బొట్టు

ఉదయం పదకొండున్నర సమయం.
మబ్బుపొరలను చీల్చుకొని సూర్యుడు ప్రతాపంతో ఎండలు వేడిక్కుతున్నాయి.
అతి పెద్ద కార్పోరేట్ స్కూలు కావడంతో చుట్టూ మూడంతస్తుల భవనాల్లో మధ్యలో విశాల ఆట స్థలం. స్కూలు ఇంటర్వెల్ సమయం కావడంతో పిల్లలంతా క్లాసుల బయట జట్లు జట్లుగా తిరుగుతూ… ఆడుతున్నారు.
ఉమెన్స్ స్టాఫ్ రూములో కొందరు టీచర్లు కబుర్లు చెప్పుకొనేవాళ్ళు చెప్పుకుంటుంటే, పుస్తకాలు చదువుకొనే వాళ్ళు చదువుకుంటున్నారు.

ఒకరిద్దరు టీచర్లు మాత్రం బయటకు వచ్చిన పిల్లల నడవడికలు గమనిస్తున్నారు.
సంతోషిణి మాత్రం ఆ పిల్లల కోలాహలంలో లేకుండా క్లాసు రూములో ఒక్కతే కూర్చుండిపోయింది.
ఆ పిల్ల ముఖంలో ఏదో విచారం వ్యక్తమవుతుంది. దిగులు మేఘం కమ్మి వర్షించడానికి సిద్దంగావుంది. ఎటో చూస్తూ, ఏదో ఆలోచిస్తుంది.
“ఏయ్…. సంతోషిణీ…! ఏమిటి అలా వున్నావ్!” కిటికీలో నుండి చూస్తూ అడిగింది అప్పుడే అటుగా వచ్చిన సోషల్ టీచర్!
“ఏమిలేదు మిస్”
“ఒంట్లో బాగాలేదా!”
“బాగానే ఉన్నా మిస్”
“మరెందుకు అలా డల్ గా వున్నావ్!?”
“ఏమిలేదు”
“ఇలా రామ్మా! ఏమయిందో చెప్పు!” చెయ్యి పట్టుకొని అడిగింది సోషల్ టీచర్.
“ఏమిలేదు, ఏమిలేదు” అంటూనే సంతోషిణి కళ్ళల్లో నీళ్ళు నింపుకుంది.
ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే సంతోషిణి రెండు రోజులుగా దిగాలుగా ఉంటుంది.
ఇంట్లో అమ్మ అడిగినా, స్కూల్లో పిల్లలు అడిగినా ఏమి లేదంటుంది కానీ, ఆ పిల్ల దిగులు ముఖంతోనే ఉంటుంది.
రెండు రోజులుగా సంతోషిణిని గమనిస్తున్న సోషల్ టీచర్ ఈ రోజు దగ్గరకు తీసుకొని ప్రేమగా మాట్లాడింది.
***
ఆ స్కూల్లో తొమ్మిదో తరగతిలో అందరి మీదా పెత్తనం చేస్తుంది సౌజన్య అనే పిల్ల. స్కూలు యాజమాన్యంతో ఆ పిల్లకు కాస్త రిలేషన్ ఉండడం చేతనేమో ఎవరికీ భయపడదు.
తనకు నచ్చని వాళ్ళని బెదిరిస్తూ, నోట్స్ లో పేర్లు రాసి, వీళ్ళు అల్లరి చేస్తున్నారని టీచర్ రాగానే చాడీలు చెప్పి తిట్టించే సౌజన్య అంటే పిల్లలందరికి హడల్.
ఒక్క సంతోషిణి మాత్రం ఆ పిల్లని పట్టించుకునేది కాదు. సౌజన్య క్లాసు లీడర్ గా ఎంతో అహంకారంగా ఉంటుంది. అసలు టీచర్లు చేయాల్సిన పనులన్ని ఆ పిల్ల చేతే చేయిస్తారు.
వయసుకు మించిన మాటలు మాట్లాడుతుంది.
మగ పిల్లలు గురించి, సారోళ్ళ గురించి కామెంట్ చేస్తుంది. పులిహార గాడు, పులిహార కలుపుతున్నారు లాంటి మాటలు మాట్లాడుతుంది.
అది కూడా గాక స్కూలు ప్రక్కనే అపార్ట్మెంట్ లో ఉంటుంది. తల్లిదండ్రులు స్థితిమంతులు కావడంచేతనేమో, సొమ్ము, సోకులతో గారాబంగా, భయం లేకుండా పెరుగుతుంది.
పిల్లలందరినీ అరవవద్దు అంటూనే…తానే అందరికంటే ఎక్కువ అల్లరి చేస్తూ బూతులు తిడుతుంది. టీచర్లు రాగానే అందరి మీదా చాడీలు చెప్పేస్తుంది.
క్లాసు పిల్లలందరూ ఇది “రౌడి బేబీ” అంటూ సైలెంటుగా కామెట్స్ చేస్తుంటారు.
సంతోషిణి మాత్రం ఒక్క మేఘన తో తప్ప ఎవరితో అంత క్లోజ్ గా ఉండేది కాదు. ఇద్దరూ ఒకే బెంచీలో కూర్చొనేవారు.
మేఘన మేనమామ అదే స్కూల్లోనే టీచర్ కావడం చేత, రోజూ ఆయన బండి మీద వస్తుంది.
సాయంత్రం ఇంటికెళ్ళేప్పుడు. భాయ్…అంటూ సైలెంట్ చేయి ఊపి వెళ్ళుతుంది.
తరగతి గదిలో ఆడ పిల్లలు మధ్య అనేక చర్చలు జరిగేవి. టీచర్ల చీరల మీద, జుట్టు మీద, సారోళ్ళ వేషాలు మీద, వారి కోపాలు మీద
సినిమా హీరోయిన్ డ్రెస్ ల మీద, హీరోల డాన్సులు మీద, టి.వి. సీరియళ్ళ మీద మాట్లాడుకుంటూ, వాదులాడుకొనేవాళ్ళు.
అక్కడితో ఆగకుండా‌ ఈ మధ్య కాలంలో వాళ్ళ సంభాషణలు కులాలు, మతాల మీద నడిచేవి.
ఒక రోజు సంతోషిణిని యూనిఫాంతో గాక, కొత్త బట్టలు వేసుకొని స్కూలుకు వచ్చింది.
సోషల్ టీచర్ గమనించి, “ఏమిటి సంతోషిణి, ఈ రోజు చాలా వెలిగిపోతున్నావ్!” అంది.
“ఇయ్యాల సంతోషిని బర్తడే మిస్” అని ఒకేసారి చెప్పారు. క్లాసులో పిల్లలంతా‌.
“అబ్బో అదా సంగతీ! ఇలా రా” అని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది.
టీచర్ కి తన క్లాస్ లోని పిల్లలకు చాక్లెట్స్ పంచింది. ఇంటర్వెల్ సమయంలో మిగతా టీచర్స కి చాక్లెట్స్ పంచుతుంది సంతోషిణి.
తీసుకున్నవారందరూ సంతోషిణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కొంతమంది టీచర్లు ఆ పిల్ల చేసుకున్న అలంకారాన్ని మెచ్చుకుంటున్నారు. కొందరు వేసుకొచ్చిన డ్రెస్ ని మెచ్చుకుంటున్నారు.
“అన్నీ బాగానే ఉన్నాయి గానీ, ఆ పిల్ల నుదుటి మీద కాస్త “బొట్టు” ఉన్నట్టయితే ఇంకా బాగుండేది కదా మేడం!” అంది ఒక టీచర్!
ఆ మాట సంతోషిణి చెవిన పడింది.
“అవును కదా! ” వంత పాడారు మిగిలిన టీచర్లు.
సోషల్ టీచర్ మాత్రం వాళ్ళ వంక చిరాకుగా చూసింది
“ఆ పిల్ల రోజూ బొట్టు పెట్టుకోనీ రాదు కదా మేడం! ఇప్పుడెందుకు అది వెలితిగా కనిపించింది మీకు” తట్టుకోలేక చురకంటించింది.
“అహ… కాదులే మేడం. ఆ డ్రెస్ కి, ఆ పిల్ల చక్కదనానికి బొట్టు లేకుంటే ఏదో లోపంగా కనిపిస్తుంది” అంటూ నసికింది ఆ టీచర్.
“బొట్టు పెట్టుకోవాలా! వద్దా! అనేది వాళ్ళవాళ్ళిష్టం కదా మేడం” అంది.
“ఉంటే చక్కగా ఉంటారు, లేకుంటే బోసిగా ఉంటారనడం అర్ధంలేనిది మేడం. ముఖ్యంగా మనం పిల్లల దగ్గర ఇలాంటి చర్చలు చేయడం మంచిది కాదు” అంటూ నవ్వుతూనే తాను చెప్పాల్సిన విషయం చెప్పేసింది సోషల్ టీచర్. కొంతమంది టీచర్లు ఆమె మాటలకు నొచ్చుకున్నారు.
***
చాలా రోజుల నుండి ఒక విషయంలో స్పష్టత లేకుండా వుంది సంతోషిణి. రోజులు గడుస్తున్నా, తన ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు.
తన కులం, మతం విషయంలో చాలా సందిగ్ధత లో ఉంది సంతోషిణి.
అమ్మా, నాన్నలను అడిగితే స్పష్టంగా చెప్పరు.
స్కూల్లోనేమో బొట్టు, కాటుక, గొలుసులు చేతికి దారాలను చూసి స్నేహాలు చేస్తున్నారు.
బెంచీలో వాళ్ళ ప్రక్కన కూర్చోవాలంటే రిలిజియన్ అడుగుతుంటారు.
ఎన్నిసార్లు నాన్నని అడిగినా… “మనం కమ్యునిస్టులం తల్లీ! మనకి కులం, మతం లేదు. మానవత్వమే మన కులం, మంచి మనుషులే మన దేవుళ్ళు” అని చెబుతాడు గానీ, తన మతమేదే చెప్పిచావడు.
స్కూల్లో క్లాస్ పిల్లలు తనకు బొట్టు లేదనీ “నీవు ముస్లీం వా?” అని అడుగుతారు.
తనకు హిజాబ్ లేకుండా, ఉర్దూ మాట్లాడనని తెలిసి, “నీవు “క్రిష్టియన్”వా ?” అని అడుగుతున్నారు.
తాను గానీ, ఇంట్లో వాళ్ళుగానీ ఎవరూ చర్చీకి పోరు. అసలు ఏ దేవుడ్ని పూజించరు.
తన స్నేహితురాలు మేఘన మాత్రం రోజు బొట్టు పెట్టుకొని వస్తుంది. చేతికి రంగు దారం, కాలికి నల్లదారం కట్టుకుంటుంది.
మిగతా పిల్లల్లాగా తానెప్పుడూ సంతోషిణిని కులం, మతం అడగలేదు.
తినే కాడ ఇద్దరు కలిసి తింటారు. ఒకరి కూరలు ఒకరు షేరు చేసుకుంటారు. హోం వర్కు నోట్సులు పంచుకుంటారు. సాయంత్రం ఫోన్ చేసుకుంటారు. వాట్సాప్ లో పలకరించుకుంటారు.
వీరిద్దరూ దోస్తులుగా ఉండడం ఆ రౌడీ సౌజన్యకు కొంతమంది అమ్మాయిలకు నచ్చేది కాదు.
ఒకప్పుడు సిగ్గుతో ఎవరితో మాట్లాడకుండా మౌనంగా వుండే మేఘన, సంతోషినణి పరిచయంతో ఎంతో మారిపోయింది. తోటి పిల్లలు బెదిరిస్తే గట్టిగా మాట్లాడడం, భయపడకుండా సూటిగా సమాధానం ఇవ్వడం సంతోషిణి ఇచ్చిన చైతన్యమేనని అమ్మాయిలు, టీచర్లు అనుకుంటుంటారు.
ఎవరెన్ని చెప్పిన వాళ్ళిద్దరూ విడిపోలేదు. ఎవరి మాటలు వినేవాళ్ళు కాదు. సంతోషిని దగ్గర కూర్చోకుండ ఉండేది కాదు.
ఒక రోజు మేఘన క్లాసులో సడెన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. పిల్లలు, టీచరు కంగారు పడ్డారు. దూరంగా జరిగి వింతగా చూస్తున్నారు.
సంతోషిణి ఆందోళనపడి గట్టిగా “మేడం…మేడం… మేఘన పడిపోయింది” అంటూ అరిచింది.
ఆ కేకలకి ప్రక్క క్లాసుల్లో వున్న టీచర్లందరు పరుగున వచ్చారు. నీళ్ళతో ముఖాన్ని తుడవమన్నారెవరో!.
క్లాసులో ఎవరూ ముందుకు రాలేదు. రౌడి బేబి సౌజన్య కూడా ముందుకు రాలేదు
సంతోషిణి వెంటనే తన వాటర్ బాటిల్ తీసుకొని మేఘన ముఖం మీద నీళ్ళు చల్లి తుడిచింది.
రెండు నిమిషాలు తర్వాత మేఘన కళ్ళు తెరిచింది.
మెల్లిగా కూర్చోబెట్టి, నీళ్ళు తాగించింది.
హమ్మయ్య అనుకున్నారు అక్కడున్నవారంతా!
సంతోషిణికి ఇంకా ఆందోళన తగ్గలేదు.

అప్పుడే అక్కడికి మేఘన మామయ్య వచ్చాడు.
నీరసంగా వున్నా మేఘనని చూసి చిర్రుబుర్రులాడాడు.
నెలసరి ప్రాబ్లమ్స్ తో నీరసించి మేఘన పడిపోయిందని టీచర్లు గమనించారు. జాలిచూపాల్సిందిపోయి మేఘన మామయ్య అలా పడిపోవడం తనకు పరువు తక్కువగా భావించాడాడు. అందరి ముందూ మేఘనని అరిచాడు.
“ఆ నుదిటిన బొట్టు ఏదే!. బొట్టు లేకుండా ఎలా ఉన్నావే!. నువ్వేమైనా క్రిష్టియన్ ముండవా! ముస్లీం ముండవా! ఏవనుకున్నావే నీవు! పాడు స్నేహాలు, పాడు అలవాట్లు. నీకన్నీ వీళ్ళ బుద్దులే వస్తున్నాయి! ఈసారి ఇలాంటోళ్ళతో తిరగడం చూసానంటే” అంటూ… సంతోషిణి వంక చూపిస్తూ… మేఘన చెంపల మీద రెండు పీకి… “నీ అంతు తేలుస్తా!”అంటూ…సంతోషిణి వైపు ఉరిమి చూశాడు.
మేఘన నోటికి చేయి అడ్డం పెట్టుకుని ఏడుపందుకుంది.
సంతోషిణి మేఘన వంకే చూస్తూ కళ్ళల్లో నీళ్ళు నింపుకుంది.
ఆవేశంగా మేఘన చేయిపట్టుకొని, మరో చేత్తో బ్యాగు పట్టుకొని బరా బరా ఈడ్చుకుంటూ బయటకు లాక్కుపోయాడు.
ఈ హఠాత్పరిణామాలకి పిల్లలు, టీచర్లుకు మతులు పోయాయి. కళ్ళప్పగించి అట్టే చూస్తున్నారు.
సంతోషిణి మాత్రం బిక్కచచ్చిపోయి సోషల్ టీచరు వంకే చూస్తుంది.
***
“చెప్పండి మిస్!. ఆ రోజు మీరు కూడా ఉన్నారుగా! మేఘన చేసిన తప్పు ఏమిటో చెప్పండి! మేఘనాకు ఒంట్లో బాగోలేక నీరసంతో పడిపోతే దాని గురించి విచారించకుండా, బొట్టు పెట్టుకోలేదని కొట్టాడేమిటి మిస్ ! మేఘన పడిపోవడానికి బొట్టుకు సంబంధం ఏమిటి? ఆ రోజు మేఘన బొట్టు పెట్టుకుంది మిస్. తాను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, నేను నీళ్ళతో తన ముఖం కడిగినప్పుడు బొట్టు చెరిగిపోయింది. నేను తన ముఖం కడగకపోయినట్లయితే తన బొట్టు చెరిగిపోకుండా ఉండేది. తనకు దెబ్బలు తప్పేవి. నా స్నేహం వల్లే మేఘన చెడిపోయింది అంటాడేమిటి మిస్. బొట్టు పెట్టుకోనోళ్ళందరు చెడిపోయిపోయినోళ్ళా? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళ స్నేహాలు మంచివి కావా? చెప్పండి మిస్! ఆ సార్ నన్ను అంటున్నప్పుడు మీరు ఉన్నారు. కానీ, మీరు మాట్లాడనందుకే నాకు ఏడుపొచ్చింది” సంతోషిణి కన్నీటితో చెబుతున్నా, సూటిగా ప్రశ్నిస్తుంది.
సోషల్ టీచర్ సంతోషిని ముఖం లోకి చూస్తూ వింటుంది.
సంతోషిణి భుజం మీద చేయివేసి, “ఊరుకోమ్మా… ఏడవమాకు. నిజమేనేమ్మా…నువ్వన్నట్టు, బొట్టుకి తన ఆనారోగ్యానికి సంబంధమేలేదు. ఇందులో నీ తప్పేంలేదు. నీవు మేఘనకు ఏమయ్యిందోనని సపర్యలు చేశావు చూడు. అదమ్మా! మానవత్వం అంటే, అది మతం కంటే గొప్పది.
వాడు మీలో బొట్టు లేనితనాన్ని చూశాడు గానీ, మీ అనుబంధాన్ని ఆ మూర్ఖుడు గుర్తించలేదమ్మా! ఇలాంటి ముర్ఖులు, వెధవలు మన దేశంలో చాలామంది ఉన్నారమ్మా! వాళ్ళందరికి మీలాంటి తల్లులే గుణపాఠం చెప్పాలి. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా?” అంటూ తన వీపును నిమురుతూ సముదాయించి దైర్యం చెప్పింది సోషల్ టీచర్.
సంతోషిణి కన్నీళ్ళు తుడుచుకుంటూ…” అవును మిస్… ఈ విషయంలో ఆ సార్ “వెధవే”. పనికిమాలిన “వెధవ” అని వత్తి పలికింది.
ఆ మాటలకు అవునంటూ టీచర్ మెల్లగా నవ్వింది.
ఆ రోజు సాయంత్రం ఇంట్లో సంతోషిణి హోం వర్క్ రాసుకుంటూ కూర్చుంది.
హాల్లో టి.వి.లో ఒక వార్త తన చెవిన పడి పరిగెత్తుకెళ్ళి చూసింది.
“బురఖా” వేసుకున్న ఒక అమ్మాయిని వందల మంది అబ్బాయిలు ఏవో నినాదాలు చేస్తూ కాలేజీలోకి రాకుండా అడ్డుతగులుతున్నారు.
ఆ అమ్మాయి ధైర్యంగా, భయం, బెరుకు లేకుండ వాళ్ళ నినాదాలకు ప్రతి నినాదాలు చేస్తూ కాలేజీలోకి వెళ్ళింది.
తన దైర్యం ముందు అంత మందిలో ఒక్కడు కూడా తనని అడ్డుకొనే సాహసం చేయలేకపోయారు.
గుండెల నిండా ఊపిరి పీల్చుకున్న సంతోషిణి హోం వర్క్ లో నిమగ్నమైంది.

పుట్టింది ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, చవటపాలెం. తాను ప‌నిచేస్తున్న‌చోట స‌హ‌చ‌ర కార్మికుల జీవితాల‌ను క‌థ‌లుగా మ‌లుస్తున్న‌క‌థ‌కుడు. ప్ర‌స్తుతం మైనింగ్ ఫోర్ మ‌న్ గా ప‌నిచేస్తున్నాడు.

One thought on “బొట్టు

  1. బొట్టు ఉండటం లేకపోవటం వైవాహిత జీవితానికి ప్రతీకగా గతం నుండి ఉంటూ వస్తుంది. ఆడవాళ్లు ఆ హింసను అంతా పడ్డారు. బొట్టుకూ, మతానికి ఉన్న సంబంధం ఇప్పుడు ముందుకు వస్తుంది. భారతదేశ ప్రత్యేక పరిస్థితుల్లో బొట్టుకూ, కులానికి కూడా దగ్గర సంబంధం ఉంది. క్రిస్టియన్లలో ఎక్కువభాగం దళితులు కాబట్టి. ఏదైనా ఈ కుల,మత, వైవాహిక అస్తిత్వాలను మోసేది మహిళలే. బొట్టు వలన వచ్చే ప్రివిలేజెస్, బొట్టు లేకపోవడం వలన వచ్చే అవమానాలు మహిళలవే

Leave a Reply