బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన (2)

బోయి భీమన్న తొలి నుండి అంబేద్కర్ ఆలోచన తెలిసినవాడే అయినా ఆయన వ్రాసిన ‘కులనిర్మూలన’ గ్రంధాన్నిఅనువదించాకనే (1969) అంబేద్కర్ ను ప్రస్తావిస్తూనో , సంబోధిస్తూనో కవిత్వం చెప్పటం ప్రారంభించినట్లు కనబడుతున్నది. 1971 లో ప్రచురించిన ‘రాభీలు’ లో జయ జయ అంబేద్కరా !/ జయ భారత భాస్కరా” అని ప్రారంభం అయ్యే గీతం ఒకటి ఉంది. “అస్పృశ్యత రూపు మాపి/ అగ్ర అంత్య భేద ముడిపి, నిష్కుల భారతజాతికి/ నీడయైన బోధి ప్రియ” అని ప్రస్తుతించాడు.

1984 లో ‘అంబేద్కర సుప్రభాతం’ ప్రచురించాడు. భగవంతుడికి తెల్లవారింది లేవవయ్యా అని స్తుతి పూర్వకంగా మేలుకొల్పే ఒక సంప్రదాయ సాహిత్య ప్రక్రియ సుప్ర భాతం. నవ యుగాన్ని అంబేద్కర్ శకంగా భావించే భీమన్న ( ఉషస్సు శీర్షికగా భీమన్న సుప్రభాతం కావ్యానికివ్రాసిన ముందుమాట) అంబేద్కర్ గురించి వ్రాయటానికి అంత సంప్రదాయ ప్రక్రియను వాడుకొనటం సంప్రదాయాన్ని వదులు కోకుండానే ఆధునికతను ఆవాహన చేసే అతని స్వభావ లక్షణం వల్లనే. దానివల్లనే ఆయన సాహిత్య వస్తు రూపాలు విలక్షణంగా రూపొందుతుంటాయి. ఈ సుప్రభాతంలో విలక్షణత దీనిని అంబేద్కర్ ను మేల్కొల్పటంగా కాక, అంబేద్కర్ మనల్ని మేలుకోల్పే పవిత్ర గాధగా రూపొందించటం అంతేకాదు, ఈ రచనలో సుప్రభాత లక్షణం కంటే ఎక్కువగా శతక లక్షణం కనబడుతుంది. శతకంలో వంద లేదా నూట ఎనిమిది పద్యాలు ఉంటుండగా దీనిలో ఎనభై ఆరు (86) మాత్రమే ఉన్నాయి. అది తప్ప ప్రతి పద్యానికి ‘నమస్సుల్ డాక్ట రంబేద్కరా’ అన్న మకుటం, ప్రతి పద్యంలో నాయకుని గుణ గానం శతక లక్షణాలే.

“అంబేద్కరు ఇప్పుడు శారీరకంగా లేడు.ఇప్పుడు ఆయన గురించి మనం ఏం చెప్పినా కాదనలేడు, ఔనన లేడు. అందుకే ఆయన పేరెత్తి ఏదైనా చెప్పేవాళ్ళు బహు జాగ్రత్తగ్గా ఆలోచించుకొని మరీ చెప్పవలసి ఉంది.” అని తెలిసినవాడు భీమన్న. ఆయన గురించిన తన అవగాహనలో ఏవిధమైన పొరపాట్లు లేవన్న గాఢమైన విశ్వాసం భీమన్నది.

56 పేజీల విస్తృతమైన ముందుమాటలో “బ్రాహ్మణ మతంవేరు. హిందూమతం వేరు. బ్రాహ్మణ మతాన్ని సంస్కరించి హిందూమతాన్నిసర్వజనీనం చెయ్యాలనుకొన్నాడు అంబేద్కర్.”
“కులవ్యవస్థ అనేది ఈనాడు లేదు”
“ పూనా పాక్ట్ అంబేద్కర్ విజయం”వంటి అనేక నిర్ధారణలు చర్చించి నిగ్గు తేల్చ వలసినవి.

ఈ అంబేద్కర్ సుప్రభాతం వ్రాయటానికి భీమన్నకు ప్రేరణ బోయి విజయభారతి తెలుగులోకి అనువదించిన ‘బాబా సాహెబ్ అంబేద్కర్’ అనే పుస్తకం. అంబేద్కర్ తన జీవితంలో కార్యదర్శి రత్తూ తో తరచూ చెప్పే “ ఎన్నోకష్టాలకోర్చి, ప్రత్యర్థి వర్గంతో పోరాడి నేనివన్నీసాధించానని నాప్రజలకు చెప్పు” అనే వాక్యం తనను బాగా కదిలించిందని, ఆయన సాధించినది ప్రజలకు చెప్పే బాధ్యతతోనే అంబేద్కర్ సుప్రభాత రచన చేశానని ఆయన చెప్పుకొన్నాడు. ఒక పద్యం అల్లటం, దానికి అర్ధ తాత్పర్యాలు, విశేషాంశాలు వ్రాయటం, సమకాలీన చారిత్రక ఘటనలతో కలిపి వ్యాఖ్యానించటం ఈ పద్ధతిలో సాగిన రచన ఇది.

“ జన సామాన్య సమత్వ నిష్ఠము, ప్రజాస్వామ్యమ్ము, తద్భిన్నల
క్షణ రోగిష్టము హైందవమ్ము, కనుకన్ జాగ్రత్త సూచించి – త
ర్జని చూపించుచు, హెచ్చరించుచు ప్రతీ గ్రామమ్మునన్ నీవు ని
ల్చొని, మమ్మోము సమగ్ర విగ్రహా ! నమస్సుల్ డాక్టరం బేద్కరా !”(5) వంటి చక్కటి పద్యాలు ఇందులో వున్నాయి. ‘ఆపన్నులైన దళితులను ఉద్ధరించాలని, దాస్యం సహించబోమని, హక్కులకై పోరాడితే, పాలనలో భాగం అడిగితే అంబేద్కర్ పై కులతంత్ర ప్రభువులు కోపపు నిప్పులు కక్కారు. అయినా అన్నీ ఓర్చుకొంటూ విజయం సాధించాడు అని అంబేద్కర్ ను ప్రశంశించాడు.( 8) కుల తత్వం తో బ్రహ్మతత్వ మహిమలు కోల్పోయి స్వాతంత్య్ర హీనులైన భారతీయులకు జ్ఞానభిక్ష పెట్టాడని మెచ్చుకొన్నాడు(9).

“బడిలో చేరగ, బావి నీరు కొనగా, బండెక్కగా, ఎప్పుడేన్
గుడికిన్ బోవగ మీకు నెల్ల గల హక్కుల్ మాకు లేవేల? ఈ
చెడు చట్టమ్మెవ డోర్చునంచు , సమదృష్టిన్ గోరి పోరాడి” న(13)ఆయన గొప్ప తనాన్ని ప్రశంసించాడు. ఏ భాష అయినా నేర్చుకొనే హాక్కు ఉందని సంస్కృతం నేర్చుకొని వేదాలు చదివి రహస్యాలు కనిపెట్టిన ఘనత గురించి చెప్పాడు.(14) గుండ్రబల్ల సమావేశాలలో అస్పృశ్యుడు హిందువు ఎలా అవుతాడు అని ప్రశ్నించి(24) చేసిన వాద పటిమను పేర్కొ న్నాడు. “ నిన్నున్, నీ ప్రజనున్, అమానుషగతి హింసించు హిందూవ్యవ/ స్థ న్నీ వెందుకు గౌరవించవలయున్? తప్పేమి దూషించినన్?”(27) అని ధిక్కరించి మాట్లా డటాన్ని గురించి చెప్పాడు. రైతు కూలీల పక్షాన ఆయన నిలబడటాన్ని, (28) ‘నానా రీతులనున్న హైందవ కుల న్యాయమ్ములన్ ఏక మార్గానన్ బెట్టిన న్యాయమంత్రివి’, అని హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టడాన్నిప్రస్తావించాడు (41) ఇట్లా అంబేద్కర్ గుణ కర్మలను, జాతికి అతను చేసిన ఉపకారాన్ని అవన్నీ తన ఎడమెదడులలో ప్రతిఫలిస్తుండగా తాను దర్శించిన అంబేద్కర్ ను ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు భీమన్న.

“ బ్రతుకెల్లన్ కృషిగా, ప్రతీ అడుగు పోరాటమ్ముగా సాగి , పీ
దిత జాతీయుల నుద్ధరించి , తొలి మెట్టెక్కించినావు; అట్టి యు
ద్ధతితో నిన్ గురిగా గమించు టది కర్తవ్యమ్ము; మాకింక వ
చ్చుత నీ దీక్షయు, త్యాగమున్ ;ప్రభు !నమస్సుల్ డాక్ట రంబేద్కరా !” — (32) 1985
కారంచేడు ఘటన తరువాత దళితుల ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటం అంబేద్కర్ గురిగా మొదలై కొనసాగుతున్న చరిత్రే . దానికి ఒక ఏడాది ముందే సృజనాత్మక ఆహ్వానం పలికాడు భీమన్న అంబేద్కర్ సుప్రభాతం వ్రాసి.

1991 లో వచ్చిన భీమన్న ‘పాటల తోట’ లోనూ అంబేద్కర్ ను వస్తువుగా చేసుకొన్న పాటలు అనేకం ఉన్నాయి. ‘నీవు చేయని త్యాగమేదయ్యా ! అంబేద్కరయ్యా !’ అనే పాటలో “ తెల్ల దొరలకు నచ్చజెప్పి / తెచ్చితివి ప్రత్యేక హక్కులు / హిందూ సంఘ సమైక్యమెంచి / ఎర్రవాడకు ధార బోస్తివి” అన్న నాల్గు పాదాల చరణం లో కమ్యూనల్ అవార్డు ప్రకటన, గాంధీ నిరసన వ్రతం, పూనా ఒడంబడిక ల చరిత్రను అలవోకగా చెప్పేసాడు. ‘అంబేద్కరా నీవు అవతరించక పోతె’ అని ప్రారంభమయ్యే పాటలో దళితులు తమను తాము తెలుసుకొని మనుషులై బ్రతికే స్థితి ఉండేది కాదని రకరకాల నిదర్శనాలతో చెప్తాడు. ‘ఎన్ని చదువులు’ పాట ఆర్య అనార్య సంస్కృతి గురించిన అంబేద్కర్ అధ్యయనాన్ని ప్రస్తావిస్తుంది. “ఎక్కడ సాంఘిక న్యాయం లోపించెనొ / ఎక్కడ ఆర్ధిక దాస్యం తెగించెనొ” అక్కడ తారక మంత్రమైన పేరు అంబేద్కర్ అని ‘దళిత భారత’ అనే పాటలో పేర్కొన్నాడు. ఊరూరా అంబేద్కర్ విగ్రహాలు ,నోరారా ఆయన కీర్తి గానాలు వినబడుతున్న సమకాలాన్ని గుండెకు హత్తుకున్నాడు భీమన్న ( ఊరూరా) పూర్తిగా అంబేద్కర్ గురించి వ్రాసిన 118 పాటలతో బోయి భీమన్న 1992 లో ‘పాటలలో అంబేద్కరు’ అనే పుస్తకం ప్రచురించాడు. దళిత జనశృతి అనే శీర్షికతో పెద్ద ముందుమాట వ్రాసాడు. కృష్ణశాస్త్రి బొజ్జాకు అంకితంఇచ్చాడు. అందరికీ సమన్యాయం కొరకు అంటే మానవులంతా సమానముగ బ్రతికే జన్మహక్కు కొరకు, దేశానికి ఒకే జాతి, జాతికంతా ఒకే నీతి అని వాదించిన అంబేద్కర్ , ( అంబేద్కరా , నీవు), “, నీటికొరకు నేల కొరకు/ నీటుగబ్రతుకుట కొరకు / దళిత జనోన్నతి కొరకు/ ….”(పాడుకొందు నీ) జీవితాన్నివెచ్చించిన అంబేద్కర్, హిందూ కులతత్వ రాక్షసత్వం పై దండెత్తిన , భారత అస్తిత్వం కాపాడగ బౌద్ధం గైకొన్న అంబేద్కర్ ( నీ ప్రతిభా ) ఈ పాటలలో కనబడతాడు.

“ ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఏజిటేట్
ఎరుక పరుచు, ఏకపరుచు, ఎదిరించు
బోధించు, సంఘటించు, పోరాడు
పోరాడక తెగవురా సంకెళ్లు !
ఎవరా పలికే వారు?
ఇంకెవ్వరు ? అంబేద్కర్” అని ప్రారంభమై ఇటువంటి నిర్మాణమే గల మరొక నాలుగు చరణాలతో సాగే పాట అంబేద్కర్ సిద్ధాంత సూత్రాలను పిల్లల్లోకి అతి సరళంగా తీసుకువెళ్లగల సత్తా గలది.

“ఏ మనెనే? ఏ మనెనే
అంబేద్కరుడేమనెనే?
జాతి సమైక్యం గురించి,
శాంతి సౌఖ్యముల గురించి
అస్పృశ్యత పాటించుట
అవమానము మానవతకు,
ఎంత త్యాగమైన చేసి
అంతు తేల్చుకోండనెనే” వంటి సంవాద రూపమైన
పాటలు కూడా ఆ ప్రయోజనాన్ని నెరవేర్చేవే.
“వినరా భారత వీరా!/ విజయం మనదేరా “ అంటూ బుర్రకథ బాణీలో అంబేద్కర్ జీవితాన్ని, ఆదర్శాన్ని, ఆచరణను గానం చేయటానికి వీలుగా వ్రాసిన పాట కూడా చెప్పుకోదగినది.

అంబేద్కర్ పుట్టుకను,బంధుబలగాన్ని ప్రస్తావిస్తూ వ్రాసిన పాటలు కూడా ఉన్నాయి.

“నిను తలచినంతనే / నీరసము తొలగు, / నిను పిలిచినంతనే / నిబ్బరము కలుగు” వంటి స్తోత్ర రూపమైన పాటలలో “నీ ప్రతిమ నింటిలో / నీ మూర్తి నెడదలో / నిలుపుకొన్న నరుండు / నిర్భయుO డేనాడు” అని జాతికి అంబేద్కర్ ఒక నైతిక శక్తిగా నిలబడటాన్ని సంభావించాడు భీమన్న. ‘నిన్ను దేవుని జెసి వంటి’ పాటలు అనేకం ఈ కోవలోవే.

తత్వార్ధ గీతాల బాణీలో “ అంబేద్కర, అంబేద్కర / అంబేద్కర అను, మనసా / అగ్ర అంత్య భేదముడిపి / అగ్రగామి వగుమ, మనస” అంటూ వ్రాసిన పాట అంబేద్కరిజమ్ వెలుగులో ప్రతి వ్యక్తి తనను తాను సంసిద్ధం చేసుకొనే క్రమానికి సూచకంగానూ , హెచ్చరికగానూ కూడా ఉంది.
రాజ్యాంగం ద్వారా రాజకీయ సమానత్వం అయితే లభించింది గానీ అది సాంఘిక సమానత్వంగా పరిణమించకపోతే వచ్చే సంక్షోభాల గురించి అంబేద్కర్ అప్పుడే ఆందోళన పడ్డాడు. దాని పరిణామాలు చూస్తున్న కవిగా భీమన్న కదిలిపోయి వ్రాసిన పాటలు ‘అందరకు వొట్లిచ్చి’, ‘అంబేద్కరా క్షమించు’ వంటివి. “ నీ వొసగిన సౌకర్యాలను పొంది/ నీ పేరున పదవులు సంపాదించి / నీ ఆదర్శము మరచిన / నీచులగని దురపిల్లే / నీ వేదన చూచి నేను / నిర్విణ్ణుడ నైనాను” అని జాతి పక్షాన ఆత్మ విమర్శనాత్మకంగా కూడా ఉండటం భీమన్న విశిష్టత.

అంబేద్కర్ ను ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా ఆయన స్పందించి పనిచేసిన అంటరానితనం మొదలైన సమస్యల పట్ల సంవేదన వస్తువుగా ఉన్నపాటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ’తాకరాకు తాకరాకు అంటరానివాడవురా’ అనిబడిలో అవమానింప బడిన బాలుడిని( తాకరాకు), నోరెండుక పోయి బావినీళ్లు చేదుకొన్నందుకు దెబ్బలు తిన్నచిన్నారి బాలుడిని ( నిన్నుకొట్టినారా) ఈపాటలలో మనకుచూపిస్తాడు భీమన్న. ‘దాహముతో నీళ్లడిగిన మనిషికి / మురికి గుంటచూపిన సంస్కారం/ తొందరతో బండెక్కిన ఆర్తుని/ కులము తెలిసి పడ ద్రోసిన శౌర్యం మనిషి లక్షణం కాదని తిరస్క రించటం, దాహాన్నే కాదు జ్ఞాన దాహాన్నీ కూడా తిరస్కరించే గురు సంప్రదాయాన్ని నిరసించటం ( దాహముతో ) ఈ పాటలలో ప్రధానం. అంటరాని తనాన్ని అంత మొందించటానికి లేవమని పిలుపు ఇచ్చేప్రబోధ గీతాలు( లేవండి లేవండి) అనేకం. “ఇటురం డిటు రండి! / ఇదిగో అంబేద్కరిజం!/ మానవతా మతమండి / మహికంతకు హితమండి” అని అంబేద్కరిజాన్ని ప్రచారం కూడా చేసాడు భీమన్న.“అస్పృశ్యత తొలగకుండ /హైందవ మిల నిలవదండి” అని స్పష్టంగా చెప్పాడు.

“కులభేదములున్నంత కాలము
కులపోరాటాల్ తప్పావురా!

కులపోరాటాల్ తప్పాలంటే
కుల నిర్మూలనె మార్గంరా

కులనిర్మూలన హిందూ మతమున
కలలో మాటనుకొంటే
భారతీయులందరును మొత్తముగ
బౌద్ధులగుట క్షేమమురా” ( కుల భేదములు ) అని అంబేద్కర్ మార్గమే మన మార్గం కావాలని ప్రబోధించాడు.“నీ యాకృతి గీయుట – చిత్రకళ
నీ ప్రతిమను మలచుట – శిల్ప కళ
నీ కృతులను నిర్మించుట – కావ్యకళ
నీ కీర్తిని పాడుట – గాన కళ –” అంబేద్కర్ వ్యక్తిత్వం, సిద్ధాంతం కళావస్తువు కాగలిగినంత ఉదాత్తమైనవి గా భీమన్న భావించాడు. చదువుకొనటానికి వీలయ్యే కృతులను, పాడుకొనటానికి వీలయ్యే కీర్తనలను వ్రాసి తన నిబద్ధతను చాటుకున్నాడు . ‘వీరెవరు, వారెవరు’ ఈ కృతిలో చివరిది. “అఖిల భారత జనులు , అంబేద్కరా / ఇపుడు / అంబేద్కరిస్టులే, అంబేద్కరా” అన్న ఈ పాట ముక్తాయింపు సమానత్వం కోరే ఏ ప్రజా స్వామికవాదీ అంబేద్కరిస్టు కాక తప్పదని సూచిస్తుంది.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply