బాగైచా ఉద్యమం: ఫాదర్ స్టాన్ స్వామి ప్రాతినిధ్యం వహించిన సామాజిక న్యాయ కార్యాచరణలు

(ఆంటోని పుతుమట్టతిల్
లోటికా సింఘా)

కోర్టుతో జరిగిన తన ఆఖరి సంభాషణలో, ఫాదర్ స్టాన్ స్వామి తన చివరి రోజులను రాంచీలో, సామాజిక పరిశోధన- శిక్షణల కోసం ఏర్పాటు చేసిన బగైచా అనే సంస్థలో గడపడానికి ఇష్టపడతానని చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ఆయన కోరికను నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చింది. కానీ తర్వాత ఆయన ఎనిమిది నెలలు మాత్రమే జీవించారు. స్టాన్ స్వామి కస్టడీలో మరణించారు. అందువల్ల ఆయన భీమా కొరెగాన్ (BK-16) కేసులో, అరెస్టు చేయబడిన పదహారవ వ్యక్తి అనీ, భారత ప్రభుత్వం తన పౌరులలో ఆలోచించ గలిగిన ప్రాథమిక మానవ హక్కును అణిచి వేసే ప్రయత్నాలు చేస్తుందనీ, అందుకు స్టాన్ స్వామే ఒక తిరుగులేని సాక్ష్యమనీ తెలిసింది. ఈ మరణం భారత ప్రభుత్వం ప్రజల విమర్శనాత్మక స్పృహను సహించలేక పోతుందని దేశీయంగా అంతర్జాతీయంగా అనేకమందికి తెలిసేలా చేసింది. రాంచీలోని, బగైచాలో స్వతంత్ర సామాజిక పరిశోధకులుగా పని చేస్తున్న రచయిత “ఆంటోని పుతుమట్టతిల్”, భారతదేశంలో అకడమిక్ స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగడుతున్న గౌరవ రీసెర్చ్ ఫెలో “లోటికా సింఘా” అనే రచయితతో కలిసి ఈ ఆర్టికల్‌ లో, బగైచా ఒక సజీవ ఉద్యమాన్ని ఎలా నిర్మిస్తుందో వివరిస్తున్నారు. స్టాన్ స్వామి సామాజిక పరిశోధన, విశ్లేషణ విధానాలను ఆధారం చేసుకున్న వ్యక్తుల -కేంద్రీకృత సామాజిక న్యాయ క్రియాశీలతను మేము అన్వేషిస్తామనీ, చివరగా, స్టాన్ స్వామి తన మతపరమైన నిబద్ధతలో సామాజిక న్యాయాన్ని ఎలా పొందుపరిచారో, అతని సహచరులు బగైచా ఉద్యమం అతని వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం అని ఎలా నిర్ధారిస్తున్నారో కూడా మేము ఈ వ్యాసంలో చర్చిస్తామని వారిద్దరూ తమ అభిప్రాయాలను ముందుగా సారాంశంగా చెప్పారు.

పరిచయం

ఫాదర్ స్టాన్ స్వామి కోర్టుతో చివరిగా జరిపిన సంభాషణలలో ఆయన తన చివరి రోజులను సామాజిక పరిశోధన, శిక్షణల కోసం ఏర్పాటు చేసిన జార్ఖండ్ రాజధాని రాంచీ లోని బగైచాలో గడపాలనుందని చెప్పారు. కానీ భారత ప్రభుత్వం అందుకు నిరాకరించింది. భయంకరమైన రద్దీగా ఉన్న దుర్భరమైన జైలు పరిస్థితులలో తొమ్మిది నెలలు గడిపిన తర్వాత విధ్వంస కరమైన కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్-19 సోకడం వలన ఆయన 2021, జులై 5 న మరణించారు. 15 మంది ఇతర మానవ హక్కుల కార్యకర్తలు – విద్యావేత్తలు, న్యాయవాదులు, సాంస్కృతిక కళాకారులు, సామాజిక కార్యకర్తలతో పాటు 16 వ వ్యక్తిగా స్వామిని కూడా అర్బన్ నక్సలైట్ గా కిరాతకంగా నేరం మోపి (ప్రధానమంత్రిని హత్య చేయడానికి ‘దేశవ్యాప్త’ ‘కుట్రలో పాల్గొన్నార’) నే పచ్చి అసత్యపు ఆరోపణలతో కస్టడీలోకి తీసుకున్నారు. భీమా కోరేగావ్ కస్టడీలో ఉన్న స్వామి మరణం, ఆలోచించ గల తమ పౌరుల ప్రాథమిక మానవ హక్కులను అణచి వేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు BK-16 కేసు ప్రతినిధిగా స్వామిని ఎంచుకున్నారని విమర్శనాత్మక దృష్టితో ఆలోచించే చాలామంది దేశ ప్రజలకి స్పష్టంగా తెలియ జేసింది.

స్వామి జైలులో ఉన్న సమయంలోనూ, అతని మరణానంతరం కూడా, అతని సన్నిహిత సహచరులు, పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, ఇంకా అనేకమంది ఇతర వ్యక్తులు వారి జీవిత కాలాల్లో అతనితో ఏర్పడిన పరిచయాల్ని కొందరు క్లుప్తంగా అయినా చాలా దృఢంగానూ, మరి కొందరు చాలా నిర్భయంగానూ, స్థిరమైన పద్ధతిలో బలమైన నివాళులు రాశారు. వారందరూ వారి స్మృతులు కలకాలం నిలిచేలా శాశ్వతమైన ముద్రను వేశారు (ఉదా. తెకేకరా 2020; టోనీ & మార్టిన్ 2020; అబ్రహం 2021; దాస్ 2021; ఫరేరా 2021; ఫోరం వార్తా లేఖ 2021; InSAF ఇండియా 2021c; జీవన్ 2021; సింఘా, et al 2021). వీటితో పాటుగా స్వామి స్వంత జ్ఞాపకాలతో 2021 లో “నేను నిశ్శబ్ద ప్రేక్షకుణ్ణి కాదు” (I Am Not A Silent Spectator) అనే పుస్తకం కూడా రాశారు : ఈ నివాళులు, స్వామి జ్ఞాపకాలు అతని జీవితంలోని అనేక హృదయాల్ని కదిలించే కోణాలను, స్ఫూర్తిదాయకమైన వృత్తాంత్తాలను అందిస్తాయి. అతని వ్యక్తిగత జీవిత ప్రయాణం; చర్చితో అతని సంబంధం; భారత ప్రభుత్వపు అన్యాయపు చర్యలు; కార్యకర్తగా అతను నెరవేర్చిన పనులు, సన్నిహితంగా ఉన్న ఆదివాసీ కమ్యూనిటీల నుండి అతను ఏర్పరచుకున్న సామాజిక సంబంధాలను నిరంతరం నెల కొల్పుకోవడం; 1990 ల నుండి జైలు శిక్ష వరకు అతను కలిసి పని చేసిన వారితో సంబంధంలో ఉండడం; ఆదివాసీల హక్కుల కోసం ఆయన చేసిన అంకిత పోరాటాన్ని అణిచి వేసేందుకు అతనిపై ప్రభుత్వం చేసిన కల్పిత ఆరోపణలు; ఈ మోపబడిన అసత్యపు ఆరోపణల ఆధారంగా మళ్లీ వేల మందిని నిర్బంధించడంపై అతన్ని మళ్ళీ విచారించడం మొదలైన విషయాలు అసలైన సత్యాలను తేటతెల్లం చేస్తాయి.

ఈ వ్యాసం స్వామి చేసిన ప్రజల కుపయోగమైన పనులు, వారి సంక్షేమానికి సంబంధించిన అనేక వారసత్వాల పబ్లిక్ రికార్డ్‌ లను జోడించడానికి ప్రయత్నిస్తుంది. “ప్రారంభంలో బగైచా ప్రజల-కేంద్రీకృత సామాజిక పరిశోధనా విధానం-అది ఒక సజీవ ఉద్యమంగా ఎందుకు, ఎలా రూపాంతరం చెందిందో వర్ణిస్తాం. బగైచా ప్రజల కదలికలు-వాటి ఆధారంగా సమరశీలమైన క్రియాశీలతను ఎలా నిర్మించుకున్నారో మేము విశదీకరిస్తాం. అదే సమయంలో, జార్ఖండ్‌లోని జెస్యూట్ మిషన్‌ తో బగైచా దగ్గరి సంబంధాన్నీ, చాలా మంది కొత్తవారితో సహా జెస్యూట్ మిషన్‌ తో ఎలాంటి దగ్గరి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారో వివరిస్తాం. తన మతపరమైన నిబద్ధతతో పాటు సామాజిక న్యాయాన్ని స్వామి ఎలా పొందుపరిచారో, అతని సహచరులు బగైచా ఉద్యమం అతని వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచిపోయేలా ఎలా కృషి చేస్తున్నారో చర్చించడం ద్వారా మేము ఈ నివాళిని ముగిస్తాం” –అని ఈ వ్యాస రచయితలిద్దరూ పేర్కొన్నారు.

చెప్పింది చేసి చూపించే ఉద్యమాచరణ గల సంస్థగా బగైచా ఎలా, ఎందుకు తయారైంది?

చెట్లతో నిండిన స్థలాన్ని గానీ తోటని గానీ ప్రత్యేకించి గ్రామం ఉమ్మడి భూమిలో భాగమైన మడ అడవుల్ని‘బగైచా’ అని అంటారు. ఇక్కడ వాటి నీడలో ఆదివాసీ గ్రామస్తులు సమాజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రజా న్యాయస్థానాలను నిర్వహించడానికి సమావేశమవుతారు. స్వామికి బాగైచా ఆదివాసీ వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా, సామాజిక పరిశోధన, విశ్లేషణలను నిర్ణీత విద్యాపరమైన అకడమిక్ వ్యాయామంగా అతను పరిగణించలేదు. ఆ విధంగా, 2000 సంవత్సరంలో, జార్ఖండ్‌ ను ఉత్తర భారతదేశంలో ఉన్న బీహార్ రాష్ట్రం నుండి వేరు చేసినప్పుడు, స్వామితో భావసారూప్యం కలిగిన అతని జెస్యూట్ సహచరులు కొత్త రాష్ట్ర రాజధాని రాంచీలో బగైచా ఇన్‌స్టిట్యూట్‌ ను స్థాపించారు. రాష్ట్రంలో మెజారిటీ అయిన ఆదివాసీ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అనేక సమస్యలపై తమ ఆందోళనలను వినిపించడానికి రాజధాని నడిబొడ్డున ‘బగైచా’ ఉండాల్సిన ఆవశ్యకతను సామాజిక కార్యకర్తలు గుర్తించారు. జార్ఖండ్ స్థాపనకు ముఖ్య కారణాలైన ఆదివాసీ వర్గాల భూములు, జీవన విధానాల పరిరక్షణ, ప్రత్యేకించి స్థానిక స్వపరిపాలన పద్ధతులు, ఉమ్మడి భూముల నిర్వహణల పరిరక్షణ జరిగేలా చూడడం వాళ్ళ లక్ష్యం.

భారతదేశంలో 1991 లో ప్రత్యేకించి నయా-ఉదారవాద ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థను ప్రారంభించినప్పటి నుండి పారిశ్రామికవేత్తలు, మైనింగ్ కంపెనీలు అపారమైన ఖనిజ సంపదలకు నిలయమైన జార్ఖండ్ ను తమ ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు రాష్ట్ర హోదా కల్పిస్తూనే ఏకకాలంలో వాగ్దానాలను ఉల్లంఘించడం ప్రారంభించింది. అయితే, సహజ వనరులతో ఉన్న తమ భూములను గనులు తవ్వడానికి ఆసక్తి ఉన్న కంపెనీలకు అక్షరాలా పళ్ళెంలో ఫలహారం పెట్టి ఆరగించమన్నట్లు అప్పగించడాన్ని ఆదివాసీ ప్రజలు ఇంతకు ముందే చూసి ఉన్నారు. భారతదేశంలో, బ్రిటిష్ వలసరాజ్యాన్నీ, పెట్టుబడిదారీ భూస్వాముల దురాక్రమణలను ఎదిరించి నిలిచిన బిర్సా ముండా (1875-1900), కొమరం భీమ్ (1900-1940) వంటి బలమైన నాయకుల మొదటి వారసులు ఆ సమూహాలలో కొందరున్నారు. అప్పటి నుండి, జార్ఖండ్ ప్రాంతంలో నాటి పాలనను ప్రతిఘటించడానికి ఉద్యమాల తర్వాత ఉద్యమాలు గొప్పపోరాట స్ఫూర్తితో ఉద్భవిస్తూనే ఉన్నాయి. పాలకవర్గ దుష్ట శక్తులన్నీ తమ స్వప్రయోజనాల కోసం పెట్టుబడిదారులతో కుమ్మక్కై, కుట్రలు చేస్తూ 1947 లో సాధించిన స్వేచ్ఛా- స్వాతంత్ర్యాలు ఈ దేశ ప్రజలతో పాటు సమానంగా ఆదివాసీ ప్రజలకు కూడా చెందుతాయని కపటబుద్ధితో చేసిన హామీలను ఏమాత్రం నెరవేర్చే ప్రయత్నాలు చెయ్యకుండా ద్రోహం చేస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి వారు కూడా సమాన పౌరులుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో, చారిత్రాత్మకంగా భారత ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాపాడేందుకు దార్శనిక చట్టాలను ఆమోదించినప్పటికీ, జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు వారి చట్టపరమైన బాధ్యతలను నిర్మొహమాటంగా బహిరంగంగానే విస్మరిస్తున్నారు. ఒక క్రమపద్ధతిలో వాటిని దాటవేస్తూ, కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు (వివరణాత్మక చరిత్ర కోసం, ఉదాహరణకు చూడండి, సుందర్ 2009; డంగ్‌ డంగ్ 2023; పుతుమట్టతిల్ 2014; బగైచా రీసెర్చ్ టీమ్ 2015).

ప్రజలు ఇష్ట పూర్వకంగా కలిసి రావడానికి , తమ ఆందోళనల నిర్మాణాత్మక మూలాలను, వారి కమ్యూనిటీల పాలనకు సంబంధించిన కార్యక్రమాలను, పరిష్కారాలను సావధానంగా అర్థంచేసుకోవడానికి, సమిష్టిగా ఆలోచించడానికి బగైచా అనే స్థలం ఒక వేదికగా మారింది. బగైచా పరిశోధనా బృందం నిర్వహించిన నిర్బంధంలో ఉన్న అండర్ ట్రయల్స్ పరిశోధన ప్రకారం వాటాదారులకు – రాష్ట్రానికి మధ్య సంభాషణలను ప్రోత్సహించడం నుండి, ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం వరకే కాదు, అంతకు మించి, సామాజిక న్యాయ కార్యాచరణ మార్గాలు, ఆదివాసీ పోరాటాలు, త్యాగాలను స్వామి సుదీర్ఘంగా గమనించారనడానికి 2015 లో బగైచా బృంద పరిశోధన నివేదిక ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

బగైచా చేపట్టిన కార్యక్రమాలు నేటి సందర్భంలో దాని విస్తృత లక్ష్యాలను ప్రతిబింబించాలనే స్పృహతో కూడా స్వామి ఉన్నారు, ఉదాహరణకు, లింగ సున్నితత్వంతో వ్యవహరించడం. ఆదివాసీ సమాజాలు వివిధ మార్గాల్లో లింగ రహిత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించినప్పటికీ, అక్కడ శ్రమలో లైంగిక విభజన ప్రబలంగానే వ్యాప్తిలో ఉంది. జార్ఖండ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ‘అలోకా కుజుర్’, 2021 లో దళిత్ కెమెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివాసీ అణచివేతను అర్థం చేసుకోవడంలో స్వామి స్త్రీవాద విధానాన్ని వివరిస్తూ “స్త్రీలను మనుషులుగా గౌరవించిన వ్యక్తి స్వామి ” అని అన్నారు. పోరాటరంగంలో, మహిళల స్వంత హక్కుల కోసం, పాలనా వ్యవహారాల్లో మహిళల గొంతులను, రచనలను స్వామి ఎలా ప్రోత్సహించారో కుజూర్ గుర్తు చేసుకున్నారు. (ఆదివాసీలలో కూడా పాలనా వ్యవహారాలు సాంప్రదాయకంగా పురుషుల చేతుల్లోనే ఉంది). బహిరంగ ప్రదేశాల్లో, ప్రతిఘటనలలో పాల్గొంటున్న ప్రదేశాల్లో మహిళల కోసం అతను వ్యక్తిగతంగా సమగ్రమైన ఆచరణాత్మక ఏర్పాట్లను పర్యవేక్షించేవారు. ఉదాహరణకు సురక్షితమైన ప్రయాణం, మంచి శానిటరీ సౌకర్యాలు పిల్లల సంరక్షణ బాధ్యతల గురించి పట్టించుకుని జాగ్రత్తలు తీసుకునేవారు. కార్యకర్త “దయామణి బార్లా” 2021 లో అవార్డు-విజేతగా గెల్చినప్పుడు ఆమె కార్యశీలత స్వామి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిల్చిపోయింది. ఆమె జార్ఖండ్ శాసనసభకు ఎన్నికైనప్పుడు అతనిచ్చిన మద్దతు, మార్గదర్శకత్వం స్మరించుకోదగినవి. అలాగే, నేడు బగైచాలో, స్త్రీలతో పాటు పురుషులు కూడా పరిపాలనా పరమైన బాధ్యతలను చేపట్టేలా ప్రోత్సహించారు. బగైచాలో పని చేసే వివిధ సేవా కార్మికులందరూ శాశ్వత ఉద్యోగులు. అలాగే అక్కడ ఉద్యోగాల్లో ఆదివాసీలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వారు పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీనే గాక మొక్కలు నాటే సమయాల్లో, పంటకోత సీజన్‌ లలో వారి గ్రామాలకు తిరిగి వెళ్లేందుకు సెలవు సదుపాయం కూడా పొందుతారు. కార్మికులందరూ బాగైచాలోనే గాక ఇతర ప్రాంతాలలో కూడా అంతర్జాతీయ స్థానిక ప్రజల దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వంటి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆదివాసీల ‘జల్, జంగల్, జమీన్’ (నీరు, అడవులు, భూములు) సంస్కృతి, వారి భాషలను రక్షించడానికి రూపొందించబడిన రాజ్యాంగ హామీలు, ఇతర శాసన నిబంధనల గురించి ఆదివాసీలకు విస్తృతమైన అవగాహన కల్పించడంలో స్వామి విలక్షణమైన సామాజిక కార్యాచరణలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి నాయకులు కొన్ని అసత్య, అధిక ప్రసంగాలు చేసినప్పటికీ 2018 లో “పతాల్‌ గడి” ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. ఎందుకంటే, నిరక్షరాస్యులైన ముండా గ్రామస్తుల వనరులపై గల చట్టబద్ధమైన హక్కుల మీదా, వారి స్వయం నిర్ణయాధికారం మీదా వారి అట్టడుగు పేదరిక స్థితి మీదా ఒకదాని తర్వాత ఇంకొకటిగా వరసగా వచ్చిన ప్రభుత్వాలు బలంగా ప్రభావితం చేస్తూ హక్కుల ఉల్లంఘనలు చేశాయి. ఇతర సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, రచయితలతో పాటు, స్వామి ఉద్యమాన్ని పూర్తిగా అణచివేయడం కంటే ప్రజలతో శాంతియుత చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి వారితో సంభాషించడం మంచిది అని ఫేస్‌ బుక్ పోస్ట్ లలో సూచించినందుకు గానూ స్టాన్ స్వామి, అలోకా కుజుర్, వినోద్ కుమార్, రాకేష్ రోషన్ కీరో, థియోడర్ కీరో, వాల్టర్ కందుల్నా తో సహా మరో 19 మందిపై దేశద్రోహం కేసు పెట్టారు. (స్వామి 2021: 74–75; Scroll. in 2018; తో పాటు The Wire 2019 కూడా చూడండి). చివరికి, ఆ కేసులను ముందుకు కూడా తీసుకెళ్లలేదు, దీన్ని బట్టి కార్యకర్తలను భయపెట్టడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తుంది.

జార్ఖండ్‌లో ఆదివాసీలు, ఇతర అణగారిన సంఘాలు నిర్వహించిన ధర్నా (సిట్-ఇన్) లకు స్వామి హాజరుకాని ప్రదర్శన ఒక్కటి కూడా ఉండదు. అతను ఆదివాసీ హక్కుల గురించి, మైనింగ్ కార్పొరేషన్లు ప్రభుత్వ సహాయంతో ఆదివాసీల భూముల్ని ఆక్రమిస్తున్న విధానాలను ఎత్తిచూపుతూ పత్రికలకు, అప్పుడప్పుడు దినపత్రికలకు కూడా నిరంతరం వారి సమస్యల గురించి రాస్తూనే ఉండేవారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ఐక్య సంఘటనలు, అభ్యాస కమ్యూనిటీలను నిర్మించడంలో స్వామి నిబద్ధత భారతదేశం నుండే గాక విదేశాల నుండి కూడా అనేక మంది సామాజిక పరిశోధకులకు శిక్షణ, కార్యాచరణ-ఆధారిత పరిశోధనలలో పాల్గొనడానికి ఆయన చేసిన కృషి బాగైచాను ఒక నోడల్ పాయింట్‌ గా గుర్తింప చేసింది. వీరిలో చాలామంది సామాజికావగాహన కలిగిన కార్యకర్తలు-పరిశోధకులు. వారు దక్షిణ భారతదేశానికి చెందిన కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు ఇండియన్ సోషల్ ఇన్‌స్టిట్యూట్‌ లో 15 సంవత్సరాల పాటు స్వామి వద్ద బోధనలో శిక్షణ పొందిన వారు (1975-1990). స్వామి జార్ఖండ్‌కు శాశ్వతంగా వెళ్లిన తర్వాత, ప్రతి మూడు, నాలుగు సంవత్సరాల కొకసారి దక్షిణ భారతదేశానికి వచ్చి మాజీ సహోద్యోగులు, విద్యార్థులను కలుస్తుండేవారు. ఈ కలయికలు స్వామితో, బగైచాతో సన్నిహితంగా ఉండటానికి చాలామందికి గొప్ప స్ఫూర్తి నిచ్చాయి.

నిజానికి అక్టోబరు 2020 లో, BK-16 కేసులో అతన్ని అరెస్టు చేసిన సమయం, జార్ఖండ్‌ లో బగైచా పరిశోధన తర్వాత, అతను నిర్బంధంలో ఉన్న వ్యక్తులకోసం దాఖలు చేసిన ఒక పిల్ మరింత ముందుకు వెళ్లాలని విచారణకు ఎదురుచూస్తున్న సమయం. క్లుప్తంగా చెప్పాలంటే, 2015లో, ఒక సన్నిహిత సహచరుడిని అక్రమంగా అరెస్టు చేయడం గురించి తెలుసుకున్న స్వామి, ఆ క్రమంలో అనేక మంది ఆదివాసీ-మూల నివాసీ వ్యక్తులను, కార్యకర్తలను, బూటకపు ఆరోపణలపై నిర్బంధించడం గురించి మరింత ఎక్కువగా తెలుసుకున్నారు. జార్ఖండ్ అంతటా విచారణలో ఉన్న ఖైదీల పరిస్థితిని, వారి జనాభానూ, అలాగే అరెస్టులకు గల కారణాలను అన్వేషించడానికి ఒక పరిశోధనా అధ్యయనాన్ని స్వామి రూపొందించారు.

భారతదేశంలోని రాజకీయ ఖైదీల పరిస్థితుల గురించి ఆందోళన చెందుతున్న ఇతర వ్యక్తులు, ప్రత్యేకించి న్యాయవాదులు వంటి వివిధ కక్షిదారులతో విస్తృతమైన చర్చల తర్వాత, స్వామి అతని సహచరులు ఈ ఖైదీల జనాభా, వారి పరిస్థితుల గురించి ఖచ్చితమైన సమాచారం సులభంగా అందుబాటులో లేదని గ్రహించారు. వారు జైళ్లలోకి కూడా ప్రవేశించలేకపోయారు, ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ వంటి ఉన్నతాధికారులతో మాట్లాడటానికి వారు అభ్యర్ధించి నప్పటికీ వారికెటువంటి సమాధానం రాలేదు. వారు వివిధ జైళ్లకు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దరఖాస్తులను పంపినప్పటికీ, సూపరింటెండెంట్లు తగినంత డేటాతో స్పందించలేదు సరికదా సమాధానం కూడా ఇవ్వలేదు.

ఏది ఏమైనప్పటికీ, బగైచా రీసెర్చ్ టీమ్ 2015, ఇటీవల రిద్ధి దస్తిదార్ (2021) నివేదికల్లో వివరించినట్లుగా, స్వామి, అతని సహచరులు చివరికి ఈ విషయాల గురించి అవగాహన కలిగిన ఇద్దరు మనుషుల ఆచూకీ తియ్యగాలిగారు. వారు బెయిల్‌పై ఉన్న పలువురు ఖైదీలను, ఇంకా జైలు శిక్షల ననుభవిస్తూ నిర్బంధంలో ఉన్న కొంతమందిని సంప్రదించడానికి సహాయం చేశారు. వీరికీ సమాచారం ఇచ్చిన ఇద్దరిలో ఒకరు స్వామికి తెలిసిన సాంస్కృతిక కార్యకర్త. అతని పేరు ఒక రాజకీయ నాయకుడి కుమారుడిని చంపినతని పేరే! అతని పేరు ఆధారంగా సాంస్కృతిక కార్యకర్తపై పోలీసులు రాజకీయ నాయకుడి కుమారుడి హత్యా నేరారోపణ చేయడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకుని అతనికి మరణశిక్ష కూడా విధించారు. మరొకతను జార్ఖండ్ విస్తాపన్ విరోధి జన్ వికాస్ ఆందోళన్ సహ వ్యవస్థాపకుడు, అతను మావోయిస్టు మద్దతుదారుగా పోలీసులు అనుమానిస్తున్నట్లు పేర్కొంటూ సుమారు 11 నెలల పాటు జైలులో నిర్బంధించారు. చాలా మంది అరెస్టయినవారిలో ఆదివాసీల హక్కుల గురించి అవగాహన కలిగిన మనస్సాక్షి ఉన్న వ్యక్తులు. ఉదాహరణకు, మైనింగ్ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా ఇతర వ్యక్తులను సంఘటితం చేయడం, సమీకరించడం వంటి వాటిపై తమ గళాన్ని వినిపిస్తున్న వారని అండర్ ట్రయల్స్ పరిశోధనలో వెల్లడైంది. అధ్యయనంలో పాల్గొన్న 102 మందిలో కేవలం 3 శాతం మందికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)తో సంబంధం లేదన్నారు. మొదటి సమాచార నివేదికలు (ఎఫ్‌ ఐ ఆర్‌ లు) పోలీసులు వెంబడించి జార్ఖండ్ అడవుల్లోని ‘వారి డెన్ లలో’ చాలామంది ప్రజల్ని పట్టుకున్నామని పేర్కొన్నప్పటికీ, వారి ఇళ్ల నుండి, తరచుగా రాత్రి సమయంలో చాలా మందిని తీసుకు వెళ్లినట్లు పరిశోధనా బృందం కనుగొంది. ఈ ఖైదీలే వారి కుటుంబాలకు ప్రధాన జీవనోపాధిని సంపాదించి పెట్టేవారు. ఉపా ఐ పి సి సెక్షన్ 17 కింద అభియోగాలు మోపబడిన వారికి దిగువ కోర్టుల ద్వారా రక్షణ గానీ బెయిల్ గానీ పొందడం అసాధ్యం. హైకోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే న్యాయవాదులు కనీసం రూ. 15,000 (అప్పట్లో) వసూలు చేస్తారు, అయితే బెయిల్‌కు కనీసం రూ. 30,000 అవసరమవుతాయి. ఆ పేద కుటుంబాలు ఈ న్యాయపరమైన ఖర్చుల కోసం తమ కొద్దిపాటి ఆస్థులను గానీ వస్తువులను గానీ తెగనమ్ముకోవలసిందే! లేదా నెలల నుండి సంవత్సరాల తరబడి తమ ప్రియమైన వారిని జైలులో వదిలి వేయాల్సి వస్తుంది.

జార్ఖండ్‌ లోని ప్రధానంగా అట్టడుగు వర్గాలకు చెందిన అమాయక ప్రజలను వక్ర భాష్యాలతో (ఉదా. ఎఫ్‌ ఐ ఆర్‌ లలో తప్పుడు వాదనలు) విచారణల పేరుతో కటకటాల వెనక్కి నెట్టడానికి రాజ్యం చేసిన పన్నాగాలు స్వామిని బాగా కలవర పరిచాయి. కానీ ఆ విచారణలో ఉన్న నిర్బంధ వ్యక్తుల కుటుంబాల పట్ల అతని నిబద్ధత మాత్రం అంతటితో ముగియలేదు. 2017 లో ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫైల్ చేశారు కానీ అలాంటి కేసులు కోర్టుల్లో చాలా నెమ్మదిగా కదులుతాయి. 2018 లో భద్రతా సంస్థలు అతన్ని వేధించడం ప్రారంభించినప్పటి నుండి 2021 లో ఆయన మరణించే వరకు దాని ఫలితం పెండింగ్‌ లోనే ఉండిపోయింది. అయినప్పటికీ, స్వామి అనుయాయి సంఘాలు ఆ పని కొనసాగేలా చూస్తున్నాయి.

ఉద్యమం-ఆధారంగా కార్యాచరణను పెంపొందించిన విధానం

బగైచా ఉద్యమం ప్రధానంగా బృందాలుగా పనిచేస్తుంది, పనిలో భాగంగా మరింత మందికి శిక్షణ ఇస్తుంది. తమ దైనందిన జీవితాలు రూపొందడంలో చారిత్రక పరిణామాలు, సామాజిక శక్తి నిర్మాణాలు, నిబంధనల పాత్రను గుర్తించేలా ట్రెయినీలకు శిక్షణ నిస్తారు. భారతదేశంలో నిరంతరంగా వెనుకబడి ఉన్న వర్గాలు ఎవరు, నిర్దిష్ట సాంస్కృతిక నిబంధనల వల్ల చిరకాలం అధికారం నిలుపుకుంటున్న కొద్దిమంది ఎవరు అని ప్రశ్నించడం వారికి నేర్పుతారు. ఛోటానాగ్‌పూర్ అద్దె చట్టం 1908, సంతాల్ పరగణాల అద్దె చట్టం 1949, పంచాయితీల నిబంధనలు షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే పెసా(PESA) చట్టం 1996 వంటి చట్టపరమైన సాధనాలను ఆదివాసీల రాజ్యాంగ హక్కుల అమలుకు ఉపయోగించుకోవడానికి స్వామి తన పనిలో చాలా మంది ఆలోచనాపరుల సహకారాన్ని పొందారు. భారతదేశంలో అణగారిన వర్గాల నుండి ప్రముఖ వ్యక్తులైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, జైపాల్ సింగ్ ముండా వంటి వారికి సామాజిక న్యాయం ప్రాతిపదికగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పెద్ద పోరాటం చేయవలసివచ్చింది. తరువాతి కాలంలో, ఆ రాజ్యాంగాన్ని నెరవేర్చడానికి కూడా చాలా మంది పోరాటాలు చేయవలసివస్తుంది. స్వాతంత్ర్య సమరయోధులు బిర్సా ముండా, కొమరం భీమ్ నేతృత్వంలోని ఆదివాసీల చారిత్రక జల్, జంగల్, జమీన్ ఉద్యమాల ద్వారా స్వామి బాగా ప్రభావితమయ్యారు. వర్గ పోరాటానికి సంబంధించిన మార్క్సిస్ట్ భావన, పాలో ఫ్రీర్ (Paulo Freire) ప్రజలను సమీకరించడానికి వాడిన సాంస్కృతిక నుడికారాలు, వాడుక భాష కూడా అతని ఆందోళన విధానాన్ని ప్రభావితం చేశాయి.

ఆదివాసీల స్థానికత, నిర్దిష్ట కమ్యూనిటీల సైద్ధాంతిక మూలాధారాలు తెలియని సామాజిక విశ్లేషకులు ప్రజలను సమీకరించడంలో, వారి అణచివేతకు ప్రధానమైన కారణాలను అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి, వారికి సవ్యమైన రీతిలో దిశానిర్దేశం చేసే విషయంలో తక్కువ ప్రభావవంతంగా ఉంటారని స్వామి గుర్తించారు. తమ సమాజ పరిస్థితికి నిర్మాణాత్మక పునాదులను స్పష్టంగా అర్థం చేసుకుని, ఆ అవగాహనను ప్రజలకు తెలియజేస్తూ వారిని సమీకరించగలిగే వ్యక్తులతో (organic intellectuals) స్వామి సన్నిహితంగా పనిచేశారు. భారతదేశంలో, సమాజంపై బ్రాహ్మణవాదపు ఆధిపత్య పట్టు, తమపై సవర్ణ సమూహాల సాంస్కృతిక ప్రభావం వల్ల అణగారిన ప్రజలు అణచివేతను అంతం చేయడానికి అంబేద్కర్ ఇచ్చిన “విద్యనభ్యసించండి, ప్రతిఘటించండి, సంఘటితంగా ఐక్య పోరాటాలు నిర్మించండి” అన్న పిలుపును అందుకుని రాలేకపోయారు. అయితే ఆధిపత్య సమూహాల ధోరణులను అనుసరించి, తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్న వారిలో కొందరు సామాజిక క్రియాశీలతతో వారి సమూహాల మెరుగైన జీవన విధానాల కోసం వివిధ మార్గాల్లో పని చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ, వీరిలో కొందరు తమను తాము సామాజికంగా-ఆర్థికంగా తమ సొంత సమూహాల లోని మిగిలిన వారి నుండి వేరు కావడానికి ప్రయత్నిస్తారు. కొందరు ‘తటస్థతను’ ప్రదర్శిస్తారు. మరి కొందరు అణచివేత దారులలో చేరిపోతారు. (పుతుమట్టత్తిల్ 2014).

బగైచా సంస్థ సామాజిక న్యాయ పరిశోధన, కార్యాచరణలకు స్థానిక ప్రజలతో, సేంద్రీయ మేధావులతో కలిసి పనిచేయటం అవసరం. అలాగే యువతరాలకు తమ సామాజిక పరిస్థితులను విశ్లేషించుకునే సామర్థ్యాన్ని పరిచయం చేయడం అవసరం. శిక్షకులకు ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు ‘బ్రౌన్ సేవియర్స్’ గా మారే ప్రమాదాన్ని గుర్తుంచుకోవడం. సాంఘిక విశ్లేషణ విధానం శిక్షణ పొందుతున్న వారిని సూక్ష్మమైన కుల వివక్షతో సహా సామాజిక శక్తి చలన సూత్రాలను అర్థం చేసుకోవడానికీ, మరింత ముందుకు నడిపించడానికీ వీలు కల్పిస్తుంది. అంతులేని అణచివేతల వలయాల నుండి విముక్తి పొందడానికీ, ప్రధాన స్రవంతి మీడియా ద్వారా ప్రచారం చేయబడుతున్న తప్పుడు వాగ్దానాలపట్ల అప్రమత్తంగా ఉండడానికీ, తమకు వ్యతిరేకంగా రూపొందించ బడుతున్న ఏకాభిప్రాయాన్ని తిరస్కరించడానికీ వీటన్నిటికీ చర్య తీసుకోవాలో లేదో, ఒకవేళ తీసుకుంటే ఏ విధమైన చర్య తీసుకోవాలో చివరికి ప్రజలే స్వయంగా నిర్ణయించుకుంటారు. ఇతర సామాజిక న్యాయం నేర్చుకునే పరిసరాలలో లాగానే, ఇక్కడి ఆదివాసీ ప్రజలు కూడా నేర్చుకోవడానికి సమయం పడుతుందని బగైచా ఉద్యమం గుర్తించింది. విద్యుత్ప్రేరకం లాంటి ఇండక్షన్ కోర్సు కొంతమంది విద్యార్థులను తమ చుట్టూ ఉన్న అణచివేత లక్షణాలను గుర్తించడానికీ, వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి వారి కొత్త అవగాహనతో ఆలోచించడానికీ, జీవించడానికీ వివిధ అవకాశాలను అన్వేషించడానికి ప్రేరేపిస్తుంది. ఈ విద్యార్థులు ఆన్‌ లైన్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కృషి చేస్తారు. ఉదాహరణకు, తమ వారి కోసం అరుదైన చారిత్రక పుస్తకాల సేకరణను కలిగి ఉన్న చైబాసాలోని ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లోని జెస్యూట్ స్పెషలిస్ట్ లైబ్రరీలకు ప్రయాణిస్తారు. చివరికి, కొందరు సామాజిక న్యాయ ఉద్యమాలలో చేరే క్రమంలో అంతకుముందున్న తమ సంప్రదాయ జీవిత పంధాలను తిరస్కరిస్తారు. స్వామి కూడా అతని జెస్యూట్ అర్చకత్వానికి అతని సామాజిక న్యాయ కార్యశీలతలకు మధ్య సంధి చేసుకోవలసి వచ్చింది.

మతపరమైన నిబద్ధత ఒక అడుగుజాడగా సామాజిక న్యాయ కార్యశీలత వైపుగా నడిపిన విధానం

జెస్యూట్‌ వ్యక్తులకు వారి విశ్వాసాలను అనుసరించడానికి, మనసు చెప్పిన విధంగా నడచు కోవడానికి జీసస్ సొసైటీ ఎప్పుడూ అవకాశాన్నిస్తుంది. తన జెస్యూట్‌ సమాజం అందించిన ఈ అవకాశాన్ని స్వామి పూర్తిగా వినియోగించుకున్నారు. కాలక్రమేణా అతనికి మతపరమైన విధుల కంటే హేతుబద్ధత, శాస్త్రీయ దృక్పధమే అతని జ్ఞాన మీమాంసలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అతను ప్రతిదాన్ని ప్రశ్నించేవారు. విద్యార్థులతో జరిగే సమావేశాలలో అతను జీసస్ సొసైటీ పనితీరును విమర్శించేవారు: ఆలోచించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ అది ప్రజల శోక ఘోషను వినకపోవడం ప్రజాస్వామ్యం కాదని, వాదించేవారు. అతని విధానం చాలా మందికి అసౌకర్యాన్ని కలిగించింది. కొందరు నిశ్శబ్దంగా అసూయ పడేవారు. జెస్యూట్ ఆచారాలను పాటించకుండా నిరాకరిస్తున్నారని అతనిపై ఫిర్యాదులు చేసేవారు. కానీ స్వామి తన నమ్మకాల మీదా విశ్వాసాల మీదా దృఢంగా నిలబడ్డారు. తన సామాజిక స్పృహనూ, న్యాయ భావననూ ఇతరులు తనతో చేరడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా కొన సాగించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. స్వామి ఏది చెప్తారో దాన్ని ఆచరించే చిత్త శుద్ధి, నిబద్ధతలను పాటించడం వల్ల బగైచా ఉద్యమంలో స్వామి, అతని సహచరులు మార్గదర్శకత్వం వహించిన పరిశోధకులు, చురుకైన కార్యకర్తలు-శిక్షణార్థులు, జెస్యూట్ ప్రారంభకులు వారి విశ్వాసాలలో ధృడంగా నిలబడడం నేర్చుకున్నారు.

స్వామి, అతని సహచరులు బగైచాలో జార్ఖండ్ ఆదివాసీ సమూహాల నుంచి సొసైటీ ఆఫ్ జీసస్‌ లో కొత్తగా శిక్షణ కోసం ప్రవేశిస్తున్న వారికి సామాజిక విశ్లేషణ కోర్సులను నిర్వహిస్తారు. కొత్తగా చేరిన వారికి ప్రాథమిక ఆధ్యాత్మిక శిక్షణను పూర్తి చేసి, భాషాధ్యయనాలను ప్రారంభించిన తర్వాత ఇది అందించబడుతుంది. దాదాపు 20-30 సంవత్సరాల వయస్సు గల ఈ యువకులకు ఆదివాసీ కులాల గురించి, వారి (దళిత) గుర్తింపుల గురించి, చరిత్రల ప్రాముఖ్యత గురించి, ఆదివాసీ వర్గాలకు ప్రత్యేకించి కల్పించబడిన రాజ్యాంగ హక్కుల గురించి గానీ అంతగా తెలియదు. ఎందుకంటే అధికారిక పాఠశాల విద్యకు సంబంధించిన జాతీయ విద్యాశాఖ సిలబస్‌ లో స్థానిక సమాజాలపై కుల వ్యవస్థ ప్రభావం, దాని అనుబంధ అణచివేత కు సంబంధించిన సమాచారం ఉండదు. శీఘ్ర (ఇండక్షన్) కోర్సు ప్రారంభకులకు తమ చుట్టూ వారి సొంత సమూహాలలో ఏం జరుగుతుందో ‘అర్థం’ చేయించడానికీ, వారి హక్కులగురించి బలంగా నొక్కి చెప్పడానికీ, వారి భవిష్యత్తుకు అది ఎలా కీలకం కానున్నదో అనే విషయాల గురించి ఆలోచించు కోవడానికి బాగా సహాయపడుతుంది.

ఇండక్షన్ కోర్సులో అనుభవం లేని కొత్త వారిని సామాజిక విశ్లేషణల గురించిన ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తారు. వారు ‘ఈ సమస్యకి పారిష్కారమార్గ మేమిటి?’ అని అడగడం సర్వసాధారణం. జెస్యూట్ క్రైస్తవ దూతలు కమ్యూనిటీ నాయకులుగా మారవలసిన బాధ్యతను కలిగి ఉండాలని, అంటే ప్రధానంగా ఆధ్యాత్మిక నాయకులు, పాఠశాల ఉపాధ్యాయుల కంటే సామాజిక అధ్యాపకులుగా తమ ప్రాథమిక పాత్రను పోషించాలని బగైచా ఉద్యమాభిప్రాయాన్ని పరిచయం చేస్తారు. అంతే గాకుండా బగైచా ఉద్యమం ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ అహింసామార్గానికి కట్టుబడి ఉండాలని నొక్కి చెబుతుంది.

స్వామి తన చుట్టూ ఉన్న ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను ఇతరులకు వదిలి వేయడానికి ససేమిరా ఇష్టపడరు. ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన లక్ష్యాలలో అది ఒక భాగం. మరో మాటలో చెప్పాలంటే, చారిత్రాత్మకంగా జెస్యూట్‌కు ‘మిషన్’ అంటే అర్థమేమిటంటే మిషనరీలు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం, దాతృత్వాన్ని ఆచరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ లౌకికవాదం, సామ్యవాదం, న్యాయం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ వంటి భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ప్రజాస్వామ్య ఆదర్శాలను ఆచరించడమే గాక ప్రజల పోరాటాలతో చేతులు కలపడంలో బగైచా తత్వశాస్త్రం ఇమిడి పాతుకుపోయింది. జెస్యూట్‌ లు, పూజారులతో సహా బోధకులు కూడా రాజ్యాంగ, ప్రాథమిక మానవ హక్కుల విలువలను వారి సొంత జీవితంలో, వారి సొంత సమాజాలలో స్వీకరించి, ఆచరిస్తే తప్ప, వాటి గురించి మాట్లాడేటప్పుడు వారికి ఎటువంటి విశ్వసనీయత ఉండదు. బగైచాలోని స్వామి సహోద్యోగులు ఇది చాలా కష్టమైన పని అని గుర్తించారు. అందుకే చాలా మంది క్రైస్తవ గురువులు, అనుభవం లేనివారు జెస్యూట్‌ మిషన్ కి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలల్లో బోధిస్తూ లోకసమ్మతి పొందిన బాగా స్థిరపడిన పద్ధతుల ప్రకారం జీవించడానికి ఇష్టపడతారని వాళ్ళు గుర్తించారు. ఈ మిషనరీ పాఠశాలలు ఇతర ఫీజులు చెల్లించే ప్రైవేట్ సంస్థలతో పోటీ పడవలసి వస్తుంది. అందుచేత వారు తమ విద్యా కార్యక్రమాలలో సామాజిక విశ్లేషణను చేర్చడానికిష్ట పడరు. మార్కెట్ ఎకానమీలో విద్యాసంస్థలుగా మనుగడ సాగించడానికి పరీక్షల ఫలితాలు పాఠశాలల పనితీరుపై గొప్పగా ప్రతిబింబించాల్సిన అవసరం ఉన్నందువల్ల, సిలబస్ పూర్తయిందనీ, విద్యార్థులు పరీక్షలకు బాగా సిద్ధమయ్యారనీ ఉపాధ్యాయ సిబ్బంది నిర్ధారించు కోవాలి. పెట్టుబడిదారీ విధానంలోని ‘అభివృద్ధి’, ‘యోగ్యత’, ‘వ్యక్తిగత ఎదుగుదల’ వంటి ఆలోచనలు మిషనరీ స్ఫూర్తిని తుంగలో తొక్కాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు సామాజిక న్యాయాన్ని తమ సొంత జీవితాలలో, పనిలో పొందుపరుచుకోలేక నిజమైన అభివృద్ధికి దూరం అవుతున్నారు. అయినప్పటికీ, స్వామి, అతని సహచరులు తమ విధానాన్ని కొనసాగించారు, ఎందుకంటే వారు బగైచా సంస్థ తత్వశాస్త్రాన్ని పరిచయం చేస్తున్న వారిలో కొందరు కార్యోన్ముఖులు అవుతున్నారు.

భారతదేశంలో మతాతీత, లౌకిక భావాల ముసుగులో కూడా చాలా మంది వ్యక్తులకు వారి మత విశ్వాసాలతో మతపరమైన ఆచారాల పద్ధతులతో బలమైన సంబంధం ఉంటుంది. అలాంటి దేశంలో ఒక పూజారి యైన స్వామి తన మతపరమైన సాధనతో పాటు ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషి బహు విధాలుగా ప్రశంసనీయమైనది.

నేటి బగైచా ఉద్యమం

ఆదివాసీలతో స్వామి చేసిన పనితో మొదలై, బగైచా ఉద్యమం దిన దినాభివృద్ధి చెందుతోంది. సామాజిక బాధ్యతతోపాటు, సమ సమాజ జ్ఞానాన్నిచ్చే కేంద్రంగా జార్ఖండ్‌ లో బగైచా విలసిల్లుతుంతోంది. బహు శాస్త్రాంతర కార్యాచరణతో అనేక సమూహాల పరిశోధన విధాన పాఠ్యక్రమాలతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది!

అయితే, కొన్ని సమూహాలలో హిందూ జాతీయవాదాన్ని ఒక ఉగ్రవాదంగా ప్రేరేపిస్తున్న ప్రస్తుత వాతావరణంలో, తమ జాడ కనుక్కుని ప్రభుత్వ నిఘా యంత్రాంగం తమను వేధిస్తుందని భావించి, కొంతమంది వ్యక్తులు బగైచాతో సహవాసం చేయడానికి వెనుకాడుతున్నారు. స్వామి మాతృసంఘంలో, ‘జాతీయవాద’ జాతి వ్యతిరేక సమూహాలు ప్రభుత్వం ఆమోదించిన చట్టాలు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆకస్మిక దాడులు జరిపిన కారణంగా చర్చి కార్యకలాపాలు నిలిచిపోతాయనే భయం కూడా ఉంది. స్వామి మరణించిన తర్వాత, దేశంలోనూ అంతర్జాతీయంగానూ వచ్చిన భారీస్పందన భారత దేశం లోని చాలా మంది జెస్యూట్‌ లకు, వారి దివంగత సహోద్యోగి చేసిన అద్భుతమైన సమాజ సేవ గురించి గొప్ప అవగాహన కలిగించింది. జెస్యూట్‌ ల నుండి ప్రజలు అధికంగా ఆశలు పెట్టుకుని నిరీక్షిస్తున్నందు వల్ల జెస్యూట్ ఉన్నతాధికారుల స్థానంలో మార్పు జరుగుతోంది, కాబట్టి వారు తమను, తమ విద్యార్థులను సామాజిక సంక్షేమ మార్పుకు మరింత కట్టుబడి ఉండేలా సిద్ధం చేయాలని గుర్తిస్తున్నారు. జీసస్‌ సొసైటీ లోని కొంతమంది స్థానిక ఉన్నతాధికారులు కొత్త వ్యక్తులను నిజాయితీకి కట్టుబడి మనస్సాక్షితో మసలుకొమ్మని బోధిస్తున్నారు. సామాజిక రంగంలో పని చేయమని వారిని ప్రేరేపిస్తూ బాగైచాకు బహిరంగంగా మద్దతు నిస్తున్నారు. బెంగుళూరులో ఉన్నటువంటి సామాజిక విశ్లేషణా సంస్థను బగైచాలో కూడా ప్రారంభించాలని స్వామి కలలు కన్నారు. అంతేగాక బగైచాలో స్వామి సహచరులు అతని పనిని కొనసాగించాలని నిశ్చయించుకున్నారు, ఎందుకంటే ఈ పని గతంలో కంటే ఇప్పుడు చాలా కీలకమని వారు గుర్తించారు. బగైచా విధానం లోని సమాచార ప్రసారం కొత్తగా చేరుతున్నవారికి ఏ రకంగానూ హాని చేయని విధంగా జరుగుతుందని వారు నిర్ధారిస్తున్నారు.

కోవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థ పనిచేయని పరిస్థితి ఉన్నా సరే, బాగైచా పరిశోధనా బృందం నిర్బంధంలో ఉన్నవారి కోసం అండర్ ట్రయల్ పిల్‌ ను కొనసాగిస్తున్నారు. వారి కత్యంత గౌరవనీయమైన బృంద నాయకుడు, సహోద్యోగి మరణించి నందుకు స్వామి సహచరులకు విద్యుద్ఘాత ప్రకంపనలు కలిగాయి. ఎంత దుఃఖం ఉన్నప్పటికీ వారు స్వామి కృషిని కొనసాగించడమే ఆయన వారసత్వానికి వారిచ్చే నివాళిగా భావిస్తున్నారు. అతని ప్రజాస్వామిక దృష్టిని ముందుకు తీసుకెళ్లేందుకు అతని సహచరులకు అమితమైన ఆసక్తి ఉంది. భారతదేశ చరిత్రలోని ఒక గొప్ప పౌరుడు సమాజానికి అందించిన సేవా సహకారాలకు సముచిత గౌరవం ఇవ్వడం మనందరి బాధ్యత.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply