బాన గొర్రెలు

“మేయ్ బారతీ.. ఓమే బారతీ…” అని యీదిలో నిలబడి అరిసినట్టు పిలస్తా ఉండాది మా రామత్త !

నేను పెల్లో సామాన్లు దుద్ధతా ఉంటి. రామత్త అరుపులు ఇని చేసే పని ఇడిసి పరిగెత్తుకుంటా ఈదిలోకి వస్తి. రామత్త వాలకం ఎట్లుందంటే చీర కట్టుసెరుగు కిందనుంచి ఎత్తి నడుములో చెక్కింది. పైట సెరుగు నడుముకు చుట్టి తల ఎంటికులు గెంటేసి, మూడేల్ల లావు ఎదురు కట్టి చేతిలో పట్టుకొని మగమంతా కండ్లు చేసుకొని పొండ్లు కొరకతా నిలబడుండాది.

నేను ”యాల రామత్తా ఊరంతా పెరక్క చ్చేటట్లు అరస్తా ఉండావు, ఎవరిని కొట్టను వస్తివి? ఎందుకు అంత రగిలిపోతుండావు” అంటి.

”ఒక మిడిమాలెం నా కొడుకు పుట్టి ఉండ్ల. వాడు నీ కొడుకు జతకు ఏమన్నా వొచ్చెనా ? ఆ నా బట్ట కోసం ఊరంతా ఎతికినా దొరకలా. ఈ పొద్దు నా చేతిలో వాని సావు తీరి పోతుంది. నా చేతికి దొరకాల వాడు, చిన్నప్పుడు తాగిన ముర్రుపాలు కక్కిస్తా. ఏం మిడిమాలం నా కొడుకు. ఒగడే అని వొబ్బిడిగ వొరికూడు పెట్టి సాకితే ఓగు పట్టి పాయ. ఏం చేసేది? ఈ పొద్దు నేను ఎర్రటెండల్లో దేవుడా అని కూలికి పోతి. పోతాపోతా గ్యాట్లో ఆవులు కట్టేసిన. వాటికి గడ్డేసి నీల్లు తాపరా అని అదేపనిగా వానికి పొద్దున చెప్పేసి పోయిన. నేను మల్ల తిరుక్కొని ఇంటికి వచ్చిచూస్తే నేను యాడ కట్టేసి పోయినానో ఆన్నే ఉన్నాయి అవి. ఆ యావులు నన్ను చూసి అంబా అని అరిసి ఆటి కళ్ళ నిండా నీల్లు పెట్టుకున్నాయి. ఈ పొద్దంతా మేత నీల్లు లేక వాటి డొక్కలు ఎముకలకు అంటక పోయినాయి. నోరు లేని ఆవులకు అంత పని జేస్తాడా?”

ఇరవై ఏండ్లు మింద పన్నాయి. మంచి చెడ్డ తెలీదా? ఆ సెల్లు ఒకటి ఉంటే చాలు. యాల పాలా లేకుండా ఇరవై నాలుగు గంటలు దాన్ని అదుము కుంటూ ఉంటాడు. ఈని వయసులో మేము ఇద్దరు ముగ్గురు బిడ్డలు సాకతా ఒక సంసారాన్ని ఉద్దరిస్తా ఉంటిమి. ఇప్పుడు నా బట్టలకు ఒక పనిమింద చింత లేదు. మనం ఎట్ల బతికేది అనేది తెలియదు. అమ్మ నాయన ఏం బాద పడి సాకతా ఉండారు అనేది తెలీదు. వాళ్ల నాయన నన్ను తిడతా ఉన్నాడు. కొడుకును ముదుగారం చేసి చెడగొడుతున్నానని. యాడన్నా తల్లి బిడ్డను చెడి పొమ్మని చెప్తుందా ? కోడి, కుక్క, గొడ్డు మేకలు బిడ్లకు ఈకలు తోకలు వచ్చినంత వరకు అంచున పెట్టుకుంటాయి. అవిటి తిండి అవి తినేది నేర్చుకుంటానే చెంగ దోలేస్తాయి. మల్లా అమ్మా అని ఆ బిడ్డలు కానీ పోతే ఎగిరెగిరి తంతాయి. శత్రువులను చూసినట్టు చూస్తాయి. అట్లాంటిది మనం జీవితాంతం సాకల్లంటే ఎట్లా?

ఈ నా కొడుకులు చెడుసావాసాలు చేసేది “కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు” జతల మీద తిరిగి ఎవున్నిఎవడు చెడస్తా ఉండారు. ఎవరికి తెలుసు? నా బట్టలందరూ ఒకే తాటిపై ఉండారు. ఈ మగ నా బట్లకంటే ఆడబిడ్డ మేలు. దప్పికి నీల్లన్నా ఇస్తుంది. ఈ నా కొడుకులతో మనకు యా సాయమూ లేదు. గుడ్డా గుసురు, తిండి తీర్థం అన్నీ మనం చేయాల్సిందే. ఈ మగ నా కొడుకులకి బయము లేదు. బక్తి లేదు. మంచి లేదు. చెడ్డ లేదు. బతుకు మింద చింత లేదు. అమ్మా నాయిన్నీ ఊదిరిచ్చుకొని, బెదిరిచ్చుకొని తిని తిరగబడేసి బతికేస్తాఉండారు.” లత్త గువ్వలన్నీ వొకే దరికి చేరినట్లు ” ఈ సావాసగాల్లు అందరూ ఒకటే తీరువాకు తీరినారు. దీనికి తోడు సెల్లు పోన్లు ఒకటి. వాల్ల ఆదీకం కోసం లేనిపోని ఇచ్చింతరాలు చూపిస్తా ఉంటే ఈ నాయాండ్లు బాన గొర్రెలయ్యి దుడ్లన్నీ వాల్ల ఎదాన పోస్తా ఉండారు ” అని గుక్కతిప్పుకోకుండా తిడతా ఇంటి ముందర మంచం ఏసింటే దాని మీద కూసుండే రామత్త !

నేనుండుకోని ”కాదు రామత్తా ఈ కాలంలో మన ఊరంతా ఎత్తుకుంటే ఒకరో ఇద్దరో ఉండారు. తల్లిదండ్రుల మాట ఇని వాళ్లకు సాయి పడతా ఉండేవాల్లు మిగిలిన వాళ్లంతా “తలకాయకి చెప్పులు అడిగేవాల్లే” ఆ సెల్లు పక్కన పెట్టి పని చేయండిరా అంటే వొగొగనికి రెట్టలావు వస్తుంది కోపం. యాడన్నా పోనీపో, కన్నాము సాకే బాద్య త ఉంది” అంటి నేను.

ఆ మాటకు రామత్త ”చూడు పాపా నేను నీ అంత మంచిదాన్ని కాదు. ఈ పొద్దు వాడు నా కంట పడాల, అప్పుడు చెప్తా వానిపని. వాని నెత్తరు కుక్కలకు పోస్తా” అని రామత్త సల్ల పడకుండా తిడతనే ఉంది. మేమిద్దరం మాట్లాడతా ఉన్నట్లే నాకొడుకు ఏడున్నాడో సూసిరమ్మని పంపిన నా తమ్ముని కొడుకు మల్లికార్జున గోడు పరిగెత్తతా వచ్చే ”బారతత్తా బారతత్తా.. సోమన్న మనూరి ఎనక పెద్ద గుంటి కాడ ఆటాడతా ఉండాడు. నువ్వు పిలస్తా ఉండావు. అని చెప్పినా కూడా రాలేదు మల్ల వస్తా పోరా అని గెదురుకుండె” అనె.

”సరేగానిరే ఆడ ఇంకా ఎవరెవరు ఉన్నారు రామత్త కొడుకును చూసినవా” అంటే ఆడ లేడత్తా అనేసి వాడెల్లిపాయ.

ఈ కరోనా రోగం వచ్చి బళ్ళు తెరసక ఊర్లో ఈడొచ్చిన నాయాల్లు అంతా సద్దు చేయని తావు చూసుకొని గొంతు క్కూర్చుండేది. ఆ సెల్లు నొక్కుంటా ఉండేది. మొదలు యానా కొడుకు జేరినాడో. వానితోపాటు ఊర్లో ఒకర్ని చూసుకోనొకరు. ముపైమంది పిల్లలు ఏదో యాట ఆడతా ఉండారంట. మంచి ఎసగొయ్యి మింద ఉన్న, మీస కట్టు మగోల్లందరూ పోయి ఈ ఆట ఆడితే ఆ తల్లిదండ్రులు ఏమై పోయేది. వీళ్లు గన్నులు పెట్టుకొని ఆ యాటలో యుద్దం చేసేదంట. ఆ యుద్ధం మొదలైందంటే యాలకి తిండి లేదు. కంటినిండా నిద్రుండదు. అంత గమనంతో ఆ యుద్ధం ఆడతా ఉంటారు. ఇదే పట్టుదలతో ఏరే పని ఏమన్నా చేసుంటే ఎబుడో బాగుపడుండే వాల్లు కాళ్లు చేతులు పీక్కుపోయి, కండ్లు నిగడకపోయి, ఓ పక్క నడుము నొప్పితో ఒళ్ళు ఇరుసు కుంటూ చేతులకి పోడర్, కొబ్బరినూనె పూసుకొని ఒల్లు ఊనం చేసుకోని ఆడతా ఉండారు. వీళ్ళకి ఎవరత్తా చెప్పే వాల్లు ‘ ‘అని నేను అత్త తో అంటా ఉండా.

ఇంతలో మా నాగన్న అక్కడకు వచ్చే ! ”పాపా నేను రమనోల్ల చెరుకుదోట కాడ గొర్లు మేపు కుంటుండా. చుట్టుపక్కల ఎవరూ లేరు. నేను ఒక్కన్నే యా గొర్రె ఎక్కడ పోతా ఉందో గమనిస్తా పెద్దగెనుము పైన కాస్త పరద్యానంగా ఉండ. గెనుము కింద గెట్టిగా అరుపులు ఇనపడే.

ఏమని “ఒరేయ్ వాన్ని కాల్సు , అదో ఆడ పరిగెత్తతా ఉండాడు చూడు. ఏయ్ ఏసైరా. వాన్నికాల్చెయ్. అని గట్టిగా అరుపులు ఇనపడే. నేను గొర్లు మేపు కుంట ఉండే వాన్ని ఎగిరి పడితి. నా గుండి కాయలు సల్లగా అయిపోయినాయి. ఎవ్వరు రా మనిషి కనపర్రు అని దిక్కులు చూస్తా అరుపుల సడి ఇని పోతే గెనుము కింద కుసోని వాన్ని కాల్సు ఈన్నికాల్సు అని అరస్తా సెల్లులో డబ్ డబీ అని తుపాకీ శబ్దాలు, అరుపులు. నన్నుసూసి కూడా తలకాయి కిందికి కొట్టుకోని సెల్ నొక్క తానే ఉండాడు. నీ కొడుకు ”ఏందిరా ఈ పని” అంటే ”ఏం లేదు పో మామా” అంటాడు. వాడు నన్ను ఈ పొద్దు అర్ల బెదర కొట్టినాడు. వానికి బయం పెట్టు పాప వాని వయసులో మేము వొగ సంసారాన్ని మోస్త ఉంటిమి ఇబుటి పిల్లలు యాబైకేజీలు బరువుండరు, బారడు దూరం ఏమీ మోయలేరు. బారువాసు పనీ చేయలేరు. ఆ పాయంలో నేను నూరు కేజీల మూట అవలీలగా ఎత్తుకొని ఐదారు మైల్లు పోతా ఉంటిని. మనుషులకి బలాలు తగ్గే కొద్దీ బలమైన మిసన్లు తయారు చేస్తా ఉండారు లే. అందుకేనేమో ఒల్లు కంత పని చెప్పకుండా తలకాయిలకు మాత్రమే పని చెప్తా ఉన్నారు. ఇంక మిసన్ల మీద ఆదారపడి బతకాల్సిందే. నేను పావాలమ్మ నీ కొడుకు ఆడున్నాడని చెబుదామని వస్తి. ఏమైనా వానికి బయం పెట్టమ్మా” అనేసి పాయ!

”చూడత్తా. నేనేమి చేసేది. ఈ పోన్లుతో ఎంత గావలో అంత వాటి పాలై పోయినారు. వీళ్ళకి చేతి నిండా పని లేద అవి ఎట్లా ఆడమంటే అట్టాడతా ఉండారు. మొన్నటి రేయి సరిగ్గా పది గంటలయింది. మేమందరం నిద్రపోతా ఉండాం. నా కొడుకు మేలుకొనే ఉండాడు.

వాడు గట్టిగా ”ఒరేయ్ మచ్చా మన వాళ్ళను అందర్నీ ఏసేసినారు రా. నువ్వే ఉండేది. ఇదిగో వాడు ఈడ దాక్కొని ఉండాడు. ఆ పొదకింద అట్ల రా. ఇట్లా రా. వానెక్క తప్పించుకునే రా. ఒరేయ్ నన్ను కూడ చంపి ఈడ పడేసి పోయినారు. నేను చచ్చిపోయిన నువ్వు బద్రం” అని అరస్తా ఉండాడు.

నేను నిద్రలో నుండి వాని మాటలు విని ఉలిక్కిపడి లేచి ”ఒరేయ్ ఏందిరా ఈ కర్మ? రేయి, పొగులు అనేది లేకుండా చావు బతుకుల ఆట ఏందిరా? అని చేతిలోని సెల్లు పెరికి ఆడ పారేస్తి. రేయ్ ఈ పొద్దున్నుండి ఈ ఆట నా ఎదురుగా ఆడితే నిన్నుఇంట్లో ఉన్నీను తరిమేస్తా అని బెదిరిస్తే ఆ పొద్దున్నుంచి నా ఎదురుగ ఆడడు నాకు మారుగా పోయి ఆడతాడు.

ఈడు ఇట్లుంటే మొన్న నా చెల్లెలు కొడుకు బాగ చదువుకునే వాడు. ఊర్లో అందర్నీ చూసి పిల్లలందరూ ఆడతా ఉన్నారు అని వాళ్ళమ్మ ను ఏడిపిచ్చి నాకు సెల్లు కానే కావల్లని మొండికేసుకోని అన్నము నీల్లు మానేసినాడు. దానిచేతల కష్టంతో సంసారాన్ని ఎలనీదతా ఉంది. వొగ బిడ్డే తీసి ఇయ్యకుంటే ఏమైతాడో అని అప్పు చేసి తీసిచ్చింది. అబుడు నుండి వాంది ఈ దావే ఈ యుద్ధంలో చేయితిరిగిన ఆటగాడు అయినాడు.

సంవత్సరమంతా చదవాల్సిన సదువంతా రేపు పరీచ్చ ఉందంటే ఈ పొద్దు కుసోని సదవుతా ఉండారు. ఆసదువు గడ్డెక్కినట్లేనాతా వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునేంత వరకు మనమేం చేయలేము” అన్నా.

రామత్త ఉండుకొని ”అవునే పాపా. ఆ యాట పేరేందే? అనే.

”అదే పబ్జీ అంటారు అత్తా” అంటే.. ”దానికి ఆ పేరు గాదే. పాడై పోతారు అని పెట్టల్ల” అనే.

ఆయాలకు మల్ల మల్లికార్జున గోడు పరిగెత్తతా వచ్చి ”రామత్తా నీ కొడుకొచ్చినాడు” అనే !

రామత్త అదే ఊపు తో కట్టి ఎత్తుకోని గబగబా పాయ!

  • అర్థాలు
    …………

వోగు – పనికిరాకుండా
గెంటేసి -ముడేసి
పెల్లో-పెరట్లో-
బాన గొర్రెలు – తెలియని గొర్రెలు
ఆదీకం – ఆధిక్యం
ఇచ్చింతరాలు – విచిత్రాలు
ఎసగొయ్యి – యౌవనపాయము

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర  బురుజు మాదిగపల్లె. కథా రచయిత్రి. వ్యవసాయ కూలీ కుటుంబం. ప్రధాన వృత్తి వ్యవసాయం. రచనలు వీరి వ్యావృత్తి. ముప్పై కథలతో 'ఎదారి బతుకులు' కథా సంపుటి ప్రచురించారు. ఇప్పటివరకు అరవై కథలు రాశారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'నవోదయం' మాస పత్రిక నిర్వహిస్తున్నారు.

4 thoughts on “బాన గొర్రెలు

  1. కథ బాగుంది భారతి గారూ… యువత అంతా యెట్లా బానిసలై పోతున్నారో బాగా చెప్పారు.

  2. ఆదీకం అంటే ఆధిక్యం కాదు, ఆదాయం

  3. పెళ్ళో అంటే పెరట్లో కాదు స్నానపు గది లేదా బాత్రూం అని అర్థం , అంటే చిత్తూరు జిల్లా పల్లెల్లో స్నానపు గదిలో వంట పాత్రలు కడుగుతారు

Leave a Reply