దేహం ఎలుగడి ఆరిన కాలిన గాయాల చెట్టు
మనసు మందలించేటోల్లు లేక పొక్కిలి తేలినట్టు
నువు దొంగ దండాలు పెట్టినా
దండన యంత్రం చేతితో నా మెడలో దండవేసినా
ఇస్తారు వేసి వడ్డించినా
షాలువాలు కప్పి సన్మానించినా
విమానమెక్కి నీ వెనుక నడువమన్నా
ఇనామిచ్చి నిన్ను పొగడమన్నా
పది ఇచ్చి పదం పాడమన్నా
మందు పోసి లగాయించి ఎగురమన్నా…
నా నోరు తెరిస్తే చాలు-
అది నువు పాటనుకున్న
పదమనుకున్న వేషమనుకున్న
పొగడ్తా అనుకుని మురిసినా…
నేను ఇంతింత ఎగిరి దునికినా
ఎంతెంత పొడుగు రాగం తీసి పాడినా
ఎత్తుకున్న రాగం ఏదైనా
మొత్తుకునే పలుకులేమైనా
అది అంగలారంగా నా నాభీ నుండి
పెకిలి వస్తున్న శోకపు దప్పుడే
అది ఔగోళించంగా నా కడుపులోని
పేగుల గరళ గరగర సప్పుడే
నీ ఆధిపత్యపు అవమానాల తొక్కుడుకి
కిక్కురుమనని అసంకల్పిత ధిక్కార శబ్ధమే
అది నేడో రేపో నిన్ను చుట్టుముట్టి ముంచివేయ
అంటుకుని సరసరా పాకుతున్న కార్పారణ్యమే