బతుకు సేద్యం – 11

అతను ఆందోళన చెందాల్సిన అవసరమేమీ కనిపించలేదు ఆమెకి. “ప్రకృతి నియమాలు పాటించే చెమట చుక్కల ఐక్యత అది. తమ జీవితావసరాలకనుగుణంగా తమను తాము మలుచుకునే శక్తి వారికుంది. ప్రకృతి నుండి వారు వేరని అనుకోవడం లేదనుకుంటా… భాగం అనుకుంటున్నారని నా అవగాహన. ఆధునిక మనిషి ప్రకృతితో పోరాడి శాసించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ భూమి పుత్రికలు ప్రకృతితో కలసి జీవిస్తున్నారు” వినోద్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో అన్నది రేఖ.

ఆ వెంటనే “ఇండియా హెల్త్ అఫ్ ది నేషన్ స్టేట్స్, 2017 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక మదిలో మెదిలింది. స్త్రీలలో త్రీవ్ర పోషకాహార లోపం ఉన్నదని, అయిదేళ్ల లోపు పిల్లల్లో అధికశాతం ఉండాల్సినదానికన్నా తక్కువ బరువుతో ఉంటున్నారని గుర్తొచ్చి “వినోద్..” ఆమె చెప్పబోతుండగా…

“అవును రేఖా నీవన్నది నిజమే.. ముమ్మాటికీ నిజమే… కాదనను కానీ..”

“ఏమిటండీ… మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నారు. అంత అవసరమా…” తేలిగ్గా తీసేసింది ఆమె. అతని దృష్టి మళ్లించాలన్న ఉద్దేశంతో.

“మన చుట్టూ ఉన్న ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసం చేసేసుకుంటున్నాం.. మనం నివసించేదే ప్రకృతిపై ఆధారపడి. కానీ, దాన్ని మన ఆధీనంలోకి తీసేసుకుంటున్నాం. వాతావరణ మార్పుల గురించి ఈ మధ్య చాలా మాట్లాడుతున్నారు తప్ప కార్యాచరణ లేదు. హూ.. పై పైన ఏం మాట్లాడుకున్నా ఏం లాభం.. మన అంతర్గత పర్యావరణాన్ని మార్చుకోనంత వరకూ..

ఒకవైపు ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని తెగనరికి వినాశనాన్ని విధ్వంసాన్ని సృష్టించే చీడపురుగులు తయారవుతుంటే..” అతని గొంతులో ఆవేశమో ఆవేదనో లేక అవి రెండూ కలగలిశాయో అర్ధంకాని రేఖ భర్తకేసి సూటిగా చూస్తూ “అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్ధమవుతోందా..ఒకదానికొకటి పొంతనలేకుండా..” అన్నది కొంచెం సీరియస్ గానే.

“భయపడకు.. నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. మానవత్వం నిలిపే ప్రయత్నాలకు సవాళ్లు విసురుతూ, తమను తీర్చి దిద్దుకోవాలనుకునే ప్రయత్నాలను కాటేస్తూనే ఉంటాయి కొన్ని డార్క్ రూమ్ ప్రయోగాలు. మాటేసి జీవితాలను విధ్వంసం చేస్తూనే ఉంటాయి.

గ్రామీణ వ్యవసాయ నేపథ్యంలేని అధికారులకు, శాస్త్రవేత్తలకు రైతు సమస్యలు ఏం పడతాయి..?

స్వప్రయోజనాల కోసం, తాము సంపద పోగేసుకోవడం కోసం, ఎన్నటికీ తీరని తమ ఆకలి తీర్చుకోవడం కోసం దేశ ప్రజల భవిష్యత్ ఫణంగా పెట్టడం వాళ్ళకో విషయమే కాదు.” చాలా సీరియస్ గా ఆలోచిస్తూ అన్నాడు వినోద్.

రేఖ మాట్లాడుతుండగా వచ్చి గడపలోనే నిల్చున్న పరిశోధక విద్యార్ధి కిషోర్ కి వినోద్ మాటలు అర్ధమయ్యి అవనట్లుగా ఉన్నాయి. అతని మదిలో విత్తనాల కంపెనీలతో, ఎరువుల కంపెనీలతో కుమ్ముక్కయి కొమ్ముగాసే అధికారులు, నాయకులూ మెదిలారు. వాళ్ళకి లాభం వచ్చే పని చేస్తూ ప్రజలని నట్టేట ముంచుతున్నారని అనుకున్నాడు.

ఆయా కంపెనీల యజమానులు విత్తనాల ముసుగులో రైతులపై వివిధ రకాల ఖర్చులు మోపుతున్నారు. విత్తనాల కంపెనీలు, ఎరువుల కంపెనీలు, పురుగుమందుల కంపెనీలు తమ ఉత్పత్తులను వాడితే పెద్ద మొత్తంలో దిగుబడి వస్తుందని పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం, మోసపూరిత ప్రకటనలు రైతుల్ని నట్టేట ముంచుతున్నాయి. ప్రకటనలు చూసి కోటీశ్వరులవ్వాలని కలలు కన్న రైతు కన్నీటి సముద్రంలో కొట్టుకుపోయాడు. ఇలా తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తున్నదో… అనుకున్నాడు కిషోర్.

“నాకిప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది వినోద్. జీవవైవిధ్యాన్ని ఆ గ్రామీణ మహిళలు అర్ధం చేసుకున్నంతగా మనం అర్ధం చేసుకోలేదేమిటని. మనం చదువుకున్న చదువులు మనకేమిచ్చాయి. మనని ఎటు తీసుకుపోతున్నాయని అని ఆలోచిస్తున్నా” అన్నదామె వచ్చి అతని పక్కనే కూర్చుంటూ.

“నిజమే రేఖా.. నేను సైంటిస్ట్ నని నా ప్రజలకు అవసరమైన వరి వంగడాలు కనిపెడుతున్నానని ఇన్నాళ్లూ ఒకింత గర్వపడేవాడినని చెప్పడానికి సిగ్గుపడుతున్నా.. నా శాస్త్ర ప్రయోగాలు నా జాతికి ఎంత ఉపయోగపడ్డాయని ఇప్పుడు ఆలోచిస్తున్నా… మేము తయారు చేసినవో కనుగొన్నవో బలవంతంగా జనం మీద రుద్దాం తప్ప వాళ్లకు ఏమి కావాలో ఏనాడైనా ఆలోచించామా.. లేదు. కానీ.. మేం ఏమి చేయగలం.. నిజానికి అది మా చేతుల్లో కూడా లేదేమో.. మేమేం కనుక్కోవాలో చెప్పేవాళ్ళు వేరే వున్నారు. వాళ్ళ కనుసన్నల్లోనే మేం పని చెయ్యాలి. బహుశా వాళ్ళ నెత్తి మీద ఉండే బండలు వేరే ఉండి ఉంటాయి. అందరం రైతుల్ని తెలివి లేనివాళ్లుగానే చూసాం. వాళ్లకి మేమే జ్ణానం అందిస్తున్నామని కాలరెగరేసుకున్నాం.. అధిక విలువ అంటే అధిక ఆదాయం తెచ్చే పంటల రకాలను అందిస్తున్నాం అనుకుంటూ వచ్చాను. నేనే కాదు నాలాటి సైంటిస్ట్ లు అందరూ అట్లాగే అనుకుంటారేమో.. పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, కోళ్లు, చేపలు అన్నీ అంతేగా ప్రయోగశాలల్లోంచి వచ్చినవేగా వాడేది. ఇప్పుడవేవీ సహజమైనవి కావు.
స్థానికంగా ముడిపడినదేదయినా మంచిదే..సహజమైనదే. వాళ్ల జ్ఞానం ఏ పుస్తకాల్లోనూ కనిపించదు. కానీ పుస్తకాల్లో చదువుకున్నదే జ్ఞానం అనుకుంటాం అది ఎంత తెలివి తక్కువ తనమో నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది. చెత్త కుప్పల్లోకి తోసేసిన జ్ఞానాన్ని ఏరుకొచ్చి, వెతికి పట్టుకొచ్చి విధ్వంసం అయిన తమ బతుకుల్ని పండించుకోవడంలోనే వాళ్ళ విజ్ఞత తెలుస్తున్నది. లేమి ప్రోత్సహించిన ఆలోచనల్లోంచి, చుట్టూ విషాదం అలుముకున్న పరిస్థితుల నుండి వారసత్వం నింపుకున్నారు. వాళ్లకు పేరాశ లేదు. వాళ్లకు తెల్సిందల్లా బతకడం, బతికించుకోవడం తప్ప. అది రికార్డు కావాలి. తర్వాతి తరాలకు అందాలి. మౌఖికంగా అందడంలో కొంత మిస్ అయిపోవచ్చు” తను ఆ మహిళల నుండే విన్న వారి జీవితాన్ని రకరకాలుగా విశ్లేషిస్తున్న వినోద్ ఆలోచనల్లో ప్రకంపనలు.

“అదేంటి సార్.. వ్యవసాయరంగంలో అనేక మార్పులు తెచ్చి వ్యవసాయరంగాన్ని కాపాడాం అని, రైతుల ఆదాయం పెంచామనీ, వ్యవసాయరంగంలో సుస్థిర అభివృద్ధిని సాధించామని సంబరపడే మీరేనా ఈ మాటలనేది..?” ఆశ్చర్యపోతూ లోనికి వచ్చాడు కిషోర్. అతని వెనకే అతని మిత్రుడు సాయిప్రసాద్ కూడా లోనికి వచ్చాడు.

“అరె.. కిషోర్.. మీరెప్పుడు వచ్చారు. చూడనే లేదే.. రండి కూర్చోండి. ఊరి నుంచి ఎప్పుడొచ్చారు” అంటూ లేచి ఇద్దరికీ కుర్చీ చూపింది రేఖ. సాయి ప్రసాద్ కి వినోద్ రేఖలను పరిచయం చేశాడు కిషోర్.

“అవును కిషోర్.. నీకు ఆశ్చర్యం కలగడంతో వింతేమీ లేదు. ఒక నెల క్రితం వరకూ నేను అలాగే ఆలోచించాను. కానీ ఈ మధ్య ఆలోచిస్తుంటే మన ప్రయోగాల్లోని డొల్లతనం స్పష్టం అవుతున్నది. మన జీవితాల్లోకి రోడ్లు వచ్చాయి. సైకిళ్ళు వచ్చాయి. ట్రాక్టర్లు వచ్చాయి. ట్రక్కులు మొదలయ్యాయి. అట్లాగే ఇరవయ్యో శతాబ్దంలో ఆధునిక టెక్నాలజీని వ్యవ్యసాయంలో ఉపయోగించడం మొదలయింది. సాంప్రదాయంగా, స్థానికంగా తయారుచేసుకున్న నైపుణ్యాలు, పద్దతుల స్థానంలో యంత్రాలు చోటు చేసుకున్నాయి. అదే విధంగా అధిక దిగుబడి లక్ష్యంగా కొత్తరకం విత్తనాలు కనుగొన్నాం. సహజంగా వచ్చిన విత్తనాలకు బదులుగా కొత్త విధానాల్లో హైబ్రీడ్ విత్తనాలు రైతు ముందు పెట్టాం. అవే మంచివని ఊదర గొట్టాం. అప్పటి నుండి జన్యుపరంగా ఉన్నతమైనటువంటి విత్తనాలు మాయం అవడం మొదలైంది. సహజంగా ఉన్న వాటి జీవిత చక్రంలో మార్పులు వచ్చాయి. రైతు ప్రతి సీజన్లో హై బ్రీడ్ విత్తనం కొనడం మొదలు పెట్టాడు. అంతర్జాతీయ విత్తన సంస్థలు విత్తనాన్ని తన గుప్పిట బంధించాయి.”

“హైబ్రీడ్ విత్తన ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమైంది సార్” ప్రశ్నించాడు అప్పటివరకూ ఆసక్తిగా విన్న సాయిప్రసాద్.

“పంతొమ్మిదివందల అరవైలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం అయింది. ప్రపంచ ఆహార వ్యవస్థ ప్రైవేటు పరం అయింది. క్రమేణా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంప్రదాయ వ్యవ్యసాయ పద్ధతులు క్షిణించడం మొదలయ్యాయి. ఎక్కువ ఉత్పత్తి, తక్కువ శ్రమ ఎక్కువ డబ్బు సంపాదన లక్ష్యంతో సాగింది వ్యవ్యసాయం. రైతు అందుకోసం కలలు కనే విధంగా తయారు చేసింది వ్యవస్థ. అట్లా మిశ్రమ పంటల విధానంలోంచి ఏకపంట విధానంలోకి వచ్చేశాడు రైతు. ఆ తర్వాత ఆహారపంటల కంటే వ్యాపార పంటలద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని వాటిని పరిచయం చేశాయి ప్రభుత్వ విధానాలు, విత్తన కంపెనీలు. అలా తమకు తెలియకుండానే కొత్త వ్యవ్యసాయ విధానంలోకి వచ్చేశారు రైతులు.

ప్రకృతికి దూరమవుతూ అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృస్టిస్తున్నాం. అనారోగ్యకరమైన ఆహారం సృస్టిస్తున్నాం. సృష్టిని పునఃసృష్టిస్తున్నామని, ప్రకృతిని శాసిస్తున్నామని విర్రవీగుతున్నాం.
కానీ.. ఒక్క సారి వెనక్కి తిరిగి చూడు. పరిస్థితి అర్ధమవుతుంది. మనం ప్రకృతికి విరుద్ధంగా చేసే ప్రతి పనీ వినాశనానికే దారితీస్తున్నది. అంత దాకా ఎందుకు.. మనం సృష్టించే నూతన వంగడాలే తీసుకో.. అవి అధిక దిగుబడి ఇవ్వడం కోసం రసాయన ఎరువులు అధికంగా వాడమంటాం. చీడ పీడలు తట్టుకోవడానికి క్రిమినాశినిలు తయారు చేస్తాం. అవి వాడమంటాం.

కొన్న విత్తనం అధిక దిగుబడి నివ్వడం కోసం రైతు రసాయన ఎరువులు వాడడం మొదలు పెట్టాడు. అట్లాగే అవి చీడపీడల నుండి తట్టుకోవడం కోసం, అవి రాకుండా కాపాడుకోడం కోసం, వచ్చిన చీడ పీడల్ని వదిలించుకోవడం కోసం రకరకాల పురుగుమందులు కుమ్మరించడం మొదలైంది. విత్తనం దగ్గరనుండి అన్నీ రైతు డబ్బు ఖర్చు చేసి కొనాల్సిందే. ఇంత చేసినా పంట ఎలా వస్తుందో తెలియదు.

ఈ విధానంలో మనం రైతుకు అందిస్తున్నదేమిటీ.. జీవుల పాలిట విషాలే కదా.. మన ప్రయోగాల్లో.. ప్రయోగశాలల్లో ఎప్పుడూ కొత్తగా విషం ఊరుతూనే ఉంటుంది. జనాన్ని ఊరడిస్తూ నెమ్మదిగా ఆ విషం నింపుతూనే ఉంటాం. రోజూ కాటేస్తూనే ఉంటాం. ఇప్పుడు చూడు.. ఎవరి రక్తం చూసినా అది స్వచ్ఛంగా కనిపించదు. అంతా విషపూరితమై.. శరీరంలోని ఆణువణువూ విష ప్రభావంలోనే.. కానీ.. వాళ్ళ శరీరాల్లోనూ, వాళ్ళ రక్తం లోనూ ఇంత విషం ఉండదని నమ్ముతున్నాను. మనం ఆ విషం తొలగించుకోవాలంటే.. నెమ్మదిగానయినా వాళ్ళు పండించే పంటలే మనకి శరణ్యం” భవిష్యత్ దర్శనం చేస్తూ వినోద్.

“ఏంటో సార్.. ఈ రోజు మీరంతా కొత్తగా అగుపిస్తున్నారు. తక్కువ మాట్లాడే మీరు ఇంత మాట్లాడేస్తున్నారు.. ఏదో ఆరాటపడుతున్నారు..” అని రేఖవైపు తిరిగి. “మేడం.. అప్పటి నుండి సార్ వాళ్ళు.. వాళ్ళు.. అంటున్నారు. ఇంతకీ వాళ్లెవరు?” అడిగాడు కిషోర్.

“నిస్సారమైన భూముల్ని ప్రకృతి సేద్యంతో పునరుజ్జివింప చేస్తున్న చిన్నరైతులు. మహిళా రైతులు వాళ్ళు. దేశాన్ని వ్యవసాయ సంక్షోభం నుండి బయటపడేయగల మార్గాలు చూపుతున్న పేద దళిత రైతక్కలు. వ్యవసాయ సంస్కృతిని, దాని చుట్టూ అల్లుకున్న సంప్రదాయాలు, పర్యావరణం, జీవవైవిధ్య జ్ఞానాన్ని గమనిస్తూ ప్రకృతికి అనుగుణంగా సేద్యం చేసే పెద్ద మనసున్న రైతులు” క్లుప్తంగా చెప్పి లోనికి వెళ్ళింది రేఖ.

రేఖ చెప్పిన విషయం వింటుంటే చాలా గొప్పగా, గర్వంగా అనిపించింది కిషోర్ కి. మేడం, సార్ వాళ్ళ గురించి ఇంత ఆలోచిస్తున్నారంటే, వారిని తలుచుకుంటున్నారంటే నిజంగా వారి అవగాహన, ఆచరణ అంత గొప్పగా ఉండే ఉంటుంది. కళ్ళు పత్తికాయలు విచ్చుకున్నట్లుగా విప్పి వినోద్, రేఖలకేసి ఆశ్చర్యంతో చూస్తూ విన్నాడు కిషోర్.

“నిస్సారమంటే చెప్పాలనిపిస్తున్నది. రెండురోజులుగా వివిధ గ్రామాల్లోని ఈ ప్రాంతపు రైతులను కలుస్తున్నాను. వారు ఎకరానికి అరవై బస్తాలు పండించినామని చాలా గొప్పగా, గర్వంగా చెబుతున్నారు. అదేసమయంలో ఒక పంట కాలంలోనే ఏడెనిమిది సార్లకు తక్కువ కాకుండా ఎరువులు కుమ్మరిస్తున్నామనీ చెబుతున్నారు. పురుగుమందులు విరివిగా పిచికారీ చేస్తున్నారు. కొందరయితే నేను పది సార్లు రసాయనాలు వాడాను అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇట్లయితే అతి తక్కువ కాలంలోనే నేలలో ఉన్న సేంద్రియ పదార్ధం, సూక్ష్మ జీవులు అంతరించిపోతాయి. నేల జవమూ, జీవమూ కోల్పోయి ఏడాదికేడాదికి నిస్సారమైపోవడమే కదా సార్.. అంటే భూమి చచ్చిపోయినట్లే కదా సార్” అన్నాడు కిషోర్ తో వచ్చిన అతని జూనియర్ సాయిప్రసాద్.

“అదేనయ్యా.. నా బాధ. నేల సహజ సారాన్ని పీల్చి పిప్పి చేసేసి తర్వాతి తరాలకు ఏమి అందిస్తున్నాం..? తర్వాతి తరాల దాకా ఎందుకు.. ఇంకా కొన్నాళ్ళు పోతే ఇంకా ఎక్కువ రసాయనాలు కుమ్మరించినా దిగుబడులు తగ్గిపోతాయి.. ఒకే పంట ఏళ్ల తరబడి సాగుచేస్తూ పోతున్నారు. ఇప్పుడు చేతికొచ్చే సొమ్ములకిచ్చే విలువ భూమికి ఇవ్వడంలేదు.. భూమి చచ్చిపోయిందంటే.. మనమూ చచ్చిపోయినట్లే కదా.. మన చదువు, తెలివి, జ్ఞానం ఏమి సాధించినట్లు ? ఏం సంపాదించినట్లు ?” లేచి నుంచొని అస్థిరంగా అటూ ఇటూ కదులుతూ వినోద్.

సంఘం మహిళలతో పరిచయం కాకముందు తన పరిశోధనలతో ఎంతో సంతోషంతో ఉన్న వినోద్, ఎలాంటి చీకు చింతా లేని వినోద్ లో గత నెలరోజుల నుండి ఘర్షణ, సంఘర్షణ మొదలైంది. అప్పటినుండి ఆధునిక వ్యవసాయం రాకముందు ఉన్న వ్యవ్యసాయ పద్దతులను గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. వ్యవసాయ విద్యార్థిగా ముందుకూడా చదివినప్పటికీ అది పరీక్షలకోసం మాత్రమే. ఇప్పుడు చాలా సీరియస్ గా చదివాడు. ఆలోచిస్తున్నాడు. ప్రకృతి గురించి, పర్యావరణం గురించి, భూమి గురించి ఆలోచిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పుల గురించి చదువుతున్నాడు.
రాబోతున్న పెను ముప్పు అతని కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నది.

అందరి మధ్యా కొద్ది మౌనం తర్వాత…

“వ్యవసాయం అంటే జీవవైవిధ్యం. ఎక్కువ రకం పంటలు సాగులో ఉండడం. ఒకే రకం పంట కాకుండా మిశ్రమ పంటల సాగు వల్ల నేల సారవంతం అవుతుంది. సురక్షితంగా ఉంటుంది. వ్యవసాయం అంటే రైతు, భూమి, పంట అవినాభావ సంబంధం. ఈ విషయం అర్థమవడానికి ఈ వ్యవసాయ శాస్త్రవేత్తకి ఇన్నాళ్లు పట్టింది. ఇక మన వాళ్లకు ఎప్పటికి అర్ధమవుతుందో..” వినోద్ దిగులు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా వచ్చిన జీర.

గొంతు సవరించుకుని “వర్షానికి, నేలకు తగిన విత్తనాల ఎంపిక, వాటిని నిలువ చేయడం, వినియోగించడం తదితర అనేక విషయాల్లో వారి జ్ఞానం అమోఘం. ఆ జ్ఞానాన్ని మనం తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది”. అన్నాడు వినోద్.

“అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటలు పండించమని మన ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి కదా సార్. ప్రభుత్వాలు తాను చెప్పిన పంటలు పండించే వారికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నది. రుణ మాఫీలు చేస్తున్నది. విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నది. రైతు మీద భారం తగ్గుతున్నప్పుడు,అధిక ఆదాయం వస్తుందన్నప్పుడు మరి ఏ రైతైనా అవే కదా పండిస్తారు..” రైతును తప్పు పట్టనవసరంలేదన్న భావం ధ్వనిస్తుండగా కిషోర్.

“నువ్వన్నది నిజమేనయ్యా.. కానీ, చారిత్రకంగా చూస్తే, ఒకప్పుడు తెలంగాణాలో సంఘం మహిళలు గాలిపంటలు అని పిలిచే చిరుధాన్యాలు ప్రధానంగా ఉండేవి. మన ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్లే పోషక విలువలు అంతగాలేని వరిపంటను ప్రోత్సహించడం ఎంత తప్పో భవిష్యత్ చిత్రం చెబుతున్నది. మన ప్రభుత్వాల విధానాలు పెద్ద రైతులకు, భారీ వ్యవసాయానికి,కొన్ని వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.నిజానికి మనం ఆలోచించాల్సింది చిన్న సన్నకారు రైతుల గురించి. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టు పెద్ద రైతులను చూసి చిన్నరైతులు ఆ పంటల వైపే పోతున్నారు.” అంటూ ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగాడు.

“ఒక్కోసారి ఇబ్బంది పడ్డా ప్రభుత్వం సబ్సిడీలు, రుణమాఫీలు, రైతుబంధుఇచ్చి ఆదుకుంటున్నది కదా. అన్నీ రైతుల మంచి కోసమే కదా సార్..” అన్నాడు సాయిప్రసాద్.

“ఆఫ్ కోర్స్, ఇక్కడ మీకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఎక్కడికెళ్లినా ప్రభుత్వం అది చెయ్యడం లేదు, ఇది చెయ్యడం లేదు అంటూ ప్రభుత్వం పై ఫిర్యాదులు మనకు వినిపించడం సహజం. మీకూ అది అనుభవమే అయ్యుండొచ్చు. ఆశ్చర్యం ఏమంటే, ఈ మహిళలు దేనికోసమూ ప్రభుత్వం మీద దేనికీ ఆధారపడడం లేదు. వీళ్ళ వ్యవసాయానికి నీరు అవసరం లేదు. కాబట్టి కరెంటుతో, బోర్లతో పనేలేదు. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారకాలు, ఉత్పత్తి, మార్కెటింగ్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. ఒక చిన్న సంఘం పరిధిలో ఆలోచిస్తూ అంత గొప్పగా అభివృద్ధి చెందారు. ఎవరి మీదా ఆధారపడని స్వశక్తి వంతులు వాళ్ళు. స్వాలంబన సాధించారు” అట్లా చెబుతున్నప్పుడు వినోద్ కంఠంలో ఆ మహిళల పట్ల ఆరాధ్యభావం తొణికిసలాడింది.

“దేశంలో అందరూ అట్లా అవ్వొచ్చు కదా..” ఉడకబెట్టిన పల్లికాయలు ప్లేట్లలో పెట్టుకొచ్చిన రేఖ లోపల్నించి వస్తూ.

“మహిళలా..” రేఖ చేతిలోని ప్లేట్ అందుకుంటూ అన్నాడు ప్రశ్నార్ధకంగా కిషోర్.

సరిగ్గా అదే సమయంలో “అవేమీ లేని వ్యవసాయం ఎట్లా..”అంటూ అందరికేసి ప్రశ్నార్ధకంగా చూస్తూ ఆగాడు సాయిప్రసాద్.

“అవును కిషోర్. ఆ మహిళా రైతుల మాటలు వింటే ఇలాంటి మహిళలూ మన మధ్యే ఉన్నందుకు గర్వం కలిగింది. వాళ్ళ పరిచయం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. నా దృష్టిలో వాళ్ళు సెలెబ్రిటీలు. ఆఫ్ కోర్స్ జనం ద్రుష్టిలో ముతక మనుషులు. మేమిప్పుడు వాళ్ళ అభిమానులుగా మారిపోయాం. అలాంటి వాళ్ళను కలిసిన తర్వాతే ఇక్కడ మేధోమదనం మొదలైంది” నవ్వుతూ అన్నది రేఖ తానూ కూర్చుంటూ.

“వాళ్ళ సంగతి ఏమో గానీ.. మేడం ఇంతకు ముందు మీరన్నట్లు దేశమంతా అట్లా కావాలంటే.. అట్లా చేయడానికి అవసరమైన అంచెలంచెల పాలనా వ్యవస్థలున్నాయి మనకి. కావలసిన మానవ వనరులు, సహజ వనరులు, ఆర్ధిక వనరులు అన్నీ ఉన్నాయి. అయినా స్వాలంబన దిశగా లేరు మన రైతులు” అన్నాడు సాయిప్రసాద్.

“అదే.. ఎందుకు లేరు..? ఎక్కడుంది లోపం..?” పల్లికాయ వలుస్తున్నవాడల్లా ఆగి పరిశోధక విద్యార్థులనే చూస్తూ వినోద్ ఆవేదనగా.

“తమ ప్రజల ఆహార భద్రత ప్రభుత్వ బాధ్యత. అందుకేగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడైతే సన్న బియ్యం ఇస్తున్నారట. పప్పులు, నూనె వంటి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు… ఇంతకన్న ఇంకేం కావాలి ? సార్” ప్రశ్నించాడు కిషోర్.

“కిషోర్ ఒక్కసారి సావధానంగా ఆలోచించు. ఆహార భద్రత అంటే తిండి పెట్టటమే కాదు కదా.. ఏదో ఒక దాంతో పొట్ట నింపడం కాదు. ఆహారమంటే అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం. ఆ ఆహారమేకదా మనని ఆరోగ్యంగా ఉంచేది. అది ప్రజలందరికీ అన్ని వేళలా అందించడమే ఆహార భద్రత. కానీ మనదేశంలో ఎంతమంది ప్రజలకి పౌష్టికాహారం అందుతున్నది? దారిద్య్రంలో మక్కిపోతున్న ప్రజల ఆకలి తీరుతున్నదా.. అన్నది మొదటి ప్రశ్నయితే, తీరినవారికి అందుతున్నది సమతుల ఆహారమేనా..అన్నది రెండో ప్రశ్న. సరే ఏదో ఒక ఆహరం అదీ సమతుల ఆహారం అందిస్తున్నాం అనుకుందాం. అందులో ఉన్న కృత్రిమ రసాయనాల, పురుగుమందుల పాలెంత?

ఇంతకు ముందే మీరు చెప్పినట్టు మన తినే తిండి తిండే కాదు. రసాయనాల విషం. విషం నిండిన తిండి మనకు భద్రతనిస్తుందా..? ఇవ్వదు. ఆహార భద్రత అంటే కాలుష్యం కాని తిండి పెట్టాలి. విషం లేని తిండి పెట్టాలి. ఈ విషయంలో నీకూ నాకూ ఎలాంటి పేచీ లేదనుకుంటా.. ఇంతకు ముందు సాయిప్రసాద్ అన్నాడు బస్తాలకు బస్తాల ఎరువులు, పురుగు మందులు పంట పొలాల్లో వాడుతున్నారని. అట్లా వాడడానికి కారణం ఎవరు? ఒకరకంగా మనం అంటే అవి కనుగొనే మనలాటి పరిశోధకులు. రసాయన ఎరువుల్ని, వాటి ఉపయోగాన్ని నియంత్రణ లేకుండా ప్రోత్సహించే ప్రభుత్వాలు. వాటికిచ్చే సబ్సిడీ లు.
తెల్లారి లేచింది మొదలు టీవీల నిండా వాటిని గురించిన ప్రకటనలు. అవన్నీ దాటుకుని రైతు ఎక్కడికి పోగలడు? ఆ రసాయనాలన్నీ ఎక్కడికి పోతున్నాయి..? ఏం చేస్తున్నాయి??” వరద ఉధృతి లాంటి ఆవేశంతో వినోద్.

“దేశంలో ఉండే రైతులందరికీ ఒకేసారి రసాయనాల వాడొద్దని సిఫారసు చేయడమో లేక రసాయనాల వాడకాన్ని నిషేధించడమో, నియంత్రించడమో చేస్తే..” పరిష్కార మార్గాన్వేషణ చేస్తున్న రేఖ.

“వావ్.. బ్రహ్మాండంగా ఉంటుంది మేడం” ఆనందంగా కళ్ళు పెద్దవి చేసిన కిషోర్.

ఆమెకేసి విస్మయంగా చూస్తున్నాడు సాయిప్రసాద్.

“నవ్వులాటగా అన్నప్పటికీ చాలా మంచి విషయం రేఖా..” అభినందనపూర్వకంగా వినోద్.

” నేను సరదాగా అన్న మాటలు కావివి. సీరియస్ గానే నేనూ ఆలోచిస్తున్నాను వినోద్” అన్నది రేఖ.

“నువ్వన్నట్లుగా జరిగితే, ఏ రసాయనాలూ లేకుండా పంటలు పండిస్తే అవి తయారు చేస్తున్న పెద్ద పెద్ద స్వదేశీ, విదేశీ కంపెనీలతో పని ఉండదు. పెద్దమొత్తాల్లో పెట్టుబడులు అవసరం ఉండదు. అట్లా జరిగిన నాడు వ్యవసాయ,సామాజిక, ఆర్ధిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులొస్తాయి…” వినోద్ మాటలకు అడ్డుతగులుతూ”కానీ అట్లా.. ఎప్పటికైనా జరుగుతుందంటారా.. సార్..” ఉత్సుకత లోంచి నిరుత్సాహం ఆవరిస్తుండగా కిషోర్.

“ఏం ఎందుకు జరగకూడదు. ఎంచక్కా జరగొచ్చు. కానీ జరగనివ్వరు. ప్రజలకోసం పనిచేస్తున్నామనే ప్రజా ప్రభుత్వాలకు, ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులకు రైతులకంటే దేశ, విదేశీ విత్తన కంపెనీలు, ఎరువుల కంపెనీలు అంటేనే ఎక్కువ ప్రేమ. అవి ఇచ్చే కమిషన్లు అంటే మమకారం ఎక్కువ. తమ సపోర్టు, సహకారం వాళ్ళకే ఇస్తున్నవి. ఇకముందు అందుకు భిన్నంగా జరుగుతుందని అనుకోను. అందువల్ల రైతుకి లాభం జరుగుతున్నదా.. నష్టం జరుగుతున్నదా అన్నది వాళ్ళకనవసరం. ఆదిశగా అసలు ఆలోచించరు. నాయకుల ప్రభుత్వ పెద్దల ఆలోచనలు మారాలంటే దేశమంతా రైతుల నుండే పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాలనిపిస్తున్నది. లేదా రసాయన రహిత ఆహరం కావాలని ప్రజలనుండి పెద్ద ఎత్తున ఆందోళనలు రావాలి. అప్పులు, ఆత్మహత్యలు లేని వ్యవసాయమే చెయ్యాలి. అట్లా జరగాలంటే జరుగుతున్న నష్టం గురించి పెద్ద ఎత్తున ప్రచారం కావాలి…” ఆలోచనల్లో ఒక స్పష్టత రూపుదిద్దుకుంటుండగా వినోద్.

“రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..! చడీ చప్పుడు కాకుండా ఒక్క కలం పోటుతో పెద్ద నోట్లు నిషేధించారు. అట్లాగే ఇది చేయలేరా.. ప్రజలకు నచ్చ చెప్పలేరా.. నిజంగానే.. దేశానికి మంచి జరుగుతుందేమోనని ప్రజలు అష్టకష్టాలు ఓర్చుకోలేదా.. అట్లాగే ఇదీ…” అన్నది రేఖ.

“నిజ్జంగా ప్రజలంటే ప్రేమ ఉంటే.. చెయ్యాలన్న ఆకాంక్ష ఉంటే ఖచ్చితంగా చెయ్యొచ్చు మేడం. కానీ అది లేకనే కదా..ఇంతకు ముందు సార్ చెప్పినట్టు వాళ్ళ ప్రయోజనాలు వేరు కదా..” అన్నాడు కిషోర్.

తమను అందలం ఎక్కించి ఆశల పల్లకిలో ఊరేగించే తెరవెనుక మనుషుల కనుసన్నల్లో నడవడం తప్ప స్వంతంగా నిర్ణయాలు తీసుకునే సాహసం చెయ్యగలవా.. ఈ ప్రభుత్వాలు.. బుర్రకు పదును పెడుతూ ఆలోచిస్తున్నాడు కిషోర్.

వ్యవసాయం గురించి ఇంత లోతుగా ఆలోచన చెయ్యలేదు గానీ చూస్తుంటే రైతు విషవలయంలో చిక్కుకుని విలవిలలాడుతూన్నట్టుగా సాయిప్రసాద్ కు తోస్తున్నది.

గుడ్డెద్దు చేలో పడ్డట్టు సాగే పరిశోధనలు.. దిగుబడులను ప్రభావితం చేసే వందలాది కారణాల్లో ఒక్కోదాన్ని పట్టుకుని ఒక్కో శాస్త్రవేత్త ప్రయోగాలు చేస్తుంటాడు. దిగుబడిని ప్రభావితం చేసే కారణాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరానికి మారిపోతాయన్న ప్రాథమిక విషయం మర్చిపోయి ప్రయోగాలు చేస్తుంటాం.

దిగుబడిని కేంద్రంగా చేసుకుని సాగే ఆధునిక పరిశోధన ప్రకృతిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నది. ప్రకృతి సిద్ధాంతాలకు చాలా దూరం జరిగి ఉంటున్నాయి ఆ ప్రయోగాలు. రైతు సమస్యలతోనూ పొంతన ఉండదు. ఆ ప్రయోగాలు, పరిశోధనల ఫలితాలు రైతులకు అనుకూలంగా కాకుండా పరిశోధకులకు అనుకూలంగా సాగుతాయి.

ప్రభుత్వ ఆధీనంలోని వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ కలసి పనిచేస్తే ప్రజల పోషకాహార భద్రత తెలుస్తుంది. ఒకదానికొకటి లింక్ చేసి సమన్వయంతో పని చేయడం వల్ల సమస్యకు పరిష్కారాలు ఎదురుగానే కనిపిస్తాయి. వాటిని అడ్రస్ చెయ్యగలిగే కెపాసిటీ ఉంటుంది. కానీ ఆలా జరగట్లేదు. ఎవరి కుంపటి వాళ్లదే. పండించే పంటలకు ప్రజల ఆహారానికి మధ్య సంబంధం, సమన్వయం వ్యవసాయశాఖకి ఆరోగ్య శాఖకి ఉండాలి. కానీ అలా జరగదు.

ఈ సృష్టిలో అన్నింటిలో ఎంత ఏకత్వం ఉందో భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉన్నది. వైవిధ్యమే సృష్టి లక్షణం కదా.. సృష్టిలోని జీవరాశులు అన్నీ ఒకదానిమీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయని మనందరికీ తెలిసిన విషయమే.

మనిషి తన అవసరాలకు ప్రకృతి పై ఆధారపడ్డాడు. ప్రకృతిలేనిదే మనిషి జీవితమూ ఉండదేమో..! కప్ప నీళ్లలో కీటకాల్ని తిని బతుకుతుంది. పాములు కప్పని తిని బతుకుతాయి. గద్దలు పామును తింటాయి. ఇట్లా సృష్టిలో ప్రతిదీ మరో దానిపై ఆధారపడి జీవిస్తాయి. చివరికి చచ్చిపోయాక అన్నీ మట్టిలో కలిసిపోతాయి. మట్టికి బలాన్నిస్తాయి. ఇదంతా ఒక వృత్తం. అంటే గొలుసుకట్టు విధానంలో ఉంటుంది. ఆ వృత్తంలో ఏ ప్రాణిని అంతరించినా ఆ ప్రభావం మిగతావాటిపై పడుతుంది. మిగతా వాటికీ ముప్పు ఉంటుంది. ప్రక్రుతి సహజంగా జరిగిపోతున్న క్రియలో మనం జోక్యం చేసుకుని రసాయనాలు వెదజల్లుతున్నాం. మన వినాశనానికే కాదు ప్రకృతి విధ్వంసానికీ బాటలు వేస్తున్నాం.

ప్రకృతి తత్వం పట్టించుకోకుండా సంపాదనలో సుఖసంతోషాలు వెతుక్కుంటున్నాం. ఆ తాపత్రయంలో ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. జీవితాన్ని కోల్పోతున్నాం. లేదా అటు చావనూ లేక ఇటు చిగురించనూ లేక కొట్టుకుంటూ ఉంటాం.. అదేగా జరుగుతున్నది మన జీవితాల్లో. కానీ.. వాళ్ళ జీవితాలలా కాదు. మొగులమ్మ.. సంతోషమ్మ.. రూతమ్మ లాంటి వాళ్ళ జీవితాలు చిగురించాయి.కొమ్మలు వేశాయి రెమ్మలు వేశాయి. పూతకొచ్చి పంటనిచ్చాయి. వృక్షాల్లా మారి నీడనిస్తున్నాయి. ఎటునుండి మరెటో పోయి అటూ ఇటూ చక్కర్లు కొట్టి సంఘం మహిళల జీవితాల దగ్గరకొచ్చి ఆగుతున్నాయి వినోద్ ఆలోచనలు.

ఈ ప్రపంచంలో మనిషి తప్ప ప్రతి జీవి ప్రకృతి సహజంగానే, పర్యావరణానికి అనుబంధంగానే తింటాయి. బతుకుతాయి. మరి మనిషి.. తనకు అనుగుణంగా పర్యావరణాన్ని, ప్రకృతిని మార్చేసుకుంటున్నామని అనుకుంటున్నాడు. సహజ వాతావరణానికి దూరంగా రసాయనికంగా, కృత్రిమంగా తయారయిన ఆహరం తీసుకుంటున్నాడు. అది శరీర ధర్మాల్ని అపసవ్యంగా మార్చేస్తుంది. అందుకే ఈ అనారోగ్య పరిస్థితులేమో.. స్థానికంగా సహజంగా పండే ఆహారధాన్యాలు తింటే ఇప్పుడొస్తున్నటువంటి తీవ్రమైన ఏ ఆరోగ్య సమస్యా రాదు. అదే సంఘం మహిళల ఆరోగ్య రహస్యం. మనకి ఏర్పడే ఆహార సంక్షోభాలు ప్రకృతి వల్ల వస్తున్నాయని నెపం వాటిపైకి నెట్టేస్తున్నాం కానీ మన గొంతెమ్మ కోర్కెల వల్లనే, మన అత్యాశ వల్లనే అని గమనించడం లేదు. లాభాల పరుగులో రైతులు డబ్బు సంపాదన కోసం ఎగబడుతున్నారు. అయితే లాభాలు లేదంటే నష్టాలు. ఒకరికి లాభం వస్తే దాన్ని భూతద్దంలో పదిమందికి నమూనాగా చూపుతారు. అదే పది మందీ నష్టపోతే దాన్ని మాత్రం అసలు పట్టించుకోరు. అధిక రసాయనాలతో, కృత్రిమ పద్ధతుల్లో వచ్చే సంపాదన కొద్దికాలం మన గొంతెమ్మ కోరికలు తీరుస్తుందేమో గానీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకు హాస్పిటళ్లు.. డాక్టర్లు, మందులూ.. శరీరాన్ని కుళ్ళబొడుస్తూ.. రేఖ మదిలో సుళ్ళు తిరుగుతూ.

బయటి వాతావరణం చల్లబడింది. చల్లని ఆహ్లాదకరమైన గాలి పరదాలను తోసుకుని గది లోపలికి వచ్చిగిరికీలు కొడుతూ చోద్యం చూస్తున్నది. అంతఃప్రపంచంలో ఎగిసిపడుతున్న అలల్లాటి ఆలోచనల్లో.. ఎవరికి వారు. అక్కడి వాతావరణం చూస్తుంటే ఉప్పెన ముందు ప్రశాంతత లాగా.. రగులుతున్న ఆలోచనల్లో.. దీర్ఘాలోచనలో.. అందరూ ఎవరికీ వారుగా..

గంభీరంగా ఉన్న వాతావరణంలోకి కొత్త ఊసులు మోసుకొస్తున్నది గోరింకల జంట. అక్కడ ఎవరూ లేరనుకున్నాయో లేదా ఉంటే మాకేంటి అనుకున్నాయో గాని పైన వేలాడుతున్న ఫ్యాన్ రెక్కలకు అటొకటి ఇటొకటి వాలి ఒకదాన్నొకటి కవ్వించుకుంటూ ఎగిరి గిరికీలు కొడుతూ వచ్చి మళ్ళీ అక్కడే చేరుతున్నాయి. సరాగమాడుతున్నాయి. కువకువలాడుతూ దగ్గరవుతున్న ఆ జంట. మేమేం తక్కువా అన్నట్లు పిచ్చుకల జంట లోపలికొచ్చింది. గదంతా పైకి కిందకి, ఆ పక్కకు ఈ పక్కకు కలియదిరుగుతూ పోట్లాడుకుంటున్నాయో.. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయో మరి.. వాటి కిచ కిచ లు అప్పుడప్పుడూ వినిపిస్తున్నా అదేమీ గమనించే స్థితిలో లేరు అక్కడి వాళ్ళు.

నిశ్శబ్దం ఆవరించిన ఆ గదిలో ముంచెత్తుతున్న ఆలోచనల ప్రకంపనలకు భంగపరుస్తూ వారిలో చలనం కలిగిస్తూ రేఖ మొబైల్ పెద్దగా రింగవడం మొదలయింది.

టీపాయ్ మీదున్న మొబైల్ అందుకుని చూసింది రేఖ. క్లాస్ మెట్, ఆత్మీయ మిత్రురాలు పద్మ.

ఆ సమయంలో పద్మ ఫోన్ ఊహించలేదు. కారణం ఆమె ఆదివారాలు తప్ప ఫోన్ చేయదు. ఆదివారం సాయంత్రం ఏ కార్యక్రమాలూ లేవనుకుంటే ముందు మెసేజ్ చేసి ఆ తర్వాత ఫోన్ చేస్తుంది. ఏమి చేసినా చాలా పద్దతిగా, ప్లాన్ చేసుకుని చేస్తుంది.

అటువంటిది ఇప్పుడు ఉరుములేని పిడుగులా శనివారమే తన ముందుకొచ్చిందంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది అనుకుంటూ ఫోన్ తీసుకుని వాకిట్లోకి నడిచింది రేఖ.

“ఏమిటే ఈ సర్ ప్రైజ్”

“అవునే.. సర్ ప్రైజ్..” పెద్దగా నవ్వేసింది పద్మ.

“ఏమిటి మళ్ళీ ప్రమోషనా.. లేక ఉద్యోగం మారుతున్నావా…”

“కాదు ఉద్యోగం మానేస్తున్నాను”

“వాట్.. మానేస్తున్నావా.. నీకిదేం పొయ్యేకాలం..? లేనివాళ్లు లేక ఏడుస్తుంటే ఉన్న వాళ్ళు వదులుకోవడం ఏంటి ? ఏం తమాషానా..” గుమ్మం నుండి గేటుదాకా అటూ ఇటూ నడుస్తూ మాట్లాడుతున్నదల్లా ఆగి అన్నది రేఖ.

“లేదే నిజ్జంగానే చెప్తున్నా.. ఇంకా మానెయ్యలేదనుకో.. నిన్న జరిగిన ఒక సంఘటన నన్ను ఆ దిశగా ఆలోచింప చేస్తున్నది” పద్మ.

“అసలేం జరిగిందీ… అర్ యు ఆల్ రైట్?”

“ఎస్, పర్ఫెక్ట్ లీ..” గట్టిగా నవ్వేస్తూ పద్మ.

“ముందు ఏం జరిగిందో చెప్పేడువు..” రేఖ విసుగ్గా.

వినోద్ కి రేఖ గొంతు బిగ్గరగా వినపడింది. లేచి రేఖ దగ్గరకొచ్చిఏమిటన్నట్లుగా సైగ చేసాడు. ఏమీ లేదన్నట్లుగా కళ్ళతోనే చెప్పింది రేఖ. అతను లోపలికి వెళ్ళిపోయాడు.

చెప్పడం మొదలు పెట్టింది పద్మ. “ఏడాది క్రితం మహిళా దినోత్సవం జరిగినప్పటి మాట ఇది.. మా కమ్యూనిటీలో మహిళలందరం మీటింగ్ పెట్టుకున్నాం. మిగతా అందరూ చేసే పద్దతికి భిన్నంగా
చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. ఆ క్రమంలో ‘మనం – మన ఆహారం’ అని తినే ఆహరం పై చిన్న వర్క్ చేద్దాం అనుకున్నాం. మనం తినే ఆహారం రసాయనాలతో కలుషితమైంది అని ముక్త కంఠంతో అందరినించి వచ్చింది. మనం రోజువారీ జీవితంలో తినే ప్రతి ధాన్యాన్ని, పప్పు దినుసుల్ని,కూరగాయల్ని, పండ్లను, చికెన్, మటన్, పాలు, నూనెలు ఏవి చూసినా ఒక్కటంటే ఒక్కటి కూడా సహజంగా మన ముందుకు వచ్చినవి కావు. మా గ్రూప్ లో మన లాంటి పోషకాహార నిపుణులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు,సైంటిస్ట్ లు, మీడియా వాళ్ళు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అందరూ ఉన్నారు. చాలా బ్రెయిన్ స్ట్రామ్ చేశాం. మరి మనం మంచి ఆహారం ఎందుకివ్వట్లేదు అనుకున్నప్పుడు అందుక్కారణం మనం కాదని అర్ధమయింది. సరైన ఆహారమేదో మనకు తెలుసు. అయినా అందించలేకపోతున్నాం. కారణం రసాయనాలు లేని ఆహార వస్తువులు మనదగ్గర లభించకపోవడమే.. సూపర్ మార్కెట్స్ లో ఆర్గానిక్ ఫుడ్ అని కొన్నివస్తువులు అధిక ధరలకు అమ్ముతున్నారు. అవి ఎంతవరకూ ఆర్గానిక్ అని మనం నమ్మొచ్చు మరో ప్రశ్న వచ్చింది మాలో… ఎలా ఎలా అన్వేషణ.. మిల్లెట్స్ తో అన్ని జబ్బులూ తగ్గిపోతాయని, అవి తింటే జబ్బులు రావని ప్రచారం బాగా జరుగుతున్న విషయం తెలిసిందే కదా.. వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీడియా లో పనిచేస్తున్న రమణి చెప్పింది. సంఘం పంటల గురించి.వాళ్ళ వ్యవసాయ విధానం గురించి. వారి ఉత్పత్తుల వెనక ఉన్న జీవవైవిధ్యం గురించి.

మేం కొందరం వెళ్లి సంఘం సభ్యులను కలవాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళ వ్యవసాయాన్ని పరిశీలించాలని అనుకున్నాం. ఆ క్రమంలో వాళ్ళని కలిసాం. వారి ఉత్పత్తి విధానం గురించి అడిగి తెలుసుకున్నాం. మాకు వాళ్ళ ఉత్పత్తులు కావాలని అడిగాం. వారు బయటి వాళ్లకు తమ ఉత్పత్తులు అమ్మడం లేదు. తమ సంఘానికే అమ్ముతున్నామని చెప్పారు. బయటి రేటుకంటే సంఘం పది శాతం ఎక్కువ ధర ఇస్తుందని అందుకే తమ సంఘానికే ఇస్తున్నామని చెప్పారు. ఆయా పంటలు పండించని తమ సభ్యులే అవి కొనుక్కుంటారని వాళ్ళకి పది శాతం తక్కువకి ఆ ఉత్పత్తులు అమ్ముతారని చెప్పారు వాళ్ళు. తమ సంఘ సభ్యుల అవసరాలు తీరాక మిగిలినవే బయటికి ఇస్తారట. అప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళు పండించే కలిపి పంటలు, చిరుధాన్యాలకు మించిన చిరునవ్వుల సాగు లేదని అర్ధమయింది. వ్యవసాయం అంటే వాణిజ్య పంటలు, సంపదనిచ్చే పంటలు అన్న భావన పోయింది.”

కొన్ని క్షణాల మౌనం తర్వాత “ఏయ్ ఉన్నావా.. మీ చెట్లమీది కోయిల కుహూ కుహూ రావాలు వినిపించడం తప్ప నా ముచ్చట్లు నీవింటున్నట్టు అనిపించడంలేదు.” మధ్యలో విషయం చెప్పడం ఆపి ప్రశ్నించింది పద్మ.

అప్పటివరకూ మౌనంగా వింటున్నది రేఖ. ఆమె మదిలో తాను చూసిన మహిళలు మెదులుతున్నారు. తాను వాళ్ళ నుండి తెలుసుకున్న వ్యవసాయం గురించిన జ్ఞానం, తన ఇంట్లో జరుగుతున్న చర్చలు, తమ ఆలోచనల్లో వస్తున్న మార్పులు కదలాడుతుండగా ” నువ్వు అంత గొప్ప విలువైన విషయాలు చెప్తుండగా నేనెక్కడికి పోతానే.. ఉత్కంఠతో వింటున్నా గానీ.. చెప్పు చెప్పు..” గబగబా అన్నది రేఖ.

“అమ్మయ్య.. ఉన్నావ్. రైతులు అనగానే మనకి మగవాళ్ల రూపాలే గుర్తొస్తాయి. కానీ అక్కడ ఆ మెట్ట వ్యవసాయం చేసే వాళ్లంతా ఆడవాళ్లు. తమ కుటుంబంలోని మగవాళ్ళను కూడా కలుపుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఆ పంట వేసే దగ్గర నుండి మార్కెటింగ్ వరకూ మహిళలే బాధ్యత తీసుకున్నారు. అద్భుతంగా.. ఊహూ.. మహాద్భుతంగా ఉంది ఆ రైతక్కల పనితీరు. సంఘం, వాళ్ళ ఉత్పత్తులను బాగు చేసి, ప్రాసెస్ చేసి అమ్ముతున్నది. మేం వాటిని తెచ్చి ఒక స్టోర్ నిర్వహించాలని అనుకుంటున్నాం. దాని నిర్వహణ బాధ్యతలు నేను తీసుకుందామని నా ఆలోచన.. అందుకే ఉద్యోగానికి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నా.. ఇంకో విషయం తెలుసా.. రైతక్కల వ్యవసాయం అద్భుతం అనుకున్నా… వాళ్ళే కాదు వాళ్ళ మాట పాట కూడా అద్భుతమే. వాళ్ళ పాటలకు నువ్వయితే ఫ్లాట్ అయిపోతావ్..రేఖా..
అక్కడ ప్రతి పనిలోనూ ప్రతి పంటమీద ఒక పాట శృతి చేసుకుంటుంది. వాళ్ళ బతుకు చిత్రం వాళ్ళ పాటల్లో ప్రతిబింబిస్తుంది. స్థానికంగా ఉండే సంఘాల్లోని రైతక్కలకు ఏ రూపంలో విషయం బాగా అర్ధమవుతుందో ఆ రూపంలోకి ఒదిగిపోతుంది ఆ విషయం. అలల్లా ఉప్పొంగుతూ అలా అలా జనాన్ని చేరిపోతుంది. ” చెప్పింది పద్మ.

పద్మ మాటలు వింటుంటే సంఘం మహిళలే కళ్ళ ముందు కదలాడుతుండగా “సంఘం అంటే జహీరాబాద్ వైపా” అడిగింది రేఖ.

“అవును, నీకు తెలుసా.. సంఘం గురించి” పద్మ ఎదురు ప్రశ్న.

“మొన్న ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు విన్నాగానీ.. చెప్పు.. చెప్పు.. ఇంకా..” పద్మ ఇంకా ఏం చెబుతుందోనన్న ఉత్సుకత రేఖ గొంతులో.

అది గమనించిన పద్మ మరింత ఉత్సహంగా చెప్పుకుపోతున్నది. “నిజానికి సంఘం మహిళలతో మాట్లాడ్డం ఒక ఎడ్యుకేషన్. చూస్తే.. పల్లెటూరి మనుషులు. చాలా అమాయకంగా కనిపిస్తారు. వాళ్ళ సంప్రదాయ జ్ఞానం అపారం. తెలివి తేటలు అమోఘం. మన ముత్తాతల సమయంలో ఉండే జ్ఞానం వాళ్ళ దగ్గర ఇంకా పదిలంగా ఉందనిపించింది. తెలుసా.. వాళ్ళకి వున్న ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువే.. మనం చాలా ఆధునికులం. చదువుకున్నాం. మెడల్స్ సంపాదించాం అనుకుంటున్నాం కానీ నీకూ నాకూ ఏముంది… వర్క్ షాప్స్ అనో, సింపోజియం అనో దేశంలో నాలుగైదు చోట్లకి తిరిగానేమో.. నువ్వు ఇంకో రెండుమూడు సార్లు ఎక్కువ తిరిగి ఉంటావ్. అంతేగా.. మరి ఆ సంఘం ఆడవాళ్లు వాళ్ళు.. చిన్న చిన్న వేదికల మీదే కాదు ప్రపంచ వేదికల మీద నిలబడి మాట్లాడుతున్నారు. తాము అందుకున్న జ్ఞానాన్ని ప్రపంచం ముందు పరుస్తున్నారు. ప్రపంచ దేశాలు తిరిగి వస్తున్నారు. తాము నేర్చుకున్న విద్య, తమకి తెల్సిన జ్ఞానం బయటి దేశాలకు వెళ్లి శిక్షణ ఇచ్చి వస్తున్నారు..చూస్తే చిన్న రైతులు.మహిళా రైతులు. గడ్డిపోచల్లాంటి మనుషులు. చదువూ సంధ్యా లేని మోటు మనుషులు వాళ్లు.”

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply