బాధిత స్త్రీ చైతన్యానికి బాసట అయిన కవిత్వం

(అరణ్యకృష్ణ ఇప్పటి వరకు రాసిన 26 కవితలతో కూడిన స్త్రీ కేంద్రక కవిత్వాన్ని “మనిద్దరం” అనే శీర్షికతో “నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం” (నరసం) వారు ప్రచురిస్తున్నారు. ఆ సంపుటికి ప్రముఖ విమర్శకురాలు కాత్యాయని విద్మహే ముందుమాట రాసారు. ఆ ముందుమాట కొలిమి పాఠకుల కోసం…)

స్త్రీవాదం తెలుగు కవిత్వాన్ని ఒక ఊపు ఊపుతున్న పందొమ్మిదివందల తొంభయ్యవ దశకపు స్త్రీల కవిత్వం పితృస్వామిక రాజకీయాల మీద తీవ్రస్వరంతో పెట్టిన విమర్శకు, ప్రకటించిన ప్రజాస్వామిక ఆకాంక్షలకు సున్నిత మానవత్వాన్ని మిగుల్చుకున్న పురుష ప్రపంచంలో వచ్చిన కదలికలు వాళ్ళ కవిత్వంలోనూ ప్రతిఫలించాయి.

స్త్రీల గురించి పురుషులు అంతకు ముందు కవిత్వం వ్రాయలేదని కాదు. తల్లి ప్రేమ గురించి, ప్రేయసి సౌందర్యాన్ని గురించి, ఇల్లాలి సహనాన్ని గురించి, ఉత్తమత్వాన్ని గురించి, అక్కాచెల్లెళ్ల ఆప్యాయతల గురించి కవితలు కట్టే ఉంటారు. అలాగే స్త్రీల జీవితంలోని వేదనా పార్శ్వాలను గుర్తించి వితంతువుల వేదన గురించో, వరకట్న సమస్య గురించో, కుటుంబానికి అవతల వేశ్యల గురించో వ్రాసే ఉంటారు. అయితే వీటన్నిటి వెనుక పితృస్వామిక చట్రం నిర్మించిన పురుష సంస్కారం, ఉదారభావజాలం నుండి రూపొందిన సంస్కర్త హృదయం ఉన్నాయి. అవి మరీ అంత చెడ్డవి కాకపోవచ్చు. కానీ పూర్తిగా స్త్రీని ఒక స్వతంత్ర వ్యక్తిగా గుర్తించినవి మాత్రం కావు. ‘స్త్రీల కు శరీరం ఉంది వ్యాయామం కావాలి. స్త్రీకి హృదయం ఉంది. అనుభవం ఇవ్వాలి. స్త్రీలకు మెదడు ఉంది ఆలోచించనివ్వాలి’ అన్న చలం వాక్యాల సారం ఇంకని దశకు సంబంధించిన కవిత్వమే చాలావరకు అదంతా.

వెనుకబాటు తనాన్ని గురించి, వివక్ష గురించి మూలాలు తెలుసుకొన్న అవగాహన నుండి స్త్రీలు స్వయంగా మాట్లాడటం అంతర్జాతీయ మహిళా దశాబ్ది (1975-1985) తో మొదలైంది. దానికి సానుకూలంగా స్పందించే ప్రజాస్వామిక చైతన్యం ఇచ్చిన ఆత్మవిమర్శ నుండి పురుష కవులు, రచయితలు స్త్రీ గురించి స్థిరపడిన భావజాల బంధనాలను తెంచుకొంటూ స్త్రీల జీవితాన్ని శాశించే వ్యవస్థలను, నైతిక నిర్మాణాలను హేతుబద్ధంగా, విమర్శనాత్మకంగా అర్ధం చేసుకొనటానికి ప్రయత్నిస్తూ స్త్రీల పట్ల సానుభూతి దగ్గర ఆగక సహానుభూతిని పెంచుకొంటూ స్త్రీ స్థానంలో నిలబడి ఆలోచించటానికి, వ్యక్తీకరించటానికి సంసిద్ధమైన సందర్భంనుండి పురుషులు స్త్రీల గురించి వ్రాసే కవిత్వ స్వభావం మారుతూ వచ్చింది. అట్లా కొత్త కవిత్వం వ్రాయటానికి ఉత్సాహ పడిన కవులలో అరణ్య కృష్ణ ఒకడు. 1994 లో ‘నెత్తురోడుతున్న పద చిత్రం’ 2016 లో ‘కవిత్వంలో ఉన్నంత సేపు’ అన్న రెండు కవితా సంపుటాలను ప్రచురించిన అరణ్యకృష్ణ ఇప్పుడు ఇంతకాలంగా స్త్రీ జీవితం కేంద్రంగా వ్రాసిన కవితలతో కవిత సంపుటం తెస్తున్నాడు. కవి అరణ్యకృష్ణతో నా తొలి పరిచయం ‘వేట’ కవిత ద్వారా. అదే ఈ సంపుటిలో మొదటి కవిత. 1988 లో వచ్చిన ఆ కవితతో ప్రారంభించి ఇప్పటివరకు మహిళ గురించి వ్రాసిన 27 కవితలతో ఈ సంపుటి వస్తున్నది.

1

2015 లో అరణ్యకృష్ణ వ్రాసిన “అమ్మ అంటేనే ఒక మానవీయ దృశ్యం” కవిత చదువుతుంటే 1990లో వరవరరావు అల్లంనారాయణ కవితా సంపుటి జగిత్యాలపల్లె కు వ్రాసిన ముందుమాటలో “బహుశా ఏ కవికైనా అమ్మను మించిన కవితా వస్తువు ఉండదనుకుంటాను. అమ్మ స్వయంగా ఒకవస్తువు. ఒకప్రక్రియ. ఒక రూపం. ఒక సారం కనుక ఎట్లా రాసినా అమ్మ మీద కవిత బాగానే ఉంటుంది.” అన్నమాటలు గుర్తుకువచ్చాయి. “ఒంట్లో రక్తం లేకపోయినా/ పాలను ఒంపే వక్షోజం గల తల్లి, చావు పడకలో కూడా మందహాసం చేయటం చేతనైన అమ్మ , కూలిపోతూ విత్తనాల్ని భూమికి బహుమతిగా ఇచ్చే చెట్టు వంటి తల్లి” మొదలైన పదచిత్రాలతో జీవనసౌందర్యం అంటే అమ్మతనంలా నిరలంకారం అని నిర్వచించిన ఈ కవిత అమ్మగురించిన నిరపేక్ష భావోద్విజ్ఞ ప్రకటనే. ఒక తల్లితో కొడుకు సంభాషణగా సాగే వాంగ్మూలం కవిత ఈ పరిధిని దాటగలిగింది. నిజానికి అది మహా శ్వేతాదేవి నవల ‘ఒకతల్లి’ చదివాక ఏక కాలంలో సంచలించే ఎద, మెదడుల ప్రతిఫలనం. ఆ నవల సారాన్ని రూపించిన కవిత. నవలలో తల్లి కొడుకును వెతుక్కొంటూ ఆ క్రమంలో వాడెంత సున్నిత మానవుడో తెలుసుకొంటూ వచ్చింది. అలాంటి సున్నిత మానవుడు తల్లి గురించి, కుటుంబం గురించి ఏమనుకొంటాడో ఈ కవితలో ఉంది.

“ఎగరటం మరచిన పక్షుల్లానో
రెక్కలు ఊడిన గాజుపురుగుల్లానో
మనమంతా దేకుతూ బతికే కుటుంబం…
అది పంజరమో సాలెగూడో / నాన్నల ఏర్పాటే కదా !…”

కుటుంబం పంజరం, సాలె గూడు… వాటినట్లా ఏర్పాటు చేసింది తండ్రి అధికారం గల వ్యవస్థ — ఈ మూడింటి మధ్య గల చారిత్రక సంబంధాన్ని గురించిన స్పృహ వ్యక్తమయ్యే వచన కవితా పాదాలు ఇవి.

“కుటుంబం అంటే ఒకర్ని మరొకరు నేలమట్టం చేసేసి
ఓడిపోయిన వాళ్ళమీద జెండా ఎగరెయ్యటమే కదా”

ఆదర్శ కుటుంబం అనే భావనలోని మాయను బద్దలు కొట్టి వాస్తవాల వైపు చూపు తిప్పే వ్యక్తీకరణ.

“ఎన్ని తరాల తల్లుల పిల్లల నెత్తుటితో తడిశాయో నా ఇంటి గుమ్మాలు
ఎన్ని సమాధుల పునాదుల మీద లేచాయో ఈ వంటిళ్లు పడగ్గదులు”

స్త్రీలను సౌకర్యాలు సమకూర్చే ఇంటి చాకిరీ బానిసలుగా , సౌఖ్యాలు సమకూర్చే లైంగిక బానిసలుగా దిగజార్చిన కుటుంబం అసలు స్వభావం తెలిసిన కవి వ్రాసిన పాదాలివి.

కవితను ముగించబోతూ “నాన్నల నుండి ప్రభుత్వాల దాకా శత్రురూపం బహు ముఖం” అని చెప్పిన వాక్యం గర్భీకరించుకొన్న అర్ధం లోతయినది. కుటుంబం రాజ్యాధికారం ఒకే లాగా అధికారవ్యవస్థలు. అణచివేత సాధనాలు. అణచివేతకు గురైన వర్గం స్త్రీలు, పిల్లలు. కుటుంబానికి రాజ్యానికి మధ్య పోలికే కాదు, అన్యోన్య సంబంధం కూడా ఉంది. ఒకే అధికార నిర్మాణంలో అవి విడదీయరాని భాగాలు. కుటుంబం లో అణచివేతకు రాజ్యం మద్దతు ఇస్తుండగా రాజ్యాధికారానికి లోబడి ఉండే శిక్షణ కుటుంబం ఇస్తుంది. నాన్నల నుండి ప్రభుత్వాల దాకా అంటున్నాడంటే మధ్యలో ఇంకా కొన్ని ఉన్నాయనే అర్ధం. అవి కులం, మతం… ఇంకా ఏమైనా కావచ్చు. 2015 నాటికి కుటుంబం గురించిన రాజకీయ అవగాహన ఇంత స్పష్టంగా ప్రకటించ గల స్థాయికి రావటానికి కవి పడిన యాతన ఎంత? తనను తాను నూతనమానవుడిగా పునర్నిర్మించుకొనటానికి చేసిన యాత్ర ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు 1988 నుండి అరణ్యకృష్ణ వ్రాస్తూ వస్తున్న కవిత్వమే చెబుతుంది.

2

అరణ్య కృష్ణ ఆడవాళ్లవే అయిన ప్రత్యేక సమస్యలకు స్పందిస్తూ, ఆడవాళ్లపట్ల అన్యాయంగా ఉన్న సామాజిక వికృతిని నిరసిస్తూ కవిత్వం వ్రాసాడు. ఆడవాళ్ళ పుట్టుకే పెద్ద సమస్య. వంశాలకు, ఆస్తులకు వారసులయ్యే మగపిల్లల పుట్టుక లాగా ఆడపిల్లల పుట్టుక ఆహ్వానించ దగినది కాకపోవటం ఎప్పటినుండో ఉన్నది. పుట్టినా మగపిల్లలతో సమానమైన అవకాశాలు ఎందులోనూ లేక వివక్షకు గురికావటం ఆడపిల్లల నుదిటి రాతగా స్థిరపడింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగే కొత్త ఆవిష్కరణలు వాటిని మరింత బలోపేతం చేస్తూ వినిమయంలోకి రావటం ఆధునిక యుగ విషాదం. ఈ విషాదాన్ని వస్తువుగా చేసి వ్రాసిన కవిత ‘ఆమ్నియోసెంటిసిస్’. ఈ పరీక్షతో గర్భస్థ శిశువు ఆడ అని తెలిస్తే గర్భస్రావం చేయించుకోవచ్చు. ఒక జాతి హననానికి సంబంధించిన ఈ పరీక్ష వైద్య రంగానికి వ్యాపారం అయింది. దానికి రాజకీయ నాయకుల మద్దతు! 1989 లో ఈ పరిస్థితిపై ఆగ్రహంతో అరణ్యకృష్ణ వ్రాసిన కవిత ‘ఆమ్నియోసెంటిసిస్’.

“ఊపిరి పోసుకోనక్కరలేదు
నువ్వులేని బతుక్కి నాందీ సూచకంగా
కెవ్వున ఏడవనవసరం లేదు” అని ప్రారంభమయ్యే ఈ కవితలో తరువాతి రెండు భాగాలు పుట్టక పోతే ఆడపిల్లలు ఎన్ని సమస్యల నుండి తప్పించుకోవచ్చో వ్యంగ్యం గా చెబుతాయి. అలా చెప్పబడిన బూతుమాటలు, రాతలు, ఇంట్లో బళ్ళో వీధుల్లో బస్సుల్లో సాగే వేట, ఇష్టంలేని పెళ్లిళ్లు, ఆత్మహత్యలు ఇవన్నీ అరణ్యకృష్ణకు విడివిడిగా కవిత వస్తువులయ్యాయి. ఇంట్లో బళ్ళో వీధుల్లో బస్సుల్లో సాగే వేట ‘వేట’ కవితకు వస్తువైంది.

“ఇంటి నుండి
అన్నల ఆంక్షల్ని నాన్న అనుమానాల్నీ
అమ్మ చెప్పే జాగ్రత్తల్ని
మోసుకొంటూ”

చదువుకో, ఉద్యోగానికో బయటకు వెళ్లే ఆడపిల్ల బయట వేధింపులతో

“చూపుల శిలువల్నీ, మాటల శిలల్ని మోసుకొంటూ ఇంటికి రావాల్సిన” పరిస్థితిలో ఉండటం దించుకొనే తావులేని బరువుకింద నలిగిపోతున్న స్త్రీల జీవిత్త విషాదాన్ని మన అనుభవానికి తెస్తుంది.

“ఆఫీసులో ఓ కరటకుడు మరో దమనుకుడితో
‘కేర్ ఫ్రీ’ మీద జోకు విషవాయువు వదుల్తాడు
ఆమె బాత్రూమ్ కి వెళ్ళటం కూడా వాళ్లకి ఓ వింతే”

— ఇవి ‘వేట’ కవిత లోని పంక్తులు. ప్రకృతి సహజమైన నెలసరి రక్త స్రావం వ్యక్తిగత రహస్యంగా చేయబడి స్త్రీలను అవమానపరచే సాధనం అయిన స్థితి గురించి ఎరుక కవికి ఎక్కడి నుండి వచ్చింది? వ్యక్తిగతమంతా రాజకీయమే అని అర్ధమై స్త్రీలు శరీర స్పృహతో మాట్లాడుతున్నది వినటం వలన. ఆ ఎరుక నుండి వ్రాసిందే ‘రుధిర సత్యం’ కవిత.

“ఆమె గర్భం నిండా రక్త సముద్రాలు
మనమంతా ఆ రక్త సముద్రంలోంచి భూమ్మీదకు కొట్టుకొచ్చిన వాళ్ళమే”

అని మొదలుపెట్టి అపవిత్రమైందిగా, ఉచ్చరించరానిదిగా చేయబడిన ‘నెలసరి ముట్టు’ మానవోత్పత్తి మూలమని అంచలంచెలుగా నిరూపించుకొంటూ వచ్చాడు కవి. పుట్టుకను ఉత్సవంగా చేసుకొనే సమాజంలో ముట్టు చుట్టూ అంత మాయా పరికల్పన ఒక వైరుధ్యం. జయప్రభ, కొండేపూడి నిర్మల, కె. గీత మొదలైన స్త్రీలు ముట్టు గురించిన తమ దైహిక మానసిక అనుభవాలను అనుభూతినీ చెప్తే అరణ్యకృష్ణ కవిత దాని తాత్వికతను ఆవిష్కరించింది. అక్కడ ఆగక

“కట్టుకునే బట్టలంత ముఖ్యమైన తుడుచుకునే గుడ్డముక్కని విలాసవస్తువుగా మార్చిన రాజ్యవాణిజ్యాన్ని
ఆ రక్తప్రవాహంలోనే కొట్టుకు పోనివ్వండి” అన్నముక్తాయింపులో స్త్రీలు రుతుస్రావం సమయంలో ఉపయోగించే శానిటరీ నాప్కీన్లను విలాసవస్తువుల జాబితాలో చేర్చిపన్నులు పెంచిన కేంద్ర బడ్జెట్ ను ప్రస్తావించి నిరసించాడు కవి.

నెలసరి రక్తస్రావమే కాదు, స్త్రీలకు రోజుకు అనేక సార్లు చేయవలసిన మూత్రవిసర్జన కూడా సమస్యే. చదువులకోసమో, పనులకోసమో బయటకు వచ్చే ఆడవాళ్ళ ఈ రెండు అవసరాలను తీర్చే శౌచాలయాలు సరిగా లేకపోవటం నాగరిక సమాజానికే అవమానకరం. అవి లేక అర్ధాంతరంగా బడి చదువులు మానేస్తున్నఆడపిల్లల సంఖ్య పెరుగుతూ బడులలో నీటి వసతి కలిగిన మరుగుదొడ్ల ఏర్పాటు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతున్న సందర్భంలో ‘సెజ్ లు ఎక్స్ ప్రెస్ హైవేలు కారిడార్ల’ అభివృద్ధి వెలుగు పక్కనే స్త్రీలకోసం పబ్లిక్ టాయ్లెట్లు లేని చీకటి స్థితి ఒకటి ఉందని ఎత్తిచూపిన ‘ఆమె శిలువలు మోస్తున్నది’ కవిత ప్రత్యేకంగా పరిశీలించదగినది.

మనుషులను, వాళ్ళ ఆదర్శాలను, మానవీయ జీవన మూల్యాలను అర్ధం చేసుకొనటానికి అరణ్య కృష్ణ సాహిత్య సాంస్కృతిక మాధ్యమాలను కూడా విస్తృతంగా ఉపయోగించుకున్నాడు. ఒక తల్లి నవల చదివి ఒక కవిత వ్రాసినట్లుగానే వాటర్ సినిమా చూసాక దీపాంకురం కవిత వ్రాసాడు. వితంతువుల సమస్య కందుకూరి కాలం నాటిదే కావచ్చు. కానీ దాని అవశేషాలు నాగరిక యుగంలో కూడా నగ్న తాండవమాడే ప్రాంతాలు భక్తి ముసుగులో సజీవంగానే ఉన్నాయి. 1938 ప్రాంతాలలో వారణాసి లో ఉన్న ఒక వితంతువుల ఆశ్రమాన్నికేంద్రంగా చేసుకొని దీపా మెహతా తీసిన “వాటర్” సినిమా కలిగించిన భావోద్వేగాల వెల్లువ ‘దీపాంకురం’. భర్త మరణించిన ఆడవాళ్లను వితంతువులను చేసే సమాజంలోని ద్వంద్వ లైంగిక నీతిని ప్రశ్నిస్తుంది ఈ కవిత.

“పవిత్ర జీవచ్ఛవంలా బతకమని ఆదేశించేదీ మీరే
ఆమెనలా బతకనివ్వనిది మీరే
మిమ్మల్ని జంతువులు పూనితే
ఆమెను ప్రకృతి ప్రేరేపిస్తుంది” అని “శాస్త్రాలు, దౌర్జన్యాలు రెండు కళ్లు”గా ఉన్న బ్రాహ్మణీయ పితృస్వామ్య రాజకీయాలను గురించి ఆలోచింపచేస్తాడు అరణ్యకృష్ణ.

సంస్కృతి చాలా చిత్రమైనది. అది ఏక రూప శిలాజంగా భ్రమ కల్పిస్తూ బహుముఖాలతో ప్రభావాన్ని చూపుతుంటుంది. ఈ వాస్తవం తెలిసిన కవి అరణ్యకృష్ణ అని ‘అంతరంగం’, ‘డెత్ వారెంట్’ కవితలు చెప్తాయి. స్త్రీల వస్త్రధారణను శాసించే విధినిషేధాలు ఎన్నో ప్రచారం చేసిన సంస్కృతి దానిని ఉల్లంఘించటమే స్త్రీలపై అత్యాచారాలకు కారణమన్నట్లు చెప్పటం వర్తమాన దృశ్యం. చీరెకట్టు సంప్రదాయం స్త్రీల కాళ్లకు బంధమైన స్థితిని, అది మిగిల్చే విషాదాన్నిచిత్రిస్తూ వ్రాసిన ‘డెత్ వారెంట్’ కవితను గోదావరి పుష్కరాల సందర్భంలో 2015 జులై14 న రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 30 మందిలో ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారన్న వార్త విని వ్రాసినది. భక్తి మార్గ ప్రబోధం, చీరెకట్టు అందుకు కారణాలుగా చేసిన ఊహను కల్పన అని కొట్టేయ్యలేము. ‘సంస్కృతి హత్యలు’ గా వాటిని సంబోధించటానికి ఉన్న వాస్తవికత ప్రాతిపదిక వైపు కవి వేలెత్తి చూపాడు. చీరెకట్టు సంప్రదాయంలో భారతీయతను, పవిత్రతను, సౌందర్యాన్ని దర్శించే సంస్కృతిలో ‘చోళీకే పీఛే క్యాహై’ వంటి పాటలు ఎలా పుట్టుకువస్తున్నాయి? స్త్రీ శరీరాన్ని చీరెల మీదుగా, జాకెట్ల మీదుగా ఎక్స్ రే తీసే భావాలు, ద్వందార్ధాల భాష ఎక్కడినుండి వస్తాయి? స్త్రీ శరీరాన్ని అంగడి సరుకుగా మార్చిన పెట్టుబడిదారీ సంస్కృతి మాటేమిటి? వంటి ప్రశ్నలను రేపే కవిత ‘అంతరంగం’.

స్త్రీలపై జరిగే యాసిడ్ దాడులకు, పసిపిల్లల మొదలు స్త్రీలపై జరిగే అత్యాచారాలకు ఆజ్యం పోస్తున్నసంస్కృతి ఇదికాదా అన్నది ప్రశ్న. ప్రేమించటం మగవాడి జన్మహక్కు. అది మహద్ భాగ్యంగా సరేననటం ఆడవాళ్ళ బాధ్యత. మగవాడు కావాలనుకొన్నది ఎలాగైనా సంపాదించటమే హీరోయిజంగా చూపించే సినిమాలు తన ప్రేమను కాదన్నఆడదాని మీదకు మగవాణ్ణి యాసిడ్ తోనో, కత్తులతోనో దాడులకు దిగేట్లు చేయటం లేదా? ఆడదాని మీద అధికార ప్రకటనకు, లొంగదీసి అదుపు చేయటానికి లైంగిక దాడి, అత్యాచారం రాజకీయ ఆయుధం కావటం లేదా వంటి ప్రశ్నలెన్నో మనముందున్నాయి. వాటికి జవాబు అన్వేషించే క్రమంలో అరణ్యకృష్ణ వ్రాసిన కవితలు ‘మచ్చ’, ‘క్షమించండి శీర్షిక లేదు!’, ‘యుద్ధక్షేత్రంలో నిరాయుధ జెండా’. నిజానికి వీటిలో ‘యుద్ధ క్షేత్రంలో నిరాయుధ జండా’ ఈశాన్య రాష్ట్రాలలో సైనిక పాలనకు వ్యతిరేకంగా పదహారేళ్ళపాటు ఆహారం తీసుకోకుండా సమ్మె చేసిన ఇరోం షర్మిల పోరాట పటిమను కీర్తించే కవిత. దానితో పాటు మొత్తంగా మణిపూర్ మహిళల ధిక్కార స్వభావాన్నిసమాంతరంగా చూపింది.

“దేహాల్నికూడా కుళ్ళ బొడిచి రక్తాల్ని పీల్చేస్తున్నప్పుడు
ఎగ తన్నుతూ పైకి వచ్చేది
మూలుగులు వెక్కిళ్లు ఆర్తనాదాలే కాదు
బట్టలు విప్పి శత్రువు ముఖం మీద విసిరేసేంత కోపం కూడా”

“ఏడుగురు అక్కా చెల్లళ్ళ పర్వతాల కళ్ళల్లో
ఏడురంగుల ఇంద్ర ధనుస్సులు విరియటం లేదు
రక్తపు జలపాతాలు రాలుతున్నాయి”

“అమ్మలు, అత్తమ్మలు,అమ్మమ్మలు తాము దాచుకోటానికీ
శత్రువు దోచుకోటానికీ ఏమీ మిగల్చుకో కుండా
దేహాల్ని బట్టబయలు చేసి అనాగరిక రాజ్యాన్ని హేళన చేస్తారు
ఏకాంత సమయాల్లో ఉద్వేగ భరితంగా పరవశించాల్సిన నగ్నత్వం
వాళ్లకి ఒక బహిరంగ నిరసన ఆయుధం”

“అత్యాచారం శత్రువు చిట్ట చివరి ఆయుధమైతే
నగ్నత్వం వారి మొట్టమొదటి ప్రతిఘటన”– వంటి వ్యక్తీ కరణలలో అత్యాచారం రాజకీయ దాడి లో భాగమైనదన్న స్పృహ స్పష్టమే.

ఇంతటి వ్యతిరేక పరిస్థితులలో జరుగుతున్నస్త్రీల ఆత్మహత్యలు, వాటిని అసలు కారణాల నుండి నమోదు చేయకుండా, కారకులను బోనులో నిలబెట్టకుండా అధికార రాజకీయ వ్యవస్థలు నిర్వహించే పాత్రను ‘ఆమె నిష్క్రమణ సారాంశం’, ‘మరణాంతర మరణం’ కవితలు చిత్రించాయి. వేశ్యల జీవన భీభత్సము మెహబూబ్ కీ మెహందీ కవితకు వస్తువైంది .

3

స్త్రీ సమస్యను స్త్రీ పురుష సంబంధాల సాపేక్షతలో చూడటం వలన అర్ధమయ్యే అంశాలు మరిన్ని. స్త్రీ పురుషుల మధ్య సహజ లైంగిక ఆకర్షణ ఉంటుంది. దానిని సంస్కారవంతం చేసే ప్రేమ వంటి భావోద్వేగాలు, పెళ్లి వంటి వ్యవస్థలు ఉంటాయి. అయితే ఈ అన్నిటిలో స్త్రీపురుషులు సమానమైన అవకాశాలు కలిగి ఉన్నారా అన్నది ప్రశ్న. లేదు అన్నది స్పష్టమే . దానిని రకరకాల ప్రమేయాలతో పరిశీలిస్తూ భిన్న కోణాల నుండి ప్రదర్శించే కవితలు అరణ్య కృష్ణ వ్రాసాడు. ‘వైరుధ్యాల కత్తెర మధ్య మనిద్దరం’ కవిత చూడండి. అది పురుషుడి వైపు నుండి ఒక కన్ఫెషన్. “నిన్ను మోహించానే తప్ప ప్రేమించిందెప్పుడు?” అని అంతరావలోకనంతో మొదలుపెట్టి స్త్రీ ముందర మగజాతి ప్రతినిధిగా తనతప్పులు ఒప్పుకొంటున్న పురుషుడు అతను.

“నిన్నో వాస్తవంగా నిరాకరించి
రూపరహిత ఆకృతిగా నా అక్షరాల్లో తీర్చిదిద్ది
నేనో సున్నిత భావుకుణ్నని మురిసిపోయాను” అని స్త్రీని వస్తువుగా చేసి వ్రాసే క్రమంలో తమకు ఇష్టం వచ్చిన రీతిలో కత్తిరించి, కుదించి మొత్తం మీద ఆమెనే అభావం చేసిన సాహిత్యకారుల పనికి సిగ్గుపడ్డవాడు.

“నీ కోరికలు నా ఊహల్ని ప్రశ్నించినప్పుడు
నీ నిబ్బరం నా ఆధిక్యాన్ని చిన్నాభిన్నం చేసినప్పుడు
నువ్వు పాషాణానివి అని నిందిస్తాను
రకరకాల సామెతలతో అవమానిస్తాను” అని చరిత్రపొడగునా స్త్రీకి పురుషుడు చేసిన అపచారానికి తలవంచుకొన్నవాడు. యుగయుగాల దాంపత్య సంబంధాలలో స్త్రీపురుషుల ప్రయాణం సమాంతర రేఖల మీదనే కానీ ఒకే సరళరేఖలో కాకపోవటం గురించి దిగులు పడతాడు. “అసలు నేను నీ కడుపులో పిండంగా కదలాడినప్పుడు తప్ప మనిద్దరం సహజంగా ఏకమైందెప్పుడని?” అన్న ముగింపుతో కవితను పరాకాష్టకు తీసుకువెళ్లాడు. స్త్రీ కడుపులో నలుసయిన అల్ప జీవి భూమి మీదకు వచ్చాక సర్వాన్ని ఆక్రమించి స్త్రీని అంచులకు నెట్టేసే ప్రక్రియ ఎంత అసహజంగా, అన్యాయంగా జరిగిపోతున్నదో సూచించిన ముగింపు ఇది.

సంసారాన్ని సాలెగూటితో రూపకం చేస్తూ వ్రాసిన కవిత ‘సాలెగూడు’. సారం లేని సంసారం, బానిస యజమాని సంబంధాల వ్యవస్థ అయిన కుటుంబం ఒక సాలెగూడు అని భావించిన కవి అందులో చిక్కి బయటకు రాలేక గిజగిజలాడి కృశించి నశించే స్త్రీని భిన్న భావచిత్రాలతో చూపించాడు ఈ కవితలో. “మార్పులేని సంతకం లాంటి ఇంటి చాకిరీతో” హత్యకుగురయ్యే స్త్రీల సృజన మేధో శక్తులు, “సంసారం వధ్యశిలమీద పరాయీకరణ పాశంతో” ఉరితీయబడే స్త్రీల వ్యక్తిత్వం వంటి వ్యక్తీకరణలను గమనించవచ్చు.

ఇంటి చాకిరీ స్త్రీలను ఎంత పరుగులు పెట్టిస్తుందో ఈ మధ్య ఒక స్నానపు సబ్బు ప్రకటన పదేపదే చెప్తున్నది. భర్తను ఆఫీసుకు, పిల్లలను బడులకు పంపే పరుగుల తరువాత స్త్రీ అలాంటి సబ్బుతో స్నానం చేయాలట. ఈ పరుగులను గురించి అరణ్యకృష్ణ 1992 లో ‘ఉనికి ‘ అనే కవితలో చెప్పాడు.

“ఆగంతకులెవరూ వెంట పడకపోయినా
పొద్దుట్నుంచీ పరుగెత్తీ పరుగెత్తీ
పెరట్లో చెట్టుగాలి కిందికి
అశాంతిగా చేరిన ఆమె మీదికి చంద్రుడు ఓదార్పుగా హాయిగా ఆకులు ఆకులుగా జాలువారుతాడు” అని ప్రారంభంలో రాత్రిలోకి మేల్కొనే స్త్రీ గురించి చెబుతాడు.

“తెల్లారగానే
ఆమె కళ్ళమీదా చీకటి పడుతుంది
అయిష్టంగా రోజు చేసే
పీడకలల్లోకి నడుస్తుంది” అన్న ముక్తాయింపు దగ్గరకు వచ్చేసరికి గుండెలు అవిసిపోతాయి. రోజంతా పరుగులతో యంత్రంలా పనిచేసే స్త్రీకి పగలు అంటే చీకటి కాక మరేమిటి? ఈ వరసలో మరొక రెండు కవితలు ‘ధ్వంస రచన’, ‘ఆమె నిరాకరించినప్పుడు’. మొదటి కవితలో కవి సంసారంలో అధీనతను, దాంపత్యాల రూపంలో సాగే హింసను నిరసిస్తూ స్త్రీల గుండె గాయాలకు అసలైన లేపనం ధిక్కారమే అని చెబుతాడు. నిన్నటి మాలిన్యాల్ని మోసుకుంటూ ఇవ్వాళ్టిలోకి తరుముకొస్తున్న సమస్తాన్ని ధ్వంసం చేయాల్సిందేనని పిలుపు ఇస్తాడు. ‘ఆమె నిరాకరించినప్పుడు’ కవితలో కవి మగవాళ్ల వంకరలను సరిచేసే స్నేహితుడు. స్త్రీల పక్షం వహించి స్త్రీ శరీరం మీద స్త్రీకి ఉన్న హక్కును తిరుగులేని విధంగా స్థాపిస్తాడు. భార్యే కదా ఆమె ఎప్పుడైనా తన లైంగిక అవసరాలకు సిద్ధంగా ఉండాలన్న పితృస్వామిక సాంప్రదాయ ఆలోచనా విధానాన్ని తిప్పికొట్టాడు. తమ ఇష్టం లేకుండా తమ శరీరాన్ని తాకకుండా నిరోధించే హక్కును స్త్రీలు ఉపయోగించుకొన్నప్పుడు ఆ నిరాకరణ పురుషులకు రాజధిక్కారం లా కనిపించవచ్చునని అరణ్య కృష్ణకు తెలుసు. కానీ ఆమెకది స్వతంత్ర రాజ్య ప్రకటన కావచ్చు,

“తన దేహం మీద
సర్వసత్తాక సార్వభౌమత్వ స్వీయ రాజ్యాంగం కావచ్చు” అని తెలుసుకోమంటాడు.

“శరీరమంటే
సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్లే బట్టలో
జాడీలో నిల్వ చేసుకొని కొంచెం కొంచెం కొరుక్కుతినే ఊరగాయోకాదు కదా
ఆ లోపల నీకేమాత్రం అంతుచిక్కని
వ్యక్తిత్వ వ్యవస్థ ఉంది బాబూ!” తెలుసుకోమని పురుష ప్రపంచాన్ని సంభోదించి ప్రబోధించాడు.

మొత్తం మీద చదువుకొని ఉద్యోగాలు చేస్తూనో చెయ్యకనో సంసారాలు చేసుకొనే మధ్యతరగతి ఆడవాళ్ళ అంతరంగాలను, ఆరాట పోరాటాలను తనవిగా చేసుకొని అరణ్య కృష్ణ వ్రాసిన ఈ కవితల సంపుటి సామాజిక సంస్కారాలను ఉన్నతీకరించగలదు. నూతన ప్రజస్వామిక మానవులను గురించి ఆశను వాగ్దానం చెయ్యగలదు. చదవండి మరి.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

3 thoughts on “బాధిత స్త్రీ చైతన్యానికి బాసట అయిన కవిత్వం

  1. చక్కని కవిత్వానికి అంటే చిక్కటి వ్యాఖ్యానం . ఇద్దరికీ ధన్యవాదాలు

  2. అద్భుతమైన విశ్లేషణ..ఈ పుస్తకం ప్రస్తుత సమాజానికి చాలా అవసరం

  3. అరణ్య కృష్ణ గారు కవిత రాసేముందు అక్షరాల్ని కొలిమిలో ఉంచి ఎర్రగా కణ కణ లాడే నిప్పు కణిక లైంతర్వాత వాటిని ఏర్చి కూర్చి రాస్తారేమో 🤔 భగ్గు మంటాయ్👍లోతైన విశ్లేషణ అందించారు.. పుస్తకం కోసం ఎదురుచూస్తూ ఇరువురుకీ శుభాకాంక్షలు💐💐💐💐💐💐💐💐💐

Leave a Reply