బెర్తోల్ట్ బ్రెక్ట్ – జర్మన్ కవి

1898 లో జర్మనీ దేశంలో జన్మించిన బ్రెక్ట్, 20 వ శతాబ్దపు ప్రఖ్యాత నాటక రచయిత. మ్యూనిచ్ నగరంలో వైద్య విద్య అభ్యసించిన కాలంలో విరివిగా కవిత్వం రాసిన బ్రెక్ట్, మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తరువాత, తన వైద్య విద్యను వొడిలి పెట్టి, మిగిలిన జీవితాన్ని రచన కోసం, నాటకాల కోసం ధారపోశాడు.

అతడి జీవితం మీదా, రచనల మీదా రెండు ప్రపంచ యుద్ధాలు చూపిన ప్రభావం అంతా యింతా కాదు. 1930 ల కాలంలో బ్రెక్ట్ నాటకాల మీద నాజీల రాజ్యం నిషేధం విధించింది. 1933 ప్రాంతంలో తన దేశం విడిచిపెట్టి, డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్ దేశాలలో తలదాచుకోవలసి వొచ్చింది.

హాలీవుడ్ సినిమాలకు పనిచేసే ఆశతో 1941 లో కాలిఫోర్నియాకు చేరుకున్న బ్రెక్ట్, అమెరికా సాంస్కృతిక రంగం మీద బలమైన ముద్ర వేశాడు. దానితో బ్రెక్ట్ మీద వున్న కమ్యూనిస్ట్ ముద్రను సాకుగా చూపి అతడి మీద కేసులు వేశారు. తరువాత, అక్కడి నుండి స్విట్జర్ల్యాండ్ కు మకాం మార్చి, కొన్నాళ్ళ తరువాత 1949 లో తూర్పు బెర్లిన్ చేరుకుని అక్కడ నాటక కంపెనీ ప్రారంభించాడు.

ప్రధానంగా నాటక రచయితగా ప్రఖ్యాతుడైనప్పటికీ, కవిగా, కథా రచయితగా కూడా జర్మన్ సాహిత్య చరిత్రలో బ్రెక్ట్ సుప్రసిద్ధుడు. బ్రెక్ట్ కవిత్వమంతా కలిపి ‘బ్రెక్ట్ పోయెమ్స్ 1913- 1956’ పేరున 1997 లో వొచ్చింది. తన నాటకాల కోసం రాసిన కవితలే కాకుండా, తన రాజకీయ కార్యాచరణకు సంబంధించిన కవితలు కూడా విరివిగా రాశాడు. ముఖ్యంగా, రాజకీయ నిర్బంధాన్ని ఎదుర్కొన్న రోజులను ప్రతిబింబిస్తూ బ్రెక్ట్ రాసిన కవితలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.

బ్రెక్ట్ రాసిన Worker Reads History చదుతున్నపుడు ‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు’ అన్న తెలుగు మహాకవి కవితా వాక్యం గుర్తుకొస్తే, దానిని బట్టి అర్థం చేసుకోవొచ్చు, ప్రపంచ వ్యాప్తంగా వున్న కవులను బ్రెక్ట్ కవిత్వం ఎంతగా ప్రభావితం చేసిందో!

మరీ ముఖ్యంగా, చరిత్ర లోని చీకటి రోజుల మీద బ్రెక్ట్ రాసిన ఈ కవితా వాక్యాలు వెంటాడే వాక్యాలు కదా!

‘చీకటి రోజులలో కూడా పాటలుంటాయా?
వుంటాయి
చీకటి రోజులలో కూడా పాటలుంటాయి
అవి చీకటి రోజుల మీద వుంటాయి’

1956 లో, కేవలం 58 యేళ్ళ వయసులో ప్రపంచాన్ని విడిచి వెళ్ళిన బ్రెక్ట్ సమాధి బెర్లిన్ లో వుంది.


కార్మికుడు చరిత్ర చదువుతున్నపుడు

ఏడు ద్వారాల ఈజిప్ట్ నగరం తీబ్స్ ను నిర్మించిందెవరు?
రాజుల పేర్లను రికార్డు చేశారు
రాజులే ఆ నిర్మాణాలకు రాళ్లెత్తి వుంటారా?

బాబిలోన్ ను అనేకమార్లు ధ్వంసం చేశారు
మరి దానిని అన్నిసార్లు పునర్నిర్మించింది ఎవరు?
లిమా నగరంలోని ఏ బంగారు భవనాలలో
భవన నిర్మాతలు వసించి వుంటారు?
చైనా గ్రేట్ వాల్ పూర్తయిన సాయంత్రం
అది కట్టిన మేస్త్రీలు ఎక్కడికి వెళ్లి వుంటారు?
రోమ్ మహానగరమంతా నిండి వుండే
విజయ చిహ్న నిర్మాణాలను ఎవరు పూర్తి చేశారు?

సీజర్లు ఎవరిపై విజయం సాధించారు?
పాటలో బైజాంటియం నగరం ఇంకా జీవించే వుంది
బైజాంటియం నగరంలో నివాసాలన్నీ రాజభవనాలు మాత్రమేనా?
రాత్రి వేళ అట్లాంటిస్ నగరాన్ని సముద్రం ముంచెత్తినపుడు
మునిగిపోతున్న కులీనులు, వారి బానిసల కోసం అరిచారట

యువ అలెగ్జాండర్ భారతదేశాన్ని ఒంటరిగానే జయించాడా?
సీజర్ అనాగరికులని చెప్పబడిన గౌల్స్ ను మట్టుబెట్టాడు
అతడి సైన్యంలో ఒక్క వంట మనిషి కూడా లేడా?
తన నౌకలన్నీ సముద్రంలో మునిగి నాశనమైనపుడు
స్పెయిన్ రాజు ఫిలిప్ పొగిలి పొగిలి ఏడ్చాడట
అతడికి మరి ఏ ఇతర కారణానికీ దుఃఖం రాలేదా?
గొప్ప రాజైన ఫ్రెడరిక్ ఏడు సంవత్సరాల యుద్ధంలో గెలిచాడట
ఆ విజయం అతడికి మాత్రమే సొంతమా?

చరిత్ర ప్రతి పేజీలో వొక విజయం
విజయోత్సవ విందుకు త్యాగాలు చేసింది ఎవరు?
ప్రతి పది సంవత్సరాలకు ఒక మహనీయుని జననం
మరి, ఆ భారాన్ని తలకెత్తుకుని మోసింది ఎవరు?
అనేక వివరాలు… అనేకానేక ప్రశ్నలు


తదుపరి జన్మించినవాళ్లకు

I

ఆకలి రాజ్యమేలుతున్న వేళ
దారితప్పిన నగరాలకు వొచ్చాను నేను
ఆందోళనల సమయంలో ప్రజలవద్ద ఆశ్రయం పొందాను
తరువాత, వాళ్ళ తిరుగుబాటులో భాగమయ్యాను
భూమ్మీద నాకివ్వబడిన కాలాన్ని అట్లా గడిపాను నేను

యుద్ధాల నడుమ రాత్రి భోజనం చేసాను
హంతకుల నడుమ నిద్రకు ఉపక్రమించాను
ప్రేమను గురించి అంతగా పట్టించుకోలేదు
ప్రకృతి అందాల కోసం పరితపించే ఓపిక వుండేది కాదు
భూమ్మీద నాకివ్వబడిన కాలాన్ని అట్లా గడిపాను నేను

నా కాలంలో నగరవీధులన్నీచిత్తడి నేలలయ్యాయి
నా ఉపన్యాసం, నన్నునరహంతకుల ముందు ద్రోహిని చేసింది
నిజానికి నేను చేయగలిగింది చాలా తక్కువ
కానయితే, నేను లేకపోతే పాలకులు
ప్రశాంతంగా నిద్రపోయారు
నేను ఆశించింది కూడా అదే
భూమ్మీద నాకివ్వబడిన కాలాన్ని అట్లా గడిపాను నేను

II

మమ్మల్ని ముంచెత్తిన, మమ్మల్ని ముంచి వేసిన
వరదలు శాంతించాక, ఆ ప్రశాంత ఉపరితలంపై జన్మించి
ఆనాటి చీకటి దినాలలోని మా బలహీనతల్ని
ప్రశ్నించే వాళ్లంతా ఆలోచించండి…

ఆ చీకటి దినాలు మీ అనుభవంలో లేవని

పాదరక్షలు మార్చిన దానికన్నా వేగంగా
మేము దేశాలు మారిన రోజులున్నాయి
నిరాశపరిచిన వర్గపోరాటాల వలన తెలిసింది
అన్యాయం మాత్రమే ఉందని, దౌర్జన్యం లేదని

అయినప్పటికీ మేము గ్రహించాము
ఇప్పటికీ అణచివేత పట్ల ద్వేషం
స్వాభావిక లక్షణాలను విచ్చిన్నం చేస్తుందని
ఇప్పటికీ అన్యాయాల పట్ల ఆగ్రహం
గొంతుల్ని పెంచి వికారంగా మారుస్తుందని

అయ్యో
మేము, శాంతికి, స్నేహపూర్వక వాతావరణానికి
ఒక మంచి పునాది వేయాలని ఆశించాము
కానయితే, మాతో మేమే స్నేహంగా వుండలేకపోయాము

భవిష్యత్తులో, ఇక మనుషులు ఎప్పటికీ
తమను తాము జంతువులుగా భావించని కాలంలో
ఒక్కసారి మావైపు ఆనందంతో చూడండి

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

2 thoughts on “బెర్తోల్ట్ బ్రెక్ట్ – జర్మన్ కవి

  1. ఒక నాటక కార్యకర్త గా నాకు బ్రెక్ట్ నాటకరంగం లో చేసిన గొప్ప మార్పులు తెలుసు, అనేక భాషల్లో ఆయన నాటకాలు చూశాను కూడా. అలాగే ఆయన్ కవితలు గూగుల్ ద్వారా గిగుమతి చేసుకొని దాచుకున్నాను కూడా. విజయకుమార్ గారు ఆయన కవితల్ని తెలుగులోకి అనువాదించి మంచి పరిచయం చేశారు బెక్ట్ కవిత్వాన్ని. అలాగే ఆయన quotations కూడా ఉన్నాయి . మంచి వ్యాసం

Leave a Reply