ఆ వెంటనే తాను వచ్చిన పని చెప్పింది.
“మొగులమ్మా.. సంఘం నడుపుతున్న కెవికె (కృషి విజ్ణాన కేంద్రం) గురించి నీకు తెలుసుకదా.. అక్కడ జెర్రల ఎరువు తయారీపై శిక్షణ త్వరలో మొదలవుతుంది.
నువ్వూ నేర్చుకో.. ఇంటికి చేసిన అప్పు త్వరగా తీర్చుకోవచ్చు. నీవనుకుంటున్నట్టు మీ ఆయన బాకీ కూడా తీర్చేయొచ్చు” అని చెప్పింది కార్యకర్త.
ఆమాటలు మొగులమ్మకు చాలా నచ్చాయి.
“ఆ.. అన్నట్టు చెప్పడం మరిచాను. ఈ విషయం మీ గుంపులో అందరికీ చెప్పు. ఆసక్తి ఉన్నవాళ్ళ పేర్లు రేపు సాయంత్రానికల్లా నాకు చెప్పాలి. రేపు కలుస్తా ” అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది అంజమ్మ.
ఇంటిపక్కనే ఉన్న సంతోషమ్మకు, ఇంటివెనక వైపున ఉండే బాలమ్మకు విషయం చెప్పింది. ఇంకొంచెం ఆవలకు ఉండే వారికీ వెళ్లి చెప్పొచ్చింది. మిగతావారికి ఇంట్లో పనులయ్యాక చెప్పింది. ఆలోచించుకుని పొద్దున్నే చెప్పమని చెప్పింది.
ఒక సారెప్పుడో సంఘం ఆఫీసుకు వెళ్ళినప్పుడు మణెమ్మ సంఘం నుండి అప్పుగా డబ్బులడిగింది.
‘ఇప్పటికే రెండులోన్లున్నాయి. అవి తెంపకుండా ఇంకా ఎట్లా ఇచ్చేది. ఇచ్చిన పైసలు తినుడే కాదు, పైసలు లేవని బాధపడడం కాదు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ మీద నువ్వు ఆధారపడు’ పెద్ద అక్క చెప్పడం విన్నది. ఆ మాటలు అకస్మాత్తుగా గుర్తొచ్చాయి మొగులమ్మకు. ఇప్పుడేకాదు అప్పుడప్పుడూ అలా గుర్తొస్తూనే ఉంటాయి.
సంఘం అక్కలు చాలా కరెక్టుగా చెప్పారు. ఎవరి మీద ఆధారపడి బతకడం సరైనది కాదు. ఎవరి బతుకు వాళ్ళే బతకాలి. ఎవరి కష్టాన్ని వాళ్లే నమ్ముకోవాలి. నేను కూడా ఎవరిమీదా ఆధారపడకూడదు. నా మీదే నేను ఆధారపడాలి అని ఆనాటి నుండీ ఎన్నోసార్లు మనసులో గట్టిగా అనుకున్నది. మళ్ళీ ఈ రోజు కూడా తనలో తాను చెప్పుకున్నది మొగులమ్మ.
బాలాపూర్ గుంపునుండి ఒక్కరు కూడా జెర్రల ఎరువు శిక్షణకు ముందుకు రాలేదు. తనతో పాటు ఇంకా ఒక్కరయినా వస్తే బాగుండునని అనుకున్న మొగులమ్మ ప్రయత్నించింది. కానీ లాభంలేకపోయింది.
‘ఇంటికి చేసిన అప్పు త్వరగా తీర్చుకోవచ్చు. నీవనుకుంటున్నట్టు మీ ఆయన బాకీ కూడా తీర్చేయొచ్చు’ అని కార్యకర్త చెప్పిన మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి.
తానొక్కటే అయినా కృషి విజ్ణాన కేంద్రానికి పోయి జెర్రల ఎరువు తయారు చెయ్యడం నేర్చుకోవాలని నిర్ణయం చేసుకున్నది మొగులమ్మ.
మూడురోజులు అక్కడ శిక్షణ పొందిన తర్వాత తనమీద తనకు నమ్మకం వచ్చింది. తాను సొంతంగా ఎరువు తయారు చేసుకోగలనని.
ఇసుక , ఇటుకలు , మెష్ , బొంగులు వేసి బెడ్ తయారీ తెలుసుకున్నది.
మేస్త్రి ఖర్చులకు ఆఫీసునుంచి రెండువేల రూపాయలు అప్పుగా ఇచ్చారు. వాయిదాల పద్దతిలో ఆ అప్పు తీర్చాలి.
కృషి విజ్ణాన కేంద్రం వాళ్ళే వానపాములు ఇచ్చారు. వాటిని మొగులమ్మ దగ్గర ఎక్కువ వున్నప్పుడు ఏడాదిలోగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఇచ్చే పద్ధతి మీద. మొగులమ్మ ఇంటి దగ్గరే చింత చెట్టు నీడలో వానపాముల ఎరువు తయారీకి కావలసిన బెడ్ వేసింది. వానపాముల ఎరువు తయారీ ప్రారంభించింది.
పనిలో మొగులమ్మకు చేదోడు వాదోడయింది పూలమ్మ. మల్లమ్మ ఇంటిపనులకు కొంచెం కొంచెం సాయం అవుతున్నది.
మొదటినెలలో రెండు క్వింటాళ్లు ఎరువు వచ్చింది.
సామూహికంగా వాళ్ళు చేసే వ్యవసాయ క్షేత్రంలో వేయడానికి ఒక క్వింటా ఇచ్చింది. మిగిలిన క్వింటాల్ ని కిలో రెండు రూపాయల చొప్పున అమ్మింది. రెండువందల రూపాయలు వచ్చాయి. మొగులమ్మ ఆనందానికి అవదులేకుండా పోయింది. ఆమె మీద ఆమెకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
అట్లా మొగులమ్మ భవిష్యత్ పై ఆశను మొలకెత్తించే విత్తును నాటి కుటుంబపు ఆకలి బాధకు తూట్లు పొడిచేసింది.
** **
మరో ఉగాది గడిచింది.
కొన్నాళ్ళకి, నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే మొగులమ్మ చిన్న చెల్లెలు అక్కను చూసి పోదామని వచ్చింది. మారిన అక్క కుటుంబ పరిస్థితి ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
సంఘంలో ఉన్న వాళ్ళ ఆకలిపోయిందని ఆనోటా ఈనోటా తన ఊరికి చేరిన ముచ్చట్లు విన్నది కానీ తన అక్క పరిస్థితిని ప్రత్యక్షంగా చూసింది.
జెర్రల ఎరువు చేయడం మొదలుపెట్టాక అక్క చేతిలో పైసలు బాగా తిరుగుతున్నాయని అర్ధం చేసుకున్నది ఆమె. అయితే ఆ ఎరువు ఎందుకు వేస్తారో తెలియదు. అందుకే…
“అక్కా జెర్రల ఎరువెందుకెయ్యాల్నే ” అని అడిగింది సందేహంగా
” ఈ ఎరువు భూమికి సలువజేస్తది. ఎండకు మొక్కలు జల్ది ఎండిపోవు , మాడిపోవు. మంచిగ ఏపుగ పెరుగుతయ్. చీడపీడలు తక్కువొస్తయట. సహజంగా వచ్చే పంట రుచి ఎక్కువట. మనకి ఆరోగ్యాన్నిస్తదట.
మసాలా ఎరువులు నేలకు మంచిది కాదట. పంట వస్తది కానీ అది మన ఆరోగ్యానికి చేటు చేస్తదట. ముఖ్యంగా ఇక్కడున్న గారాబు భూములకు అస్సలే మంచిది కాదట. ” తనకు సంఘం కార్యకర్తలు చెప్పిన విషయాలు చెల్లెలికి చెప్పింది మొగులమ్మ
“నీకా.. సేను సెల్క ల్యాకనే పాయె.. ఏంజేత్తవే గీ జెర్రల ఎరువంతా.. ” ఆమె చెల్లి నుండి మరో ప్రశ్న
“ఈ యాడాది లాగోటి (కౌలు) జేసిన. ఇరవై తీర్ల పంటలేసిన. రోహిణి భరణి నాటికి ఎదకు పెట్టిన. పచ్చ జొన్నలు , సాయి జొన్నలు, రెండు తీర్ల పెసర్లు , రెండు తీర్ల తొగర్లు, మినుములు, అనుములు, రెండు తీర్ల బొబ్బర్లు, నువ్వులు , గడ్డి నువ్వులు, అవిసెలు , సజ్జలు, కొర్రలు , సామలు, శనగలు, పూండి, వంకాయలు, టమాటలు పెట్టిన. అండ్లనే ఎప్పటికీ ఇంత పాయలకూర, దొగ్గలి కూర , తుమ్మికూర , గునకకూర , తెల్లగరిజే కూర , ఎర్రగరిజే కూర ఏదోటి దొరుకుతనే ఉంటది.
గణపతి పండుగెల్లంగనే పెసర్లు , మినుములు కోతకొచ్చినయ్. అటెనుక నువ్వులు , అటెనుక జొన్నలు , సజ్జలు , అటెనుక శనిగెలు ఆఖరుకు తొగర్లు ఒక్కదానేనుక ఒక్కటొచ్చినయ్. కు కింటా తొగర్లు , కింటా పైన జొన్నలు , సజ్జలు , ఏసిన పంటలన్నీ అయిన్ని ఇవిన్నొచ్చినయ్. ఇత్తునంకు తీసి పెట్టిన. నేను ఇత్తునం తెచుకున్న కాడ ఒకింతకు రెండింతలిచ్చిన. ఇంటి తిండికి కరువు లేదు. జొన్నలిన్ని , తొగర్లిన్ని నువ్వు కొంటవోతవని ముల్లెగట్టి ఓరకు పెట్టిన ” చెల్లెలితో చెప్పింది మొగులమ్మ.
“అంతగనం పంట ఎట్లదీసినవే..” అక్కకు తనమీద ఉన్న ప్రేమకు మురిసిపోతూ ఆశ్చర్యంగా అన్నది ఎల్లమ్మ
” ఏం లే.. ఇంటెనుక పెంట ఎరువు తొల్తము గద. అట్లనే జెర్రల ఎరువు వేసిన గద.గంతే.. ” అన్నది మొగులమ్మ
అట్లనా ” ఆశ్చర్యంగా చూస్తున్నది మొగులమ్మ చిన్న చెల్లెలు ఎల్లమ్మ.
“నేను చేసిన చేను పక్కాయన తొగర్లు , జొన్నలు ఏసిండు. మసాలా ఎరువులేసిండు. తొగర్లకు పురుగుపట్టిందని పురుగుమందు కొట్టిండు. అయిన ఇత్తునం ఏసినంత మందమన్న పంట రాలేదట. పరేషనయితాండు “
“అట్లెట్ల ” అర్ధం కాలేదు చెల్లెలుకు
“మేం కలిపి పంటలేసినం కద. కలిపి పంటలల్ల ఒక పంట భూమిల బలం తీసుకుంటది. ఇంకొక పంట భూమికి బలాన్నిస్తది. ఒక పంట కొంచెమే బలం తీసుకుంటది. ఒకదానికొకటి తోడయితయి. ఆకు రాలుత్తయి. భూమి మెత్తబడతది. సారం పెరుగుతది. ఒక పంటకు చీడ పడ్తే మరో పంట అది రాకుంట కాచుకుంటది. కాపాడుతది “‘ వివరించింది కలసి కట్టుగా ఉంటె మనుషులకే కాదు మొక్కలకి కూడా బలమేనని గ్రహించిన మొగులమ్మ.
ఒకప్పుడు బిచ్చమడుక్కు తినే స్థితిలో ఉన్న అక్క ఇప్పుడు ఒకరికి తిండి పెట్టే స్థితిలో.. మనస్ఫూర్తిగా అక్కను మనసులోనే అభినందించింది ఎల్లమ్మ.
** **
ఆ రోజు బయటి పనులేమీ లేవు. ములకున్న ఇసుర్రాయి తీసి శుభ్రం చేసింది. పెద్ద బానలోంచి జొన్నలు గంపలోకి తీసింది. గోనెసంచీలు పరిచింది. వాటిమీద తన పాతచీర పరిచి మధ్యలో ఇసుర్రాయి పెట్టింది.
జొన్నపిండి, జొన్న గట్క అయిపోయిందని విసుర్రాయి ముందేసుకున్నది.
పగలంతా ఆ పని పెట్టుకుంది మొగులమ్మ. కొద్ది కొద్దిగా జొన్నలు పోస్తూ నెమ్మదిగా విసిరి పిండి చేసింది. కొంచెం ఎక్కువ జొన్నలు పోసి బరబరా విసిరినప్పుడు జొన్న గట్క వచ్చింది. విసిరిన జొన్న పిండి , గట్క వేర్వేరు కుండలో పోసింది. రాగులు రోట్లో పోసి దంచింది. చేటతో చెరిగి పొట్టు తొలగించింది. ఆ తర్వాత అంబలి కోసం రాగులను విసుర్రాయిలో పోసి విసిరింది. రాజన్ పిండిని ఎత్తి కుండలో పోసిపెట్టింది.
ఆ పూటకు రొట్టె పిండి తడిపి పెట్టింది.
చేన్లో తెచ్చుకున్న జొన్న చెంచలిగూరలో రెండు టమాటాలు వేసి కూరొండింది. కట్టెల పొయ్యి ముందర కూర్చుని రొట్టెలు చేస్తూ కాలుస్తూ పొయ్యిదగ్గరే ఉన్నది.
అరె బేటా.. జర రెండు ఎండు పుల్లలు పట్కరా పో అని కేకేసింది. అది వినిపించుకోలేదు మల్లేశం.
ఆ సంధ్యా సమయంలో అల్లరిగా తిరుగుతున్న తూనీగల వెంట పడ్డాడు మల్లేశం. ఆ వెనకే మల్లమ్మ , చంటివాడు.
వీళ్ళనుండి అవి తప్పించుకుంటూ మొక్కలపై , కొమ్మలపై ఎగురుతున్నాయి. ఒక్కోసారి ఎండుపుల్లలపైకి వెళుతున్నాయి. వీళ్ళు దగ్గరవుతున్న శబ్దానికి తుర్రుమంటున్నాయి.
అంతలో చిన్నయ్య వెళ్లి ఎండుపుల్లలు తెచ్చి పొయ్యిలో పెట్టమని మొగులమ్మ ముందుపెట్టాడు.
అడవి నుంచి ఎండుపుల్లలు ఏరుకొని తెచ్చుకోవడం చాలా కష్టమవుతున్నది. చాలా ఇబ్బంది అవుతున్నది. డ్వాక్రా గ్రూపులో సబ్సిడీపై గ్యాస్ పొయ్యి ఇస్తున్నారని అంటున్నారు. కానీ అది తెచ్చుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. చూడాలి, కార్యకర్త అక్కని అడిగి తెలుసుకొంటే ఏమి చెబుతుందో.. వీలయితే అది తీసుకోవాలని మనసులో అనుకుంటున్నదామె.
గ్రామంలో డ్వాక్రా కార్యక్రమాలు కొద్దికాలం క్రిత్రం ప్రారంభం అయ్యాయి. సంఘం సభ్యులు కూడా డ్వాక్రా సంఘాల్లో సభ్యత్వం తీసుకున్నారు. మొగులమ్మ కూడా తీసుకుంది.
అంతలో పూలమ్మ అన్నం తినే ప్లేట్లు తెచ్చి తల్లి దగ్గర పెట్టింది.
మల్లేశానికి తూనీగ దొరినట్టే దొరికి తుర్రుమంటున్నది. ప్రాణభయంతో తప్పించుకుంటున్నది.
తోక ఊపుతూ వెక్కిరిస్తున్నది అనుకుంటూ వాటి వెంట పరుగులు పెడుతూనే ఉన్నాడు మల్లేశం
చివరాఖరికి మల్లేశం చేతికి ఒక తూనీగ దొరికింది. దానికి దారం కట్టాడు. గాలిలోకి వదిలాడు. అది సరిగ్గా ఎగరలేకపోతున్నది. గిలగిలకొట్టుకుంటున్నది.
అంతలో చంటి వాడు ఎవరో కొట్టినట్టు ఏడుస్తున్నాడు. ఆకలయిందేమోనని మొగులమ్మ పిలిచింది. రాకుండా వాకిట్లో చతికిల పడ్డాడు. కాళ్ళు కింద నేలకేసి కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు.
“ఏమైంది బేటా.. ఆకలయితాందా.. ” అన్నది మొగులమ్మ.
కాదని తల అడ్డంగా ఊపుతూ ఏడుస్తూనే ఉన్నాడు. అప్పటినుండి వాడిని గమనిస్తూనే ఉన్నది పూలమ్మ. పెద్ద తమ్ముడి చేతిలో ఉన్న తూనీగ కోసం ఏడుస్తున్నాడని అర్ధం చేసుకున్నది.
అంతలో “బూగ.. బూగ.. ” స్వరం పెంచాడు చిన్నోడు.
“మల్లేశా.. తమ్ముడికి జరసేపు బూగ నియ్యరాదురా..”అని మళ్లి వెంటనే ” అయ్యిటి గోస పోసుకోకురా..కొడకా.. ఇడ్సు.. “అన్నది మొగులమ్మ
“అసలే ఇదెగుర్త లేదని నేను పారేశానయితాంటే.. ” అని దాన్ని పైకి పంపించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు మల్లేశం.
తూనీగ తలనిండుగా కనిపిస్తున్న పెద్ద పెద్ద కళ్ళని , కాళ్లని చూసింది మల్లమ్మ. ఇంత పెద్ద తలకి అంత సన్న కాళ్లయితే ఎట్లా నడుస్తుంది.. అందుకే ఎగిరిపోతున్నదేమో అనుకుంది మల్లమ్మ.
అంతలో లేత పసుపు , బుడిదరంగులో ఉన్న తూనీగ రెక్క ఊడి రాలిపోయింది.
అయ్యో.. ఎట్లా అన్నట్టుగా నోటిఫై చెయ్యి వేసుకొని చూస్తున్నది మల్లమ్మ. చంటివాడి ఏడుపు ఆగిపోయింది. ఎగరలేక చచ్చినట్టు పడిఉన్న తూనీగకు కట్టిన దారం తీసేసాడు మల్లేశం.
అందరికి ప్లేట్లలో రొట్టెలుపెట్టి కూరవేసింది పూలమ్మ. చిన్నోడికి గిన్నెలో సగం రొట్టెముక్క వేసి ఇచ్చింది
ఒకదగ్గర కూర్చొని రొట్టె తింటున్న మల్లేశం తినడం ఆపి లేసాడు. తూనీగ దగ్గరకు వెళ్ళాడు. “అయ్యో.. చచ్చిపోయింది” అసంకల్పితంగా అతని నోట. ఆ కళ్ళలో బాధ. దాన్ని చీమలు మోసుకు పోతున్నాయి.
“ఇంత చిన్న చీమలకు అంత బలం ఎక్కడిదో..” అన్నది ఆ దృశ్యాన్ని చూస్తున్న మల్లమ్మ.
“మనమూ ఆ బూగలు , చీమలసొంటోల్లమే.. బిడ్డా..ఇన్నొద్దులు గా బుగలెక్కనే పటేండ్ల కాడ రెక్కలిరిగి పడిపోయిన బతుకులు మనవి ..
ఇప్పుడు , ఆ చీమల్లెక్క అందరం కలసి కట్టుగుండి బలం , బలగం పెంచుకొంటున్నం. ఏది మనతోటి కాదు అనుకుంటలేం.” అంటూ పిల్లల వైపు చూసింది.
ఏమర్ధమయిందో మల్లేశం తప్పుచేసిన వాడిలా తల దించుకున్నాడు.
“అవ్వా.. మల్లెన్నడు , బూగలకు , సీతాకోకచిలుకలకు ఎవ్విటికి పట్టనే.. ముట్టనే..
అయ్యిటిని , అయ్యిటి లెక్కనే ఎగురనిస్తనే.. ఏమననే.. ” బాధతో మల్లేశం గొంతు వణికింది.
కొడుకు పెద్దవాడయిపోతున్నాడు. ఎంత చక్కగా అర్ధం చేసుకున్నాడు అని లోలోపల ఆనందిస్తూ “అట్లనే , కొడకా.. ” అంటూ చేస్తున్న రొట్టెలు ఆపి కొడుకును దగ్గరకు తీసుకుని మెటికలు విరిసింది.
అప్పటికి గాని మల్లేశం మనసులోని బాధ ఉపశమించలేదు.
రోజూ కంటే ఆ రోజు సాయంత్రం వంట కొద్దిగా ఆలస్యమవడంతో అంతా గబగబా తినేశారు.
రెండిళ్ళ ఆవల వేప చెట్టుకింద ఆడామగా పిల్లా జెల్లా అప్పటికే జమవుతున్నారు.
అంతలో టేప్ రికార్డర్ , క్యాసెట్ తీసుకొచ్చింది పూలమ్మ. అందరూ గుండ్రంగా కూర్చున్నారు. మధ్యలో టేప్ రికార్డర్ పెట్టింది పూలమ్మ. రికార్డర్ లో క్యాసెట్ వేసి ప్లే చేసింది. వీధి దీపపు గుడ్డి వెలుగుతురులో జనం ఆ రోజు కార్యక్రమం వినడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గారాబు భూములిచ్చినారు
గింజ మొలువ నీరు లేదు
తిండికి తిప్పలొచ్చెరా ఓ రాములన్నా..
ఎండిపోయే రోజులొచ్చేరా.. ఓ రాములన్నా
తిండికి తిప్పలొచ్చెరా ఓ రాములన్నా
ఎండిపోయే రోజులొచ్చెరా.. ఓ రాములన్నా
గారాబు బూవులల్ల.. ఓ రాములున్నా..
తిండి గింజలేసినాము.. ఓ రాములన్నా
జెర్రల ఎరువులే ఏసినాము ఓ రాములన్నా
తిండి తిప్పలు తీరెనన్నో.. ఓ రాములన్నా
పాట వస్తున్నది. వచ్చిన వాళ్ళు ముచ్చట్లు ఆపి వినడం మొదలు పెట్టారు. అప్పటికి రాకుండా ఇళ్లలోనే ఉన్నవాళ్లు తొందరపడి రావడం మొదలు పెట్టారు. అందరి ధ్యాస ఆ రోజు వినే కార్యక్రమాల పైనే పెట్టారు.
మన అక్కలు పాడిన పాట విన్నారు కదా. బర్డిపురం లచ్చుమమ్మ ఏం చెప్తున్నదో వినండి
‘నాకు మూడెకరాల భూమి ఉన్నది. రెండెకరాలు గారాబు నేల. ఎకరం నల్లర్యాగడి. జెర్రల ఎరువు ఇత్తునాలతో కలిపి చల్లుత. ఆ తర్వాత మొక్క అడుగు ఎత్తు పెరిగినంక మళ్లి ఎరువు ఏస్త. మిగిలిన ఎరువు కిలో రెండు రూపాయలకు అమ్ముతున్న.
మీరు సుతం జెర్రల ఎరువు జేస్కోవాలని అనుకుంటే మీ గుంపు లీడరుకు చెప్పుంరి. ఆమె సంగంల చెప్తది. కెవికె లో ట్రేనింగ్ ఇస్తరు ‘ చెప్పింది
నేను సంగంల లేనప్పుడు చానా పేదరాలిని. దిమాక్ లేకుండే.. గిప్పుడు ముత్తెమంత శానిగయిన. ధైర్నమొచ్చింది. ట్రైనింగ్ తోటి చాన విషయాలు తెల్సుకున్న.
ఇప్పుడు తోటి రైతులకు నేను సుత ట్రైనింగ్ ఇస్తున్న. వేరే ఊర్లల్లకు పోయి ట్రైనింగ్ ఇచ్చోస్తున్న.. హట్నూర్ పోయి ఇప్పుడే వచ్చిన.
ఇంట్ల రికాం కూసోకుంట చేతినిండ పనిదొరుకుతున్నది. మాకు అమ్దాని మంచిగున్నది. ఎవ్వరి కోసం ఎదురు చూసేటిది లేదు. ఆధారపడేదిలేదు. బయట కూలి మీదనే బతికే పరిస్థితి కాదు.
నేనిప్పుడు బాకీ తేగలను. అది తీర్పగలను. ఆ ధీమా ఉన్నది. అది జెర్రల ఎరువు అమ్మిస్త. లేకుంటే దాని బదాలు ఇంకోటి తెచ్చుకుంట. అంటే ఆళ్లతాన ఉన్నది తీసుకుంట, నా తాన ఉన్నది ఆళ్ళకిస్త.
ఇప్పుడు మా ఊర్లె అందరికీ మేమెర్కనే. మాకింత గుర్తింపు దొరుకుతున్నది.
మేము శ్రమ జీవులం. గుప్పెట మట్టి పట్టి ఇటుక రాళ్లు ఎత్తుతున్నం. ఒక్కొక్క ఇటుక పేరుసుకుంట గోడ గట్టిగ కట్ట వస్తున్నం.
ఓ అక్కలూ.. మీ కెర్కేనా.. ఇప్పుడు మా తాన కులం తక్కువయింది
మంచినీళ్ల బాయిలల్ల మా నీళ్లు మేం చేసుకుంటాన్నం…గట్లెట్ల.. అంటున్నరా..
నీళ్లు చేసుకున్నందుకు మమ్ముల కొట్టొచ్చింరు. కులంతోటి తిట్టింరని మేం పోలీసు ఠాణాల కేసు పెట్టినం.
అప్పటిసంది లోపట లోపట తిట్టుకున్నరేమో కానీ పైకి తిడ్తలేరు. సంగమొచ్చినంక తెలివికచ్చిండ్రు అనుకోవట్టిన్రు.
ఇదంతా ఉత్త మాటలు గాదు నివద్దే.. జెప్పిన. అని ముగించింది.
ఇగో ఇప్పుడు ఐతపురం మణెమ్మ ముచ్చట ఆమె గొంతులనే మీకు వినిపిస్త అనుకున్న. కానీ ఆమె మాట మంచిగొస్తలేదు. జర సర్ది దగ్గు అయింది. ఆమె సెప్పిన ముచ్చట్లు నేను మీకు సెప్తాన్న.
నేనెవరనుకుంటుంరా.. నేనేనుల్లా.. మీ పూలమ్మను.
ఆ గొంతు వినగానే అక్కడున్న అందరి కళ్ళు పూలమ్మకోసం వెతికాయి. ఆమె కనిపించలేదు. కానీ ఆమె గొంతు వినిపిస్తున్నది. ఆ గొంతులోంచి జాలువారుతున్న ముచ్చట్లలోకి వెళ్లిపోయారంతా.
మణెమ్మకు డెబ్భై ఏండ్లు. మనూర్ల అందర్లేక్కనే ఆమె సుతం పెద్ద పెద్దోళ్ల చేన్లలకు కూలికి పోతుండే.
పెనిమిటి లేడు. సచ్చిపోయిండు. ఆమె పిల్లగాండ్లు సిన్నగున్నప్పుడే సచ్చిండ్లు.
ఆమెకు మూడెకరాల గార్బు ఉన్నది. అండ్ల ఏం ఎయ్యకుంటిరి. పడితు ఉండే. పంటలు పండేటి న్యాల కాదని. అంత ఖరాబు బూమది.
మణెమ్మ ఇయ్యాల్ల ఈడ ఉండి రేపటేల్లుండి దినాలల్లకు జూస్తది. శానా తెల్వి గల్లది. ఆమె పనికిపోయినక్కడి కెల్లి మునిగిపోతున్న పాత పంటల ఇత్తునాలు కొన్ని కొన్ని తీస్కచ్చి చిన్నగురుగుల్ల ,కుండలవోసి వొరకు పెడుతుండే.
ఆ ఇత్తునం తోని ఎవుసం జేసుడు మొదాలువెట్టింది. ఇప్పుడామె సేను రూపమే మారిపోయింది. అయి ఇన్ని , అయి ఇన్ని ఇరవై రకాల పంటలు ఏసింది. ఆ మొక్కల ఆకు రాలింది. న్యాలతల్లికి తిండి దొరికింది. బలమొచ్చింది. అరిగెలు , సామలు , కోడి సామలు, అనుములు, చెమ్కి మినుములు , గంగ మినుములు, పొరక ఉలవలు, మన్సు ఉలవలు, ఎర్ర బైముగలు, నల్ల బైముగలు (వేరుశనగ ), పాయలికూర, టమాట , పూండి , బెండి గిట్ల మా లెస్స ఏసింది. పంటలు తీసింది.
గమ్మతున్నది గదా మణెమ్మ ముచ్చట. ఇగ ఇప్పుడు సారమ్మ ఏం సెప్తదో జర్ర ఇనుంరి.
‘అప్పట్ల మా నాయిన నాలుగు రకాల కలిపి పంటలు ఏసేటోడు. నేనిప్పుడు ముప్పై రకాలేసిన.
ఒక్కొక్క పంట మట్టికి ఎంతో కొంత ఇస్తది. పక్కనున్న పంటలు పెరిగెతందుకు తోడయితది. రాలిన ఎండుటాకులతో బూమి బలమొచ్చింది. చీడపీడలు తక్కువనే. ఒకపంట రాకున్న ఇంకో పంట వస్తదన్న దైర్యంతోని ఏసిన. పశులపొట్టకు కరువు లేకుంట రకరకాల మ్యాత దొరికింది.
మన పాత పంటలకు కాలం అయిన కాకున్న నడుస్తది. అవి తట్టుకొని నిలవడతయ్. మనకు నిలవెడతయ్.
మసాలా ఎరువులు, పురుగుమందులు బూతల్లికి ఖరాబు జేత్తయని అవెయ్య.
అవుసరంబడ్తే యాప కసాయం, మిరప కసాయం వాడిన. సంగం సార్లు పురుగులతో పోరాడే కాసాయాలే వాడుమన్నరు. గందుకే భూతల్లి బలం పెరిగేతందుకు మసాల ఎరువులు కాకుండా జెర్రల ఎరువు ఏసిన. పెంట ఎరువేసిన. చెట్లకెల్లి రాలేటి ఆకులాలములు ఐదు బండ్ల ఎరువుతోటి సమానం. నా న్యాల బలం తినేటందుకు ఈ ఎండుటాకులు మాలేస మేలుజేసినయ్. నా న్యాలతల్లి జర నున్నవడ్డది. జరంత మంచిగయింది.
నా బూతల్లికి జుత్తంటే ఎంత మంచిగగొట్టవట్టింది. సేన్లకు వోతే ఇంటికే రాబుద్ధికాకవచ్చింది.
మన పాత పద్ధతులల్ల , తాత ముత్తాతల నాటి పద్ధతులల్ల ఉన్నయ్ మా పంటలు.
కలిపి పంటలు మనుషుల సుత బందం పెంచుతయ్ మన్నుతోటి బూవితోటి అనుబందం పెంచుతయ్ ‘
విన్నరు గద. మీకేమనిపిత్తంది.. ఆ.. మనం బీ అట్లనే పంటలు తియ్యాల్ననిపిత్తాంద..
కాసెట్ ఆగింది. అది వెయ్యడం తియ్యడం అక్కడున్న ఎవరికీ రాదు. పూలమ్మ కోసం వెతికాయి వాళ్ళ కళ్ళు.
పూలమ్మ మధ్యలో వచ్చి రేడియో వినుకుంటా రొట్టె తిని రాత్రిబడికి వెళ్ళిపోయింది.
తల్లి ఆదేశం మేరకు ఓ పిల్లవాడు రాత్రిబడిలో ఉన్న పూలమ్మ దగ్గరకు పిల్లలు పరిగెత్తాడు. విషయం చెప్పాడు.
పో.. కొద్దిగాగి వస్తానని చెప్పిందామె.
లేదు ఇప్పుడే రావాలంటూ వచ్చే వరకు అక్కడే ఉండి ఆమెను లాక్కొచ్చాడు ఆపిల్లవాడు.
“ఓ పోరి బుడిమెకాయంత లేవు. రేడియల మాలేస ముచ్చట వెట్టవట్టినవ్ గదనే..” పూలమ్మ కేసి మురిపెంగా చూస్తూ అన్నాడో తాత.
తలో విధంగా పూలమ్మను మెచ్చుకున్నారు అక్కడున్నవాళ్ళు.
ముందు రేడియోకి మాట్లాడడమంటే భయపడింది కానీ అదేమంత కష్టం కాదని కార్యకర్త అక్క చెప్పినాక ఒప్పుకుని మాట్లాడిన విషయం మదిలో మెదులుతుండగా ముసిముసి నవ్వులతో వాళ్ళ మెచ్చుకోళ్ళు అందుకుంటూ క్యాసెట్ తిప్పి వేసింది పూలమ్మ.
పున్నమినాటి చందమామలా మొగులమ్మ హృదయం విచ్చుకుంది.
( ఇంకా వుంది…)