరుపేదల కొంపలు, బలిసినవాళ్ళు, ఎముకలుతేలిన వాళ్ళు, వేదాంత విద్యాప్రవీణులు, చూడగరాని హరిజనులు పక్కపక్కనే వున్న వ్యత్యాసాల భారతీయ సమాజంలో ఖేదం తప్ప శాంతి అనేది లేదని నిష్కుల్ ముఖంగా ప్రారంభంలోనే చెప్పిస్తాడు. “…. భారతమాత మెడకు / క్రూరతర మైన ఉరి తాళ్లు కులమతాలు / నిష్కులము,నిర్మతము, చేయనేర్పి…” ఆమెను రక్షించుకొనటానికి లేచిరమ్మన్న ప్రబోధం అతనిది. పేద కూలీలలో పుట్టి పెరిగి కొంత బాగుపడిన భాగ్యవంతుల ధర్మం జాతి ఉద్ధరణ అన్నది అతని అభిప్రాయం. అందరి ఆకలి తీర్చేవాడికి ఆకటి చావు/, కొంప గట్టి, బట్టనేసి జగతికి / కోరిన సౌఖ్యం కూర్చేవాడికి / కొంప,గుడ్డ, సౌఖ్యం లేకపోవటం గురించిన చింతన అతనిది.

మొదటి రంగంలో తొలి పరిచయంలోనే అతనిని పరంజ్యోతి స్వామీ! మీది కేవలం కూలీ ఉద్యమమేనా ? హరిజనోద్యమం కూడా కలిసి వుందా? అని ప్రశ్నిస్తుంది. దానికి ఆయన “ నాది కేవలం కూలి ఉద్యమమే. ఈ ఉద్యమంలో కులానికి స్థానం లేదు. కులభేదాలు రూపుమాపి ఏకైక భారతజాతిని తయారుచేసి రాజకీయ ఆర్ధిక సాంఘిక సమత్వం స్థాపించటమే నా ఆశయం” అని బదులిచ్చాడు. కులాలు నశిస్తాయా అన్న పరంజ్యోతి సందేహానికి ఎందుకు నశించవు అని పశ్నరూపకమైన విశ్వాస ప్రకటనతో సమాధానం ఇచ్చాడు.
“కూడు దొరకక ప్రతిరోజు కూలికేగు
కులములన్నియు నొక్కటే కులము కాదె ?
బ్రాహ్మణుడు మొదల్ మాదిగవాని వరకు
కష్టపడు వాడు ప్రతివాడు కార్మికుండె” — అని ఏ కులంలో పుట్టారన్నదానిని బట్టి కాక కూడు కడుపునిండా దొరుకుతున్నదా? కూటికొరకు పడే తిప్పలు ఏమిటి అన్న దానిని బట్టి మనుషులలో తెగలు ఉంటాయన్న తన అవగాహనను కనబరిచాడు.

పరంజ్యోతి ‘మీది కేవలం కూలీ ఉద్యమమేనా ? హరిజనోద్యమం కూడా కలిసి వుందా?’ అని నిష్కుల్ ను ప్రశ్నించటంలో ఆమె ఆకాంక్ష కూడా కులం ప్రసక్తి లేని కూలి ఉద్యమమే అన్న స్వరం వినబడుతుంది. ఆ తరువాత నాటకేతివృత్తగమనంలో ఎక్కడా కులవివక్ష ప్రస్తావన లేక పోవటం దానినే బలపరుస్తుంది. 1940 లలో కులం పాత్రను పట్టించుకోకపోవటం, దళిత ప్రజానీకం ఎదుర్కొంటున్న కుల దోపిడీ సమస్యను నామమాత్రంగానైనా ప్రస్తావించకపోవటం అనేది కిసాన్ సభల, రైతుకూలీ సంఘాల, రైతు సమితుల స్వభావంగా ఏదైతే స్థిరపడిందో ( యాగాటి చిన్నారావు ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమచరిత్ర ,2007,పు,97) ఆ రాజకీయ వాస్తవమే ఈ నాటకం ఇతివృత్తంలో ప్రతిఫలించింది అనుకోవచ్చు. అంబేద్కర్ ను ఉపేక్షించిన కాంగ్రెస్ రాజకీయాల ప్రతిఫలన లక్షణం ఇది.

                                      2.

కమ్యూనిస్టులు ఆర్థికవాదులు కనుక రైతు కూలీ ఉద్యమాల నిర్మాణ నిర్వహణ ఉత్సాహంలో కుల సమస్యను ఉపేక్షించారనుకోవచ్చు. కానీ హరిజనోద్యమానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి, హరి జనసేవక్ సంఘ్ వంటివి పెట్టి అస్పృశ్యతకు వ్యతిరేకంగా, హరిజనాభ్యుదయానికి అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొన్న కాంగ్రెస్ కులసమస్యను మినహాయించి కూలీ సమస్యను ఎందుకు కార్యక్రమంగా తీసుకున్నది అన్నది ప్రశ్న.

1936 ఏప్రిల్ లో లక్నో కాంగ్రెస్ సభల సందర్భంలో ఏర్పడిన అఖిలభారత కిసాన్ సభ కృషి 1937 నాటి ఎన్నికల మేనిఫెస్టో లోకి కార్మిక కర్షక అనుకూల విధానాలను ప్రవేశపెట్టేంతగా ప్రభావితం చేసింది. దానితో ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరచిన ఏడు రాష్ట్రా లలోనూ ఆ కాలంలో జరిగిన జమిందారీ వ్యతిరేక పోరాటాల ఫలితంగా కూలి రేట్ల పెంపుదల, కౌలు రైతుల రక్షణ, రుణమాఫీ మొదలైన విషయాలలో చర్యలు చేపట్టవలసి వచ్చింది. జాతీయోద్యమ ప్రయోజనాలరీత్యా భూస్వాములకు, రైతు కూలీలకు మధ్య వైరుధ్యాలు సమ్మెలు, సంఘర్షణల వరకు పోకుండా మధ్య వర్తిత్వం వహించి సర్దుబాట్లు చేసేందుకు కమిటీలు ఏర్పడ్డాయి. ఇవి పార్టీకి ప్రజాపునాదిని సమకూర్చి పెట్టాయి. వివిధప్రాంతాలలో రైతు సంఘాలు, వ్యవసాయకూలీ సంఘాలు నిర్మాణమై పనిచేయసాగాయి. దళితులు ప్రధానంగా వ్యవసాయకూలీలే కనుక సహజంగానే వేముల కూర్మయ్య వంటి దళిత ఉద్యమకారులు ఎందరో ఆ సంఘాలలో చురుకుగా పనిచేయసాగారు. ( బిపిన్ చంద్ర – భారత స్వతంత్ర పోరాటం, రెండవ ముద్రణ,జనవరి 2007, ప్రజాశక్తి బుక్ హౌస్ )

ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. 1937 ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరచిన ఏడు రాష్ట్రా లలో కూడా అస్పృశ్యుల హక్కుల రక్షణకు జరిగిన ప్రయత్నాలు సంతృప్తి కరంగా లేకపోవటంతో కాంగ్రెస్ విధానాన్ని హరిజన ప్రతినిధులు శంకించారు. తమ నామ మాత్రపు ప్రాతినిధ్యాన్ని వదిలేసుకొని, కాంగ్రెస్ లో దళితులకు ఏ మాత్రం స్వేఛ్చ లేదని, తమ హక్కులు తాము పొందటానికి ఒక ప్రత్యేకరాజకీయ పార్టీ అత్యవసరం అని వాళ్ళు నిమ్నజాతీయులలో ప్రచారం చేశారు (పి. బాల కృష్ణ – హరిజనాభ్యుదయం, 1947). ఈ పరిస్థితులలో కాంగ్రెస్ లోని దళిత యువజన మేధావులకు ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించవలసిన అవసరం పార్టీకి ఏర్పడింది. కులంపేరుతో రాజకీయపార్టీ ఏర్పడితే దాని పరిధి సంకుచితం అయిపోతుంది. అది కాంగ్రెస్ ఓటుబ్యాంక్ ను కొల్లగొడుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ తో పోటీపడి గెలవటమూ ఆ పార్టీకి సాధ్యం కాదు. ఆలాంటి పార్టీ ఏదీ లేకుండానే హరిజనులకు అభ్యుదయం సమకూడాలి. అది కాంగ్రెస్ కు కలిసివచ్చే అవకాశం. హరిజనులలో అధికశాతం వ్యవసాయ కూలీలు కనుక రైతుకూలీ సంఘాలు వాళ్ళలోకి ఎంతగా చొచ్చుకువెళితే అది ఉభయతారకం అవుతుంది. తక్షణ అవసరం అయిన ఆర్ధిక ప్రయోజనాలముందు అస్పృశ్యత వంటి సాంప్రదాయక సాంస్కృతిక వైషమ్యాలను పక్కకు పెట్టె వీలుంది. అదీగాక 1940 నాటికే ఎన్. జి. రంగా జమిందారీ వ్యతిరేక రైతాంగ ఉద్యమాల సంబంధంలో అభివృద్ధిపరచిన రైతుల రాజకీయాధికార భావన వుంది.

కాంగ్రెస్ అభిమాని అయిన బోయి భీమన్న 1940 నుండి వ్రాస్తూ, మారుస్తూ వచ్చిన కూలిరాజు నాటకంలో కుల సమస్యను మినహాయించి కూలీ సమస్యను ఇతివృత్తంగా చేసుకొనటం వెనుక ఇంత రాజకీయార్థిక పరిణామాల చరిత్ర ఉన్నది. ఈ నేపధ్యం లో నిజానికి దళితుడుగా కులవివక్ష, పేదవ్యవసాయ రైతుకూలీ వర్గంగా ఆర్ధిక అసమానతలు భీమన్న ముందున్న సవాళ్లు అయినప్పటికీ స్వరాజ్యం తో ఆ రెండూ పరిష్కరింపబడతాయని కాంగ్రెస్ రాజకీయాలు ఇచ్చిన విశ్వాసం నడిపిస్తే నడిచిన సమూహంలో అతనూ ఒకడయ్యాడు. కూలీ యూనియన్ స్థాపనతో నాటకం ప్రారంభించి దానినే ఒక రాజకీయ పార్టీగా మార్చి రైతుకు , అందులోనూ దళితమహిళకు రాజ్యాధికారం సంపాదించి పెట్టాడు.

                                      3. 

కూలీ యూనియన్ లు అంటే వ్యవసాయ కూలీ సంఘాలు, పరిశ్రమలలో పనిచేసే కూలీల సంఘాలు ఏవైనా కావచ్చు. వాటి లక్ష్యం మెరుగైన కూలిరేట్లకోసం, పని పరిస్థితులకోసం, హక్కుల కోసం ఇటు యాజమాన్య వర్గాలతో , తమ ప్రయోజనాలకు అనుకూలమైన చట్టాల కోసం అటు ప్రభుత్వం తో బేరసారాలు చేయగల స్వతంత్ర శక్తులుగా ఎదగటానికి కర్షక కార్మిక వర్గాలను సంఘటిత పరచటం. తాలూకా కూలీ సంఘం ఏర్పడి దానికి పరంజ్యోతి సెక్రటరీ అయ్యాక చేసింది ఆ పనే.
“పగలెల్ల పనిచేసి
పస్తు పడుకుంటావు
పల్లెత్తు మాటాడలేవా? ఓ కూలి!
పావలా తెచ్చుకోలేవా?
పుట్లకొలదీ నీవు
పురిగట్టి వస్తావు
ఆకలని చెప్పుకోలేవా? ఓ కూలి!
అర్ధభాగము పొందలేవా? — ఇలాంటి ప్రబోధగీతాలలో కూలీలు వున్న దుర్భర పరిస్థితుల దృశ్యం ఉంది. మౌనంగా అందులో మునిగిపోవటం, మునగ దీసుకు ఉండిపోవటం కాక వాటి గురించి మాట్లాడ వలసిన అవసరం గురించిన హెచ్చరిక ఉంది. మాట్లాడితేనే, హక్కుగా అడిగితేనే శ్రమ ఫలితం దక్కుతుందన్న సూచనఉంది.

అభివృద్ధిలో వాటా హక్కుగా సాధించుకోవలసినది అన్న భావన 1985 తరువాత దళిత బహుజన ఉద్యమాలతో వ్యాప్తిలోకి వచ్చింది. అది బీజరూపంలో ఈ నాటకంలో కనబడుతుంది. పరంజ్యోతి అర్ధభాగం పొందటం గురించి కూలీలను హెచ్చరించటం ఆమె పాడిన ప్రబోధగీతంలో గమనించవచ్చు. మధుమూర్తి ప్రబోధంలో కూడా. “…లెండు , రండు, భారత ధనధాన్యముల్ మనకు రాగాల భాగము పంచుకొండికన్” అన్న పిలుపు ముఖ్యమైంది. పొలాలలో, పరిశ్రమలలో కష్టపడి సంపద సృష్టించే మనుషులు తమకు లభించే కూలి యజమానుల దయాధర్మ భిక్ష అన్నట్లుగా దోసిలి ఒగ్గి నిలబడే పాత అలవాటు అన్యాయమైనది, అగౌరవకరమైనది.ఆ స్థితిని రద్దుచేసి సమానవిలువల నూతన సమాజం ఏర్పరచటం అంబేద్కర్ ఆశయం. అగ్రవర్ణాల దయమీద వాళ్ళను వదిలెయ్యకూడదని అంటాడు. ఈ నాటకంలో కూలీ యూనియన్ కు కూడా అదే ఆదర్శం అయింది . నిష్కుల్ చెప్పింది కూడా అదే. ఆ క్రమంలోనే సంపద సృష్టికర్తలు హక్కుగా అర్ధభాగమో, లెక్కగా రావలసిన భాగమో పొందవలసినవాళ్లు, పంచుకొనవలసినవాళ్లు అని సోషలిస్టు నీతి ఏమి చెబుతుందో అదే పరంజ్యోతికి మధుమూర్తికి ప్రజలలో ప్రబోధించవలసిన, వ్యాప్తి చేయవలసిన విలువ అయింది.

“పెట్టుబడిదారీతనం, భూస్వామ్యం ఈ రెండు ముఖాల రాక్షసత్వాన్నీఈ మానవ సంఘం ఎంతకాలం నుంచీ భరించుకొంటూ వస్తున్నదో” అని బెంగపడగలిగిన చైతన్యం పరంజ్యోతిది. ఈ రెండు ముఖాల పీడనకు తోడు మహిళలు ఎదుర్కొనే అదనపు పీడన లైంగిక అత్యాచారాలు, అవమానాలు. దళితపేద కార్మిక కర్షక కూలీల శ్రమ మాత్రమే కాదు, ఆ వర్గాల స్త్రీల శరీరాలు కూడా లోకువ ఈ వ్యవస్థలో. పరంజ్యోతిని గురించి ‘పోతపోసిన బంగారం తీగ గదండి’ ఆపిల్ల అని గుమస్తా శివం విశ్వనాథరావు కు చెప్పిన మాటల అర్ధం అదే. కూలీ రేట్ల పెంపుదలకు మధుమూర్తి, పరంజ్యోతి రైతు కూలీలను వెంటబెట్టుకొని విశ్వనాథరావు దగ్గరకు వెళ్ళినప్పుడు అది రుజువైంది కూడా. కూలీలకు గిద్దెడు గింజలు కూడా ఎక్కువ కొలిచేది లేదని విశ్వనాథరావు తెగేసి చెప్తుంటే ‘మనుష్యుని కనీస లక్షణం కారుణ్యం కూడా చూపలేరా’ అని పరంజ్యోతి అన్నమాటకు విశ్వనాథరావు ఇచ్చిన జవాబు ‘ అది నీ మీద చూపగలను. నీవుండి తక్కినవాళ్లను పంపెయ్యి’ అని.

స్త్రీగా పరంజ్యోతికి కలిగిన ఈ అవమానం గురించి తరువాతి అంకంలో (5) చర్చ ఉంది. పరంజ్యోతి అది వ్యక్తిగా తనకు జరిగిన అవమానంగా భావించి బాధపడలేదు.తన వర్గపు స్త్రీలు ప్రతినిత్యమూ పొందే అవమానాల బాధే ఆమె బాధ.
“జగతికాహారమిడునట్టి శ్రామికునకు
కడుపునిండ గంజియు లేదు , పుడమినెల్ల
సతుల మానము గాచెడి శ్రమిక సతికి
గౌరవము లేదు – బ్రతుకెంత కాలమిట్లు”
అన్నదే ఆమె బాధ. ఇందులో పుడమిలోని సతులనుండి శ్రామిక సతులను వేరుచేయటం చూస్తాం. శ్రామిక సతులే మిగిలిన సతుల మానపరిరక్షకులుగా చెప్పబడ్డారు. తిండి బట్టా సమృద్ధిగా ఉన్న భద్రలోకపు మహిళలు వాళ్ళు. కూటికోసం బయటకు వచ్చి పనులు వెతుక్కొనవలసిన అవసరం వాళ్లకు లేదు. అందువల్ల వాళ్లకు మానహాని లేదు. అటువంటి గౌరవకరమైన సౌఖ్యజీవనం కొందరికి సమకూడుతున్నదంటే అది శ్రామిక సతుల శారీరక శ్రమ లో కారిన చెమట వల్ల ఆ క్రమంలో ఎదురయ్యే అవమానాల ఫలితమైన కన్నీళ్ల వల్ల మాత్రమే అన్నది పరంజ్యోతి అవగాహన.

భాగ్యశాలినులుద్యాన వనములందు
కేళి నాటపాటలతో సుఖించు చుండ్రి!
కూలి పడతులీ మధ్యాహ్న కుటిల వేళ
మండుటెండల కూటికై మాడుచుండ్రి! – అని స్త్రీలందరూ ఒక్కటి కాదు అన్న సత్యాన్ని గురించిన గ్రహింపు జ్ఞానం ఆమెది. అందుకే
“శ్రమికలై, యెంతకాలమీ చచ్చు బ్రతుకు
దీనలై యెంతకాలమీ దేవురింపు?
గోరవ ప్రతిపత్తికై కత్తిగట్టి
దెబ్బలాడగా కచ్చ బంధింపుడమ్మ!” అని శ్రామిక స్త్రీలను గౌరవకరమైన జీవితం కావాలంటే తిరుగుబాటు తప్పదని పిలుపు ఇచ్చింది.

పరంజ్యోతిని తండ్రి అలా అవమానిస్తున్నప్పుడు ప్రేమ కుమార్ అక్కడే ఉన్నాడు. ఆ నాడు ఎదుటపడి తండ్రిని నిరసించ లేకపోయిన అపరాధభావమే అతనిని ఇల్లువదిలి వచ్చి కూలీ యూనియన్ లో చేరేంతవరకు వెంట తరిమింది. పరంజ్యోతి క్షమాపణను అభ్యర్ధించేటట్లు ఒత్తిడి పెట్టింది. ఆ సందర్భంలో పరంజ్యోతి లోని ఆత్మాభిమానం ‘క్షమించాను’ అన్న మాట బయటకు రాకుండా అడ్డుపడింది. ‘నాడు అవమానం పొందింది నేనుకాదు, నా జాతి’ అని తప్పించు కొన జూసింది. నీ జాతి తరఫున నీవు క్షమించు అని ప్రేమ కుమార్ ఒత్తిడి చేసాడు. అప్పుడామె ‘ నా జాతి తరఫున నేను క్షమించలేను అని నిష్కర్షగానే చెప్పింది. క్షమించలేకపోవటానికి ఆమెకు సరైన కారణమే ఉంది.

“పొట్టగడవక కూలికిపోయి, ఆత్మ
గౌరవము సున్నగాగ, బెంగల కృశించి
ఎందరు కులాంగనల్ నశియించినారో !
మిమ్ము క్షమియింపగ, నన్ను క్షమింత్రే వారు?” అని ప్రేమకుమార్ ను శ్రమను శీలాన్నీ కూడా దోచుకొనే భూస్వామ్య వర్గానికి ప్రతినిధిగా నిలబెట్టి నిరాకరించింది. ఆమె చేత క్షమింపబడటానికి కావలసిన అర్హత సంపాదించుకొనే తిరిగివస్తానని వెళ్లిన అతను ఆ తరువాత తన శ్రామిక జన పక్షపాత కార్యాచరణ తో ఆ అర్హతను సంపాదించుకొనటంవల్ల ఆమెను జీవిత సహచారిగా కూడా పొందగలిగాడు.

                                      4.

కూలీల హక్కుల సాధన మార్గం ఏమిటి? ఉత్పత్తిలో తగిన వాటా పొందే విధానం ఎటువంటిది? శ్రామిక మహిళలకు గౌరవప్రతిపత్తి సాధించటం ఎలా? ఈ మొదలైన ప్రశ్నలను మనముందుకు తెస్తుంది నాటకం. అన్ని ప్రశ్నలకు ఒకటే జవాబు కూడా ఇస్తుంది. అది అహింసా మార్గం. ముందు అభ్యర్ధించటం. యాజమాన్యం దానిని మన్నించకపోతే సమ్మె కట్టి సాధించాలి. కానీ జాతీయ ప్రభుత్వంలో సమ్మె కూడదు అని నిష్కుల్ అభిప్రాయం. గాంధీ ఇచ్చిన సత్యాగ్రహమే ఆయధంగా భూస్వాములపై యుద్ధం అతని ఎజండా. అతనే ఈ నాటకానికి ఆత్మ అయిన తత్వాన్ని ప్రతిపాదించినవాడు. దానికి అనుగుణంగా ఆచరణ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశించినవాడు. గాంధేయ సామ్యవాదం ఆశయం. గాంధేయ అన్న విశేషణం వల్ల సామ్యవాదంలో ఉన్న వర్గపోరాట పదునును మినహాయించినట్లయింది. సత్యాగ్రహం ద్వారా సర్వసమత్వం గమ్యంగా సాగాలి అన్న అతని నిర్దేశన దాని కొనసాగింపే. పరంజ్యోతితో చేసిన సంభాషణలో ( 5వ రంగం ) నిష్కుల్ సర్వ సమత్వం కోసం మార్క్స్ ఇచ్చిన కార్యక్రమం కాలం చెల్లిన కార్యక్రమం అని చెప్తాడు. నూరేళ్ళ క్రితపు నిరంకుశ పరిస్థితులకు అది సరిపాయింది కానీ వయోజన ఓటింగ్ ,ప్రజాస్వామికమూ ఉన్న నేటికాలానికి ఎంతమాత్రమూ పనికిరాదని అతని అభిప్రాయం. గాంధీ ఇచ్చిన సత్యాగ్రహమే అవశ్యం అనుసరణీయం అని చెప్పి స్వతంత్ర భారత దేశంలో సమానత్వ సాధనకు గాంధేయమార్గాన్ని ఏకైక మార్గంగా ప్రతిపాదించాడు.

గాంధీ ధర్మకర్తృత్వ సిద్దాంత ప్రస్తావనకు కూడా ఈ నాటక ఇతివృత్తంలో స్థానం లభించింది. సర్వసమత్వం కూలీల ఆకాంక్ష అయితే అందువల్ల నష్టపోయే భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలు తప్పనిసరిగా కూలిమనుషుల ఆకాంక్షలను చిదిమివేసే ప్రయత్నం చేస్తారు. ఆ ఆకాంక్షను ఆపలేమని తెలిసిన యువకుడు ప్రేమకుమార్ ‘దానికీ గాంధీ చక్కని కార్యక్రమాన్నిఇచ్చాడు. దాన్ని మనం తృణీకరిస్తే విప్లవాన్ని మనమే ప్రోత్సహించినట్లవుతుంది’ అని భూస్వామి అయిన తండ్రి విశ్వనాథ రావు ను హెచ్చరిస్తాడు. సర్వసమత్వ సాధనకు శ్రామికులకు సత్యాగ్రహాన్ని సాధనగా ఇచ్చిన గాంధీ సంపన్న వర్గాలకు సర్వోదయ తత్వాన్ని ఇచ్చాడు. సర్వోదయం అంటే అందరి అభ్యున్నతి. ప్రకృతినుండి అవసరాలకు సరిపడినంత తీసుకోవాలి కానీ ఆశతో అంతా తనకే కావాలని అనుకోకూడదు. అవసరాన్ని మించి ఆస్తులు పోగుపడ్డవాళ్లు వాటిని అందరి శ్రేయస్సుకోసం వాడే వితరణ శక్తిని సంపాదించుకోవాలని భావించాడు. ఆస్తులకు స్వంతదారులం అన్న భావనను విడిచి దానిని సమాజంలో సర్వుల శ్రేయస్సుకు వాడాలనే ధర్మకర్త భావనను అభివృద్ధిచేసుకోనాలని ఆశించాడు. సమాజంలో సమత్వం, సామరస్యం సాధ్యమయ్యే మార్గం అదేనని ఆయన నమ్మకం. తండ్రికి చేసిన హెచ్చరికలో ప్రేమ్ కుమార్ ప్రస్తావించిన కార్యక్రమం ఇదే.

అంతే కాదు, అతను కూలీ యూనియన్ లో చేరి కూలీ రాజ్య నిర్మాణ ఆశయాన్ని ప్రచారం చేస్తూ “వందలకొలదీ యెకరాలొకడే / వ్యక్తికి చెందుట తగదండోయ్ / దేశంలోగల సర్వభూమినీ / జాతీయం చేయాలండోయ్ / ఉత్పత్తిని జాతీయం చేసీ / ఊరందరికీ పని చూపీ / కలిమీ లేమీ తేడా మాపి / కమ్మని పాలన జరపండోయ్” అని ఇచ్చిన పిలుపులో సారం ధర్మకర్తృత్వ దృక్పథం నుండి దిగినదే. ( 11వ రంగం ) తండ్రి ఇంటికి రమ్మని ఆస్తిపాస్తులు చూచుకోమని కోరినప్పుడూ అతను దానికే కట్టుబడి ఉన్నాడు. ప్రభుత్వానికి అవి స్వాధీనం కావలసినవే నని చెప్తూ అవి వ్యక్తిగా తనకు మాత్రమే చెందినవి కావన్న ఉన్నత తాత్విక దృక్పథాన్ని కనబరిచాడు. సంపన్న వర్గాలలో రావలసిన హృద్యపరివర్తన గురించి గాంధీ ఆశించినదానికి అచ్చమైన ప్రతినిధిగా భీమన్న ప్రేమకుమార్ పాత్రను నడిపించాడు.

కూలీల కోసం,కూలీలను కూడగట్టి ఏర్పరచిన తాలూకా యూనియన్ చేసినదేమిటి? జీవనప్రమాణాలకు అనుగుణంగా కూలిరేట్లు పెంచమని కూలీల పక్షాన ప్రెసిడెంటు మధుమూర్తి వైస్ ప్రెసిడెంట్ భయంకర్, సెక్రటరీ పరంజ్యోతి భూస్వామిదగ్గరకు రాయబారం వెళ్లివచ్చారు. అది విఫలం అయింది. సత్యాగ్రహం ధనవంతుల చేత అణచివేతకు గురైంది. ఈ పరిస్థితులలో కర్తవ్యం ఏమిటని ప్రశ్నవచ్చినప్పుడు ‘పార్టీని బలపరచుకొని దరిద్రులంతా ఏకమై ప్రభుత్వాన్ని స్వాధీన పరచుకొనటమే’ అని నిష్కుల్ మరొక కార్యక్రమాన్ని ( 8 వ రంగం ) ముందుకు తెచ్చాడు. అంత వరకు కూలి యూనియన్ ప్రస్తావన తప్ప మరే రాజకీయ పార్టీ ప్రస్తావన లేదు. కూలీ యూనియన్ నే అతను పార్టీగా చెప్పాడనుకోవాలి.

ప్రేమకుమార్ ‘కూలీ యూనియన్ లో చేరుతాను. జాతీయ కాంగ్రెస్ నే కూలీ యూనియన్ గా మారుస్తాను. నా శక్తియుక్తుల్నీ, నా పలుకుబడిని ఉపయోగించి రేపటి ఎన్నికలల్లో ఈ పార్టీ విజయంపొందేలా కృషిచేస్తాను’ (9వ రంగం) అనుకొనటాన్ని గమనిస్తే కూలీ యూనియనే పార్టీగా చెప్పబడింది అని రూఢీ అవుతుంది. రైతుకూలీ సంఘం రాజకీయపార్టీగా మారటం ఎలా సాధ్యమో అర్ధం కాదు. జాతీయ కాంగ్రెస్ నే కూలీ యూనియన్ గా మారుస్తాను అనటం మరింత జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశం. కూలీ యూనియన్ ఒక పార్టీ అనుకొంటే దాని మౌలిక స్వభావం పేద లకు, శ్రామికులకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టటం. అది సోషలిస్టు విప్లవం ద్వారా కాక వయోజన ఓటింగ్ హక్కు ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వాళ్ళను అధికారంలోకి తీసుకురావటం. జాతీయ కాంగ్రెస్ స్వభావాన్నికూడా ఆ రకంగా మార్చాలనేది ప్రేమకుమార్ ఉద్దేశంలా కనబడుతుంది. అగ్రవర్ణ సంపన్నవర్గాన్ని అధికారంలోకి తెచ్చి నిలబెట్టిన పార్టీగా కాంగ్రెస్ మోస్తున్ననింద ఎక్కడో హృదయాన్ని బాధిస్తుంటే పరిహారంగా కాంగ్రెస్ లో పరివర్తనను ఆ విధంగా సంభావించి ఉంటాడతను. అంతే కాదు మిత్రాతో కాంగ్రెస్ మహా సంస్థను మీకు అండగా నిలుపుతాను అంటాడు. స్వతంత్ర నిర్మాణం కలిగి దేశమంతా ప్రతినిధులను నిలబెట్టి గెలిపించుకొని అధికారాన్ని స్వాయత్తం చేసుకొనటానికి సిద్ధంగా వున్నపార్టీకి కాంగ్రెస్ మహా సంస్థ ఇయ్యగల అండ ఏమిటో ఊహకు అందదు.
ఏమైనా “కూలివాడు రాజ్యమేలినప్పుడు గాని
సంఘ బాధలెల్ల చక్కబడవు
పరగనట్టి రాజ్య సంస్థాపనమునకై
బ్రతుకు ధారవోసి పాటుపడుదు” అన్నది అతని ప్రతిజ్ఞ.

                                      5.

‘ఇంట భత్యములేని, ముఖాలలో వికాసం లేని కార్మికుల దౌర్భాగ్యం’ గురించిన మధుమూర్తి మాటలకు కదిలిపోతూ పరంజ్యోతి స్వరాజ్యం వచ్చిన తరువాతకూడా మార్పులేకపోవటంగురించి వేదన పడుతున్న సందర్భంలో ఆమెతో మాటకలుపుతూ మిత్ర ‘మనకు వచ్చింది స్వరాజ్యం కాదు. స్వాతంత్య్రం మాత్రం’ అంటుంది. అనటమే కాదు, ఇంకా రాని ఆ స్వరాజ్యాన్ని మనం సాధించవలసి ఉంది అని ఒక కార్యక్రమాన్ని ఇస్తుంది కూడా. (1 వ రంగం)

బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలు నాటక కథాకాలం అన్నది స్పష్టం. స్వాతంత్రం కన్నా స్వభావంలో , విలువలో భిన్నమైనది స్వరాజ్యం అన్నది మిత్ర అవగాహన.స్వరాజ్యం అంటే రాజ్యం మనదే అయివుండటం. కానీ మిత్ర స్వరాజ్యం రాలేదంటున్నది అంటే అది అన్యవర్గం చేతిలో ఉందని అర్ధం. రాజ్యం మనది కాదు అంటే అశేష శ్రామిక వర్గానిది కాదు. మరెవరిది? ధనవంతులది, అగ్రవర్ణులది. అధికారం వాళ్ళది. నిర్ణయాలు వాళ్ళవి. ఏది జరిగినా వాళ్ళ ప్రయోజనాల పరిరక్షణకే. జనాభాలో తొంభై శాతంగా వున్న దళితులు, కష్టజీవులు అయిన ప్రజలకు అందులో భాగస్వామ్యంలేదు. వాళ్ళ అవసరాలగురించి మాట్లాడే నోరే లేదు. అదీ అసలు విషాదం. మిత్ర ఆశించే స్వరాజ్యం వ్యవసాయ కూలీలు, కార్మికులు భాగస్వాములుగా , వాళ్ళ ప్రయోజనాల పరిరక్షణకు బాధ్యత వహించగల రాజ్యం. అది ఇంకా రావలసే ఉంది. అప్పటికీ ఇప్పటికీ కూడా.

దళితుల రాజ్యాధికారం గురించి మొదటి నుండీ మాటాడుతున్నవాడు అంబేద్కర్. ఏ రకమైన పక్షపాతానికి తావులేని సమాన విలువల సమాజ నిర్మాణం ఆయన ఆకాంక్ష. సామాజిక న్యాయ స్దాపనకోసమే రాజ్యాధికారం అవసరం అని ఆయన అభిప్రాయం. రాజకీయ న్యాయం ఒక్కటే ఆయనకు సరిపోదు. అస్పృశ్యుల సంక్షేమం, గౌరవకరమైన జీవనం అందుకు మొదటి షరతు. అయితే ఈ నాటకంలో అంబేద్కర్ చెప్పిన సామాజిక ఆర్ధిక న్యాయంలో సామాజికం అన్న అంశం వదిలివేయబడి , మొత్తంగా శ్రామిక వర్గానికి ఆర్ధిక న్యాయం ప్రధానాంశం అయి అది సాధింపబడటానికి రాజ్యాధికారం అన్న భావన ప్రముఖంగా ముందుకు వచ్చింది. అంటే అది బహుజన రాజ్యం అన్నమాట. ఇందులో హరిజన మహిళను భారత రాజ్య అధ్యక్షురాలిని చేయటం అనే కొత్త ఆదర్శం గాంధీ చెప్పిన మాటగా వచ్చి చేరింది. దానిని వాస్తవీకరించటానికి వీలుగా ఇతివృత్తగమనం సాగింది.

వ్యవసాయ కూలీలు అనుసరించదగినది ఒక్క గాంధీ మహాత్ముని చరణద్వయమే అని పరంజ్యోతి అన్నప్పుడు నిష్కుల్ ‘కులమత వర్గ రహితమైన సాంఘిక వ్యవస్థను ప్రేమ ద్వారా సత్యాగ్రహం ద్వారా సాధించమన్నాడని హరిజన బాలికను భారతరాజ్య అధ్యక్షురాలిగా చేయమన్నాడని, భారత ప్రధాని కూడా హరిజనుడే కావాలని అన్నాడని చెప్తాడు.(5 వ రంగం) ఆ సమాచారం వ్యాప్తిలోకి వచ్చింది కనుకనే భూస్వామ్యవర్గ ప్రయోజనాలకు కట్టుబడి స్వంత లాభం చూసుకొనే శివం వంటి గుమాస్తాలు హరిజన స్త్రీని దేశానికి అధ్యక్షురాలిని చెయ్యమన్న గాంధీకి బుర్ర లేదని తీర్మానించేసుకొని అది సాగనియ్యకుండా చేయటానికి ఎత్తులు వేయటం మొదలైంది. ( 8 వ రంగం ) ఆ విధంగా భారత రాజ్య అధ్యక్షురాలు కాదగిన హరిజన బాలిక పరంజ్యోతి అని ప్రచారం కూడా జరుగుతున్నదేమో కూలీ యూనియన్ లో చేరి పేద దళిత వర్గాలతో కలిసి పనిచేయటానికి సిద్ధపడి వచ్చిన ప్రేమకుమార్ మిత్ర తో మాట్లాడుతూ ‘మీరనుకొంటున్నట్లుగా గాంధీజీ ఆశయానికి అనుగుణ్యంగా పరంజ్యోతిని భారత రిప్లబిక్కుకు అధ్యక్షురాలిగా చేదాం’. (9వ రంగం) అని తన మద్దతుని ప్రకటించాడు. ఎన్నికల ప్రచార సంరంభంలో అధ్యక్ష పీఠానికి అభ్యర్థినిగా పరంజ్యోతి రంగం మీదకు రానే వచ్చింది. ఎన్నికలలో గెలవనూ గెలిచింది. ఢిల్లీ దర్బారుకు ప్రయాణాన్ని సూచిస్తూ నాటకం ముగుస్తుంది.

మిత్ర ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ విప్లవాలక్కరలేదు, సమ్మెలక్కరలేదు, సత్యాగ్రహాలక్కర్లేదు అని అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఓటు ను నిలబెడుతుంది. పేదలంతా ఒక్క తాటిమీద నిలబడి పేదల పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకే ఓట్లు వేస్తే ప్రభుత్వం పేదలదే అవుతుంది అని చెప్పటం గమనించవచ్చు. పేదల సమస్య కులమత సంబంధమైనది కాదని చెప్పటం ద్వారా అంటరానితనం అనే సామాజిక దురన్యాయాన్ని ఉపాంతీకరించటం ఒకవైపు జరిగితే సాధించ వలసిన ఆర్ధిక సమత్వం రాజకీయాధికారం చేజిక్కక స్థాపించలేమనిచెప్పటం ద్వారా రాజకీయా ధికారం అనే దానిని ఒక సర్వస్వతంత్ర అంశగా స్థాపించటం మరొక వైపు జరిగింది. పీడితులలోకెల్ల పీడితురాలు అయిన దళితమహిళకు రాజ్యాధికారం అన్నది ఈ నాటి విలువలదృష్ట్యా కూడా గొప్ప ఆదర్శమే. అయితే దానిని గాంధీ ఆదర్శంగా పదేపదే చెప్తూ స్థాపించు కొంటూ రావటంద్వారా ఇతి వృత్తంలో అటు అంబేద్కర్ తాత్వికతను, ఇటు మార్క్సిస్టు తాత్వికతను అంచులకు నెట్టెయ్యటం జరిగిందని మాత్రం చెప్పక తప్పదు. ’సర్వోదయ సోషలిజం’ అనే శీర్షికతో బోయిభీమన్న 1995 నాటి ఈ నాటక ముద్రణకు వ్రాసిన ముందుమాటను కలుపుకొని చూస్తే ఈ విషయం మరింత బాగా అర్ధం అవుతుంది.

కుల రహిత సమాజం బోయిభీమన్న ఆదర్శం. దానికి ఆయన పదేపదే ప్రచారం చేసే మార్గం కులాంతర వివాహాలే. ప్రేమకుమార్ కు , పరంజ్యోతికి జరగవలసిన పెళ్లి గురించి మిత్రా ద్వారా సూచించి కూలిరాజు నాటకంలోనూ ఆయన దానిని వాస్తవీకరించే ఉత్సాహం చూపాడు. ఆ తరువాతి నాటకాలలో కూడా ఈ ధోరణి కనబడుతుంది.

                                      6.

అస్పృశ్యతా వ్యాధికి మందు వర్ణాంతర వివాహాలే అన్నది బాల్యం నుండి భీమన్న ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వ్రాసిన నాటకాలలో ‘పడిపోతున్న అడ్డుగోడలు’ ముఖ్యమైనది.1958 లో వచ్చిన నాటకం ఇది. కులం మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడ. అది మట్టిగోడ … ఇట్టే కరిగి కూలి పోతుం దని భీమన్న అభిప్రాయం. ఆ అడ్డుగోడను కూలగొట్టే చోదక శక్తిగా ఆయన గాంధీ ని గుర్తించాడు. గౌరవించాడు. అందుకే ఈ నాటకం ప్రారంభంలో ‘ఐకమత్యపు మేడగట్టిన లోక బాంధవుడు’ అంటూ ఆయనను కీర్తించాడు.

కులం చెప్తేగానీ తెలియనిది. ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి అవకాశాలు అందుబాటులో ఉన్నమేరకు అందరూ ఒకటిగానే కనిపిస్తారు. ఈ సహజ న్యాయ సూత్రం ప్రాతిపదికగా వ్రాసిన నాటకం ‘పడిపోతున్న అడ్డుగోడలు’. బడికివెళ్ళి చదువుకో గలిగిన అవకాశం ఉంటే హరిజనులకు, అగ్రవర్ణాలకు మధ్య సంస్కారాలలోని తేడాలు సమసిపోతాయని నిరూపించటానికి వ్రాసిన నాటకం ఇది. హరిజన బాలిక రమాదేవికి ఆమెతో అదే తరగతిలో చదువుకొంటున్న బ్రాహ్మణ బాలిక ఉమాదేవికి మధ్య కులం వల్ల వచ్చే సంస్కార భేదాలకు తావులేకుండాపోయింది. కులాల పట్టింపు ఉన్న ఉమాదేవి తల్లి రమాదేవి తమ యింటికి వచ్చి కలిసి పోయి కబుర్లు చెప్తుంటే మాలపిల్ల అనే గుర్తించలేకపోయింది. దళితులలో చదువు, సమాజంలో జంకుగొంకులు లేక మెసలగల అవకాశం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన అలవాట్లు, పరిసరాల శుభ్రతకు సంబంధించిన స్పృహ పెరిగే కొద్దీ ఇది సాధ్యం అవుతుంది. మనిషి, మాటతీరు, మర్యాద ఇవే పైకి కనిపిస్తాయి. అభిప్రాయాలు ఏర్పరచుకొనటానికి కారణమవుతాయి. చెప్తేగానీ తెలియని కులాన్ని బట్టి మనిషికి విలువ కట్టటం అనేది ఎంత అసంబద్ధ వ్యవహారమో ఇక్కడ స్పష్టం అవుతుంది. ఈ వివేకం వల్లనే కులం తెలిసాక కూడా రమాదేవిని కోడలుగా అంగీకరించగలిగింది ఉమాదేవితల్లి.

తండ్రి శివరామ శాస్త్రి హరిజన సేవక సంఘం కార్యదర్శి కావటం, అన్న రామచంద్రం సంస్కరణ వాడి కావటం , తాను స్వయంగా చదువుకొంటున్నది కావటం వల్ల ఉమాదేవికి ఉదారభావాలను అలవరచుకొనటం సులభం అయింది. బయటి సమాజంతో సంబంధంలేని తల్లి మెదడులో ఘనీభవించుకు పోయిన అసమ కుల ధర్మం కరగటానికి వాళ్ళు ముగ్గురూదోహదం చేసిన వాళ్ళే. మనుషులు ప్రయత్నపరులై కుల వ్యతిరేక సంస్కరాలను పెంచుకొనటమే కాదు కులాంతర వివాహాలకు సంసిద్ధులు కావాలన్న భీమన్న దృక్పథం ఇందులో సుస్పష్టం.

భీమన్న నాటకాలలో పైరుపాట ఒకటి . 1960 జనవరి నుండి 1962 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న దామోదరం సంజీవయ్యకు అంకితమిచ్చాడు కనుక ఇది ఆ మధ్యకాలంలో ప్రచురించబడి ఉంటుంది. అంతకంటే పన్నెండేళ్ల క్రితమే అంటే 1950 లోనే అది స్నేహాసుందరి అనే పేరుతో అది ఒక పత్రికలో సీరియల్ గా వచ్చిందని భీమన్న నాటకానికి వ్రాసిన ప్రస్తావన వల్ల తెలుస్తున్నది. ఇది నృత్య సంగీత గేయ రూపకం. పాటే మాట. సంభాషణ. శ్రీవత్స, శీల, స్నేహ పాత్రలుగా నడిచే ఈ నాటకంలో శ్రీవత్స విద్యాధికుడు , సంపన్నుడు అయిన గ్రామీణ యువకుడు. శీలా, స్నేహ గడ్డికోసుకొని బతికే గ్రామీణ యువతులు. అతను భావుకుడు, ప్రకృతి ప్రేమికుడు. సౌందర్యారాధకుడు. స్నేహ కు అతనికీ మధ్య పరస్పర ఆకర్షణ. అంతస్థుల తేడావల్ల అంతః సంఘర్షణ. చివరకు వివాహం.

ఒక భావ గీతంగా సాగే దృశ్యమాలికల సమాహారం అయిన ఈ నాటకం ఆద్యంతాల మధ్య కామందుల పశువుల మందలకు గడ్డికోసే పనిలో వున్న స్నేహాను, శీలను చుట్టుకొని శ్రమ ప్రాధాన్యం, శ్రమ సౌందర్యం పరచుకొని కనిపిస్తాయి. గడ్డికోసేపనిలో చెమటలు కారుతూ నిమగ్నమైన స్నేహాను గమనిస్తూ ఉన్న శ్రీవత్స
“పరువు పరువును గడ్డి కోస్తూ
పాటకూడా పాడతావు,
చాల కష్టం కాదటే? ఈ
శ్రమకు అంతే లేదటే?” – అని
సానుభూతితో ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానంలో శ్రమ ఇచ్చే ఆత్మగౌరవ సౌందర్యం , పనికి పాటతో ఉన్న విడదీయరాని సంబంధ సౌందర్యం కనబడతాయి. చెమటపట్టుట చిత్రమా అని ప్రశ్నించి చెమటోడ్చక సంపదల సృష్టి లేదని సూచిస్తుంది. చెమటపడితే ఏమి… కోసుకువెళ్లివేసిన ఈ గడ్డి మేసి నెమరువేసే పాడిపశువుల కళ్ళలోని పారవశ్యం ఇచ్చే ఆనందం ముందు లెక్కే కాదు, అంటుంది. ఉత్పత్తి సాధనాలతో శ్రమజీవికి ఉండే మానవీయ సంబంధాన్ని వ్యక్తం చేసే మాట ఇది. ఆమెకు పనీ కష్టం కాదు, పాటా కష్టం కాదు… సంపదను సృష్టించే పనీ , ఆ పనిలో ‘ప్రతినరానికి ఊతమిచ్చీ పట్టునిచ్చే శక్తిగా’ పాట పరస్పరపోషకాలు. శ్రమజీవుల జీవన తాత్వికతలోని సహజ గతితర్కం అది.

అలసట అవుతుందేమో కాస్త పని ఆపరాదా అని అతనంటే ‘ పని ఆపుదునా నేను? పంట లెలా పండుతాయి? అన్నది ఆమె ప్రశ్న. తాను ప్రత్యక్షంగా పంట తీసే పనిలో లేదు. అయినా తాను గడ్డి కొస్తేనే పశువులకు దాణా.. అవి పుష్టిగా ఉంటేనే అరకదున్నటం, అరక నడిస్తేనే విత్తనం మొలకై కంకివేసి, కాయగాచి పండటానికి పాదు. ఈ శ్రమక్రమంలో ప్రతీదీ బాధ్యతగా చేయ వలసిన పనే. ఆ వివేకం శ్రమజీవికి సహజ సిద్ధం. మనిషి కష్ట పడకుండా మహిమీద భాగ్యమన్నది లేదు అన్న తెలివి ఆమెది. అదే సమయంలో శ్రమ ఒకరిదిగా సౌఖ్యం మరొకరిదిగా ఉన్న వ్యవస్థ గురించిన అవగాహన కూడా ఇందులో శీల ముఖంగా వ్యక్తం అయింది. అయితే ఈ వ్యత్యాసాల వ్యవస్థ ను సమ సమాజంగా మార్చటానికి శ్రామిక వర్గాల సంపన్న వర్గాల యువతీయువకుల మధ్య వివాహమే పరిష్కారం అని రచయిత భావించినట్లు ముగింపువల్ల తెలుస్తుంది.

ఈ నాటకం లో స్నేహ, శీల గడ్డికోసుకొనే కూలిపిల్లలు, పేదపిల్లలు అని ప్రస్తావించబడ్డారే కానీ కులంపేరుతో ఎక్కడా చెప్పబడలేదు. ఎవరామె?ఎక్కడపుట్టింది ? అన్న శ్రీవత్స ప్రశ్నకు పంకజమని చెప్పినచో పార్వైతువే? అన్నది శీల సవాల్. ఇక్కడ వాళ్ళు పంచమ బాలికలు అన్న సూచన ఉంది. అయితే అదేమీ అభ్యంతరం కాకుండానే శ్రీవత్స స్నేహల పెళ్లి అయిపొయింది. అది రచయిత సమాజంలో రావాలని ఆశించిన సంస్కారం. డెబ్బైఏళ్ల తరువాత ఈ నాటికి కూడా అది ఆకాశ కుసుమమే కానీ ఆచరణ వాస్తవం కాలేకపోయింది.

శ్రీవత్స స్నేహల వివాహం అయ్యాక శీల ఒక మంగళ గీతం పాడుతుంది. అందులో పెళ్లి ఉత్సవాన్ని ‘సర్వోదయ సమాజమే /జన్మించిన శుభోత్సవం’ అని సంభవించటం చూస్తాం. వర్గ సంఘర్షణతో నిమిత్తంలేని, పేదల పోరాటంతో పనిలేని, సంపన్నవర్గాల ఉదార దృక్పథం వల్ల మానవీయ సంస్కార ఫలితంగా ప్రభవించే సమాజంగా గాంధీ దేనిని చెప్పాడో ఆ సర్వోదయ సమాజం ఇలాంటి పెళ్లిళ్ల వల్ల ఆచరణ వాస్తవం అవుతుందన్న నమ్మకాన్ని సూచిస్తాయి ఆ మాటలు. వర్ణాంతర వర్గాంతర వివాహాలను వర్గరహిత సమాజం నెమ్మదిమీదనైనా ఏర్పడటానికి ఒక మార్గంగా భీమన్న భావించినట్లు కనబడుతుంది.

                                      7.

బోయి భీమన్న పౌరాణిక నాటకాలు కూడా వ్రాసాడు. రాగ వాశిష్ఠం(1959), వేదవ్యాసుడు (1960) ధర్మవ్యాధుడు(1960) ఆదికవి వాల్మీకి ( 1970). 1940 వ దశకంలో మూడు స్థాయిలలో దళిత కమ్యూనిస్టు కాంగ్రెస్ ఉద్యమ రాజకీయ భావజాల ప్రభావంతో రూపొందుతూ మారుతూ స్థిరపడిన సాహిత్య వ్యక్తిత్వం బోయిభీమన్నది. 1943 లో గోదావరిపుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో గుర్రం జాషువా అధ్యక్షతన దళితరచయితలు హరిజనాభ్యుదయానికి సాహిత్యకళోపాసకుల కర్తవ్యం ఏమిటని చర్చించిన చారిత్రక ఘట్టంలో నేతునూరి గంగాధరం , కుసుమ ధర్మన్న,, పోలుకొండ భద్రయ్య, జాలా రంగస్వామి మొదలైన వారితోపాటు బోయిభీమన్న కూడా ఉన్నాడు. ప్రబోధ సాహిత్య సమితి ఆ చర్చల ఫలితంగానే ఏర్పడింది. ఇది చెప్పటం ఎందుకంటే హరిజనాభ్యుదయ ప్రబోధ ప్రచారాల నిబద్ధత అంతగా ఉన్న బోయిభీమన్న పౌరాణిక నాటకాలను పురాణం కథలను మళ్ళీ చెప్పటానికి మాత్రం వ్రాయడని గుర్తుచేయటానికి.

పురాణ కథలను -అందరికీ తెలిసిన కథలను – తీసుకొని అందులోని మాయను అభవం చేస్తూ వాటిద్వారా వాళ్లకు తెలియని వర్తమాన సామాజిక అంశాలపై ఒక అవగాహన కలిగించటానికి ప్రక్రియను, ఉద్దేశాన్ని కూడా మారుస్తూ పునర్నిర్మించటం ఆధునిక సాహిత్యంలోని విశిష్టత. త్రిపురనేని రామస్వామి చౌదరి దళిత బహుజన కోణం నుండి, చలం స్త్రీల కోణంనుండి, కొడవటిగంటి కుటుంబరావు వర్గ దృక్పథం నుండి ఇలాంటి ప్రయోగాలు చేశారు. బోయి భీమన్న పౌరాణిక నాటకాలు ఆ కోవలోవే. వాటి స్వభావాన్ని, ప్రయోజనాన్ని అర్ధం చేసుకొనటానికి రాగవాశిష్ఠం ఒక్కటి పరిశీలిస్తే సరిపోతుంది.

భారతదేశపు కుల వ్యవస్థలో అస్పృశ్యత ఒక అవమానకరమైన అణచివేత విధానం అని అర్ధం కావటం మొదలైన 20 వ శతాబ్ది నుండి పంచములుగా చెప్పబడుతున్న జాతి మూలాల గురించిన చర్చ ప్రారంభం అయింది. నాలుగు వర్ణాల హిందూ వ్యవస్థలో ఈ పంచమకులం ఎక్కడినుండి వచ్చిందని తర్కించారు. నాలుగే వర్ణాలు ఉన్నాయి, అయిదవది లేనే లేదు అని మనుస్మృతి చెప్పిన దానిని బట్టి పంచములు అనే జాతి ప్రత్యేకంగా లేదని భావించినవాళ్లు ఉన్నారు. అసలు మూల వాసులు ప్రాచీన ద్రావిడులు అని, ఉత్తరాది నుండి దండెత్తివచ్చిన ఆర్యులు ద్రావిడుల పై తమ ఆధిపత్యం స్థాపించుకొని స్థానికులనే పరాయివాళ్లుగా చేశారనే చారిత్రక సమాచారం ఆధారంగా భాగ్యరెడ్డివర్మ పంచమ కులం అనే భావనను ఖండిస్తూ వర్ణవ్యవస్థలో అయిదవ తరగతి ప్రస్తావన లేదని నిరూపించి అంటరాని వర్గాలను అఖిలభారత స్థాయిలో ఆది హిందువులు అనీ, తెలుగు ప్రాంతాలలో ఆది ఆంధ్రులు అనీ వ్యవహరించాలని ప్రతిపాదించి ప్రచారంలోకి తెచ్చాడు. ఈ రకమైన చర్చోపచర్చలు, నిర్ధారణలు ఆంధ్రదేశంలో దళిత ఉద్యమ గమనం – వింటూ, చూస్తూ గమనిస్తూ పెరిగిన చైతన్యం నుండి భీమన్న పంచముల ఆత్మగౌరవ పతాకను ఎగరవెయ్యటానికి పురాణకథలను ఉపయోగించుకొనవచ్చునని చేసిన తొలి ప్రయత్నం రాగవాశిష్ఠం నాటకం

ఈ నాటకం సాక పేములు గారికి అంకితం. భీమన్న ఈ నాటకాన్ని పౌరాణిక సాంఘిక నాటకం అన్నాడు. వస్తువు పౌరాణికం, నిర్వహించిన తీరు సాంఘికం అని అర్ధం చెప్పుకోవచ్చు. ఈ నాటకానికి భీమన్న వ్రాసిన ప్రస్తావనను బట్టి ఇది పద్దెనిమిది సంవత్సరాలక్రితమే వ్రాయబడిందని తెలుస్తుంది. మంగిపూడి వేంకట శర్మ వ్రాసిన నిరుద్ధభారతం ( మూడవకూర్పు,1933) లోని
“వ్యాసముని చంద్రుగన్న పరాశరుండు
మాల దానికి బుట్టి బ్రహ్మర్షి యయ్యె
వేశ్యకును పుట్టి, మాలెత బెండ్లియాడి
ఆ వశిష్ట మహర్షి బ్రహ్మర్షి యయ్యె” అనే పద్యం హరిజనులు ఆర్యులే అన్న భావం కలగటానికి, ఈ నాటకం వ్రాయటానికి పురికొల్పింది అని చెప్పుకొన్నాడు భీమన్న. వాశిష్ఠం అంటే వశిష్ఠుడికి సంబంధించినది. రాగం అంటే ప్రేమ. వశిష్ఠుడికి సంబంధించిన ప్రేమ కథ అని తాత్పర్యం. వశిష్ఠుడు సప్తఋషులలో ఒకడు. ఋగ్వేద కాలం నుండి ఆయన ప్రస్తావనలు ఉన్నాయి. సూర్యవంశస్థుల కుల గురువుగా రామాయణంలో అతనిది ప్రధానపాత్ర. ఆయన భార్య అరుంధతి మాలకులస్థురాలని చెప్పబడింది. బ్రహ్మర్షికి మాల స్త్రీతో వివాహం ఎట్లా జరిగి ఉంటుంది? సామాజిక అభ్యంతరాలు ఏమీ రాలేదా? వస్తే అవి ఎట్లా పరిష్కరించబడ్డాయి? వంటి ప్రశ్నలు వేసుకొని సంభవ యోగ్యత గల సమాధానాన్ని అన్వేషించే క్రమంలో భీమన్న ఈ నాటక ఇతివృత్తాన్ని అభివృద్ధి చేసాడు. 12 రంగాలు ఉన్నాయి ఈ నాటకంలో.

పెళ్లిళ్లు పెద్దలు కుదిర్చి చేసే వ్యవస్థలో అవి కులంలోపలి పెళ్లిళ్లే అవుతాయి. బ్రాహ్మడికి మాలపిల్లను వెతికి తెచ్చి పెళ్ళిచేయటం అనేది జరగని పని. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికి అరుంధతి తో పెళ్లయింది అంటే అది వాళ్ళ ఇద్దరి ఇష్టం మీద జరిగిన పెళ్లిఅయి ఉండాలి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి చేసిన పరికల్పన ఇది. వశిష్ఠుడిని ప్రకృతి సౌందర్యోపాసకుడుగా చూపించి, నీట మునిగిన అరుంధతిని రక్షించటంతో వాళ్ళిద్దరిమధ్య అనురాగం ఏర్పడిందని ఈ నాటకం ప్రారంభిస్తాడు. అప్పుడప్పుడూ కలుసుకొనడం, తాత్విక చర్చలు.. జీవబ్రహ్మల స్థితిని సంభావిస్తూ ఒకరినొకరు చేరి పరిపూర్ణులమయ్యామని ఆనందించటం వరకు ఒక ఘట్టం.

వశిష్ఠుడి ఆశ్రమ పెద్ద, ఇన్నాళ్లు అతనికి రక్షకుడు అయిన ప్రాచీనుడు అంటరాని, చూడ రాని, చండాలకన్య తో స్నేహం ఏమిటని కట్టడి చేయబోతాడు. అతని తల్లి ఊర్వశి అతడిని తనకు అప్పగించి పోయింది కనుక ప్రాచీనుడు వశిష్ఠుడిమీద తనకు ఆ అధికారం ఉందనుకొంటాడు. భీమన్నకు ఈ నాటకం వ్రాయటానికి ప్రేరణ ఇచ్చిన నిరుద్ధభారత పద్యంలో వశిష్ఠుడు వేశ్యకు పుట్టాడని చెప్పబడింది. ఆ వేశ్య దేవ వేశ్య అయినా ఊర్వశి అన్నమాట. నరనారాయణులు తపస్సుచేసుకొంటుంటే తన సింహాసనాన్ని ఆశించి చేస్తున్నారని భావించి ఇంద్రుడు అప్సరసలను పంపిస్తే .. వాళ్ళు చలించక మేము తలచుకొంటే మీ కంటే అందమైన స్త్రీలను సృష్టించగలం అని తొడనుండి ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి కానుకగా పంపారని ఆమెను చూసి మోహించిన వరుణుడి వీర్యం ఒక కుండలో పడి అందుండి వశిష్ఠుడు పుట్టాడని కథ. ఊర్వశి దేవ వేశ్య కనుక శిశువు పెంపకపు బాధ్యతను ప్రాచీనుడికి అప్పగించి వెళ్లినట్లు కల్పించాడు భీమన్న. వేశ్యకు పుట్టాడు అన్న నిరుద్ధభారత కర్త మాటను వాస్తవీకరించటంలో భాగమే ఊర్వశి ప్రస్తావన. పెంచి పెద్దచేసిన అధికారంతో ప్రాచీనుడు నీచజాతి కన్యతో పవిత్రమైన ఆర్యజాతిని సంకరం చేసి సర్వనాశనం చేయవద్దని హితవు చెప్పబోతాడు.

బ్రాహ్మణ చండాలత్వనిర్ణయం అసలు ఎట్లా చేస్తాం? అన్నది వశిష్ఠుడి విచికిత్స. వర్ణభేదం ప్రాతిపదికగా వలపుకు తలుపులు మూసుకోలేని రాగ గాఢత అతనిది. ఏ షరతులు, పరీక్షలు అరుంధతి ప్రేమకు గీటురాయి కావు అన్న ఉదాత్త మానవ సంవేదనతో అతను అరుంధతి కోసం ఆశ్రమ వదిలి వెళ్లిపోతాడు. ఆ తరువాత వచ్చిన ఘోర క్షామానికి ఆశ్రమాలన్నీ అల్లకల్లోలం అవుతాయి. అందుకు కారణం సృష్టిలోని సమానత్వాన్ని విచ్ఛిన్నంచేసే మానవ పాపమేనని బ్రహ్మచేత చెప్పించి , కులమత వర్గ విభేదాలతో మనుషులు అజ్ఞానులై ప్రవర్తిస్తున్నంతకాలం ఇలాంటి విపత్తులు తప్పవని శివుడి ముఖంగా హెచ్చరించి అరుంధతీ వశిష్టుల వివాహానికి సర్వజనామోదం సంపాదించిపెట్టి నాటకాన్ని ముగిస్తాడు భీమన్న.

ఈ క్రమంలో ఆయన నిరూపించదలచుకొన్న విషయాలు రెండు. ఒకటి స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ , అనురాగం అత్యంత సహజం. అవ్యాజం. కులం ఏమిటో తెలిసాక పుట్టే ప్రేమకాదది. అలా పుట్టిందంటే అది ప్రేమే కాదు. ప్రేమ పుట్టటానికి కారణం కాని కులానికి పెళ్లి సమయంలో ఎందుకంత ప్రాధాన్యత అనేది కీలకమైన ప్రశ్న. అది ఒక ప్రజాస్వామిక ప్రశ్న. వసిష్ఠుడు ఆ ప్రశ్నను ఎదుర్కొన్నాడు. రెండు లేవు బ్రహ్మం ఒక్కటే అని చెప్పే తత్వం ప్రకారం కూడా మనుషులంతా ఒకటి కావాలె కానీ కుల భేదాలతో అనేకులు కాకూడదు కదా అన్నది ఆతని ఆలోచన. అందుకనే అతను తనకోసం ప్రాచీనుడి ఆక్షలవల్ల తానిక రాలేననుకొని, స్పృహకోల్పోయి లేచి, ప్రాయోపవేశం లాంటి తపోగ్నిలో దహనం కావటానికి సిద్ధపడ్డ అరుంధతి కోసం బ్రాహ్మణా శ్రమాన్ని వదిలేసి మాదిగ పల్లెకు వెళ్ళిపోయాడు.

మాలమాదిగలను చూడగానే ఉపద్రవమేదో వాటిల్లినట్లు పెడబొబ్బలు పట్టి దూరముగా తొలిగే బ్రాహ్మణ మూర్ఖత్వాన్నిగురించి ఆలోచించమని కులగిరి పాత్ర ప్రవృత్తి ద్వారా హెచ్చరిస్తాడు భీమన్న. ‘పులినోట్లోనన్న చస్తాను గాని, నిన్ను ముట్టుకోను’ అని మలమాదిగలతో అనగలటం ఆ మూర్ఖత్వానికి పరాకాష్ఠ. ఆ స్థాయికి శిక్షణఇచ్చిన సంప్రదాయం, సంస్కృతి, ధర్మశాస్త్రాలు ఎంత క్రూరమైనవో చెప్పకనే తెలుస్తుంది. కులానికి సంబంధించిన ఉచ్ఛత్వ నీచత్వాల భావన మనిషిలోపలి పెద్దపులి అని శివోహం పాత్రద్వారా చెప్పించిన విషయం గమనించదగినది. మనం సంపాదించిన జ్ఞానం ఎంతైనా కానీ తోటిమనిషి పట్ల, జాతిపట్ల మనమెంత సమాన భావంతో ఉన్నాం అనేదే అది అసలు జ్ఞానమా కాదా తెలుసుకొన టానికి గీటురాయి అని వశిష్ఠుడి పాత్ర ప్రవృత్తిలో నిరూపించటం ఈ నాటకంలోని గొప్పతనం.

భీమన్న ఈ నాటకం ద్వారా నిరూపించదలచుకొన్న మరొక అంశం హరిజనులు ఆది హిందువులు ,ఆది ఆంధ్రులు అన్న భావనను హరిజనులు ఆర్యులు అన్న భావనగా ఉన్నతీకరించటం. శూద్రునివలన బ్రాహ్మణస్త్రీకి పుట్టినవాళ్ళు చండాలురు అన్న ప్రతిపాదనను నాటకం ప్రస్తావనలోనే ఆయన అంగీకరించాడు. వర్ణసంకరులు వర్ణబాహ్యులు అయ్యారని మతంగా మహర్షి వాళ్ళ మూల పురుషుడని అనేక ఉదాహారణలతో తర్కంతో వివరించాడు. హరిజనులు బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వాళ్ళు కనుక తల్లివైపు నుండి ఆర్యులే. తండ్రివైపు వాళ్లు ఆర్యులే అని నిర్ధారణ అయితే ఇప్పుడున్న సాంకర్య దోషం పోతుందని అంటాడు. శూద్రత్వం పుట్టుకకు సంబంధించినది కాదని గుణకర్మ విభాగఫలితమని నమ్ముతాడు. అంబేద్కర్ పూర్తిగా తిరస్కరించిన వాదం ఇది (కుల నిర్మూలన) నాటకంలో శివుడి ముఖంగా ఆర్యఅనార్య భేదం లేదని చెప్పిస్తాడు. జాతి దురహంకారంపై ఆగ్రహ ప్రకటన చేయిస్తాడు. సామాజిక హెచ్చు తగ్గులు ఆర్యద్రావిడ యుద్ధాల పర్యవసానమని చెప్పించాడు. మాలమాదిగల మూలపురుషుడైన మతంగుడిని ఆర్యద్రావిడ సమైక్య శక్తిగా చూపిస్తాడు. మూల ద్రావిడులుగా, ఆదిమాంధ్రులుగా దళితుల గురించి అప్పటికి అందరు చెప్తున్నా దాని పట్ల భీమన్నలో ఎక్కడో ఒక అసంతృప్తి ఉంది. ఆర్యులతో సంబంధం కలిపితే గానీ దానికి పరిహారం లేదు. ఆత్మ గౌరవం నిలబడదు. ఆ ప్రయోజనం కోసం అంబేద్కర్ నుండి ఆయన స్వతంత్రత వహించినట్లు కనబడుతుంది.

(ఇంకా వుంది…)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply