బువ్వ నవ్వింది

ఎట్టకేలకు
జల ఫిరంగుల తలలు తెగిపడ్డాయి
నెత్తుటి అంచుల బారికేడ్లు
పోరాట ఉధృతిలో కొట్టుకుపోయాయి
కందకాలు తవ్వించిన చేతులు
లెంపలేసుకున్నాయి
ఉన్మాదంతో రెచ్చిపోయిన లాఠీలూ
పాపం ముఖం చెల్లక తలలొంచుకున్నాయి

బువ్వ నవ్వింది
ఢిల్లీ పొలిమేర నవ్వింది
ఏడాది సేద్యం తర్వాత
పిడికిళ్ల పంట చేతికందింది

ఒకప్పుడు
ప్రతి గింజా చెమట వాసనేసేది
కొన్నేళ్లుగా కన్నీటి వాసనేస్తోంది
ఏడాదిగా ఐతే, నెత్తుటి వాసన!
తొలిసారిగా ఇవ్వాళే
బువ్వ.. గెలుపు వాసనేస్తోంది

చాన్నాళ్ళ తర్వాత
ఆకాశం ఎర్రగా పూసింది
అచ్చు పుస్తకంలో
నాగలి పట్టుకున్న రైతు బొమ్మ
ఈ దేశ పటంలా వుంది
భగత్ సింగ్ చిత్రపటం సరసన
నాకిప్పుడు విజయగీతం పాడుతున్న
రైతు ముఖం కనబడుతోంది
దేశం ఇప్పుడు కొత్తగా
1947 వాసనేస్తోంది

చేపనెత్తికెళ్లిన కొంగ
కొండ మీదికెళ్లాక తినబోతూ
మనసెందుకు మార్చుకున్నట్టు?
మట్టిని మట్టుబెట్టడానికి సిద్ధపడ్డ పులి
వెనుకడుగెందుకు వేసినట్టు?
కొంగ మరేదైనా దొంగ జపం మొదలెట్టిందా?
లేదూ,పులి మరో దారిని వెదుక్కుందా?

ఏదేమైనా
పోరాటానికి కొత్త చూపు తొడుక్కోవాలిప్పుడు
వీచే గాలిని ఒడిసిపట్టి
ఎగురుతున్న జెండా పైకి మళ్లించాలి
రాలిపడ్డ ప్రతి గింజకూ విలువ దక్కాలంటే
పిడికిళ్ళప్పుడే దించేయకూడదు!

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply