బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన

“కాలము మారిపోయే, కల కాలము దాస్యము నిల్వబోదు, ఈ / మాలలు రాజులౌ దురు సుమా…..” అన్న విశ్వాస ప్రకటనతో బోయి భీమన్న 1937 – 38లో కవితా రంగ ప్రవేశం చేసాడు. ఈదళిత అస్తిత్వ చేతన ఆయన సమస్త సాహిత్యంలోకి పరివర్తితమైంది. అది భీమన్న కవిత్వంలో ఏ రకంగా ప్రతిఫలించిందో పరిశీలించాలి .


1

“ పేరులు పెట్టి భేదములు పెంచి అహంకృతులైన వట్టి పూ
జారులు, ‘నీవు-నే’ నను మజా పొసగించిరిగాక ; వ్యర్ధమై
భారత భూమి పాడగును భావి యుగాలకు, నీ విభేదమే
కారణమై శపింతురు దగాపడి దుఃఖితులైన మాదృశుల్
కావున నీవు మానవ వికాసము గోరిన వాడవేని, నీ
భావము మార్చుకొమ్మెవడు బ్రాహ్మణుడుం డెవ్వడు మాల మౌని
వర్యా; వెలయింపుమా, అహముబ్రహ్మమొకండను చున్;వసంతపుం
బూవుల తోటబోలు మతమున్ దయచేయుము మానవాళికిన్ “

బోయి భీమన్న డెబ్బై మూడేళ్ళ క్రితం వ్రాసిన పద్యం ఇది. ‘శంకరుడు – చండాలుడు’ అనే శీర్షికతో 1947 మార్చ్ ప్రజాబంధు పత్రికలో వచ్చిన ఎనిమిది పద్యాల ఖండికలో ఇది ఒకటి. శంకరుడిని సంబోధించి ఒక చండాలుడు చెప్పిన మాటలు ఇవి. ఈ మాటల సారం ఏమిటి? ఈ కులం,ఆ కులం అని పేర్లు పెట్టి, భేదాలు పెంచి మానవులను నీవు నేను అంటూ వేరు చేసి పబ్బం గడుపుకునే పూజారివర్గపు అహంకారం గురించి తెలిసి మాట్లాడుతున్న చండాలుడు అతను.ఈ శంకరుడు ఎవరు?ఈ చండాలుడు ఎవరు? ఎనిమిదవ శతాబ్దిలో బౌద్ధం వల్ల క్షీణించిన హిందూమతాన్ని ఉద్ధరించటానికి పూనుకొని అద్వైత వాదాన్ని ప్రచారం చేస్తూ దేశమంతా తిరిగిన శంకారాచార్యుడే ఈ శంకరుడు. వారణాశిలో వాళ్లిద్దరూ ఎదురుపడ్డారు. వేద పండితుడైన బ్రాహ్మణుడు వస్తున్నాడు కనుక చండాలుడిని తొలిగి త్రోవ ఇమ్మన్నారు. ఆ మాటకు జవాబుగా మీరు తొలగ మంటున్నది ఈ శరీరాన్నా? ఇందులోని ఆత్మనా ? అన్న ప్రశ్నను సంధించి శంకరుడికి అద్వైత వివేకం కలిగించిన ఆ చండాలుడే ఈ చండాలుడు. అతనిని స్తుతిస్తూ శంకరా చార్యుడు చెప్పిన అయిదు శ్లోకాలు ‘మనీషాపంచకం’ గా ప్రసిద్ధం.

భారతీయ వైదిక, పౌరాణిక కథలను దళితులు మూలవాసులు, జ్ఞాన దాతలు అనే విషయాన్నినిరూపించటానికి ఉపయోగించుకోవచ్చునని 1947 నాటికే బోయి భీమన్న ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపే మొదటి నిదర్శనం ఈఖండిక. రాగవాశిష్ఠం వంటి తరు వాతి కాలపు నాటకాలకు బీజం ఇది. శంకారాచార్యుడికి ఎదురైన చండాలుడు సాక్షత్తు శివుడేనని,శంకరాచార్యుడికి కర్తవ్యం బోధపరచటానికి ఆరూపంలో వచ్చాడన్నది ఐతిహ్యం. ఈ పౌరాణిక మాయను తొలగించి భీమన్నచండాలుడి పాత్రను పునర్నిర్మించాడు. “జ్ఞానములేనివాడెటులు జ్ఞాని యగున్? పరమమైన బ్రహ్మమున్ / గాననివాడు దాపడయ గల్గునే యెన్నడు బ్రాహ్మణత్వమున్ ?” జ్ఞానానికి బ్రాహ్మణత్వానికి ముడిపెట్టి ఆలోచించటం, అది ప్రాతిపదికగా కులసమస్యను చర్చించటం అప్పడినుండే ప్రారంభించాడు భీమన్న.

పూజారివర్గం సృష్టించిన ఈ కులభేదాలు భారతభూమిని పాడుచేస్తాయని చెప్పటమే కాదు, భావియుగాలకు దానిపరిణామం ఎలాఉంటుందో ఊహించి చండాలుడి చేత చెప్పిం చాడు భీమన్న. ఈ విభేదాలవల్ల దగాపడి దుఃఖితులైన తనవంటి వారు ఆ విభేదాల సృష్టి కర్తలను శపించక మానరని హెచ్చరించాడు. సమాజంలో కులసంఘర్షణల తీవ్రత మను షుల మధ్య సృష్టించబోయే శత్రువైరుధ్యాన్ని భీమన్నఈ పద్యంలో దేనినైతే గుర్తించాడో దాని పోకడలు నేటి సమాజంలో మనం చూస్తున్నవే.కలుపుగా ఉన్నప్పుడు పీకేయ్య వలసిన దానిని పెంచి పోషించిన వ్యవస్థ వికృతి పరిణామాలు, ఫలితాలు మనకిప్పుడు అనుభవమే.

దారి తొలగమని అనిన శంకరాచార్యుడి కి చండాలుడు నీ భావము మార్చుకోవాలని సూచించాడు. బ్రాహ్మడు ఎవడు ? మాల ఎవరు? ఇద్దరి శరీరం ఒక రకంగా తయారైందే కనుక ఆ భేదభావం విడనాడాలని అతని ఉద్దేశం . అహమూ బ్రహ్మమూ ఒకటే అని నిర్ధారిస్తూ మానవాళికి “ వసంతపుం బూవుల తోట బోలు మతమున్ దయచేయుము” అని కోరాడు. భీమన్న కోరిందీ అద్వైతమే. ఆయన దృష్టిలో నీవు, నేను, ఈ కులం, ఆ కులం అనే భేదస్థితి నశింపు అద్వైతం.

మళ్ళీ పదేళ్లకు ప్రచురించబడిన ‘కావ్య కుసుమాలు’ అనే ఖండకావ్య సంపుటిలో ఒకటి రెండు దళిత అస్తిత్వవేదనను ధ్వనించే ఖండికలు కనబడతాయి. ‘స్వప్నజీవి’ ప్రకృతిలో తిరుగాడే ఒక బాటసారి అనుభవాలు అనుభూతులు ఆత్మా శ్రయ పద్ధతిలో చెప్ప బడిన అయిదుపద్యాలఖండిక.కోయిలలు, చిగురుకొమ్మలు, సంధ్యారాగాలు, వసంత నృత్యాలు, మధుపానాలు మొదలైన వాటితోటి స్నేహసరాగాల జ్ఞాపకాల బరువుతో నడిచే బాటసారికి ఒకచోట విశ్రమించినప్పుడు కులం గురించిన ఆలోచన వస్తుంది.

“ఏ కులమంచు నన్ను వివరింపుల గూడిన కుంటి ప్రశ్నలన్
వ్యాకుల పెట్టబోకు డది వ్యర్ధము; లోకపు మంచిచెడ్డలన్
దూకియు మున్గకుండ నిటు దూరములన్ బడి వచ్చినాడ
, ఈ యాకృతి నేమి కల్గు? హృదయాకృతి జూచి సమాదరింపరే!” అని పరిసరాలకు మొర పెట్టుకున్నాడు. కులం గురించిన కుంటి ప్రశ్నలతో వేధించవద్దని వేడు కొనటం, ఆప్రశ్నలతో విసిగి వేసారిపోయిన దాని పరిణామమే. బహుశా వాటిని తప్పించుకొన టానికే మానవసమాజాన్నివదిలేసి ప్రకృతిలోకి ప్రయాణం ప్రారంభించి ఉంటాడు. శరీరాకృతిని, రంగును బట్టి గాక హృదయానికి విలువ ఇచ్చి తోటి మనిషిని ఆదరించే సమాజం అతని ఆకాంక్ష ‘ఈ యాకృతి నేమి కల్గు? హృదయాకృతి జూచి సమాదరింపరే!’ అన్నమాటలలో అదే వ్యక్తంఅవుతుంది.

కావ్యకుసుమాలు లోనే ‘కంటక నిర్వేదం’ అనే ఖండిక వుంది. “ఒక్క తల్లికె జన్మించి, ఒక్క ప్రేమ / డోలికను జేరి లీలనుయ్యాల లూగి/పెరుగుచుంటిమొకే రీతి విరుల తోట! / అలరు చెల్లెల! నన్నేల అంటుకోరు?” అనిప్రారంభం అయ్యే ఈ ఖండిక లో ప్రస్తుత వర్ణనీయాంశం ఒక చెట్టుకు పూసిన పువ్వును ఉద్దేశించి దానిని అంటి పెట్టుకొని ఉండే ముల్లు పువ్వును పట్టించుకొంటున్నట్లు తనను ఎవరూ పట్టించుకొనటంలేదని బాధపడటం. నన్నేల అంటుకోరు? అన్నముల్లు సవాల్ చటుక్కున అప్రస్తుతం అయిన ‘అస్పృశ్యత’ ను గుర్తు చేస్తుంది. “ ఉర్వి నాగతి నా చేతనుండె నేని/ ముల్లుగా పుట్టియుందునా – పువ్వుగాక?” అన్నముగింపు వాక్యాలు దానిని సమర్ధిస్తాయి. ఎక్కడ పుట్టాలి, ఏకులంలో పుట్టాలి అన్నవి మన ప్రమేయం లేకుండా జరిగిపోయే విషయాలు. మనిషి చేతిలో లేని దానికి బాధ్యత మనిషికే అంటగట్టి అగౌరవపరచటం ఏమి న్యాయం అన్నప్రశ్నను ముల్లు నెపంగా ముందుకు తెచ్చాడు కవి.

దళిత సమస్యను ప్రత్యక్షంగా,ప్రధాన వస్తువుగా చేసి భీమన్న వ్రాసిన కావ్యం “ ‘జన్మాoతర వైరమ్’. 1980 లో వచ్చింది ఈ కావ్యం. పరిష్కారం అనే శీర్షికతో ఈ కావ్యానికి విపులమైన ‘వెనుక మాట’ రాసాడు భీమన్న. దీనిని బట్టి ఈ కావ్యం వ్రాయాలన్న భావం 1937 లోనే ఆయనకు కలిగినట్లు తెలుస్తున్నది. 1937 లో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట సమీపంలోని ఆవిడి గ్రామంలో జరుగుతున్న ఆది ఆంధ్ర సభలకు ముంగండ మీదుగా వెళ్ళాడు. ముంగండ బ్రాహ్మణ అగ్రహారం. మహీధర రామ్మోహనరావు గారి వూరు అది. అందువల్ల ముంగండలో ఆయనను కలిసాడు. అప్పుడాయన జ్వరంతో వున్నాడు. అయినా వద్దన్నా వినకుండా వీధి చివరివరకూ వచ్చి సాగనంపాడు. అలా రావటానికి కారణం కూడా చెప్పాడు. “ వీధి పోడుగునా అరుగుల మీద చేరి మా బ్రాహ్మలు చేస్తున్నపని చూసారుగా ! అదీ ఇక్కడ మా వాళ్ళ నిత్యకృత్యం. తాంబూలాలు వేసుకుంటూ పేకాడుకుంటూ ఉంటారు. ఎవరైనా కొత్తవాళ్లు వీధిలో కనిపిస్తే నిలవేసి అడుగుతారు. – ఊరూ, పేరూ, కులం, గోత్రం వగైరా – మీరు కొత్తవాళ్లు కదా!మిమ్మల్నీ అడుగుతారు. మీరూ చెబుతారు. వాళ్లు తన్నుతారు. అది నాకిష్టం లేదు. నేను కూడా వున్నాను కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకో లేదు.” అని. అగ్రహారం వీధి గుండా నడిచే హక్కు గురించిన ఆ నాటి చింతన పాతిక పద్యాల ఖండిక అయింది. అదే 1980 నాటికి 178 పద్యాల కావ్యం అయింది. దీనిని ఆయన ‘కర్మసిద్ధాంత కావ్యం’ అన్నాడు.

మనం ఇలా ఎందుకు ఉన్నాం? మన కష్ట సుఖాలకు కారణంఏమిటి? అన్న ప్రశ్న లకు సమాధానాలు అన్వేషించే క్రమంలో రూపొందిన కర్మసిద్దాంతం భావవాద సిద్దాంతం. మనుషులు సంతోషంతో అయినా బాధతో అయినా బ్రతకటం పూర్వ జన్మల పాపపుణ్యాల ఫలం అని చెప్తుంది ఈ సిద్ధాంతం.పూర్వజన్మలలో చేసిన మంచి, చెడ్డ పనుల ఫలితం అనుభవించక ఎవరికైనా తప్పదు.దీనిప్రకారం అగ్రవర్ణాలలో పుట్టటమైనా,పంచమ వర్ణంలో పుట్టటమైనా పూర్వజన్మ కర్మ ఫలితమే అయివుంటాయి. అవి అనుభవించవలసినవే కానీ మార్చలేనివి. ఈ సిద్ధాంతాన్నే ఉపయోగించి వర్ణవివక్ష కూడనిది అని చెప్పటం ఈ కావ్య వస్తునిర్మాణంలో రచయిత ఎన్నుకొన్నవ్యూహం.

కథాస్థలంఅతి పురాతన శిధిలాగ్రహారం.సూర్యుడు అస్తమించి చీకట్లు ముసురుకున్న సమయం. “పూర్వమే పండితునికొ, ఏ రాజో ధారపోసిన సంపదలను ఆరగిస్తూ పోకలు నములుతూ,పేకాటాలాడుకునే అగ్రహార బ్రాహ్మణులు ఆర్షవృత్తి నిర్వహణలో భాగంగా చేసిన పనేమిటి అంటే ‘పవిత్ర విప్రవీధిని మైలపరచా’ డన్న నెపంతో ‘పిలవాని, గోచి మాత్రుని, తలపేలిక, చేతికర్ర తాల్చిన వానిన్’ ‘మాల వెంకడి కొడుకు’ను దొంగ అని పట్టి చావకొట్టటం. కావ్య ప్రారంభం ఇదే. తమ జాతి వాడికి నీచత్వం ఆరోపించి హింసించే హిందూ దేశాన్ని,బ్రాహ్మణ దౌష్ట్యాన్నిఏవగించుకొన్నకవి చచ్చాడనుకొన్న బాలుడిని లేపి అతని చేత జాతివైరం గురించి తన ఆలోచనలు, అభిప్రాయాలూ చెప్పిస్తాడు.

పొలం పనిలో ఉండగా పాము ఒకటి పడగ విప్పి తన మీదికి కాటేయ వచ్చిందని తప్పుకున్నా వెంటాడుతూనే ఉన్నదని దాని భయానికే ఊరిమార్గంఎంచుకొన్నానని పాము కోరలను తప్పించుకోబోయి కులదర్పం అనే పాము కోరకు చిక్కానని చెప్పుకొచ్చాడు ఆ బాలుడు. కర్మ మర్మం చెపుతాను వినమన్నాడు. అతను చెప్పినదేమిటి? పూర్వజన్మ లో తాను బ్రాహ్మణకులంలో పుట్టాడట. అహంభావపు నెత్తుట పదును పెట్టిన కత్తి వలె తనవలె పుట్టి బతకాలనుకొనే పొరుగు పంచమ ప్రజలను హింసించాడట. పంచమవర్ణం లేదు అని చెప్పి మరణించిన వారి వారసుడై హరిజనులను హింసపెట్టాడట. చివరకు చచ్చిపోయాడట.అప్పుడు మొదలైందట తనకు అసలు హింస.

“ జీవపరిధినిదాటి, ఆత్మావ శిష్టు
నైన నన్నంటి, హింసించు నట్టి దేదొ
ఎరుక దొంటిరే ?ఎవరినస్పృశ్యులనుచు
అణచిపెడితినో, వారి క్రోధాత్మలవ్వి”(40) – ఆ ఆత్మలు ఎన్ని తరములవో, ఎన్ని యుగములవో, ఎన్ని కొట్లో ‘ప్రతీకార తీవ్ర వ్రతం’ తో ఈ బ్రాహ్మడు ప్రేతాత్మ అయి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నట్లు ఒక్కసారిగా లేడిపై పులి మూక పడ్డట్లు పడ్డాయట. బతికి ఉన్నప్పుడు , కష్టాలు పడుతున్నప్పుడు ప్రతిఘటించలేని పంచములు చచ్చి సాధిస్తారని చెప్పదలచుకొన్నట్లున్నది భీమన్న. వాటిని తప్పించుకొంటూ పరుగెత్తుతూ అనేక కాలాలు గడిపి చివరకు తాను మాలపేటలో పుట్టానని, బ్రాహ్మణ జన్మలో తాను బాధించిన అస్పృశ్యు లు బ్రాహ్మణులై అగ్రహారంలో జన్మించారని, వాళ్లిప్పుడు తనను కొట్టి చంపి ప్రతీకారం తీర్చుకున్నారు కనుక పగ, కర్మ తీరి పోయాయి కనుక వేదోక్త భరత జాతి భవిష్యత్తుకు ఇక ఢోకా లేదన్నట్లుగా మాట్లాడుతాడు. మాలమాదిగలను అస్పృశ్యులు అని దూరం పెట్టినా, వివక్షచూపి హింసించినా ఆ కర్మ ఫలితంఅనుభవించటానికి మరుజన్మలో మాలమాదిగ జన్మఎత్తవలసి వస్తుందని హెచ్చరిక చేయదలచుకొన్నట్లుగా ఉంది ఈకల్పన అంతా.

బ్రాహ్మడే కాదు భువి నంటరానితనము
అమలు పరచెడి ప్రతివాడు నంటరాని
జనుడుగా పుట్టి తత్ఫల మనుభవించు;
చెరకు పండునె తుంగ ముస్తేలను నాట? (69) అని దానిని వాచ్యం చేసాడు కూడా. అంతే కాదు. బ్రతుకులో ధర్మార్ధకామమోక్షాలు అనే నాలుగు దశలు ఉంటాయి వాటికి సూచికలు శూద్రాది పేర్లు, శూద్ర దశనుండి బ్రాహ్మణదశకు ఎదగటం వేద సమాజ లక్షణం, బ్రహ్మవిద్యచే శూద్రుడే బ్బ్రాహ్మడవుతాడు, అర్హతనుబట్టి కులం మారుతుంది, అదిజన్మతో వస్తుందనటం తప్పు అని తన వాదాన్ని ఆ పిలగాని మాటగా వినిపించాడు భీమన్న. ‘పుట్టుక తోడనే కులము పుట్టుక హిందు మతంపు స్వార్ధపుం గుట్టు’ ‘ స్మృతికర్తలకుట్ర’ ((94) అని ప్రకటించాడు. ఆ తరువాతి పద్యాలు ఈవాదాన్నిబలపరిచే పౌరాణిక నిదర్శనాల ను వర్ణిస్తాయి. తాను వ్రాసిన రాగవాశిష్ఠ నాటకాన్నికూడా నిదర్శనంగా చూపించటం గమనించవచ్చు.( 99)

చిలుక పలుకులుగా వేదములను నేర్చి
నంత మాత్రాన జ్ఞాని కాడవని నెవడు;
నిత్యకార్మికుడగువాడె నిర్వికల్పి
సర్వజీవన సముడె విశ్వాధి శిల్పి (126) కులవ్యవస్థ చట్రాన్ని తిరస్కరించకుండా బ్రాహ్మణుడి కిసరికొత్త నిర్వచనం ఇచ్చాడు. కష్టజీవికావటం, సర్వజీవన సమబుద్ధి కలిగిఉండటం ఒకవ్యక్తిని బ్రాహ్మడిని చేస్తాయి కానీ వేదజ్ఞానం ఒక్కటే బ్రాహ్మణత్వ లక్షణం కాదని నిర్ధారించాడు. ‘ఉర్వీఫలమే యొక్కరిదో కాదు, ఎల్లరి హక్కది ; బ్రతుకంగ వచ్చు నందరు దానన్( 130) అని నొక్కిచెప్పాడు. ‘ ఉమ్మడి ఆస్తి ప్రజకు/ పంచభూతమ్ము లట్టులే ప్రతిభకూడా’ ( 136) అని ప్రకటించాడు. మండల్ కమీషన్ రిపోర్టు సిఫారసు చేసిన వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ ను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో చర్చకు వచ్చిన ‘ప్రతిభ’ అనే భావన ను పదేళ్ల ముందే రాజకీయ పదునుతో భీమన్న ప్రస్తావించటం గమనించవచ్చు.

బ్రాహ్మలను ఉద్దేశించి కుల నిర్మూలనకు పూనుకొమ్మని ప్రబోధిస్తాడు గానీ అది వేదవిహిత కార్యంగా ఉండాలని చెప్పటం భీమన వాదనలోని వైరుధ్యం. ఇది ఆయనకు తెలియక కాదు. రెండు పొసగని విషయాలకు మనసిచ్చిన వాడుగా ప్రారంభంనుండి కడ దాకా ఆయన దీనిని కొనసాగిస్తూనే వచ్చాడు. బ్రాహ్మణాది వర్ణాలకు పంచములకు జన్మాo తర వైరమ్ కొనసాగవలసినది కాదు. ఆ గొలుసును ఎక్కడో తెంపెయ్యాలి, జన్మకర్మల భయం లేని సమత లోకి మేల్కొనాలి అన్న భీమన్న కామన ఈ కావ్యం.

దీని తరువాత ఇరవై ఏళ్లకు ‘పంచమ స్వరం’ వచ్చింది. కోకిల కూత పంచమ స్వరం లో ఉంటుందని ప్రసిద్ధి. ఆ పంచమ స్వరం ఈ కావ్యానికి పేరు అయింది.“ నేను పంచ ముణ్ణి కాబట్టి నా స్వరం పంచమ స్వరం. నాది కవి కోకిలగా పంచమ స్వరం. పంచముడిగా పంచమ స్వరం. రెండు విధాలుగానూ ఈ కావ్యం పంచమ స్వరమే.” అని కావ్య ప్రారంభంలో భీమన్న చెప్పుకొన్న మాటలు గమనించదగినవి. పంచముడు చెప్తున్న కవిత్వం కనుక పంచమ స్వరం అన్నది అసలు వాస్తవం. అలాగని పంచముల గురించిన స్వరం ఇందులో వినబడదని కాదు.అసలు ఈ కావ్యమే ఒక విచిత్రం. కొన్నిపద్యాలూ…ఆ పద్యాలకు వ్యాఖ్యా నంగా ఉండే కొంత వచనం ..ఇలా ఉంటుంది నిర్మాణం. పంచమ స్వరం 2, పంచమ స్వరం 3 అంటూ పన్నెండు అధ్యయాలుగా ఉంది ఈకావ్యం. ఎప్పుడు ఏ విషయం భావనా ప్రపంచంలోకి వస్తే దానిని కవిత్వం చేయటం ఇందులో కనబడుతుంది. మ్యూజింగ్స్ వలే అనిపించే అనిబద్ధ పద్యాల గంప ఈ కావ్యం.

పంచమవర్ణాన్నివర్ణవ్యవస్థలో చేర్చి వర్ణసమైక్యాన్ని సాధించదలిచాను అని మొదటి అధ్యాయంలో కంఠోక్తిగా చెప్పిన భీమన్న“ పంచమాంగుళి ఖండించి, భరత బలము
కూలద్రోసెనుఒకపొట్టకూటి గురువు;
పంచమమె నాస్తి అని బొంకి, భరత జాతి
కథనె ఖండించె శాసన కర్త మనువు” — అని అటు ద్రోణాచార్యుడిని, ఇటు మనువును తప్పు బట్టాడు. ఇదే అభిప్రాయం రెండవ అధ్యాయంలోనూ పద్యరూపం తీసుకొన్నది. హరిజన,దళిత అనే వాచకాలతో తనజాతిని సంబోధించి చెప్పటాన్నినిరాకరించి ‘పంచమ’ పదమే వాడవలసినది అనిప్రతిపాదించాడు. “పంచముడ నేను వైదిక పంచజనుడ , పాంచజన్యము నాది, ప్రాభవము నాది” అని ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు. పంచమ కులాన్ని వర్ణవ్యవస్థలో చేర్చ టానికి పార్లమెంటులో చట్టం చేయాలన్నాడు. కులం మార్పుకు కూడా చట్టం ఉన్నప్పుడు కుల నిర్మూలన జరుగుతుందని భావించాడు. పదే పదే చెప్పాడు. “ అంటరాని రాముడు అబ్రహము కాగ/ హత్తు కొందురు ఇండ్లను అద్దెకిత్రు / మానవత్వము లేని ఈ మతము నుండి / పారిపోవుట దోషమే పంచములకు” అని సవర్ణ హిందూ సమాజం చేసే అవమానాలే వాళ్ళను మతాంతరీకరణ వైపు నెడుతున్నాయని సూచించాడు. మాల మాదిగలు అన్న దమ్ములని చెప్పాడు. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన వారికి ప్రత్యేక అవకా శాలు , సదుపాయాలూ ఉండటమే సమంజసం అన్నాడు. .
“ఏ కులమన్న ప్రశ్న ఇపుడెందుకు? పాలక వర్గ దుష్ట బు/ద్ధే కద హేతువందుకు !” అని కుల రాజకీయాల మీద ఆధారపడిన ప్రజాస్వామ్య పాలకవర్గ స్వభవాన్ని వేలెత్తి చూపు తూనే “ ఇపు డేలెడి వంతిక మాలవారిదే ;” అని ప్రకటించాడు . “ పై కులముల్ స్వదేశమును బానిస జే సిరి, క్రింది వారు తత్ / ధీ కళ నుద్ధరింప వలె ; దేశము లోకము నేలగా వలెన్” అని భరత వాక్యం పలికాడు .ఆకాంక్ష బాగానే వుంది కానీ అందుకు అవసరమైన కార్యక్రమం గురించిన సూచన ఏదీ భీమన్న కవిత్వంలో కనబడదు.

(మిగతాది వచ్చే సంచికలో…)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply