బతుకు సేద్యం – 14

పట్నం పడచులు పచ్చి కందికాయలు ఎగబడి కోస్తున్నారు. మధ్య మధ్యలో ఉన్న జొన్న మోళ్ళు కాళ్ళకు తగలకుండా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. అయినా ఒక పిల్లవాడికి జొన్న మోడు తగలనే తగిలింది. గీసుకు పోయి సన్నగా రక్తం బయటికొచ్చింది. అది చూసి వాడు ఏడుపందుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న గుంపులోని ఓ మహిళ ఆ చేలో అటూ ఇటూ తిరిగి ఏదో ఆకు తెంపింది. దాన్ని రెండు చేతుల మధ్య వేసి నలిపి మెత్తగా చేసింది. ఆ పిల్లవాడి కాలికి ఆ రసం రాసింది. అది పెట్టగానే ముందు అరచినప్పటికీ ఆ కొద్దిసేపటికే మాములుగా తిరగడం మొదలుపెట్టాడు ఆ అబ్బాయి.

కొందరు పచ్చిగా ఉన్న కందికాయలు చూసుకుని తినడానికి అనువుగా ఉన్నవి కోసుకు తింటున్నారు. కొందరు అక్కడ కనిపిస్తున్న ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర కోస్తున్నారు. కోసినవి కొందరు కొంగులో వేసుకుంటున్నారు. అయ్యో ఒక కవర్ అయినా తెచ్చుకోలేదే అని బాధపడ్డారు కొందరు. ఆ చేను తమ సొంతం అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు.

ఆ మొక్కలనాశ్రయించి ఉన్న చిన్న చిన్న కీటకాలు లేసి వాళ్ళ మీద వాలుతున్నాయి. అట్లా లేచిన పురుగులేవో పాకి చేతులు దురద పెడుతున్నాయని గోక్కుంటోంది శ్యామల .

అటునుండి శ్రమజీవులంతా గుండ్రంగా కూర్చొని పనులు చేసుకుంటున్న వైపు నడిచారు పట్నం అక్కలు. చుట్టూ పట్నం వాసులు. మధ్యలో కోసిన జొన్న కంకులు వేసి ఎద్దులతో తొక్కిస్తున్నాడు తలపాగా వ్యక్తి. సజ్జలు కర్రతో కొడుతున్నారు ఒక దగ్గర. కొర్రలు హార్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కో పంట కుప్ప దగ్గర కొందరు మహిళలు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. పట్నం నుంచి వచ్చిన వాళ్లలో కొందరు ఆ లంబాడా మహిళలతో పాటే కూర్చుని వాళ్లు చేసే పని తాము చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మగవాళ్ళు అటూ ఇటూ చూస్తూ అక్కడికొచ్చిన మగవాళ్ళతో ముచ్చటిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం పనుల్లో సాయం చేస్తున్నారు.

అరిగెలు, కొర్రల కంకుల్ని చేతిలోకి తీసుకుని ఆశ్చర్యంగా చూశాడు వినోద్. అవి తన చిన్నప్పుడు తనకు బాగా తెలిసినవే. తమ వరిపొలంలో కలుపు మొక్కలుగా కనిపించినవే… అప్పుడు కలుపు మొక్కలని ఏరి పారేసింది ఇంత గొప్ప పంటలనా… గడ్డి మొక్కలు అని కలుపు తీసినప్పుడు పీకేసేవాళ్ళు. కలుపుతీయగా ఎక్కడో ఒకటి మిగిలిపోయినవి వరి పంటతో పాటే గెలవేసి కంకులొచ్చేవి. వాటిని కోసేటప్పుడు వదిలేసేవారు. జీతగాళ్ళు కోసుకెళ్లే వాళ్ళు. పరిగె ఏరుకోవడానికి వచ్చిన జీతగాడి భార్యో… పిల్లలో పట్టుకుపోయేవాళ్లు అని గతంలోకి వెళ్లి వచ్చాడు వినోద్.

పిల్లలూ పెద్దలతో పాటే తమవంతు సాయం అందించడానికి ప్రయత్నిస్తూ… తల్లిపక్కనే కూర్చొని సజ్జ కంకుల్ని తానూ కర్రతో కొడుతున్నది లక్ష్య. శ్రామిక మహిళ వాటిని పైకి కిందకి కదపడం చూసి తానూ ఆ ప్రయత్నం చేస్తుండగా ఓ టీవీ ఛానల్ వాళ్ళు లక్ష్యని పిలిచి ఇక్కడికొచ్చాక తనకేమనిపిస్తున్నదో చెప్పమన్నారు. అంత మందిలో మాట్లాడడానికి ఆమె ముందు కొద్దిగా బిడియపడింది. చలాకీగా కనిపిస్తున్న లక్ష్య ని మళ్ళీ మళ్ళీ పిలుస్తుండడంతో ఆమెకు లేవక తప్పింది కాదు. ఏం మాట్లాడాలన్నట్లుగా తల్లికేసి చూసింది. నీకేమనిపిస్తున్నదో అదే చెప్పు అంటూ ప్రోత్సహించింది దీక్ష.

“అమ్మ తినమని ఏదైనా పెట్టినప్పుడు నాకిష్టం లేకపోతే తీసుకుపోయి బిన్ లో పడేస్తాను. అట్లా చేయకూడని ఇప్పుడిక్కడికి వచ్చాక అర్ధమవుతున్నది. మేము ఎక్కడో కూర్చొని తినడానికి కావాల్సిన ధాన్యం, పప్పులు, కూరగాయలు అన్నీ పండించేది వీళ్ళు. వీళ్ళు ఎన్ని రోజులు ఎంత కష్టం చేస్తే పండుతాయో నాకు ఇప్పుడే తెలిసింది. వీళ్ళు అన్ని నెలలు కష్టం చేస్తే, ఎంతో జాగ్రత్తగా సాకితే వచ్చే పంటల్ని మేము చాలా చాలా వృధా చేసేస్తున్నాం… ఇక ముందెప్పుడూ అట్లా చేయకూడదని ఈ రోజు ఇక్కడికి రావడం వల్ల తెలుసుకోగలిగాను. నేను తెలుసుకున్న విషయాల్ని నా ఫ్రెండ్స్ తో కూడా చెప్తాను ” అన్నది లక్ష్య.

ఆ తర్వాత కెమెరా రమణి వైపు తిరిగింది. “నిజమే చిన్నపిల్లయినా చక్కగా చెప్పింది లక్ష్య. మేం పెళ్లిళ్లు, ఫంక్షన్స్ పేరుతో చాలా చాలా వృధాగా పడేస్తున్నాం. విత్తనం వేయడానికి ముందు భూమిని సిద్ధం చేసుకోవడంతో మొదలుపెట్టితే ఆ తర్వాత కలుపు తీయడం, బలంగా ఎదిగేలా చూడడం, చీడపీడలు తగలకుండా చూసుకోవడం, కోయడం, వాటిని కొట్టుకోవడం, గింజల్ని రాసి చేయడం, విత్తనం నిలువ చేసుకోవడం ఇట్లా రకరకాల పనులున్నాయి. అచ్చం పిల్లల్ని పెంచినట్లుగానే… కానీ ప్రతి పంటా ఇట్లాగే… ప్రతి సారీ ఇట్లాగే… అంతే శ్రద్ధతో పనిచేస్తేనే ఫలితం వస్తుంది. ఇంత పెద్ద దాన్నయిన నాకే ఇప్పటివరకూ ఈ జ్ఞానం లేదు. ఇప్పటికయినా తెలుసుకున్నందుకు ఆనందపడుతున్నా… ఇంత కష్టం చేసి మా ఆరోగ్యాల్ని కాపాడే ఇంత మంచి పంటల్ని అందిస్తున్న వీళ్ళ శ్రమకి విలువ కట్టడం కష్టమే” అన్నది రమణి.

ఆ కళ్ళం చుట్టూ అటూ యిటు తిరుగుతూ అందరి మాటల్ని వింటున్నాడు వినోద్. అయ్యో… ఇక్కడికి వస్తున్నట్లు సుధాకర్ కి చెప్పి ఉండాల్సింది. కలిసేవాడు అనుకుని మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు. సిగ్నల్స్ అందడం లేదు.

“నేను తినడానికి కావలసినవి సూపర్ మార్కెట్ నుండి వస్తాయని మాత్రమే తెలుసు నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అర్ధమైంది. వీళ్లంతా ఎంత కష్టపడితే అవి మాదాకా వస్తాయో అని. ఈ రోజు వీళ్ళతో కలిసి నేను కూడా చిన్న చిన్న పనులు చేశాను. ఐ అయామ్ సో హాపీ. నిజానికి ఇక్కడికి రావడం బోర్ అనుకున్నాను. నాకు సంబంధం లేని చోటుకి మా అమ్మ తీసుకొస్తున్నదని చిరాకు పడ్డాను. థాంక్స్ అందరికీ… ఇవ్వాళ నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను” పద్మ కొడుకు చింటూ చెబుతున్నాడు మరో ఛానెల్ వాళ్ళతో.

“మాకివ్వాళ పండుగగా ఉంది… మీ అందరినీ ఇట్లా చూసుడు…” చేస్తున్న పని ఆపకుండా పక్కన కూర్చున్న పట్నపు అక్కతో మాట్లాడుతున్నది తండా వాసి.

ఆ తర్వాత కెమెరా దీక్ష ముందు పెట్టారు. “మా వాళ్ళ మాటలు వింటుంటే నాకర్ధమయింది ఏంటంటే… మేం పొందుతున్నది మా ఆరోగ్యం పెంచే ధాన్యాన్నే కాదు. మేం బడిలో నేర్చుకోని కొత్త జ్ఞానాన్ని
మట్టితో విత్తనాలతో మీతో పచ్చని బంధాన్ని…” దీక్ష మాటలు కొనసాగుతున్నాయి.

తన వెనుక వైపు నుండి పద్మ గొంతు వినిపిస్తుంటే అటు తిరిగాడు వినోద్. “జీవన ప్రవాహం ఆగిపోయి ఆవిరైపోయి ఎడారిగా మారుతున్న నేలలో గడ్డిపూలు తలెత్తి నిల్చున్నాయి. భవిష్యత్ ఆశలు పూయిస్తున్నారు ఈ చిన్న మనుషులు. సప్త వర్ణాల పరిమళం నింపుకున్న పంటలందిస్తున్న వాళ్ళ గొంతులు దశ దిశలా వ్యాపిస్తున్నాయి. భవిష్యత్ తరాలకు వాగ్దానం ఇస్తున్నాయి…” పద్మాక్షి పండిన జొన్న, సజ్జ, కొర్ర కంకులు చేతిలో పట్టుకుని వీడియో కెమెరా ముందు మాట్లాడుతున్నది.

ఛానెల్స్ వాళ్ళు వీలయినంత ఎక్కువమందితో మాట్లాడిస్తూ తమకు కావాల్సిన స్టోరీ కి బైట్స్ తీసుకుంటున్నారు. రేఖ అక్కడ పండిన ధాన్యపు శాంపిల్స్ అన్నీ కొద్ది కొద్దిగా తీసుకుంటున్నది. మొగులమ్మ బృందం ప్రొఫెషనల్స్ లాగే తమ పని తాము చేసుకుపోతున్నారు. కాస్త దూరంలో ఉన్న చెట్టుకింద చాలామంది చేరారు. వాళ్లలో ఉన్న అరవింద్ చేతులు వినోద్ వైపు చూపుతూ… సుధాకర్ చెయ్యెత్తి ఊపాడు.
వినోద్ కూడా చెయ్యి ఊపి అటువైపు కదిలాడు…

సామజిక,వ్యవసాయ, ఆర్ధిక ప్రగతిని సాధించిన సంఘం మహిళలు పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని భద్రపరుస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. రేఖ అన్నట్టు సాంప్రదాయం – ఆధునికత మేళవింపుతో బతుకును కొత్త వర్ణాలతో పండిస్తున్నారు ముతకగా కనిపించే మేలిమి మనుషులు. ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి వచ్చిన వీరి విత్తన జ్ఞానం, పంటల జ్ఞానం ఇంకా ఏ అద్భుతాలు సృష్టించ నున్నదో… ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన అవగాహన, రసాయన ఎరువులతో పండిన పంటల పట్ల విముఖత, చిరుధాన్యాల వాడకం పై పెరిగిన మోజు, అవగాహన ఈ మహిళా రైతుల్ని ఏ తీరం చేర్చనున్నదో ఆలోచనలతో చెట్టుకిందకు చేరాడు వినోద్.

రెండురోజులుగా సంఘం వారి గ్రామాలలో తిరుగుతున్నాను. ఇక్కడి పంటలను చూసే మన ఆర్ధిక మంత్రి గారు తన బడ్జెట్ ప్రసంగంలో బ్యాక్ టు బేసిక్స్, జీరో బడ్జెట్ సాగు గురించి మాట్లాడారేమోననిపించింది… అక్కడున్న వారితో చెబుతున్నాడు ఓ జాతీయపత్రిక స్పెషల్ కరెస్పాండెంట్ హేమచంద్ర.

“ముఖ్యంగా మార్కెట్ నుండి కొనుగోలు చేసే యంత్రాలు, ఉపకరణాలు, రసాయనాలు, విత్తనాలు నివారిస్తే కనీస ఖర్చుతో వ్యవసాయం చేయొచ్చేమో…” అన్నాడు ఆ మాటలు విన్న అరవింద్.

“జీరో బడ్జెట్ పేరుతో రైతులకిచ్చే ఆర్ధిక సహాయాన్ని తగ్గించేయడం కాదు కదా….?” సందేహం వెలిబుచ్చాడు వినోద్.

“నీకా సందేహమెందుకొచ్చిందన్నా….” వినోద్ కేసి చూస్తూ అడిగాడు సుధాకర్.

” వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ చూసావా… అదిచూస్తే ఎవరికైనా ఆ సందేహం రాకమానదు…” వినోద్ అంటుండగా పట్నం నుండి వచ్చిన మరో వ్యక్తి కల్పించుకుని “సముద్రంలో ఇసుకరేణువంత మన బడ్జెట్… రసాయన ఎరువుల సబ్సిడీకి 80 వేల కోట్లు కేటాయించారు. అదే ప్రకృతి వ్యవసాయానికి 325 కోట్లు మాత్రమే కేటాయింపు… ఈ గణాంకాలు తిరగబడితే కదా మన ఆమాత్యులు చెప్పేది నిజం అనుకోవడానికి. సొంత మూలాలు కత్తిరించుకుంటూ పోతున్నారు. ఏమైపోతామో…” ఉద్వేగంగా అన్నాడు. “మనకు తాత ముత్తాతలు ఇచ్చిన విత్తనాన్ని, విజ్ఙానాన్ని కాపాడుతున్న ఈ రైతక్కలే కదా మన భవిష్యత్…” అన్నాడతనే మళ్ళీ.

“చేయి చాచి దేహీ… అని ఎన్నడూ యాచించని రైతుని యాచకుడిగా మార్చింరు. ఇప్పుడు ఏడ జూసిన సత్తువ కోల్పోయిన రైతు చేవచచ్చిన భూమి అవుపడ్తది కానీ, మా దగ్గర చూడుంరి ఇచ్చే చేయే గానీ చేయి చాచే స్థితి ఎరుగరు. తన చేనుకు తానే పరాయిగా మారరు మా వోళ్ళు ” తన ప్రాంతపు రైతక్కల గొప్పదనం తన గొప్పదనంగా ఫీలవుతూ చెప్పాడు సుధాకర్.

“రసాయన రహిత సాగు గురించి, జీరో బడ్జెట్ సాగు గురించి పాలేకర్ పిలుపు ఎక్కువ మందికి చేరినట్లుంది. ఐటీ కొలువును వదులుకొని వ్యవసాయం లోకి ప్రవేశిస్తున్నారు చదువుకున్న యువత. అది శుభపరిణామం” సాలోచనగా అన్నాడు వినోద్.

“మన దేశంలో భారీ రాయితీలు, గ్రాంట్లతో కూడిన ప్రభుత్వ విధానాలు, ఆర్ధిక తోడ్పాటు వల్ల వ్యవసాయంలో రసాయనాలు ముంచెత్తాయి. జన్యుమార్పిడి పంటల్ని నిరంతరాయంగా ప్రోత్సహిస్తే ప్రమాద ఘంటికలు తప్పవు. రసాయనాలతో కూడిన వ్యవసాయానికి సబ్సిడీలన్నీ ప్రభుత్వం నిలిపివేయాలి. అప్పుడు కానీ రైతులు సేంద్రియం వైపు మళ్లరు.” అన్నాడు హేమచంద్ర.

“1994 లో WTO సూచనతో మన దేశంలో ఎరువులపై రాయితీలు తగ్గించినప్పుడు పెద్ద సంఖ్యలో రైతులు సేంద్రియం వైపు ఆకర్షితులయ్యారు. వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, కేంద్రాలు రసాయన వ్యవసాయం కంటే సేంద్రియ వ్యవసాయంలో మంచి దిగుబడులు వచ్చినట్లు నిరూపించాయి. కానీ మళ్ళీ…” వినోద్ చెప్తుండగా…

“రసాయనాల వల్ల జరుగుతున్న చెడు అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లోనూ బాధితులే… అందుకే సహజంగా పండించిన పంటలకు ఎంత ధర పెట్టి కొనడానికైనా సిద్దమై పోతున్నారు. పేదల తిండిని ఇప్పుడు పెద్దలు కబ్జా చేసేస్తున్నారు. వాళ్ళ కంచాల్లోకి చేర్చుకుంటున్నారు. అందుకు నిదర్శనం ఆ బస్సుడు జనం…” బస్సువైపు చూస్తూ గట్టిగా నవ్వాడు స్పెషల్ కరెస్పాండెంట్ హేమచంద్ర. ఆ నవ్వుతో తమ నవ్వు కలిపారు కొందరు. ఒకరిద్దరు సిరియస్ గా ఆలోచనలో పడ్డారు.

“సార్… ఎంత మాటన్నారు మమ్ములను. మేం వాళ్లకి సాయం చేయడం మాకు మేము సాయం చేసుకోవడం కోసమే ఈ రైతక్కలతో చేయి కలిపాం. కానీ వాళ్ళ తిండిని కబ్జా చేయడానికి కాదు…” వివరించబోయాడు పట్నం నుంచి బస్సులో వచ్చినతను.

“అయ్యో… మీరంత సీరియస్ గా తీసుకోకండి. రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు లాంటివన్నీ పేదల కంచాల్లో తప్ప పెద్దింటి కంచాల్లోకి ఎప్పుడొచ్చాయి… రోగాలు రొష్టులు గుమ్మంలో తిష్టవేశాకే కదా… చిరుధాన్యాల గొప్పదనం ఏంటో తెలిశాకే కదా… అంతెందుకు… ఈ ప్రాంతంలో ముప్పై ఏళ్లకు పైగా సంఘం రైతక్కలు చిరుధాన్యాలు పండిస్తున్నారు. తింటున్నారు. ఆరోగ్యం కాపాడుకుంటున్నారు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతున్నారు. అయినా అప్పుడెప్పుడైనా మీలో ఎవరైనా ఇటు తొంగి చూశారా… లేదు కదా…ఉన్నత వర్గాల్లో ఆరోగ్యం గురించి ఎప్పుడైతే శ్రద్ధ, జాగ్రత్త మొదలైందో, మిల్లెట్స్ లో ఉన్న సుగుణాల గురించి ఎప్పుడైతే బాగా ప్రచారం జరిగిందో అప్పటినుండి వాటికోసం వెంపర్లాట… వెతుకులాట…” అంతేనా అన్నట్టుగా అందరివైపూ చూశాడు హేమచంద్ర. నిజమేనన్నట్లుగా తలలూపారు మిగతావాళ్ళు.

“నేనో వ్యవ్యసాయ శాస్త్రవేత్తను. నూతన వరివంగడాలు ఆవిష్కరించడం నా పని. గుడ్డెద్దు చేలో పడినట్టుగా పని చేసుకుపోయేవాడిని. అంటే… అధికదిగుబడుల వైపే మా చూపు, ఆలోచన తప్ప మరో ధ్యాస ఉండేది కాదిన్నాళ్లూ… అంటే కొన్ని నెలల క్రితం వరకూ కూడా… ఇక్కడి వ్యవసాయం గురించి తెలుసుకున్నాక నేను అసలైన పరిశోధన మొదలు పెట్టాను. నన్ను నేను శోధించుకోవడం కోసం నా దేశపు వ్యవసాయ మూలాల అన్వేషణ మొదలుపెట్టాను. దేశ విదేశాల్లో జరుగుతున్న ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు తెలుసుకుంటున్నాను. వ్యవ్యసాయంలో విత్తనం, రసాయనాల వాడకం, ఆర్ధిక వ్యవ్యస్థ, ఇలా మన వ్యవ్యసాయం చుట్టూ గజిబిజిగా అల్లుకున్న వ్యవ్యస్థలను పరిశీలిస్తున్నాను. ఈ మధ్య ఏదో సందర్భంలో హరిత విప్లవం కంటే ముందు వ్యవసాయం గురించి భారత ప్రభుత్వ రికార్డులు పరిశీలించాను. అప్పుడే కృషి పండిట్ అవార్డు అందుకున్న రైతులు వరి ఎకరానికి 51 క్వింటాళ్లు, జొన్నలు 38 క్వింటాళ్లు రాగులు 17 క్వింటాళ్లు, గోధుమలు 37 క్వింటాళ్లు పండించారని తెలిసి ఆశ్చర్యపోయాను. కానీ దురదృష్టం ఏమంటే మన కృషి పండిట్ ల కంటే విదేశీ శిక్షణ పొందిన వ్యవ్యసాయ శాస్త్రవేత్తలు ప్రాధాన్యత పొందారు. ఆ క్రమంలోనే నాలాంటి శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారు. మన యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు మాలాంటి వారికే పెద్దపీటవేశాయి. మేం విశ్వవిద్యాలయాల్లో పెద్దపెద్ద చదువులు చదువుకున్నాం. కృషి పండిట్ లకు అటువంటి చదువుల్లేవుగా… అందుకే చిన్న చూపుకావచ్చు.

1966 నుండి మన దేశీయ వ్యవ్యసాయంలో మార్పులొచ్చేశాయి. ఆధునిక వ్యవ్యసాయ పద్ధతులు, రసాయన ఎరువులు చొచ్చుకొచ్చేశాయి. ఆనాటి అలసత్వం వల్లే, విధానాల వల్లే ఈ రోజు మనం ఈ వ్యవ్యసాయ విపత్తుకు చేరుకున్నామని స్పష్టంగా చెప్పగలను. మనదేశంలో సాగుకు సహజ వనరులు కావలసినన్ని ఉన్నప్పటికీ, రసాయనాలతో కలుషితమైన, నాణ్యత లేని పంటలసాగుతో మనల్ని మనం అధోగతి పాలుచేసుకుంటున్నాం. రసాయనాలతో కలుషితమైన ఆహారంవల్ల మానవ మనుగడకే కాదు, జంతు జీవజాలానికీ దెబ్బే… వాతావరణం కూడా అనేక మార్పులకు లోనవుతున్నది. ఫలితంగా తీవ్ర సంక్షోభంలోకి కొట్టుకుపోతున్నాం.

అయితే, ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా వ్యవ్యసాయ నిపుణులు ఈ చిన్న సన్నకారు రైతక్కలు చేస్తున్న సహజ వ్యవసాయాన్నే సిఫార్సు చేస్తున్నారు. సాగులో దేశీయ పరిజ్ఞానం ముఖ్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు. స్థానికంగా సరిపోయే పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, స్థానిక నైపుణ్యాలతో, జీవవైవిధ్యంతో కూడిన వ్యవసాయంలో, జీవ సాంకేతికతను ఉపయోగించుకోవాలనీ, స్థానికంగా జరిగే పరిశోధనలని, వారి సామర్ధ్యాలని గుర్తించాలనీ ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చెప్తున్నది. ఇవేమీ తెలియకపోయినా సంఘం రైతక్కలు చేస్తున్నది అదే…” చెప్పాడు చెట్టు నీడన నుంచున్న గుంపుతో. అందులో జర్నలిస్టులతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు చాలా శ్రద్దగా విన్నారు.

“వివిధ సంస్థల ఆధ్వర్యంలో సేంద్రియ పద్దతుల్లోకి మారుతున్నారు చిన్న సన్నకారు రైతులు. వాళ్ళే జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నారు” అన్నాడు సుధాకర్.

“ఈ మధ్య సంఘం ఆధ్వర్యంలో చిరుధాన్యాల చెల్లెళ్ళ సంఘం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్లందరిదీ ఒకటే బాట సేంద్రియ సేద్యం. ఒకటే మాట చిరుధాన్యాల సాగు అని” అన్నాడు సుధాకర్ పక్కనే ఉన్న స్థానిక జర్నలిస్ట్.

“సేంద్రియం అంటే ఆవు మూత్రం, ఆవు పేడ… ఇవేనా…?” అడిగాడు అరవింద్.

“వివిధ ప్రాంతాల్లో స్థానికంగా గేదలు, మేకలు, పందులు, కోళ్లు, చేపలు… ఇట్లా ఏవి ఉంటే… వాటి నుండి లభ్యమయ్యే పేడ వ్యర్ధాలు ఎరువుగా వాడే పద్ధతులు… వర్మీ కంపోస్ట్… అన్నీ సేంద్రియ ఎరువులే…” అన్నాడో రైతు.

“నేల ఆరోగ్యం కాపాడుకోవడానికోసం పంట వ్యర్ధాలన్నిటినీ రైతులు తిరిగి మట్టిలో వేయాలి. ఇక్కడ వీళ్ళు చేస్తున్నదదే… దీని ద్వారా తెగుళ్ల నివారణ కూడా సులభమవుతుంది” అన్నాడు వినోద్.

సీరియస్ గా ముచ్చటించుకుంటున్న సమయంలో మొగులమ్మ కెమెరాతో ఎప్పుడొచ్చిందో తనపని తాను చేసుకుపోతున్నది. అది చూసిన అరవింద్ “స్థానిక జీవనం, జానపద జ్ఞానాన్ని, జీవ సంస్కృతిని ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ చేస్తున్నారు ఈ అక్కలు” అన్నాడు.

“వ్యవసాయరంగంలో వస్తున్న సవాళ్ళను ప్రకృతి వ్యవసాయం ఎదుర్కోగలదని అనుకుంటున్నారా…” సందేహం వెలిబుచ్చాడు హేమచంద్ర.

“జీరో బడ్జెట్ సహజ వ్యవసాయంలోనూ నాకు చాలా సందేహాలు ఉన్నాయి… ” అన్నాడు వినోద్. ఏమిటన్నట్లుగా అందరూ కుతూహలంగా వినోద్ కేసి చూస్తున్నారు.

“జీరో బడ్జెట్ వ్యవసాయం గురించి బడ్జెట్ ప్రసంగంలో కూడా వచ్చాక ఇంకా మీకెందుకు సందేహం…” పట్నం నుండి వచ్చిన వుత్సాహికుడు.

వినోద్ చెప్పడం మొదలు పెట్టాడు “ఒక శాస్త్రవేత్తగా ఆలోచిస్తున్నాను. జీవామృతం- బీజామృతం ద్వారా జన్యుమార్పిడి ప్రభావాలను తిప్పికొట్టగలమా… మొక్క కణాల్లో టాక్టిన్ బిటి ఉత్పత్తిని తగ్గించగలదా… గ్లైఫొసేట్ లాంటి ప్రాణాంతక రసాయనాల ప్రమాదాన్ని నివారించగలదా… విత్తనాలపై రైతుల మేధో సంపత్తి హక్కులను హరించే కుట్రను జీరో బడ్జెట్ సహజ సాగు నిరోధించగలదా… గుజరాత్ లో ఆలుగడ్డ రైతులపై పెప్సికో కేసుపెట్టిన ఉదంతం మన కళ్ళముందే ఉందికదా… బిటి వంకాయ, పత్తి, ఆవాలు, సోయాబీన్ లాంటి జన్యుమార్పిడి పంటల అక్రమ సాగును జీరో బడ్జెట్ సహజ సాగు అనుమతిస్తుందా… నిషేధిస్తుందా… ఇలా ఎన్నో సందేహాలు, ప్రశ్నలు నా ముందు. చూడాలి. కాలం ఏం సమాధానం చెబుతుందో…”

*

గతం లోంచి వర్తమానంలోకి వచ్చిన వినోద్ పక్కనే కార్యక్రమాన్ని చూస్తున్న రేఖతో “ఒకప్పుడు ఆహార భద్రతకోసం అడుగులు వేయడం మొదలుపెట్టిన సంఘం మహిళలు పోషకాహార భద్రత సాధించారు.
ఆరోగ్యం అందుకున్నారు. తమ పని తాను చేసుకునే క్రమంలో తమకు తెలియకుండానే పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేశారు. ఆత్మగౌరవ పతాక ఎగురవేశారు. మహిళా సాధికారత, ఆర్ధిక స్వాలంబన సాధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఈ దళిత మహిళా రైతుల విజయం ఐక్యరాజ్య సమితికి చేరడం, పర్యావరణ పరిరక్షణలో ఎదురవుతున్న పెనుసవాళ్లకు పరిష్కారం చూపుతున్న సంఘం మహిళల కృషికి గుర్తింపుగా ప్రపంచంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఈక్వేటర్ పురస్కారం అందించడం… వ్వా…వ్, ఎంత గొప్ప ఘనత… ఒళ్ళు పులకరిస్తుంది ” అన్నాడు.

వినోద్ చెబుతున్నది పూర్తికాకుండానే అందుకుని “అవును, వినోద్. నిజమే… మారుమూల పల్లెల్లో ఎక్కడో ఎవరి దగ్గరో ఉన్న సంప్రదాయ విత్తనాన్ని, జ్ఞానాన్ని గాలించి గౌరవించడం ఎంత గొప్పవిషయం. ఎంత విజ్ఞత తో కూడిన ఆలోచన. ఒక చిన్న సంస్థ ద్వారా సంఘం రైతక్కలు సాధించిన ప్రగతిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. వాళ్ళ కృషిని వేనోళ్ళ పొగుడుతున్నాం. వాళ్ళ గెలుపుని ఆనందిస్తున్నాం. ఆస్వాదిస్తున్నాం. ఆరాధిస్తున్నాం. ఢమరుకం వాయించి ఎంత చెప్పినా అదంతా సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే… అది మర్చిపోకూడదు” అన్నది రేఖ.

“నిజమే రేఖా… నేనూ అదే ఆలోచిస్తున్నాను. మనిషిలోని స్వార్ధం, ఆధిపత్యం అనే చెదపురుగులు, చీడపురుగులు తోటివారినేకాదు తనచుట్టూ జీవితంలో అల్లుకుపోయిన గాలి, నీరు, నేల ఇతర జీవజాలాన్ని, జీవవైవిధ్యాన్ని, ప్రకృతిని పర్యావరణాన్ని దండెత్తి దాడిచేస్తున్నవి. కాటేసి మత్తు పెడుతున్నవి. ఇటువంటి క్లిష్ట సమయంలో భవిష్యత్ పట్ల భరోసాఇచ్చేది, గుండెల్లో తడిని పెంచేది ఇలాంటి వాళ్ళే కదా….

ప్రకృతిని, పర్యావరణాన్ని, కాపాడే సేద్యం మాత్రమే కాదు, ఆహార భద్రత, పోషకాహార భద్రత సాధించడమే కాదు మహిళా సాధికారతకు ఐకాన్ గా నిలిచారు గడ్డిపోచల్లాంటి మనుషులు. వారే చీకటి దారుల్ని తప్పిస్తూ వెలుగులు నింపే పనిలో నిమగ్నమై ఉన్నారు.

నువ్వన్నట్టు సంస్థలూ, సంఘాల పరిధి చాలా చిన్నది. వాటి ద్వారానే ప్రపంచమంతా అద్భుతాలు జరగాలనీ, జరిగిపోతాయనుకుంటే పొరపాటే… భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైన నేల, నీరు, గాలి ఇవ్వాలంటే, విషం లేని ఆహారం జన్మహక్కుగా అందుకోవాలంటే ఇందుకోసం విస్తృతమైన ప్రచారం, అవగాహన కలిగించడం అవసరం… మనకి సంఘం పుడమి పుత్రికలు పరిచయం అయిన దగ్గరనుండి నేను చేస్తున్న పనిలో ఏదో వెలితి. ఎటూ తేల్చుకోలేని తనంలో కొట్టు మిట్టాడుతున్నాను. ఇప్పుడు స్పష్టమవుతున్నది నా కార్యక్షేత్రం ఏమిటో… ఒక్కొక్కరినీ కలుపుకుంటూ ఎలా ముందుకు పోవాలో…. నేనేమి చేయాలో…” భవిష్యత్ చిత్రం మదిలోనే చిత్రించుకుంటూ వినోద్.

“ముతక బట్టల్లో
అనాగరికంగా కనిపిస్తున్న
ఆ శ్రామిక మహిళలు
అనామకులు కాదు
అసాధారణ రైతక్కలు
అవును, అది నిజం

మొన్న
నిప్పుల కొలిమిలా
మండుతున్న జీవితంలో
బుక్కెడు బువ్వ కోసం
దేహీ అన్న బతుకులవి
గుక్కెడు నీటి కోసం
ఎదురు చూసిన జీవితాలవి
కూలీ నాలీ కోసం
పడిగాపుల పడినరోజులవి

నిన్న
మొన్నటి కష్టాల కడగండ్లను
కాలిలో ముళ్లలా ఏరేసి
రాళ్లు రప్పల ఎడారి దున్ని
కనుమరుగైన విత్తు విత్తి
స్వయంగా తయారు చేసిన
ఎరువులు మందులతో
ఐకమత్యపు పంటలతో
ఆత్మగౌరవపు బతుకు పండించి
ఆకలి మంటలార్పిన జీవాలవి
అంతేనా…!
కొంకి కొడవలితోపాటు కెమెరా చేబట్టి
మాసిన బతుకుల పూసిన జీవితాల
సేద్యపు కష్టనష్టాలు తెరకెక్కించే కళ్ళవి
చరిత్రలో కలిసిపోతున్న
పల్లె శబ్దాల్ని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని
రేడియో భాండాగారంలో
భద్రపరచే గొంతుకలవి
బంజర్లలో వేనవేల మొక్కలతో
జీవవైవిధ్యానికి పెద్దపీట వేసి
పశుపక్ష్యాదులకు
ఆవాసం చూపిన హృదయాలవి
అందుబాటులోని ఆకులలుములతో
సాంప్రదాయ గ్రామీణ వైద్యం
జనుల చెంతకు చేర్చిన మనసులవి

నేడు
ఆ చేతులే జెండాలై
భారత కీర్తి పతాక
ఐక్యరాజ్య సమితిలో ఎగరేశాయి
ఆశ్చర్యంగా ఉన్నా, అది నిజం!

క్షణక్షణం వేడెక్కుతున్న పృథ్వీలో
మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో
పర్యావరణ స్పృహతో
మొక్కలు నాటిన చేతులతో
రసాయనాల వాసన ఎరుగని
కలిపి పంటల్ని పండిస్తూ
ఆ మట్టికి కొత్త పరిమళాలద్ది
జవం జీవం అందించి
ఆరోగ్యంతో స్వశక్తితో ఎదుగుతూ
తమను తాము మల్చుకుంటూ
ఎవరెస్టులా ఎదిగి సాధికారతకు
దర్పణంగా నిలిచిన ఆ మహిళలు
చూపరులకు అనామకుల్లా కనిపిస్తారేమో…
కానీ, వారు సామాన్యులు కాదు
ఆ అసాధారణ రైతక్కల గెలుపుని
ఈక్వెటర్ అవార్డుతో ఐరాస
అమెరికాలో గౌరవంగా సత్కరించుకుంది

రేపు
గడ్డిపరకల గెలుపు స్పూర్తితో
వ్యవసాయం ముందుకు నడిస్తే
విత్తనాలు, ఎరువులు, క్రిమినాశినిల
కొనుగోళ్లు, సబ్సిడీలు అనవసరమేమో….
భూతల్లి కడుపు ఛిద్రంచేస్తూ వేసే బోర్లు
నీటి కోసం లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు
కరెంటు కోతలు కనుమరుగై
ఈ దేశంలో రైతు ఆత్మహత్యలు
పరారవుతాయేమో…?! ” ఆశాభావంతో అన్నది రేఖ.

“ఓహ్… కవిత్వం కూడా చెప్పేస్తున్నావే…”అని, కొన్ని క్షణాలు రేఖ కళ్ళలోకి సూటిగా చూస్తూన్న వినోద్.

“అవును వినోద్. ఆకుపచ్చని విత్తనంతో వాళ్ళు గెలిచారు…మరి నువ్వూ… నేనూ… మనమందరమూ.?! …. గెలవాలి, ఆ విత్తనాల్ని విశ్వ వ్యాపితం చేస్తూ…. మనమూ గెలవాలి”

*

ఈక్వెటర్ పురస్కారం అందుకొన్న విజేతలందరూ మ్యూజిక్ కి అనుగుణంగా అడుగులేస్తూ వేదికపైకి చేరారు. ఎన్నో ఆటుపోట్లను, సవాళ్ళను అధిగమించి వేలమైళ్ల దూరం ప్రయాణించిన ఆనందం, పురస్కారం అందుకున్న సంతోషం తో పాటు తమపై మరింత బాధ్యత పెంచుకుంటూ వేదికపై చేరారు. దుఃఖాల చిరుగుల్లోంచి చిగురింప చేసుకున్న తమ జీవితపు నడక తలుచుకుంటే మొగులమ్మకెంతో గొప్పగా కనిపించింది. తమలాగే వీళ్లంతా. జాతి, మతం, ప్రాంతం ఏదైనా మనుషులందరికీ సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలూ ఉంటాయనుకున్నదామె.

వారి గుండెచప్పుడును ప్రతిఫలింప జేస్తూ ఆ… ఆ… రాగం అందుకున్నది నైజీరియా నుంచి వచ్చిన మారియా.
మా రంగు, రూపు వేరైనా
జాతి మతం ఏవైనా
ప్రాంతం, దేశం ఏదైనా
భేదాల్లేవ్. ద్వేషాల్లేవ్. విద్వేషాల్లేవ్.
మా అందరి ఆశ, శ్వాస, ధ్యాస ఒక్కటే…
మనం పీల్చే గాలిని, తాగే నీటిని, తినే తిండి ని
మన పృథ్విని మనం కాపాడుకోవడం అంటూ ఉద్వేగంగా సాగింది ఆ పాట.
పాటకు అనుగుణంగా వాయిద్య సహకారం అందిస్తుంటే ఆ వెన్నెల కాంతుల్లో ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చిన తమలాంటి వాళ్ళతో స్వరం కలుపుతున్నాయి. బతుకుమీద మమకారాన్నీ భవిష్యత్ పట్ల ఆశనూ పెంచుతూ చేస్తున్న సేద్యంపై పాట అవడంతోనే హాలు చప్పట్ల శబ్దంతో మారుమోగిపోయింది.

ఇంతలో ఒకరు ఢమరుకం మోగిస్తున్నారు, మరొకరు డప్పు కొడుతున్నారు. ఇంకొకరు బూర ఊదుతున్నారు. ఇలా తమతో తెచ్చుకున్న సాంప్రదాయ వాయిద్య పరికరాలు ఆనందంతో పులకిస్తుండగా కెన్యా నుంచి వచ్చిన వాళ్ళు ఆ ధ్వనులకు అనుగుణంగా అడుగులేస్తూ తమ జెండా ఊపుతున్నారు. ఆ ఊపుకు బ్రెజిల్ నుంచి వచ్చిన సారా మైక్ అందుకుని పాడడం మొదలు పెట్టింది.

మనం ఈ తల్లి బిడ్డలం.
తల్లితో బిడ్డ తలపడుతుందా…
తల్లి బిడ్డపై యుద్ధం ప్రకటిస్తుందా…
లేదు… లేదు… కాదు… కాదు…
మనం ప్రకృతి బిడ్డలం
మనం ప్రకృతితో తలపడం
కలసి అడుగులో అడుగువేసి నడుద్దాం

వేనవేల ఏళ్లుగా ప్రకృతి
తనను తాను రక్షించుకుంటూ
నిన్ను నన్నూ కాపాడుతున్నది
పాతరుతువులకు వీడ్కోలు పలుకుతూ
కొత్త ఋతువులకు ఆహ్వానం పలుకుతూ
నిన్నటిలోని విష విషాదాలను
బతుకురసంలో కలిపేసి
నిలుచున్న కొమ్మనే నరికేసే
సంపదకు ఆక్సిజన్ అందించే
దగాకోరులనుండి రక్షించుకుందాం
రా రమ్మని గొంతెత్తి పిలుస్తున్నది

రండి… రండి… చేయీ చేయీ కలుపుదాం
పగిలిపోతున్న కాలానికి ఊపిరులూదుదాం
ఎండిన తల్లి గుండెచెరువు నింపుకుందాం
చిట్లిపోతున్న నేలను చిగురింపచేసుకుందాం
సమూహమై పెనవేసుకున్న చీకట్లను తరిమేద్దాం
ప్రకృతి అంత స్వచ్ఛంగా, స్పష్టంగా… స్నేహంగా.
కలసి అడుగులో అడుగేసి నడుస్తూ వ్యాపిద్దాం
ప్రకృతి నియమాలను గౌరవిస్తూ పయనిద్దాం
మన గాలి, నీరు, భూమి, ఆహరం, ఆరోగ్యం మనచేతుల్లో
అదే మన సంపద. అంతులేని సంపద. తరిగిపోని సంపద

మట్టిచేతుల గొంతుల్లోంచి పాట జాలువారుతున్నది. లయబద్ధంగా ఎవరి సంప్రదాయ వస్త్రధారణలో వాళ్ళు అడుగులేస్తున్నారు. ఆ అడుగుల్లో మొగులమ్మ, లక్ష్మమ్మ, సునీతల అడుగులు. రెప్పలమాటున అణుచుకున్న కన్నీటి ఉప్పెనలు కాలక్రమంలో మాయమై వెన్నెల పూలు విశ్వవేదికపై నర్తిస్తున్నాయి. వారు కలగంటున్న ప్రపంచాన్ని చాటి చెబుతూ వారి చేతుల్లోని వాయిద్యాలు ఊపందుకున్నాయి. కవాతు చేస్తున్న సామూహిక స్వర ప్రకంపనలు అనేక సవాళ్ళను దాటుకుంటూ వలయాలు వలయాలుగా విశ్వంలోకి ప్రవహిస్తున్నాయి. చీకటి ఉరితాళ్లు తెంపే భావనలు వెదజల్లుతూన్నాయి. ఉజ్వల భవిష్యత్ పట్ల విశ్వాసం కలిగిస్తున్నాయి. చుట్టూ చీకట్లను చీలుస్తూ విద్యుత్ కాంతులు పరుచుకున్నాయి.

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply