బతుకు సేద్యం – 13

అక్కడంతా పండుగ వాతావరణం. ఊరు ఊరంతా అక్కడే ఉన్నట్లు ఉంది. ఆకాశంలో వెలిసే హరివిల్లు ఆ ఎర్రటి ఇసుక నేలల్లో విరిసినట్టుగా ఉంది. గిరిజన మహిళల రంగురంగుల సాంప్రదాయక దుస్తులు కన్నుల పండుగగా… ఊళ్ళోనుండి ఊరేగింపుగా వస్తున్న జనం….అంతా కోలాహలంగా నాగళ్లతో పురుషులు… విత్తనాల గంపలతో మహిళలు… వాళ్ళతో కలసి పట్నం నుండి పల్లెబాట పట్టిన ఆధునికులు వాళ్లే కాదు, కెమెరాలతో ఇద్దరు పల్లె పడుచులు, ట్రై ప్యాడ్స్ పట్టుకుని మరో ఇద్దరు పడుచులు…

వాళ్ళను చూసి ఆశ్చర్య పోయాడు మాధవ్. అక్కడేమి జరుగుతుందో అర్ధం కాలేదు. వెంటనే దీక్ష ని అడిగేడు. తొలకరి పండుగ మామయ్యా అంది. తొలకరి పండుగా… ఇంతకుముందు ఎప్పుడూ ఇట్లాటి పండుగ ఒకటి ఉన్నట్లే తెలియదు అనుకుంటూ బాల్యంలోకి వెళ్లి తీవ్రంగా వెతికాడు. ఎప్పుడూ ఇలాంటి పండుగ పేరు విన్న జ్ఞాపకం కానీ చూసిన జ్ఞాపకం కానీ గుర్తు రాలేదు. అక్కడ జరుగుతున్నదంతా పరిశీలనగా చూస్తున్నాడు. పండుగను జ్ఞాపకం తెచ్చుకోవడానికి యత్నిస్తునే మధ్య మధ్యలో ఫోటోలు తీస్తున్నాడు. తొలి ఏకాదశి మాత్రమే గుర్తుకొస్తున్నది. నాయనమ్మ కట్టెలపొయ్యి పెట్టి మట్టి మంగళంలో వేయించిన జొన్నలు, మొక్కజొన్నలు… పువ్వుల్లా విచ్చుకున్న పేలాలు… ఆరిన తర్వాత వాటిని పిండి విసిరి తురిమిన బెల్లం కలిపి చేసిన పేలపు పిండి తప్ప మరేమి అతని జ్ఞాపకానికి అందడం లేదు.

అక్కడున్న వారంతా చిన్న చిన్న రైతులు. మహిళా రైతులు. అంతా దళిత, గిరిజన మహిళలు. వీరు చేస్తున్న తొలకరి పండుగకు తమ పనులకు సెలవు పెట్టి పట్నం నుండి రెక్కలు కట్టుకొచ్చి వాలిన కొందరు ఉన్నత విద్యావంతులు… వీళ్లెవరికి ఇక్కడ భూముల్లేవు. జాగల్లేవు. అయినా ఎందుకొచ్చినట్లు ? వీళ్ళందరికీ ఇక్కడ ఏం పని ? మాధవ్ ని తొలుస్తున్న ప్రశ్న. సస్పెన్స్ గా ఉంది.

అక్కడున్న నడివయసు పై బడిన లంబాడా మహిళను అడిగాడు. చుట్టాలు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నట్టు వీళ్ళు సాయం చేయడానికి వచ్చారు అన్నది. అంతలో ఆగిన వాహనంలోంచి వీడియో కెమెరాలతో కొందరు దిగారు. గబగబా కెమెరాలు సిద్ధం చేసుకుని షూట్ చేయడం మొదలుపెట్టారు.

అంతలో అక్కడున్న జనాన్ని ఉద్దేశించి ఒకావిడ మాట్లాడడం మొదలు పెట్టింది. అందరూ శ్రద్దగా వింటున్నారు. వీడియో షూట్ చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నారు.

“బీడు పడ్డ నేలలివి. చినుకు కరువై బతుకు బరువై దిగాలుపడ్డ జీవులు వీళ్ళు. వీళ్ళే మనకిప్పుడు ఆరోగ్యకరమైన ఆహార పంటలు అందివ్వబోతున్నారు. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే వీరు పండించే పంటలకు మన మద్దతు ఇవ్వడం తప్పని సరి. ఎలాగంటారా… వీళ్ళకి తమ వ్యవసాయ భూమిలో ఏమి పండించాలో ఎలా పండించాలో తెలుసు. ఆ పంటలు వేయడానికి కొద్దిగా పెట్టుబడి అవసరం. చిన్న మొత్తంలో ఆ పెట్టుబడి మనం ఇస్తే పంట వచ్చిన తర్వాత మనం ఇచ్చిన సొమ్ముకు సరిపడా మనం ధాన్యం తీసుకోవచ్చు. మనకు కావలసింది మంచి ఆహరం. అది ఈ పద్దతిలో మనకు సులభంగా దొరుకుతుంది…” ఆమె మాటలు సాగిపోతున్నాయి.

ఓహ్… చాలా మంచి కాన్సెప్ట్…? ఈ ఐడియా ఎలా వచ్చిందో… మనసులోనే అనుకున్నాడు మాధవ్.

“నిజానికి వీళ్ళు కూడా నిన్న మొన్నటి వరకూ పత్తి వేశారట. పత్తిలో నష్టం వచ్చి అప్పుల పాలై గ్రామంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారట. గ్రామంలో అంతకు ముందు లేని కొత్త కొత్త జబ్బులు ఎక్కువయ్యాయట. దాంతో రెండేళ్లుగా భూముల్ని బీడు పెట్టేసి పట్నం బాట పట్టారట. కానీ అక్కడి వాతావరణంలో ఇమడలేక మళ్ళీ పల్లెకే చేరుకున్నారట. అప్పుడు ఎవరో చెప్తే ఈ ప్రాంతంలో పాత పంటలు పండించే సంఘం రైతులను కలసి వచ్చారట. అప్పటి నుండి గ్రామంలో మహిళలంతా కలసి నిర్ణయం తీసుకున్నారట. తిండి పంటలే పండించాలని. ఈ మధ్య వీళ్ళలో కొందరు సంఘంలో చేరారట.
సంఘం మహిళలు వేసినట్లే వీళ్ళు కలిపి పంటలు వెస్తారట, పెట్టుబడి కోసం సంఘం ఆఫీసును కలిశారు. అదే సమయంలో మనం కల్తీలేని ప్రకృతి పంటల కోసం సంఘం ఆఫీసును కలిసాం. వాళ్ళు మనకీ వీళ్లకీ ఇలా లంకె వేశారు” నవ్వుతూ చెప్పింది దీక్ష స్నేహితురాలు పద్మాక్షి.

ఆ తర్వాత పద్మాక్షి చేతిలోని మైక్ తీసుకుని “ఇక్కడ వీళ్ళు వేసే మిశ్రమ పంటల ద్వారా ఒక ఎకరంలోనే 15 నుండి 35 రకాల పంటలు పండిస్తారు. ఆ పంటల్లో మనకు కావాల్సినవి మన కుటుంబ అవసరాల కోసం మనం తీసుకోవచ్చు. మనం ఇచ్చిన సొమ్ముకు సరిపడా తీసుకోవచ్చు. మనకు ఇవ్వాల్సింది ఇచ్చాక మిగిలిన ధాన్యం వారి కుటుంబానికి సరిపోను ఉంచుకొని మిగిలింది అమ్ముకుంటారట. నిజానికి సంఘం మహిళలు పండించే పంటకి వాళ్ళే మార్కెట్ చేసుకుంటున్నారు వారి సొంత స్టోర్ ద్వారా. కానీ అది మనదాకా రావడం లేదు. వాళ్లకున్న పరిమితుల్లో వాళ్ళు నడుపుకుంటున్నారు. మంచి ఆహారమే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిస్తుంది. ఎప్పుడైతే మన సాంప్రదాయ పంటలు, భిన్నపంటలు పండించే విధానాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని వదిలేశామో అప్పుడే వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపడం మొదలైంది. వ్యాపార పంటలకున్న విలువ సాంప్రదాయ పంటలకు లేకపోవడం వల్ల జనం వాటి సాగువైపే మళ్ళిన విషయం అందరికీ తెలిసిందే… అప్పటినుండి ఆహార భద్రత కూడా ప్రశ్నార్థకమైంది.

ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూడకుండా ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో సంఘం సహకారంతో పాత పంటలు ఇరవై ఏళ్లపైగా పండిస్తున్నారట.

ఇప్పుడీ గ్రామంలో ఈ రైతమ్మలకు పెట్టుబడి కావాలి. వారికి సహాయం అందిద్దామని మేం పది మంది మిత్రులం అనుకున్నాం. నిజానికి మనం చేసేది సహాయం కాదు. మనకి నాణ్యమైన సహజమైన ఆహారం కావాలి. ఆ ఆహారం వాళ్లందిస్తారు. ఇద్దరి మధ్య పరస్పర అవగాహనతో చేసుకుంటున్న ఒప్పందం. ఇదొక ప్రయోగం. బహుశా ఇటువంటి విన్నూత్న ప్రయోగం మరెక్కడా జరిగి ఉండకపోవచ్చేమో…” హైదరాబాద్ నుండి వచ్చిన ఫణిందర్ చెప్తున్నారు మైక్ పట్టుకొని.

ఆ మాటలు వింటూ రెండడుగులు పక్కకు వేశాడు మాధవ్. “మాకు చానా సంతోషం అయితాంది. నిన్నటి దంక ఈ పట్నపు వొళ్ళెవరూ తెల్వదు. వాళ్ళేవ్వరో… మేమెవ్వరో… ఇప్పుడు చుట్టాలెక్క అయినం. కొత్త బంధంలోకొచ్చినం. చుట్టాలకు కూడా లేని సంబంధం మనది… మా గురించి చింత చేస్తున్నరు. ఇంత దూరం వచ్చిన్రు…” ఏదో ఛానెల్ వాళ్ళతో సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న లంబాడా మహిళ మాట్లాడుతున్నది.

ఈ కొత్త ప్రయోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మీడియా వాహనాలు ఇంకా అక్కడ చేరాయి. షూట్ చేసుకుంటున్నాయి. అటు రైతులు, ఇటు వినియోగదారుల అభిప్రాయాలు తీసుకుంటున్నాయి.

“ఆ భూముల్లో ఎక్కడా నీటి సౌకర్యం ఉన్నట్లే లేదు. కనీసం ఒక్క మోటారు కానీ కాలవ కానీ కన్పించడం లేదు. ఇక్కడేం పండుతాయి? మీ పెట్టుబడి మీకెట్లా వస్తుంది?” ఇందాకటినుండి తొలుస్తున్న సందేహం వెలిబుచ్చాడు దీక్ష పక్కకు వచ్చిన మాధవ్.

“నిజమే మామయ్యా వీళ్ల చేలలో ఎక్కడా నీటి సౌకర్యం ఉన్నట్టు కనిపించడం లేదు.” చుట్టూ చూస్తూ అన్నది దీక్ష

“నీళ్లు లేకుండా పంటలు ఎట్లా పండుతాయి…” వచ్చిన వాళ్ళలోంచి మరో ప్రశ్న.

“వీళ్ళు వేసేది వర్షాధార పంటలే కావచ్చు. కానీ… వీళ్ళు పండించేది పంటల్నే కాదు మన ఆరోగ్యాల్ని అని నేను గాఢంగా నమ్ముతున్నాను.” కళ్ళముందు తల్లి రూపం ఆమె పడుతున్న బాధతో పాటు తన పేషేంట్స్ కళ్ళముందు కదలాడుతుండగా అంది దీక్ష.

“అవునంకుల్ మన ఆరోగ్యాల్ని పండించుకోడం కోసం ఒక కొత్త భాగస్వామ్యంలోకి అడుగు పెడుతున్నాం. గతంలో ఎక్కడా లేని విధానానికి.నాంది పలుకుతున్నాం. ఈ భాగస్వామ్యం వల్ల వాళ్లకన్నా మనమే ఎక్కువ లాభం పొందుతామని మా విశ్వాసం” అంది దీక్ష మరో స్నేహితురాలు శ్యామల.

“పోటీ ప్రపంచంలో మనం ముందుండాలని సంపద పోగేసుకోవాలని పరుగులు పెడుతున్నాం కానీ వాటికన్నా ముందు మనం పోగేసుకుంటున్నది అనారోగ్యాన్ని. దాన్నుండి బయట పడాలంటే వీళ్ళు పండించే ఆరోగ్య పంటలే మనకు దారి” అంది పద్మాక్షి.

“అదే నాకర్ధం కావడం లేదు. నీళ్లు లేని పంటలు ఆరోగ్యకరమైనవా… వాళ్ళు పండించే పంటలు ఆరోగ్యకరమైనవా…” మాధవ్ సందేహం.

“మామయ్యా నీలో చాలా సందేహాలు నా కర్ధం అవుతున్నాయి… వీళ్ళు పండించే పంటల్లో ఎక్కడా రసాయన ఎరువులు వాడరు. పురుగుమందులు వాడరు. అత్యంత సహజంగా పెరిగే పంటలు వీళ్ళవి… వాటికి అప్పుడప్పుడూ పడే వర్షపు చుక్కల తడి సరిపోతుందట…” చెప్తున్న దీక్షను కుదిపేస్తూ…

“అమ్మా… టుడే, ఐ యామ్ సో హాపీ… రియల్లీ… నాకు చాలా హ్యాపీగా ఉంది. పంటలు ఎలా వేస్తారో తెలిసిపోయింది” అంటూ దీక్షని పట్టుకుని కుదిపేసింది లక్ష్య.

“నేను మళ్ళీ వస్తా… బియ్యం చెట్లు వచ్చాక చూడ్డానికి” అంది ఆ వెంటనే.

“బియ్యం చెట్లు ఇక్కడ లేవే…” హిమజ పకపకా నవ్వుతూ.

“మరి…” బుంగమూతి పెట్టింది లక్ష్య.

“వీటిని చెట్లు అనరు మొక్కలు అంటారు. ఇక్కడ రకరకాల మిల్లెట్స్, పల్సెస్ వేస్తున్నారు” చెప్పింది పద్మాక్షి.

“ఓ అయితే నేను స్కూల్ లో మిల్లెట్స్ ప్రాజెక్ట్ చేస్తా…” అప్పటికప్పుడు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తోంది లక్ష్య.

తను ఇండియా రావడానికి నెల ముందనుకుంటా చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి తమ కుటుంబంతో చాలా స్నేహంగా ఉండే ఐదు కుటుంబాల్ని పిలిచాడు. వాళ్లలో రెండు కుటుంబాల వాళ్ళు మిల్లెట్స్, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం. అవే పెడుతున్నారా అని అడిగిన విషయం జ్ఞాపకం వచ్చింది మాధవ్ కి.

ఆ వెంటనే ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ స్టోర్ కి ఫ్రెష్ గా వచ్చాయంటే ఎంత ఖరీదయినా సరే, కొని పడేసే భార్య వసంత మదిలో మెదిలింది… నిజంగా అవి ఆర్గానిక్ అవునో కాదో తమకు తెలియదు. కానీ ఆర్గానిక్ అని ఖరీదు చూడకుండా కొనేస్తున్నాం అమెరికాలో.

ఇక్కడ దీక్ష వాళ్ళు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ ఆలోచన వాళ్లకు ఎందుకొచ్చిందో అడగాలి అనుకుంటూ దీక్ష కోసం చూశాడు. టీవీ ఛానెల్ వాళ్ళతో మాట్లాడుతున్నది.

“సంఘం మహిళలతో మాట్లాడాను. వాళ్ళ గ్రామాలకు వెళ్ళాను. చూశాను. అక్కడ కమ్యూనిటీ సావరినిటీ ఉంది. ఆటోనోమి ఉంది. ఉత్పత్తి, విత్తనాలు, వనరులు, ఆరోగ్యం ఉన్నాయి…” దీక్ష చెప్పుకు పోతున్నది.

పోటీ ప్రపంచంలో మనం ముందుండాలని పరుగులు పెడ్తున్న సమయంలో ఒక్క క్షణమ్ చేసిన ఆలోచన కొత్త బంధాలను ఏర్పరిచింది. కొత్త సామజిక ఆర్ధిక వ్యవస్థకు పురుడుపోసిందనుకున్నాడు మాధవ్.

ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్థల గురించి, వినియోగదారుల ఆటిట్యూడ్ గురించి ఆలోచిస్తూ తనకు కాస్త ఆవల నుంచొని అంతా శ్రద్ధగా గమనిస్తున్న నడివయస్కుడిని పలుకరించాడు మాధవ్. పక్క మండలం నుంచి వచ్చిన ఇరవై ఎకరాల రైతు అతను. మెట్ట, మాగాణి రెండురకాల భూమి ఉన్నదతనికి.

తానూ ఇక మిశ్రమ పంటల్నే వేయాలనుకుంటున్నానని. ఒకే పంట వేయడం వల్ల నేలలో సారం తగ్గిపోయిందని, వాడిన రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల నేల పాడయిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో లోపల్లోపల గూడుకట్టుకున్న బాధను విప్పి చెప్పడం మొదలు పెట్టాడు.

“వ్యవసాయాన్ని కూల్చేసే పత్తి పంట వేసి పెద్ద విపత్తు తెచ్చుకున్నా.మొదట రెండెకరాల్లో వేసిన పత్తికి వచ్చిన లాభాలను చూసి ఇంకేముంది. ధనవంతుడై పోదామన్న ఆశతో తన పద్దెనిమిది ఎకరాలతో పాటు మరో యిరవై ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశా. మొదటి రెండేళ్లు పర్వాలేదు. లాభం లేకున్నా నష్టం లేదు. అంతకంతకు సరిపోయింది. ఆ తర్వాత పచ్చపురుగు దాడి చేసి పంటను నాశనం చేసింది. ఒక పురుగు వస్తే పదిసార్లు మందు కొట్టాను. అది చస్తేనా… వ్యవసాయ అధికార్ల చుట్టూ తిరిగాను. బిటి పత్తి వేసుకొమ్మని సలహా చెప్పారు. ఆ పత్తి తో పురుగులు రావన్నారు. రోజూ టీవీల్లో అదే చెప్పి చెప్పి, చూపి కలలను రైతులకు అమ్మారు. ఆ కలల వెంట పరుగెత్తారు నేను నాలాంటి చాలా మంది రైతులు. ఈ ఏడు కాకపొతే వచ్చే ఏడు పంట వస్తుంది అన్న ఆశతో దొరికిన చోటల్లా అప్పులు చేసి పత్తి వేస్తూ పోయాను. పచ్చపురుగు తర్వాత గులాబీ పురుగు ఎదో ఒకటి దాడి చేస్తూనే ఉన్నది. పురుగుమందులు పోస్తూనే ఉన్నాను. పత్తికాయ డొల్లబారిపోయింది. నా జీవితంలాగే… పత్తికాయలు రాలిపోయాయి. రైతు జీవితాలు నేల వాలిపోయాయి. అది తెల్సుకునేటప్పటికి ఇన్నేళ్లు పట్టింది. ఒక పురుగు తర్వాత ఒక పురుగు రైతుల జీవితాల్ని తినేస్తుంటే తొలిచేస్తుంటే పత్తి వేయొద్దని చెప్పాల్సిన ప్రభుత్వం నీ పంటకు పరిహారం ఇప్పిస్తాం అంటుంది. నేను చచ్చిపోతే నా కుటుంబానికి నష్టపరిహారం ఇస్తారట… అహహా అహహా…” ఏడవలేక వచ్చిన నవ్వు. అతని మాటలు విన్న రెండు ఛానల్సు వాళ్ళ కెమెరాల్ని అతని వైపు ఫోకస్ చేశారు. అదేమీ పట్టించుకోని అతను మాధవ్ తో చెప్పుకుపోతూనే ఉన్నాడు.

“ఏం చెయ్యాలి? పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి పదెకరాలు అమ్మి అప్పులు తీర్చాను. ఇంకా చిన్న చిన్న బాకీలు ఉన్నాయి. ఇదంతా అర్ధం చేసుకునే ఓపిక లేదు. ఇకముందు పత్తి జోలికి పోవద్దని ఒట్టు పెట్టుకున్న. అందుకే విషం నిండిన చేనుని బాగుచేసుకొని ఆరోగ్యం పంటలు పండిచ్చుకోవాలని అనుకుంటున్నా… జీవామృతం, బీజామృతం చేసుకుంటాను. పెంట ఎరువులే వాడాలని అనుకుంటున్నా… నేను నమ్ముకున్న నేల తల్లి నాకు నాకుటుంబానికి ఇంత తిండిపెడ్తుందన్న నమ్మకంతో ఉన్నా” స్థిరంగా అన్నాడతను.

“ఏడాదికేడాదికి బస్తాలకు బస్తాలు రసాయన ఎరువులు ఎక్కువ కుమ్మరిస్తేనే పంట వస్తున్నదని వ్యవసాయపు ఖర్చు కూడా ఏడాదికేడాదికి ఎక్కువై పోతున్నది. ఒకే పంట వేయడం ఖరీదైన విత్తనాలు ఒకటికి రెండుసార్లు కొనడం, రసాయన ఎరువులు పురుగు మందులుకోసం ఎంత వడ్డీకైనా తెచ్చి పెట్టడం చివరకు అప్పులే మిగిలి దిక్కు తోచని రైతు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితులు… అందుకే నేనూ… ఈ ప్రాంతంలో పండే చిరుధాన్యాలు, పప్పుదినుసుల పంటలు వేయాలనుకుంటున్నా. కొర్రలు, సామలు రాగులు, పెసలు, కందులు, ఉలవలు, అనుములు, నువ్వులు, అవిసెలు వంటి పూర్వపు పంటలు వేసి. భూమిని కాపాడుకోవాలని ఆలోచిస్తున్న. ఇప్పుడిక్కడ తొలకరి పండుగ చేస్తున్నారని పేపర్లో చూసి వచ్చాను” విద్యావంతుడైన మరో రైతు చెప్పాడు.

అతని పక్కనే ఉన్నతను “మగోళ్ళు అధిక దిగుబడుల వైపు చూస్తరు. పైసలొచ్చే పంట పెడ్తరు. ఆడోల్లు ఇంటిల్లపాది పొట్ట చూస్తరు. తిండి చూస్తరు. వ్యవసాయంల ఆడవాళ్ళ చేతిమీద నడిచే అక్కడ ఎనకటి పద్దతిని వదల్లేదు. కుటుంబం సంప్రదాయాలు పట్టుకు వేలాడుతున్నట్టే పాత పంటల పద్దతి కొనసాగుతున్నది. ఆడోళ్ళ కున్నంత ఓపిక మన మగోళ్ల కెక్కడిది…” అన్నాడు నిర్మల్ నుండి వచ్చిన రైతు.

“కాకపొతే ఆ పంటలు వేస్తే ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ చేయదు. పంటను కొనుగోలు చేయదు. నష్టపోతే నష్ట పరిహారాలు ఉండవు, పెట్టుబడికి లోన్లు ఉండవు. రైతుకు శ్రమ చాలా ఎక్కువ. అందుకే వెనక ముందు ఆలోచిస్తున్నా. ఈ ఏడాది రెండెకరాలు రసాయనాలు లేని కలిపి పంట వేస్తే ఇంటి తిండికైనా వస్తాయనుకుంటున్నా” చెప్పాడు అదే రైతు.

వ్యవసాయ సంక్షోభం అంటే ఇదేనేమో… అనుకున్నాడు మాధవ్.

“రోగాలు వస్తాయని కోళ్లఫారంలో కోళ్లలాగా గిజగిజలాడిపోతున్నారు. మిద్దెతోటలే పరిష్కారం అంటున్నారు. సజ్జలు కొర్రలు తిందాం అంటున్నారు. ఒక్క గోవుంటే చాలు అన్ని సమస్యలు మాయం అంటున్నారు. జీవామృతం, బీజామృతం, వర్మీకంపోస్టు, ఏవేవో చెబుతున్నారు. సేంద్రియ ఎరువులు వాడుకుందాం. మనని మనం కాపాడుకుందాం అంటున్నారు. బాగుంది. చాలా బాగుంది. మంచిదే… చాలా…. మంచిదే… కానీ… ముందు ఆ ఎరువులు, పురుగు మందులు మన వాకిట్లోకి రాకుండా బాన్ చేయరెందుకు? ఆరోగ్యానికి మంచిది కాదని సారా బీరు బ్రాందీ ల గేట్లు బందు చెయ్య రెందుకు? చెరుపు చేసే చుట్టలు సిగరెట్లు జర్దాలు, పాన్ పరాగ్ లు జేబుల్లోకి జేరకుండా అమ్మడం మానరేమి? వాటితోని పెచ్చులూడిపోతున్న పాత గోడల్లా మారిపోతున్న జీవితాలు కనిపించట్లేదా… కాపాడాల్నని తెల్వదా…? ఇన్ని చెప్తున్నారు…” మనసు మూలల్లో దాచుకున్న భావాలన్నీ ఒక్కొక్కటీ వెల్లువై దండయాత్ర చేస్తుండగా టీవీ ఛానెల్ కెమెరాముందు కొచ్చి తనకు తానుగా మాట్లాడుతూ రాందాసు.

అసలతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. అతను మనసు బాగోక అట్లా సైకిల్ పై పోతున్నాడు. ఆగిన వాహనాలు, పట్నం -పల్లె జనం చూసాడు. దారిన పోతూ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాడు.
అతనికి లోలోన రగిలిపోతున్నది. రెండు రోజుల క్రితం విన్న వార్త అతన్ని దహించి వేస్తున్నది. అక్క కొడుకు ముద్దుల మేనల్లుడు వయసెంత… మూడేళ్లు నిండలేదు. వాడికి బ్రెయిన్ కాన్సర్ అన్నారు. అభం శుభం తెలియని వాడికీ శిక్ష ఏమిటి? అని డాక్టరు నడిగితే చెప్పిన సమాధానం అతన్ని మరింత కుంగతీసింది.ఆలోచింపజేస్తున్నది. ఆవేశం కట్టలు తెంచుకు వస్తున్నది. భూమిని తల్లిలాగా చూసుకుంటామని చెబుతారు. మరి తల్లి గొంతులో నిండా విషం నింపుతారా… ఒళ్ళంతా విషంతో తడిసిపోయిన తల్లి బిడ్డకి విషపు పాలే ఇస్తది కదా… ఆ జ్ఞానమే లేకుండా బతుకుతున్నాం” ఆవేదనతో ఆ యువకుడు రాందాసు.

రాష్ట్రంలో ఉన్న ప్రధాన వార్తా ఛానెల్స్ వాళ్ళంతా కనిపిస్తున్నారక్కడ. పట్నం నుండి వచ్చిన దీక్ష వాళ్ళ గ్రూప్ లో ఒక ఛానెల్ లో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఉండడంతో వారి ప్రతినిధి హంగామా చేయడంతో స్థానికంగా ఉన్న మీడియా వాళ్లంతా పెద్ద ఎత్తున మోహరించారు. ఎవరికి వాళ్ళు తాము ప్రత్యేక కార్యక్రమం చేయాలని ఉబలాట పడుతుండడంతో వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ అంతా హడావిడిగా ఉంది ఆ వాతావరణం. కళ్ళకి కాస్త బాగా కనిపించిన వాళ్ళనో, మాట్లాడుతున్న వాళ్ళముందో మైక్ తెచ్చిపెట్టి ఏవో ప్రశ్నలు వేసి చెప్పమంటున్నారు మీడియా ప్రతినిధులు.

“మనం సజ్జలు, జొన్నలు, కొర్రలు, తైదలు వంటి పంటల్ని మానేసి బియ్యానికి ఎగబడ్డాం… మల్లెపువ్వుల్లా విచ్చుకునే అన్నం తినడం గొప్పవాళ్ళ తిండి, ధనవంతుల తిండి అనుకునేవాళ్ళం. నాజూకు నేర్చి తెల్ల బియ్యం, సన్న బియ్యం కావలనుకున్నాం. బియ్యం తినే వాళ్ళను చూసి కుళ్లుకున్నాం. బియ్యం అందరు తినాల్నని రెండురూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు కు జై అన్నాం. అంతకు మునుపుబియ్యం తినడం అలవాటులేని జనం కూడా బియ్యంకి ఎగబడ్డారు. బియ్యం చూడ్డానికి చక్కగా ఉన్నాయి. చిరుధాన్యాలకు చేసినంత చాకిరీ ఉండదు. కడిగి పొయ్యి మీద పడేస్తే చాలు అన్నం సిద్ధం.
ఆడవాళ్లకి ఆ పని నచ్చింది. చాకిరీ తప్పింది.

జొన్నలో, కొర్రలో, సజ్జలో, సామలో, అరిగెలో అయితే ముందు వాటిని శుభ్రం చేయాలి. దంచి పొట్టు తియ్యాలి. ఆ తర్వాత పిండి విసురుకోవడమో గిర్నీ పట్టించడమో చేయాలి. ఆ తర్వాత పిండి కలిపి రొట్టె చేయాలి. కాల్చాలి. దానికి చాలా సమయం, చాలా ఓపిక కావాలి. అంతే కాకుండా రొట్టెకు ఏదో ఒక కూర కావాలి. అన్నానికయితే ఏమీ లేకపోతే ఇంత ఉప్పు వేసుకుని పిసుక్కుని తినెయ్యొచ్చు. అందుకే పాతపంటలు తినేవాళ్లు బియ్యానికి మళ్లారు. ఇప్పుడు తెల్ల బియ్యం తినేవాళ్లు మన పాత పంటల వైపు మళ్లారు. అంతా ఉల్టా పల్టా… ఇప్పుడేమో హార్వర్డు సైన్టిస్టులు తెల్ల బియ్యం, మిల్లు బియ్యం తింటే రోగాలొస్తాయి మంచిది కాదు అంటున్నారు. అందుకే వాళ్లంతా మన పంటలకు ఎగబడుతున్నారు ” అన్నాడు ఆంగ్ల పత్రికకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు మాధవ్ దగ్గర కొచ్చి “అవును, అంతేకావచ్చు.
ఇప్పుడు వీళ్ళ పంటలే ఖరీదైన పంటలయ్యాయి. విలువైన పంటలయ్యాయి. ఆరోగ్య పంటలయ్యాయి” నవ్వుతూ అన్నాడు మాధవ్.

చిన్నప్పుడు చూసిన వ్యవసాయం తప్ప న్యూయార్క్ నగరంలో మెకానికల్ ఇంజినీరింగ్ అధ్యాపకుడిగా యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో పాఠాలు చెప్పే మాధవ్ కి వ్యవసాయం గురించి ఏమీ తెలియదు.
ఆహారం, పంటల గురించి ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించిందీ లేదు.

తినే తిండికి మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని మాత్రం మాధవ్ కి బాగా తెలుసు. అందుక్కారణం అతని భార్య వసంత. అమెరికా వెళ్ళాక సంపాదనలో పడి ఏది దొరికితే అది అందుబాటులో ఉన్నవి కొనుక్కు తినడం మొదలు పెట్టారు. ఇంట్లో వంటలు చేయడం తగ్గిపోయింది. ఆహారపు అలవాట్లూ మారిపోయాయి. శరీరానికి ఏవి అవసరమో అని కాకుండా మార్కెట్ ఏది ముందుకు తెస్తే అది, ఏది చౌకగా లభిస్తే అది తినేయడం అలవాటయిపోయింది.

వసంతకు బ్రెస్ట్ కాన్సర్ మొదటి దశలో గుర్తించడం, ఆ తర్వాత ఆహారపు అలవాట్లు మార్చుకోవడంలో ఆమె విజయం సాధించింది. పిల్లలకి చెప్పి చెప్పి విసిగిపోయింది. కానీ తాను మానలేదు. నెమ్మదిగా ఆవిడ తినే ఆహారమే తనపై రుద్దడం మొదలు పెట్టింది. అక్కకి పాంక్రియాస్ కాన్సర్ అని తెలియడంతో మరింత వత్తిడి పెంచింది. మాధవ్ ఆలోచనలు అంజ్య నాయక్ తండా నుంచి అమెరికా వరకూ విస్తరించి ఇటునుండి అటూ, అటునుండి ఇటూ గిరికీలు కొడుతున్నాయి. మరిన్ని కొత్త ఆలోచనలకు బీజం పోస్తున్నాయి.

“మేము సినిమాలు తీస్తం. విత్తనాల మీద తీస్తం, పంటల మీద తీస్తం, ఆరోగ్యం మీద తీస్తం, చీడపీడల మీద తీస్తం,వాటర్ షెడ్ మీద, కలిపి వ్యవసాయం మీద, మీటింగులు చేసినప్పుడు, సంఘం పండుగలు అయినప్పుడు ఏది జరిగిన షూటింగ్ చేస్తాం. ఇట్లా మా లెస్స సినిమాలు తీసినం. మేం చేసినవి మా సంఘం ఊర్లల్లో చూపుతాం. తర్వాత ఢిల్లీకి పోయినయ్, ముంబయికి పోయినయ్, హైదరాబాద్ పోయినయ్ చెన్నై పోయినయ్ ఇట్లా మా సినిమాలు అటు ఇటు మస్తు జాగల్లకు పోయినయ్. దేశమంత తిరిగినయ్. ఇంకా కెనడాకు, లండన్, జర్మనీ, థాయిలాండ్, పెరూ, ఆఫ్రికా, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సెనెగల్, ఫ్రాన్స్…. అట్లా దునియా అంత తిరిగినయ్. ముప్పై దేశాలల్ల తిరిగినయ్. వాటితోటి మేమూ తిరిగినం.మేము వీడియో షూటింగ్ నేర్సి సినిమాలు చేసినట్టే పెరూ దేశంల 18 మంది మా అసొంటి ఆడోల్లకు వీడియో షూటింగ్ నేర్పిచ్చి వచ్చినం. బాంగ్లాదేశ్ ల నేర్పిచ్చినం. పాకిస్తాన్ల వాళ్ళ వ్యవసాయం మేము షూటింగ్ చేసి ఇచ్చినం. ఇక్కడి కరువు ఎట్లుండే… కలిపి పంటలతోని ఎట్ల కరువు ఎల్లగొట్టినమో చెప్పినం. అప్పుడు వాళ్ళ కండ్లల్ల నీళ్ళొచ్చినయ్… ఇట్ల మా లెస్స తిరిగినం. ఫిలిం ఫెస్టివల్ కు మమ్ముల పిలిచిండ్రు. మేం పోయినం. మా సిన్మా ఎట్లెట్ల చేసినం చెప్పినం. మాకు మా లెస్స అవార్డులిచ్చిన్రు. అట్లనే మేము ఎప్పటికి పోతున్నము కదా… అట్లనే ఇక్కడ మేము ఫిలిం ఫెస్టివల్ చేస్తే ఎట్లుంటదని సంఘంల కూచొని విచారం చేసినం. అక్కడోళ్ళు వేటి మీద పని చేస్తున్నరు… ఆ ఊర్లల్ల ఏమి తక్లిబులున్నాయి. ఏం పారేశాన్లున్నాయి అట్ల తెల్సుకోవాలనుకున్నం. మా లెక్క ఊరోళ్ళు తీసిన సినిమాల కోసమే పోయినేడాది ఒక ఫెస్టివల్ పెట్టినం. మంచిగున్నవాటికి ప్రయిజులిచ్చినం. ఇంకొక్క నెలకు ఉగాది ఎల్లినంక మళ్ళ ఈ యాడాది ఫిలిం ఫెస్టివల్ చెయ్యాల్నని అనుకుంటున్నం….” టివి ఛానల్ ఇంటర్వ్యూ లో మొగులమ్మ చెప్పుకుపోతున్నది. ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూ మొత్తం తన కెమెరాలో రికార్డు చేసింది తర్వాతి తరం కెమెరా వుమన్.

“నువ్వు సంఘంలో ఏమి చేస్తావ్” ఆ ఇంటర్వ్యూ పూర్తికాగానే మొగులమ్మకేసి చూస్తూ అడిగింది పద్మాక్షి.

“కమ్యూనిటీ మీడియా సెంటర్ కో ఆర్డినేటర్ గ పనిచేస్తున్న” టక్కున చెప్పింది మొగులమ్మ. పద్మకి చాలా ఆశ్చర్యంగా ఉంది.

“వాట్…? ఏమీ చదువుకోలేదన్నావుగా…” నమ్మలేనట్లుగా.

“అవును, చదువుకోలే…. చదువులేనోళ్ళు మీడియా సెంటర్ ఎట్ల నడుపుతున్నారని మీ డౌట్ కద! నాకు తెలుస్తున్నది. అది తెలవాలంటే మా ఆఫీసుకు రండి. మా సంఘం ఆఫీసుల ఉన్న కమ్యూనిటీ మీడియా సెంటర్ చూడండి. మేం ఏమి పని చేసినమో, ఎట్ల చేస్తున్నామో మీకు తెలుస్తది” అన్నదామె చిన్నగా నవ్వుకుంటూ. ఇంకా మీ సంఘం వాళ్ళు… ఏదో అడుగుతున్నది పద్మ. ఆమె చెబుతున్నది. మధ్య మధ్యలో పద్మ ఏవో ప్రశ్నలు వేస్తున్నది. వాళ్ళిద్దరి సంభాషణను తన దగ్గరున్న కెమెరాతో వీడియో షూట్ చేస్తున్నది తర్వాతి తరం సంఘం కెమెరా ఉమన్ మంజుల.

“పురుషుల రంగంగా ఉన్న మీడియాని గ్రామీణ మహిళలు బ్రేక్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కనిపించని ప్రగతి వెనుకబడిన ప్రాంతపు మారుమూల పల్లె పడతులు సాధించడం గొప్ప విజయం.
సాధారణంగా ఎవరయినా తాము చేసిన పనిని, సాధించిన విజయాన్ని చాలా గొప్పగా ఉన్నదానికి ఇంకాస్త జోడించి చెప్పుకోవడం తెలుసు. కానీ సంఘం స్త్రీలు చెపుతున్న విషయాలు వింటుంటే ఏమాత్రం గొప్పలు చెప్పుకున్నట్లుగా లేదు. అసలు విషయాన్ని విషయంగా చెబుతున్నట్లున్నది. ఇక్కడ జరుగుతున్న ప్రగతిని ఎవరైనా డాక్యుమెంట్ చేసారో లేదో…” పక్కనే ఉన్న ఇంగ్లీషు పత్రిక జర్నలిస్టు తో అన్నాడు మాధవ్.

“ఎవరో ఎందుకు సర్, వాళ్లే వీడియో చేస్తున్నారు కదా… రేడియో నడుపుతున్నారు… అంటే వాళ్ళ గురించి వాళ్ళు డాక్యుమెంట్ చేస్తున్నట్లే కదా…” అన్నాడతను. తనకు తానే చిన్నగా మొట్టుకుని “నిజమే కదా…
మన పూర్వీకులు వారికి చెందిన గొప్ప జ్ఞానం డాక్యుమెంట్ చేయకపోవడం వల్ల చాలా విషయాలు, విజ్ఞానం తర్వాతి తరాలకు అందలేదు. కొన్ని విషయాలు ఏ విదేశీ పర్యాటకులో, చరిత్రకారులో చెబితే తెలుసుకున్నాం. ఉన్నవాళ్ళ చరిత్రలు, గోప్గ్ప్పవాళ్ళ చరిత్రలు, గాధలు వెలుగు చూస్తాయి కానీ పేద మహిళల జీవిత చరిత్రను ఎవరు డాక్యుమెంట్ చేస్తారు…? చేసినా వాళ్ళ అవగాహనా కోణం వేరేగా ఉండొచ్చుగా. వీళ్ళ కృషిని, విజయాన్ని చిన్నదిగా చేసి చెప్పొచ్చు. కాబట్టి వీళ్ళే డాక్యుమెంట్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. వచ్చిన దగ్గరనుండీ అందరి మాటలు, సంఘం స్త్రీలు సాధించిన గొప్ప విజయాలూ వింటుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే” అన్నాడు మాధవ్.

“నవ్వుతూ నాగలి పట్టి పొలం దున్ని మన కడుపు నింపే రైతులు కరువై పోతున్నారు. ఎద్దుల మెడలో కట్టాల్సిన పగ్గాలు రైతుల మెడకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. అన్నంపెట్టే అన్నదాత కుటుంబాలు అనాధలై ఆకలి మంటల్లో అలమటిస్తున్నాయి. వాళ్ళ పంటకు వాళ్ళు ధర నిర్ణయించుకోలేని యజమానులు వాళ్ళు. వ్యవస్థలో లోపాలను ఏమనలేక తమను తాము శిక్షించుకుంటున్నారు రైతులు… అటువంటి పరిస్థితిలో ఈ మహిళారైతులు మాత్రం విజయకేతనం ఎగురేస్తూ…వ్యవసాయానికి ఐకాన్ అయ్యారు” తాను చూసిన అనుభవాల్లోంచి ఇంగ్లీషు జర్నలిస్ట్ వ్యాఖ్య.

*

ఐదారు నెలల తర్వాత పట్నం రెక్కలు కట్టుకుని పల్లెలో వాలడానికి సిద్దమై బస్సు ఎక్కింది. ఆ బస్సులో పెద్దలతో పాటు పిల్లలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళను చూస్తే ఏదో పిక్నిక్ కి వెళ్తున్నట్టుగా ఉత్సాహం ఉరకలేస్తూ… కొందరు తమతో వాటర్ బాటిల్, స్నాక్స్, లంచ్ కూడా ప్యాక్ చేసి తెచ్చుకున్నారు. అందరి నోళ్ళలో మన పంట వచ్చింది…మాట వినిపిస్తున్నది. ఏమేమి వచ్చాయో ఓ ఉద్వేగం వాళ్ళ మాటల్లో… ఏదో వాళ్లే కాయకష్టం చేసి పండించినట్లు మాట్లాడుకుంటున్నారు. పద్మద్వారా విషయం తెలుసుకున్న వినోద్, రేఖ, అరవింద్ కూడా దీక్ష, పద్మాక్షి బృందంతో కలసి ఆ బస్సులో బయలుదేరారు.
ఒకప్పుడు వదిలేసిన పంటల వెంట పడిన ధనిక వర్గం, ఆరోగ్యం వెంట పరుగులు పెడుతున్న విద్యావంతులు ఆ పంటల్ని తమవిగా చేసేసుకున్నారని మనసులోనే నవ్వుకుంటున్నది రేఖ.

“అబ్బా… ఇంకా రాదేంటి… ఇంకెంత సేపమ్మా…” అని ఒక పాప తల్లిని అడుగుతున్నది. తమ పంటలను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆత్రుత పడుతున్నది ఆమె.

“నేను రానంటే తీసుకొచ్చావ్… ఏముందిక్కడ? చాలా బాగుంటుంది నువ్వు ఎంజాయ్ చేస్తావ్ అని నన్ను కన్విన్స్ చేసావ్. ఎంచక్కా ఆన్లైన్ గేమ్ ఎంజాయ్ చేసేవాడ్ని” చేతిలో ఫోన్ లాక్కుని వీడియో గేమ్ ఆడుకుంటూనే తల్లిని విసుక్కుంటున్నాడు పద్మ కొడుకు సిద్దార్ద్.

“గేమ్స్ ఎప్పుడూ ఉండేవేగా… ఇట్లాటి అవకాశం వస్తుందా… చెప్పు…” బుజ్జగిస్తున్నది పద్మ.

“అమ్మా… తొలకరి పండుగకి వచ్చినప్పుడు ల్యాండ్స్ రెడ్డిష్ ఉన్నాయి. ఎక్కడన్నా కొంచెం కొంచెం గ్రీన్ కనిపించింది. ఇప్పుడు కొంచెం ఎక్కువే గ్రీన్ కనిపిస్తున్నది. కదమ్మా” అన్నది లక్ష్య. కూతురు పరిసరాల్ని పరిశీలనగా చూస్తున్నందుకు మనసులోనే అభినందించింది దీక్ష.

“నాన్నా… ఇప్పుడు ఆ విలేజ్ వాళ్ళు మనకు బంధువుల్లాగే… అన్నావుగా మరి మనకి లంచ్ ఆఫర్ చేస్తారా …” తను లంచ్ తెచ్చుకోలేదు ఎట్లా అనే ఆందోళన మనసులో ఉన్న ఓ బుడతడు తండ్రిని అడుగుతున్నాడు.

పెట్టుబడి… మార్కెట్… డిమాండ్… ఉత్పత్తి… మాటలు వెనక నుండి వినిపిస్తున్నాయి. ఎవరో పక్కనున్నవాళ్ళ బుర్ర తినేస్తున్నట్లున్నారనుకున్నాడు అరవింద్. నేటి సామాజిక వ్యవస్థ నమ్మకాల్ని మొదలుకంటూ నరుక్కుంటూ పోతున్నది. ఏమైపోతుందో… ఆ మాటల్లో ఆవేదన.

మాటలు వినిపిస్తున్నాయి కానీ మనుషులెవరో తెలియడం లేదనుకుని ఒక సారి వెనక్కి తిరిగింది రేఖ. ఎవరో తెలియలేదు. మరీ అట్లా చూడడం సభ్యత కాదని మౌనంగా కూర్చుంది. కాస్త ఆవలగా కూర్చున్న వినోద్, అరవింద్ కేసి చూసింది. అరవింద్ బయటికి చూస్తూ… వినోద్ కళ్ళు మూసి సీటుకి వెనక్కి జారిగిలపడి ఉన్నాడు.

పాపం వినోద్ అలసి పోయినట్లున్నాడు. ఆఫీసు నుండి రాగానే బయలుదేరడం వల్ల డ్రైవింగ్ తో రెస్ట్ లేకుండా పోయింది. హైద్రాబాద్ చేరేప్పటికి దాదాపు పది. భోజనం చేసి పడుకునేప్పటికి పదకొండున్నర. మళ్ళీ ఉదయమే లేచి ఇటు బయలుదేరడం వల్లనేమో కునుకు తీస్తున్నాడు అనుకుంది.

కానీ అతని కళ్ళు నిద్రపోతున్నట్టుగా లేవు. ఏదో కల కంటున్నట్టున్నాడేమో… చిన్నగా తనలో తనే నవ్వుకుంది. పక్కన కూర్చున్న పద్మ లేచివెళ్లి కొడుకుని బుజ్జగిస్తున్నది.

*

వినోద్ పరధ్యానం లోంచో కనురెప్పలు వాల్చినప్పుడు రాలిన నిశ్శబ్దం లోంచో రాలిపడుతున్న దృశ్యాలు.

ట్రాక్టర్లతో దున్నుతూ… రసాయన ఎరువులు, పురుగు మందులు వెదజల్లి చేస్తున్న సేద్యం… యంత్ర సహాయంతో నాట్లు, కోతలు… డ్రోన్ ల సాయంతో రసాయన ఎరువులు వెదజల్లడం, పురుగుమందు పిచికారీ…
వావ్… మనం చాలా అభివృద్ధి సాధించాం. కూలీల కొరతని అధిగమించేసాం… యంత్రాలు… మర మనుషులు అన్ని పనులూ చేసేస్తున్నాయి. గోడౌన్ల నిండా ధాన్యం. అధిక దిగుబడులతో ఆహారకొరతని అధిగమించేసాం. ప్రకృతిని లొంగదీసుకుని కాని కాలంలో కూడా కావాల్సిన పంటలు పండిస్తున్నాం. మనకు కావలసిన విధంగా… కోరుకున్న విధంగా… పశుగ్రాసం లేక ఊర పశువులు ఆకలితో అలమటించి ఎప్పుడో పోతేపోయాయి… ఫార్మ్స్ లో పెంచే హై బ్రీడ్ పశువులు అధిక పాల ఉత్పత్తినిచ్చే పశువులు, అధిక మాంసం ఇచ్చే పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు ఉత్పత్తి చేసుకుంటున్నాం కదా… ఇంక మనకి సరిలేరు ఎవ్వరూ…

వీర విహారం చేస్తున్న బహుళ జాతి కంపెనీలు… అవి కబళించేస్తున్న పొలం, పంట, వంట అంతా… వాళ్ళ చేతుల్లోనే… వాళ్ళ కనుసన్నల్లోనే బలహీనురైన గ్రామీణులు కూలి లేక పని లేక…. ఎండిపోయిన మోళ్లుగా… అడుక్కునేవాళ్లుగా… పూలమ్మినచోటే కట్టెలమ్మలేని రైతులు మూటాముల్లె నెత్తిన పెట్టుకుని నడుస్తున్న శవాల్లా పోతూ…

ఉలిక్కిపడి ఆ దృశ్యం చూడలేక తల కుడి నుండి ఎడమ పక్కకు తిప్పాడు వినోద్.

కనుచూపు మేరలో ఎటుచూసినా పనికిరాని బంజరు భూములే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళ లాడిన నేలంతా సహజత్వాన్ని కోల్పోయి…వట్టిపోయి నిర్జీవంగా… కంటి ముందు ఏదో తెర పరచుకున్నట్లుగా… పీల్చేగాలి లో ఘాటైన వాసనలు తట్టుకోలేక ఆక్సిజన్ మాస్కులు… అందరూ మొఖాలకు తగిలించుకున్న మాస్కులతోనే… వీపు పై ఆక్సిజన్ బ్యాగులతోనే… తాగడానికి నీరు లేక… ఉన్న నీరు తాగడానికి పనికి రాక… ప్లాస్టిక్ బాటిళ్లు మెడలో తగిలించుకుని అప్పుడప్పుడూ ఒక గుక్క తో గొంతు తడుపుకుంటూ… బిందె మీద బిందె నాలుగైదు వరుసలు పెట్టుకుని బారులు తీరి పోతున్న మహిళలు… వాటి కోసం జరుగుతున్న ముష్టి యుద్దాలు… పంటలు ఇచ్చే జవసత్వాలు కోల్పోయిన భూమి… కృత్రిమంగా పండించే కొద్దిపాటి పంటలు… ఆకలి మంటలు తీర్చుకోడం కోసం మేడల మీద, మిద్దెల్లోపల మట్టిలేకుండా ఎల్ ఇ డి లైట్ల వెలుతురులో నేరుగా పోషకాలు అందిస్తూ ఏర్పాటు చేసుకున్న కృత్రిమ పంటలు… తినే ఆ తిండి… అది తెచ్చే తిప్పలు… జీవంలేనట్లు రోబోల్లా కదిలే మనుషులు… వాళ్ళ చుట్టూ తిరిగే రోగాలు…
వదిలించుకోలేని జబ్బులతో జనం హాస్పిటల్స్ ముందు క్యూ కడుతూ… అరణ్యాల్లా పెరుగుతున్న అద్దాలమేడల హెల్త్ విల్లేజ్ లు… కన్నీటి చుక్క రాలి పడింది. ఆ తడి శబ్దానికి ఉక్కిరి బిక్కిరై ముడుచుపోతున్న రెక్కల్ని సవరించుకుంటూ నిటారుగా కూర్చున్నాడు వినోద్.

జీవం ఉట్టిపడే మనుషులు ప్రకృతికి ఎదురెళ్లకుండా ప్రకృతితో కలిసి నడిచే మనుషులు. బంజరు భూముల్లో సిరులు పండించే రైతులు రైతక్కలు… తృప్తితో జీవం కోల్పోయిన బహుళ జాతి కంపెనీలు… కోల్పోయిన లక్షల కోట్లు…నోమోర్… గ్రోమోర్ అంటూ… సహజమైన పంటలకు డిమాండ్. సిరుల పంటలు పండించడం కోసం క్యూ కడుతున్న యువతరం… కన్నీటి తడి లేని రైతు కళ్ళు, ఏ బాధలేని చిరునవ్వుల రైతు ముఖం… ఆత్మహత్యలు లేని గ్రామం. ఆ గ్రామం పచ్చగా గడ్డిపూలతో కళకళలాడుతూ. గడ్డిపూల పరిమళాలు విశ్వవ్యాప్తి చేస్తూ… శిలలు… ఊరవతల అచేతనంగా పడివున్న ఉన్న శిలలు… తమను తాము మలుచుకుంటూ… అందమైన శిల్పాలుగా రూపాంతరం చెందుతూ… హర్షాతిరేకంతో కళ్ళు విప్పార్చుకుని చూస్తున్న వాడల్లా బస్సు కుదుపుకు వినోద్ తల కిందకి వాలింది.

చిరుధాన్యాలకు ఉత్పత్తికి మించి డిమాండ్. ధర ఎంతైనా కొనుగోలు చేసే జనం క్యూ కట్టి. డిమాండ్ కు తగ్గ పంటలేక షాపులో దొరికినప్పుడే కొని స్టాక్ చేసుకుంటున్న ప్రజలు. అది గమనించి ముందే బ్లాక్ చేస్తున్న వ్యాపారులు. రైతునుండి వినియోగదారుడి దగ్గరకొచ్చేసరికి ఆ పంటకు నాలుగు రేట్లు అధిక రేటుతో… అయినా సేంద్రియ ఆహార పంటతో ఆరోగ్యం నిలుపుకోవాలన్న ప్రజల ఆరాటం. తమ ఇంటి అవసరాలకోసం పక్కకు ఉంచుకున్న ధాన్యాన్ని అధిక ధరలకు ఆశపడి ఇచ్చేసే తర్వాతి తరం రైతులు… చిరుధాన్యాలు సిరిధాన్యాలై సిరిగలవారి తిండిగా మారిపోయిన వైనం… ఏ పంటలకు డిమాండ్ ఉందో ఆ పంటల అధిక ఉత్పత్తి కోసం రైతుల యత్నాలు… మళ్ళీ ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా పడుతున్న అడుగులు… విషవలయంలో చిక్కినట్టు, ఊబిలో కురుకుపోతున్నట్టు ఉక్కిరిబిక్కిరవుతూన్న వినోద్.

“బావా…” అన్న పిలుపుతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.

*

బస్సు ఆగింది. జనం దిగిపోతున్నారు. బావా వచ్చేసాం అంటూ పక్కన కూర్చున్న అరవింద్ లేచి నుంచున్నాడు. ఈ ప్రపంచంలోకి వచ్చిన వినోద్ చుట్టూ చూశాడు.

ఇప్పటివరకూ నా కళ్ళముందు కనిపించినదంతా కలా… భ్రమా… అయోమయంగా చూస్తూ ఆ పరధ్యానంలోనే బస్సు దిగాడు.

ఫర్లాంగ్ దూరంలో పెద్ద గుంపు కనిపిస్తున్నది. సాంప్రదాయ దుస్తుల్లో లంబాడా మహిళలు, గ్రామీణ మహిళలు ఆహ్వానం పలుకుతూ ఎదురొచ్చారు. పట్నం వాళ్ళ కంటే ముందే వచ్చిన టీవీ చానెళ్ల కెమెరాలు అక్కడ సందడి చేస్తున్నాయి. చడీ చప్పుడు లేకుండా సంఘం కెమెరాలు తమపని తాము చేసేస్తున్నాయి. తన పనిలో బిజీగా మొగులమ్మతో మరో ఐదుగురు. మధ్య మధ్య వాళ్ళకి ఏదో చెబుతోంది ఆమె.
మొగులమ్మను అక్కడ అలా చూడగానే వినోద్, అరవింద్, రేఖలకు తమ దగ్గరి బంధువుని చూసినంత ఆనందం కలిగింది. గబగబా తమ అడుగులు ఆమెవైపుకు అప్రయత్నంగా వేశారు. ఆమెతో చేయి కలిపి కరచాలనం చేశారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పూలమ్మ, సంతోషమ్మ, రూతమ్మలగురించి అడిగారు.

వీళ్ళ అభిమానం చూసి మొగులమ్మ కూడా అంతే ఆత్మీయంగా, ఆనందంగా పలకరించింది. పిల్లల యోగ క్షేమాలడిగింది. పూలమ్మ వచ్చిందని, ఊళ్లోకి పోయిందని చెప్పింది.

ఆ కల్లంలో జొన్న, సజ్జ, కొర్ర, సామలు, రాగులు, అవిసెలు, నువ్వులు, అనుములు, పెసలు, బొబ్బర్లు ఇట్లా వాళ్ళ చేలల్లో పండించిన పాతిక రకాల పంటల కుప్పలు కనిపిస్తున్నాయి. కొందరు జొన్న కంకులు కొడుతున్నారు. కొందరు సజ్జలు కొడుతున్నారు. వాటిలోంచి విత్తనం కంకులు తీసి పక్కకు పెట్టారు.

(ఇంకా వుంది…)

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply