బీర్నీడి కవులు – 2

బీర్నీడి ప్రసన్న వ్రాసిన మరొక కావ్యం తుకారా . శ్రీకృష్ణదేవరాయల చారిత్రక మహాకావ్యము అని బ్రాకెట్ లో చెప్పబడింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురణ. 1978 ఏప్రిల్ నెలలో ప్రచురితం. దీనికి విశ్వనాథ సత్యనారాయణ విపుల పీఠిక వ్రాసాడు. ( పీఠికలు -1, 1995,పు 323-328) ఈ కావ్య స్వరూప స్వభావాలు తెలుసుకొనటానికి ప్రస్తుతానికి ఇదే  ఆధారం. 

తుకారా శ్రీకృష్ణ దేవరాయలు ఓడించిన గజపతుల కూతురు.గజపతి వంశస్థులు ఆంధ్రా నుండి ఒడిశా బెంగాల్ ప్రాంతాలకు విస్తరించి రాజ్యం చేస్తున్నారు. వాళ్ళ పై శ్రీకృష్ణదేవరాయలు చేసిన యుద్ధం కళింగనగర యుద్ధంగా ప్రసిద్ధి. ఆ యుద్ధంలో ఓడిపోయిన గజపతి రాజు ప్రతాపరుద్రదేవ తన కూతురిని శ్రీకృష్ణ దేవరాయలకు ఇచ్చి వివాహం చేసాడు. ఆమె పేరు తుక్కాదేవి. జగన్మోహిని , లక్ష్మీ దేవి అనే పేర్లతో కూడా ఆమె ప్రస్తావించబడింది. ఆ తుక్కా దేవిని కేంద్రంగా   చేసి  వ్రాసిన కావ్యమే తుకారా. ఇది ఆరు ఆశ్వాసాల పద్య కావ్యం. తండ్రిపై యుద్ధం చేసి  ఓడించి తనను  పెళ్లాడిన కృష్ణదేవరాయల పై ద్వేషంతో పాగా తీర్చుకొనటానికి పడకటింట కత్తి దూసిందని తిమ్మరుసు ఆమె ప్రయత్నాన్ని భంగపరిచి కృష్ణదేవరాయలను కాపాడదని కథ ఒకటి వ్యాప్తిలో ఉంది. దానిని స్వీకరించి అవసరమూ ఔచితీవంతమూ అయిన కల్పనలతో కావ్యంగా పెంచి వ్రాసాడు ప్రసన్న. 

విశ్వనాథ సత్యనారాయణ తన పీఠికలో కృష్ణదేవరాయలకు తుకారా కు సంబంధించి ప్రచా రంలో ఉన్న కథలను ప్రస్తావిస్తూ వాటిలో దేనిని ఎందుకు కవి పరిహరించాడో , ఎందుకు స్వీకరిం చాడో వివరించాడు.  కృష్ణదేవరాయలు యుద్ధంలో సాధించిన విజయానికి కానుకగా తుకారా లభించింది అన్న లోక ప్రసిద్ధ అంశాన్ని పక్కకు పెట్టి అసలు తుకారాను పొందటం కోసమే అతను యుద్ధం చేసినట్లు ప్రసన్న కల్పించాడు. ఒక చిత్రకారిణి తుకారా బొమ్మ గీసి చూపిస్తే ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆయన యుద్ధానికి వెళ్లినట్లు కల్పన చేసాడు. అంతే కాదు ఆ చిత్ర కారిణి గీసిన చిత్రములను కృష్ణదేవరాయలు చూడటంగా కల్పించబడిన ఈ   ప్రధమాంకం ఉత్తర రామ చరిత నారకం ప్రధమాంకంలో భవభూతి  కూర్చిన చిత్రపట సందర్శనం వంటిదని కూడా విశ్వనాథ సూచించాడు ఈ పీఠికలో.  

 తుక్క పడకగదిలో భర్త గుండెలలో కత్తితో పొడవటానికి సిద్ధం అవుతున్నదని తెలుసుకొన్న తిమ్మరుసు రాయల స్థానంలో బొమ్మను చేయించి పెట్టడటం ,గుండెను తేనెతో నింపి పెడితే పొడిచి రక్తం రుచి చూసిన ఆమె తియ్యటి రక్తంకలిగిన రాజు ఎంత మహాత్ముడో అని ఆమె దిగులు పడటం ఒక కథ కవి దానిని పరిహరించాడు. పడకటింటికి ఆమె కత్తి తేలేదు. ఆమె ఒడ్డాణమే కత్తి. శరీరం అలంకారంలో భాగం. కృష్ణదేవరాయలు నిద్రిస్తున్నప్పుడు కాక అతను యథాలాపంగా ఉన్న తరుణంలో ఆమె ఒడ్డాణం తీసి చంపబోయిందని, తిమ్మరుసు వచ్చి అడ్డుకొన్నాడని కృష్ణరాయలు ఆమెను చంపబోతే తిమ్మరుసు వారించాడని ఆమె అడవులలోకి వెళ్లిపోయిందని కవి కల్పించాడు. 

అడవికి వెళ్లిన తుకారా తపస్సు చేసి కృష్ణరాయల విరహంతో సన్యాసినిగా జీవితం గడుపుతూ  అక్కడ ఒక మహానగరాన్ని నిర్మించుకొని  పాలిస్తున్నదని కవి మరొక కల్పన చేసాడు. రాజు వేటకు వెళుతుంటాడు కానీ ఒక పెద్ద కొండ ఆ అడవికి ఆమె నిర్మించుకున్న నగరానికి మధ్య ఉండటం వలన వాళ్ళు ఎప్పుడూ ఒకళ్లకు ఒకళ్ళు తటస్థపడలేదు అన్నది మరొక కల్పన. మరి వాళ్లిద్దరూ చివరకు ఎలా కలిశారు? తుక్కాదేవి తుమ్మెదల మీద వ్రాసిన అయిదు శ్లోకాలు తుక్కా పంచకం అనే పేరు మీద ప్రసిద్ధి. అడవికి వెళ్లిన రాయలు  ఆ శ్లోకాలు వినో , చదివో ఆమెను స్వీకరించాడని ఒక కథ ఉంది కానీ ప్రసన్న దానిని ఉపయోగించుకోలేదు. మొదట్లో ఏ చిత్రకారిణి అయితే తుకారా బొమ్మ గీసి ఆమె పట్ల రాయాలలో ప్రేమ కలిగించిందో ఆ చిత్రకారిణి వల్లనే వాళ్ళిద్దరికీ కలయిక సాధ్యమైనట్లు కల్పించాడు. ఈ మొత్తం కల్పన లోని చమత్కారాన్ని, ఔచిత్యాన్ని విశ్వనాథ అభినందించాడు. 

నిర్వచన పద్య గ్రంధం  వ్రాసి ప్రబంధ కవుల సరసన పేర్కొన దగిన కవితా శక్తిని ప్ర దర్శించాడని, శబ్దజాల సమృద్ధి ఉన్నవాడిని, చిన్న చిన్న దోషాలు ఉన్న పరిగణించదగినవి కాదని, ప్రసన్నకవి తన అభ్యాసం చేత,  పాండిత్యం చేత, మెలకువ చేత పద్యరచనా శిల్ప కౌశలం ప్రదర్శించాడని మెచ్చుకున్నాడు విశ్వనాథ. తుకారాకు, లక్ష్మణుని భార్య ఊర్మిళకు పోలికలు చూస్తూ, చూపుతూ చక్కటి వర్ణనలు చేసాడని ఉత్ప్రేక్షలు అబ్బుర పరుస్తాయని సోదాహరణంగా వివరిస్తూ ఈ పీఠిక వ్రాసాడు. 

 ప్రసన్నకవికి తమ్ముడు  బీర్నీడి విజయదత్తు. 1934లో పుట్టాడు భాషా ప్రవీణ  అతని విద్యార్హత. సంస్కృతం బాగా చదువుకున్నాడు.  విద్వాన్ పరీక్షకు  సంస్కృత పాఠాలు చెప్పిన గురువుగా ప్రసన్న కవి తమ్ముడి గురించి చెప్పుకొన్నాడు.  విజయదత్తు భార్య మరియమ్మ. విజయదత్తు 31 సవంవత్సరాల చిన్నవయసులోనే మరణించాడు. తమ్ముని మరణానికి ప్రసన్నకవి దుఃఖం ఆపుకోరానిదై పృధ్వీ భాగవతము(1967) కృతి స్కంధంలో పద్యాలై (ఏడు) ప్రవహించింది.     మోషే వంశపు మొలక, తన వెనుక పుట్టిన తోబుట్టువు, లేత ఇల్లాలిని, చిన్నపిల్లలను వదిలేసివెళ్లిపోయాడు అన్న దుఃఖం కన్న “ తెలుగు రస భాండము బాదాబదలుగా( బ్రిదిలి “ పోయిందన్న దుఃఖం మరీ ఎక్కువ అనుభవించాడు.  

 అమృతము చిమ్మలై చిలపలై మొలిపించు సుందరీ

 సుమ సుషుమారుణా ధర రుచుల్ రసవంతపు ద్రాక్షవల్లి ము 

గ్ధ మధుర మోహనమ్ములు పదార్ధములెన్నొ !యమర్చి నీవు స్వ 

ర్గ మొకటి దింపినా వుమరు ఖాయము పైడి పదాలమీదుగా”  అనే పద్యంలో ఉమర్ ఖయమ్ రుబాయతుల ను ఆధారంగా చేసుకొని విజయదత్తు వ్రాసిన స్వర్గావతరణం కావ్యాన్ని ప్రస్తావించాడు. ఇది  అలభ్యం. 

‘అంతర్వాణి’ విజయదత్తు వ్రాసిన ఖండకావ్యం. ఇది ఆయన మరణానంతరం పదేళ్లకు  1975 లో ప్రచురించబడింది. ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల ఆంధ్రోపన్యాసకులు ఆర్. ఆర్.  సుందరరావు ‘దర్పణం’ అనే శీర్షికతోను  , చర్ల గణపతి శాస్త్రి ‘ఉత్తేజనం’ అనే శీర్షిక తోను ముందుమాటలు వ్రాసారు. సుందరరావు ముందుమాటలో కూడా స్వర్గావతరణం కావ్య ప్రస్తావన ఉంది. ఆయనను ఆధునిక కవి , భావకవి అని పేర్కొన్నాడు. తన మిత్రుడైన యస్వీ స్వామికి అంకితం చేయాలని అంతర్వాణి ఖండికల సంపుటిని విజయదత్తు స్వయంగా సమకూర్చి నట్లు తెలుస్తున్నది. అధికభాగం యస్వీ కి వ్రాసిన ఉత్తరాల రూపంలో ఉన్నదట. బహుశా విజయదత్తు తాను ఖండిక వ్రాసిన వెంటనే కానీ, అచ్చయిన వెంటనే కానీ తనమిత్రుడికి ఉత్తరం వ్రాస్తూ అందులో ఈ ఖండికను చేర్చి పంపి ఉండవచ్చు. అలా ఉత్తరాలు అందుకొన్న మిత్రుడు వాటన్నిటిని సుందరరావు కు ఇచ్చి ఖండికలను వేరుచేసి ఒక ప్రతిని తయారు చేసి ఇమ్మని కోరితే ఈ కావ్యం తయారైంది. హైదరాబాద్ , లలితా ప్రెస్ లో అచ్చు వేయించే పని కూడా ఆయనే చేసినట్లు ఉన్నది. అచ్చువేయించింది మాత్రం యస్వీ అనబడే ఆ మిత్రుడు  ఎస్ వేంకట స్వామి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా లోని చెల్లూరుకు చెందిన పంచదార ఫ్యాక్టరీ అధినేత. 

యస్వీ స్వామికి అంకితంగా వ్రాసిన అయిదు పద్యాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎంతటి సున్నితమో, హృదయ సంవేదనలను పంచుకొనే సన్నిహితమో చెప్తాయి. ఓయీ అని సంబోధన తో మొదలుపెట్టటంలోనే ఆ స్నేహ గాఢత వ్యక్తం అవుతుంది. “ ఇది మనోజ్ఞ కళా రూపమెత్తుకొన్న /మానసిక వేదనా చ్ఛాయ !మన యిరువురి / ప్రాణ మైత్రికి చిన్నారి ఆనవాలు / నా నవ కవిత్వ మసృణ మందారమాల” అన్న మొదటి పద్యం దానికి అద్దం  పట్టింది. దుఃఖాలు పంచుకొనే స్నేహం. సాహిత్య అనుభవాలను పంచుకొనే స్నేహం ఈ పద్యాలలో కనిపిస్తాయి. 

అంతర్వాణి ఇందులో మొదటి ఖండిక. దానితో కలిపి మొత్తం 17 ఖండికల సంపుటి ఇది. బీర్నీడి కవులు ప్రధానంగా పద్య సంప్రదాయ కవులు. విజయదత్తు వచన కవితలు కూడా వ్రాయటం విశేషం. వీటిలో ఆరు అలాంటి కవితలు ఉన్నాయి. పద్యంలో కూడా అతని సంవేదన  ఆధునిక జీవిత సంబంధి కావటం గమనించవచ్చు.

స్వర్ణాక్షతలు అనే కవిత మిత్రుడి పెళ్లి సందర్భపు అభినందన పద్యాలు. ఆ  మిత్రుడు ఈ కావ్యాన్ని ప్రచురించిన , అంకితం తీసుకొన్న యస్వీ స్వామి ఒకరే. “ చందమామకు ప్రేమ సందేశమందించు మెలకువల్ కలికి   చుక్కలకు నేర్పి ..” అనే ప్రారంభ పద్యంలో మా స్వామి అన్న ప్రయోగం దానిని సూచిస్తుంది రెండవ పద్యం వధువు రత్నమాల అని  చెప్తుంది. ‘నీ సౌందర్య సమీక్షకున్ దగిన మాణిక్యంబు చేజిక్కె’నని అభినందించి సంసార సారస్యం చూరగొనుమని ఆశీర్వదించాడు. తెలుగు భాషాదేవి సేవకుడిగా , అజ్ఞాత కవితల ప్రచురణ కర్తగా , పేదల కష్టాల పట్ల చలించి సహాయపడేవాడిగా తన మిత్రుడి ప్రత్యేకతలను ప్రస్తుతించాడు.

 బహుశా ఆ మిత్రుడికే ఉత్తరాలుగా వ్రాసిన కవితలు  కలలో , నేస్తం, స్వగతం. కలలో ‘అపుడు నేను నేను గా లేను / నేను నీవట’ అంటాడు కవి తన మిత్రుడితో. ‘ఆత్మ నాది / రూపం నీది’ అనే స్థితి. నేస్తం లో తన అనుద్యోగ దుస్థితిని మిత్రుడితో పంచుకొనటం ఉంది. నీవే నేను అనుకొనే   స్థితి నుండి నేను ఎవరిని అని తనగురించి తాను ఆలోచించుకొనే స్థితికి జరిగిన పరివర్తనం గురించి చింత పడతాడు. “ సంధ్యకేసి చూసి / నీవు – అది సౌందర్య సమ్పత్తి అని / నేను నిప్పుల కుంపటి అని / ఇట్లా ఎన్ని భేదాలు పోయినా / మన స్నేహ బంధం /ఆవిచ్ఛిన్నమూ , దృఢమూ / అనే కలబలుకు కుందాం” అని వాగ్దానం అడుగుతాడు.  ప్రపంచాన్ని చూసే చూపు ఇద్దరిదీ ఎక్కడ ఎప్పుడు వేరయింది అన్న దిగులు కూడా కవిది. “ అభ్యుదయ వికసితములైన హృదయాలతో / ఎన్ని మహోన్నత స్వప్నాలు కన్నాం మనం !/ ఈ కలలు కరిగిపోవటానికి/ ఈ  కనుగొనలు తడిసిపోవటానికి కారణమేమిటి? అని దిగులు పడుతూనే ఇంకా గాఢంగా మిత్రుడిని ప్రేమించటానికే చేసుకొన్న కవి సంకల్పం ఈ కవిత ముగింపులో కనిపిస్తుంది. పెద్దయ్యాక ఏమైనా సరే ‘చిన్నతనం/  నుంచీ, హృదయాలను పరస్పరం ఏకం చేసుకొన్న’ వాళ్ళం కదా అన్నది కవి ఆలోచన. భిన్న దృక్పథాలకు  స్నేహానికి మధ్య వైరుధ్యం కలిగించే మానసిక సంఘర్షణను, సమాధానం కుదుర్చుకోవలసిన తీరును ఒక విలువగా ఆవిష్కరింప చేసిన మంచి కవిత ఇది. ఇక్కడ కవి పూర్తిగా ఆధునికుడు.  స్వగతం కవితలో సమస్యల వలయంలో వేదన అనుభవిస్తున్న కవి మృత్యు కాంక్ష విషాద జీరవలే ఉంటూనే తనకు అన్ని వేళలా సహాయపడిన మిత్రుడికి కృతజ్ఞతలు చెప్పలేనంటాడు. ఎందుకంటే తాను అతనికి అభిన్నం కనుక. “ ఎవడయినా తనకు నమస్కారం చేస్తాడు / అయితే తానై తనకు నమస్కారం చేసుకోడు” అని ఒక పోలిక ద్వారా దానిని సూచిస్తాడు. “ “నా హృదయం నించి చీలి పరాయి వాడవైనప్పుడే / నీకు కృతజ్ఞతా నమస్కారం చేస్తాను – అంతే” అని  చెప్పటంలో అద్వైతం ఎంతో ఆత్మాభిమానం అంత. 

బైబిల్ లోని పాత్రలను, ఘటనలను ఆధారంగా చేసుకొని వ్రాసిన పద్య ఖండికలు సలోమీ , రక్తాభిషేకం. ఖడ్గధారణం కవితకు వస్తువు  పల్నాటి వీర చరిత్ర నుండి స్వీకరించబడింది.  బాల చంద్రుడిని యుద్ధోన్ముఖం చేసిన వీరావేశ సౌందర్య మూర్తి మాంచాల ఉపదేశం ఇందులో విషయం. 

చ్యుత జ్యోత్స్న ప్రేమించి వంచనకు గురైన స్త్రీ దుఃఖాన్నిచెప్పిన పద్య ఖండిక. ప్రేమ- స్త్రీపురుష ప్రేమ- తరచు  శృంగారంలోకి పర్యవసించేదే. కవులకు అది గొప్ప కవితావస్తువు. భావుకతకు, సంఘర్షణకు, సంతోషానికి సమృద్ధి అయిన వనరు అది.  విజయదత్తు దృష్టి ఈ వస్తువును విలక్షణంగా దర్శించింది. ప్రేమ , శృంగారం ఇద్దరిని ఒక్కటి చేసి ఆనందపు టంచులకు తీసుకువెళ్ళేవే. కానీ అది అందరికి సమానంగా  అనుభవంలోకి రావటం లేదు. అలా అనుభవంలోకి రానీయని వాటిలో పేదరికం ఒకటి. ప్రేమ, సంయోగ కాంక్ష స్త్రీపురుషులను దగ్గరకు చేర్చవచ్చు కానీ అదే సమయంలోకనీస అవసరాలు తీరని  జీవన వాస్తవాలు రసభంగ కారణం అవుతాయి. ఆ స్థితిని సూచించిన  పద్య ఖండిక  భీభత్స శృంగారం.   

మహాకవి గురజాడ ఎనిమిది పద్యాల ఖండిక. కేవల స్మృతిగీతం కాదిది. కవిలోకపు విలువల విచారణ ఇందులో భాగం . గురజాడ స్ఫూర్తి దాయకమైన గతం. ఆయనను తలచుకోగానే కవికి గుర్తుకు వచ్చింది సమకాలపు కవితా ప్రపంచం.ఈ ప్రపంచం  “ పనికిన్ పాటకు ప్రాలు మాలియు సుఖింపన్ జాలు భోగేశ్వరుల్ / ధనికులు గీచిన గీటుదాటక విరుద్ధ వ్యర్ధ గాధా వళుల్ /”  వినిపించు కవి దిగ్గజముల తో నిండి ఉంది. పేదలను, పీడితులను, బాధితులను పట్టించుకోని కవిత్వం పట్ల కవి నిరసన స్వరం స్పష్టం.  

విజయదత్తు పూర్తిగా పేదల పక్షపు కవి.దుఃఖితుల వైపు నిలబడ్డ కవి. తాజమహలు  కవిత అందుకు నిదర్శనం. అందరిలాగా తాజమహలు ను  ఆయన అమర ప్రేమ చిహ్నంగా భావించలేదు. తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు  అని ప్రశ్నించిన శ్రీశ్రీ మార్గం ఆయనది. “ అది – కూలీల కవోష్ణ రక్తములు నీరై గుండెలే రాళ్లుగా / చిదురం గొట్టి పునాదులెత్తిన మాహా చిత్రాంత శుద్ధాంతము” అన్న నిర్ధారణ వాక్యంతో పద్యంతో ప్రారంభించి ఆ తరువాతి పద్యాలలో అంతటి సంపద్వంతమైన భవన నిర్మాణం ఎందరి బ్రతుకు తెరువులను, ఎందరి శ్రమ ఫలితాన్ని దోచుకొంటే సాధ్యమైనదో చూడమంటాడు. ఆలోచించమంటాడు. వేదన పడతాడు. ఈ క్రమంలోనే ఆయన యుద్ధాన్ని వ్యతిరేకిస్తాడు.  

యుద్ధమంటే అధికార దాహం. ఆక్రమణ. సంపదల అపహరణ. ఇది చాలామందిని దుంపనాశనం చేసి కొద్దిమందిని విజేతలుగా నిలుపుతుంది. ఇది మానవత్వానికే అపచారం అని కవి భావన. ఆ కోణం నుండి వ్రాయబడినవి అంతర్వాణి, శాంతి సూక్తం, సింహావలోకనం. మొదటిది   అశోక చక్రవర్తిని సంబోధిస్తుంది. “ ఎడపెడ వీచి గుండె వణికించెడి యీ చలిగాలి హోరులో 

 గడగడలాడిపోవు పసి గందులతో , తమ మేడ క్రింద మ్రా

న్పడినవి, మూల్గుచున్నవి , అనాధ కుటుంబములెన్నొ; హాయిగా

  పడుకొనినావు రాణి  కుడి ప్రక్క నీవొక పూలపాన్పు పై !” అని కటిక పేదరికం, అంతులేని సుఖ భోగాలు పక్కపక్కనే ఉన్న పరిస్థితి వైపు అశోకుడిని  చూడమంటాడు. బౌద్ధం వెల్లివిరిసిన నేల  మీద  యుద్ధ దాహం ఏమిటని నిలదీసాడు. రాజ్య కాంక్ష యుద్ధాలు మానవ సంబంధాలను ఎంతగా వేదనకు గురిచేస్తాయో గుర్తుచేశాడు. విశ్వశాంతిని ఆకాంక్షించాడు. 

చరిత్ర అంతా యుద్ధాలు. వర్తమానము యుద్ధమే. రెండవ ప్రపంచ సంగ్రామం వరకూ అన్నీ మానవహంతల దుర్నీతే. దానిపట్ల కవికి కోపం. “ప్రత్యణువూ వికసించిన / ప్రాణం తొణికిస లాడిన / చల్లని సౌందర్య దృష్టి” వల్లకాడు అయిపోతున్నదని వేదనపడ్డాడు. “ రారాజులా రాకాసుల /రణ దాహం ధనమొహం / జన రక్తా స్వాదన..” ఫలితమని అది అంతం కావాలని ఆశించాడు. పల్లీయులు , పట్టణ వాసులు / విద్యార్థులు విజ్ఞానులు / యువ యోధులు, మహారధులు / ఏకమై ఒక మహా లోకమై భూకంపం పుట్టిస్థూ / శాంతి ధ్వజమెగరేసే .. రోజు ను ఆవాహన చేసాడు ఈ కవితలో. ప్రపంచ శాంతి కవి కామన. 

సింహావలోకనం పద్య ఖండిక. ఇందులో ‘ శ్రమైక జీవిని , ‘కర్మారగర్భమ్ములో బంగారమ్మును కుప్ప’ పొసే కార్మికుడిని, ‘తల వ్రాతలెమ్మని’ కలవాని వాకిట బిచ్చమెత్తుకొనే అనాథను స్వేఛ్ఛా  సిద్ధికి  క్రాంతి యోద్దలు కావాలని ఉద్బోధిస్తాడు. ఆత్మ సుఖ లాలసులైన దేశనాయకులను, ‘ పేదల రక్త మాసములు పిండి పలావులు చేసుకొనే ధనోన్మాద నిషాదులను మీకిక కాలం చెల్లింది అని హెచ్చరిస్తాడు.  ‘నిరుపేదలందరేకైకముగా ప్రపంచము జయించి సమస్తము నాక్రమించు’ రోజును ఆవాహన చేయటం విజయదత్తు కవిత్వ ఆశయం. 

“నా కవితా దృక్కోణం కత్తిలాగా

 వాళ్ళ నడిగుండెల్లో దిగ బొడుచుకొన్నది” (ఇదొక అనుభవం) వాళ్లంటే ఎవరు ? మతవాదులు. మతాలను, మతాలను కనిపెట్టుకొని బ్రతికే దైవాన్నీ / ఆ రెండింటినీ నమ్ముకొని భక్తుల్నీ విమర్శించి ఖండించినందుకు సంఘం తనను వెలివేసిందంటాడు కవి. మత దాసులకు , సంఘ ద్రోహులకు విధ్వంసనం తన కవిత్వం అని ప్రకటించటం లో విజయదత్తు  ధిక్కార స్వర తీవ్రతను అర్ధం చేసు కోవచ్చు. అందువల్లనే ఈ కావ్యానికి ముందుమాట వ్రాసిన చర్ల గణపతి శాస్త్రి “ఈ కవి కలము సత్యమును సూటిగా చెప్పుటలో  చాలా ఘాటైనది” అన్నాడు. 

ధనిక పేద ద్వంద్వాల మధ్య వైరుధ్యాన్ని కార్యకారణ సంబంధాన్ని పసిగట్టి కవిత్వంలో ఆవిష్కరించగలిగిన కవి విజయదత్తు.ప్రజల సంఘటిత శక్తిని సంభావించ గలిగిన , ప్రజా పాలనను దర్శించ గలిగిన  బీర్నీడి విజయదత్తు ముప్ఫయేళ్లకే అకాల మృత్యువు వాతపడకుండా ఉంటె  అతని ఆవేదన ఏ ఆచరణ వైపు ఆయన ప్రస్థానాన్ని నిర్దేశించి ఉండేదో కదా అనిపిస్తుంది. 

బీర్నీడి కవులలో ప్రపంచ వాస్తవికత కు మేల్కొన్న విలక్షణమైన కవి  విజయదత్తు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply