కొత్త తొవ్వలు తీస్తున్న బీసీ కవిత్వం

తెలుగునాట 1990ల తర్వాత దళిత సాహిత్య ఉద్యమాలు, దళిత సామాజికోద్యమాలు ఊపందుకున్నాయి. “విదేశీ పాలకుల నుంచి విముక్తి సాధించడం కన్నా సాంఘిక ప్రజాస్వామ్యాన్ని సాధించడమే ప్రధానమనే” మహత్తర సందేశాన్ని జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే అందించారు. అంబేద్కర్ కూడా పూలే మార్గాన్ని అనుసరించాడు. ఈ స్ఫూర్తితో తెలుగునాట దళిత సాహిత్యోద్యమంలో భాగంగా బీసీల సాహిత్య చైతన్యం వెల్లివిరిసింది. తెలుగు సాహిత్యంలో బీసీవాద దృక్పథం పూలే, అంబేద్కర్ సిద్దాంతాలను సొంతం చేసుకుంది. 1990ల తర్వాత తెలుగు వచన కవితా సంపుటాలను పరిశీలిస్తే 1994లో వచ్చిన దెంచనాల శ్రీనివాస్ ”గురితప్పిన పద్యం” కవితా సంపుటిలో బీసీవాద దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది.

”నువ్ తొలిచిన నందీశ్వరులను తలచుకొని లేపాక్షి బసవన్న లేచిపోతాడు
త్రాచుల్ని చంపే నీ నైపుణ్యాన్ని చూసి దేశ దేశాల కమెండోలు తలలు దించుకుంటారు.
కాలుతున్న గుడిసెల మధ్య దూకే నీ చాకచక్యాన్ని ఏడు ప్రపంచ పైర్లింజన్లన్నీ తగలబడిపోతాయి
నువ్ సృజించిన ఇళ్ళూ, నాగళ్ళూ, వెండి మొలతాళ్ళూ, మట్టి గంగాళాలు, కట్టె శిల్పాలూ
ఇత్తడి తాంబాళాలూ, ఇనప పనిముట్లూ, కళా జ్ఞానాల చరిత్ర చెరిపేస్తాయి”
అంటాడు.

1995 జనవరిలో వెలువడ్డ “చిక్కనవుతున్న పాట” దళిత కవితా సంకలనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతటికి ప్రాతినిధ్యం వహించింది. దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు, ఆదివాసీలు – అణచివేతకు గురవుతున్న వర్గాలన్నీ ఒకే వేదిక మీదకు రావాలన్న విశాల ప్రాతిపదికతో ”చిక్కనపుతున్న పాట” కవితా సంకలనంలో అందరికీ ప్రాతినిధ్యం కల్పించబడింది. తర్వాత జరిగిన చర్చల్లో ”ఊరి చివర నివసించే బహుజనులకు, వెలివాడ దళిత బాధ ఎన్నటికీ అర్థం కాదు” అనే భావజాలంతో సతీష్ చందర్ బీసీ కవులు దళిత కవిత్వాన్ని వోన్ చేసుకోవడాన్ని ప్రశ్నించాడు. సాహిత్య రంగంలో పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరిగింది. సామాజిక రంగాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏదో మహత్తరమైన మార్చు దక్షిణ భారతదేశంలో రాబోతుందన్న స్పహను ఆనాటి దళిత బహుజన సాహిత్యం కల్పించింది. ఇదే మాటను ప్రముఖ విమర్శకుడు కె.కె.రంగనాథాచార్యలు రాత పూర్వకంగా, వేదికల మీద పలుమార్లు ప్రస్తావించారు. అలాంటి మార్పులు జరగక పోవడం అస్తిత్వ ఉద్యమాలు, ఆ ఉద్యమాలు కోసం జీవితాలర్పించిన ఎంతో మంది మేధావులకు, సామాజిక ఉద్యమకారులకు చారిత్రక విషాదాన్ని మిగిల్చింది. ఈ తొలినాళ్ల చైతన్యం అణచివేతకు గురైన ఉప కులాల మధ్య కుమ్ములాటలు పెరగడంతో అస్తిత్వ ఉద్యమాలు అనివార్యంగా మరో దారిని వెదుక్కున్నాయి. అది చారిత్రక అవసరం కూడా. ఆ నేపథ్యంలోనే దక్కన్ నేలపైన దళితోద్యమాల ఆత్మగౌరవ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆత్మగౌరవ చైతన్యంతో ప్రాంతీయ ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి. అందులో తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం బలమైన గొంతుకే గాక, ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్.

1996లో జరిగిన చర్చోపచర్చల పర్యవసానంగా కోస్తాంధ్ర ప్రాబల్యం నుంచి బయటపడి తెలంగాణలోని నల్లగొండలో ”నీలగిరి సాహితీ సంస్థ” సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సంపాదకత్వంలో “బహువచనం” దళిత, బహుజన కవితా సంకలనాన్ని తీసుకువచ్చింది. ‘బహువచనం’ అనివార్యంగా బీసీవాద దృక్పథాన్ని తెలంగాణ ప్రాంతీయతను, ముస్లిం మూలవాసీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చింది. తెలంగాణ కవులు ముందు చూపును, ప్రాంతీయ స్పహను, బీసీ కులాల వ్యక్తీకరణను స్పష్టమైన గొంతుకతో చెప్పింది బహువచనం. తెలంగాణలో బీసీ కవులు అద్భుతమైన కవిత్వం ‘బహువచనం’లో రాసారు. అంతకు ముందు తెలుగు వచన కవిత్వంలో లేని స్పష్టమైన కుల సహను బహువచనం కవితలు చిత్రీకరించాయి. కల్లుగీత వత్తిని జీవనాధారంగా చేసుకున్న గౌడ కులస్తుల బాధలను ”ముస్తాదులు కదులుతున్నాయి” కవితలో కొంపెల్లి వెంకట్ గౌడ్ స్పష్టంగా కవిత్వీకరించాడు.

”రకం కట్టేది మేమైతే
చెట్టు మీద జులుం వాడిది
కల్లు గీసేది మేమైతే
ముంత మీద ధర ముద్రించేది వాడు
ఆపై ఆబ్కారోడి నిఘా”
అని తమ శ్రమను తమకు కాకుండా చేస్తున్న దోపిడీ గాళ్లను చూస్తే “మాలో కసి తాటిపీచై చెలరేగుతుంది” అంటాడు.

తెలంగాణ బెస్త, ముత్రాసి కులాలపై దళారీ దోపిడీ చిత్రీకరిస్తూ అంబటి వెంకన్న ”వల ఏరెయ్యక ముందే” అనే కవిత రాసిండు.

”మా పుట్టుకలు మేఘాలై
బతుకులు శోకసముద్రమవుతుంటే
మా వెనుకట్టి మీద లారీలు పెట్టి
మాకు కడుపులే లేనట్టు
మా పొట్ట పేగులు కూడా వేపుకుపోతున్నారు
దొరలు-దళారులు”
అంటూ చెరువుల్లోంచి వేటాడి తీసిన మత్స్య సంపదను ఎగుమతుల పేరిట దళారీలు దోచుకుంటున్న తీరును అద్భుతంగా వర్ణించాడు.

అలాగే ఎం. వెంకట్ ”గంగమ్మ”కవితలో నదుల్లో, వాగుల్లో, ప్రమాదపు అంచులో తారట్లాడే బెస్తవారి జీవన కల్లోలాన్ని అద్భుతంగా కవిత్వీకరించాడు.
”చేపలతట్ట మోస్తూ అమ్మ
వంటి నిండా నీసు నింపుకొని
ఉప్పు చారలతో మెరుస్తూ
తీరం వెంట నడుస్తుంది సముద్రంలా
నీటి మీదికి వెళ్లిన అయ్యను జూస్తూ
తిరిగి రాకకై అమ్మ కళ్లు జెన విడుస్తున్నయి “
అంటూ గంగమ్మ కవితలో వాస్తవికంగా

నేత కళాకారుడు, రాజయ్య హస్త కళా కౌశలాన్ని”ఓ రాజయ్య కథ” కవితలో వివరిస్తూ ఆచార్య ఎన్. గోపి…
”అవి పట్టు చీరలు నేసిన అద్భుత హస్తాలనీ
బట్టపై బంగారు శిల్పాలు నాటిన
కళా విజయ కేతనాలనీ మనకు తెలుసు
లోకాన్ని జలతారు ముసుగుల్తో కప్పినవాడికి
పిర్రల మీద ధోతి చిరుగులెందుకున్నాయో కూడా మనకు తెలుసు?”
అంటూ, రాజయ్య జీవితంలోని విషాదాన్ని కళ్ళకు కడతాడు.

సీతారాం ”రెజ్యూమ్” కవితలో మొత్తం బీసీ కులాల చైతన్యాన్నే హృద్యంగా చిత్రీకరించాడు.
”మేమెవరం?
చాకళ్లం, మంగళ్లం
చౌడు సున్నాలు, సన్నాసులం
గాడిద బరువులా ముట్టు మూటలం, ఇస్త్రీ పెట్టెలం
ఆదరణ అంతగా లేని పౌరులం”
అంటూ మొత్తం బీసీ కులాల జీవన విషాదాన్ని ఆవిష్కరిస్తాడు. “ఏమైతేనేం? మేం బీసీలం” అంటాడు.

భారతదేశంలో సామాజిక జీవన చక్రం నడవడానికి మూలకారకులైన బీసీలు ప్రతి క్షణం అడుగడుగునా అవమానానికి గురికావడాన్ని బీసీ కవులు తీవ్రంగా తమ కవిత్వంలో నిరసించారు. నిజానికి ఈ చైతన్యం మహోన్నతమైన సామాజిక ఉద్యమంగా రూపు దాల్చాల్సి ఉండె. అలా జరగకపోవడం వల్ల సామాజిక మార్పు మరి కొన్ని సంవత్సరాలకు వాయిదాపడింది.

కోస్తా ఆంధ్రా ప్రాంతంలోని కళావంతుల కుటుంబాల గూర్చి, ఆంధ్ర తెలంగాణ ఇతర ప్రాంతాల దేవదాసీ కులాల జీవితాల విషాదాన్ని మొదట కవిత్వీకరించింది బీసీ కవులే. ఏ మాత్రం ఆత్మ న్యూనతా భావం లేకుండా కవులు సామాజిక చైతన్యంతో ఈ విషాదాన్ని కవిత్వంగా మలిచారు. ప్రసేన్ “కన్నీటి నది దోచుకెళ్లిన నావ నా పద్యం” అనే కవితలో అద్భుతంగా చిత్రించాడు.

ఏ. దుర్గా ప్రసాద్ ”దేవదాసి” కవితలు ఇదే బాధను వ్యక్తీకరించాయి. పగడాల నాగేందర్ ”సుద్ది” కవితలో ఇదే విషయాన్ని సాధారణీకరించి రాశాడు.
జోగిని వ్యవస్థ వికృత రూపాన్ని పగడాల నాగేందర్ ”సుద్ధి” కవితలో ఇలా ఆవిష్కరిస్తాడు.

”గుడి వాకిట్లో జోగినులై తల్లులు
ఎంగిలి తట్టల్లో మానాన్ని
పలారంలా పంచిన కళాజాతోణ్ని
మీ అనుమానపు చూపుల్లో
తరాల అవమానాల పుండును మోస్తున్న
………
ఎనకబడ్డ కులాల ధిమికి ధిమికి దరువుల్లో
ధ్వజస్తంభాలు దొరల గడీలు కూలుతుంటే
పురుడు బోసుకున్న గీ నేలంతా
తంగేడు పూల వనంలో
బాలసంతు పాటై మోగుతుంది”
అంటూ జోగినీ వ్యవస్థను పెంచి పోషించిన ధ్వజ స్తంభాలు, దొరల గడీలు కూలుతున్న ఒక చారిత్రక సందర్భాన్ని కవి చిత్రించాడు.

జూలూరు గౌరీశంకర్ “కట్టు” కవితలో కమ్మరి జీవితంలోని ఘట్టాలను హృద్యంగా ఆవిష్కరించాడు.
”అరిగిన కాలం అరికాళ్లకు నాడాలు కొట్టి
ఊర్ల పుట్టుకకు ముగ్గులు పోసిన
గుమ్ముకు రాశులకు రెక్కలు
కంచర రాజయ్య, వడ్ల వీరభద్రయ్యలు
నే కొలిమి తిత్తి గొంతుకనై
వూదీ వూదీ
మంటకు మాటలు నేర్పాకే
చరిత్ర ప్రసవం”
అంటూ లోక సంచార వుత్తి వారి ప్రాధాన్యాన్ని విషాదంగా చిత్రిస్తాడు.

డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ “మొద్దు మీద కత్తి” కవితలో కటిక కులం బాధల్ని, అవమానాల్ని గొప్పగా ఆవిష్కరించాడు. తన జీవితానుభూతులతో, అనుభవాలతో ముడిపడ్డ ఈ కవిత వేదనామయమైన కటిక కులపు” బాధలను ఆవిష్కరిస్తోంది.
“మరిచిపోయిన నా కులాన్ని ఎవడో కెలుకుతున్నాడు
నా గాయంపై ఎవడో కారం చల్లుతారు.
వెండితెరకు నా కులాన్ని హేళనగా వేలాడదీసినప్పుడు
ఎక్కడో ఓ మూల – నా మూలాన్ని నన్ను తొలుస్తున్నట్లు బాధ
……..
కరగని కఠిన శిలలకు పాకుడు పట్టిన
పాషాణ హృదయాలు… కటికోణ్ని పర్యాయపదంగా పలవరించినప్పుడల్లా
నా ఒల్లంతా జలజలమని వణికిపోతుంది.

మనుషుల్ని తెగనరికేవాడు మహానేతగా చలామణి అవుతారు
మేక మాంసాన్ని అమ్ముకునే వాడు నీచుడని,
కటికవాడని గీతలు గీసిన
ఏ మనువుగాడైన

మొద్దు మీద కత్తికి సాన…”
అంటూ ఎస్వీ సత్యనారాయణ తన కులం జీవితంలో మమేకమైన బాధకు, ఆవేదనకు ఈ కవితలో అక్షర రూపమిచ్చాడు.

1990ల తర్వాత ఇలా వృత్తులను ఆధారం చేసుకొని తెలుగునాట బీసీ కవిత్వం పోటెత్తడం నిస్సందేహంగా బహుజనోద్యమాల స్ఫూర్తే. ఆలస్యంగానైనా పూలేని భారతదేశాన్ని ముందుకు నడిపించే స్ఫూర్తి దాతగా బీసీ కవులు గుర్తించారు. 1990ల తర్వాత వచ్చిన వచన కవుల్లో మొదటగా దెంచనాల శ్రీనివాస్ (గురితప్పిన పద్యం), ఆ తర్వాత ‘బహువచనం’, ‘మేమే’, ‘మొగి’ సంపుటాల్లో కూడా బీసీ కవిత్వాన్ని అత్యద్భుతంగా రాశారు. విడిగా డా. ననుమాస స్వామి, బాణాల శ్రీనివాసరావు, సిద్ధార్థ, బెల్లి యాదయ్య, ఎం.వెంకట్, తమ్మనబోయిన వాసు మొదలైన కవులు బలమైన బీసీ వాద కవిత్వాన్ని రాశారు.

కుల నిర్మూలన అనేది కుల చైతన్యంతో ముడిపడి ఉంది. శారీరక శ్రమ చేయకుండా, కేవల కాల్పనిక, ఊహాజనిత భ్రమల లోకాన్ని సృష్టించి అవాస్తవిక జగత్తులోకి మనిషిని లాక్కెళ్లి మానసికంగా నిర్వీర్యుణ్ని చేసింది బ్రాహ్మణవాదం.
ఒక కవి అన్నట్లు…
”ఎప్పుడైతే దేవుడు పుట్టాడో
ఎప్పుడైతే విధిరాత నుదుటి మీద లిఖించబడింది అన్నారో
అప్పుడే మనిషి చచ్చాడు
కర్తవ్యం చచ్చింది”.

ఇది కాల్పనిక జగత్తు పై కవి సంధించిన అస్త్రం. ఈ నిజాన్ని గుర్తు చేస్తూ బీసీ కులాలు చేసే శ్రమను బ్రహ్మణులు కించపరిచి చిన్న చూపు చూడడాన్ని కంటే ఐలయ్య తీవ్రంగా తన కవితలో నిరసించాడు.
”కుండబోత వానలో నిప్పు కావాలంటే
నువ్వు అగ్ని దేవుడి కోసం
తలకిందులుగా తపస్సు చేస్తావే

నేనైతే చెకుముకి రాయితీని
కాసింత దూది పెట్టి
ఒక్క దెబ్బతో మంట పుట్టిస్తాను

చలి కాలమొచ్చి వణుకు పుడితే
నువ్వు భగమంతుడా కాపాడమని
పొర్లుతావు

నేను కమ్మరన్న ఇచ్చిన కత్తెర జుట్టు
గొర్రె బొచ్చు కత్తెరేసి
కంబలి నేసి కప్పుకుంటాను…”
బ్రాహ్మణుల భావజాలాన్ని పూర్వ పక్షం చేసి, బీసీ సామాజిక వర్గాల జీవన చైతన్యాన్ని సగౌరవంగా ప్రకటించిన కవిత్వమిది. అహేతుకతను నిరసిస్తూ, హేతుబద్ధతను సమర్థిస్తూ కంచె ఐలయ్య మళ్ళీ లేవకుండా బ్రాహ్మణవాద వేదాంత ప్రపంచాన్ని చావుదెబ్బ తీశాడు. మంత్రాలకు చింతకాయలు రాలవన్నది ఎంత భౌతిక సత్యమో, ఇది అంతే భౌతిక సత్యం. ఆదిమ కాలంలో నిప్పును పుట్టించింది బీసీ శ్రమజీవులే అన్న ధ్వని ఈ కవితలో ఉన్నది.

చలిని ఎదుర్కోవడానికి గొర్రె బొచ్చును కత్తిరించడానికి కమ్మరి కత్తెరను వాడడం, గొంగడి నేసిన గొల్లవాడి వ్యక్తి చైతన్యాన్ని ప్రస్తావించడం ఈ కవితలో గొప్ప గుణం. పురోగతి చెందే ఏ సమాజమైనా అవాస్తవాలను వ్యతిరేకిస్తూ, వాస్తవాల వైపు పయనించాలి. కాని విచిత్రంగా రాజకీయ రంగంలో అవాస్తవాలను, అ
హేతుకతను నెత్తి మీద పెట్టుకొని సమర్థించే పార్టీలే అధికారంలోకి రావడం, 70 ఏళ్ళ సామాజిక చైతన్యాన్ని నిర్వీర్య పరిచే ఒక చారిత్రక విషాదం. మన పయనంలో వైఫల్యాలు ఎక్కడున్నాయో నిలబడి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈనాటి పురోగామి శక్తులన్నింటిపైనా ఉన్నది.

బీసీ కవులు తమ తాత్విక మూలాల్లోంచి సమాజాన్ని అర్థం చేసుకున్నారు. బీసీ కవుల కవిత్వం ఆర్ధం చేసుకోవాలంటే విమర్శకులు కూడా వారి సామాజిక తాత్విక కోణంలోంచి సమాజాన్ని చూడాలి.

బీసీ వాదాన్ని ఒక చైతన్యంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో మార్చి 2001లో ”వెంటాడే కలాలు” అనే బీసీవాద కవితా సంకలనం వచ్చింది.

మొదట తెలుగులో దళితవాద కవిత్వంలో ఒక పాయగా మొదలైన బీసీవాద కవిత్వం 1995-2000 మధ్యన ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంది. దీనికి అనేక సామాజిక కారణాలున్నాయి. అటు అగ్రకులాల నుంచి అనాదిగా ఎదురవుతున్న అవమానాలనే గాక, ఇటు కింది కులాల నుంచి మీరు మాతో సమానమైన పీడితులు కారు” అనే ప్రశ్నను అదనంగా బీసీవాద కవులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంత డీక్యాస్టిఫై అయి దళితవాదుల ఉద్యమాలతో బీసీ కవులు, బీసీవాదులు, బీసీ సామాజిక ఉద్యమకారులు కలిసిపోయినా, ముందు నడిచినా వారిని అనుమానపు చూపులతో దళితవాదులు ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. తమ వెంట కలిసి నడిచే బీసీవాదులను కలుపుకుపోవడం అటుంచి మీరు హిందూత్వవాదుల్లో భాగమే అంటూ సూటిపోటి మాటలతో గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ ఇతరేతర వ్యాసాలతో దాడిచేస్తూ బీసీ మూలవాసీ చైతన్యాన్ని తూట్లు పొడుస్తున్న కొందరు దళితవాదులూ ఉన్నారు. ఇది ఏ దోపిడీ వర్గాలకు ప్రయోజనకారి అవుతుందో వారి విచక్షణకే వదిలేయడమే గాక వారిపై ధర్మబద్ధమైన పోరాటం చేయాల్సిన సామాజిక బాధ్యత బీసీ కవులపై, బీసీవాదులపై ఉన్నది.

జననం: నల్లగొండ. కవి, కథకుడు, విమర్శకుడు. రెండు దశాబ్దాలుగా ఆధునిక సాహిత్యంలోని అనేకానేక అంశాలపై రచనలు చేస్తున్నారు. 'జంగం కథ - ఒక పరిశీలన' అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్,  'సమకాలీన తెలుగు వచన కవిత్వం-ప్రాంతీయతా ద్రుక్పథాలు' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేశారు. రచనలు: మొగురం(సాహిత్య వ్యాసాలు). ప్రస్తుతం హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

One thought on “కొత్త తొవ్వలు తీస్తున్న బీసీ కవిత్వం

  1. ఇంకా పదుల సంఖ్యలో బీసీవాద కవిత్వముంది. దీన్ని సమగ్రం చేయాలి. అలాగే ఈ వ్యాసం ఇదివరకు సబాల్టర్న్ లో వొచ్చింది అని కూడా చెప్పాల్సింది.

Leave a Reply