బెకబెక!

ఉరుము వురమలేదు! మంగలం మీద పడలేదు?! మండూకం మీద పడింది! మండూకపు జాతి మీద పడింది! కనిపించిన కప్పనల్లా యెత్తుకుపోతున్నారు! ఎక్కడికక్కడ రాములవారి కల్యాణం జరిపించినట్టు కప్పలకు కళ్యాణాలు జరిపించేస్తున్నారు! ఊరూ వాడా పల్లే పట్నమూ నగరమూ తేడా లేకుండా అన్నీ పెళ్ళి మండపాలే! ప్రతి యిల్లూ పెళ్ళి సందడితో కళకళలాడుతోంది!

ఎటొచ్చీ కప్పలకే కన్నీళ్ళొస్తున్నాయి! గుండెలు గక్కురుమంటున్నాయి! జతకట్టిన వాళ్ళతో కాకుండా కనిపించిన వాళ్ళని కనిపించిన వాళ్ళతో పెళ్ళిళ్ళు చెసెయ్యడంతో వాటి కళ్ళకు అందరూ స్వయం సంఘ సేవకుల్లా కనిపించారు! వాళ్ళు భగవంతుడయితే ప్రార్ధించో ప్రాధేయపడో మొక్కొచ్చును! భక్తులు?! తాట తీసి వొలుస్తారని కప్పలకు తెలుసును! అందుకే బెకబెక మని అనలేదు!

కళ్ళకి రెప్పలు లేనట్టు కప్పలు గుడ్లు నిలేసి చూస్తున్నాయి! వాటికేమీ బోధ పడ్లేదు! నీళ్ళలో చక్కగా జలకాలాడే తమని తెచ్చి నీళ్ళు లేని చోట యీ మనుషులు స్నానాలాడించడం యేమిటో అర్థం కాలేదు! ఇదంతా వింతగా చూస్తున్న వో కుర్రకప్ప ‘ముందు మీరు స్నానాలు చెయ్యండ్రా… మీ వొళ్ళు మీరు కడుక్కోకుండా మా వొళ్ళు కడుగుతారేంటి?’ గొణుగులాడింది! మనుషులు ఆ కప్ప మాటలు వినకుండా దాని వొళ్ళంతా రుద్ది మరీ పసుపు రాశారు! ‘ఒరే… నేను మగనాకొడుకునిరా’ అంటూ సిగ్గుతో గింజుకుంది కుర్రకప్ప! ఆ మాటకు పక్కన వున్న ముసలికప్ప ముసిముసి నవ్వులు నవ్వింది!


కుర్రకప్పకు పసుపు పూస్తుంటే వొళ్ళంతా చక్కిలిగిలి వేసింది! అటూ యిటూ కదిలింది! ‘నెమ్మదిగా’ అంది! ‘ఈ అమ్మలక్కలు వీళ్ళు పసుపు రాసుకోరు గాని నాకు మాత్రం…’ కంఠం కింద పసుపు రాయడంతో కుర్రకప్పకి మాట రాలేదు! ‘పసుపు రాస్తే దబ్బపండులా వున్నావు’ అని ముసలికప్ప కన్ను గీటింది! ‘కాకో గద్దో చూసిందంటే సరాసరి కైలాసానికే…’ కుర్రకప్ప వాపోయింది! ముసలికప్పకీ నుదిటన తిలకం దిద్దుతుంటే ‘మనవడా నీకూ నాకూ పెళ్ళి’ అని కుర్రకప్పని చూసి బెకబెకమంది!

‘ఈ మనుషులకు వావి వరసలు వుండవా?’- కుర్రకప్ప లబోదిబోమంది! ‘వయసూ గియసూ వుండదా?’- అని కూడా గింజుకుంది! ‘అయినా మగాడికీ మగాడికీ యెలా పెళ్ళి చేస్తారు?’- పెద్ద ఆరిందలా అడిగింది! ‘ఆడవాళ్ళకీ ఆడవాళ్ళకీ పెళ్ళి చేస్తున్నారుగ’ అంది అందుకు తనే సాక్ష్యం అన్నట్టు పక్కజంటలోని పడుచుకప్ప! ‘మనుషుల్లో వున్నన్ని రకాలు మనకున్నూ’ అంది పడుచుకప్పకు జంటవుతున్న జంటకప్ప! ‘మనం మగో ఆడో ఆళ్ళకి తెలీదు, తెలుసుకొనేంత సమయమూ లేదు… అవసరమూ లేదు’ అంది ముసలికప్ప!

ఒక్కసారిగా బాజాలూ బజంత్రీలూ మోగి మిన్నంటడంతో కప్పలు వులిక్కిపడ్డాయి! కప్పలకి వొళ్ళంతా చినుకుల సూదులు గుచ్చినట్టు చురుక్కు చురుక్కు మంటున్నాయి! మధ్యలో చెవ్వులు చిల్లులు పడేలా శంఖారావం! ‘ఏం జరుగుతోంది?’ అంది కుర్రకప్ప! ‘మనకి దండంపెట్టి అక్షింతలు చల్లుతున్నారు’ చెప్పింది ముసలికప్ప! ఫోటోలూ ఫ్లాష్లూ వీడియోలూ మీడియాలూ! కళ్ళు పట్టని వెలుగుల నడుమ వొక్కసారిగా చీకటి కమ్మింది?!

‘ఏమయింది?’ అంది కుర్రకప్ప! ‘మనిద్దరినీ పసుపు బొత్తుల్లో చుట్టి- కర్రకు కట్టి- కావిడి బద్దకు అటూ యిటూ భుజాలు పట్టినట్టు పట్టి- యింటింటికి వూరేగిస్తున్నారు’ పలుచని గుడ్డలోంచి నలిగిన కన్నంట నీళ్ళు కారుస్తూ లీలగా దృశ్యాన్ని చూస్తూ అంది ముసలికప్ప! ‘ఎందుకూ?’ అంది కుర్ర కప్ప! ‘పెళ్ళన్నాక వూరేగించరా?’ అంది ముసలికప్ప! ‘వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకు చావచ్చుగ?’ అంది కుర్రకప్ప! ‘వాళ్ళు పెళ్ళి చేసుకుంటే వాన కాదు, అగ్గిపుడుతుంది’ వెక్కిరింతగా అంది ముసలికప్ప! ‘మన కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తే వరుణ దేవుడు సంతోషించి యీ భూమ్మీద వానలు కురిపిస్తాడు’ అని గర్వాతిగర్వంగా కూడా చెప్పింది!

ఇంతలో దబ్బున కుమ్మరించినట్టు పడ్డాయి నీళ్ళు! ఊపిరి సలపలేదు! ‘నిజంగానే కుంభవృష్టి వాన’ కళ్ళు తేలేసింది ‘మనకింత మహత్తు వుందా’ అన్నట్టు కుర్రకప్ప! ‘వానా కాదు, వల్లకాడూ కాదు, బిందెలతో మన మీద నీళ్ళు వొంపుతున్నారు’ చెప్పింది ముసలికప్ప! ‘నీళ్ళు లేవని అవస్థలు పడి యిదేం గోల?’ కుర్రకప్ప చిరాకు పడింది! ‘విధాయకం’ చెప్పింది ముసలికప్ప! మళ్ళీ మళ్ళీ నీళ్ళు కుంభవృష్టిగా కురిసి కురిసి అలసి వెలిసి ఆగాయి!

పసుపు బొత్తుల్లోంచి బయటపడ్డాక వరదల్లోంచి బయటపడ్డట్టే అనిపించింది కప్పలకి! సత్తువ సన్నగిల్లింది! నీరసంగా వుంది! డప్పుల మోతలతో చెవులు దిమ్మెక్కిపోయాయి! బెదురుబెదురుగా చూశాయి! దానికి తోడు వూపిరి సలపనివ్వకుండా కప్పలకి కొత్తబట్టలు కట్టారు! మెళ్ళో మోయలేనన్ని పూలదండలూ పూసలదండలూ వేశారు!
అంత నీరసంలోనూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ‘నీ చీర బాగుంది కుర్రోడా’ అంది ముసలికప్ప! కుర్రకప్ప తనని తాను చూసుకుంది! కుచ్చిళ్ళు కూడా పోసివున్నాయి! నుదిటన అద్ది దిద్దిన కుంకుమ కంట్లో పడింది! కళ్ళలోని నీళ్ళు మసకనీ మబ్బునీ క్షణాల్లో కడిగేశాయి! కుర్రకప్పకి దృశ్యం స్పష్టమయ్యింది! తెల్లని పంచెకట్టులో మెరిసిపోతున్న ముసలికప్ప తాతని పోల్చుకోలేకపోయింది!

అంతలోనే తేరుకొని ‘ఛీ వొళ్ళంతా కప్పుకోవడమేంటి అసహ్యంగా’ కుర్రకప్ప అసహనంగా అంది! ‘వోయ్ మనవడా… మన పెళ్ళికి పెళ్ళి కార్డులు కూడా వేసి యెంచక్కా అందరికీ పంచిపెట్టారు చూడు’ అని నవ్వించాలని చూసింది ముసలికప్ప! కుర్రకప్ప దిగులు వీడలేదు! అది చూసి ముసలికప్ప ‘వధువు వర్ష, నువ్వే; వరుడు వరుణ్, నేనే’ అంది! ‘వీళ్ళకి యీ పెళ్ళి సరదా యేమిటి?’ గింజుకుంది కుర్రకప్ప! ‘నయం… వీళ్ళు పాతరోజుల్లో చేసుకున్నట్టు అయిదురోజుల పెళ్ళిళ్ళూ మూడురోజుల పెళ్ళిళ్ళూ మనకీ చేస్తే పెళ్ళిపీటల మీదే చచ్చేవాళ్ళం’ అంది పక్కజంటలోని పడుచుకప్ప! ‘చూశావా… బంధు మిత్రులతో సహా మన పెళ్ళికి హాజరయ్యారు… మన పెళ్ళికి విందుభోజనం కూడా పెడుతున్నారు చూడు…’ అని ఆ పక్కనున్న దాని జంటకప్ప!

అటు మేళాలూ తాళాలూ! ఇటు మంగళ వాద్యాలూ! ఒక పక్క కబడ్డీ కోకోలాంటి ఆటలూ ఆడుకుంటున్నారు! మరో పక్క భక్తి సినిమాల రక్తి పాటలూ పాడుకుంటున్నారు! ఇంకో పక్క గుక్కతిప్పుకోకుండా పంతుళ్ళు వేదమంత్రాలు వల్లె వేస్తున్నారు! కొందరు తాగి డాన్సులు చేస్తున్నారు! వరుణ యజ్ఞ గుండపు పొగ పొగమంచులా కమ్మేసింది!

‘మన కప్పలన్నిటికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయన్న మాట’ తనలో తాను అనుకున్నట్టు పైకే అనేసింది కుర్రకప్ప! ‘దేశ వ్యాప్తంగా’ నిట్టూర్పు వొదిలింది పక్కజంటలోని పడుచుకప్ప! ‘మనల్ని ఆదుకొనేవాళ్ళే లేరా?’ ఆందోళనగా అడిగింది కుర్రకప్ప! ‘శంఖూ చక్రమూ ధరించకుండా వచ్చిన విష్ణుమూర్తికి మల్లె జంతుప్రేమికులు వచ్చారు చూడు…’ అంది ముసలికప్ప! కుర్రకప్ప ఆనందంతో గెంతబోయింది! ఒంటికి చుట్టి కట్టిన బట్టలవల్లా పూసల పూల దండలవల్లా అది సాధ్యం కాలేదు! ముసలికప్ప అటు చూడమని కుర్రకప్పని కాలితో తన్నింది!

‘జంతు హింస’ అన్నారు జంతు ప్రేమికులు! కప్పలు జంతువులు కావన్నారు భక్తులు! సాక్షాత్తు దైవ స్వరూపాలన్నారు! జంతువులనడం తమ దైవాన్ని అవమానించడమే కాదు, తమ మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీయడం గాయపరచడం అని కూడా అన్నారు! పెళ్ళి హింస కాదని, వివాహ వ్యవస్థమీద నమ్మకం లేనివాళ్ళే పెళ్ళిలో కప్పల పెళ్ళిలో జంతు హింస వుందని వితండవాదం చేస్తున్నారని విరుచుకుపడ్డారు! సాంప్రదాయ క్రీడైన జల్లికట్టులో యెద్దుల్ని ఆమోదించి ఆహ్వానించి మద్దతిచ్చి పోరాడిన ప్రజలు- అల్పజీవులైన మండూకాలకు కూడా తమ మద్దతిచ్చి మరో పోరాటానికి సిద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారు! సంస్కృతిని యెవరూ ప్రశ్నించరాదని- అలా ప్రశ్నించిన వాళ్ళు దేశ ద్రోహులని- ముఖ్య అతిధిగా హాజరైన మంత్రిగారూ తేల్చేశారు!

ఈ విషయమై అత్యన్నత న్యాయస్థానంలో పిర్యాదు చేయడమే కాదు, యీ దేశపు సంస్కృతీ సాంప్రదాయాలను సయితం కాపాడుతామని భక్తులకు భరోసానిచ్చాయి విత్తన కంపెనీలు! ఆయా కంపెనీల యాజమాన్యాలు తమ తమ వుద్యోగుల్ని యిప్పటికే కప్పల వూరేగింపుల్లో భాగస్తుల్ని చేశామన్నాయి! కప్పలకు పెళ్ళిళ్ళు జరిపించడం వల్ల వానలు కురుస్తాయన్న ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తామని పోటీపడి చెప్పాయి! వానలు కురిస్తే రైతు బాగుంటాడని- రైతు బాగుంటే పంటలు బాగుంటాయని- పంటలు బాగుంటే దేశం బాగుంటుందని- ప్రకటనలిచ్చాయి! స్పాన్సర్స్ చేస్తూ ఆయా కంపెనీలు పెద్ద పెద్ద హోర్డింగులూ పెట్టాయి! ఈ పెళ్ళిళ్ళ ద్వారా మూడనమ్మకాలని ప్రోత్సహించడం లేదని- జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నామని- పర్యావరణ సమతుల్యతని సాధిస్తున్నామని- ప్రజాప్రతినిధిగారు గట్టిగానే చెప్పారు! కృత్రిమవర్షాలు సృష్టిస్తే వర్షాలు కురిసినా కురవకపోయినా కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తే ఖచ్చితంగా వానలు కురుస్తాయని- ఖర్చు తక్కువని- ప్రాచీన వారసత్వ జ్ఞానాన్ని ప్రతివొక్కరూ గుర్తించి గౌరవించి నెత్తికెత్తుకోవాలని- అప్పుడే దేశం ప్రపంచదేశాల నడుమ తలెత్తుకు నిలబడుతుందని- కాషాయపు తలపాగా చుట్టుకు మరీ చెప్పారు!

కప్పలు విన్నాయి! తిప్పలు మనకు తప్పవనుకున్నాయి! మనమే కాదు, మనజాతి సమస్తమూ మానవజాతి నుండి తప్పించుకోవడం దుర్లభం అనే నిర్ణయానికి వచ్చేశాయి! ఆశలకు నీళ్ళొదిలేశాయి! వధూ వరులైన తమ కప్పల యేడుపుగొట్టు ముఖాలు చూసి ‘పెళ్ళి కళ వచ్చేసింది’ అని అంటున్నవాళ్ళని మైకుతోసహా మింగేయాలన్నట్టు చూశాయి! భగవంతుని ప్రతిరూపాలుగా యెత్తకూడని అవతారం యెత్తినప్పుడు అనివార్యంగానైనా హింసకు పూనుకోవడం సరికాదని కప్పలు వుగ్గబట్టుకు వూరుకున్నాయి! నీటిలోంచి తియ్యగానే చచ్చిపోయే చేపల్లా పుట్టివున్నా బాగుణ్ణని వుభయచరాలయినందుకు బాధ పడ్డాయి!

ఋతువులు దారి తప్పొచ్చు! పవనాలు పలుకరించక పోవచ్చు! కాని రుతుపవనాల్లా వచ్చారు కొంతమంది యువతీ యువకులు! అడవులు అంతరించిపోవడం వల్లే వర్షాభావ పరిస్థితులు యేర్పడ్డాయన్నారు! సర్కారు భుజాల మీది గుమ్మడికాయను తడుముకుంది! అటవీ వనరుల్ని అప్పనంగా దోచిపెడుతున్నారని అన్నవాళ్ళని ఆల్రెడీ అండా సెల్లో జీవితఖైదుగా పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ- ‘మీ బంగారం లాంటి భవిష్యత్తు పాడుచేసుకోవద్ద’ని అరెస్టయిన వాళ్ళకు పోలీసులు గీతోపదేశం చేశారు! తాగునీటి సరఫరా మీద దృష్టి పెట్టకుండా- బావుల్నీ చెరువుల్నీ రక్షించకుండా- మొక్కల్నీ చెట్లనీ పెంచకుండా- కాలుష్యం తగ్గించకుండా- భూతాపాన్నీ అదుపులో పెట్టకుండా- పెళ్ళిళ్ళ పేరయ్య వేషాలు వెయ్యొద్దని విమర్శించిన కొందరిని శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ కటకటాల లోపల వేసి యూజర్ చార్జీ లేకుండా లాఠీచార్జీ చేసేశారు!

శాంతియుత దేశంలో యింత అశాంతి వద్దని కుర్రకప్ప ‘మాకు పెళ్ళి చేసేయండిరో’ అని మొర్రోమంది! ఆ అరుపు పూరించిన శంఖంలో కలిసిపోయింది! ‘మాంగల్యం తంతు నానేనా మమ జీవన హేతునా’ దిక్కులు పిక్కటిల్లు తున్నాయి! కుర్రకప్ప బిర్ర బిగుసుకుపోయి చూస్తోంది! పక్కజంటలోని పడుచుకప్పకి ఆవిడెవరో తాళి కట్టేస్తోంది అరే- అనుకొనే లోపలే వో పెద్దమనిషి తనమెడలో తాళి కట్టేస్తూ వొక్కో ముడీ వేసేస్తున్నాడు! ‘నేనీ మనిషికి పెళ్ళాన్నా?’ అమాయకంగా నోరు వెళ్ళబెట్టింది కుర్రకప్ప! ‘దేవుళ్ళకే తప్పలేదు, పంతుళ్ళ ముడి… నువ్వెంత? నీ బతుకెంత? నోర్మూసుకొని తాళి కట్టించుకో’ కసురుకుంది ముసలికప్ప!

కుర్రకప్ప మెళ్ళో తాళిబొట్టు పడింది! తలంబ్రాలు పోశారు! అక్షింతలు కురిశాయి! కుర్రకప్పకి నింగిలోని నక్షత్రాలు నేలమీదే మెరిశాయి! ‘అరుందతీ నక్షత్రం చూపించండర్రా’ యెవరో భక్తిగా చేతులెత్తి కప్పలకు మొక్కేస్తూనే పకపకా నవ్వుతున్నారు! హారతి పడుతుంటే ‘కప్పలకు మూతి కాలిపోగలదు’ అని నవ్వుతూనే పాపభీతితో బుగ్గలకు అటూ యిటూ తడుముతున్నట్టు అరచేతులతో లెంపలు వేసుకుంటున్నారు! కాలిన అగరువొత్తితో యెవరో కొంటె పిల్లలు గుచ్చగ కుర్రకప్పకి ముడ్డి కాలిపోయింది!

అంతకంటే యెక్కువ కడుపు కాలుతోంది! మంది మనసు తెలుసుకున్నట్టేవున్నారు! పాలూ పండ్లూ వడపప్పు ప్రసాదాలూ బెల్లం పానకాలూ పచ్చిబియ్యం పాయసాలూ తెచ్చి ముందు పెట్టారు! ‘మనం యేమి తింటామో కూడా యీ యెదవలకు తెలీదా?’ రిమ్మెక్కిపోయింది కుర్రకప్పకి! ‘మనమిప్పుడు దేవతలం కదా?’ అంది ముసలికప్ప! ‘దెయ్యాలం అయినా బాగుణ్ణు’ చింతించింది కుర్రకప్ప! ‘తధాస్తు దేవతలు వుంటారు’ వద్దన్నట్టు అడ్డంగా తలూపింది ముసలికప్ప!

‘పెళ్ళయిపోయింది కదా, యింక మనల్ని వదిలేస్తారా?’ ఆశగా అడిగింది కుర్రకప్ప! ముసలికప్ప వినీ విననట్టే వుండి యెటో చూస్తోంది! ‘వానలు కురిసేదాక వదలరా?’ తీరనన్ని అనుమానాలు కుర్రకప్పకి! ‘మనల్ని పువ్వుల రథంలో పెట్టి సాగనంపుతున్నారు చూడు’ అంది ముసలికప్ప! అరచేతి మందంగా మెత్తటి దూది పరుపులు కుట్టి- దాని మీద రంగురంగుల పూలేసి కుట్టి- ఆ పానుపు మీద కప్పల్ని పడుకోబెట్టి- జోకొట్టారు! ముత్తైదువలు రాగాలు తీసి జోలపాటలు పాడి వులాలేశారు! కప్పల జంటలని హనీమూనుకు పంపుతున్నట్టు మైకులో ఆ ప్రాంతాన్ని కూడా ప్రకటించారు!

ప్రకటించిన పచ్చని స్థలంలోనే కప్పల్ని తీసుకువెళ్ళి విడిచిపెట్టారు! స్వేచ్ఛతో సంతోషంతో గంతులేస్తూ కప్పలు బెకబెకమన్నాయి! ఎక్కడెక్కడో దాక్కున్న తమ జాతి కప్పలు బొరియల్లోంచి బయటికొచ్చి బెకబెకమని తోడిరాగం కూడి తీశాయి! కొత్త వధూవరులు బురదలో పొర్లి పాతబడ్డారు! కీటకాలని కడుపునిండా తిని తేన్చి అరిగేదాక గంతులేశాయి! జతకోరి జతగూడి బెకబెకమన్నాయి! ఆ ఆనందరాగానికి దిక్కులే కాదు, దిగ్ దిగంతాలూ దద్దరిల్లాయి! మబ్బుల మేఘాలు కరిగి నీరై జారి జాలువారి వానై వర్షించాయి!

కప్పలు ఆనంద తాండవం చేస్తూనేవున్నాయి! నింగిని నేలా నేలని నింగీ తడుపుకున్నాయి! కుండపోత! వానలు వాగులయ్యాయి! వాగులు వరదలయ్యాయి! నీళ్ళు పల్లానికే కాదు, మెరక మెడలు వంచి యెత్తుకీ యెగబాకాయి! అంతా బెకబెక?!

ఊర్లు యేర్లయాయి! సెలయేర్లయాయి! ఊళ్ళోని యిళ్ళు వోడలయ్యాయి! పొలాలు చెరువులయ్యాయి! మనుషులు కప్పల్లా తేలారు! కప్పలు మనుషుల్లా మునిగి తేలాయి! అంతా బెకబెక?!

బెకబెకమని కప్పలు అరవడం మాత్రం మానలేదు! వానలు కురవడం మానలేదు! ఉట్టి తెగినట్టు వుపద్రవం! ఉద్దండులు సృష్టి ముగుస్తుందని అంచనా వేస్తున్నారు! కల్లోల కారణాలను తవ్వి తీస్తున్నారు! కప్పలు బెకబెకలు ఆపితే వర్షాలకు తెరిపి అని, అదే విరుగుడు అని పండితులు తేల్చేశారు! కాని కప్పలు ఆపలేదు… ఆగలేదు… అంతా బెకబెక?!

పూజలు నియమ నిష్టలతోనే చేశామే అన్నారు కొందరు! మన లోపం మానవ లోపం లేదన్నారు మరికొందరు! ‘అమ్మా మండోదరుల్లారా మాయందు దయతలచి మీ బెకబెకలు ఆపండి… శాంతించండి…’ మొక్కుతున్నారు యింకొందరు! ‘మళ్ళీ యేడు మీకు ఘనంగా పెళ్ళిళ్ళు చేస్తాము’ అని మొక్కుకున్నారు భక్తులు! వరుణుడు బాగా పగబట్టాడు అన్నారు విరక్తులు! అంతా మానవ తప్పిదం అన్నారు ప్రకృతి ప్రేమికులు! మానవ తప్పిదమూ కాదు, మట్టిగడ్డా కాదు… కప్పల్ని పట్టుకు నాలుగు తంతే- తగిలిస్తే- బెకబెకలు ఆపితే- వానలు అవే ఆగుతాయి అన్నారు దేశభక్తులు!

అంతే! కర్రలూ కత్తులూ తిప్పుతూ మూక బయల్దేరింది! కప్పల డిప్పలు పగిలిపోయాయి! దొరికిన కప్పని దొరికినట్టు చితక బాదుతున్నారు! పణతలు విచ్చిపోతున్నాయి! పుచ్చెలు యెగిరిపోతున్నాయి! ప్రమాదం పసిగట్టిన కప్పలు తమజాతికి సంకేతాలు తెలిపే ఆందోళనలో… అంతా బెకబెక?!

పూజలు చేసిన చేత్తోనే బడిత పూజలు చెయ్యడం చూసి కుర్రకప్ప కలవరపడిపోయింది! కళ్ళముందే తమ కప్పల జాతి కడతేరిపోవడం చూడలేక కళ్ళు మూసుకొని మోర తెరచుకొని ‘బెకబెకా… బెకబెకా’ అని ఆపకుండా అరవడం మొదలు పెట్టింది! మూక రెచ్చిపోయి వీరతిలకాలు దిద్దుకొని దండెత్తి వచ్చేస్తున్నారు! ముసలికప్ప కుర్రకప్పకి వొక్క టెంకిజెల్ల యిచ్చి నోర్ముయ్యమంది! ‘బతుకుమీద తీపి లేదా?’ అని, ‘రెండు కాళ్ళూ పట్టుకొని నేలకేసి కొట్టేస్తా’నని హెచ్చరించింది! ‘మనుషుల్లా ఆవేశాకావేశాకాలకి లోనయితే మట్టిలో కలిసిపోవడమే’ అని బోధ పరిచింది! ‘వీళ్ళసలు మనుషులేనా?’ అడిగింది కుర్రకప్ప!

ముసలికప్ప కుర్రకప్పను బుజ్జగించింది! బుర్ర నిమిరింది! అడ్డాల్లో కూర్చోపెట్టుకుంది! ‘మనవడా మనం వుభయచరాలం… మానవుడూ వుభయచరమే…’ చెప్పబోయింది! ‘మనిషి మట్టిమీదే కదా జీవిస్తాడు?’ ఆగలేక అడిగింది కుర్రకప్ప! ‘ఈ చరాచర జగత్తులో స్థలమునా జలమునా అనగా నేలమీదా నీట్లోనూ అనేది భౌతికమైన విషయం… దానికి విలువ లేదు, యిక్కడ వుభయ అనగా రెండు విధములుగానూ రెండు తావులుగానూ వుండే చరము’ అని అర్థమయ్యిందో లేదో అన్నట్టుగా ఆగి చూసింది ముసలికప్ప! కుర్రకప్ప కాలితో బుర్ర గోక్కుంది!

సరిగ్గా అదే సమయంలో రాళ్ళ వర్షం! రివ్వున దూసుకు వచ్చిన వో రాయి తగిలి కుర్రకప్ప కాలు విరిగి తుళ్ళిపోయింది! మరో రాయి తగిలి ముసలికప్ప అప్పటికప్పుడే ప్రాణాలు వదిలింది! రాళ్ళ దాడి నుండి తప్పించుకోవడానికి కుంటుతూనే పరిగెత్తింది కుర్రకప్ప! పరిగెడుతూ వెనక్కి చూసింది! అప్పుడు యింకో రాయి వచ్చి గుండెకు గుండులా తగిలింది! కుర్రకప్ప మరి పరిగెత్తలేదు!

కుర్రకప్ప, ముసలికప్ప అనేక కప్పల్లానే గాల్లో తేలాయి! ‘ఒళ్లేంటి దూదిపింజలా తేలిపోతోంది?’ అర్థంకాని అయోమయంతో అడిగింది కుర్రకప్ప! ‘నువ్వేం కోరుకున్నావో గుర్తుందా?’ తిరిగి అడిగింది ముసలికప్ప! కుర్రకప్ప కాలితో బుర్ర గోక్కోబోయి ఆగింది! తెగిన కాలు వెతుక్కొనే లోపలే అతుక్కుంది, కాని దాని పాదం చూసుకుంటే వెనక్కి తిరిగివుంది! ‘దెయ్యాలం అయినా బాగుణ్ణని చింతించావు కదా?’ గుర్తుచేసి ‘నీ ఆశ తీరింది’ నవ్వుతూ అంది ముసలికప్ప! నమ్మలేక కుర్రకప్ప తనని తాను గిల్లుకుంటుంటే ‘మనల్ని దేవుళ్ళను చేసినా దెయ్యాలను చేసినా ఆ ఘనత మనుషులకే చెల్లింది’ అంది ముసిముసినవ్వులతో ముసలికప్ప!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

Leave a Reply