బతుకు సేద్యం-7

పూలమ్మ ఇంటిముందే జాలాది దగ్గర ఇటుకపెల్ల మీద కూర్చొని పొయ్యిలోంచి ఎత్తి తీసుకొచ్చిన బూడిదతో నల్లగా మసిపట్టిన గిన్నెల మసి వదిలిస్తున్నది.
తెల్లగా వెండి గిన్నెల్లా మెరిపిస్తూ తోముతున్నది.


మల్లమ్మ మొండి చీపురుతో వాకిలి ఊడుస్తున్నది.
మొగులమ్మ దాడికి ఉన్న చిక్కుడుకాయలు తెంపి వలుస్తున్నది. అలా వంటపనిలో బిజీగా ఉండగా “మొగులవ్వా.. మొగులవ్వా..” అంటూ హడావిడిగా వచ్చింది బాలమ్మ

“ఏందే బాలక్కా.. గట్ల ఒర్రుకుంట ఆగమాగం రావడ్తివి.. జర తీరెం కూసో.. ” అంటూ ఉడుకుతున్న అన్నాన్ని గరిటెతో తిప్పుతూ బాలమ్మకేసి ఒకచూపు విసిరింది మొగులమ్మ.

“ఇగ వానికి ఓపుడు నాతోని గాదె…
మనమంత కూడి ఆనికెట్లనన్న బుద్డిజెప్పాల్నే..
ఏంజేస్తవో నాకెర్కలే.. బాంచత్.. ” ఒగురుస్తూ అన్నది బాలమ్మ
“అసలేమైందే.. ఎవళ్ళ సుద్దే.. నీ మొగని సుద్దేనా..” సందేహంగా అడిగింది

“వాడే.. ఇంకెవడి సుద్ది జెప్త..?
ఊకే సంగం సంగం అంటవ్ చింగాలి అంటడు
ఏదో తెల్వక అట్ల అంటుండు అనుకుంటి.
మొన్న సంగంలకు పోవద్దని మీది మీదికొచ్చిండు. ఏ పాడుగాని.. తాగున్నడు గద అని సప్పుడు జెయ్యకుంటి..
ఇగ నిన్న మాపటేల సంగం సంగం అంటివంటే ..డా.. సంగం సెట్టుకే కట్టుకు సచ్చిపోత అన్నడు. రాత్రి తాడు కొండబోయి చెట్టెక్కి కూకున్నడు.
అదెవరికెరుక..

ఆడజూసిన , ఈడజూసిన. యాడ జూసిన దొరకడు.
నా పెద్ద కొడుకు కందిలి పట్టుకొని లెంకబట్టె. ఆఖిరికి చెట్టుమీద కుసోనున్నడు.

చెట్టు మీనుంటే ఎట్ల దించుకోవాలె.. అని విచారం జేసిన. మా పక్కింటోళ్లకు లేపి చెప్పిన.
వాండ్లు పిల్సిన రాలే. సప్పుడు సేయ్యకుంట మూగ మొద్దోలే అట్లనే కూసున్నడు.
ఇగ నాకు యాష్టకొచ్చింది.

ఇగో.. ఇగ నీ ఇష్టం మాట. ఆ చెట్టుకే ఉరివోస్కోని పోతనంటావ.. పో.. నీ ఇష్టమది
గోశిల పాపం గోశిల పెట్టుకొని కాశికి పోతనంటే పో..
నీవు సచ్చి మల్ల బతుకుతవని కాదు. సచ్చిపోతే పో.. ఒక్కటే సారి..
ఉన్నోల్లం ఎట్లనన్న బతుకుతం
మనిషి సావాలె.. సావోచ్చినప్పుడే సావలె

అట్లగాకుంట, నీకంత కష్టమున్నదంటే సావు. నీ కష్టం వాడల ప్రతి మనిషి గూడ సూస్తున్నరు. — పగల తాగిండు. ఉరి బోస్కోని సచ్చిండు అంటరు. సంగంలకు బోయి ఆమె సెడు జేసింది, ఖరాబయిందని, తప్పు జేసిందని ఒక్కడు గూడ అనడు. సూడు అదన్న జూడు. ఇదన్న జూడు అని ఇంటికొచ్చిన.
ఇగ సప్పుడు గాకొచ్చిండు. ఆడే అస్తడనుకుంటి. ఇగ రాలే , అగొ రాలే.

పాతింటికాడ తుమ్మ చెట్టుండే. పోయి రాత్రంతా ఆ తుమ్మ చెట్టు మీదనే కూసున్నడు. తెల్లారిందకా దొర్కలే.. సచ్చిండనుకున్నం ” ఆ మాటంటున్నప్పుడు ఆమె గొంతు , హృదయం భారమవడంతో కొన్ని క్షణాలు ఆగింది. మళ్ళీ ఆమే చెప్పడం మొదలుపెట్టింది.

“మా మామిచ్చిన నాలుగెకరాలల్ల పసుపు ఏసిన్నా.. ఆని తోని కాడి పడితి. అరక దున్నితి. సుక్కపొద్దుకు లేసి మోట కట్టితి. నాత్రిపగలు పంట కాసిన్నా.. పంట సేతికచ్చింది. అప్పటిదాంక మంచిగనే ఉన్నడు లమ్ది… అమ్ముకస్తనని జైరాబాద్ కాడికి పోయిండు.
ఇగోలే అగోలే.. మీకెర్కనే గద..

దీవెల పండుక్కు కుతికెలదాంక తాగి ఆకులాడుకుంట కూసున్నడు. ఆయిన్ని పైసలు ఒడగొట్టిండు. ఇంటికి రాలే. మూడు దినాలు రాలే. నాల్గు దినాలు రాలే. ఏడ్సుకుంట ఉన్నం. పిల్లగాండ్లు నేను ఏడ్సుకుంటనే ఉన్నం. నేనెంత తక్లిబయిననో.. మీకెర్కలే..
ఆరుదినాలయినంక అస్తున్నడు.

ఆరుదినాలు నంది మేరం తిన్నడు. పంది మేరం బురదల పొర్లిండు. అస్తున్నడు.
పిల్లిలెక్క అస్తున్నడు. సూసిన ,

పసుపు పైసలేమయినని అడుగుత అనుకున్నడు. ఏవన్న అనగలది అనుకున్నడు. ముప్ఫైదు గజాల బాయిల రెండుకాళ్లు ఏస్కోని కూసున్నడు.
అతని గుణం తెలిసిందేయున్నది. పతి విషయంల సావు కొట్టుకుంటనే ఉన్నడు.

యాడాదంత చేసిన కష్టం.. పైస ఏవన్న తెస్తె పిల్లలు తింటూంరి. మేం తిననట్ల జేసినవ్. మేం లేనట్ల జేసినవ్. నీ ఇష్టం కానీ అనుకున్న. ఆముచ్చట మీకెర్కనే గద ” ఎర్రటి మంటల్లో కాలుతున్న మనసుని ఉగ్గబట్టుకుని చెప్పింది బాలమ్మ.

అంతలో గౌండ్ల పెరుమాండ్లు వచ్చాడు. బాలమ్మ చెప్తున్న ముచ్చట ఆపి ఇంటికి పోయింది.
“మొగులవ్వా నీతోటి పనిబడి వచ్చిన. ” ఏ ఉపోద్ఘాతం లేకుండా సూటిగా అన్నాడు పెరుమాండ్లు.
ఏమిటన్నట్టుగా చూసింది మొగులవ్వ.

“ఏం జెప్పాలె.. నా బిడ్డ లగ్గం పెట్టుకున్న. చేతుల పైస లేదు. ఇరవై వేలు ఇచ్చి చేనుకు కౌలుకు కట్టుకుంటరేమో మీ సంగపోల్లు అని అర్సుక పోదామని ఇట్లోచ్చిన ” అంటూ తానొచ్చిన పని చెప్పాడు. గతంలోనూ ఇట్లాగే కొందరు సన్నకారు రైతులకు పైసలిచ్చి పంట తీసుకు తిన్న అనుభవం సంఘం సభ్యులకు ఉన్నది. సంఘం వాళ్లకు భూమినిస్తే ఖరాబు చెయ్యరని మరింత మంచిగ బలంగా చేస్తారని ఊళ్ళో జనానికి నమ్మకం. అందుకే కౌలుకు ఇవ్వాలనుకున్నప్పుడు సంఘం వాళ్లనే మొదట సంప్రదించడం అక్కడి వారికలవాటయింది.

** **

గుంపు మీటింగులో బాలమ్మ విషయం చర్చకు పెట్టింది మొగులమ్మ. చివరివరకూ తోడుంటానన్న బంధాలు పెట్టే బాధల్ని గుండె గూడు తెరిచి పంచుకున్నాయి ఆ అక్కాచెల్లెళ్ల బంధాలు. అసూయాద్వేషాలు లేకుండా గుండెలోతుల్లోకి వెళ్లి తమ బాధల్ని తోడిపోశారు.

తమ ఆడవాళ్లు సంగంలోకి వెళ్లడం ఇష్టం లేనిది బాలమ్మ మొగుడికి మాత్రమే కాదని , అది ఆమె ఒక్కదాని సమస్య మాత్రమే కాదని ముక్త కంఠంతో చెప్పుకున్నారు.
అక్కడున్న మహిళల్లో చాల మంది భర్తలతోనో అత్తామామలతోనో నిత్యం ఎదుర్కొంటున్న సమస్యే అనుకున్నారు. ఎవరికి వాళ్ళు సమస్యతో బాధపడుతున్నారు కానీ పరిష్కారం ఆలోచించలేదు. ఇప్పుడు ఆ విషయంలో ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఆ సమయం వచ్చిందని స్పష్టం చేసుకున్నారు.

తమ మగవాళ్ళు చేసిన కష్టం కల్లు గుడిసెల్లోనో , సారా దుకాణాల్లోనో పోసి వస్తున్నారు. వచ్చి కావాల్సింది వండి పెట్టలేదని, ఇల్లు వదిలి తిరుగుతున్నారని ఏదో ఒక వంక పెట్టుకుని చితకబాదడం వాళ్ళకి మామూలయిపోయింది.

లోపల్లోపల లుంగచుట్టుకుని కుదిపేస్తున్న బాధల్ని ఇంక భరించకూడదు. వాటిని తోడి పడెయ్యల్సిందే. బతుకును తీపి చేసుకోవాలంటే తగిన పరిష్కారం ఆలోచించాల్సిందేనని ఒకే గొంతుకతో చెప్పుకున్నారు. లేకపోతే ముందుకు పడలేం అనుకున్నారు. ఒకరిని చూసి ఒకళ్ళు పెళ్లాలని కొడుతూనే ఉంటారు. హింసిస్తూనే ఉంటారు. బాధలు పెడుతూనే ఉంటారు అనుకున్నారు.

అట్లా కాకుండా ఒకరికి బుద్ధి చెప్తే నలుగురూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారని తలిచారు. ఆడవాళ్లు ముందటపడి నడుస్తుంటే మగవాళ్ళకి నచ్చడం లేదని అర్ధం చేసుకున్నారు ఆ ఆడవాళ్లు. ఒకళ్ళు ముంగట ఒకళ్ళు వెనుక పడడం కాదు కలిసి నడవాలని, అందుకు ఉపాయంతో తగిన ప్రయత్నం చెయ్యాలని ఒక నిర్ణయానికొచ్చారు.

“మొగుళ్లపల్లి కాడ ఇట్లనే పెండ్లాన్ని కొట్టి యాతన పెడ్తున్న పెనిమిటిని గుంపుల ఆడోళ్ళందరు గల్సి బొక్కలిరగకొట్టింరట. అప్పటికెల్లి ఆడోల్లకు అన జాల్తలేరట.
వామ్మో.. ఈ ఆడాళ్ళెన్క సంగమున్నది.

ఓ అంటే పది మంది , ఊ అంటే బండెడు మంది ఉరికొస్తరు అంటున్నరట. గా పొద్దు మా వదినె కాడికివోతే సెప్పవట్టిరి ” అన్నది నడివయసు మహిళ.
“ఆలుమగలు సమానం నడిసిన ఇంట్ల మగోడికి నల్లదోతి బొయ్యి తెల్లదోతి అయ్యే.. అది కానరాకొచ్చిందా.. బాడ్కవ్ లకు ” ఏదో కోపంగా అనబోయింది ఒకామె.

ఎందుకే మనోళ్ళను మనం తిట్టుకోవడం.. ఉపాయంతోని వాళ్ళు మారే ప్రయత్నం చేద్దాం.
మన ఎన్క సంగమున్నదని చానా మందిల ఫికరున్నది. బయం తిన్నరు. ఆబుగులు , బయం , ఫికర్ అట్లనే వుండనిద్దాం. సంగంల ఉన్నోళ్లు గని , లేనోళ్ళు గని ఎవ్వళ్లకన్న సరే ఆడోళ్లకు ఆపదచ్చిందంటే , తక్లిబ్ ఉన్నదంటే మనమంత ఒక్క మాట మీద బోవాలె. ఒక్క తాట ఉండాలె. ఆమెన్క మనం పదిమందివి ఉన్నమన్న బరోస ఇయ్యాలె ” అంతా విన్న మొగులమ్మ తన మనసులో మెదులుతున్న మాట వెల్లడించింది.

“అట్లనే కల్లు , సార ఊర్ల లేకుంట దుకణం బందు వెట్టిపియ్యాలె. ” రోజూ తాగివచ్చి ఇల్లంతా ఆగమాగం చేసే భర్త గుర్తొచ్చిన కాశమ్మ అన్నది.
” ఈడిగాయన చెట్లకింద ఆకుపట్టుమని లొట్టెత్తి పోసెతందుకు మన దిక్కు ఈదుల్లే ల్యాకపాయె. గుల్ఫారం కలుపుకచ్చి కల్లని అమ్మవట్టిరి. సారా దుకాణాలు తెచ్చి ముంగిట బెట్టి తాగు కొడకా అనవట్టిరి..” నిరసనగా అన్నది ఒకామె.

అందరూ ఆలోచిస్తున్నారు. వర్షాకాలపు రాత్రిళ్ళు నల్లటి చీకట్లో నక్షత్రపు కాంతుల్లా వెలిగే మిణుగురుల్లా ఆలోచనలు..
ముందు కల్లు సారా తమ వాళ్లతో మాన్పిస్తే సగం కష్టాలు తొలుగుతాయి. తాగి తెచ్చుకునే పంచాయితీలు తగ్గుతాయి. తమ కష్టాలు తీసుకుపోయి వేరేవాళ్ళ చేతుల్లో పెట్టొద్దు. పంచాయితీలు తెంపే పేరుతో పటేళ్ల దగ్గరకో , పట్వారి దగ్గరకో, కాపోళ్ల దగ్గరకు పోయి పైసలు దండుగ చేసుకోవద్దు..

పెద్దరికం పేనుకిస్తే తలంతా గొరిగినట్టవుతున్నదని అనుకున్నారు. మనలో మనమే పరిష్కరించుకుందామని నిర్ణయం చేసుకున్నారు.
వారి మెదళ్లలో పురివిప్పిన ఆలోచనలు వెలుతురు చినుకులు రాలుస్తూ మహాప్రభంజనమై కదులుతున్నాయి.

** **
వారిని ఆహ్వానిస్తున్నారు
ఇప్పుడు జాతర తమ ఊరికి రావాలంటూ ఆహ్వానించే వారు ఎక్కువైపోయారు. ప్రజల భాగస్వామ్యం బాగా పెరిగిపోయింది.
జాతర వెళ్లిన ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులందరితో కూర్చొని ఒక సభ చేస్తున్నారు.

ఆయా కమిటీల సభ్యులు ఆ గ్రామంలో ఉన్న భూమి రకాలు, ప్రస్తుతం పండించే పంటలు, ఆ భూముల్లో పాండే పంటలు, ఎరువులు , తమ పంటల విధానం , ఉత్పత్తి , మార్కెటింగ్ తో ఉన్న సవాళ్లు వగైరా ఎన్నెన్నో విషయాల గురించి చర్చించుకుంటారు. గ్రామస్థులకు వచ్చే సందేహాలకు , ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ వైవిధ్య పంటల్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పుకుంటారు. అలా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి జాతరను బాజా భజంత్రిలతో సాదరంగా తీసుకుపోతున్నారు తర్వాతి గ్రామస్థులు.

ఇరవై ఏళ్ళనుండి చేస్తున్న ఈ పంటల ఫలితాలు పండుగ ప్రభావం , ఈ చిన్న మహిళా రైతులు సాధించిన ఘనత ఇప్పుడు బాగా తెలుస్తున్నది.

ఒకప్పుడు బావిలో కప్పల్లా ఉన్న మహిళలు , వారి కుటుంబాల వారు ఇప్పుడు నలుగురిలో తిరుగుతున్నారు. నాలుగు విషయాలు తెలుస్తున్నాయి. ఒకప్పుడు తమ గురించి ఆలోచించని వాళ్ళు ఇప్పుడు మరొకరి సమాస్యల గురించిన ఆలోచన చేస్తున్నారు. పరిష్కారాలు సాధిస్తున్నారు.

ఆకలితో అలమటించిన పీడిత మహిళలను అంటరానివారిగా దూరం పెట్టిన మహిళలను , అది ఇది అని అభ్యంతరకరంగా మాట్లాడిన వాళ్ళే , వారి నోళ్లే కూర్చో అంటున్నాయి. గౌరవంగా పలకరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. జనంతో సంబంధాలు పెరిగాయి. గౌరవం పెరిగింది.

పాత పంటల విధానానికి చిరునామాగా మారారు సంఘం రైతక్కలు.

** **

అద్భుతమైన దృశ్యం
అబ్బురపరిచే దృశ్యం
అనూహ్యమైన దృశ్యం
కలలోకూడా ఊహించలేని దృశ్యం
కళ్ళముందు సాక్షాత్కరిస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలడు?
అనిర్వచనీయమైన ఆనందంతో ఆ దృశ్యాల్ని కనురెప్పవేయడం మరచి ఉత్కంఠతో చూస్తున్నాడు మాధవ్.

యథాలాపంగా టీవీ ఛానెల్స్ తిప్పుతున్న అతనికి నలుగురు మహిళలు కలసి చిరుధాన్యాల కంకులు పట్టుకున్న దృశ్యం ఆకర్షించింది.
సంతోషంతో వెలిగిపోతున్న వాళ్ళ మొహాలు చూడగానే వాళ్ళనెక్కడో చూసినట్లనిపించి ఆసక్తి కలిగింది. చూపునలాగే నిలిపి టైటిల్ చూశాడు.

ఉత్సుకతతో చూస్తున్న క్షణం లోనే, అక్కడ జరిగే కార్యక్రమంలో భాగంగా స్క్రీన్ పై డాక్యుమెంటరీ వస్తున్నది.
ఓ పక్క నుండి చీరల్లో కనిపిస్తున్న మహిళల దృశ్యాలు..

ఏడాదిక్రితం ఇండియా వెళ్ళినప్పుడు దీక్షతో కలిసి పల్లెలో తిరిగి చూసిన దృశ్యాల్లాగే, అప్పుడు విన్న పాటలలాగే ఉన్నాయి. ఆ మాటల్లా ఉన్నాయే..
అనుకున్న అతనిలో తెలియని ఉత్తేజం ఉరకలేస్తుండగా డాక్యుమెంటరీ చూస్తూనే మేనకోడలు దీక్షకి ఫోన్ చేశాడు. విషయం చెప్పాడు.
ఆ వెంటనే భార్యని పిలిచాడు ఆమెక్కూడా చూపుదామని.

ప్రకృతిని కాపాడడంలో ఆ మహిళలు చేస్తున్న కృషిని ఇంగ్లీషులో చెప్తున్నారు. ఇంగ్లీషులో టైటిల్స్ వస్తున్నాయి.
మారిపోతున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న, ఎదుర్కోబోతున్న గడ్డు పరిస్థితులనుండి, సంక్షోభంనుండి రక్షించుకోడం కోసం తమ పరిధిలో సంఘం మహిళలు చేస్తున్న గొప్ప కృషిని అభినందిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల కామెంటరీ వస్తున్నది.

తమ పనితో ప్రజల జ్ఞానాన్ని , వనరుల్ని , అనుభవాల్ని మెరుగుపరుచుకునే కృషి ప్రపంచంలో ఏ మూలన జరుగుతున్నా, మెరుగైన ప్రజల జీవితాలను నిర్మించుకునేందుకు దోహదం చేస్తున్నా, అటువంటి కృషిని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గుర్తిస్తుందని, ప్రపంచానికి ఆ కృషిని చూపుతుందని డాక్యుమెంటరీ చూపుతూనే ఇంగ్లీషులో కామెంటరీ ఇస్తున్నారు.

అంతర్జాతీయ వేదికపై తనకే ఆ అవార్డు వచ్చినంత సంబరంతో మాధవ్ ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు.
సంఘం కృషిని చూసినప్పుడు ప్రపంచ స్థాయి అవార్డు అందుకునేంత గొప్పదని అస్సలు ఊహించలేదతను.

ఒకవైపు టీవీకి అతుక్కుపోయి కార్యక్రమం చూస్తూనే మధ్య మధ్య భార్యకి సంఘం గ్రామాల్లో తాను చూసిన మరో లోకపు విషయాలు చెప్తూనే ఉన్నాడు.
అంత గొప్ప మనుషులు తనకు తెలుసని అతని ఛాతీ గర్వంగా ఉప్పొంగింది.

వారితో కొంత సమయం గడిపే అవకాశం కల్పించిన దీక్షకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

మాధవ్ ద్వారా తెల్సుకున్న దీక్ష ఆ విషయాన్ని వెంటనే పద్మకి చేరవేసింది.
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు అవార్డు ప్రకటించిన విషయం పద్మకి తెలుసు. కానీ ఆ రోజు జరుగుతున్న సభ గురించి తెలియదు.
తెల్సిన విషయాన్నీ రేఖకి చెప్పింది. అందరూ ఆ ఈక్వేటర్ బహుమతి ప్రదానోత్సవ సభ లైవ్ ఉందేమోనని యూ ట్యూబ్ లో వెతికారు.
అందరిలోనూ ఒక ఉత్కంఠ. ఉద్వేగం.
ఆ కార్యక్రమం చూడాలన్న ఆత్రుత.
అంతలో సంఘం ద్వారా లింక్ సంపాదించిన పద్మ ఆ లింక్ రేఖకి , దీక్షకు పంపింది.
రాత్రి భోజనం చేసి ఇంట్లోని ఆఫీసు రూములో కూర్చొని సీరియస్ పనిలో ఉన్న వినోద్ కి లింక్ పంపింది రేఖ. అంతా కొద్ది క్షణాల్లో సమాచారం పంపిణీ జరిగిపోయింది.
పనిలో ఉన్న వినోద్ ని సాధారణంగా రేఖ డిస్ట్రబ్ చేయదు. అలా చేసిందంటే ఏదో ముఖ్యమైన విషయం అని అర్ధమైంది వినోద్ కి.
అలసటగా ఒక్క నిముషం కుర్చీ వెనగ్గా జారిగిలపడి కళ్ళు మూసుకున్నాడు.
అంతలో రేఖ వచ్చి మెస్సేజ్ పంపాను. వెంటనే చూడు. లేదంటే చాలా మిస్ అవుతావు. చాలా ఫీలవుతావు అంటూ అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చొని చేతిలో ఉన్న మొబైల్ లోకి దీక్షగా చూస్తున్నది.

ఏమిటీ.. అన్నట్లుగా రేఖ కేసి చూశాడు. కనురెప్పలార్పకుండా మొబైల్ కేసి చూస్తున్నది ఆమె.
వెంటనే కుడివైపునున్న తన మొబైల్ అందుకున్నాడు వినోద్.
చేతిలో ఇమిడిపోయిన మొబైల్ ఫోన్ కేసి ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూస్తూన్నాడు..

రేఖ ఒకసారి వినోద్ మొహంలోని భావాల్ని పట్టుకుందామని చూసినదల్లా ఆ వెంటనే కళ్ళు తిప్పేసి మొబైల్ లో తల దూర్చింది. తానెక్కడ మిస్ అయిపోతానో అని..
నోట మాట రాని వాళ్ళలాగా.. మొదట అర్ధంకాలేదు. తర్వాత వినోద్ కళ్ళలోకి మెరుపు.
వాళ్ళ నోళ్లు నిశ్చబ్దంగా.. కళ్ళు ఆత్రంగా చూస్తూ..

‘జొన్నలేమో బలం తీసుకుంటది
కందులేమో బలమిస్తది ‘
అది మొగులమ్మ గొంతులా ఉంది. కళ్ళు చిట్లించి చూశాడు వినోద్. మొబైల్ స్క్రీన్ పెద్దది చేసుకుని చూస్తున్నాడు.
సందేహం లేదు , ఆమె మొగులమ్మే…

గబుక్కున కళ్ళు విప్పార్చి చూసింది రేఖ.
జొన్న కంకుల నడుమ మొగులమ్మ మొఖం వికసిస్తున్న సూర్యుడిలా కనిపిస్తున్నది. గంట కొట్టినట్టుగా ఆమె గొంతు వినిపిస్తున్నది
వేదికపై నున్న స్క్రీన్ పై సంఘం మహిళలు తీసిన డాక్యుమెంటరీ..

ఆ ప్రసారంలో మొగులమ్మ కనిపిస్తున్నది. స్టేజి మీద ఉన్న ముగ్గురు మహిళల్లో మొగులమ్మ నొక్కదాన్నే చూసినట్లుగా ఉంది.
“ఎక్కడో వేల మైళ్ళ దూరంలో జరుగుతున్న కార్యక్రమ దృశ్యం ఫోన్ ద్వారా ఇక్కడ చూస్తున్నారు..
ఇక్కడ తీసిన వీడియో అక్కడ చూపుతుంటే ఇక్కడ మనం చూడడం అద్భుతంగా అనిపిస్తున్నది.
ప్రపంచమంతా కుగ్రామం అవడమంటే ఇదేగా.. ” అన్నది రేఖ

సాంకేతికరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులవల్లే ఇదంతా సాధ్యంమయిందని నెమ్మదిగా గొణుగుతూ లాప్టాప్ లో ఆన్ చేశాడు వినోద్. ఇద్దరూ లాప్ టాప్ స్క్రీన్ పై చూస్తున్నారు.

‘చూసారు కదా.. ప్రకృతిని , ఆ ప్రకృతిలోని జీవకోటిని సజీవంగా నిలుపుకోవడం కోసం నిరక్షరాస్యులైన పేద దళిత మహిళల కృషి.
కాలానుగుణంగా వచ్చే వాతావరణ మార్పులకు తోడు మానవ కార్యక్రమాలు కూడా వాతావరణంలో అనేక మార్పులకు కారణం అవుతున్నది.

ఆర్థికాభివృద్ధి ఫలితంగా భూమి , నీరు , గాలి , అడవులు మొదలైన సహజ వనరులతోపాటు జీవవైవిధ్యంపై కూడా వత్తిడి , విపరీత పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఆ సవాళ్ళనెదుర్కొంటూ అడవులు కొత్తగా సృష్టించడం , వివిధ రకాల వృక్షాలతో పాటు జంతుజాలానికి ఆవాసం ఏర్పరచడం తద్వారా పర్యావరణ సమస్యని అధిగమించడానికి ప్రయత్నించడం , వనరుల నాణ్యతను పెంచడం ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు భవిష్యత్ తరాల ప్రయోజనాలను కాపాడుతున్న సంఘం మహిళలు అభినందనీయులు అంటూ వస్తున్న కామెంటరీ.

ఆ తర్వాత మరికొన్ని డాక్యూమెంటరీలు చూపించారు.

** **
ఆ తర్వాత ఈక్వేటర్ అవార్డు విజేతల పేర్లు ప్రకటిస్తున్నారు. సభ దృశ్యాలు చూపుతున్నారు. సభికులను చూపుతున్నారు.
ప్రపంచంలోని రంగులు , వివిధ వేషధారణలు కనిపిస్తున్నాయక్కడ.

డయాస్ ని పరిశీలించారు.
ఐక్యరాజ్యసమితి లోగో కనిపిస్తున్నది.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం వారు నిర్వహిస్తున్న ఈక్వేటర్ పురస్కార సభ.
ఆ హాల్ లో జరుగుతున్న ఈక్వేటర్ పురస్కార సభను శ్వాస తీయడం మరచి ఉత్కంఠగా చూస్తున్నారు ఇద్దరూ.
“సంఘం మహిళలు ఆ సభలో… ఆశ్చర్యం” కళ్లింతవి చేసుకుని రేఖ

“ఇంతకు ముందు నక్షత్రాల్లా మెరిసి మాయమయ్యారు. ఏరి వాళ్లూ.. ” అన్నాడు వినోద్.
వారి కళ్ళు, మనసు సంఘం మహిళల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుండగా..

మూడు దేశాల తర్వాత ఫ్రమ్ ఇండియా… సంఘం సొసైటీ.. శ్రావ్యమైన గొంతు వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నది
.
ఒకరకమైన ఉద్వేగంతో ఉత్కంఠతో వేదికపైకి వెళుతున్న మొగులమ్మ బృందాన్ని చూస్తూ వినోద్ , రేఖ.

ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి పురస్కారం అందిస్తున్నప్పుడు భారత జాతీయగీతం జనగణమన గీతాలాపన జరుగుతున్నది. భారత కీర్తి పతాక ఎగురుతున్నది.

సభికుల హర్ష ధ్వనుల మధ్య మూడు తరాలకు చెందిన సంఘం ప్రతినిధులు కలిసి పురస్కారం అందుకున్నారు.
వాళ్ళలో మొగులమ్మను తప్ప మిగతా ఇద్దరినీ చూసిన గుర్తులేదు. కానీ వాళ్ళు చేసిన పనులు మాత్రం విని ఉన్నాడు.

అలా పదిహేడు దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు 2019 పురస్కారం అందుకున్నారు.
భారత దేశం నుండి అందుకున్న ఏకైక సంస్థ సంఘం సొసైటీ.

“రియల్లీ గ్రేట్ వినోద్..
నేలమీద గడ్డిపరకల్లా తిరుగాడిన వాళ్లుప్పుడు నింగిలో తారకల్లా మెరుస్తున్నారు.
మనం చేయలేని పనులు వాళ్ళు చేయగలిగినందుకు ఆ మహిళలని గట్టిగా హత్తుకుని నా అభినందనలు తెలియజేయాలని శరీరం , మనసు తహతహలాడుతున్నాయి.. ” వినోద్ చేతిని చేతిలోకి తీసుకుని నొక్కుతూ అన్నది రేఖ. ఆ వెంటనే

“ఇప్పటికే తీవ్ర సాగునీటి కొరత ఎదుర్కొంటున్నాం. వాతావరణ నిపుణులు వాతావరణ మార్పులపై చేస్తున్న అంచనాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి.
భవిష్యత్ లో నీటి లభ్యత మరింత దిగజారిపోతుందని హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్యల్ని ఎదుర్కోగల ధీటైన పంటలు చిరుధాన్యాలే.. పోషకాహారలోపం నుండి దేశాన్ని గట్టెక్కించగలిగేది చిరుధాన్యాలే.. ” అన్నది రేఖ.
ఆమె కంఠంలో తానే ఏదో సాధించినంత సంబరం.

ఆమె మాటలు విన్నాడో లేదో కానీ రేఖవైపు, కార్యక్రమం వైపు మార్చి మార్చి చూస్తున్నాడు వినోద్.

నిజమే ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల, మితిమీరిన మనిషి స్వార్ధం వల్ల ప్రకృతీ, సమాజమూ తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ మహిళలకు ఆ ముప్పు గురించి తెలుసో తెలియదో గానీ ప్రకృతికి అనుగుణంగా ముందుకు సాగారు. ఆ తర్వాతే మానవ తప్పిదాల వల్ల జరిగే ముప్పును తెలుసుకున్నారు.

ప్రకృతి విధ్వంసం , జీవన వైవిధ్యానికి ఏర్పడ్డ ప్రమాదం గుర్తించారు. అందుకే తమను తాము ప్రకృతికి అనుగుణంగానే మలుచుకుంటూ వస్తున్నారు. అదే వారి విజయానికి కారణం.

గుడ్డిగా అనుసరిస్తూ పోయిన తనను సరికొత్త ఆలోచనల్లోకి, ప్రపంచ జ్ఞానంలోకి లాక్కెళ్ళింది ఆ మహిళలే.
అంతర్జాతీయ వేదికలపై భూమిపుత్రికలు చేస్తున్న సేద్యపు పరిమళాల గురించి మొగులమ్మ , సంతోషమ్మల ద్వారా గతంలో విన్నాడు.
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం నోబులు ప్రయిజ్ స్థాయి అనుకుంటాం. పర్యావరణ పరిరక్షణలో అదే స్థాయి పురస్కారం ఈక్వేటర్ పురస్కారం.
ఆ పురస్కారాన్ని అందుకోవడం ఇప్పుడు కళ్లారా చూస్తున్నాననుకుంటూ కళ్ళు స్క్రీన్ పై దృష్టిని పెట్టాడు వినోద్.

ప్రపంచ వేదికపై పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అందుకున్న సంఘం మహిళలతో పాటు మిగతా విజేతల బృందం అంతా కలసి గ్రూప్ ఫోటో తీస్తున్నారు

ఎడారి బతుకు లోతుల్లో ఊటచెలిమలు పుట్టించారు. దూప తిర్చుకున్నారు. కళ్ళు కార్చిన కన్నీటినే ఆనందబాష్పలుగా మలచుకున్నారు. ఆధిపత్యపు చీకటిని సరిహద్దులు దాటించేసారు. స్వేదంతో సేద్యం చేసే వీళ్ళు కుంచించుకుపోవడం ఎప్పుడో మర్చిపోయారు. ఆగని ప్రవాహంలా సాగిపోతున్నారు.
అతిసాధారణంగా కనిపించే ఆ మహిళల్లోని అసాధారణ గొప్పదనాన్ని ప్రపంచం గుర్తించింది. అంత గొప్ప మహిళలతో కొంత సమయం గడపగలిగినందుకు అతనిలో కొత్త ఉత్తేజం. ఉత్సాహం.

వారి గురించి కొద్దిగానైనా తెలిసినందుకు, వారి నుంచి ఎంతో నేర్చుకోగలిగినందుకు తనకు తాను గర్వంగా ఫీలవుతున్నాడు వినోద్.
అంతలో “ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టే ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థకి నిధులు ఎక్కడినుంచి వస్తాయో.. “వినోద్ కేసి చూస్తూ అన్నది రేఖ.
ఏమో రేఖా.. అంటూ మొబైల్ లో గూగుల్ బ్రవు జ్ చేశాడు వినోద్.

అది చూస్తూ “ప్రధాన వనరులు అమెరికానుంచే. అమెరికా ఇతర అభివృద్ధి దేశాల నుండే రేఖా.
అమెరికా ఒక్కటే బిలియన్లకొద్దీ డాలర్లు సమకూరుస్తున్నది. అంతేకాదు అమెరికన్ ప్రయివేటు సంస్థలైన గేట్స్ ఫౌండేషన్ , గవి అలియెన్స్ , నేషనల్ ఫిలోన్త్రోఫిక్ ట్రస్ట్ , బ్లూమ్బెర్గ్ వంటి సంస్థలు కూడా నిధులు సమకూరుస్తున్నాయి. వాటితోపాటు యునైటెడ్ కింగ్ డం , యూరోపియన్ కమిషన్ కూడా నిధులు అందిస్తున్నాయి. ఇవికాక ప్రజలనుండీ కూడా కొద్దీ మొత్తంలో సేకరిస్తుంటారు ” చెప్పాడు వినోద్.

“అంటే , ఒక చేత్తో పోగేసుకుంటూ మరో చేత్తో విదిలిస్తున్నవా..” ఏదో అర్ధమవుతున్నట్లుగా రేఖ
ఏమిటో రేఖా.. ఆలోచిస్తుంటే ఎవరు ఎటునుండి ఎటు ప్రయాణం చేస్తున్నారో.. కదా..

ఏదేమైనా సంఘం మహిళలకు వచ్చిన గుర్తింపు నాకు మాత్రం చాలా చాలా ఆనందం కలిగిస్తున్నది అంటూ కుర్చీకి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు వినోద్.

వారితో పరిచయం.. మాటలు.. వాళ్ళ కార్యక్రమాలు.. ఎన్నెన్నో జ్ణాపకాలు.. మదిలోంచి తెగిపడుతున్నాయి.

వెనక్కి నడిచిన కాలంలో తెగిపడిన ఆ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా ఏరుకోవడం మొదలుపెట్టాడు వినోద్

** **

“అప్పుడు
గంపకింద కోళ్ళలెక్క బతికినోళ్లం
బుగులు బుగులుతోని బతికినోళ్లం
పేదోల్లం.. చానా ప్యాదోళ్లం

ఆడోళ్లం
ఆధారపడి బతికినోళ్లం
చేను చెల్క లేనోళ్లం

ఇసిరేసినట్టు ఒక్కోళ్ళకు ఇంతంత ఉన్నగానీ.. పనికిరాని భూములోళ్ళం
ఏదొక గింజరాల్చే ఆ అరెకరం, ఎకరం భూతల్లినీ పడితు పెట్టినోళ్లం
ఎద్దుకు నాగలికి , ఇత్తునానికి పెద్ద రైతులమీద ఆధారపడినోల్లం

వాండ్ల పొలాలల్ల , చేన్లల్ల కూలినాలి చేసినోల్లం
వాండ్ల ఇండ్లల్ల గాయిదోళ్లం..
వాండ్లేసేటి ఎండిన రొట్టె, మురిగిన అంబలి కోసం దున్నపోతోలే బండెడు చాకిరీ చేసినోళ్లం

కానీ, ఇప్పుడు..
అదంతా ఉల్టా ఫుల్టా
మేం ఎవుసాయదారులం. రైతులం
మా తాన ఎడ్లయినయి. బండ్లయినయి
మా పంటలు మేం పండించుకుంటాన్నం

ఒక్కటి కాదు రెండు కాదు ఎకరంల ఇరవై ముప్పై రకాల పంటలు తీస్తున్నం
అన్ని తిండి పంటలు, కలిపి పంటలు పండిచ్చుకుంటున్నం

మా తిండి మేం తింటున్నం. రుచిగల్ల తిండి తింటున్నం. రోగాల్లేని తిండి తింటున్నం
మా బతుకులు మేం బతుకుతున్నం

మేమీ మట్టినే నమ్ముకున్నం. ఈ మట్టిలనే వేళ్లుబోసుకుంటున్నం
ఎవరికోసం ఎదురుజూసుడు లేదు. ఒకళ్ల చెయ్యి విదిలిచ్చుడు కోసం ఆశపడుడు లేదు

మా ఇత్తునం మేం జేసుకుంటున్నం. మా ఎరువుల మందులు మేమే చేసుకుంటున్నం
మా పురుగు మందులు మేం జేసుకుంటున్నం. మా పంటను మేమే అమ్ముకుంటున్నం
మా బతుకు మేము బతుకుతున్నం. మా బతుకు పండించుకుంటున్నం
మా భూతల్లిని మేం బతికిచ్చుకుంటున్నం

ఇప్పుడు మా ఆడోళ్లదంతా ఒక పట్టు. చిన్న చిన్నోళ్ళదంతా ఒక కట్టు. ఆడోళ్ళ చేతిల ప్యాదోళ్ళ ఎవుసం ముందుకుబోయింది
ముందు ఒక ఎకురం మనుషులమయినం. అటెనుక మేం నాల్గయిదెకరాలోల్లం అయినం.
కోళ్లయినయి, మ్యాకలయినయి , బర్రెలున్నయి , పశులున్నయి
ఇల్లున్నది , వాకిలున్నది

మా తాన కొద్దో గొప్పో చేతుల పైసాడుతున్నది. ఇబ్బంది లేదు. మేమిప్పుడుత్త కుండలం గాం.
అన్నిటికన్న ముందు , మాకిప్పుడొక గుర్తింపున్నది. గౌరవమున్నది.
నిన్న మొన్నటిదాంక అంటుడు ముట్టుడు , అసుంట ఇసుంట అన్నోళ్లే ఈ దినం మా తానికొస్తుంరు. మా ఆకిట్లకొస్తుంరు. వాండ్ల గల్వలోపటికి రాని స్తుంరు.. “

మైక్ లోంచి మాటలు వినవస్తున్నాయి. ఆ గొంతులో గాని , మాటలో గానీ గర్వం, అతిశయం, అహంభావం ఏమాత్రం ధ్వనించడం లేదు.
ఆమె ఎద లోపలి నుండి ఆత్మవిశ్వాసంతో వస్తున్న మాటలవి. నిండైన నదీ ప్రవాహంలా గ్రామీణ జహీరాబాదీ మాండలికంలో బిరబిరా సాగిపోతున్నాయి.
బావమరిది అరవింద్ వాళ్ళకోసం ఎదురుచూస్తూ చెట్టు నీడకు ఆగి, ఫోన్ కాల్ తో కారు దిగిన వినోద్ చెవిలో అవి దూరాయి.

ఆ మాటల్లోని లోతు అర్ధం కాకపోయినా అతనిలో అంతులేని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
గాలి మోసుకొస్తున్న మాటలు వినవచ్చే దిక్కుగా చూశాడు.

చుట్టూ ఎర్రమట్టి నేలలు. గులకరాళ్ళ నేలలు. రోడ్డుకు రెండు ఫర్లాంగుల దూరంలో కొన్ని పచ్చని చెట్లు . ఆ చెట్ల మధ్యలో రంగు రంగుల టెంట్లు వేసి కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలు ఆగి ఉన్నాయి. అక్కడ ఏదో మీటింగ్ జరుగుతున్నట్లున్నది.

అతని చెవులు రిక్కించి వింటున్నాయి. ఎప్పుడూ ఏ మీటింగ్ లోనూ వినని విధంగా సాగుతున్నది ఆ ప్రసంగం.

ఈ మారు మూల ప్రాంతంలో ఇంత బాగా మాట్లాడుతున్న మహిళ ఎవరో… ఆ భాష చూస్తుంటే గ్రామీణ మహిళలాగే అనిపిస్తున్నది.
ఎవరై ఉంటారు.. జీవితాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దుకున్నది. అంత గొప్ప విజయాల్ని నమోదు చేసుకున్నది.. మదిలో రేగే ప్రశ్నలకు జవాబు వెతుకుతూ అసంకల్పితంగా మైక్ లో మాటలు వచ్చే దిక్కు అతని కాళ్ళు అడుగులేశాయి.
ఆ ఒరవడిలో కొట్టుకుపోతున్నాడతను.

( ఇంకా వుంది… )

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply