బోయిభీమన్న సాహిత్యం లో సమానతా సూత్రం

దళిత రచయితలలో బోయి భీమన్నది ఒక విలక్షణ మార్గం. సమానత్వం, అభివృద్ధి మూల సూత్రాలుగా ప్రాచీన హిందూ మత్తతాత్విక భావ ధారతో అవిచ్ఛిన్నతను సంభావిస్తూ పంచముల ఆత్మగౌరవ ప్రతిష్టాపన లక్ష్యంగా సాగిన సాహితీ వ్యవసాయం ఆయనది. ప్రధానంగా భీమన్న భావుకుడు. ప్రకృతి సౌందర్యం, స్త్రీ సౌందర్యం, జీవన సౌందర్యం ఈ మూడూ ఆయనను కాల్పనికోద్వేగంలోకి తీసుకువెళ్లి రసాద్వైతపు సీమలలో పరిభ్రమింప చేస్తాయి. ఆయన నిజమైన అస్తిత్వం అది. రాగ వైశాఖి వంటి కావ్యాలు ఆ మూడ్ నుండి వచ్చినవే .

లౌకికంగా ఆయన సాహిత్య సృజన బహు విస్తారమైనది. విభిన్న ప్రక్రియలలో సాగినది. సం ప్రదాయ సాహిత్య వేదాంత తాత్విక బలం ఆయనకు పుట్టిపెరిగిన తూర్పు గోదావరి జిల్లాల కోనసీమ వారసత్వం. వేదపరిజ్ఞానం, భారతభాగవత పురాణ జ్ఞానమూ గల తండ్రి పల్లయ్య వారసత్వం కూడా కలిసివచ్చింది. పల్లయ్యకు గోదావరి జిల్లాలలో ఎంతోమంది శిష్యులు వుండేవాళ్ళుట. భీమన్న మామగారు, నాగరత్నమ్మ తండ్రి గొల్ల చంద్రయ్య ఆ శిష్యగణంలో వాడే. ఆ గురుత్వం కారణంగానే ఆయన భీమన్న చురుకుతనం చూసి చదువుకోమని ప్రోత్సహించి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసాడు (1936). ( బి.విజయభారతి – మా అమ్మ బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు, 2019) భీమన్నకు బిడ్డ నిచ్చి పెళ్లిచేసిన గొల్ల చంద్రయ్య కూడా సామాన్యుడు కాడు. అధ్యాపకవృత్తిలో ఉంటూనే దళిత జనోద్ధరణ కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించినవాడు. 1936 లో రాజోలులో దళిత బాలల విద్యాభివృద్ధికోసం వసతిగృహాన్ని ఏర్పరచాడు. ఆదిఆంధ్ర ప్రాంతీయ సదస్సుల నిర్వహణలో చురుకుగా పాల్గొ న్నాడు. కార్మిక సహకార సంఘాల, పరపతిసంఘాల ఏర్పాటులో గట్టి కృషి చేసాడు. అందువల్ల భీమన్న వ్యక్తిత్వ నిర్మాణంపై ఆయన ప్రభావం కూడా వుండే వీలు విస్మరించరానిది.

మామిడికుదురు గ్రామంలో 1911 సెప్టెంబర్ 19 న నాగమ్మ కడుపున జన్మించిన భీమన్న ఇరవైనాలుగేళ్ల వయసులో (1935) కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో బిఎ పూర్తి చేసాడు. 1937 లో బిఇడి చేసాడు. ఆ కాలంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు అధ్యాపకత్వం, గోరా సాహచర్యం భీమన్న ఆలోచనా రీతిని ప్రభావితం చేశాయి. తన ఆలోచనలను, భావోద్వేగాలను ప్రపంచంతో పంచుకొనటానికి అవసరమైన మాధ్యమంగా రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి కుదురు కున్నది. 1940లో ముమ్మడివరంలో టీచర్ ఉద్యోగం వచ్చే వరకూ ఆ మూడేళ్లూ సాగింది సాహిత్య వ్యవసాయమే. 1946లో మద్రాస్ లో ఆంధ్రప్రభ ఉద్యోగానికి పోయేనాటికి కవిగా, రచయితగా ఒక గుర్తింపును కూడా పొందాడు. ఆంధ్రాలో గడిపిన ఆ నవయౌవన దినాలలో ఆయనను ప్రభావితం చేసినవి ఇంకేమేమి ఉన్నాయి?

పుట్టిన కులంరీత్యా అంటరానితనమనే సామాజిక దురన్యాయానికి గురికావటం అనుభవంలో విషయం కనుక అతిసహజంగా ఆది ఆంధ్ర ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. 1937 లో తూర్పు గోదావరిజిల్లా కొత్తపేట తాలూకాలోని అవిడి అనే గ్రామంలో జరిగిన ఆదిమాంధ్ర మహాసభకు వెళ్ళటం తన జాతి అభివృద్ధికొరకు జరుగుతున్న ప్రయత్నాలను తెలుసుకొనే సహజ కుతూహలం లో భాగమే. ( డాక్టర్. కె. సంజీవరావు – బోయిభీమన్న రచనలు – దళిత దృక్పథం 2008, పద్మ భూషణ్ డా. బోయి భీమన్న సాహిత్యపీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ) నిజానికి అసలే భావుకుడు, ఊహా శాలీ అయిన బోయి భీమన్న సమకాలపు అంబేద్కర్ ఆలోచన, ఆచరణ దిక్సూచిగా సాగుతున్న దళిత ఉద్యమంతో గుండె కలపటం, గాంధీ నాయకత్వంలోని జాతీయో ద్యమంతో అడుగు కదపటం రెండూ ఆ ముప్ఫయ్యవదశకపు తొలి సంవత్సరాలలోనే సమాంత రంగా జరిగిపోయాయి. ఎంతో ఆర్తితో , సహేతుక వాదనలతో అణగారిన వర్గాల కోసం కమ్యూనల్ అవార్డ్ సాధించిన అంబేద్కర్ గాంధీ కోసం దానిని వదులుకొనటానికి సిద్ధపడి పూనా ఒడంబడికపై సంతకం పెట్టాక హరిజనోద్ధరణ నైతిక బాధ్యతగా భావించి గాంధీ ఏర్పరచిన సంస్థ హరిజనసేవక్ సంఘ్. 1932 లో విజయవాడలో హరిజన్ సేవక్ సంఘ్ శాఖ ఏర్పడటంతో ఆంధ్రా ప్రాంతమంతటా దళితులకు బడులు, వసతిగృహాలు, బావులు మొదలైనవాటి నిర్మాణ కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకత్వాన విస్తృతమయ్యాయి. బడులను, బావులను,గుడులను దళితులతో కలిసి ఉమ్మడిగా ఉపయోగించుకొనటానికి సవర్ణులను చైతన్యవంతంచేసే పనులూ జరిగాయి. ఈ సందర్భంలో గాంధీ ఆంధ్రదేశ పర్యటన(1932- 33) ప్రభావం కూడా చెప్పుకోదగినది. ఇవన్నీ కలిసి అంతవరకు స్వతంత్ర ప్రతిపత్తితో సాగుతున్న దళిత ఉద్యమం జాతీయోద్యమ మహాప్రవాహంలో పాయగా కలిసిపోయింది. ( యాగంటి చిన్నారావు – ఆంధ్రప్రదేశ్ దళితఉద్యమచరిత్ర, 2008) ఈ చారిత్రక సందర్భం నుండి బోయి భీమన్న సాహిత్య దృక్పథం రూపొందింది.

అయిదవతరగతి విద్యార్థిగా పదునాలుగేళ్ల వయసుకే పద్యాలు వ్రాయటం ప్రారంభించినా పరిణత ఆలోచనలతో, భావుకతతో కూడిన ప్రామాణిక రచనలు మాత్రం1932 నాటి పల్లెటురిలేఖలు, 1933 నాటి జానపదుని జాబులు. ఇవి వచన రచనలు. పట్నం లో కొంతకాలం చదువుకొని బీదతనం వాళ్ళ చదువు సాగించలేక తన స్వగ్రామం వెళ్లి పల్లెటూరి పనులలో మునిగిపోయిన యువకుడు తన జీవితానుభవాలను, అనుభూతులను పట్నంలోని మిత్రుడికి వ్రాసిన ఉత్తరాల రూపంలో వున్న కథనాలివి. అక్కడినుండి 2005 (డిసెంబర్ 16) లో మరణించే వరకు డెబ్బై ఏళ్లకు పైగా ఆయన వ్రాసిన నాటకాలు, కావ్యాలు, ఇతర రచనలు అనేకం.

బోయి భీమన్న రచనలను చూస్తే చాలావరకు రచనా కాలానికి, ప్రచురణ కాలానికి మధ్య ఎడం ఎక్కువ కనిపిస్తుంది. చాలాకాలంక్రితమే వ్రాసి అలా పడేసాను అని సందర్భాలతో సహా ముందుమాటలలో చెప్పుకొన్నాడాయన. అట్లా ఆయన వ్రాసుకొన్న ముందుమాటలను బట్టి వాటి రచనా కాలాలను వూహించటంలో ఎవరి లెక్కలు వాళ్ళవి కాగా భిన్నమైన నిర్ధారణలు కూడా జరిగాయి. పాలేరు నాటకమే తీసుకొంటే 1942 అని పోణంగి శ్రీరామ అప్పారావు (తెలుగునాటకవికాసం, 1967) అంటే, 1988 లో వచ్చిన 19 వ ముద్రణకు ముందుమాటలో భీమన్న ‘ వ్రాసి యాభై ఏళ్లకు పైగా అయింది’ అని చెప్పిన దాన్ని బట్టి అది 1933 లోనే వ్రాయబడిందని ఊహించాడు డాక్టర్ పిల్లి శాంసన్ (దళితసాహిత్య చరిత్ర, సెప్టెంబర్,2000) ఆధారాలు ఏమిటో చెప్పకుండానే 1940 అన్నాడు తక్కళ్ళ బాలరాజు (బోయిభీమన్న రూపకాలు ,తాత్విక చింతన, మార్చ్ 1996). దేశికవితమండలి వారి 1946 మార్చ్ నాటి ప్రధమముద్రణ ప్రతి లభిస్తున్నది. మరి తెలుగునాటకం మీద అంతగా పరిశోధనలు చేసిన పోణంగి శ్రీరామ అప్పారావు 1942 అని చెప్పటం ఎందువల్ల? ఆ నాటకం 1942 నాటికి పదేపదే ప్రదర్శితమవుతున్న మాట వాస్తవం. ఆ రకంగా ఆయన నాటక రచనా కాలాన్ని పేర్కొని ఉన్నాడనుకోవాలి. గొల్ల చంద్రయ్య ఏర్పాటుచేసిన వసతిగృహ విద్యార్థులతో రాజోలులో ఆ నాటక ప్రదర్శనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. (బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు). 1940 నాటికే వ్రాయబడి ప్రదర్శనలద్వారా ప్రాచుర్యానికి వచ్చినతరువాత 1946 లో ప్రచురించబడిన నాటకం అది. కూలిరాజు నాటకం విషయంలోనూ ఇంతే. 1951 అని (పోణంగి శ్రీరామ అప్పారావు), 1947 అని ( తక్కళ్ళ బాలరాజు ) 1942 అని (ననుమాసస్వామి,- బోయి భీమన్న రచనలు-దళితదృక్పథం ) ఇలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అవి అలా ఉంచుదాం.

బోయిభీమన్న వ్రాసిన నాటకాలు, గేయ నాటికలు, పిల్లీ శతకం(1967) వంటి శతకాలు, ఏక పద్యోపాఖ్యానం వంటి వ్యంగ్య రచనలు, రాగోదయం (1954) తో మొదలుపెట్టి మోక్షం నాజన్మ హక్కు (1987 ) వరకు ఉన్న కావ్యాలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు అన్నీ కలిసి ప్రచురించబడిన రచనలు డెబ్భైకి పైగానే. అయితే ఏ లౌకిక వాస్తవాల మీద భీమన్న సాహిత్య సౌధానిర్మాణం జరిగిందో, ఆ క్రమంలో భీమన్న ప్రాపంచిక దృక్పథం ఏ రూపు తీసుకున్నదో అంచనావేయాలన్న లక్ష్యమే ఆయన విస్తృత సాహిత్యప్రపంచ విచార చర్చకు పరిధిని నిర్దేశిస్తుంది.

  1. బోయి భీమన్న సాహిత్య పునాది అసమానతల గుర్తింపు జ్ఞానం. 1932,1933 నాటి పల్లెటూరి లేఖలు, జానపదుని జాబులు (జానపదుని జాబులు – దేశీ ప్రచురణ 1957) లోనే అది కనిపిస్తుంది. నూటికి తొంభై తొమ్మిదిమంది గ్రామీణుల కొంపలు కూల్చే సంజెవేళ సందర్భాలను ఒక జాబులో ప్రస్తావిస్తాడు రచయిత పగలంతా రెక్కలుముక్కలుచేసుకొని రక్తం నీరుగా మరచుకొని శ్రమించి సంపాందించిన బేడ డబ్బులు కల్లుదుకాణంలో సమర్పించుకొనటం, ఇంట్లో పిల్లల ఆకలి, పిల్లలను పెళ్ళాన్ని కొట్టటం వంటి దృశ్యాలను చూపిస్తూ “ ఎన్ని కొంపలు కూలిస్తేగానీ ఒక్క కొంప కోటికి పడగెత్తగలదు ? ఎన్ని కొంపల్ని కడుపులు మాడ్చి – ఏడ్పించితే గాని ఒక కొంప సుఖంగా వినోదించగలదు? అని వేసిన ప్రశ్నలలో ఆర్ధిక వ్యత్యాసాల మూలకారణ స్పృహ కనబరిచాడు. మరొక లేఖలో “ ఎంత క్రూర సంఘం ఇది! ఒకరి ఏడుపుతో మరొకరికి సంతోషం కలిగిస్తుంది. ఒకరి ఆకలితో ఇంకొకరి కడుపు నింపుతోంది. ఒకరి రక్తంతో వేరొకరికి సౌఖ్య సౌధాలు నిర్మిస్తోంది” అని చెప్పిన మాటలలో అసమానతలను అంటిపెట్టుకొని వుండే దోపిడీ స్వభావాన్ని గురించిన అవగాహన కనబడుతుంది. మరొక లేఖలో “ తాను స్వయంగా సాగుచేసుకోలేనంత భూమి ఇనాందారు కెందుకు? కష్టపడి భూమిని బాగుచేయగలిగే వాళ్లకు ఏమీలేకపోవటం దురన్యాయం” అని చెప్పిన మాటలలో దున్నేవాడికి భూమి లేకపోవటం గురించిన చింతన ఉంది.

ఒక లేఖలో జానపదుడు పంట కుప్పల దగ్గర కావలి పడుకొన్ననాటి అనుభవం గురించి వ్రాస్తూ నేరమూ శిక్షల గురించి పంచుకొన్న ఆలోచనలు వర్తమాన సందర్భం నుండి కూడా ఆలోచించదగినవే. “ఈ కుప్ప దగ్గర మేమెందుకు చలికి వణుకుతూ బాధపడుతున్నాం? కుప్పను దొంగలు దోచుకోకుండా చూడటానికి . దొంగలేందుకు దోస్తారు? తిండిలేక. తిండి గలిగితే దొంగలే వుండరు.”ఇక్కడ ప్రశ్న సమాధానం తెలిసి వేసినదే.. ఆ తరువాత లేఖలలో కూడా ఎన్ని చట్టాలు, ఎన్ని బందోబస్తులు చేసినా దొంగతనాలు ఆగక పొవటానికి, క్రైమ్ అనేది తగ్గకపోవటానికి కారణం సంఘంలో వున్న అసమత్వమేనన్న స్ఫష్టమైన అవగాహన ఆ లేఖలలో కనబడుతుంది. ఈ విధమైన సంఘ దౌర్జన్యాన్ని ఎదుర్కొనే విప్లవకారులు, అసమత్వాన్ని బహిరంగంగా ఎదిరించటానికి జంకి వేరు మార్గాలు పట్టిన సంఘీయులు దొంగలుగా చెప్పబడుతున్న ధోరణిని ఆనాడే నిరసన స్వరంతో నమోదుచేశాడు భీమన్న. ఈ భీమన్న లేఖలలో బానిసత్వంపై ఏవగింపు, పెత్తందారీ తనాలపై పెదవి విరుపు, చదువు మాన్పించి చిన్నపిల్లలను పనులలో పెట్టటానికి కారణమయ్యే పేదరికంపై కసి, సాంఘిక అంతరాలపై కన్నెర్ర కనబడుతూనే ఉంటాయి.ఏమైనా 1930లలో ఆయన దృష్టి ప్రధానంగా ఆర్ధిక అసమానతల మీద, అందుకు కారణమైన భూసంబంధాల పైన ఉండటాన్ని గమనించవచ్చు. దీనిని బట్టి భీమన్నపై మొదటి ప్రభావం కమ్యూనిస్టు తాత్వికతదే నేమో అనిపిస్తుంది.

పాలేరు నాటకం కంటే ముందే భీమన ‘ఆత్మరక్ష’ అనే నాటిక ఒకటి వ్రాసాడు.( 1939 మార్చ్ ప్రబుద్ధాంధ్ర ) ఎందుచేతనో అది ఇప్పటివరకు భీమన నాటకాల జాబితాలోకి చేరలేదు. ఒక కూలి మనిషి తన భార్యను కామందు కాంక్షిస్తున్నాడని తెలిసి జరగబోయే ప్రమాదం గురించిన ఆందోళనతో చావాలని ఊరమసకల వేళ పొలంలో ఆత్మహత్యకు తలపెడితే, అక్కడ ఉన్నఉత్పత్తి సాధనాలు బండి, ఎడ్లు, గడ్డపార,పార, కొడవలి, తట్ట వంటి పనిముట్లు అతనిని ఆ ప్రయత్నం నుండి విరమించమని, పనిముట్లను కామందు మీద తిరగెయ్యమని ,భార్యను రక్షించుకోమని ఉద్బోధిస్దాయి.దానినిఆచరించే సాహసం కూలిమనిషి చేయ నిరాకరిస్తుండగా అతనిని వెతుక్కొంటూ పొలానికి వచ్చిన కూలిమనిషి భార్య తన వెంటపడి వచ్చి వేధిస్తున్న కామందు మీదకు ఆత్మరక్షకు గడ్డపార ఎత్తటం ఇందులో విషయం. పీడనకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కూలివాళ్ళు పనిముట్లే ఆయుధాలుగా తిరగబడాలని ప్రబోధించే ఇటువంటి నాటిక సమకాలీన రైతుకూలీ ఉద్యమాల స్ఫూర్తి నుండి తప్ప రావటానికి వీలులేదు. అయితే కూలివాళ్ళు సాధారణంగా అస్పృశ్యులు అంటే మాలమాదిగలు అయివుండటం భీమన్నకు తెలిసిన సామాజిక వాస్తవం. అందువల్ల తనను బాగా కలవరపరచిన కూలీల దుర్భరజీవిత సమస్యకు పరిష్కారంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆయన స్వీకరించలేకపోయాడు. తాను కళ్ళువిప్పి లోకాన్ని చూడటం నేర్చుకొంటున్న ఆ ముప్ఫయిలలో దానిని అర్ధం చేసుకొనటానికి ఆయనకు తక్షణం అందివచ్చింది అంబేద్కర్ తత్వమే.

1920 నాటికి అంబేద్కర్ అణగారిన వర్గాల వారి సమస్యల గురించి వేరెవరో మాట్లాడవలసిన అవసరం లేదని,తమ సమస్యలు తామే చెప్పుకొనటానికిదళితులకు అవకాశం ఉండాలని జనాభాలోదళితుల శాతాన్ని బట్టి చట్ట సభలలో వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించాలని (సౌత్ బర్ కమీషన్) మాట్లాడటం మొదలుపెట్టాడు. సమాజంలో తమ సహజ స్థానాన్ని నిలబెట్టుకొనటానికి ఆతృత ఉన్న దళితులే దళితులకు ప్రతినిధులు అని చెప్తూ వచ్చాడు.దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను కోరటం వరకు కొనసాగింది ఆయన కృషి. పూనా ఒడంబడిక దాని దిశను కొద్దిగా మార్చింది. అప్పటికి భీమన్న ఇరవైఏళ్ళ యువకుడు. కూలివాళ్ళ సమస్యలకు కదిలిపోతున్న భీమన్న సమాజంలో వాళ్లకు మిగిలిన అందరితో పాటు సమానంగా సహజమూ, న్యాయమూ అయిన స్థానాన్నిసంపాదించిపెట్టటంలో తనను తాను వాళ్ళ ప్రతినిధిగా సంభావించుకొన్నాడు. అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక పరిణామాల దిశగా మార్పుకు సాహిత్యం కార్యరంగంగా ఎంచుకొన్నాడు. ఆ మార్పును లక్ష్యంగా చేసుకొని పాలేరు నాటకంతో మొదలుపెట్టి సాంఘిక నాటకాలను వ్రాసాడు. అణగారిన వర్గాల అభ్యుదయం కోసం అంబేద్కర్ చేసిన ఆలోచనలలోని – విద్య, కుల నిర్మూలన, రాజ్యాధికారం – అనే మూడుఅత్యంత కీలకాంశాలను ఇతివృత్తాలలో సహజభాగం చేయటం ఈ నాటకాల విశిష్టత.

2.

‘పాలేరు’ నాటకం 1940 లనాటికే వ్రాసాడు బోయిభీమన్న. 1946 లో అచ్చుపడేలోగా అనేక చోట్ల, అనేక సార్లు ప్రదర్శితమైన నాటకం అది. నాటక సహజ స్వభావం, ధర్మం ప్రదర్శనే. ఒక నాటకంలోని సత్తాను నిరూపించే గీటురాయి ప్రదర్శన. పాలేరు ఆ రకంగా అచ్చమైన నాటకం.నాకు ప్రతిరోజు ఎక్కడో అక్కడ తారసపడే పెద్దలలో చాలామంది “ మీ పాలేరు నాటకం లో పాత్రధారులం” అని పరిచయం చేసుకొంటూ వుంటారు అన్న భీమన్న మాటలు ( పాలేరునాటకం ముందుమాట బాణాకర్ర,1988) అతిశయోక్తిగా అనిపించే వాస్తవాలు. ఆనాడు దళితఉద్యమంతో సంబంధం వున్న వాళ్ళ కార్యాచరణలో సాంస్కృతిక ప్రబోధం కూడా ఒక భాగం.

1917 విజయవాడ ఆది ఆంధ్రుల మహాసభతరువాత దళితులలో కలిగిన హక్కుల చైతన్యం సంఘాలుగా సమీకృతం కావటానికి ప్రేరణ ఇచ్చింది. దళితుల సామాజిక హక్కులు, విద్యాభివృద్ధి, ఉపకారవేతనాలు, వసతిగృహాలు, ఉద్యోగపరికల్పన, వ్యవసాయ హక్కులు, ఆత్మగౌరవం మొదలైన అనేక విషయాలు డిమాండ్లుగా ముందుకువచ్చాయి. ఆ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలలో గొల్ల చంద్రయ్యతో పాటు వుండ్రు తాతయ్య, నక్కా వెంకటరెడ్డి, తాడేపల్లి తాతయ్య వంటివారు అనేకులు దళిత ఉద్యమానికి పనిచేశారు. వాళ్లలో బొజ్జా అప్పలస్వామి ఒకడు. బొజ్జా తారకం ఆయన కొడుకే. దళితుల హకుల ప్రచారానికి, హక్కుల వాస్తవీకరణకు దారులు తీసే కార్యక్రమంతో సాగటానికి 1942లో అంబేద్కర్ ఏర్పరచిన షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ లో ప్రారంభం నుండి పనిచేసిన వాడు బొజ్జా అప్పలస్వామి. ఆయన పాలేరు నాటక ప్రదర్శనలలో ఒక నటుడు. అది ఆయన ఆచరణ రంగం యొక్క విస్త్రుతి. అందుకు ప్రతిఫలంగా ఆయన అగ్రవర్ణ హిందువుల దాడులను కూడా ఎదుర్కొన్నాడు ( యాగాటి చిన్నారావు – ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమచరిత్ర) ఆ నాటకం వ్రాసిన రచయితగా భీమన్నఅరెస్టు కూడా అయ్యాడంటే ( బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు) సామాజిక విద్యారంగాలలో, వ్యవసాయకూలీ వర్గాలలో ఈ నాటకం చూపే ప్రభావాన్ని, సాధించగల మార్పును గురించిన అగ్రవర్ణ, అధికారవర్గాల భయమే కారణం అయివుంటుంది. కాకతాళీయమే కావచ్చు కానీ ఈ నాటకం తొలి ముద్రణ తరువాత 1988లో 42 ఏళ్లకు ప్రచురించిన 19వ ముద్రణను అంకితం తీసుకొన్న కోనాడ సూర్యప్రకాశరావు కూడా తనకాలపు దళిత ఉద్యమాలలో భాగస్వామి కావటం, బొజ్జా అప్పలస్వామి వలెనె షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ( 1944 నుండి ) లో క్రియాశీల కార్యకర్త కావటం నాటక వస్తువుకు, సమకాలీన దళిత ఉద్యమానికి, రచయిత సాంస్కృతిక దృక్పథానికి వున్న అన్యోన్య సంబంధాన్ని అనేక పార్శ్వల నుండి సూచిస్తున్నాయి.

3.

పాలేరు పదహారు రంగాల నాటకం. గోదావరీ తీరంలో కాకినాడ బస్సు మార్గంలో రైతువాడ అనే గ్రామంలో కథ మొదలై మధ్యలో కాకినాడ శరణాలయానికి మారి మళ్ళీ వచ్చి రైతువాడ లోనే ముగింపుకు వస్తుంది. ఆ ఊరి భూస్వామి కుబేరయ్య దగ్గర పాలేరు పుల్లయ్య తన కొడుకు వెంకన్నను పశువులు కాయటానికి పనిలో పెడతాడు. వెంకన్నకు బడికిపోయి చదువుకోవాలని ఆశ. వూళ్ళో బడిపంతులు ఉపకారి చదువుపట్ల వెంకన్నకు ఉన్న ఆసక్తిని గమనించి బడికి పంపమని అతని తండ్రిని అడిగి భంగపడతాడు. ఆ ఊళ్లోని మరొక పెద్దింటి బిడ్డ వనబాల బడికిపోయి చదువుకొంటూ ఉంటుంది. వెంకన్నతో ఆమెకు స్నేహం. అతనికి చదువుకొనే ఆవకాశంలేదే అని బాధపడుతుంది. తండ్రి నుండి, కామందు కుబేరయ్య నుండి పొందే తిట్లకు, కొట్లకు ఊరట బాల స్నేహమే అతనికి. ఒక దశకు వచ్చేసరికి వెంకన్న కు ఉన్న చదువుకోవాలన్న పిపాసను తీర్చటానికి ఉపకారి మార్గం చూస్తాడు. కాకినాడ శరణాలయం సూపరెండెంటు దగ్గరకు ఉత్తరం ఇచ్చి, కొత్త డబ్బు ఇచ్చి పంపుతాడు. మార్గమధ్యంలో కుబేరయ్య పంపిన మనుషులు కొట్టి అతని ఉత్తరం, డబ్బు దోచేస్తారు. కాకినాడలో చదువుకుంటున్న బాల అన్న సుందరం, సూపరెండెంట్ కొడుకు రామం కలిసి కాకినాడలో ఎక్కడికిపోవాలో ఆ చిరునామా పోగొట్టుకొని తిరుగుతున్న వెంకన్నను కనిపెట్టి తీసుకువెళతారు.

కుబేరయ్య దగ్గర మరొక పాలేరు వీరేశు. వెంకన్న పినతల్లి సీత అతను ఒకరినొకరు ఇష్టపడతారు. కుబేరయ్య కళ్ళు సీత మీద పడటం గమనించి ఇద్దరూ పట్నం వెళ్లి బతుకుదామనుకొంటారు. కొడుకు ఎక్కడకుపోయాడో తెలియక కుబేరయ్య దగ్గర పని పోయి బాల ఇంట్లో ఆశ్రయం పొందుతాడు పుల్లయ్య. వూరికే తినికూర్చోలేనని అతని ఆవేదన.బిచ్చగాడై తిరుగుతుంటాడు. కాకినాడలో వెంకన్న చదువు కొనసాగుతుంటుంది. బిఎ పూర్తయ్యాక పై చదువులు చదవాలని ఆశపడుతున్నాడని తెలిసిన బాల తన మెడలో కాసుల పేరు తీసి ఉపకారికి ఇచ్చి వెంకన్నను చూసి ఏర్పాట్లు చూచి రమ్మంటుంది. ఈ విషయం తెలిసిన కుబేరయ్య ఉపకారి పైకి మనుషులను పంపుతాడు. అప్పటికే అతని తలమీద కొట్టి కాసుల పేరు తీసుకువెళ్తున్న దొంగ వెంబడి పడతారు వాళ్ళు. ఆ దొంగ పోలీసులు వస్తున్నారని చూసి తనచేతిలో ఉన్న నగ ఎదురుగా వస్తున్న వీరేశు మీద వేసి దొంగ పారిపోతాడు. దొంగతనం నేరం మీద పోలీసులు వీరేశును అరెస్టు చేస్తారు.

వెంకటేశ్వరరావు అయిన వెంకన్న బిఎ ప్రధమ శ్రేణి లో ఉత్తెర్ణుడైన వార్త చెప్పి రామం డిప్యూటీ కలెక్టర్ పదవికి షెడ్యూలు కులానికి చెందిన గ్రాడ్యుయేట్ కావాలని ప్రకటన వచ్చిందని చెపుతాడు. బాల పెళ్లి కుదిరిన విషయం కూడా చెప్పాడు. అన్న సుందరం తనపెళ్ళి రామంతో కుదిర్చాడని తెలిసి చిన్నప్పటినుండి హృదయంలో ఉంచుకొన్న మిత్రుడిని వదిలి పరిచయంలేని పరాయివాణ్ణి పెళ్లాడటం ఎట్లా అని దుఃఖపడి ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకొంటుంది. వెంకన్న బాల పెళ్లి రామంతో అని తెలిసి దిగులుతో ఉంటాడు. పెళ్ళికి రావాలని సుందరం ఒత్తిడి పెడితే ఉపకారి కేసు, వీరేశు కేసు విచారణ కాంప్ వూళ్ళో వేయించుకొని అధికారికంగా వస్తే గౌరవకరంగా ఉంటుందని అతనే ఇచ్చిన సూచన ప్రకారం చేస్తాడు. అక్కడ కేసు పరిష్కారం అయిపోతుంది. తండ్రిని వెతించటానికి ఏర్పాట్లు చేస్తాడు. బావిలో పడిన బాలను రక్షిస్తాడు. బాల వెంకటేశ్వర రావు ల ప్రేమ సంగతి తెలిసి రామం పెళ్లిపీటలమీద కూర్చోవలసినవాడు అతనే అంటాడు. వాళ్ళ పెళ్లితో నాటకం ముగుస్తుంది.

నాటకంలో పద్యాలు, పాటలు సమృద్ధిగా ఉన్నాయి. పద్యాలు పౌరాణిక నాటకాల సంప్రదాయంలోనివి. పాటలు కొన్ని అభ్యుదయ నాటకాలలో కనబడినా ప్రధానంగా సాంఘిక నాటకాలు వచన నాటకాలే. ‘గాఢమైన ఆవేశాలను , రసాలను, ఫీలింగ్స్ ను, వ్యక్తంచేయటానికి పద్యాలు, పాటలు, నృత్యాలు వంటి కళా ప్రక్రియలే సాధనాలు’ అని భావించే బోయి భీమన్న తన నాటకాలను పద్యగేయ సంయుతాలుగానే తీర్చిదిద్దాడు. ఆయన దృష్టిలో కేవలం వచన నాటకాలు నాటకాలు కావు. డాక్యుమెంటరీలు మాత్రమే ( బాణాకర్ర) నాటకాన్ని కళగా మలచాలంటే పద్యాలూ పాటలు అవసరమని ఆయన దృఢ విశ్వాసం. అదలా ఉంచుదాం.

పాలేరు నాటకంలోని సమస్య ఏమిటి? కథనాయకుడు వెంకన్న మాల కులస్థుడైనా అంటరానితనానికి సంబంధించిన సమస్య ముఖ్యం కాదు. మాలవాడు పేదవాడు కూడా కావటంవల్ల చదువుకు పరాయీకరింపబడటం అసలు సమస్య. ఈ పరాయీకరణకు కారకులెవరు? దీని నుండి వాళ్ళను బయటపడెయ్యటం ఎలా? అందుకు లోపలి నుండి ఉండాల్సిన సంసిద్ధత, బయటనుండి రావాల్సిన సహకారం ఎలాంటివి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను సూచించే ఇతివృత్తం ఇందులో ఉంది. విద్య కోసం పూనిక, విద్య పొందటం కోసం ఘర్షణ, ఆంతిమంగా విద్యవల్ల ఉన్నతోద్యాగాన్ని పొందటం ఈ నాటక ఇతివృత్తక్రమం.

పశువులు కాచే చిన్న పాలేరు వెంకన్న బడీడు పిల్లవాడు. తండ్రి తనను కుబేరయ్య దగ్గర పనికి పెట్టేవరకు బహుశా బడికి పోయే ఉంటాడు. చదవటం బాగానే వచ్చింది.తనంతట తాను ఒక పుస్తకం చదివి అర్ధంచేసుకోగల స్థాయిలో ఉన్నాడు. ఈ పుస్తకం చదివేసాను అని తలగుడ్డ నుండి పుస్తకం తీసిచ్చి పంతులు ఉపకారిని మరో పుస్తకం కోసం అడిగేంత విద్యాదాహం అతనిది. కోడి కూతతో లేచి కామందు ఇంటికివెళ్ళి దూడల్ని మార్చి, దొడ్డి ఊడ్చి,పేడ చిమ్మి, పాచిపనులుచేసి, దూడల్ని విప్పుకొని పొలం రావటం అతని నిత్యకృత్యం. (4 వ రంగం) అంత ఒత్తిడి పనిలోనూ ఉపకారి ఇచ్చిన పుస్తకాలు చదువుతాడు. సాయంత్రం బడిలో పాఠాలకూ వెళ్తాడు. అతనిలోని ఆ విద్యాసక్తులను వ్యవస్థీకృత పద్ధతిలో సంతృప్తి పరచుకొనటానికి బయటినుండి లభించిన నైతిక మద్దతు పంతులు ఉపకారి. స్నేహితురాలు వనబాల. వాళ్ళ ప్రయత్నాలకు అడ్డుపడింది కుబేరయ్య, అతని కవ్వింపువల్ల తండ్రి పుల్లయ్య కూడా. ఈ ఆకాంక్ష, దోహదం, అభ్యంతరం వీటిమధ్య సంఘర్షణ నుండి తీగసాగిన కథ ఈ నాటకంలో ఉంది. ఈ క్రమంలో అంబేద్కర్ తాత్వికత అంతఃసూత్రం కావటం వల్ల నాటకం ఒక విలువను సంతరించుకొని చరిత్రలో నిలబడ గలిగింది.

1924లో బహిష్కృత హితకారిణి సభ పెట్టిననాటి నుండే అంబేద్కర్ దళితుల విద్య గురించి గాఢంగా ఆలోచిస్తున్నాడు. ఆచరణ కార్యక్రమాలు తీసుకొన్నాడు.మానవ వ్యక్తిత్వాన్ని, చైతన్యాన్ని నిర్మించటంలో విద్యకు అనితర సాధ్యమైన పాత్ర ఉంది అని భావించాడు. చదువుకున్నవాళ్ళే తమవర్గ ప్రయోజనాలను గుర్తించి వాటికి ప్రాతినిధ్యం వహించగలరు అని ఆయన అభిప్రాయం. విద్య హక్కుల గురించిన చైతన్యం కలిగించి ఐక్యంగా పనిచేసే ప్రేరణ ఇస్తుంది. న్యాయాన్ని, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, నిర్భీతిని, సమాజంలో స్థాపించటానికి ఉపయోగపడుతుంది అని ఆయన నమ్మకం. ( Meenakshi MEENAN – https:// www. Forward press. In /2017/10/ambedkars – thoughts – on – education – an – overview) అందుకే దళితుల కోసం ఉచిత విద్యావ్యవస్థలను, గ్రంథాలయాలను, పఠనకేంద్రాలను, వసతి గృహాలను ఏర్పర చాడు.

బొంబాయి లెజిస్లేటివ్ సభలో ప్రతినిధిగా ఉన్నకాలంలో ( 1927& 1937 ) బాంబే యూనివర్సిటీ యాక్ట్, ప్రాధమిక విద్యా సవరణ చట్టం పైన చర్చలలో పాల్గొంటూ విద్యపై తన భావాలను ప్రకటించాడు అంబేద్కర్. వివిధకులాలు, మతాలతో ఉన్న భారతదేశంలో అంతస్తూ, అభివృద్ధి విషయంలో అసమానతలు ఉన్నాయని చెబుతూ 1923-24 గణాంకాలను ఉదహరిస్తూ ప్రాధమిక, మాధ్యమిక ,ఉన్నతస్థాయి విద్యలో అగ్రవర్ణ హిందువులకన్నా, ముస్లిములకన్నా, అణగారినవర్గాలు ఎంత వెనకబడి ఉన్నాయో చూపించాడు. దళితుల విద్యావసరాలు తెలుసుకునేందుకు లోగడ అంటే 1885 లో మహమ్మదీ యుల విద్యాభివృద్ధికి వేసినట్లే ప్రత్యేక తనిఖీ బృందాలను వేయాలని సూచించాడు. పురోగమనం, అభివృద్ధి గురించి దళితవర్గాలకు ఉన్న ఆశలను, ఆకాంక్షలను ఏ రకంగానూ పట్టించుకోని వ్యక్తులు వాళ్ళ చుట్టూ ఉన్నారు. అందువల్ల విద్యావంటి అత్యంత కీలకాంశాలకు బాధ్యత వహిస్తున్న స్థానిక సంస్థలు దళితవర్గాలను నిర్లక్ష్యం చేయకుండా సూచించేందుకు ఈ తనిఖీ సంస్థలు అవసరం అని చెప్పాడు. బానిసకు తాను బానిసనని తెలియటానికైనా, బానిసత్వంపై తిరగబడటానికైనా విద్య సరైన సాధనమని అంబేద్కర్ చెబుతూ వచ్చాడు. దళితులకు విద్య అనేది ఆయన ఉద్యమం. ఇదంతా బోయి భీమన్నకు సమకాలపు చరిత్ర. ఈ విద్యాఉద్యమ చరిత్ర సంబంధంలో చదివి నప్పుడు ‘పాలేరు’ నాటకం విలువ అర్ధం అవుతుంది.

పాలేరు నాటకం లో వీరేశు అని ఒక పాలేరు ఉన్నాడు. చదువంటే అతనికి శిక్షణ పేరుతో పంతులు తన్నిన తన్నులే గుర్తున్నాయి. బడికి పొమ్మని ఇంట్లో తండ్రి తంతాడు, బడికి పోతే పంతులు బాధ. ఈ రెండూ పడలేక కామందుచేత తన్నులు తినటానికి సిద్ధపడి పాలేరుతనానికి కుదురుకున్నాడు. ఊళ్ళో కామాందుల దగ్గర నుండి రైతులు, కూలీలు, వెంకన్న తండ్రి పుల్లయ్యతో సహా అందరూ చదువు పట్ల వ్యతిరేక భావం ఉన్నవాళ్లే. ఇంత వ్యతిరేక వాతావరణంలో వెంకన్న కు చదువుపట్ల కోరిక అతనిలో అంత సజీవంగా ఉండటానికి కారణం ఏమై ఉంటుంది? దళిత ఉద్యమం ప్రచారంచేస్తున్న విద్య అవసరం, ప్రయోజనాలు, కల్పించవలసిన అవకాశాల గురించిన అభిప్రాయాలు అతని చెవి వరకు వచ్చి ఉండాలి. లేదా బడికిపోయిన కాలంలో పాఠం చెప్పిన పంతులు ప్రభావం ఏమైనా పడివుండాలి. పుస్తకాలు చదవటం అలవాటైంది కనుక ఆ పుస్తకాలు చూపించిన కొత్త ప్రపంచం చదువు గురించిన పట్టుదలను పెంచి ఉండాలి. తనకళ్లముందు విద్యావకాశాలు అందిపుచ్చుకొంటూ కనిపిస్తున్న కాకినాడకు వెళ్లి చదువుకొంటున్న సుందరం, వూళ్ళో బడికివెళ్తూ పొలాల దగ్గర కనబడే, మాట్లాడే సుందరం చెల్లెలు వనబాల అందుకు పట్టుగొమ్మలై ఉండాలి. లేకపోతే చదువుమాట తలపెట్టవద్దని తండ్రి కొడితే జ్వరం వచ్చి మంచాన ఉన్నా బడికి పంపకపోతే మందు తిననని మంకుపట్టు పట్టలేకపోయేవాడు.

నిలవనీటి చందంగా ఉన్న ఆ వూళ్ళో కదలిక కలిగించి పిల్లలను బడిబాట పట్టించాలని ఉద్యమించినవాడు ఉపకారి. ఉపకారి ఎవరు? ఆ ఊరి బడికి పంతులు. పిల్లలను బడికి పంపమని ప్రతిరైతును, ప్రతికూలీని వేడుకొంటూ వీధుల్లో తిరుగుతుంటాడు. రెండవరంగంలో ఆ పాత్ర ప్రవేశమే — “ గోచిపెట్టుట నేర్చుకొనగానె బిడ్డకు చేతికి కర్రిచ్చు రైతులారా!

నడువనేర్చినతోనె బుడతని గొంపోయి పాలేరు తనముంచు మాలలార !
పసిబిడ్డ తెచ్చు సంపాదనకాసించి మనుగడలే మాపు జనకులార!
వంటఇల్లొకటే ప్రపంచమ్ముగా జేసి తనయల మెడ గోయు తల్లులార!
జాతి శక్తి విహీనమై చచ్చుచుండ
కన్నులను మూసికొంటిరే గాఢనిద్ర
శక్తికంతకు మూలము చదువు కాన
చదువబంపుడు మీ తనయులనింక” – అన్నఉద్బోధంతో… దేశానికి ప్రజలే శక్తి. అది అంధకారంలో మునిగివుంటే దేశానికి బానిసత్వమే గతి. బానిసత్వానికి అవిద్యయే ముఖ్యకారణం అని తెలిసి అని దాని నిర్మూలనకు నడుం కట్టినవాడతను. పేదరైతులు, కూలీలు అయిన దళితులలో విద్యాభిలాషను అంటుగట్టటానికి అంబేద్కర్ మార్గంలో జరుగుతున్న కృషికి ఒక ప్రతీక ఉపకారి.

అవిద్యకు కారణం ఆర్థికదుఃస్థితా లేక మూర్ఖత్వమా అంటే ముఖ్యకారణం మూర్ఖత్వమే అని అతని అభిప్రాయం. ఆర్ధికమైన ఆసరా ఎవరైనా ఇయ్యవచ్చు. వెంకన్న విషయంలో ఆ సహాయం చేయటానికి తాను ఉన్నాడు. అది వెంకన్నకూ చెప్పాడు. చదువుకొనటానికి వీల్లేదని వెంకన్నను పట్టుకొని కొడుతున్న అతని తండ్రికీ చెప్పాడు. ఆ అవకాశాన్ని అందుకొనటానికి సిద్ధంగా లేకపోవటం మూర్ఖత్వం కాక మరేమిటి? నిరంతర ప్రబోధమే మూర్ఖత్వానికి విరుగుడు మందు అని తెలిసినవాడు కనుకనే ఎన్ని తిరస్కారాలు ఎదురవుతున్నా చదువు వల్ల స్వతంత్రమూ, గౌరవ కరమూ అయిన జీవితం లభిస్తుందని నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.వెంకన్న ముఖంగా కూడా పాలేర్లు తమపిల్లల విద్యకోసం చొరవ చూపకపోవటానికి పేదరికంకన్నా తెలివితక్కువతనం, మూర్ఖత్వమే కారణమని చూపిస్తాడు రచయిత( 4 వ అంకం ). దళితుల విద్యకు అవరోధంగా ఉన్న మూర్ఖత్వం అనేది ఎలా పుడుతుందో ఎలా ప్రవర్తిస్తుంటుందో దానిని నాటకంలోని భిన్న దృశ్యాలలో చూపించి రచయిత దాని మూలం అణచివేత రాజకీయమేనని నిరూపిస్తాడు. దానిని తిప్పికొట్టే ప్రయత్నంలో, ప్రక్రియలో ఒక సాధనంగా ఉపకారి పాత్రను రూపొందించాడు.

బీదల, మాలల విద్యకు అవరోధంగా ఉన్న మూర్ఖత్వపు స్వభావాన్ని వెంకన్న తండ్రి పుల్లయ్య ప్రవర్తనలో చూస్తాం. ఎవరెంత ఏడ్చినా వెంకన్నను బడికి పంపేది లేదని మంకుపట్టు పట్టాడు అతను. చదువు మాకు అచ్చిరాదు. అఆలు దిద్దబోయి తాత కాలిరిగి చస్తే తండ్రి రాగాలు దీయబోయి పళ్ళురాలి చచ్చాడు అందుకని వెంకన్న ను చదువుకు పంపే ప్రసక్తి లేదు అన్నది అతని వాదన. ఇటువంటి మూర్ఖుడైన తండ్రికి కొడుకై పుట్టటం ఎంత దురదృష్టం అని ఉపకారి వెంకన్న గురించి బాధపడతాడు. పుల్లయ్యకు ఈ మూర్ఖత్వం ఎక్కడినుండి వచ్చింది? పాలేరు పని ఇచ్చి సేవలందుకొంటున్న కామందు కుబేరయ్య ఎక్కించిన మూర్ఖత్వం అది. పుల్లయ్యలు, వీరేశులు తన అధికారాన్ని తలదాల్చె బానిసలుగా పూర్తిగా తయారై పోయారు. వెంకన్న ఇంకా సంపూర్ణ బానిస కాలేదు. పాటలు పాడుకొనే జీవనాలాలస, చదువుపట్ల శ్రద్ధవున్నాయి. అలాంటి స్వతంత్ర ఇచ్ఛలు ఉన్నవాళ్లు జీవితకాలపు బానిసలుగా పడి ఉండలేరు. ఉండకపోతే కుబేరయ్య పొలాలు పండవు. పశువుల పాడి ఉండదు. మొత్తంగా కామాందులకు సంపదను పెంచే శ్రమశక్తిపై పెత్తనం ఉండదు. అందుకే వాళ్ళను సహజ వివేకాన్నిఉపయోగించుకోలేని మూర్ఖులుగా తయారుచేయటం పెత్తందారీ వర్గాల అవసరం అవుతుంది. అప్పటికే తమవర్గపు ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేసేటట్లు తయారుచేసుకున్న పాలేర్లను,వాళ్ళ బంధుత్వ సంబంధాలను తోటివాళ్ల మీదకు ప్రయోగించటంద్వారా ఆ అవసరం తీరుతుంటుంది. కుబేరయ్య ప్రవృత్తి లోని వాస్తవికత అదే.

వెంకన్న పాడుకొంటుంటే పాలేరు పీనుగుకు పాటలెందుకట అని మెరమెర లాడే కుబేరయ్య, వీణ్ణి పాలేరుగా పెట్టుకుంట పాటలు పాడటానికా! అని గింజుకునే కుబేరయ్య ఆ మేరకు వాడు పని దొంగ అయిపోతాడని ఆందోళన పడతాడు. ‘పసులు కాసే పాలబుగ్గల జీతగాడికి’ కామందు పనితప్ప తనకంటూ ఒక ఆశ, ఒక స్వరం, ఒక గుర్తింపు, ఒక ఆనందం ఏదీ ఉండకూడదు. అలా ఉండటం అవిధేయత. పూర్తిగా నియంత్రణలో లేకపోవటం. పుట్టిన మాల కులాన్నిబట్టే ఒదిగివుండవలసిన వెంకన్న గొంతెత్తి పాడటం నేరమే. మేధస్సుకు పదునుపెట్టే చదువుకు ఆశపడటమూ నేరమే. బడికి పోకపోయినా పంతులుదగ్గర పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నాడు, రాత్రి పాఠశాలకు వెళ్తున్నాడు అంటే వెంకన్న హద్దు మీరుతున్నాడన్నమాటే. అందువల్ల వాడిని హద్దుల్లో పెట్టటానికి వాడి తండ్రినే ప్రయోగించాడు కుబేరయ్య.

పుల్లయ్యను పిలిపించి అతను మాట్లాడింది ఏమిటి? ఓరి! దున్నపోతు కొడుకా ! మీ ఇంటా వంటా ఎప్పుడైనా చదువు ఉందిరా? అని బెదిరించి లేదని ఒప్పించాడు. మీలో చదువుకోవటం పాపం కాదట్రా! అని ప్రశ్నించి ఘోరపాపం బాబూ అని అంగీకరించేట్లు చేసాడు. తాతలనాడు, బాబులనాడు, తన నాడు లేని చదువు మాట కొడుకు వెంకన్న తలపెట్టటంతో ఆ గొప్ప న్యాయం మంటగలిసిపోయిందని లాబలాబలాడేట్లు చేసాడు. ‘పాలేరుతనం చేసుకు బ్రతికే తొత్తుకొడుక్కు చదువేమిటిరా చదువు’ అని కసిని వెళ్లగక్కి, అస్తమానం పాటలూ, పుస్తకాలతో పనిముట్టటం లేదని నేరం ఆరోపించి, పని మాన్పించమని బెదిరించి కొడుకును తన్ని తంపటేస్తానని, ఉప్పు పాతరే స్తా నని శపధాలు చేసే స్థాయికి తండ్రిని రెచ్చగొట్టి విడవటంలో ఉంది కుబేరయ్య కుటిల నీతి అంతా. వెంకన్నను తండ్రి కొట్టినా అక్కడితో తృప్తి పడక, బాలతో మాట్లాడటం నెపంగా చదువుకునే పిల్లలతో స్నేహమేటని మీదపడి కొట్టటం, వెంకన్న చేతిలో పుస్తకం చూసి గంగవెర్రులెత్తి చింపి పోగులు పెట్టి మళ్ళీ కొట్టటం గమనిస్తే – “పురోగమనం, అభివృద్ధి గురించి దళితవర్గాల వారికున్న ఆశలను ఆకాంక్షలను ఏ రకంగానూ పంచుకోని వ్యక్తులు వారిచుట్టూ ఉన్నారు” అని అంబేద్కర్ బొంబాయి చట్ట సభలో విద్యకు నిధులు అనే విషయం మీద మాట్లాడుతూ ఏ వ్యక్తుల గురించి చెప్పాడో (1927మార్చ్ 12) అటువంటి వ్యక్తులకు నమూనాగా భీమన్న కుబేరయ్య పాత్రను సృష్టించాడా అనిపిస్తుంది.

కుబేరయ్య వెంకన్నను కొడుతుంటే ప్రశ్నించిన ఉపకారికి, కుబేరయ్యకు మధ్య జరిగే సంభాషణలో పాలేరుతనాన్ని, కామందు తనాన్ని సృష్టించిన సమాజపద్ధతిని గురించి ఉపకారి నిరసనగా మాట్లాడితే అది దైవనిర్ణీతం అంటాడు కుబేరయ్య అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ. అది అబద్ధం అని కొట్టి పారేస్తాడు ఉపకారి. ‘ అంతా మానవ నిర్ణీతం. దైవాన్నీ, కర్మనూ , కులవర్గ సాంఘిక భేదాన్నీ సృష్టించింది స్వార్ధపరుడైన మానవుడే’ అని నిర్ద్వంద్వం గా చెప్పాడు. అతనట్లా దేవుడేలేడంటూ ,కులాలే పనికి రావంటూ చెప్పటానికి చదువే కారణమని అనుకొన్నాడు కనుకనే కుబేరయ్య ‘ఓరి నీ చదువు తగలెయ్య’ అని శాపనార్ధాలకు దిగటం గమనించవచ్చు. కుబేరయ్య వంటి కామందులకు దేవుడు, కర్మ అత్యవసరమైన వస్తువులు. వాటి పేర్లు చెప్తూ చదువు, సంపదలు ఏవీ లేకపోవువటానికి ఎవరినీ తప్పుపట్టకుండా జీవితం వెళ్లదీసుకొనే నిర్లిప్తతను మనుషులలో పెంచిపోషించటం వాళ్ళ ప్రయోజనం. కులం మనుషులను విడదీసి పాలించటానికి వీలిచ్చే వ్యవస్థ. శ్రమదోపిడీ నగ్నత్వానికి సంకేతం వర్గం. ఆ విషయం దళితులు, పీడితులు దోపిడీకి గురయ్యేవాళ్ళు ఎప్పటికీ తెలుసుకోకుండా ఉండటం మీదనే అసమానతల వ్యవస్థ కొనసాగుతుంది. ఉపకారి ఆ మాయను అర్ధంచేసుకొన్నాడు కనుకనే అందుకు మూలకారణమైన చదువు మీద కుబేరయ్యకు అంత అక్కసు కలిగింది. పైగా అతను అందరూ చదువుకోవాలని ఆశిస్తున్నాడు. అది మరింతమంది ఉపకారి వంటి వివేకవంతులైన మనుషులను తయారుచేస్తుంది కనుక మరింతప్రమాదకరం అనుకుంటాడు కుబేరయ్య. అందుకనే చదువంటే అతను అసహనంతో రేగిపోతుంటాడు.

కుబేరయ్య వంటి వాళ్ల ప్రయోజనాలకు అవసరమైన, దేవుడు, కర్మ వంటివి పీడితుల మనసులలోనూ ఇంకిపోయి ఆత్మవినాశకర పరిస్థితులకు దారి తీయటం అసలు విషాదం. దీనిని కూడా కనిపెట్టి సవరించటానికి ప్రయత్నించిన అధ్యాపకుడు ఉపకారి. కుబేరయ్య కొట్టిన దెబ్బలకు ఒళ్లెరుగని జ్వరం వచ్చి, చదువు కొనే అవకాశాలు జారిపోతున్నాయే అన్న ఉక్రోషం నుండి మందు తాగనని మొరాయిస్తున్న వెంకన్నకు ఉపకారికి మధ్యజరిగిన సంభాషణ పరిశీలించదగినది. మందు తాగాను, చచ్చిపోతాను, నన్ను సుఖంగా చావనీయండి అంటున్న వెంకన్నను ఆత్మహత్య పిరికితనమని హెచ్చరిస్తాడు ఉపకారి. చావు తప్పదన్నట్లుగా వెంకన్న “నేను చచ్చిపోయి ఈ కామందులకు కామందునై పుడతాను. ఈ కామందు, మా బాబు నాకు పాలేళ్ళయి పుడతారు అప్పుడు వాళ్ళ మీద నా పగ తీర్చుకుంటాను”అంటాడు. పూర్వకర్మ, పునర్జన్మ రెండూ తప్పుడు సిద్ధాంతాలేనని పాటకపు జనాన్ని మోసగించటానికి పుట్టిన సిద్ధాంతాలవి అని వెంకన్న తప్పుడు ఆలోచనను సరిచేసే ప్రయత్నం చేస్తాడు ఉపకారి. వాటిని నమ్మటం అంటే కామందులు అల్లిన వలలో పడటమే. పనిపాటల జనాన్ని అట్లా తప్పుడుదోవ పట్టించటం యధాతథ స్థితి కొనసాగింపుకు అవసరం. అణగారిన వర్గాల జీవితంలో అభివృద్ధిని సమాజంలో మార్పుని కోరేవాళ్ళు పూర్వకర్మ,పునర్జన్మ సిద్ధాంతాలను ఆంగీకరించరు. ఉపకారి చేసిన పని అదే. వెంకన్న ఆ మాయలో పడకూడదని హెచ్చరించాడు.

చదువుకు తాను సహాయం చేస్తానని ఉపకారి చెప్పినప్పుడు “పరసహాయం నేను పొందను. అది నన్ను రుణగ్రస్తుడిని చేస్తుంది” అని వెంకన్న చెప్పిన అభ్యంతరం ప్రత్యేకంగా ఆలోచించదగ్గది. సంపదలు ఒక దగ్గర పోగుపడ్డ సమాజాలలో సంపదలేని వాళ్ళు ఉన్నవాళ్ళ వైపు ఆశగా చూసే అవకాశం ఉంది. దానిని తుంచెయ్యటానికే ‘పరుల సొమ్ము పాము లాంటిది’, ‘పరుల సొమ్ముకు ఆశపడరాదు’, – వంటి నీతులు అభివృద్హి చేయబడ్డాయి. ఉన్న వాడి దగ్గర వాటాకు పోకుండా ఉండటానికే కర్మ సిద్ధాంతం. అదే ఇతరుల దగ్గర ఏమి తీసుకొన్నా జన్మజన్మాలకు రుణపడి పోవటమే మిగులుతుందని, రుణగ్రస్తుడుగా జీవించటమైనా, మరణించటమైనా గౌరవకరం కాదు అన్న నీతి ప్రచారంలోకి తెచ్చింది. వ్యక్తిగత ఆస్తి సమాజంలో ఏదైనా వ్యక్తి సమస్యే తప్ప సామాజికం అన్న అవగాహనే ఉండదు. అందువల్లనే వెంకన్నకూడా తన చదువు గురించి బాధ్యతగా మాట్లాడిన ఉపకారి ముందు పరసహాయం పొందను, రుణగ్రస్తుడిని కాను అని గంభీరమైన నీతులు వల్లించాడు. ఇదంతా మెట్టవేదాంతం అని కొట్టేసాడు ఉపకారి. కామందులు, వాళ్లకు వూడిగంచేయటంలో కాలం వెళ్లబుచ్చుకొనే పుల్లయ్య వంటి తండ్రులు రంగరించి పొసే ఈ మెట్టవేదాంతం జీవితానికి పనికి రాదని తీసిపారేసాడు. సంఘజీవులైన మనుషులు సహాయం పొందుతూ పునస్సహాయం చేస్తూ అభివృద్ధి చెందవలసినవాళ్లు అన్న అవగాహనను వెంకన్నకు కలిగిస్తాడు. ఇక్కడ ఉపకారిని చూస్తే మంచి టీచర్ అంటే సామాజిక వాస్తవికత తెలిసినవాడే అన్న అంబేద్కర్ నిర్వచనం గుర్తుకువస్తుంది. అంటరానివారికి విద్య నిరాకరించటం అంటే ఒక అన్యాయమైన స్థితిని సృష్టించటమేనన్న అంబేద్కర్ భావానికి ప్రతినిధిగా కనిపిస్తాడు ఉపకారి. ఆ రకమైన అన్యాయ పరిస్థితిని నిరోధించటానికి అతను చేసిన ఒంటరి పోరాటం వెనుక సాంఘిక బానిసత్వం నుండి బయటపడటానికి సరైన సాధనం అయిన విద్య అందరికీ అందుబాటులోకి రావాలన్న అంబేద్కర్ విద్యా ఉద్యమ స్ఫూర్తి వుంది.

అంబేద్కర్ విద్యాఉద్యమంలో దళితుల కోసం విద్యాలయాలు, గ్రంధాలయాలు, పతనమందిరాలు, వసతిగృహాలు ఏర్పరచటానికి ఒత్తిడి ఎలా పెరుగుతూ వచ్చిందో వాళ్ళ జీవనావకాశాల మెరుగుదల కోసం ప్రభుత్వ ఉద్యోగాలలో కేటాయింపుల గురించిన డిమాండ్ కూడా అలాగే పెరుగుతూ వచ్చింది.( ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమచరిత్ర) పాలేరు నాటకంలో వెంకన్న బిఎ పాసయ్యేటప్పటికి డిప్యూటీ కలెక్టర్ పదవికి షెడ్యూల్ కులానికి చెందిన గ్రాడ్యుయేట్ కావాలన్న ప్రకటన వెలువడిందని రచయిత కల్పించిన సన్నివేశం సమకాలపు ఆ ఉద్యమ చైతన్య ప్రతిఫలనమే.అలాగే వెంకన్నబిఎ అయ్యేనాటికి వెంకటేశ్వర రావు అయినాడు.ఎందుచేత ఈ పేరు మార్పు? ఇది కూడా దళితుల పేర్లకు ముందు వెనకల అగౌరవ వాచక ప్రయోగాలను ఖండిస్తూ ఆది ఆంధ్ర ఉద్యమం తీర్మానాలు చేసిన క్రమంలో ఆత్మగౌరవ చైతన్య ప్రకటనగా కొందరు పేర్లను మార్చుకొన్న చరిత్ర ఉన్నది. భీమన్న వెంకన్న పేరును వెంకటేశ్వరరావుగా మార్చటంలో ఆ చరిత్ర స్పూర్తే ఉన్నది. చదువు కోసం ఆరాటపడి, ఘర్షణపడి, సాధించిన వెంకన్నను డిప్యూటీ కలెక్టరుగా ఉన్నతపదవిని అందుకొన్నట్లు నాటకాన్ని ముగించటంలో, అవమానాలు పడిన స్వంత వూరికే ఉద్యోగహోదాలో వచ్చి గౌరవాలు అందుకొన్నట్లు చూపటంలో దళిత ఉద్యమం ఇన్నాళ్లూ అవిద్య కు, అజ్ఞానానికి, అంతులేని పీడనకు గురిఅవుతున్న జీవిత విషాదాలకు చరమాంకం రచిస్తున్న దని, ఇక గానం చేయవలసినవి విజయోత్సవ గాధలే అన్న ఆత్మ విశ్వాసమే కనబడుతుంది.

4.

సమాజాన్ని సమానత్వం, న్యాయం అనే సూత్రాలమీద పునర్నిర్మించటానికి విద్య తప్పని సరి అని అంబేద్కర్ భావన. సమానత్వం, విద్య అన్నవి అంత అన్యోన్య సంబంధమున్న ఆంశాలన్నమాట. ఆ తత్వం తెలిసి వ్రాసిన నాటకం పాలేరు. మొదటి రంగంలో వెంకన్న పాత్రను ప్రవేశపెడుతూనే బానిసతనం పోవటం, కూడు,గుడ్డ ,కొంప అందరికీ సమానంగా ఏర్పరచబడటం, ప్రభువు,సేవకుడు లేని సంఘాన్ని స్థాపించటం అతని ఆకాంక్షలుగా వినిపిస్తాడు భీమన్న. ఇవి నెరవేరాలంటే ముందు అతను విద్యావంతుడు కావాలి. అందుకని దానిని ప్రధానం చేసి నాటకాన్ని నడిపాడు. అయితే కుబేరయ్య రెచ్చగొడితే రెచ్చిపోయిన తండ్రి కొట్టిన దెబ్బలవల్ల కలిగిన శారీరక బాధకంటే తన చదువు గురించిన ఆశలు భగ్నం కావటంవల్ల కలిగిన బాధలో మళ్ళీ వెంకన్నకు కనుచూపు మేరలో లేని సమానత్వం గుర్తుకు వచ్చింది. పాలేరుగా బ్రతకలేను. విద్యావంతుడిని కాలేను .. అని నిస్పృహకు లోనయ్యాడు. అప్పుడు అతను తన కులం గురించి బాధపడటం చూస్తాం. ‘అంటరాని అసహ్యకరమైన – ఈ నికృష్ట జీవితం- స్వతంత్ర నాగరిక జాతికి ఒక మచ్చ’ అనిపించిన ఆ క్షణంలో ఆలోచనలు ఆత్మహత్య వైపు మళ్ళాయి. బ్రతుకంటే ఏమిటో ఇంకా పూర్తిగా తెలియని ఒక బడీడు పిల్లవాడిని చావు వైపు తిప్పిన సామాజిక కాఠిన్యం ఏమిటి? అప్పుడు పరమేశ్వరుడిని ఉద్దేశించి అతను చేసిన ప్రార్ధనలో ఆ కాఠిన్యానికి గురయిన బాధ వినిపిస్తుంది. కనిపిస్తుంది.

“మాలను గావించి పాలేరుగా జెసి/ కామందు కాలికి -గట్టినావు
అంటరాదని చెప్పి – పెంటల పాల్జేసి/ నీచుల మనుపేర నిల్పినావు

చదువు సంధ్యలు లేక జంతువులకు బోలె /ఊరివెల్పల చావునుంచినావు
అజ్ఞాన తిమిరాల యడుగునా బడద్రోసి / బరువుగా యెడ నొక్కి పట్టినావు

వెలుగు జూపవు,నేర్పావు మెలగు జాడ / దాస్యముం బాపుకోనీవు, ధైర్యమూని
మనిషిగా నన్ను మననీవు మహినికేల / చంపుకొనిపొమ్ము , చాలింతు జన్మమిక”

కులం, కులంవల్ల లభించిన అంటరానితనం, ఊరివెలుపల జీవితం, ఆపాదించబడిన నీచత్వం, పాలేరుతనం, కామందుకు దాస్యం, చదువుకొనే అవకాశాల నిరాకరణ – ఇన్ని కఠిన వాస్తవాలు ఒక్కసారిగా ముప్పిరిగొన్నవేళ వివశుడైన వెంకన్నకు అప్పుడు బాల, ఆ తరువాత ఉపకారి ఉపశమనం ఇచ్చారు. “బ్రతికి సాధింపవలెగాని వాంఛితములు / చచ్చి సాధింతుననుమాట చచ్చుమాట” అన్నది ఉపకారి ఉద్బోధ.

వెంకన్నకు తక్షణం సాధించవలసిన వాంఛితం విద్య అయినా కుల అసమానతల రద్దు దాని అంతిమ లక్ష్యం. కుల అసమానతల రద్దు అంటే అది అంబేద్కర్ దృష్టి లో కులవ్యవస్థ నిర్మూలనమే. శ్రమవిభజనతో కులవ్యవస్థ ఏర్పడింది అన్న వాదనను తిరస్కరిస్తూ ఆయన కులవ్యవస్థలో శ్రమవిభజనే కాదు శ్రామికుల విభజన కూడా జరిగి వారి మధ్య అసహజమూ, అలంఘ్యమూ అయిన అడ్డుగోడలు కట్టబడ్డాయని, శ్రమ విభజన వ్యక్తుల ఇష్టాలనుబట్టి, అభిరుచు లను బట్టికాక కర్మసిద్ధాంతాన్ని బట్టి జరిగిందని, కొన్ని పనులకు ఔన్నత్యాన్ని, మరికొన్నింటికి నీచత్వాన్ని అంటగట్టిన వివక్షాపూరిత సంస్కృతి అమలులోకి వచ్చిందని అంబేద్కర్ పేర్కొన్నాడు. దానితో సేవాసహకార భావాలు, స్వతంత్ర భావాలు మొత్తంగా మానవత్వం నాశనం అయ్యాయి అని అభిప్రాయపడ్డాడు.

ఈ అమానవీయ సమాజం రద్దయి స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు విలువల మీద ఆధారపడి కొత్త సమాజం పునర్నిర్మింపబడాలన్నది అంబేద్కర్ ఆశయం. స్వేఛ్ఛగా బ్రతకటం ,స్వేఛ్ఛగా అభివృద్ధిచెందటం స్వాతంత్ర్య సంబంధమైన అవసరాలు, విలువలు. భౌతిక వారసత్వం, తల్లిదండ్రుల విద్యా విజ్ఞానాలను బట్టిలభించే సాంఘిక సౌకర్యాలు, స్వీయ ప్రయత్నాలు వంటి వాటిని బట్టి మనుషులలో తరతమభేదాలు ఉండవచ్చుకానీ అది అలాగే కొన సాగాలనుకొనటం, వారిని సమానులుగా చూడకూడదనటం సరియైనవి కావు అంటాడు అంబేద్కర్. మానవత్వం ద్వారా, మానవ వివేకం ద్వారా సాధించవలసిన సర్వ మానవ సమానత్వం అసలైన ప్రజాస్వామిక విలువ అని ఆయన నిరూపించాడు. ఇక సౌభ్రాతృత్వం అంటే సమాజంలోని మానవులమధ్య సాధించవలసిన సాంఘిక సోదరత్వం. ఇది కూడా వివేకమూ మానవీకరణమూ వల్లనే సాధ్యం అవుతుంది. ప్రజాస్వామిక జీవితవిధానానికి దారులు తీసే విలువ ఇది. మొత్తం మీద ప్రకృతిలో లేకపోయినా ప్రయత్నపరులై మనుషులు అన్ని జీవనరంగాలలో సాధించుకోవలసిన మహోన్నతమైన ప్రజాస్వామిక విలువ ‘సమానత్వం’ అన్నది అంబేద్కర్ మతం. అసమానతల పునాది మీద ఉన్న కులవ్యవస్థను కూల్చివేయాలన్నది అందుకే. ( అంబేద్కర్ – కుల నిర్మూలన ( అను; బోయి భీమన్న, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,1990).

కుల నిర్మూలనకు వర్ణాంతర భోజనాలు, వర్ణాంతర వివాహాలు అలవాటుగా ప్రతిచోటా, ఎల్లా వేళలా జరుగుతూ ఉండటం ఒక మార్గం అన్న అభిప్రాయాన్ని ఆంగీకరిస్తూనే వాటికి ఉన్న పరిమితులను కూడా చర్చించాడు అంబేద్కర్. వర్ణాంతర భోజనాలకు కొంతవరకు అభ్యంతరాలు లేకపోయినా వర్ణాంతర వివాహాలకు మాత్రం అంగీకారం తరచు లభించదు. అందుకు కారణం కులం అంటే పాతుకుపోయిన పిచ్చినమ్మకం. అందువల్ల కుల భావాన్ని అంతగా పేనుకుపోతూ, ప్రచారంలో పెడుతూ వచ్చిన శాస్త్రాల అధికారాన్ని నిర్మూలించవలసి ఉన్నది అని ఆయన భావించాడు. మనుస్మృతి దహనం అందుకు ఒక సంకేతం అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో పాలేరు నాటకంలో భీమన్న అగ్రవర్ణ బాలిక బాలకు, మాల కులస్థుడు వెంకటేశ్వరరావు కు వివిహంగా జరిపించటం ద్వారా కులనిర్మూలనలో మొదటి మెట్టును సూచించాడనుకోవచ్చు. అదే సమయంలో దేవుడు, కర్మ, పునర్జన్మ మొదలైన వాటిని తిప్పికొట్టే హేతువాదం, నైతిక శక్తి వంటి అంబేద్కర్ అభిమానించిన ఆయుధాలను కూడా అందించినట్లైంది. తన ఇచ్ఛ ప్రకారం చదువుకొని డిప్యూటీ కలెక్టర్ అయి స్వేఛ్ఛగా అభివృద్ధిని సాధించటానికి మార్గం వేసుకొన్న వెంకటేశ్వరరావు ఆ తరువాత చెయ్యవలసిన పని మానవులందరూ సమానులని నమ్మి నడుచుకొనటం, సాంఘిక సోదరత్వ సాధనకు తన శక్తులను వినియోగించటం. ఆ రకంగా భవిష్యత్తు లోకి ప్రవహించే జీవిత స్వభావం గల నాటకం పాలేరు.

(ఇంకా ఉంది)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

One thought on “బోయిభీమన్న సాహిత్యం లో సమానతా సూత్రం

  1. ఇప్పటి దాకా జరిగిన బోయిభీమన్న గారి పరిచయం చాలా బాగా చేశారు కాత్యాయని గారు. ఆవిడ పాలేరు గురించి వివరంగా రాశారు. . కానీ ఎందువల్లనో 1940 లో ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఏర్పడి ఆధునిక తెలుగు నాటకం బాగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ ప్రయాణంలో ఎందుకో పాలేరు నాటకం అంత విరివిగా వినబడలేదు . పినిశెట్టి గారి పల్లెటూరు, తెలంగాణ పోరాటం లో వచ్చిన మాభూమి నాటకాలు ఆ తర్వాత వచ్చిన ఆత్రేయ వగయిరా రచయితలు రాసిన నాటకాలు బాగా ఆడాయి. అలాగే ఆయన రాసిన మిగతా నాటికలు. నిజానికి పాలేరు నాటకం బావుంది మిరురాసినది చదువుతుంటే బాగుంది. బహుశా 16 అంకాల నాటకం కావడం ఒక్ కరణమయితే కాత్యాయని గారు చెప్పినట్టు “నాటకంలో పద్యాలు, పాటలు సమృద్ధిగా ఉన్నాయి. పద్యాలు పౌరాణిక నాటకాల సంప్రదాయంలోనివి. పాటలు కొన్ని అభ్యుదయ నాటకాలలో కనబడినా ప్రధానంగా సాంఘిక నాటకాలు వచన నాటకాలే.) కావొచ్చు.

    మొత్తం మీద బోయిభీమన్న గారి గురించి చాలా విషయాలు తెలిసాయి

Leave a Reply