బోయి భీమన్న కవిత్వం – వస్తు వైవిధ్యం – 2

దీపసభ కావ్యకథకుడు రైతుకూలీ. ఇంట దీపానికి నూనె లేని నిరుపేద. కాసింత వెలుగిచ్చే దీపం కోసం అతని ఆరాటం. ఆరిన దీపపు కాంతి ఆకాశమార్గాన పోతుంటే ‘ ఏమున్నదో పైని మా యెదల నుండని రమ్యత’ చూతమంటూ కథకుడు కన్ను మూసి కాంతి లవమై దీపాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. ఆకాశంలో దీపసభను చూసాడు. కార్తీక పౌర్ణమి వెన్నెల కాంతి అధ్యక్షతన ఆ సభ జరిగింది. వెన్నెలను స్త్రీగా సంభావించిన కవి ఆమె ముఖపద్మకాంతులను “ పొలముల మోటగట్టి జలముల్ పలుదారుల, పెద్ద చిన్న బో/ దెల బ్రవహింపజేసి, పువుదీవలు, తోటలు పెంచు మా కృషీ/ వల సతి’ ముఖపు కాంతులతో పోల్చటం అటు గ్రామీణ వ్యవసాయ సంస్కృతిని, ఇటు శ్రమ సౌంద ర్యాన్ని ఏకకాలంలో ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాయి.

దీపసభలో పాత్రలన్నీ దీపాలే.అది ఈ కావ్యంలోని ఏక సూత్రత.కానీ రూపాన్ని, ప్రయోజ నాన్నిబట్టి దీపాలు వేరువేరుగా అనిపిస్తాయి. వాటి వెలుతురు వ్యాపించే ప్రాంతాలు, దృశ్యాలు కూడా భిన్నభిన్నంగానే ఉంటాయి. అది జీవిత వైవిధ్యం. ఆ వైవిధ్యం దీపసభ విశిష్టత. భీమన్న బండి దీపం ద్వారా కల్తీ వ్యాపారాల మీద, రాజకీయాల మీద వెలుతురును ప్రసరింప చేసాడు. హరికెను లైటు ద్వారా కృషీవలుడి గృహ జీవిత చిత్రాన్ని ప్రదర్శించాడు. “ అవని శ్రమ చౌర్య,మాస్తి చౌర్యమ్ము , భావ/ చౌర్యమును నేడు పీడించు చాల ప్రజల,/ ఏ యనుభవమ్ము నుత్పత్తి చేయలేని/ సోమరుల నుండి’ లోకాన్ని కాపాడమని ఆ దీపం అధ్యక్షులకు విన్నపం చేస్తుంది. ఇందులో మరొక విశేషం కూడా ఉంది.ఆ కృషీవలుడు ఆనాడు కొట్టించి రాసి పోసి వచ్చిన కొబ్బరి కాయలను దోచుకుపోయినారని వార్త వచ్చి పొలానికి పరిగెత్తాడు. ఆ దోపిడీలో రాసి పక్కనే ఉన్న లేత దానిమ్మ మొక్క తొక్కిడి పడటం చూచి అతను కళ్లనీళ్లు పెట్టుకున్నాడని చెప్పి “ కన్ను చెమ్మగిలదు కష్టార్జితమె పోవ, / మొక్క పోవ నెదయె మొక్కవోయె !/ జాలి నీకు నేర్పజాలును వ్యవసాయి,/ అతనికున్న గుండె నవనికిమ్ము” అని కూడా ఆ హరికేన్ లాంతరు కోరినట్లు చెప్పి భీమన్న రైతు జీవిత తాత్విక ఔన్నత్యానికి పట్టం కట్టాడు.
ఆకాశం నుండి రాలిపడిన ఉల్క వెలుగులో లోకంలోని కర్షకుల కార్మికుల కష్టజీవితం, మనుషుల మధ్య ద్వేషాలు, హింస వర్ణించబడ్డాయి. “ అడుసు త్రొక్కిన కార్మికుడు విశ్రమించినా
డడుసు గుంటగనున్న గుడిసె లోన,
ఇటుక తీసినవాడునిటుకయే తలగడ
గా తోటగట్టున కన్నుమూసె,
సున్నమందిచ్చిన చిన్నది సున్నానె
పఱచుకొన్నది తన పైట చెఱగు,
కఱ్ఱ కోసిన ఱంపకారియు కడుపులో
కాళ్ళు పెట్టుక పండె కఱ్ఱలడితి’
అట్టి రత్నాల మేడను గట్టినట్టి
శిల్పి పొరిగింటి పంచకు జేయి సాచె,
మానవుల గూడి మనలేని ప్రాణి యొకడు
దాన శాసించు సెత్తులు పూనినట్లు. “ —


శ్రమ చేసేవాళ్ళు ఫలితాలకు పరాయీకరింపబడుతున్న ఆర్ధిక సూత్రాన్ని, అది మానవత్వం నుండి పరాయీకరణ చెందిన శాసన కర్తల చేతిలో ఉన్నతీరును గుర్తించి చూపిన ఈ పద్యం కవి సామ్యవాద దృష్టికి నిదర్శనం. కొబ్బరి తుంట దీపం చూసిందీ,చూపిందీ కూడా కూలీల జీవితమే. కూలీ పేట వర్ణన ఇందులో గమనించదగినది. “పాడు గుంటకు రుద్రవాటిక / త్రాడు గట్టిన కూలి పేటది/ పెంటకుప్పల మధ్య మిత్తికి / వంటసాల యది” అని మొదలుపెట్టి మరి మూడు పద్యాలలో ఆ పేట దౌర్భాగ్యం చెప్పబడింది. చీకట్లో పని స్థలం నుండి ఇంటికి వచ్చే కూలీలకు దారి దీపమైన కొబ్బరి తుంటకు “ ముఱికి సందుల, నిఱుకు గుడిసెల / మూల్గుచున్న దరిద్రమున్ గన / తగులబెట్టగ బుద్ధిపుట్టె”నట. “చేతగాని నరుడు సిగ్గునెగ్గును లేక/ పాడు గుడిసెలందె బ్రతుకు గాక, చలము గల్గి, చేతబలమున్న చిచ్చేల ఓగు కాల్చి, బాగు నోమరాదు?” అన్న తర్కం కొబ్బరితుంట మంటది. అదే వినూత్న ధర్మ సృష్టికి నాయకత్వం వహించే శక్తి అని ఈ ఖణ్డికను ముగిస్తాడు భీమన్న. గుడిసెలు కాలిపోతున్నై అన్న భీమన్న భావనలో తాత్విక బీజం ఆ రకంగా 1955 నాటికే పడింది.

భక్తి చాటున దోపిడీ, ద్వేషం,అవినీతి, లంచగొండితనంతో మలినపడిన జీవితాల మనుగడ ఎలా సాగిపోతున్నదో గుడిదీపం చూపిస్తే, వీధి లాంతరు వెలుగు పగలంతా కంకర తట్టలు, మట్టి తట్టలుమోసి, రాత్రి ఆత్మ వికాసానికి చదువుకొనే దీపం ఇంట లేక గుడిసెల నుండి పుస్తకాలతో వీధిలోకి చేరే పిల్లలను చూపుతుంది. ప్రకృతి సిద్ధములైన ధర్మముల తొడ / సంఘధర్మాలకేనాడు సంధి లేకపోవటాన్ని గురించిన గ్రహింపు విద్యుద్దీపానిది. వీటన్నిటికీ పరిష్కారం సర్వోదయ సమాజ నిర్మాణంలోనే ఉన్నదని చెప్పటమే దీపసభ కావ్య పరమార్ధం.

కావ్య కుసుమాలు భిన్న ఖండికల సంపుటి. భావ కవితలు, ప్రేమ కవితలు ప్రధానంగా ఉన్నా సామాజిక జీవిత వైచిత్రిని చిత్రించిన కవితలు కొన్ని ఉన్నాయి ఈ సంపుటిలో. రైతు జీవన సౌందర్యాన్ని పలికించిన ‘కృషి ప్రశస్తి’ ఖండిక వాటిలో ఒకటి. ‘ఎట్టి సఫలతకు నైన మూలము శ్రమయె’ ( శ్రమ- సఫలత) అన్న విశ్వాసం కవిది.

ప్రకృతి సౌందర్య దర్శనోత్సాహంతో ఉన్న మనిషికి కనిపించిన భయద దృశ్యాలు , ప్రకృతికి మానవ ప్రకృతికి మధ్య ఉన్న అగాధాన్ని గురించిన అవగాహన ఇయ్యటం ప్రకృతిలో మానవప్రకృతి కావ్య( 1963) విషయం. ఇందులో దృశ్యాలు పదిహేను. పేదల గుడిసెలకు గుడులకు మధ్య వ్యత్యాసం, కష్టించి సంపాదించినా కూలి డబ్బుల దోపిడీ, మనుషులు తాగి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చావటం, నది సముద్రంలో నౌకను భగ్నం చేసే రాజకీయం, ధాన్యరాసులకు కావలి కాస్తూ ఆకలోకి మాడే మనిషి విషాదం, పొరుగింటి నిప్పుపెట్టే మానవ ద్వేషం, ఆడబిడ్డ అని కన్నా బిడ్డను సముద్రానికి వదిలివేసే కరుకుదనం, తుఫాను భీభత్సం, పడవలో ఎక్కిన తోటి మనిషి మాలవాడని త్రోసివేసే అమానవీయత, ఆడపిల్ల పై చేయివేసే అల్పత్వం, హత్యలు, ఇళ్లపై దాడులు, హింస, హత్యాకాండ, ఆడపిల్లలమీద ఆత్యాచారాలు, యుద్ధాలు, మత విద్వేషాలు- ఇట్లా కదలాడే దృశ్యాలు ఏమేమి చూశాడో కవి “ ప్రకృతిలో మానవ ప్రకృతి యీ రీతి / పండును తినివేయు పుండులా మండ / తిలకించలేక” కన్నులు మూసుకున్నాడు. “ఎందుకో మానవుడింతగా చెడెను” అని దిగులుపడ్డాడు. 1963 నాటికే మానవుడి చెడు ఆ స్థాయిలో ఉందంటే 57 ఏళ్లకు ఇప్పుడెంత పెరిగి ఏ స్థాయికి చేరుకొన్నదో సులభంగానే ఊహించవచ్చు. అనుభవం నుండి అర్ధం చేసుకోవచ్చు.

శతకాలకు సాధారణ లక్షణం రూపములో నైతే మకుటం ఉండటం, సారంలో నైతే సామాజిక విమర్శ. బోయిభీమన్న పిల్లీ శతకం ఈ కోవలోదే. పిల్లీ అన్న సంబోధన మకుటంగా ఉన్న 126 పద్యాల పుస్తకం ఇది. తొలి ముద్రణ 1967 మే అయినా అంతకు చాలాకాలం ముందునుండే వ్రాయబడుతూ, సవరించబడుతూ వచ్చిన శతకం అది. కొన్ని సంవత్సరాల క్రితం ఆకాశవాణి లో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో ఇందులోని కొన్నిపద్యాలు కావ్యగానం చేయబడ్డాయని, వాణి పత్రికలో ప్రచురించబడ్డాయని భీమన్న తన ముందుమాటలో చెప్పుకొన్నాడు. అపూర్వకవి అనే మారుపేరుతో పిల్లీ శతకం పద్యాలు కొన్నిగోలకొండ పత్రిక 1958డిసెంబర్ 7 వతేదీ సంచికలోనూ, 1959 జనవరి 4 వతేదీ సంచికలోనూ కనిపిస్తాయి. ( ఎన్. యాకయ్య , గోలకొండ పత్రిక – సాహిత్య వాజ్మయ సూచిక& గోలకొండపత్రిక – సాహిత్య సాంస్కృతిక చైతన్యం, పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం, కాకతీయ విశ్వవిద్యాలయం) పిల్లిని దుశ్శకునంగా భావించే సంప్రదాయాన్ని తిప్పికొడుతూ “శ్రీకారములో నీతి / ష్ఠాకారము కలిగియుండుటన్ జగ మెల్లన్ / శ్రీకారమునర్చించును;/” అని ఒక కొత్త సిద్ధాంతంతో ఈ శతకాన్ని ఆరంభించాడు భీమన్న. పనిలేని మంగలి పిల్లి తల గోరిగాడు అని ఒక సామెత. అందులోని న్యూనార్ధాన్ని తిరస్కరిస్తూ “పనిలేని మంగలికి బల్/ పనిచెప్పిన మేటి వీవు” అని పిల్లిని ప్రశంసించాడు భీమన్న. ఆ ప్రాతిపదిక మీద పని లేకపోతే జగతికి మనుగడే లేదు, పనిదొంగకు ఇహము పరమూ లేవు అని ఒక విలువను నిలబెట్టాడు. ఇలా పిల్లిని నెపంగా చేసుకొని అన్య విషయార్ద బోధ చేయటం ఇందులోని పద్యాల స్వభావం.


ఎలుకపై పిల్లికి పిల్లిపై ఎలుకకు ఎక్కించి చెప్పటం అనే జాతివిద్వేషాన్ని రెచ్చగొట్టే మానవ కలహప్రియ లక్షణాన్ని, అర్ధమునకు దాసులైన వ్యర్ధ మనుజుల రీతిని, తోడి మానవులను దోచుకొనే దొంగబజారు నీతిని, గోడలు దూకే దుర్బుద్ధిని, పిల్లికి ఎలుక సాక్ష్యమా అని గేలి చేస్తూనే ఏదో వ్యవహారంలో లాలూచీ పడే మనుషుల తెంపరితనాన్ని, మనుషుల మనసు మాలిన్యాన్నిఈ పద్యాలలో నిరసించాడు భీమన్న. ఎలుకలను చొంపి తినే పిల్లిని రైతు బంధువుగా ప్రతిపాదించాడు. ప్రతి వంటింటిలోకీ స్వేఛ్ఛగా, స్వంతం అనుకున్నట్లుగా వెళ్లగల పిల్లిని ఆకలి దాడుల మార్గదర్శిగా ప్రతిపాదిస్తాడు.
“ నూటికి తొంభై మందికి
కూటికి గుడ్డకును లేదు; కూర్చుంటావే
నోటికి తాళము వేసుక?
చాటింపుము వంట గదుల సవరణ ! పిల్లీ” ఇలాంటి ఊహలు, ఆలోచనలు ఎన్నో ఈ శతకంలో కనిపిస్తాయి. పిల్లి ఎలుకను పట్టి తింటుంది. అది భీభత్స దృశ్యం కావచ్చు. కానీ అది పిల్లికి సహజమైన ఆహారం. ఎక్కిరించటానికి, ఏవగించుకొనటానికి ఎవరికీ హక్కు లేదు. “మాంసము మాషమవదే ?” అన్న ప్రశ్నతో ప్రారంభించి మాంసానికి మాషము నకు అంటే మినుములకు తేడా లేదంటాడు. మినుములలో ఉన్నది కూడా మాంసకృత్తులే కదా ! అందువల్ల “ భోంసేయుము మాంసమునే” అని పిల్లి సహజ ఆహారానికి హామీ పడ్డాడు. “మాంసమె పో జగతికెల్ల మనుగడ” అని నిర్ధారణగా చెప్పాడు. దళితుల ముస్లిముల ఆహారపుటలవాట్లమీద హేళనలు, నిషేధాలు, దాడులు దేశ చరిత్రలో విద్వేష ఘట్టాన్ని రచించిన సమకాలపు సందర్భంలో మాంసము మాషమవదే ? అన్న పద్యం (64) విలువ మరీ ఎక్కువ.

ఏది హిందూ? ఏది ముస్లిం?
ఏది క్రైస్తవము ?
ఎల్లమతముల సారమొకటే
హృదయమే మతము! అని చాటాడు భీమన్న ( ఏది హిందూ – రాభీ ) మతం నల్ల మందు అన్న మార్క్స్ ప్రతిపాదనను తిరస్కరించి మతం విషం, ఆత్మనే చంపుతున్న విషం ( గుడిసెలు కాలిపోతున్నై ) అని అభిప్రాయపడ్డాడు.

“ తోడివాని శ్రమఫలము
దోచుకొనుట తొలగాలి
పనీ, తీరికా, వేడుక
ప్రతిమనిషికి కలగాలి” అని ఆకాంక్షించాడు( మారాలి, రాభీ ) కానీ “మేడలు పెరిగాయి / మురికివాడలు పెరిగాయి”( గుడిసెలు కాలిపోతున్నై) అంటూ ఆర్ధిక అసమానతలు తీవ్రమవుతుం డటాన్ని చూసి వేదన పడ్డాడు. “ లంచగొండి తనం / మన జాతీయ క్రీడ కాదా!దానికి నోబెల్ ప్రైజు ఇస్తే / ప్రతి ఏడాదీ అది మనదే కాదా “ ( గుడిసెలు కాలిపోతున్నై) అని నానాటికీ పెరుగుతున్న లంచగొండితనం పై అసహనాన్ని వ్యక్తం చేసాడు.

పండుగలకు ముఖ్యంగా ఉగాది పండుగను ఉద్దేశించి కవిత్వం వ్రాయటంలో శ్రీశ్రీ వంటివాడే భీమన్న. భీమన్నఉగాదులు(1983) -ఉగాది కవితలు- ప్రజాజీవిత వార్షిక ప్రగతి నివేదికలు. ఒక కవిత లో “ పైరవీల పంచలలో / లంచాల కంచాలలో / చీకటి బజార్ల లాకర్లలో / అధిక ధరల బొజ్జలలో / పదవీ రాజకీయాలలో / ప్రపంచపర్యటనలలో / లక్ష్మి,… లక్ష్మికి సేవ చేస్తూ సరస్వతి” ఉండటాన్నిగురించిన వాస్తవాన్ని చూపిస్తాడు. కొండల నుంచి బండలను కొట్టి పడేస్తున్న శ్రమజీవుల చెమటలో అన్నిటికీ మూలమైన శక్తి ఉందని గుర్తించి చెప్పటం ఈ కవితకు కొసమెరుపు (బొమ్మల బజారు)

మధ్యతరగతి, ఇంకా దిగువ మధ్య తరగతి గృహస్థుడి కోణం నుండి ఉగాదిని వ్యాఖ్యానించిన కవిత ‘వాకిట్లో వసంత లక్ష్మి’ “ఒక ప్రక్క
పంపులో నీళ్లులేవు
మార్కెట్లో కూరలు లేవు
జేబులో పైసలు లేవు
మరో ప్రక్క
వసంతలక్ష్మి వచ్చి
వాకిట్లో నిలబడింది!
ఏమిటలా చూస్తావ్?
ఒత్తేసుకో కళ్ళల్లోని దైన్యాన్ని
హత్తేసుకో వసంతలక్ష్మి హృదయాన్ని” అని ప్రారంభం అయ్యే ఈ కవిత కరుణరస ప్లావితం.

“కాలిపోతున్న గుడిసెల్ని కాలిపోనీ / వాటి సమాధులే పునాదులుగా / లేచే భవనాలకు రూపం కల్పించుకో” అని ఒక భర్త తన భార్యకు కానవలసిన కల గురించి చెప్తున్నాడు. విధ్వంసం నుండి నూతన సృష్టి ఆవాహన ఇది. కల్తీ సరుకుల, అధికధరల, అసమానతల, ఆడవాళ్లకు అవమానాల, అధికార రాజకీయాల, అప్రజాస్వామిక వ్యవస్థల పై దూసిన కత్తులు ఆయన ఉగాది కవితలు. శ్రేయో రాజ్యంగా , సర్వోదయ సమాజంగా దేశాన్ని ముందుకు నడిపించే శక్తుల ఆవాహన ప్రతి ఉగాది కవిత. ఈ సంపుటి లో ప్రత్యేకం చెప్పుకోవలసిన కవిత ‘భిక్షుక జాతి’ ప్రారంభం అతి సామాన్యంగా వున్నా ముగింపులో వ్యంగ్యం దీనిని మంచి కవితను చేశాయి. ‘కొంచెం పెన్ను ఇస్తారా , వ్రాసుకొనిస్తాను అన్న సాధారణమైన పలకరింపు నుంచి కొంచెం పొలం ఇస్తావా పండించుకొని ఇస్తాను అనటం వరకూ వెళ్లిన ఈ కవితలో అడిగే వాళ్లు, అడిగినవి సమకూర్చేవాళ్ళు ఇద్దరూ ఉన్నారు. అడిగేవాడు ఈ మొత్తం జాతికి ప్రతినిధి, ముష్టెత్తుకోవడం ఆతడి జన్మహక్కు అంటాడు భీమన్న. అంతవరకు ఒక ఎత్తు. “ ఈ జాతినంతా మేపడం నాకర్తవ్యం /నేను మట్టి నుంచి మధువును పిండే కార్మికుడిని” అని ముగించటం మరొక ఎత్తు. దోపిడీ అనేకులను ఏమీ లేనివాళ్లుగా చేసి బిచ్చగాళ్లుగా మారుస్తున్నది అన్నది లోక సత్యం. ఆ సత్యాన్ని తిరగేసి అందరు సృష్టించిన వస్తుసముదాయాన్ని అవసరాలకు వాడుకుంటున్న వర్గమే బిచ్చగాళ్ల వర్గం అని వస్తుసముదాయాన్ని సృష్టించి అందించే కార్మిక వర్గం భావిస్తున్నట్లు కల్పించిన భీమన ఆ వర్గంలో తలెత్తుతున్న ఆత్మగౌరవ చేతనను ఈ కవిత కొసన దీపంలా నిలిపాడు.

“పనే జీవి వ్యక్తిత్వం / పనే వ్యక్తి అస్తిత్వం” అని సంభావించే (ఫలితంతో, పాటలతోట,1991) భీమన్న ‘మానవహక్కుల బాధ్యత మనసా వహించు / శ్రేయో రాజ్యపు రక్షణ శిరసా వహించు’ ( పాటలతోట) అని ప్రబోధించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎన్నోసమస్యలు వంటి కవితలలో వేతనజీవుల వేదననుంచి అక్రమాల అవినీతి ప్రభుత్వపాలనా వ్యవస్థల వరకు అన్నిటినీ ప్రస్తావించిన భీమన్న ఎవడురా వంటి కవితలలో సంపదలు సౌఖ్యాలు ఏ కొందరివిగానో వుండే స్థితిని నిరసించి శ్రమచేసే వాళ్లకు సౌఖ్యాన్ని, అధికారాన్ని ఆశించాడు.

అకాండతాండవం 1996 లో తొలిసారి అచ్చయినా భీమన్న మిగిలిన కావ్యాలవలెనే ఇదికూడా అంతకుముందెప్పుడో కొన్నేళ్ళక్రితం – దాదాపు 1940 లలో మొదలైన రచన. శివుడి తాండవ నృత్య కథనంగా మొదలైనా ‘మానవ స్వభావంలోని గుణ లేశ వర్ణన’ ఇందులో ప్రధానం కావటం విశేషం. 24 గేయాలవరకు శివ సంబోధనమే. తాండవకేళీ వర్ణనమే. 25 వ గేయం నుండి మనిషిని సంబోధించటం కనిపిస్తుంది. ఆ మనిషికీ శివుడికి అనుసంధానం కుదిర్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ క్రమంలో మనిషిలోని యుద్ధకాంక్ష, పరస్పర ఆహరణోద్యోగం, హింసా ప్రవృత్తి వదులుకోనవలసిన లక్షణాలని బుజ్జగించి చెప్పాడు భీమన్న. రాజ్యకాంక్ష, అధికార ప్రవృత్తి హాని కరమని, మానవతకు అపకారమని తేల్చి చెప్పాడు. పేదవాడిని, కష్టజీవిని కాపు కాయటానికి కవిత్వాన్ని వాడుకున్నాడు. ‘ ధనము కల్గినవాడు ధరణికి ధర్మకర్తగ నుండవలె’ నని గాంధీ ధర్మకర్తృత్వ సిద్దాంతాన్ని గానం చేసాడు. ఆ రకంగా లోకంలోని అన్యాయం మీద, మనిషిలోని స్వార్ధ బుద్ధిమీద, దోపిడీ స్వభావం మీద భీమన్న చేసిన ‘అకాండ తాండవం’ ఈ కావ్యం. “ శక్తి కొలదిగ కష్టపడుచు,/ చాలినంతగ అనుభవించుచు / ఎవనిమట్టుకు వాడు బ్రతికిన / ఇలకు స్వర్గమె దిగదటోయ్” అన్న విశ్వాసమే భీమన్న కావ్యశక్తి.


(అచ్చులో లభించిన తొలి పద్యాలు 1947 నాటివి.)

(ఇంకా వుంది)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply