బీ ది రియల్ మేన్!

బారెడు పొద్దెక్కింది. అయినా పిల్లలూ పెనిమిటీ బెడ్ దిగలేదు. కరోనా కాదు గాని క్లాక్ తప్పుతోంది జీవితం. పగలు రాత్రిలా వుంది. రాత్రి పగల్లా వుంది. నిజం చెప్పాలంటే రెంటికీ తేడాలేదు!

ఆఫీసుల్లేవు. బడుల్లేవు. పనుల్లేవు. పాకుల్లేవు. బతుకు లేదు. దేని మీదా శ్రద్ధ లేదు. బుద్ధి లేదు! ఉన్నదల్లా ఫోన్లో వాట్సప్లు చూడడం… టిక్ టాక్లు చూడ్డం… ఫార్వర్డులు చెయ్యడం… మళ్ళీ అవి డిలిట్లు చెయ్యడం… అలసి పోవడం… ఆవలింతలు తియ్యడం… అన్నానికి పిలిస్తే యేదో తిన్నామనిపించడం… చేతులారకముందే మళ్ళీ ఫోన్లు తియ్యడం… ఫేస్ బుక్లు చూడడం… ఆవలింతలు తీస్తూ వేళాపాలా లేకుండా నిద్రపోవడం… లేచి అడ్డూ అదుపూ లేకుండా రోజుకో రకం చిరుతిళ్ళు చేయించుకు తినడం… ఆనక అమెజాన్లోనో నెట్ ఫ్లిక్స్ లోనో సినిమాలూ వెబ్ సీరీస్లూ చూడ్డం… అదయ్యాక టీవీలో ఛానల్స్ మార్చి మార్చి చూడ్డం… చూసిన న్యూసే తిప్పి తిప్పి చూపిస్తే చూడ్డం… మళ్ళీ తినడం… మళ్ళీ నిద్రపోవడం… మళ్ళీ లేవక తప్పకపోవడం…

ఇవన్నీ చూసిన అమ్మకి పిచ్చి లేస్తోంది. ‘రేపు లాక్ డౌన్ యెత్తేస్తే యేమవుతారు వీళ్ళు?’ అనుకుంటే కరోనా వొచ్చినట్టే గజగజలాడిపోయింది. అప్పుడు అమ్మకి ముల్లుని ముల్లుతోనే తియ్యాలనిపించింది!

వెంటనే అమ్మ కత్తి అందుకోలేదు. కర్ర అందుకోలేదు. కనీసం బెత్తం అందుకోలేదు. సొంటిపిక్క కూడా తియ్యలేదు. వెనువెంటనే ఫోను తీసింది. వీడియో రికార్డర్ ఆన్ చేసింది!

అర్థంకాక అరమోడ్పు కన్నులతో యింటర్మీడియట్ పాప లేవకుండానే “యే-మైంది మమ్మీ?” గోముగా అడిగింది!

“బీ ది రియల్ మేన్ ఛాలెంజ్” వొత్తి పలుకుతూ స్టయిల్ గా నవ్వింది అమ్మ!

అంతే… ఆమాట విని బద్ధకం భళ్ళున బద్దలైనట్టు లేచారు హాలీడేస్లో వున్న ఎంప్లాయ్ నాన్న. అడ్డదిడ్డంగా పడుకున్న డిగ్రీబాబు అదిరిపడి లేచాడు. వాడు వీపు మీద చరవడంతో వాడి కాంపెటేటివ్ మావయ్య కూడా రివ్వున లేచాడు. అలా అంతా వొకర్ని చూసి వొకరు లేచి కూర్చున్నారు. పాచిముఖాలు చూపించడం యిష్టం లేనట్టు దొంగల్లా ముఖానికి మోచేతులు అడ్డం పెట్టుకున్నారు!

అంత అవస్థలోనూ “చెల్లీ… మేకప్ లేదు కదా- నిన్నెవరూ గుర్తుపట్టరులే” ధైర్యం చెప్పాడు అన్న డిగ్రీబాబు! ఇంటర్మీడియట్ పాపకు కోపం వచ్చింది.

ఆ కోపం తీర్చుకొనే అవకాశం యివ్వకుండానే “బాగా పొద్దున్నే పది గంటలకు యెవరు నిద్ర లేవగలరు? ఛాలెంజ్” విసిరింది అమ్మ!

ఒక్క వుదుటన బెడ్ మీంచి దూకిన యింటర్మీడియట్ పాప బ్రెష్షూ పేస్టూ నోట్లో పెట్టేసుకుంది. “నా పల్లు యివాళ నేనే తోముకుంటున్నా” అంటూ చకచకా తోమింది. ఆగింది. తనని వీడియో తియ్యమన్నట్టు ముద్దుగా చూసింది. అమ్మ అర్థం చేసుకొని షూట్ చేసింది!

“చెల్లి వాళ్ళ కాలేజీ గ్రూపులో పెడతావా మమ్మీ?” అని అన్న డిగ్రీబాబు అమాయకంగా అడిగినట్టు అడిగాడు. కాని చెల్లి పనులు చెల్లితో చేయించాలని వాడి ఆలోచన. ఆ ఆలోచనని అమ్మకి అర్థమయ్యేలా కళ్ళెగరేశాడు. ‘వీడి వీపు వీడికి కనబడ్డం లేదే?’ అనుకున్న అమ్మ “మీ కాలేజీ గ్రూపులో నీది కూడా పెడతాను…” అని ఫోను తిప్పేసరికి చెంగున వాష్ రూమ్లోకి దూరాడు!

కాంపెటేటివ్ మావయ్య యేదో వొకటి చెయ్యాలన్నట్టు పెట్ డాగుని టబ్లో పెట్టి నీళ్ళు పోసాడు. సబ్బు రాసాడు. స్నానం చేయించాడు. అమ్మ షూట్ చేస్తూ వుండడంతో రెచ్చిపోయాడు. టవల్తో డాగుని చుట్టేసాడు. అది వూపిరాడక కాంపెటేటివ్ మావయ్య చెయ్యి కరిచేసింది. “అమ్మా” అని అరిచాడు. నొప్పి కంటే ఆ నొప్పిని షూట్ చేస్తూ వుండడమే యెక్కువ నొప్పనిపించింది. అందుకే “అక్కా… యిది కూడానా” అన్నాడు యేడుపు ముఖంతో. అని, తప్పించుకోవడానికి “నేను యిమ్మీడియట్టుగా బావగార్ని నామినేట్ చేస్తున్నా”నన్నాడు!

నాన్న న్యూస్ పేపరు తెచ్చి యిస్త్రీ చేస్తున్నారు. అప్పుడు అమ్మ “మా తమ్ముడు మీకు ఛాలెంజ్ విసిరాడు” అంది. నాన్న ఘనకార్యం చేస్తున్నట్టు వీడియోకు స్మైల్ యిచ్చారు. అప్పుడు అమ్మ పాజ్ బటన్ నొక్కి “పేపర్లు ఐరన్ చెయ్యడం కాదు, మీ బట్టలు మీరు ఐరన్ చెయ్యండి. అప్పుడే మీరు ఛాలెంజ్ని స్వీకరించినట్టు” అంది. “ఔను బావగారూ” అన్నాడు చెయ్యి వూదుకుంటూ కాంపెటేటివ్ మావయ్య. “తప్పులేదు, నీకు కుక్క ముక్క తీసేయాల్సింది” కసిగా అన్నారు నాన్న!

ఇంతలో “నా ముఖం నేనే కడుక్కున్నా” మురిసిపోతూ అంది యింటర్మీడియట్ పాప.

అప్పుడే వాష్ రూమ్లోంచి వచ్చిన డిగ్రీబాబు “నా … నేనే కడుక్కున్నా” అని, యేమి కడుక్కున్నాడో అది మింగేసాడు. అయితే అందుకు పనిష్మెంటుగా అన్న డిగ్రీబాబు వీపు వొంచి యింటర్మీడియట్ పాప రెండు పిడిగుద్దులు వేసి అంతదాక వున్న కోపం తీర్చేసుకుంది!

గీతలు కాదు చేతులు అరిగేలా కడిగి కడిగి వచ్చిన నాన్నకు అమ్మ “మీరేఛాలెంజూ స్వీకరించలేదు” అని అనడంతో చపాతీలు చెయ్యడానికి సిద్ధపడ్డారు. చపాతీ ముద్ద అప్పడాల ముద్దలా చేతికి అంటుకొంది. అమ్మ వీడియో పక్కన పెట్టి మళ్ళీ పిండి వేసి కలిపి చక్కదిద్దింది. “ఒక్క రోజు వేషానికి వొళ్ళు కాల్చుకోవడమెందుకు?” అమ్మ నిష్ఠురపడింది. “ఒక్క రోజయినా గెలిపించొచ్చు కదా?” ప్లీజింగుగా ముఖం పెట్టారు నాన్న. “అయితే నేను చేస్తాను, మీరు యాక్టింగు చెయ్యండి చాలు” అంది అమ్మ!

ఆ మాట నాన్నకు గుచ్చుకున్నట్టే వుంది. అందుకని తనే స్టార్ హీరోలా రంగంలోకి దిగారు. అమ్మతో అవసరం లేదన్నారు. ‘సామాజిక దూరం’ పాటించమన్నారు. ఒక్కో ముద్ద తీసి చపాతీగా పాముతున్నారు. పిల్లలు యెంకరేజ్ చేసారు. అమ్మ వీడియో తీస్తూవుంది. కాంపెటేటివ్ మావయ్య వచ్చాడు. చేసిన చపాతీలు లెక్కపెట్టాడు. “పది తక్కువ వొచ్చాయి బావగారూ” అన్నాడు!

నాన్న అర్థం కానట్టు చూసారు. అప్పుడు కాంపెటేటివ్ మావయ్య “మరో పది చేస్తే యెంచక్కా టోటల్ స్టేట్స్ వచ్చేవి” అన్నాడు. అర్థం కాలేదని తెలుగానువాదం కూడా చెప్పాడు. “మన దేశంలో వున్న రాష్ట్రాలకు పది తక్కువ” అంటే, “అంటే పందొమ్మిది” అంది యింటర్మీడియట్ పాప. “మరి కేంద్రపాలిత ప్రాంతాలు యేడు సంగతి ?” నవ్వాడు డిగ్రీబాబు. చూసుకుంటే- నిజమే, వొక్కో చపాతీ వొక్కో స్టేట్ ఆకారంలో వుంది?!

అమ్మ పగలబడి నవ్వుతూ జూమ్ యిన్ చేసింది. “అన్నీ కలిపి పెడితే మన దేశ చిత్రపటం వస్తుంది… కావల్సినంత టైం పాసూ అవుతుంది” అని యింటర్మీడియట్ పాప పడిపడి నవ్వుతోంది. నాన్నకు లోపల కాలినట్టే వుంది. “రా- నువ్వు చెయ్యి” ఆఫర్ యిచ్చారు. ఇంటర్మీడియట్ పాప సిగ్గుపడిపోయి వెనక్కి తగ్గిపోయింది!

“స్టార్ హీరోస్ ‘బీ ది రియల్ మేన్’ ఛాలెంజ్ స్వీకరించి ఆ పని చేసినప్పుడు యెన్ని టేకులు తీసుకున్నారో యేమో పాపం…” వైరాగ్యంగా అన్నాడు కాంపెటేటివ్ మావయ్య!

కనీసం నవ్వకుండా- బేలగా కళ్ళ నీళ్ళతో చూసిన నాన్నను చూసి అమ్మ అంది. “బీ ది రియల్ మేన్’ అన్నారు, తప్పితే వుమెన్ అనలేదు, హ్యూమన్ బీయింగ్ అనలేదు!”

అమ్మ తనకి సంబంధం లేనట్టు వుండిపోవడంతో- యేదయితే అదే కానన్నట్టు నాన్న యుద్ధరంగంలోకి దిగిపోయారు. చపాతీలు పీట మీంచి తీసి పెనం మీద వేసేసరికి మిగతా పది రాష్ట్రాలే కాదు, మరో యేడు కేంద్రపాలిత ప్రాంతాలూ యెంచక్కా తయారయేయి!

నాన్న చపాతీలు కాల్చి వాళ్ళ రిటైర్డు నాన్నకు తినిపించారు. కొడుకు మనసు కష్టపెట్టకూడదని కాదనలేక కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ తిన్నారు తాతయ్య. “అందుకే సినిమావోళ్ళు వేసే వేషాలన్నీ వెయ్యకూడదు…” నాయనమ్మ మాటను యెవరూ పట్టించుకోలేదు!

“అందుకే యిల్లు గుడ్డపెట్టుకోవడం… గడ్డి పీక్కోవడం లాంటి టాస్కులు చూజ్ చేసుకోవాలి” అని డిగ్రీబాబు అంటూవుండగా వాడి ఫ్రెండ్ పక్కింటి బబ్లూ వచ్చాడు. బబ్లూని చూడ్డంతోనే “వొరే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా” అని, “టీవీలో పెట్టిన ప్రోగ్రామ్ ఛానెల్ మార్చకుండా చివరి వరకూ చూడాలి” అని టాస్క్ యిచ్చాడు. రిమోట్ చేతిలో పెట్టాడు!

“కష్టపడి చేసార్రా మీ నాన్న” అమ్మ దిగులు గొంతుకి “మేమూ కష్టపడి తింటాం అయితే” అంది యింటర్మీడియట్ పాప. చపాతీ ప్లేట్స్ సర్వ్ అయిపోయాయి. అప్పుడే టీవీలో కొత్త ప్రోగ్రామ్ మొదలు కాబోతోంది. ‘బస్తీమే సవాల్?’ అని!

“బీ ది రియల్ మేన్ ఛాలెంజ్” అని ట్రెండింగులో వుండి వైరల్ అవుతున్న స్టార్ హీరోలూ డైరక్టర్లూ పొలిటీషియన్లూ చేసిన ఛాలెంజెస్ తో కలిపి చేసిన లైవ్ ప్రోగ్రామ్ అది. మధ్య మధ్యలో లైవ్లో టీవీ ప్రేక్షకులు జాయిన్ అవుతున్నారు. అప్పటికప్పుడు వారు వాట్సప్ చేసిన వీడియోలను ప్లే చేస్తున్నారు. ఆ వాట్సప్ పంపిన వాళ్ళతో మాట్లాడుతున్నారు!

టీవీలో యిస్తున్న ఫోను నెంబరుకు అమ్మ యెక్కడ వాట్సప్ చేసేస్తుందోనని నాన్న కంగారుపడి అంతకుమించి ఆందోళన పడ్డారు. అమ్మ చేతిలోని ఫోను లాక్కున్నారు. అయితే అమ్మ అప్పటికే సెండ్ చేసేసింది… ప్చ్!

“లాక్ డౌన్ మరో రెండు నెలలు కాదు, రెండేళ్ళు పెట్టినా సరే మా ఆయనకు వంట రాదు… వేస్ట్…” అని యిరిటేట్ అయిపోతోంది గడ్డిఅన్నారం నుండి గౌతమి!

“ఈ ఛాలెంజుల నుండి తప్పించుకు పోదామంటే పోలీసులు వొప్పుకోవడం లేదు, ఈ టాస్కుల కంటే పోలీసు ఫోర్సుల దెబ్బలే మేలు” గొణుగుతున్న భర్త వాయిస్ ని రిపీట్ చేస్తున్నారు!

ఆ వీడియో అయ్యాక మరో స్టార్ డైరెక్టరుకు లైవ్ యిచ్చారు. న్యూస్ యాంకరు రాబోయే సినిమాల గురించి లాక్ డౌన్ గురించి అడిగింది. లాక్ డౌన్ లాభాలు చెప్పిన ఆ డైరెక్టర్ మళ్ళీ యిలాంటి మహాదావకాశం మరి రాదని ఎంజాయ్ చెయ్యాలని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడాడు. తాను సినిమాలు చూస్తూ స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నానని చెప్పాడు!

లైవ్ లో వున్న డైరెక్టరుతో ప్రేక్షకులకు మాట్లాడే అవకాశమిచ్చారు. అప్పుడు వో ప్రేక్షకుడు “సినిమాలు చూస్తూ స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నామని చెప్పారు కదా- యీ సందర్భంలో మీకో టాస్క్ యివ్వొచ్చా?” అడిగాడు. “స్యూర్” అని, “వోపెన్ ఛాలెంజుని స్వీకరిస్తున్నా” అత్యుత్సాహంతో అన్నాడు డైరెక్టర్!

“మీరు చెప్పింది చెయ్యకూడదు” అన్నాడు ప్రేక్షకుడు. “వ్వాట్?” అర్థం కాలేదు డైరెక్టరుకు. “రిపీట్ చెయ్యండి” అంది మధ్యలో యాంకర్. మళ్ళీ ప్రేక్షుకుడు “మీరు సినిమాలు చూస్తూ స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నామని చెప్పారు కదా” చెప్పబోతుంటే, “యస్” అని డైరెక్టర్, యాంకర్ పోటీపడ్డారు. “మీరు సినిమాలు చూసి సినిమాలు తయారు చెయ్యడం మానేసి సొంతంగా సినిమాలు చెయ్యాలని టాస్క్…” అంతే- ఆ ప్రేక్షకుడి కాల్ కట్ అయిపోయింది!

“దట్స్ నాట్ కరెక్ట్. కాపీ కాదు, ఇండియనైజ్… లోకలైజ్ చెయ్యడం నార్మల్ విషయం కాదు, యూ నో యిట్స్ బిగ్ ఛాలెంజ్” ముఖం మాడిపోగా అన్నాడు డైరెక్టర్. “య… యా” అంటూ యా గుణింతం చదివింది యాంకర్!

బ్రేక్!

బ్రేక్ టైంలో అమ్మ మీద నాన్న అంతెత్తు లేచారు. నువ్వెందుకు వీడియో సెండ్ చేసావ్?- అని. నా పరువు తీయడం నీకు హేపీ- అని. నన్ను చూసి నలుగురూ నవ్వుకొవాలనీ- అని!

“జస్ట్ ఫర్ ఫన్” మధ్యలో అంది యింటర్మీడియట్ పాప. “నోర్ముయ్” అన్నారు కాదు, అరిచారు నాన్న!

నాన్న వాళ్ళ అమ్మ నాన్నమ్మ “పూటకో వేషం వేసేవాళ్ళ వేషాలు చూసి మనమూ వేస్తే పగటి వేషాలు అనుకుంటారు” అంది. ఆ మాట కొడుకుని వెనకేసుకు వస్తున్నట్టుగా లేదు. అదో వున్న మాట అంటున్నట్టు అయినట్టు అందరూ సైలెంటు అయిపోయారు!

మళ్ళీ నాన్నమ్మే అంది “భార్యకు సాయం చేసేవాడు బజార్లో పడి చెప్పడు” అని. అన్నాక “యెవరు యే పనన్నా చేయనీ, ఆ పనిలోంచి రిలీఫ్ ఫీలవడానికి చేసేదే యింటిపని. దాన్ని ఆడపని మగపని అని విడదీసి చూసేవాడు ఆయింటి మనిషే కాదు. అయినా చేసే పనిని ప్రదర్శనకు పెట్టేవాడు పనిమంతుడు కాదు…” తను చెప్పడం పూర్తి కాలేదు-

బ్రేక్ టైం అయిపోయింది. ప్రోగ్రామ్ మళ్ళీ మొదలు కావడంతో మ్యూట్ తీసి టీవీ ఆన్ చేసారు. ఈసారి శ్రీశ్రీశ్రీ దశదండి పెద అయ్యరు స్వామివారు లైవ్ లోకి వచ్చారు. వారిని “క్వారంటైన్ సమయంలో మీరు యేమి చేస్తున్నారు?” భక్తితో అడిగింది యాంకర్. “మీకూ నాకూ క్వారంటైన్ కాని భగవంతునికి క్వారంటైన్ యేమిటి?” అని నవ్వారు. యాంకర్ యేదో వొకటి మాట్లాడాలన్నట్టు “కరోనాకీ భగవంతునికీ క్వారంటైన్ లేదంటారు” అంది. కవరు చేసుకుంటూ అంతలోనే నవ్వింది. “నేను అనలేదు, నేను భగవంతునికి క్వారంటైన్ లేదన్నాను, మీరు కరోనాని జత చేర్చారు” అని స్వామివారు నవ్వారు. “చరాచర జగత్తులో అంతటా అణువణువునా భగవంతుడు వున్నాడు… సంచరిస్తున్నాడు… చూస్తున్నాడు…” స్వామివారు చెప్పకముందే, స్పాంటేనియస్ గా “భగవంతుడు కరోనాలో కూడా…” అనడం పూర్తికాలేదు. అందుకున్న స్వామివారు “వున్నాడు, మనల్ని హెచ్చరించడానికి ఊ…” అని, మళ్ళీ యేమాలోచించుకున్నారో టక్కున టాపిక్లోకి వచ్చేసి “కరోనా కట్టడికి విష్ణు సహస్ర నామాలు పఠిస్తూవున్నాము” అని చెప్పారు!

“మీరు ఛాలెంజ్ విసిరితే స్వీకరిస్తారా?” యాంకర్ మొహమాటంగా అడిగింది!

“వై నాట్?” ధీమాగా అని, “ఆ భగవంతుడే ఛాలెంజ్ విసిరాడని అనుకుంటాను…” నామాల స్వామివారు నర్మగర్భంగా నవ్వారు!

ఫ్రెండ్ బబ్లూగాడు యిక్కడ “హలో” అనడంతో టీవీలోంచి తలలు తిప్పి చూశాం. ఆ ‘హలో’ టీవీలో ప్రతిధ్వనించింది. “మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి…” యాంకర్ సూచనతో మేం రిమోట్ నొక్కబోతే, వద్దన్నట్టు- వారించి మీరు చూడండన్నట్టు సైగ చేసి అవతలకు వెళ్ళిపోయాడు బబ్లూ!

టీవీలో ఫ్రెండ్ బబ్లూగాడి వాయిస్ “హలో… హలో…”

మేం ఆసక్తిగా చూస్తున్నాం!

“ఎక్కణ్ణుంచి?, మీ పేరు?” యాంకర్. “బబ్లూ ఫ్రమ్ సనత్ నగర్” బబ్లూ గొంతు విని మాగొంతే విన్నట్టుగా యింటిల్లిపాదీ మురిసిపోయాం!

“స్వామివారు మీ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా వున్నారు…” యాంకర్ చెప్పబోతుంటే “భగవంతుడే అతనితో మాట్లాడిస్తున్నాడని అనుకుంటాను…” తన్మయంగా అన్నారు స్వామివారు. అతనిని అతని భక్తులే ప్రశ్నిస్తారని నమ్మకమేమో చాలా నమ్మకంగా వున్నారు!

“నమస్కారం” అన్నాడు బబ్లూ!

“స్వీకరించాం” నవ్వారు స్వామివారు!

“ఛాలెంజ్ కూడా” అని ఆగి “స్వామివారికి మీ ఛాలెంజ్ విసరండి… ఐ మీన్ సమర్పించండి” యాంకర్ తన భాషని నవ్వుతో సరిపెట్టేసింది!

“సార్… యీ ఛాలెంజ్ మీకు మాత్రమే కాదు, హీరోలూ డైరెక్టర్లూ పోలిటీషియన్లూ యెవరైనా స్వీకరించొచ్చు…” బబ్లూ మాటలు పూర్తికాలేదు!

“అందరం యెవరి వృత్తుల్లో వాళ్ళం వున్నా యీ దేశం మన యిల్లు. మనమందరం యింటి సభ్యులం. ఒకే కుటుంబ సభ్యులం. భారతమాత బిడ్డలం. మన యింటి పని మనం చేసుకోవడానికి తరతమ భేదాలు అవసరం లేదు. ఇంకోమాట నాకు విసిరిన సవాల్… ఛాలెంజ్ నీకు కూడా వర్తిస్తుంది… నువ్వూ చేయాల్సివుంటుంది” అని స్వామివారు గర్వంగా నవ్వారు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే!

“కమాన్… మీ ఛాలెంజ్ చెప్పండి” యాంకర్ తొందర పెట్టింది!

“హాస్పిటల్స్ లో- అది గాంధీ కానీ ఉస్మానియా కానీ యెక్కడ వున్నవాళ్ళు అక్కడ పారిశుధ్య పనులు చేద్దాం… సెలవులేకుండా నిరంతరంగా పనిచేస్తున్న మన పారిశుధ్య కార్మికులకు వొక్కరోజు సెలవిద్దాం…” బబ్లూ మాటలు పూర్తికాకుండానే- “ఫోను కట్ అయ్యింది…” అంది యాంకర్!

మేం షాకయ్యాం!

టీవీలో స్వామివారు మౌనముద్రతో వుండి తలవూపుతున్నారు!

బబ్లూ వచ్చి మాపక్కనే కూర్చున్నాడు. మేం వింతగా చూస్తున్నాం!

“ఆకతాయి కాల్…” అని, “లైవ్” అని యాంకర్ సర్దేయబోయింది. అంత తేలికగా తీసిపారేయడం నచ్చనట్టు స్వామివారు “లేదు, అందులో న్యాయం వుంది. కాని న్యాయం ధర్మాన్ని అనుసరించి వుంటుంది. అంచేత న్యాయం కంటే ధర్మం గొప్పది. వృత్తిలో దైవం వుంటుంది గనుక వృత్తి ధర్మం మరీ గొప్పది. ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. డాక్టర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నారని వాళ్ళని సెలవు తీసుకోండని చెప్పి మనం కత్తెర్లూ సూదులూ పట్టుకుంటే యేమవుతుంది? కరోనా మారణాల కంటే యెక్కువ మరణాలకు మనం కారణం అవుతాం… కదా?” అని నవ్వారు స్వామివారు!

“కుక్కపని కుక్క గాడిద పని గాడిద చెయ్యాలంటారు” నవ్వింది యాంకర్!

రిమోటుతో టీవీ పీక నొక్కుతూ “మరి భౌభౌమనాల్సినవి వోండ్ర పెడుతూ- వోండ్ర పెట్టాల్సినవి భౌభౌమని షో చేస్తూ ఛాలెంజులు విసురుతున్నాయే?!” బబ్లూ అన్న మాటలకు యింటిల్లిపాదీ మూగవాళ్ళలా వుండిపోయారు!!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

7 thoughts on “బీ ది రియల్ మేన్!

  1. కరోనా లో ఉన్న గృహ నిర్భందం లో చదవడానికి గొప్ప సరదాగా ఉంది

  2. Bhagundhi. Rao garu
    KOLIMI KI SAVAL MEEDHA SAVAL —CHIRANJEEVI —VENKATESH LU AVASARAMA EDITOR GARU

    1. CHIRANJEEVI —VENKATESH LU AVASARAMA EDITOR GARU- అన్నారు. నిజానికి ఆ వార్త ఆధారంగానే కథ రాయడం జరిగింది. ‘కాదేదీ కథకు అనర్హం’ శీర్షికన ఈసారి ‘వార్తకు కథ’. ఇప్పటికే ఈ శీర్షిక కింద బొమ్మకు కథ, పురాకథకు కథ ఉప శీర్షికల కింద కథలు రాయడం జరిగింది. కొత్తగా కథలు రాస్తున్నవారికి ఉపయోగపడేలా దేన్నయినా ఎలా కథగా చేయొచ్చో – మలచొచ్చో – కొత్త కథకుల్ని ప్రోత్సహించే ఉద్దేశముతో రాస్తున్న నేపథ్యం వుంది. ఒక్కసారి ‘వార్తకు కథ’ ఉపశీర్శికన పాత సంచికలు చూడగలరు.

  3. బమ్మిడి గారు — కొలిమి లాంటి వెబ్ పత్రిక కు — సవాల్ మీద సవాల్ అవసరమా ??పవన్ కళ్యాణ్ దేవుడు –మహా నాయకుడు అం టూ రాతలు –వార్తలు –చిరంజీవి దోస లు వేయడం — వెంక టే శ — గార్డెనింగ్ — యివి కథ లా ?? సాహిత్యమా ??

    *** ఏ కథ అయినా జీవితం లో నుండి రావాలి తప్ప ఊహల్లో నించి కాదు . రాసే కథ గాని నవల కాని ఏది అయినా సరే అప్పటి రాజకీయ వ్యవస్థ నో –ఆర్థిక వ్యవస్థ నో –సాంఘిక పరిస్థితుల నో –ఏదో ఒక దాన్ని ప్రతిబి౦బచెయాలి –సాహిత్యం యిచ్చిన మంచి కి సమాజం బాగుపడుతుంది –రెంటికి పరస్పర స్పందన ఉంటుంది

    life is stranger then fiction ****బీ నా దేవి ఆంధ్రభూమి ,స్వాతి వారపత్రికల కథ ల ను సమీక్షిస్తూ

    బుచ్చి రెడ్డి గంగుల

    1. బుచ్చి రెడ్డి గంగుల గారూ… మీరు నా సమాధానాన్ని మరొక్కసారి చదవండి. దయచేసి అర్థం చేసుకోండి. ‘కాదేది కథకనర్హం’ అనే శీర్షికన నేను కథలు రాస్తున్నాను. ఒక వార్తను తీసుకొని రాస్తే అది ‘వార్తకు కథ’, ఒక బొమ్మ(ఫోటో)ను తీసుకొని కథ రాస్తే అది ‘బొమ్మకు కథ’, ఒక పురా(పాత)కథని తీసుకొని కథ రాస్తే అది ‘పురాకథకు కథ’, ఒక ఎఫ్బీ/వాట్సప్ పోస్టుని తీసుకొని కథ రాస్తే అది ‘ఎఫ్బీ/వాట్సప్ పోస్టుకు కథ’. ఇవన్నీ ఉప శీర్షికలు. వర్తమాన సమాజాన్ని సాహిత్యీకరించడంలో భాగంగా రాస్తున్న కథలు అయినప్పటికీ కొత్తగా రాస్తున్న వాళ్ళకి ఏ అంశాన్ని అయినా కథగా ఎలా మలచవచ్చో చెప్పడము కూడా ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. అందుకనే పాత సంచికలు చూడమని కోరింది. మీరు చూసివుంటే మీకు అర్థమయ్యేది.
      ‘సవాల్ మీద సవాల్’ అనే ఒక వార్త ఆధారంగా నేను ఈ కథను రాశాను. ఆ వార్తని కూడా నేనే పంపాను. దానికీ కొలిమి సంపాదకులకు సంబంధం లేదు. మీ దృష్టిలో అది తప్పు అయితే ఆ తప్పు నాది.
      పవన్ కళ్యాణ్ దేవుడు –మహా నాయకుడు అంటూ రాతలు –వార్తలు : అని అన్నారు. అది యిక్కడ సంబంధం లేని విషయం.
      చిరంజీవి దోస లు వేయడం — వెంక టే శ — గార్డెనింగ్ — యివి కథ లా ?? సాహిత్యమా ??: అని అన్నారు. అది దానికదిగా సాహిత్యం కాదు. కాని ఆ వార్త అన్ని ప్రసార మాధ్యమాల్లో వైరల్ అయినప్పుడు- అది సామన్యుల జీవితంమీద ప్రభావం చూపించినప్పుడు ఖచ్చితంగా అది సాహిత్యంలో భాగం అవుతుంది. అవ్వాలి. పైకి కనిపించే దోసెలు వేయడం, గార్డెనింగ్… వగైరాలు మనల్నిఅంటే సామాన్యుల్ని తప్పుదారి పట్టిస్తాయని, వాటి వెనుక వుండే పనిచేసే భావజాలాన్ని సామాజిక చలన సూత్రాలని పట్టిచ్చేదాక కథ వెళ్ళింది. మీరు దోసెలు వేయడం గార్డెనింగ్ వగైరాలు చేయడం కాదు, విష్ణు సహస్రనామాలు చదవడం కాదు, గాంధీ హాస్పిటల్లో పారిశుద్యపనులు చేద్దామని సవాల్ విసరడం కథా/సాహిత్య ప్రయోజనం. ఏ కులం వాళ్ళు ఆపని చేయాలి- అని చెప్పడంలో భాగమే “కుక్కపని కుక్క గాడిద పని గాడిద చెయ్యాలంటారు” అనే మాట. “మరి భౌభౌమనాల్సినవి వోండ్ర పెడుతూ- వోండ్ర పెట్టాల్సినవి భౌభౌమని షో చేస్తూ ఛాలెంజులు విసురుతున్నాయే?!” అని ముగించడంలో అసలు విషయాన్ని బట్టబయలు చేయడమూ వుంది. బీనాదేవిగారి మాటలకు విరుద్ధంగా వుందని అనుకోవడం లేదు.

    2. బుచ్చిరెడ్డి గారూ, కొలిమి కి చిరంజీవి, నాగార్జున అవసరం లేదు. శీర్షికకు అవసరం పడింది. శీర్శిక ‘వార్తకు కథ.’ కథ రాయడానికి రచయిత ఎంచుకున్న వార్త క్లిప్పింగ్ అది. కథ చదివితే అందులో ఉన్న వ్యంగ్యం అర్థం అవ్వాలి మరి. థాంక్యూ!

  4. ADMIN— THANKS SIR
    బమ్మిడి గారు–సర్
    సెల్ – రిమోట్ కంట్రోల్ కాలం లో — ఈ దోపిడి వ్యవస్థ లో — ప్రచార మాధ్యమాలు ఎంతగా దిగా జారి పోయాయో
    అందరికి తెలుసు –పవన్ కళ్యాన్ గురించి అందుకే రాశాను –దో శ లు వేయడం –గార్డిం నిం గే — చేయడం –సామాన్యుల జీవితం మీద ప్రభావం చూపించినపుడు –సాహిత్యం లో భాగం అవుతుందా ??
    అసలు మనిషి జీవించడానికి దేవుడు — కులం దేనికి — అవసరమా — పని చేయడానికి కులం తో దేనికి ??
    ర చ యితలకు పాఠకుల నా డి తెలియడం చాల అవసరం

    యిక ముగిద్దాం బమ్మిడి గారు

    బుచ్చి రెడ్డి గంగుల

Leave a Reply