బతుకు సేద్యం

(నిన్న
వాళ్ళు గడ్డి పరకలు.
ఆకలికి తాళలేక మట్టితిన్న శవాలు .
అనాదిగా అంటరానితనపు అవమానాలూ, వివక్షాలూ తలరాత అనుకోని అనుభవించిన అభ్యాగ్యులు.
జీవితాల్లోని చీకటిని తరిమేయాలన్న తలంపే లేని బతుకులు
నేడు
తమ ఎడారి బతుకుల్లో ఊట చెలిమెలు పుట్టిస్తూ బతుకులోని ఖాళీలను పూరించుకున్నారు ఆ మహిళలు.
స్వేదంతో సేద్యం చేస్తూ తమ జీవితాల్లోనే కాదు తమ చుట్టూ ఉన్న జీవితాల్లోనూ ప్రాణవాయువులూదిన భూమిపుత్రికలు.
అంటరానివారుగా, బానిసలుగా ఆగమాగమయిన బతుకును, కుంచించుకుపోయిన జీవితాన్ని ఆగని ప్రవాహంలా చేసుకున్న ధీరలు.
ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతి మాట వింటూ కలసి అడుగులేస్తున్న ప్రకృతి బిడ్డలు.
తాము పీల్చే గాలి , తాగే నీరు, నించున్న నేల అన్నీ తమతో పాటే బతకాలనుకున్నారు. తినే తిండి గింజ, కాయ, పండు ఏదైనా సహజంగా ఉండాలనుకుంటూ గాలిపంటలు పండించే గరికలు.
పచ్చటి జీవితాల్లో చిచ్చుపెట్టే కృత్రిమ రసాయన ఎరువులు, పురుగుమందులు దరి చేరనివ్వని పుడమి బిడ్డలు వాళ్ళు.
ఈ గడ్డిపోచల వ్యవసాయంలో నకిలీ విత్తనాల బెడద లేదు. అతివృష్టి అనావృష్టి శరాఘాతాలు లేవు.
వారి జీవితాల్లో మెతుకుల్ని లాగేసే వడ్డీ వ్యాపారులు, బతుకు కొడిగట్టించే దళారీలు లేనే లేరు .
స్వశక్తి కి నమూనా గా నిలిచిన మట్టిలో మాణిక్యాలు, అన్నీ తామై స్వశక్తితో ముందుకు సాగుతున్న మట్టిపూలు కన్నీటి జీవితాన్ని ఏనాడో కాట్లో కలిపేశారు. ఆకలికేకల జీవితాల ఆకృతి మార్చుకున్నారు. ఆకలిని జయించారు. తమ జీవితాలకు ఓ విలువ నిచ్చుకుని ఆ పరిమళాలు జగమంతా నింపుతున్నారు.
అంతేనా .. నిన్న అవహేళనలతో అవమానాలతో దూరంగా నెట్టేసిన నోళ్లే నేడు గౌరవంగా పలకరిస్తున్నాయి . అట్టడుక్కి తోక్కేసిన నోళ్లే వారి విలువైన పనులను గుర్తిస్తున్నాయి .
ఔరా ! అని నోటిమీద వేలేసుకుంటున్నాయి.
పరిమిత వనరులతో సంప్రదాయాన్ని ఆధునిక సాంకేతిక విజ్ఙానాన్ని మేళవించి ఎలా బతుకు సేద్యం చేస్తున్నారో ..
ఉత్పాతాల జీవితాన్ని ఉత్సవంగా ఎలా మలుచుకున్నారో..
గ్రామీణ ఆర్థిక, సామాజిక వ్యవస్థలో ఆధిపత్యపు కాళ్ల కింద నలిగిన వాళ్లు లేచి తలెత్తుకుని గగనపుటంచుల్ని తాకుతున్నారో
విశ్వవేదికపై నోబుల్ బహుమతి అంతటి అత్యున్నతమైన ఈక్వెటర్ పురస్కారం అందుకోగలిగే స్థాయికి ఎలా చేరుకోగలిగారో తెలియాలంటే ..
మట్టిపూల పరిమళాలు గుబాళించే జీవితాలతో మనమూ నడవాలి .
“బతుకు సేద్యం” చేసే ఆ రైతక్కల జీవితాల్లోకి తొంగి చూడాలి. ‘కొలిమి’ పాఠకుల కోసం నెలనెలా ‘బతుకు సేద్యం’ నవలను ధారావాహికగా అందిస్తున్నాం.)

అది
టౌన్ హల్ థియేటర్,
న్యూయార్క్

`ఈక్వేటర్ పురస్కారోత్సవం 2019`, వేదిక అంగరంగ వైభవంగా ముస్తాబయింది .
వేదికపై నున్న మహిళ లయబద్ధంగా పాట పాడుతున్నది. హెచ్చు తగ్గులతో సాగుతున్న ఆ పాటకు అనుగుణంగా ఆమె శరీరం కదులుతున్నది.

పాట ఏమిటో అర్థంకాలేదు.
కానీ, ఆ కదలికలకు ఆమె స్కర్ట్ కున్న గవ్వలు, పూసలు, అద్దాలు చేస్తున్న వింత సవ్వడి… సన్నగా కదులుతున్న మెడలోని పూసల దండల సంగీతం .. ఆ సభలో కూర్చున్న మొగులమ్మను విపరీతంగా ఆకర్షించాయి.

నీలం, తెలుపు రంగుల్లో నిమ్మకాయలంత పెద్ద పూసల దండలు ఎట్లా వేసుకుందో…
అటువంటి పూసలతో ఆవుదూడల మెడకో, పొలాల అమావాస్యకు ఎద్దులకు అలంకరించడమో చూడడమే తెలుసు. వాటికి కూడా ఒకటో రెండో వరుసలు మాత్రమే వేస్తారు.

ఇరవై ముప్పై వరుసల్లో మెడలో వేసుకోవడం ఎప్పుడూ చూడలేదు. అందుకే ఆమెను విచిత్రంగా చూస్తుండగా లయబద్దంగా సాగిన పాట అయిపొయింది.
అందరికీ ధన్యవాదాలు తెలిపి ఆమె వేదిక దిగితున్నది.

పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో ఆమెను అభినందించారు సభికులు. అందరితోపాటు మొగులమ్మ కూడా గట్టిగ చప్పట్లు కొట్టింది .

అప్పటివరకు ఆమెను పాటపాడిన వ్యక్తిని మాత్రమే ఫోకస్ చేసిన దీపాలు వేదికంతా పరుచుకున్నాయి .
వేదికపై ఈక్వేటర్ పురస్కారోత్సవం 2019 అని బ్యానర్ ఇంగ్లీషులో కనిపిస్తున్నది.

అంతలో అందరికీ స్వాగతం పలుకుతూ ఓ మహిళా వేదికపైకి వచ్చి తనను పరిచయం చేసుకున్నది .
ప్రకృతిని సెలెబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చిన అందరికీ ధ్యన్యవాదాలు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న పర్యావరణం విధ్వంసం కాకుండా కొందరు తమ పరిధిలో తాము కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి అసామాన్య కృషిలో భాగస్వాములైన వారే ఈనాటి ఈక్వేటర్ పురస్కార విజేతలు.

తమ కుటుంబాలను వదిలి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దూరతీరాలనుండి వచ్చారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని వచ్చినందుకు వారికి స్వాగతంతో పాటు ధన్యవాదాలు తెలిపిందావిడ.

వివిధ దేశాలనుండి వచ్చిన అతిథులకు, ఐక్యరాజ్యసమితి పెద్దలకు ఇంగ్లీషులో ఆహ్వానం పలికింది.

ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అభివృద్ధి మండలి పాలనాధికారి అకిం స్టెయినర్ ను మాట్లాడమని వేదికపై ఆహ్వానించింది ఆమె .
అతను జోక్స్ వేస్తూ మాట్లాడుతుంటే ఆ హాలులో కూర్చున్న వారి చప్పట్లు .. నవ్వులు…

అతను ఏమి మాట్లాడాడో, అందరూ ఎందుకు నవ్వుతున్నారో ఆ హాలులో కూర్చున్న మొగులమ్మ, లక్ష్మమ్మలకు, ఏమీ అర్ధం కాలేదు.
సునీతకి అర్ధమయ్యి కానట్లుగా ఉంది. వాళ్ళ ఇంగ్లీషు అందుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ అందరితో పాటు తాము చేతులు కలిపి చప్పట్లు కొట్టారు.

మొగులమ్మకు కుడిపక్కన ఉన్న సునీత ఇంగ్లీష్ మీడియంలో డిగ్రీ చదువుతున్నది. అందుకే అతను ఏమంటున్నాడని నెమ్మదిగా సునీతని అడిగింది.
సన్నగా గొణిగినట్లు సునీత చెప్పిన మాటలు ఆమెకు ఏమీ అర్ధం కాలేదు.

తమతో వచ్చిన సంఘం బాధ్యులలో ఒకరైన వందనక్కని అడుగుదామంటే తను సునీతకు అటు పక్కన కూర్చున్నది.
వేదికపై మాటలు తప్ప వేరే ఏమీ వినిపించడం లేదు. ఇటువంటిసమయంలో వందనక్కని బిగ్గరగా అడిగితే బాగుండదేమోనని మౌనంగా ఊరుకుంది .
సంఘంలోకి వచ్చాక తను ఎన్నెన్నో నేర్చుకుంది. ఇన్ని నేర్చుకున్న తను ఇంగ్లీషు భాష నేర్చుకోలేదెందుకో.. అని తనకు తాను ప్రశ్నించుకుంది మొగులమ్మ. అది కూడా నేర్చుకోవాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది మొగులమ్మ.

మట్టిలోపడి నిండా మట్టి కొట్టుకుపోయిన బండరాళ్లను చక్కని బొమ్మలాగా చెక్కారు సంఘం వాళ్ళు .
లేకపోతే ఇంతమంది పెద్దల మధ్య తాను ఉండగలిగేదా.. ఇటువంటి వాళ్లందరితో మాట్లాడాలంటే కొద్దో గొప్పో అందరికీ అర్ధమయ్యే ఇంగ్లీషు నేర్చుకోవాలని మరో మారు మనసులోని నిర్ణయాన్ని స్థిరపరచుకుంది మొగులమ్మ.

నియాన్ లైట్ల వెలుతురు పోయి మసక వెలుతురు .. అంతా నిశ్శబ్దంగా ..
వేదిక పై అతను ఏమి మాట్లాడుతున్నాడో ఏమీ అర్ధం కావడంలేదు. చుట్టూ చూసింది ఆ మసక వెలుతురులో .. అంతా వేదికపైకి ఏకాగ్రతతో చూస్తున్నారు . వాళ్లందరికీ అతను మాట్లాడేదేమిటో అర్ధమవుతున్నది. మాకే తెలియడంలేదని మనసు బాధగా మూలిగింది.

ఆ మెత్తటి కుషన్స్ తో ఉన్న సీటులో వెనక్కి జరిగి జారిగిలపడి కూర్చుంది మొగులమ్మ. బాగా అలసిపోయిన ఆమె శరీరం అప్పటివరకు విశ్రాంతి కోరుతున్నది. పక్కకు చూసింది. తనతో వచ్చిన లక్ష్మమ్మ, సునీత, వందన అక్క కూడా అలసటగానే కనిపించారు ఆ మసక వెలుతురులో.
ఎయిర్ కండిషన్ లో ఉన్నప్పటికీ అక్కడి టెంపరేచర్ చల్లగా అనిపించింది. కాళ్ళు దగ్గరకు జరుపుకుని ముడుచుకు కూర్చుంది.

కొద్దిసేపటికి ఆమెలోని అలసట క్రమంగా కరిగిపోయింది. కొత్త శక్తి అణువణువునా నిండుతున్నట్లుగా తోచింది మొగులమ్మకు.
గత వారం పదిరోజులుగా పడిన శ్రమంతా ఉఫ్ న ఊదినట్లుగా ఎగిరిపోయి శరీరం మనసు తేలికగా ఉంది.

ఈ క్షణాల కోసం ఎంత ఘర్షణ జరిగింది తమలో అనుకున్న మొగులమ్మ చుట్టూ చూస్తూ ఇక్కడ ఉన్నది తనేనా .. నిజ్జంగా తనేనా .. కల కాదు కదా .. ఆమెలో సందేహం మొలిచింది.

తనను తాను గిల్లుకుంది . నిజ్జంగానే తామిక్కడ అమెరికాలోనే ఉన్నామని చిన్నగా నవ్వుకుంది.
తమ బతుకుల్లో పరిమళిస్తున్న సువాసనలు ఏ దూరతీరాలకో చేరి విజేతలుగా నిలబెడితే… ఆకాశపుటంచులను తాకే సంబరంపై విరుచుకుపడిన సునామీ లాంటి వార్త వీసా తిరస్కరణ .. తమ రెక్కలు కత్తిరించివేసిన బాధ పడిన క్షణాలు లోలోన సుళ్లుతిరిగాయి.

ఆకాశపుటంచుల్లో దాగి అందుకొమ్మని ఊరిస్తున్న వీసా…
ఎలా అందుకోవాలా అన్న ఆలోచనల మొలకలు..
బండ చాకిరీ బతుకులకు అది దూరమా అని మదిలో రేగుతున్న ప్రశ్నలు…

ఒక ప్రెస్ మీట్ పెట్టడం.. అది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లడం ..
ఈ లోగా వీసా తిరస్కరణ వార్త ఆహ్వానితులకు చేరడం ..
వాళ్ళు అమెరికన్ ఎంబసీ కి లేఖరాయడం .. వీసా మంజూరు అవడం ..
చిటారుకొమ్మన కూర్చున్న వీసా దిగివచ్చి తలుపు తట్టడం ..
మండుటెండల్లో తొలకరి చినుకులు కురిసిన అనుభూతితో ఇనుపరెక్కల గుర్రంపై వచ్చి అమెరికాలో వాలడం..
85 అంతస్తులో బస ..

రాత్రి అసలే నిద్రపట్టలేదు .. పై నుండి కిందకు చూస్తే వచ్చిన వళ్లు గగుర్పాటు వల్లో లేక పగలు రాత్రి తేడా కావడం వల్లో లేక కొత్త ప్రదేశం అవడం వల్లో .. లేక అన్నీ కలగలసి నిద్రపట్టనీయలేదో అర్ధం కాలేదామెకు .

మిణుకుమనే వెలుతురులో కళ్ళు అటు ఇటు కదలాడుతూ పరిసరాలను, మనుషులను గమనిస్తున్నాయి. కానీ మొగులమ్మ మెదడు సాలిగూట్లో చిక్కుకున్న ఎన్నెన్నో భావాలు పగులుతున్నాయి.

ఏనాడూ ఎవరికోసమో తమ పని చేయలేదు. అవార్డులు ఆశించలేదు.
అవకాశాలు రాలేదనో, బాధపడుతూనో, వైరాగ్యంతోనో, అసూయతోనో, కుమిలిపోతూనో లేరు తామెప్పుడూ.
మెరుపులా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడుపుగా అందిపుచ్చుకున్నారు. తమకోసం తమ పని చేసుకుపోతున్నారు. అలుపుసొలుపూ లేకుండా చేసుకుపోతున్నారు. తమ జీవితాల్లోని చీకటిని తరిమేయ్యడం కోసం పనిచేసుకుంటున్నారు.

ఆ పనే జీవితాల్లో మలుపులు తెస్తున్నది. వెలుతురంటే ఏమిటో తెలుపుతున్నది. పిలిచి అవార్డులు, బహుమతులు అందిస్తున్నది.
అట్లాగే ఈ బహుమతి ప్రకటించారు. అందుకోవడానికి అమెరికాకి రమ్మని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకున్నాక వీసా ఇవ్వం పొమ్మనడం మెతుకులేని కంచం ముందుపెట్టినట్లుగా బాధ కలిగింది.

కానీ రమ్మని పిలిచి వీసా ఇవ్వనంటున్న ఆ దేశాన్ని ఏమనుకోవాలి. స్వేదం చిందించి సేద్యం చేసే వాళ్లంటే చిన్నచూపా.. శ్రమ జీవులకు తగిన గౌరవం ఇవ్వకపోవడం వాళ్లకు చెల్లుతుందేమో .. అందువల్ల తమకు వచ్చే నష్టం, కష్టం ఏమిలేదు. వారి ఆహ్వానం మన్నించి పాస్ పోర్టుల కోసం , వీసాలకోసం ఎంత సమయం ఖర్చు చేశారు. అదంతా వృధానే కదా ..

ఇటువంటి అవమానాలెన్నో గరళంలా మింగిన వాళ్ళమే కదా ..
వీసా కోసం బతిమాలుకోవలసిన అవసరం ఏముందనుకున్నారు.

కానీ జరిగిన విషయం మాత్రం నలుగురికీ తెలియాల్సిన అవసరం ఉందని గట్టిగా అనుకున్నారు ఆ రైతక్కలు.
వెంటనే ఆ సమాచారం తమకు ఈక్వెటర్ బహుమతి ప్రకటించిన ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి తెలియజేయాలని సంఘం పెద్దలను కోరారు .
ఆ వెంటనే హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి పరిస్థితి వివరించారు .

సాంప్రదాయ వస్త్ర ధారణలో ఉన్న గ్రామీణ మహిళల మాటల్ని యధాతధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు ప్రజలకు చేరవేశాయి. విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ప్రభుత్వం తమ మద్దతు ప్రకటించింది .

ఎవరికి వారు తామ పరిధిలో అన్నివిధాలా సంఘం మహిళలకు అండగా నిలబడ్డారు. ఓ వైపున ప్రభుత్వం , మరోవైపు మీడియా సంస్థలు అమెరికన్ ఎంబసీని సంప్రదించాయి .

అదే సమయంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు అవార్డు ప్రకటించిన విషయం తెలుపుతూ వీసా మంజూరు చేయవలసిందిగా కోరుతూ హైదరాబాదులోని అమెరికన్ ఎంబసీకి లేఖ పంపడంతో కథ సుఖాంతం అయింది .

బండబారిన చేల గుండెల్లో విత్తనాలు చల్లి మొలకెత్తించిన వారి ఆలోచనల ఫలితం వీసా వారి గడపముందు నిలిచింది.
చివరిక్షణంలో బయలుదేరడం వల్ల ఈ రోజు అవార్డు ఫంక్షన్ ముందురోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత కానీ చేరుకోలేకపోయారు .
మిగతా దేశాల వాళ్ళు రెండురోజులు ముందుగానే వచ్చారు. అమెరికా వాతావరణానికి, ఆహారానికి కొంచెం అలవాటు పడ్డారు .

మొగులమ్మ తన ఆలోచనల్లో పడి మరొకరు వేదికపైకి రావడం గమనించనేలేదు. అతనేం చెబుతున్నాడో భాష తెలియకపోయినా శరీర భాష కొన్నిసార్లు అర్ధమవుతుంటుంది.
కానీ అతను చెప్తున్నదేమీ ఆమె చెవికి ఎక్కడంలేదు.

పల్చని మంచు తెర పరుచుకున్నట్లున్న వాతావరణంలో గతకాలపు జ్ఞాపకాల శకలాలు ఆమెలో తొంగిచూస్తున్నాయి . తెగిపడుతున్నాయి .
మట్టిలో పుట్టి మట్టి బుక్కి బతికిన మట్టిమనుషులు మిన్ను కెగిసిన ఈ సంబరాల్లో ఉండడమంటే సంబరమే…
ఏనాడు కలలోనైనా ఊహించ సాహసించని ఎండు కట్టెల్లాంటి జీవితంలో వెన్నెల నీడలాగా వెన్నంటి నడిపించింది సంఘం…
జీవితపు చిక్కుముడులు విప్పుకుంటూ .. ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ ఇక్కడిదాకా ప్రయాణం సాగడానికి బీజం వేసింది సంఘం ..
లేకపోతే.., వెలవెలబోయిన జీవితాలు వెలగలజీవితాలుగా వెలుగుల్లోకొచ్చేవా…

మనసు తలుపులు తెరచిన ఆమె..
కష్టాలు కన్నీళ్లు కాపురమున్న కాలంలో కడుపుకోసం చేసిన యుద్ధాలు .. పొంగిన విచారాన్ని దిగమింగుకున్న క్షణాలు తవ్వుకుంటున్నది.
గంపల కొద్దీ జ్ఞాపకాల శకలాలు గట్లు తెంపుకున్న వానలా పొంగిపొర్లుతున్నాయి ..

*** *** *** ***

ఆ రోజు చాలా కష్టంగా ఉంది.
ఆకలి చేసే విన్యాసాలు తట్టుకోలేక పిల్లలు ఏడుస్తున్నారు . గిన్నెలు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. వెలగని పొయ్యి ఉసూరుమంటూ నిస్సహాయంగా చూస్తున్నది.
గత రాత్రి పిడకలేసి గంజి కాసింది. అది తాగిన పూలమ్మ కడుపు ఆకలికేకలు వేస్తున్నది.


పొయ్యిలోంచి తీసిన కచికతో పళ్ళు కొద్దిసేపు రుద్దింది. ఆమెను చూసి చెల్లెలు మల్లమ్మ, పెద్ద తమ్ముడు మల్లేశం కూడా పొయ్యిదగ్గరికి పోయి కచ్చిక తీసుకున్నారు . నోటి నిండా కచ్చిక పెట్టుకున్నారు .
పూలమ్మ చేతిపంపు దగ్గరకు పోయి దాన్ని పట్టుకుని ధనా ధనా కొట్టింది. అలా కొడుతున్నప్పుడు ఆమె లోపలికి పోతున్న పొట్టలోని పేగులు వికారంగా కదిలుతున్నాయి.


పంపులోంచి నాలుగు చుక్కల నీళ్లు పడనా వద్దా అంటూ ఆగి ఆగి ధారలా బయటికొస్తున్నాయి. నీళ్లను చూడగానే ఆమె మొహం వెలిగింది . చిట్టి చేతులతో ఆ నీటిని దోసిటపట్టి నోట్లో పోసుకుంది. ఉప్పుకాశం నీళ్లను ఎక్కువసేపు నోట్లో ఉంచుకోలేక గబగబా పుక్కిలించి తుపుక్కున ఊసింది. నోరంతా వికారంగా ఉంది . మళ్ళీ దోసిట పట్టి మొహంపై జల్లుకుంది. అట్లా రెండు మూడుసార్లు చేసింది . చల్లటి నీళ్ళు మొఖానికి తాకగానే ఎంతో సత్తువ వచ్చినట్లైయింది పూలమ్మకు.
అది చూసి తమ్ముడు , చెల్లెలు కూడా వచ్చారు . వాళ్లకు నీళ్లు ధనాధన్ కొట్టింది . .
లోపలున్న ఆకలికి ఆమె పొట్టలోపలంతా తిప్పుతున్నది. పేగుల ఏడుపు చప్పుడు పూలమ్మకు వినిపిస్తున్నది .


నెమ్మదిగా వెళ్లి అమ్మ పక్కన చేరి “అవ్వా .. బువ్వెయ్యే .. ” పొట్టచేత పట్టుకుని సన్నగా రాగం అందుకున్నది పూలమ్మ. ఆ వెనకే మిగతా ఇద్దరూ ..
పూలమ్మకు తెలుసు అమ్మ ఏమీ వండలేదని . కుండలు ఖాళీగా వెక్కిరిస్తున్నాయని . అయినా అమ్మని అడగకుండా ఉండలేకపోయింది పూలమ్మ .


పూలమ్మ చెల్లెలు మల్లమ్మ గట్టిగా గొంతెత్తింది . పెద్ద తమ్ముడు మల్లేశం కెవ్వుమన్నాడు . అది గమనిస్తూనే ఉన్న మొగులమ్మ.
ఆమె చేతిలో ఉన్న చంటివాడు పాలకోసం చాలా సేపటినుండి రోదన పెడుతూనే ఉన్నాడు . ఆ తల్లి ఎండిన రొమ్ముని మళ్ళీ చంటాడి నోట్లో పెట్టింది .
చప్పరిస్తున్నాడు. చుక్క కూడా కడుపులోకి పోవడం లేదు . వాడి కడుపాకలి తీరడం లేదు. ఉండి ఉండి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. విడవకుండా తల్లి రొమ్మును చీకుతూనే ఉన్నాడు . తల్లిని అతుక్కుపోతూ అప్పుడప్పుడే వస్తున్న పాలపళ్లతో మరింత గట్టిగా కొరుకుతున్నాడు.


కెవ్వుమనబోయిన ఆ తల్లి గొంతు పైకి రాలేదు. ఆ బాధను లోలోనే అణిచేసుకుందా తల్లి .
అంతకన్నా ఏమి చేయాలో అర్ధంకాక బిక్కమొహంతో చంటాడి తల నిమురుతూ వాకిట్లో చతికిలపడి కూర్చుంది మొగులమ్మ.
ఆమె కడుపున పుట్టిన పిల్లల గోస ఈ రోజుది మాత్రమే కాదు . ఎన్నో సార్లు తల్లీ పిల్లలకు అనుభవమైనదే .


ఆ తల్లి ప్రాణం పిల్లలను చూసి విలవిలలాడింది. ఆమె
ఏమీ చేయాలో తోచక శూన్యంలోకి చూస్తూ ఉన్నది . పేగులు లుంగచుట్టుకుపోతున్న బాధని పంటిబిగువున ఓర్చుకునే ప్రయత్నం చేస్తున్నది.

విప్పపువ్వు ఏరడానికి కూడా పోలేకపోతున్నది . చుక్కపొద్దుకు లేచిపోయినా అప్పటికే చేరిన జనం. ఊరు మొత్తం అక్కడే ఉన్నట్టున్నది. థలా ఇంత ఏరెప్పటికీ అంతకలసి తవ్వెడు పువ్వు కావట్లేదు . ఏది ఎండబెట్టి షావుకారు దగ్గరికి వెళ్లేసరికి దోసెడు కూడా అవ్వట్లేదు .


అయినా పిల్లల్ని ఇంట్లో వదిలి విప్పపువ్వు ఏరుకొచ్చి షావుకారు కిచ్చి కొద్దిగా నూకలు , కొద్దిగా నూనె తెచ్చుకున్నది . మొన్నటినుంచి పువ్వు తగ్గిపోయింది. విప్ప పండ్లు అయితే అవి ఏరుకొచ్చి పిల్లలకు పెడదామన్నా ఇంకా పండడం లేదు .
నిన్న పూలమ్మ ఏరుకొచ్చిన గంజితాగి ఆకలిమంటలను చల్లారింది .
ఏమి చేయాలో అర్ధంకాని అయోమయంలో ఉన్నది మొగులమ్మ .
తమ బాధతీరే మార్గం కళ్ళముందు కానరావడం లేడామెకు.
తమ గాచారం అని తన దీనస్థితికి సరిపెట్టుకుంటున్నది కానీ కడుపున కాసిన కాయలకింత గంజి నీళ్లయినా పోయలేకపోతున్నందుకు గుండె భారమవుతున్నది . పిల్లలను చూడలేకపోతున్నది .


కొంచెం సేపు రాగం తీసిన పూలమ్మ ఇకలాభం లేదనుకుందేమో చింత చెట్టు దగ్గరకు చేరింది . చింతాకు కోసి నోట్లో వేసుకు నమిలింది. అదే చెల్లికి తమ్ముడికి ఇచ్చింది .
వాళ్ళు నమిలారు. మరింత చింతాకు తెంపి రోట్లో వేసి నూరింది . దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసింది . దాన్ని బుగ్గకు పెట్టుకుంది పూలమ్మ . అది చూసిన మల్లమ్మ , మల్లేశం చెయ్యి చాచారు . వాల్లకింత చేతిలో పెట్టింది .


అంతకుముందున్న ఏడుపు మరచి తేమ ఇంకని కనుకొలుకుల్లోంచి తల్లికేసి జాలిగా చూసింది పరిస్థితి అర్ధం చేసుకున్న పూలమ్మ.
మొగులమ్మకేసి తిరిగి అవ్వా ఇగోయే అంటూ ఆమె చేతిలో పెట్టింది తినమని .
పిల్లలు నెమ్మదిగా చింత చెట్టు నీడకు ఏవో ఆటలాడి సొమ్మసిల్లినట్టు కూర్చున్నారు.
మొగులమ్మ కూడా లేచివెళ్లి ఆ చెట్టుకే జారిగిలబడి కూర్చున్నది .

పటేల్ దగ్గర పనికిపోయిన భర్త చిన్నయ్య చిక్కగా చీకట్లు ముసిరిన తర్వాత గానీ రాడు. వచ్చినా అతను చేసేది , చేయగలిగేది ఏమైనా ఉంటేగా …
బయట ఎండ పెరిగిపోతున్నట్లే కడుపులో ఆకలి చేసే హడావిడి పెరిగిపోతున్నది. అది భరించడం చాలా కష్టమయిపోతున్నది.


ఎట్లా అనుకుంటూ చంటాడిని అట్లాగే గుండెలకు అదుముకుని లేచి నుంచుంది. ఆ నుంచునేటప్పుడు నోట్లో ఉన్న స్తన్యం కొద్దిగా కదిలిందేమో గొంతు తెరిచి గయ్ మన్నాడు చంటోడు.


అట్లాగే వెళ్లి దొంతరలుగా పేర్చుకున్న మట్టి కుండల్లో చేయి పెట్టి అటూ ఇటూ తిప్పి చూసింది. అడుగుబొడుగూ ఓ చారెడు నూకలేమయిన చేతికి తగులుతాయేమోనన్న ఆశతో .


అప్పటికే మూడుమార్లు చూసింది. అయినా ఆమెలో ఏదో ఆశ. కళ్ళు గప్పిన గుప్పెడు నూకలయినా దొరికికితే బాగుండుననే ఆశ. ఇష్టంగా కావలించుకున్న ఆకలిని పిల్లలనుండి ఈ పూటకైనా తరిమెయ్యొచ్చనే ఆశ ఆ తల్లి మొగులమ్మది

పక్కింట్లోనో , ఎదురింట్లోనో , మరో ఇంట్లోనో అప్పు అడిగే పరిస్థితి లేదు . ఇప్పటికే అప్పుడప్పుడూ చేసిన అప్పులు తీర్చనేలేదు .
అయినా వాళ్ళదేమన్నా కలిగిన కుటుంబాలా.. వాళ్ళదీ దాదాపు అదే పరిస్థితి. కాకపోతే ఒక పూట గంజినీళ్లయినా దొరుకుతాయేమో ..
చేతికి ఒక్క నూక పలుకూ తగలక ఆమె ప్రాణం ఉసూరుమంది.
గాలిని , నీటిని నింపుకున్న పేగుల ఆకలి తాపం తీర్చడానికి చెంబెడు నీళ్లు కుండలోంచి తీసుకొని గటగటా తాగేసింది.


పెద్ద కూతురు పూలమ్మ , చిన్న కూతురు మల్లమ్మ లను కూడా నీళ్లు తాగమని చెప్పి, తాను తాగిన చెంబులో కొన్ని నీళ్ళుంచి మల్లేశానికిచ్చి తాగిచ్చింది.
“ఇప్పటిదాంక మాలెస్స నీళ్ళే తాగిన . కడుపుల కిందిమీదయితాంది . గంజి పొయ్యవే .. ” రాగం తీసింది మల్లమ్మ

తల్లికేసి చూస్తూ “అవ్వా , కుండల నీళ్ళొడిసిపోతయే.. ” నెమ్మదిగా అన్నది పూలమ్మ .
నీళ్లు తాగడం ఇష్టంలేక అన్నదో తాగడానికి నీళ్లు కూడా అయిపోతాయని అన్నదో అర్ధంగాక దిగులు సముద్రం ఉవ్వెత్తున ఎగుస్తుంటే పెద్ద బిడ్డకేసి చూసింది మొగులమ్మ .


పూలమ్మ అన్నది నిజమే . కుండలో నీళ్లు అడుక్కు చేరాయి .
కాసేపయితే ఆ నీళ్లు కూడా ఖర్చయిపోతాయి. రేపటిదాకా ఈ నీళ్ళే సరిపెట్టుకోవాలి. లేదంటే ఉప్పు నీళ్ళే గతి అనుకుందామె . అవి తాగితే ఇప్పటిదాకా తాగిన నీటిని కూడా పేగులు బయటికి పంపుతాయి
పొద్దున్న మంచినీటి బావిదగ్గరకు వెళ్ళినప్పుడు తెనుగు బాలయ్యను రెండో కడవ పొయ్యమని బతిమాలితే పొయ్యకపోగా ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టిన విషయం గుర్తొచ్చింది ఆమెకు .


మంచినీళ్లు చేది కుండలో పోసేటప్పుడు సగం నీళ్లు కిందే పడిపోయాయన్నందుకు జరిగిన యుద్ధాలు , గొడవలు కళ్ల ముందు మెదిలాయి.
గుక్కెడు నీళ్లకోసం , బుక్కెడు బువ్వకోసం పడుతున్న అగచాట్లకు ఆమె ఎప్పుడూ ఎవరినీ నిందించదు. తమ బతుకులింతే . తలరాత అని సరిపెట్టుకోవడం
మొగులమ్మకే కాదు ఆ వాడలోని వాళ్ళందరికీ అలవాటే .
పాడుబడినట్లున్నఆ ఇల్లు ఇంత నీడనిస్తున్నది . పుట్టమన్నుతో అలికిన నేల పరిశుభ్రంగా ఉన్నది . కానీ పైన పెంకుల్లో తిరుగుతున్న ఎలుకలు మట్టి రాలుస్తున్నాయి . అది కాళ్ళ కింద గరగరాలాడుతుంటే అట్లాగే కాలుగాలిన పిల్లిలా నాలుగుసార్లు అటూ తిరిగింది .
నాలుగు రోజుల క్రితం చీపుర్లు కట్టి అమ్ముకోవచ్చని చీపురు కొయ్యలూ , విస్తరాకులు కుట్టి అమ్ముదామని మోదుగాకులూ అడవికి పోయి తెచ్చింది. ఈనగాసిన చేను నక్కలా పాలయినట్టు అవన్నీ పటేలమ్మ పరమయిపోయాయి .
ఏం చేస్తుంది మరి . ఆ ఇంటి బానిస భార్యగా వాళ్ళు చెప్పిన పనులన్నీ కాదనకుండా చేయాల్సిందే.
ఎట్లా తెలుస్తుందో ఏమో .. ఎప్పుడు తెచ్చినా అంతే .. చెట్టూ గుట్టా తిరిగి తిరిగి ఏరుకొస్తుంది మొగులమ్మ. ఆ మరుసటి రోజే చీపుళ్లు కావాలి , విస్తళ్ళు కావాలని యజమానురాలి నుండి ఆదేశం . ఒక్క పైసా చేతిలో రాలదు .
మొన్న తెచ్చిన మోదుగాకులు కుట్టి విస్తర్లుగా మార్చింది . వంద ఆకులయితే రెండు రూపాయలొస్తాయి . రెండొందల విస్తర్లు కుట్టి రెండు కట్టలు కట్టింది . ఈరోజు పొద్దున్న బీదర్ పోయి అమ్ముకొద్దామని అనుకున్నది .

ఉదయం లేచి చూస్తే విస్తళ్ళు , చీపుళ్లు ఏమీ లేవు . నోట్లో మట్టిగొట్టి అవి ఎప్పటిలాగే వాటికీ కాళ్లొచ్చి గడపదాటి పటేల్ గుమ్మంలోకి చేరాయి .
ఆ రోజు ఐదో పదో కళ్ళ జూస్తానని ఆశపడిన మొగులమ్మ ఆశలు ఆవిరైపోయాయి.
అయినా తన పని మానదు . మళ్ళీ మళ్ళీ అడవిలోకి పోతుంది . గుట్టలకు చెల్కలకు పోతుంది . అందుబాటులో ఉన్నవాటిని తెస్తుంది . కానీ అవి అక్కరకురాని చుట్టాల్లా వెళ్లిపోతున్నాయి . ఇదంతా ఎపుడూ జరుగుతున్న కథే .


ఈ పొద్దు గడిచేదెట్లా .. ఆలోచనలోనే పొద్దు నడి నెత్తిమీదకు చేరింది .
చంటివాడు తల్లి రొమ్ము కరుచుకుని అతుక్కుపోయాడు. వాడినట్లా గుండెలకు అదుముకుని మిగతా పిల్లలను తీసుకొని బయటకు నడిచింది ఆమె .
ఇంత మాడినరొట్టెముక్కనో, పాచిపోయిన గంజి నీల్లో దొరకక పోతాయా .. పటేలమ్మ కనికరం చూపించక పోతుందా అన్న ఆశ జీవంపోసుకోవడంతో.
ఆ అడుగులు పటేల్ ఇంటికేసి దారి తీశాయి . .


అసలే ఎండాకాలమేమో బయట ఎండ నిప్పుల కొరడాతో కొడుతున్నట్లున్నది. ఆ ఎండ కంటే ఎక్కువగా ఎండిన బతుకు బండి నడవలేక నిస్సత్తువై కదలలేక కదులుతున్నది.
ఆమె కళ్ళలో తిరిగే కన్నీటి సుడులు ఎప్పుడో ఆవిరయిపోయాయి.
పొడారిపోయిన జీవితాన్నంతకంటే ఏం మండించగలదు ఈ ఎండ వేడి !

చెంగుతీసి చంటాడికి కప్పింది. చీర కంతల్లోంచి ఎండ దూసుకొచ్చి వెక్కిరిస్తున్నది . ఆ పిల్లవాడిని చురుక్కున తాకుతున్నది.
నెత్తి మీద కుంపటి బోర్లిచ్చినట్టు , కాళ్ళ కింద నిప్పుల కొలిమి ఉన్నట్లు తోచింది ఆమెకు .


పగిలిన అరికాళ్ళ తో గబగబా నడుస్తున్నాననుకుంటున్నది ఆమె. కానీ దూరం తరుగుతున్నట్లు లేదు.


ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ పటేల్ ఇంటి బయట ఎవరూ కనిపించడం లేదు. ఎండకు అందరూ లోపలే విశ్రాంతిలో ఉన్నట్టున్నారు.
పటేల్ ఇంటివెనుక ఉన్న వేప,చింతచెట్ల మీద విశ్రాంతి తీసుకుంటున్న పూరిళ్లు , కొంగలు, ఇతర పక్షుల ముచ్చట్లు .. చప్పుళ్ళతో సందడిగా ఉంది .
ఇంటి ముందటి మందార మొక్క నీడలో మట్టిని కాళ్ళతో కెలుకుతూ ఆహారం ఎట్లా సంపాదించుకోవాలో పిల్లలకు తల్లికోడి బోధిస్తున్నది.
పైన కింద మలమలమాడ్చేసే ఆ ఎండకు నిల్చోలేక బర్లు , ఆవులు , ఎడ్లు కట్టేసే కొట్టంకేసి నడిచింది. ఆ చుట్టుపట్ల భర్త కనిపిస్తాడేమోనని ఆశతో ఆమె కళ్ళు చుట్టూ పరికించాయి. అతనక్కడ లేడు .
గట్టుకు తిరిగి తినొచ్చిన పశువులు నీడకు పడుకొని నెమరువేస్తున్నాయి. సేదతీరుతున్నాయి .
తమ కన్నా నోరులేని జీవాలే నయం అనుకున్నదామె పిల్లల మొహంలోకి దిగులుగా చూస్తూ .
వ్యధ నిండిన ఆ గుండె చప్పుడు పట్టుకున్నదో , లేక గుక్కపట్టి ఏడుస్తున్న చంటాడి ఏడుపుకు బెదిరి లేచిందో లేకపోతే లేవాలని లేచిందో కానీ ఒక లేగదూడ లేచింది . పెండ వేసింది.


అది ఆమె చూసింది . ఆమె కళ్ళలో తళుక్కున ఓ మెరుపు మెరిసింది.
ఆ తర్వాత ఆమె కళ్ళు ఆ పశువుల కొట్టం అంతా కలియజూశాయి. అక్కడక్కడా ఉన్న పెండకల్లు కనిపించాయి.
అన్ని పేడకల్లలో ధాన్యపు గింజలు లేవు. కొన్నింటిలో మాత్రమే ఉన్నాయి. కొన్ని ఎక్కడో దొంగతిండి ఆత్రం ఆత్రం తిన్నట్లున్నాయి. అరగలేదు .
ఆ పచ్చటి పేడలో అక్కడక్కడా బంగారు వర్ణంలో మెరిసే వడ్ల గింజలు , ముత్యాల్లా అగుపించే జొన్న గింజలు ఆమెకు ప్రాణం పోశాయి.


తల్లి మొఖంలో మారుతున్న రంగుల్ని , కళ్ళలో కనిపించి మాయమైన మెరుపుని పూలమ్మ పసికట్టింది. కానీ ఎందుకో ఆ చిన్ని బుర్రకు అర్ధంకాలేదు.
చంటాడిని ఓ మూలకు కూర్చోబెట్టింది మొగులమ్మ. పూలమ్మను తనతో రమ్మని చెప్పింది.
బర్రెలకు కుడితి పెట్టే చిన్న గోలెంలో అడుగున మిగిలిన అన్నం మెతుకులను ఆత్రంగా అందుకోవాలని చూస్తున్న మల్లమ్మ, మల్లేశాన్ని పిలిచి చంటాడి దగ్గరే కదలకుండా కూర్చోమని చెప్పింది . వచ్చి కూర్చున్నారు కానీ వాళ్ళ చూపు తమ్ముడిపై లేదు . గోలెంలో మిగిలిన అన్నం మెతుకుల పైనే ఉంది .

లేగదూడ వేసిన పేడను చేతిలోకి తీసుకొని పిసికింది మొగులమ్మ. వడ్లగింజలు , జొన్న గింజలు, ఏవో గడ్డి గింజలు చేతికి తగిలాయి. వాటిని తీసి పక్కకు పెట్టింది. అది చూసి పూలమ్మ కూడా అదే పని చేయడం మొదలు పెట్టింది . ఆ పేడను మాత్రమే తీసుకుని అందులోని ధాన్యపు గింజల్ని తీయడం మొదలు పెట్టారు.
అమ్మ , అక్క చేసే పని చూసి మల్లమ్మ కూడా వచ్చి పేడ పిసకడం మొదలుపెట్టింది. క్షణాలు మౌనంగా నలిగిపోతున్నాయి.


మల్లేశం తల్లి పక్కనున్న బర్రె దూడను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దాని తల్లి ఏమన్నా అంటుందేమోనని వెనక ముందు చేస్తున్నాడు. చంటాడు నిస్సత్తువ ఆవరించిన చూపులతో కొంత సేపు పరిసరాలను చూస్తూ గడిపాడు. ఆ తర్వాత, అప్పుడే స్పృహలోకొచ్చినట్లు తల్లి కోసం అరవడం అరవడం మొదలుపెట్టాడు.
వేరు చేసిన వడ్లు , జొన్నలు ఎందులో పొయ్యాలో అర్ధం కాక చుట్టూ చూసింది . కోళ్లు అటువైపుగా వచ్చాయంటే ఆ గింజలు మిగలవని ఆమె భయం . కోళ్లను రానీయొద్దని పూలమ్మకు చెప్పి కొద్ది దూరంలో కనిపించిన మోదుగచెట్టు ఆకుల్ని కోసుకొచ్చింది. గడ్డి పుల్లతో వాటిని కుట్టింది. అందులో వాటిని పోసింది. పిల్లలను తీసుకుని ఊరవతల విసిరేసిన వాడకు నడిచింది.


అరికాళ్ళ పగుళ్లలోంచి రక్తపు చారికలు తొంగిచూస్తూ .. మండుతున్న కాళ్లతో ఎండిన కట్టె పుల్లలాంటి మొగులమ్మ బిరబిరపోతున్నది. ఇందాకటి నిస్సత్తువ పోయి వంట్లో ఉత్సాహం వచ్చింది . కడుపులోని పేగుల రోదను ఎండకు అరెయ్యనవసరంలేదు . కడుపునపుట్టిన పిల్లలకు ఈ పూటకు గిన్నెడు గంజి పోయగలదనే ధీమాతో నడుస్తున్నది .


దారిలో పెద్ద మాదిగ తమ్ముడు శివన్న కనిపించాడు . పలుకరించింది.
“ల్యాగ దుడ్డె సచ్చిందట. గా కాపోల్ల నారాయణ పిలువంపిండు. పోతున్న ” అని రెండడుగులేసి మొగులమ్మ పరిస్థితి మదిలో మెదిలి వెనక్కి తిరిగాడు శివన్న .
“బిడ్డా .. మాపటికింత పెద్ద కూర పట్కపోను పోరినంపు ” అన్నాడు
ఆ మాట విన్న పూలమ్మకు సంబరంగా ఉంది. రాత్రికి తినబోయే పెద్దకూర తునకలను ఊహించుకుంటూ నడుస్తుంటే ఆకలి మరింత అల్లరిచేయడం మొదలుపెట్టింది. దాన్ని చల్లార్చుకునే ప్రయత్నంలో తల్లితో సమానంగా నడవడానికి ప్రయత్నిస్తున్నది.

“అవ్వా .. ఎందుకే గివ్వన్నీ .. ” దారిలో అడిగిన పూలమ్మకు జవాబివ్వకుండా వడివడిగా ఇంటికి చేరింది మొగులమ్మ .
ఆమె వెంటే ఆమె పిల్లలూ .. మధ్య మధ్యలో ఎండకు వేడెక్కిన రాళ్లు కాళ్లకు ఒరుసుకుపోతుంటే .. ఎదురు దెబ్బలు తగులుతుంటే .. ఒక్కోసారి ఏడుపు అందుకోవడం లేదంటే అబ్బా అని అరవడం .. పరుగులాంటి నడకతో ..
తల్లి చంకలోంచి దించేసరికి చంటోడు గయ్ మన్నాడు. ఏడవడానికి కూడా ఓపిక లేనట్టుగా కీసురు కిసురుగా ఉందా ఏడుపు.


వాడినట్లాగే వదిలి ఆకుల్లో కట్టి తెచ్చిన వాటిని గిన్నెలో పోసి ఇంటిముందు కుండలోని నీళ్లతో బాగా కడిగింది. ఆ తర్వాత జొన్నలను , వడ్లను వేరు చేసింది మొగులమ్మ.


ఏడుస్తున్న చిన్న తమ్ముడిని తానే అమ్మై లాలిస్తున్నది పూలమ్మ.
జొన్నలను రోట్లో వేసి బాగా నూరింది. ఇంటెనుకకు పోయి రెండు పిడకలు , నాలుగు ఎండుపుల్లలు తెచ్చి ఇంటిముందున్న మట్టి పొయ్యి ముట్టిచ్చింది . మెత్తగా అయిన జొన్నపిండిని తీసి జొన్న అంబలి కాసింది . పిల్లల ఆకలి తీర్చింది . గిన్నె అడుగున ఓ గుక్క మిగిలితే వాటితో తన ఆకలి చల్లార్చుకుంది ఆ తల్లి .
కాస్త పొట్టలో పడగానే ఆకలి తీరిన పిల్లలు సొమ్మసిల్లినట్టు పడుకున్నారు .
మొగులమ్మ లేచి వడ్లను దంచి పొట్టు తీసి చెరిగి పక్కన పెట్టుకుంది.
ఆ తల్లికి రేపటి గురించిన కలలు లేవు. అమ్మయ్య ఈ పూటకి గడచిపోయింది అని తృప్తి పడడం తప్ప .

** ** ** **


అట్లాటి గడ్డు రోజుల్లో ..
ఓ సాయంత్రం
చంటివాడికి అమ్మవారయిందని ఊరవతల ఉన్న కల్లు దుకాణం దగ్గరకు వెళ్లి గౌండ్ల అతనికి కాల్మొక్కి , బతిమాలి ఆకుబట్టి కల్లు తెచ్చి ఎల్లమ్మకు సాకపొసింది మొగులమ్మ. అందులోనే ఇంత చంటాడికి తాగిచ్చింది . అది తాగిన చంటాడు లోపల పరిచిన వేపాకులపై మత్తుగా పడుకుని ఉన్నాడు .

ఇంటికి ఓ పక్కనున్న చింతచెట్టు మొదట్లో ఉన్న పెద్దబండరాయి మీద కూర్చొని పెద్ద పిల్లకు తలలో పేలు చూస్తున్నది మొగులమ్మ.

బానపొట్ట , పగిలిన పెదాల మూలలతో మల్లేశం . దుమ్ముకొట్టుకున్న అతని ఒంటిపై చినిగిన చెడ్డీ తప్ప మరోటి లేదు . తీసేసిన పాత సైకిల్ టైర్ తో ఇంటిముందు ఆడుకుంటున్నాడు. అతనిని పరిగెత్తిస్తున్నది చింపిరి జుట్టు మల్లమ్మ. ఆమె పెదాల చుట్టూ పగుళ్లు . కంటిరెప్పలపై పెద్ద కురుపు .
పరిగెత్తిస్తున్న మల్లమ్మకు దొరకకుండా ఆ టైరును తిప్పుతూ పరుగులు పెడుతూనే ఉన్నాడు మల్లేశం .

అదిగో అప్పుడూ ఓ వింత జరిగింది .
మొగులమ్మ ఇంటికి వచ్చారు ఇద్దరు ఆడవాళ్లు , ఇద్దరు మగవాళ్ళు. వాళ్ళను చూస్తేనే బాగా చదువుకున్న వాళ్ళని , పట్నపు వాసులని అర్ధమైపోతున్నది .
అంతలో తమకేసి వస్తున్న కొత్తవాళ్లను చూసి తని చేతిలో ఉన్న పాత టైర్ అక్కడే వదిలేశాడు . “అవ్వా అవ్వా .. ” భయంతో బిగ్గరగా అరుస్తూ మొగులమ్మను చుట్టుకుపోయాడు మల్లేశం.

తమ దొడ్లోకి వచ్చిన వాళ్ళను చూసి ఎవరో ఏమిటో అర్ధం కాక లేచి నుంచుంది మొగులమ్మ. బిత్తిరి బిత్తిరి చూస్తున్నది. తల్లి వెనకకు చేరి పక్కనుండి తొంగి చూస్తున్నది మల్లమ్మ.
అంత చొరవగా తమ దగ్గరకి వస్తున్న పట్నపు వారిని ఎన్నడూ ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు ఆమెకు . అసలు ఆమె జీవితంలో అప్పటివరకూ చూసింది , పరిచయం ఉన్నది అతి కొద్దిమందితోనే .
విరబోసుకున్న జుట్టుతో పూలమ్మ కొత్త వాళ్ళకేసి వింతగానూ, భయంగానూ చూస్తూ తల్లి పక్కన నిలబడింది.


ఆ నలుగురూ చనువుగా వచ్చి కొద్దీ క్షణాల క్రితం వరకూ మొగులమ్మ కూర్చున్న రాళ్లపైనే కూర్చున్నారు.
బిత్తర చూపులతో ఉన్న పూలమ్మను , మొగులమ్మను కూడా తమతో పాటు కూర్చోమన్నారు .
ఆమె పుట్టి బుద్దెరిగినంక ఎప్పుడూ చూడనిది , ఎక్కడా విననిది ఇప్పుడామె ముందు . ఏనాడూ ఊహించని దృశ్యం ఆమె ముందు సాక్షాత్కారమైంది. వెలివాడల్లోని మాలమాదిగల ఇళ్ళకొచ్చి కూర్చునేదెవరు ? బెదురూ చూపులతో అయోమయంగా చూస్తూ నిలుచుండిపోయింది ఆమె .


నువ్వూ కూర్చోమ్మా .. నీతో కాసేపు ముచ్చట పెట్టి పోదామని వచ్చామని చెప్పింది వచ్చిన వాళ్ళలో ఒకామె.
ఎవరో తెలియని వాళ్ళు అంతస్తులు మరచి తనతో ముచ్చట్లాడడం ఏమిటి ?
ఏమన్నారు .. నువ్వూ కూర్చోమ్మా .. అని కదూ .. అని తనలో తాను మనసులోనే అనుకుంటూ ఆశ్చర్యపోయింది . అంతులేని ఆ ఆశ్చర్యంతో అట్లా బిగుసుకున్నట్లుగా నుంచుని ఉంది మొగులమ్మ .
భయం పోయిందేమో .. నెమ్మదిగా తల్లిని వదిలేసి వెళ్లి టైర్ అందుకున్నాడు మల్లేశం. మల్లమ్మ కొద్దిసేపు అలా వచ్చినవాళ్ళను , తల్లిని మార్చి మార్చి చూసి తమ్ముడితో ఆటల్లో పడిపోయింది. తల్లితో చెబుతున్న ముచ్చట్లను శ్రద్దగా వింటూ నిల్చున్నది పూలమ్మ .


వచ్చినవాళ్లు చాలా ముచ్చట పెట్టారు . మొగులమ్మ కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పనుల్లేక పస్తులుండడం గురించి , ఆమె పడుతున్న అవస్థ గురించి గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకున్నారు .


కష్టాల్లో సలసలా కాగిపోతున్న , వేగిపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసమే సంఘం అని సంస్థ ఏర్పడిందని చెప్పారు . సంఘం గురించి వివరించారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఆడవాళ్ళంతా వారానికి రూపాయి జమేసుకోమ్మని చెప్పింది తప్ప ఆమెకు ఏమీ అర్ధం కాలేదు .
కానీ రూపాయి ఎక్కడ నుండి తేగలదు. అది ఉంటే పిల్లల కడుపు నింపుకోవాలి కదా . ఆలోచించింది ఆమె .


పూలమ్మ బెరుకు భయం తగ్గాయి . విరబోసుకున్న జుట్టును వేలుముడి పెట్టి తల్లి ముందుకు వచ్చి నుంచుంది . వాళ్ళు చెబుతున్న ముచ్చట్లు కళ్ళు విప్పార్చి వింటున్నది . మధ్య మధ్యలో తల్లి ఏమనుకుంటున్నదో తెలుసుకోవడం కోసం వెనక్కి తిరిగి తల్లికేసి చూస్తున్నది . తల్లి వెనక నక్కిన మల్లమ్మ వచ్చి అక్కకు సరిగా నుంచున్నది. గాలికి కదులుతున్న చింపిరి జుట్టును మధ్య మధ్య సవరించుకుంటూ ఉన్నది . మల్లేశం వచ్చి తల్లి చెయ్యి పట్టుకు ఊపుతూ నుంచున్నాడు.

ఆ తర్వాత ఆ నలుగురూ అప్పుడప్పుడూ వస్తూనే ఉన్నారు . మళ్ళీ మళ్ళీ వచ్చి ముచ్చట పెడుతూనే ఉన్నారు.
వాళ్లు చెప్పే ముచ్చట్లు మొగులమ్మను ఆకర్షిస్తున్నాయి . వారి మాటల్లో ఏదో మతలబు ఉన్నది . వారిపట్ల ఆమెలో నమ్మకం కలుగుతున్నది . వాళ్ళు చెప్పినట్లు చేస్తే అది తనకు మంచే చేస్తుంది అని మాత్రం అర్ధమయింది మొగులమ్మకు .

పెద్ద వాళ్ళదగ్గరకు , సర్కారువాళ్ల దగ్గరకు మేము పోవడమే కానీ వాళ్ళ చుట్టూ తాము తిరగడమే కానీ వాళ్ళు మా దగ్గరకు ఎవరూ రారు . ఎన్నడూ రారు . మేం వాళ్ళ దగ్గరకు పోయినా అంత దూరాన పెట్టేవాళ్లే తెలుసు. వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు . మంచం మీద కూర్చుంటారు. వాళ్ళ ముందు మట్టిలో దుమ్ములో చేతులు కట్టుకుని చెంగు తలమీదుగా నిండా కప్పుకుని వినయంగా నిలబడాలి . లేదా నేలపైనే చతికిలపడాలి.


కానీ ఈ నలుగురూ అట్లా చేయడం లేదు . మా లాగే కిందనే కూర్చుంటున్నారు. తమతో పాటే తమ పక్కనే తమతో సమానంగా కూర్చోమంటున్నారు.
అదే వింతగా తోస్తున్నది. అదే విపరీతంగా ఆకర్షిస్తున్నది మొగులమ్మను.

ఏ పటేల్ ఇంటికో , పట్వారి ఇంటికో , ఏ కాపోల్ల ఇంటికో పోతే ఇంటిముంగటే ఎంతసేపైనా నిలబెడతారు. బండెడు చాకిరీ చేయించుకుని మాడిందో , ఎండిందో ఓ రొట్టె ముక్కనో , ఇన్ని గంజినీల్లో పోసినా ఇంత ఎత్తు మీద నుంచే .. అసుంట , ఇసుంట నే ..
అదే ప్రసాదంగా తెచ్చుకునే ఊరవుతలి ఈ ఇళ్లకు ఈ నలుగురూ ఇంటి చుట్టాల్లాగా వస్తున్నారు . అంతకంటే ఎక్కువ ముచ్చట చేస్తున్నారు . మంచి చెడు తెలుసుకుంటున్నారు అని మొగులమ్మలో అంతులేని ఆశ్చర్యం . దాన్నంటే తెలియని ఆనందం ఓ పక్క గజిబిజిగా అల్లుకుపోతూ ..

ఆ రోజు మొదలు అప్పుడప్పుడూ ఆ నలుగురి ఆత్మీయ పలకరింపులూ అలవాటయ్యాయి . ఆ వాడలోని వారికి . ఒక్కోసారి అంతా కలసి వస్తే ఒక్కోసారి ఇద్దరో , ముగ్గురో వస్తున్నారు . కొత్త కొత్త ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఎండిపోయి బీడుపడిన హృదయాలకు బతుకుపై భరోసా కల్పిస్తూనే ఉన్నారు

మంచినీళ్ల బావిని ముట్టుకుంటే మైల పడుతుందని పై కులం వాళ్ళు ఎవరో ఒకరు కడవతో చేది అంత ఎత్తు మీదనించి కుండలో పోయడమే తెలుసు . కానీ వీళ్ళు ఊరవతలి ఇళ్ల కుండలో నీళ్లు తాగుతున్నారు. మా చేతి నీళ్లు తాగుతున్నారు . మాతో సమానంగా కిందనే కూర్చుంటున్నారు. అని మొగులమ్మ మనసులో అనేకసార్లు అనుకుంది .

ఇంటిచుట్టు పక్కల ఉన్న సంతోషమ్మ , బాలమ్మ, సుశీలమ్మ,సంగమ్మ , రూతమ్మ ఎవరు కలిసినా వాళ్ళ మధ్య మాటల్లో ఇదే ముచ్చట చర్చకు వస్తున్నది. ఆ వాడలో అందరికీ కొత్త మనుషుల ప్రవర్తన వింతగానూ , ఆశ్చర్యంగానూ ఉంది .
అట్లాగని ఆనందంగా లేదని కాదు . వారిపట్ల ఆదరము , ఆనందమూ ఉంది. కానీ లోపలలోపల ఏదో బుగులు భయం సుడులు తిరుగుతున్నది. ఎటుపోయి ఎటు తమ తలకు చుట్టుకుంటుందోనని .


గతంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలు ఎవరైనా మరిచిపోతే కదా ..

అప్పటివరకూ కొరడా దెబ్బల్లాంటి మాటలే విని ఉన్న మొగులమ్మ హృదయాంతరాళాల్లో ఎన్ని భయాలున్నా, కొత్తగా వచ్చిన వాళ్ళు తమంటే ప్రాణంపెట్టి ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతుండడం, తమతో సమానంగా ఉండడం , గొప్పవాళ్ళమన్న ఆధిపత్యం చెలాయించక పోవడం మొగులమ్మను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నది. సంఘంలో చేరమని మనసు పోరుపెడుతున్నది .
కానీ, వాళ్ళు చెప్పినట్టు సంఘంలో సభ్యులవ్వాలంటే మొదట కొంత సొమ్ము జమ చెయ్యాలి. అది తనతో ఇప్పట్లో కాని పని అనుకున్నది. ఆ వాడలో మిగతా వాళ్ళది కూడా దాదాపు అదే సమస్య. అదే పరిస్థితి .

ఎప్పుడో మొగులమ్మ అత్తమామలు చేసిన అప్పు కొండచిలువకంటే బలంగా వాళ్ళను చుట్టేసి ఊపిరాడనివ్వకుండా ఉన్నది. ఏ నిముషం ఊపిరి ఆగిపోతుందో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.


మొగులమ్మ అత్తమామలు లోకం వదిలిపోయారు కానీ వాళ్ళు చేసిన అప్పుకు తోడు అవసరం వచ్చినప్పుడల్లా ఐదో పదో తెచ్చుకుంటున్నారు. అందుకు గాను మొగులమ్మ భర్త చిన్నయ్య ఏడేళ్ల వయసులోనే భీంరావు పటేల్ ఇంటి పశువులు కాసే జీతగాడిగా బాధ్యతల బరువు మోస్తున్నాడు. వాళ్లకున్న కాస్తో కూస్తో ఉన్న భూమి ఎప్పుడో పటేల్ పరమైపోయింది.


నెమనెమ్మదిగా బండి ,ఎడ్లు, బర్రెలు, మేకలు అన్నీ పోయాయి. నెత్తిన మాత్రం అప్పు గుదిబండ భారం దినదినం పెరుగుతూనే ఉన్నది. ఆ బరువు వారిని కుంగదీస్తూనే ఉంది.

పటేల్ ఇంటి పనిధ్యాస తప్ప కుటుంబ బాధ్యత ఏమితీసుకోలేని అశక్తత మొగులమ్మ భర్త చిన్నయ్యది. ఎప్పటికి ఆ అప్పునుండి బయటికి వస్తారో తెలియని తనం మొగులమ్మది.
భారమైపోతున్న గుండె బరువును ఎట్లా దించుకోవాలో తెలియడం లేదు ఆమెకు. ముళ్ల కంచెల నడుమ చిక్కిన లేగదూడలా నలుగురు పిల్లలతో దినదినం ఒక గండంగా సతమతమవుతున్నది మొగులమ్మ .

అప్పు తీరేదాకా పూలమ్మని తన చేతికింద పనికి పంపమని అడగనే అడిగింది పటేల్ భార్య . తాను పనికి పోతే పిల్లల్ని చూసేది పూలమ్మేనని , చంటాడు కొంచెం పెద్దగా అయితే అప్పుడు పంపిస్తానని వినయంగా చెప్పుకుని వచ్చింది మొగులమ్మ .
ఓ రోజు ఉదయాన్నే పనికి పోబోతూ పడుకుని నిద్రపోతున్న పిల్లలకేసి చూస్తూ ” పులవ్వకు పటేళమ్మ సేతికిందకు అంపుమంటున్నది .. ఊకూకే అడ్గవట్టింది ” అన్నాడు చిన్నయ్య .


“ఏమన్నవ్ ” అన్నట్లుగా కళ్ళతోనే ప్రశ్నించింది మొగులమ్మ
“ల్యాత సేతులు .. పనిరాదు పటేలమ్మ .. అనిజెప్పితినా
గంతే .. కూటికి గతిలేదు గానీ పోకడ తక్వ లేదు .. అన్నది కసురుకుంట , ఈసడిచ్చుకుంట ” చెప్పాడు చిన్నయ్య


“అయ్యో గట్లనా .. పటేళమ్మ ఎంత కోపానికచ్చిందో .. ఏమో .. ” ఎప్పుడయినా దయతలచి ఇచ్చే ఎండు రొట్టెముక్క కూడా రాల్చదేమోనని భయం రెపరెపలాడింది ఆమె కళ్ళలో. ఏదో తప్పు చేసినట్లు అపరాధభావం తొంగి చూసింది ఆమె మనసులో
“సూద్దారి ..” అనుకుంటూ తువ్వాలు అందుకుని పనిలోకి పొయ్యాడు చిన్నయ్య .
పెద్ద బిడ్డను పనిలో పెడితే సద్దిదో , మురిగిందో , ఎండిందో , మాడిందో ఇంత రొట్టెముక్క , ఇన్ని గంజి నీళ్లు దానికయిన దొరుకుతాయి . ఒక్కరయినా నీకు బరువు తగ్గుతారు గదనే అనే పక్కింటి సంతోషమ్మ మాటలు కూడా మొగులమ్మ మదిలో మెదులుతున్నాయి.


కొడిగట్టిన దీపంలా తయారయిన పూలమ్మను చూస్తూ పటేల్ ఇంట్లో పనిలోకి పంపడమే మంచిదేమో అని మొగులమ్మ ఆలోచిస్తున్న సమయంలో నాలుగు చినుకులు రాలాయి .


మొగులమ్మ హృదయంపై పన్నీటి జల్లులు కురిపించాయి .

** ** ** **

(మిగతాది వచ్చే సంచికలో…. )

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply