బుల్లి బాయ్ వేలాలు – మతం, పెట్టుబడికి మహిళల ఆహుతి

న్యూ ఇయర్ తెల్లవారు ఝామునే ముస్లిం మహిళలకు ఒక దుస్స్వప్నం ఎదురయ్యింది. ప్రముఖ ముస్లిం మహిళల పేర్లు బుల్లి బాయ్ యాప్ లో ఎవరో దుర్మార్గులు వేలానికి పెట్టారు. దీని నేపధ్యానికి వెళ్తే, సరిగ్గా 2014 ఎలక్షన్ కు ముందు 2013లో ముజాఫ్ఫర్పూర్ లో లవ్ జిహాద్ అగ్గి రాజుకుంది. మతోన్మాద మారణకాండ ఎంతో మందిని బలి తీసుకున్నాక, దాదాపు 200 ల ముస్లిం కుటుంబాలు నిర్వాసితం అయ్యాయి. అప్పటి వరకు తమ భూములు సాగు చేసుకుంటూ, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ సామరస్యంతో బతుకుతున్న కుటుంబాలు అవి. చాలా మంది ఉన్నత, మధ్య తరగతి ముస్లిం కుటుంబాలు కూడా మొదటి సారిగా ఈ విషవలయంలో చిక్కుకున్నాయి. దేశంలో ఇతర ప్రదేశాల్లో మత కలహాలు జరిగినా ఇప్పటి వరకు అక్కడ ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది.

2014 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరవాత మరో కొత్త చిచ్చు మొదలైయింది. ట్రిపుల్ తలాక్. అది చాలా రోజులు రగిలి, విడాకులిచ్చిన ముస్లిం పురుషులని నేరస్తులుగా నిలబెట్టే చట్టం బలవంతాన పాస్ చేసి అధికార పక్షం తమ ఆధిపత్యం చాటుకున్నాకే శాంతించింది.

దాని తరవాత సుల్లి డీల్స్ ఆప్ ద్వారా గిట్ హబ్ అనే ఆప్ లో ముస్లిం మతానికి చెందిన ప్రముఖ మహిళలని వేలం వేయడం, వాళ్ళని గురించి కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు, అప శబ్దాలు ప్రచారం చేయడం మొదలైంది. కొన్ని పోలీస్ కేసులు ఫైల్ అయ్యాక, తాత్కాలిక నిశ్శబ్దం పాటించి, మళ్లీ 2022 జనవరి ఒకటిన బుల్లి బాయ్ అనే ఆప్ తో ప్రముఖ ముస్లిం మహిళల వేలం మొదలైంది. ఈసారి ఆరుగురు 20-25 ఏళ్ల లోపు అబ్బాయిలని, అమ్మాయిలని అరెస్ట్ చేశారు.

దేశంలో అడపా దడపా ముస్లిం సముదాయానికి వ్యతిరేకంగా జరిగే ఈ సంఘటనలను ఎట్లా అర్ధం చేసుకోవాలి? బుల్లి బాయి వేలాలను, ఇతర సంఘటనలను సంబంధం లేని నేరాలుగా చూస్తే పొరపాటే.

సంఘ్ పరివారం చేపట్టిన హిందూ రాష్ట్ర స్థాపన, మనువాద పునఃస్థాపన, కార్యక్రమంలో రెండు పాయలు ఉంటాయి. మొదటిది, ఇతర మతస్తుల మీద, కింది కులాల మీద విష ప్రచారం చేసి, కించ పరిచి, జనంలో వాళ్ళ పట్ల విద్వేషం సృష్టించటం. మన చుట్టుపక్కల మనం ఎక్కడ చూడని, ఎక్కడ ప్రత్యక్షంగా అనుభవించని ధోరణులని ఫలానా సముదాయం ఎక్కడో మరో రాష్ట్రంలో నో మరో దేశంలోనో చేస్తున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం. ఇది వరకు ఇవే పుకార్లు గా మన మధ్య వ్యాప్తి చేసేవాళ్ళు. ఇప్పుడీ సోషల్ మీడియా ద్వారా క్షణాల మీద విష ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల ఒక పక్క బహు సంఖ్యాక మతానికి చెందిన వాళ్ళని ఏకం చేసి మరో పక్క రెండు మతాల వారి దృష్టి తమ మహిళల భద్రత, గౌరవం వంటి విషయాలతో సతమతం చేయచ్చు. హిందూ మతస్తులకి లవ్ జిహాద్ పేరిట తమ మహిళలకి భద్రతలేదని పిస్తారు. సుల్లి డీల్స్, బుల్లి బాయి వంటి చేష్టలతో ముస్లిమ్ సమాజంలో అభద్రతా భావాన్ని రెచ్చ కొడతారు. ట్రిపుల్ తలాక్ వంటి వాటితో, తలాక్ని ఇచ్చే పురుషులని క్రిమినలైజ్ చేయటం ద్వారా అభద్రత సృష్టిస్తారు. ఏ కుటుంబ వ్యవస్థలో, సముదాయంలో అయినా, తమ కుటుంబం, కుటుంబ సభ్యుల భద్రత, గౌరవం వంటి విషయాలతో భావోద్వేగాలను రెచ్చగొట్టచ్చు.

రెండవది, ఈ భావోద్వేగాలతో ఇరు పక్షాల జనం సతమతం అవుతున్నప్పుడు దేశ ఆర్ధిక, రాజకీయ వ్యవస్థను పెట్టుబడి దారుల, ఫ్యూడల్ శక్తుల అదుపులో పెట్టేస్తారు. గత కొన్ని ఏళ్లుగా రేజర్వేషన్లు కల్పించే ప్రభుత్వ సంస్థలని ఏ విధంగా విచ్చల విడిగా అమ్మేశారో మనం అంతా చూశాము. ఆర్ధికంగా, రాజకీయంగా ప్రజలని వంచిస్తూ మరో వైపు పితృస్వామ్యాన్ని, మనుధర్మాన్ని బలపరుస్తున్నారు. ఎన్నడూ లేనంత స్థాయి లో సోషల్ మీడియా లో అన్ని మతాల, వర్గాల మహిళలని అవమానించటం, కించపరచడం చూస్తున్నాం.

ఆర్ధికంగా బలహీన పడి, ప్రభుత్వాల నుంచి హక్కులు కాకుండా కొద్దిపాటి మద్దతుని ఆశిస్తూ బతికే ప్రజలైనా, సాంఘికంగా అస్తవ్యస్తం అయిన సమూహాలైనా, తమ దృష్టిని ప్రతిఘటన మీద పెట్టలేరు. మాట్లాడితే ఉన్న సహాయం కూడా పోతుందేమోనన్న భయంతో ఉంటారు. ఇటువంటి సందర్భాల్లోనే రకరకాల వ్యాపారులు ప్రభుత్వాలతో కుమ్మక్కై, సర్వ విధాలా ప్రజల దైన్య స్థితి నుంచి సొమ్ముచేసుకునేందుకు బయలుదేరతారు. ఈ ప్రక్రియనే నఒమీ క్లైన్ షాక్ అండ్ అవ్ స్ట్రాటజీ అంటుంది. ఎప్పటికప్పుడు జనాన్ని తల్లడిల్లజేసే సమస్యలను సృష్టించి, ఆ సమస్యను తీర్చే నెపంతో పెట్టుబడి దారులు వచ్చి మరింత లాభ పడే కార్యక్రమాలు చేస్తారు. దీన్నే డిసాస్టర్ క్యాపిటలిజం అంటున్నారు.

మహిళల మీద దాడులు జరిగితే, ఏ మతంలో నైనా కన్సర్వేటివ్ శక్తుల మొదటి స్పందన ఆడవాళ్లను గడప దాటనీయక పోవడం, వారి నిత్య జీవితాల్లో ఆంక్షలు పెంచడం. వీలును బట్టి చదువుకు, బయట సమాజంతో సంబంధాలకు దూరం చేయడం.

సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమంలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ రాజకీయ అవగాహన, రాజ్యాంగ విలువల పట్ల ఉన్న అవగాహనని దేశానికి ప్రత్యక్షంగా చూపించారు. నిర్భయంగా రాజ్య హింసని, సామాజిక వివక్షని ఎదుర్కొనే శక్తి తమకు ఉన్నదని చాటుకున్నారు. ముస్లిం మహిళలు ఒక రాజకీయ శక్తిగా ముందుకు వచ్చారు.

గత ఎనిమిది ఏళ్ళు గా వార్తలను గమనిస్తే ముఖ్య శీర్షికల్లో లవ్ జిహాద్, ట్రిపుల్ తలాక్, సుల్లి డీల్స్, బుల్లి బాయ్, ఇక ఇప్పుడు హిజాబ్ గురించిన చర్చ, అన్నీ కూడా ముస్లిం సముదాయము మీద వాళ్ళని బలహీన పరిచే అంశాల ద్వారా, మహిళా పక్షపాతం ముసుగులో, దాడి చేయడమే. ఇవన్నీ కూడా మహిళల ఆటోనమీని దెబ్బతీసే విషయాలే. ఒక పక్క మహిళలు సామాజికంగా వాటిని ఎదుర్కొంటుంటే, రాజ్యం దాన్లో కలగ చేసుకుని, ఆ చీలికలని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం.

ఈ పూర్తి కాలంలో డీమానిటైజేషన్, కోవిడ్ లాక్ డౌన్ల వల్ల కలిగిన ఆర్థిక దుస్థితి గురించిన చర్చ చాలా తక్కువ. కేవలం అన్య మతస్తుల పై వ్యతిరేకత ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు కూడా స్వామిజీల ద్వారా మూఢ నమ్మకాలు వంట పట్టించి ఫ్యూడల్ శక్తులు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున బలం సమీకరించుకుంటున్నాయి.

బహు సంఖ్యాక జనం ఈ మతోన్మాదం లో మునిగి పోతే, మైనారిటీస్ కి కూడా తమ మతపరమైన అస్తిత్వాన్ని కాపాడులోవాల్సి వస్తుంది. ఈ కృత్రిమంగా సృష్టించిన అంతర్యుద్ధం మాటున హింస, అధిపత్యధోరణలు బలపడక తప్పదు.

బుల్లి బాయ్ ఆప్ కి సంబంధించిన కేసులో 20-21 ఏళ్ల వయసు పిల్లల్ని అరెస్ట్ చేసారు అని సరిపెట్టుకుంటే పొరపాటే. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ ప్రకారం జరిగిన నేరం. కేవలం ఈ ఆరుగురు పిల్లలు తమంతట తాము చేసి ఉండరు. వెనుక ఉన్న ఎవరి ఆదేశాల మేరకు చేశారో కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరిని నిర్భయ ఆక్ట్ కింద సెక్సువల్ హరాస్మెంట్ నేరానికి బుక్ చేయాలి. ట్రాఫికింగ్ చట్టం కింద కూడా బుక్ చేయాలి. అరెస్ట్ అయ్యాక ఇంతవరకు ఆయా కేసుల్లో ఏం తేలిందో తెలియదు. ఎప్పుడో అందరు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ వాళ్ల కార్యకలాపాలు మొదలు పెడతారు.

ఈ పరిస్థితుల్లో మెజారిటీ కమ్యూనిటీలకు సంబంధించిన మహిళలు, పురుషులు ముందుకు వచ్చి ముస్లిం మహిళలకు మద్దతుగా నిలబడాలి. రాజకీయాల కోసం మహిళలని పావులుగా చేసి, కించ పరిచే కుసంస్కారాన్ని తీవ్రంగా ఖండించాలి. ఒక సారి అటువంటి సంస్కృతి వేళ్లూనుకుంటే అది మనని కూడా వదలదు. ఇప్పటికే ప్రగతి శీలంగా పనిచేసే మహిళా కార్యకర్తల మీద దారుణమైన, అసభ్యమైన వ్యాఖ్యానాలు సోషల్ మీడియా లో వింటున్నాం.

ముస్లిం మహిళల పై జరిగే ఈ దాడిని పలు కోణాల్లో నుంచి ఎదిరించాలి. ఒకటి సాంస్కృతిక కోణం, రెండవది రాజకీయ కోణం, మూడవది ఆర్ధిక కోణం. సాంస్కృతికంగా ముస్లిం సముదాయాన్ని అధిక సంఖ్యాకులతో కలుపుకుని, వారి సంస్కృతిని ఆదరించాలి. వారికి విద్య, ఉపాధి వంటి విషయాల్లో సహకరించాలి. రాజకీయంగా నిర్భయంగా అల్ప సంఖ్యాకుల పక్షాన నిలబడాలి. ఆర్ధికంగా అల్పసంఖ్యాకులు నడిపే వ్యాపారాలను ప్రోత్సహించి సమాజంలో వాళ్ళ భాగస్వామ్యం ఉండేట్టు చూడాలి. అప్పుడే సామరస్యం తో కూడిన శాంతియుత జీవనం అందరికి వీలు పడుతుంది. సమాజంలో కొందరిని వెంటాడి, భయభ్రాంతులను చేస్తే దాని వల్ల ఎవరికీ శాంతి ఉండదు.

రిటైర్డ్ జర్నలిజం ప్రొఫెసర్, ఉస్మానియా యునివర్సిటీ

One thought on “బుల్లి బాయ్ వేలాలు – మతం, పెట్టుబడికి మహిళల ఆహుతి

  1. TOO MUCH POLITICS
    TOO MUCH HATE
    TOO MUCH DIFFERENCES —WHY
    HOW LONG — MORE THEN 75 YEARS INDEPENDENCE
    NEEDS CHANGE — IN OUR HEARTS AND MINDS
    MEN AND WOMEN ALL ARE EQUAL — there is no plus or no minus
    Muslims — treat them with respect
    Treat them with dignity
    THEY ARE OUR BROTHERS AND SISTERS
    LOOK -THINK —ACT
    PROFESSOR PADMAJA JI — AGREE WITH U MADAM — U R RIGHT
    —————————————————————————————

    BUCHIREDDY GANGULA

Leave a Reply