బతుకు సేద్యం – 10

ఈ దినం నా తాననే చేనున్నది. పంటున్నది. నా చేనుకు పోత గాని వాండ్ల చేన్లకు కాదు కద!
మా సంగేపోల్లని కలుపుకొని పనులు జేసుకుంటం .

పటేండ్లు గిన మాకు పని చేయుంరి, మాకు చేయుంరి అని మాఎన్కవడితే.. మా అక్కడ అయినంక ఆల్లకాడికి పోకడ.
గా దినాలల్ల కాపుదనపోల్లు ఇండ్లకాడ కుసుంటిరి. పన్లన్నీ మా తోని చేపిచ్చుకుంటిరి. గిప్పుడు ఆల్లే జేసుకుంటుంరు. ఎవరిది ఆల్లే జేసుకుంటుంరు. తప్పుతదా .. మరి !
ఇప్పుడు గోదలు, బర్లు గిన వాండ్లక్కడ తక్కువయినయ్ . మా అక్కడ మా లెస్సయినయ్ .

దున్నుడు , గొర్రు కొట్టుడు , అరక దున్నుదు , రొప్పుడు , గుంటుకకొట్టుడు అన్ని జేస్తుంటిమి . పండుగొత్తె ఎర్రమన్ను గొట్టిస్తుంటిమి . ఆళ్ళ గోడలలికొస్తుంటిమి. అంత వారి మెప్పుకోసం జేస్తుంటిమి . అట్లా జేసినందుకు వాళ్ళు ఇంత గట్క ముద్దేస్తరని ఎదురు జూస్తుంటివి . ఆశ పడుతుంటివి . ఇప్పుడంతా ఉల్టా పల్టా అయిపాయె .

అప్పుడు మా అండ్ల ఇంతో అంతో చేనుంటే కాపోళ్ల తానకో , పటేండ్లు , పట్వారి తానకో ఇత్తునాల కోసం పోయేది. వాళ్ళ దగ్గర ఇత్తునం గింజలు అడుక్కోను పోతుండే. ఆల్లదయిపోయినంక కాలమైపోయినంక ఎప్పటికో ఇస్తుండే.
గిప్పుడేమో ఆల్లే మా తాటకొస్తున్నరు. వాళ్ళక్కడ లేని ఇత్తునం గింజలు మా సీడు బ్యాంకుల్ల నిండుగ ఉన్నది . మా ఇండ్లల్ల ఉన్నది .” చెప్పింది సంతోషమ్మ

“మాకు అప్పట్ల ఆనకాలంలనే పనిదొరుకుతుండే . అప్పుడే నాట్లకు , కలుపుకు , కోతలకు పోయేటోల్లం . మాగిల ఎప్పుడో తప్ప పని దొరకక పోతుండే . మొత్తంల 30 దినాలు పని దొరికితే ఎక్కువనే. ఇగ తత్తిమ పనే లేకపోతుండే . మాగిల పని ఏముండకుండే ..

అసొంటప్పుడు గుట్టకు పోయి పొయ్యిలకు పుల్లలు తెచ్చుకుంటుంటిమి . చీపురు కయ్యలేరుకచ్చి చీపుర్లు తీస్తుంటిమి. పెండ ఎరుకచ్చి పిడకలు చేసుకుంటుంటిమి. కానుగ పిక్కలేరుకచ్చి అమ్ముతుంటిమి . ఒక్కోపారి ఆముదం తోటల్ల ఆముదం ఏర బొతుంటిమి . గిట్లనే ఏదోటి జేసుకుంట ఇంటికాడ్నే ఉంటుంటిమి.
ఇగ కాపోల్లో , పటేలమ్మనో అడ్లు జెయ్యానో , బియ్యం జెయ్యనో , పప్పులిసరనో , పిండి దంచనో, గోడలలకనో ఏదో పనికి పిలిస్తుంటిరి . పోతుంటిమి . ఇన్ని నూకలో , మోడాలో పెట్టక పోతరానన్న ఆశతోని .

ఒక్క పూట కడుపులకింత బోతే అదే ఘనంగా అనిపిస్తుండే . ఇంత నూకల బువ్వనో , సలి బువ్వనో, గట్కనో దొరికితే అండ్ల ఇంత దొడ్డుప్పేసుకొని పిసుక్క తింటుంటిమి. ఎన్నడన్న చేన్లల్లకు బోయినప్పుడు ఆడ ఏదన్న ఆకు కండ్లవడితే తెచ్చుకొని వండుకొనుడు . ఆనకాలంల దండ్లపొంటి ఆనిగెపిత్తులో , చిక్కుడిత్తులో పెడితే మాగిల కాస్తుండే . అయ్యే తింటుంటిమి .
మాకా చుట్టుముట్టు అడవులు ల్యాకపాయె . అటుబోయి పండో ఫలమో దొరికితే తెచ్చుకోను ” సంతోషమ్మ మాటలకు కొనసాగింపుగా చెప్పింది మొగులమ్మ .

“అప్పట్లో రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళు కాదా ..?” అరవింద్ సందేహం
“ఇస్తుండె సారూ .. కూపన్ బియ్యం తెచ్చుకోను మా తాట పైసలేడివి. అవి ఎన్కకే పోతూండే. అయ్యో .. ఆ గోస .. గోస కాదు ఎట్లపడ్డమో ..
ఎండల్ల సానా కష్టం ఉండే. కడుపాకలి ఉన్నఊరొదిలి పొమ్మంటుంటే మూటాముల్లె సర్దుకొని పట్నం పోక తప్పని పరిస్థితి. పని వెతుక్కుంటూ పోవాల్సిన పరిస్థితి. ” అన్నది సంతోషమ్మ ఆ ముళ్ళన్నీ ఆమె గుండె లోతుల్లో ఇప్పటికీ గుచ్చుకుని బాధిస్తున్నట్టున్నాయి ఆమె మొహం చూస్తూ అనుకున్నాడు వినోద్ .

వాళ్ళు మరచిపోయిన, మాసిపోయిన గతం తాలూకు గాయాల్ని తాము రేపుతున్నారా .. అని సందేహపు తెర అలా కదిలి ఇలా మాయమయింది అతనిలో. అయ్యో.. ఏదో తప్పుచేసిన భావన లోనికి చొచ్చుకొస్తుండగా ..

“ఈడికొచ్చింరా .. ఆడ జాతర కాడ మీ కోసం లెంకి లెంకి ఇట్లోచ్చిన ” అన్నది నోట్లో ముద్ద పెట్టుకోబోతూ అన్నం ప్లేటుతో వచ్చిన రూతమ్మ .
“అవు .. అప్పుడే వచ్చేసినం . నీకు ఆడ పని ఉన్నదని నీకు చెప్పకుంటనే వచ్చినం. అది మన పండుగనే.. ఇది మన ఊరి పటేల్ ఇంట్ల పండుగనే. పిలిసినంక రాకుంటే మంచిగుంటదా .. ” పెద్దరికంగా అన్నది సంతోషమ్మ
“ఎక్కడి సంబంధాలు అక్కడ కాపాడుకోవాలె ” అన్నది మొగులమ్మ

“సంఘం రాంగనే మీ పరిస్థితులు ఎట్లా మారాయి ” సంతోషమ్మ , మొగులమ్మలను చూసి అక్కడకు వచ్చిన రూతమ్మను అడిగాడు వినోద్
“గా గడ్డి పోసల బతుకే మంచిగుంటుండే మా బతుకుల కంటే . అసొంటి దినాలల్ల సంగమొచ్చి ఎండిపోయిన మా బతుకులకు పానంపోసింది.
మా మీదనే పానం పెట్టింది. మా బతుకులు చిగుర్లు తొడిగినయ్. మొక్కలయినయ్. సిల్వలుపల్వలేసి గా చెట్టులెక్క చెట్లయినయి. ” కొద్ది దూరంలో ఉన్న గడ్డిని ఇంకాస్త దూరంగా ఉన్న వేపచెట్టును చూపుతూ చెప్పింది రూతమ్మ.

” రియల్లీ గ్రేట్ .. ” మనసులో అనుకున్నమాట వినోద్ నోట బయటికొచ్చింది .
“అదే ఎట్లా సాధ్యమయింది ” రెట్టించి అడిగాడు సుధాకర్

“సంగం వచ్చినంక ఎండాకాలంల సుతం మాకు పని దొరకవట్టింది. పని దొరికిందంటే పైసలస్తయి గద . పైసలచ్చినయంటే తిండి దొరికినట్టే గద .
నాకు బాల్వాడిలో పని దొరికింది . కసువు చిమ్ముడు , బాసన్లు తోముడు , వంట చేసుడు , బల్వాడి పిల్లలకు పెట్టుడు చేస్తుంటి. నా పెనిమిటి యాడాదికి రెండువేలకు జీతమున్నడు . నాకు నెలకు రొండు నూర్లు వొస్తుండే. యింటి కర్సులకు సరిపోతుండే .

సంగం మీటింగులకు ఇడువకుంట పోతుంటి గద . ఆడ జెర్రల ఎరువు చేసుడు నేరిస్తే ఎట్ల లాభమయితదో చెప్పింరు. నేను సుత జెర్రల ఎరువు చెయ్యాల్ననుకున్న . కెవికె (కృషి విజ్ఞాన కేంద్రం )ల ట్రేనింగ్ కు పోయిన . ఎరువు ఎట్లజేసుకోవాల్నో నేర్పిచ్చింరు. అవుసరమైన సామ్యాన్లిచ్చిన్రు. మేం బెడ్లు కట్టుకున్నం. జెర్రలు తెచ్చేసినం. ఆ పని శానా కష్టముంటుండె. చిన్న చిన్నగ అలవాటయింది.

తొట్టతొల్తా జెర్రలెరువు అయ్యేతందుకు రెండునెలలు పట్టింది . అటెనుక అనుభవం కామాయించినంక అది నెలరోజులు పడుతుండే . అట్ల ఇరవై రోజులకు , ఇగ ఇప్పుడయితే 15 దినాలల్ల చేస్తున్న .
“ఇంట్రెస్టింగ్ ” అరవింద్

“జెర్రల ఎరువు కొత్తగేల్లిందనుకున్న . ఓ అప్పటికెల్లి ఉన్నదా.. ఎట్ల చేస్తుంటిరి ” అడిగాడు సుధాకర్
” ఒక బెడ్ల రెండుమూడు కింటాల్ల ఎరువువొస్తున్నది . ఈ బెడ్స్ ల ఆవు పెండ , యాపాకు , కానుగాకు , తంగెడాకులసొంటివన్నీటి తోని బెడ్ తయారుజేస్త. సేంద్రియ పద్దతుల్ల ఎరువుతోని చేనుకు బలం. పండిన పంట మనకు మంచిది .

ఇప్పుడు మా ఊర్లె రెడ్డిలు , పటేళ్లు , కాపోల్లేనా .. బీదర్ , నాగోవర్ , కొత్తూరు కెల్లి సుత మా కాడికొచ్చి జెర్రల ఎరువు కొనుక్కపోతున్నరు. కిలో రెండు రూపాయల చొప్పున అమ్ముతున్నం. నెల రోజుల్లో ఖర్సుబోను ఎనిమిదొందల రూపాలు వచ్చినయి. ఇప్పుడు కూలీ పన్లకు పిలిచిన పోతలేం. నా పెనిమిటి పనికివోతే యాడాదికి నాల్గువేలిస్తుండే .. అది ఏవన్నా సరిపోతదా.. సరిపోదు కద. బారెడు పనికి జానెడు బెత్తడు జీతం యాడ సరిపోతది. బాకుల మీన బాకులు చేస్తుండే . ఆ బాకీ తీర్పేతందుకు మల్ల బాకీ జేసుడేనాయే. కర్సులకు దుకాణంబొతే దరలు మిన్నంటుడాయె జీతం నెలదిక్కే జూసుడాయె. ఒడ్డుక్యాడవడతం.. ఆ .. చెప్పురి . ” నిలదీస్తున్నట్టుగా అంటూ అందరి మొహాల్లోకి పరిశీలనగా చూసింది . ఆ తర్వాత ఆమెనే “ఆ బాకులన్నీ తెంపేసిన . రెండేండ్లల్ల తెంపేసిన . నా నా పెనిమిటిప్పుడు యాడ జీతంజేస్తలేడు. జెర్రల ఎరువుజేసుకుంట మంచిగున్నం. నా పెనిమిటి అట్లనే జీతంజేత్తే మా అయితే ఇంకో మున్నూరో నన్నూరో పెంచుతుండెనేమో .. కాకుంటే ఐదువేలు అయితుండెనేమో ..

కానీ జెర్రల ఎరువుతోటి ఆరేడువేల కంటే ఎక్కువ సంపాదిచ్చిన. ఇంటిపని , పిల్లలపని , బాల్వాడి పనిజేసుకుంటనే . గందుకే నా పెనిమిటి జీతం బందు జేసిండు .
ఎన్కటి దినాల్లకు వోతే దుఃఖం పొర్లుకొస్తది . అది ఒక బతుకేనా అనిపిస్తది.

నా లగ్గమయినప్పుడు పెనిమిటితోని పండుకోను చింకి శాప లేకుండె. కంతల బొంత లేకుండే .. అసొంటి మా అక్కడ ఇప్పుడు సూడుంరి. మా అక్కడ తిండి ఉన్నది. కట్ట బట్ట ఉన్నది . మా పిల్లలు చదూకుంటున్నరు. మా సేతుళ్ళ పైసలున్నయి.

నేనిప్పుడు ఒక బర్రెను కొన్న . ఎడ్లుబండి అయింది. మా బతుకులు ముందుకుబోతయని నమ్ముకమున్నది. నాకు ధైర్నం ఇచ్చింది సంగం.” చెప్తున్నప్పుడు ఆమె మోహంలో సన్నని గర్వరేఖ

“ఆ జమానాల మాలమాదిగోళ్ళు, చిల్లర కులాలోళ్లు, చిన్న కులాలోళ్లు ఇట్ల మనిండ్ల ముంగటికొస్తుంటిరా .. ఆమడ దూరంల ఉండేటోళ్లు ..
నోరు తెరిచి పెద్దల ముందు మాట్లాడడానికి భయపడి సచ్చేటోళ్లు . అసుంట అంత దూరంల ఉండెటోళ్లు. ఆ జమానా పాయె .
ఇగ చూడు మనతోటి సమానమయిరి. మనం కూసున్న కుర్చీల బారాబరీ కూచొని ముచ్చట బెడుతున్నరు .

మన ఇండ్ల ముంగిట నిల్చి అది కావాలె , ఇది కావాలె అని ఇంటి సుట్టూతా తిరిగేటి మంది, మిగులో తగులో అడ్కబోయేటి మంది తాటికి మనం పోవుడయితాంది.
కలికాలం .. ” అన్నాడో గ్రామస్తుడు వినోద్ బృందం కేసి చూస్తూ

“నేను బీ ఈ సంగపోల్ల ఇండ్లకు పోయి రబీల ఏసేటి ఎర్ర కందులు తెచ్చిన. ఖరీఫ్ ల వేరే అక్కడ తెచ్చిన పంట మంచిగ రాలె . ఇంటిపూర్తయిన పప్పుల్లేకుంట ఎట్ల నడుస్తది . గందుకే వాళ్ళ తాటకు బోయి విత్తునం తెచ్చిన , జెర్రల ఎరువు కొనుక్కొచ్చిన” చెప్పాడో నడివయస్కుడు

“కాపులు కాకులయిన్రు . కాకులు కాపులైన్రు ” అంటూ తుపుక్కున ఉమ్మి చేతిలో ఉన్న కర్రాడిస్తూ వెళ్ళిపోయాడు మొదట మాట్లాడిన గ్రామస్తుడు.
అతను వెళ్లడంలో ఆధిపత్య కులంలో ఉన్న తనకంటే సంఘం సభ్యల బతుకు బాగుండడం చూసి అక్కసు ఓర్వలేని తనం అహంకారం కనిపించాయి వినోద్ కి .
ఈ మహిళలు వాళ్ళ శక్తులేంటో తెలుసుకుంటున్నారు . జ్ఞానం పెంచుకుంటున్నారు . వాళ్ళ సొంత గొంతు వినిపిస్తున్నారు . తమ జీవితాల్ని తామే మలుచుకుంటున్నారు . ఎటువంటి కష్టాలు , సవాళ్లు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్దమై ఉన్నారు .

ఆ మాట్లల్లో ధీరత్వమే కానీ దైన్యం లేదు.
ఆ మాటల్లో ఆత్మవిశ్వాసమే కానీ ఆత్మన్యూనత లేదు .
ఆ మాటల్లో తమ మీద తమ శ్రమ మీద నమ్మకమే కానీ అసూయాద్వేషం లేవు .
అధికారికంగా విషయం చెపుతున్నారే కానీ ఆధిపత్య భావం కనిపించడం లేదని మనసులో అనుకున్నాడు వినోద్ .

పెళ్లి తతంగం అంతా పూర్తయింది . ఆడవాళ్లు భోజనానికి లేచారు .
షామియానాల కింద కుర్చీల్లో కూర్చున్న తమ వాళ్ళని చూసి ” ఏం జేస్తున్నారు ” అంటూ వచ్చింది వినోద్ భార్య రేఖ .
అప్పటికే భోజనాలయి ఊళ్లో మగవాళ్ళు చాలా మంది వెళ్లిపోయారు . షామియానా కింద కుర్చీలు చాలా ఖాళీ అయ్యాయి .
పెళ్లి మండపం దగ్గర కొత్తగా మిత్రులయిన కొత్త స్నేహితులతో ముచ్చట్లాడుతున్నారు పిల్లలు .
సంఘం సభ్యుల్ని రేఖకి పరిచయం చేసాడు సుధాకర్ .

“మీరూ వీడియో షూట్ చేస్తారా ” కొద్దిసేపటి క్రితం వినోద్ చెప్పిన విషయం విని ఉన్న రేఖ గొంతులో ఉత్సుకత
” నేను చెయ్యను మేడం . మొగులమ్మ చేస్తది ” అంటూ పక్కనున్న ఆమెను చూపింది సంతోషమ్మ .
“మీకు పాటలు వచ్చా .. ” రేఖలో కుతూహలం

వచ్చన్నట్లుగా నవ్వుతూ తలలూపారు ఆ ముగ్గురు మహిళలూ
“ఏది కొంచెం వినిపిస్తారా ..” చిరునవ్వుతో రేఖ .

“అందరము కలసి , ఆడోల్లము కలసి
పేదోళ్ళము కలసి , కూలోళ్ళము కలసి
కలిపి పంటలు వేసినమే వజ్రమ్మా
కలిపి పంటలు తినవే వజ్రమ్మా ..

అందరము కలసి , ఆడోల్లము కలసి
పేదోళ్ళము కలసి , కూలోళ్ళము కలసి
ఆకుకూరలు తెస్తిమే వజ్రమ్మా
ఆకుకూరలు దినాం తినవే వజ్రమ్మా

అందరము కలసి , ఆడోల్లము కలసి
పేదోళ్ళము కలసి , కూలోళ్ళము కలసి” రాగయుక్తంగా ముగ్గురూ కలసి ఏక కంఠంతో పాడినట్లుగా పాడారు .

వాళ్ళ పాట విని కొందరు అక్కడ జమయ్యారు . పాట విన్నవాళ్లు చప్పట్లు చరిచారు
వాళ్ళని అభినందిస్తూ “ఎంత చక్కటి పాట పాడారు . చాలా అర్ధవంతమైన పాట. చాలా చక్కగా పాడారు ” అంటూ లేచి వాళ్ళ చేతిలో చెయ్యి కలిపింది. పోషకాహార నిపుణురాలయిన రేఖ. ఆమెని వాళ్ళ పాట చాలా ఆకట్టుకుంది.

“ఎవరు రాశారు ఈ పాట ” అడిగింది రేఖ
“మేమే ” జవాబిచ్చింది మొగులమ్మ
” మేమే అంటే మీలో ఎవరు ” రేఖ ప్రశ్న
“మేమంటే మేమే . మాకు రాసుడు , సదుడు రాదు కద.
సంగంల మీటింగ్ కోసం కూసున్నప్పుడో , చేన్లల్ల కలువబోయినప్పుడో లేకుంటే నలుగురం కూడినప్పుడో పదం కైకడతం. పాడుకుంటం . అట్లనే కట్టినం ఈ పాట సుత . ” వివరించింది రూతమ్మ

వినోద్ లాగే రేఖ , అరవింద్ లక్కూడా అనామకంగా కనపడుతున్న అసాధారణ మహిళల పట్ల ఆసక్తి పెరిగిపోతున్నది.
” మీ గురించి మీరు చెబుతున్నది వింటుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తున్నది . చెప్తారా ” వారిపట్ల పెరిగిన గౌరవంతో అడిగాడు అరవింద్
“వంటకాడ మేమే .. పంట కాడ మేమే .. పని కాడ మేమే” కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చిరునవ్వుతో చెప్పింది మొగులమ్మ .

” మూడుముక్కల్లో భలే చెప్పావ్ గా ” మొగులమ్మ కేసి అభినందనపూర్వకంగా అని ” ఒక్క నిముషం మొగులమ్మా .. నేను అన్నం పెట్టుకొస్తా .. నీకు సంఘంలో ఎందుకు చేరాలనిపించిందో వివరంగా చెప్తావా ” అడిగింది రేఖ
అట్లాగే నన్నట్లు తల ఊపింది మొగులమ్మ.

అన్నంతో పాటు ఆలుగడ్డ, వంకాయ కూర ప్లేటుతో వచ్చిన రేఖను చూస్తూ ” బగార ఏస్కోలే .. ” ప్రశ్నార్ధకంగా చూసింది సంతోషమ్మ
” ఈ ఎండకు అది తినబుద్ది కాలేదు.” అంటూ మొగులమ్మ వైపు తిరిగి “ఊ .. చెప్పు .. చెప్పు .. మళ్ళీ మేం బయలు దేరాలి . మీకూ పనులుండి ఉంటాయి ” అన్నది రేఖ .
“నేను చెప్పింది ఈమె మాట్లాడిన మాటల గురించే రేఖా .. ” అని రేఖతో చెప్పి మొగులమ్మ కేసి సూటిగా చూస్తూ

“మొగులమ్మా ..సాంప్రదాయ పంటలు కాపాడుకోవాలని మీకెందుకు అనిపించింది ? చదువులేని మీకు అంత జ్ఞానం, విజ్ఙానం ఎక్కడినుంచి వచ్చాయో తెలియట్లేదు. మీరు మీ హక్కులు కాపాడుకుంటూ మీ కుటుంబం పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించడం చాలా గొప్పగా అనిపిస్తున్నది . మీరుచేస్తున్న పని గొప్పదనం మీకు తెలుసో లేదో గానీ నాకైతే మీరు అంత ఎత్తున కనిపిస్తున్నారు ” అంటూ చేయి పైకెత్తి ఆకాశంలోకి చూపుతూ అన్నాడు వినోద్

శాంతాడంత ఉన్న ముచ్చట ఇట్ల సెప్పుడంటే… అని సన్నగా నవ్వింది మొగులమ్మ .
“నా మతిలకచ్చిన కాడికి సెప్త . మీరు తీరెముంటే ” చుట్టూ కలియజూస్తూ అన్నది ఆమె . సంతోషమ్మ, రూతమ్మ అవునన్నట్లుగా తలలూపుతూ
వినోద్ , రేఖ , అరవింద్ లు చెవులు రిక్కించారు ఆమె మాటలకోసం. సుధాకర్ నాలుగడుగుల అవతల నిల్చొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు .

” ముప్పై ఏండ్ల ముచ్చట ఏమని జెప్పాలె . ఊరుకాలితే పేలాలు ఏరుకునేటోల్ల సుద్ది ఎంతని జెప్పాలె సారూ .. తవ్వినకొద్దీ పెంకాసులెళ్లినట్టు మాస్తుగున్నయి . అచ్చిరానికాలంల చేతిల ఉన్నచిప్పబోయే ..

కుక్కలకన్న నక్కలకన్న హీనపు బతుకుండే . మేమేందో మా బతుకేందో మాకే తెలియకుండే .. మొగులుకు మొకంబెట్టి సూసేటి దినం గాకపాయె .
సంఘం రాకుంటే అట్లనే మూలుక్కుంట ముక్కుకుంట ఉంటిమో మిట్టిలకే బోతుంటిమో .. ” విషాదగాయాలను రెండుముక్కల్లో చెప్పి లేచి నిలుచుంది మొగులమ్మ.

పూలమ్మ పిల్లలు ఇంటి దగ్గర తనకోసం చేస్తుంటారని ఆమెకు తెలుసు . అందుకే లేచి నించుంది .
“మీతో మాట్లాడ్డానికి మీ దగ్గరకి రావచ్చా .. ” అడిగాడు వినోద్ .

అంతలో మొగులమ్మనెతుక్కుంటూ ఆమె కూతురు పూలమ్మ వచ్చింది .

***

ఆ రోజు ఆదివారం. భోజనాల తర్వాత వినోద్ కాసేపు ఏదో పుస్తకం తిరగేశాడు . ధ్యాస దానిమీద నిలవడంలేదు . మూసి పక్కన పడేసాడు.

రేఖ టీవీ కార్యక్రమం చూసింది కాసేపు . తర్వాత హోరెత్తిస్తూ ప్రకటనలు మొదలయ్యాయి . అవి చూడలేక ఏవేవో ఛానెల్స్ పైకి కిందకి వెళ్తూ వస్తూ
ఉన్నది. ఆకట్టుకునేవి ఏవీ కన్పించలేదు . విసుగొచ్చింది .
రిమోట్ తో టీవీ పీక నొక్కి ఆ రిమోట్ టీ పాయ్ పై పడేసింది . అదే టీ పాయ్ మీదున్న తన మొబైల్ అందుకుంది .

లోపల సునామీ గాలులు వీస్తున్నట్లు అస్థిరంగా ఉన్నాడు వినోద్. చాలా అసహనంగా కన్పిస్తున్నాడు . అవిశ్రాంతిగా ఉన్నాడు . వాటి నుండి తప్పించుకోవడం కోసమా అన్నట్లుగా కూర్చున్న చోటునుండి లేసాడు . అటూ ఇటూ హాల్లోనే పచార్లు చేస్తున్నవాడల్లా ఒక్క నిముషం గడపలో నుంచొని బయటకు చూశాడు .
వేప, మామిడి చెట్లపైన చేరినపక్షులు గలగలా .. కిలకిల అంటూ కబుర్లు చెప్పుకుంటున్నాయి . కూనిరాగాలు తీస్తున్నాయి . కోయిలమ్మలు కుహుకుహూ అంటూ రాగాలు పలుకుతున్నాయి

రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న వరి పొలాల్లోంచి చల్లని పిల్లగాలి వేపచెట్టు మీదుగా వచ్చి తాకింది . వేప పూత వాసన కమ్మగా అలుముకుంది.
ఓ వైపుగా ఉన్న మామిడి పిందెలు గాలికి చిన్నగా కదులుతున్నాయి . ఉడుతలు వేపచెట్టునుండి మామిడిచెట్టు దగ్గరకు అటు నుండి జామచెట్టు పైకి ముక్కోణంలో తిరుగుతున్నాయి .
వాటినలా చూస్తూ నెమ్మదిగా వాకిట్లోకి అడుగులేశాడు . కాళ్ళు సుర్రు మన్నాయి . వెంటనే లోపలికొచ్చాడు. మాములుగా అయితే చెప్పులేసుకుని వెళ్లి వాటితో ఊసులాడి వచ్చేవాడే . రాగాలు తీస్తూ ఆనందించేవాడే .. సాధారణంగా అట్లా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడలా చేయలేదు. సుదీర్ఘంగా ఆలోచిస్తూ వెళ్లి సోఫాలో జారిగిలపడ్డాడు.

అప్పటివరకూ తమ రూమ్ లో కూర్చొని పుస్తకాలు అటూ ఇటూ తిరగేసిన పిల్లలు ఎండని దాచేసిన మేఘం ప్రత్యక్షం అవడంతో సైకిళ్ళు తీసుకుని గ్రౌండ్ లోకి
ఆటలకు తుర్రు మన్నారు.
ఇప్పుడే వద్దు . ఇంకాస్త ఎండ తగ్గనీయండి అని రేఖ వెనక నుండి అరుస్తూనే ఉంది . అయినా వినిపించుకోలేదు .
“కాసేపు వికాస్ వాళ్ళ పనస చెట్టు దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటాంలే .. ” అభయమిచ్చింది కూతురు వెళ్తూ .

పరిశోధనా కేంద్రం స్టాఫ్ క్వార్టర్స్ లో ఉండడం వల్ల ఇదో ప్లస్ పాయింట్ .. పిల్లలు ఈ చుట్టుపట్లే తచ్చాడుతుంటారు. ఎక్కడున్నారో ఏమిటో వెతుక్కునే పని ఉండదు . వాళ్ళ భద్రత గురించి బెంగ పడనవసరంలేదు .

చుట్టూ అలుముకున్న పచ్చదనం వేప , మామిడి , పనస వంటి వృక్షాలతో సపోటా, సీతాఫలం , జామ , నిమ్మ బత్తాయి, కొబ్బరి రకరకాల పండ్ల మొక్కల తో వాతావరణం చల్లగానే ఉంటుంది . రెండు వైపులా ఓ వైపు చిన్న చిన్న గుట్టలు .. మిగతా రెండు వైపులా కళ్ళనిండా ఎంత నింపుకోగలిగితే అంత పచ్చదనాన్నిస్తూ పరిశోధనా కేంద్రం పరిశోధనల్లో భాగంగా సాగుచేసే రకరకాల వరి , చెరుకు పంటలు .

అప్పుడప్పుడూ పంటలకు పిచికారీ చేసే పురుగు మందులు , గడ్డి మందుల వాసనలు తప్ప స్వచ్ఛమైన గాలులు . వాతావరణం బయటి కంటే రెండుమూడు డిగ్రీలు చల్లగానే ఉంటుంది .

ఇక్కడ ఉండబట్టి ప్రకృతిలో ఆడుకునే అవకాశం దొరికింది పిల్లలకి. ఇంకెన్నాళ్లు లే..
చైతూ వచ్చే ఏడు ఎనిమిదికి వస్తాడు. వాడిని హాస్టల్ లో వేసి మంచి స్కూల్ లో చదివించాలి . ఆ తర్వాతి సంవత్సరం ప్రీతిని వేసెయ్యాల్సిందే .. స్థిరంగా అనుకుంది రేఖ

ఇప్పటికే లేట్ అయింది . ఇక్కడున్న టీచర్స్ ఏదో చెప్తున్నారు. కానీ, పై చదువులకు మంచి పునాది పడాలంటే ఇప్పటి నుండి మంచి స్కూల్స్ లో ఉంచి చదివించడమే మంచిది . ఖర్చు అయితే అవుతుంది . కష్టపడేది వాళ్ళ కోసమేగా ..
చదువులు తప్ప ఆస్తులు ఇవ్వం అని ముందునుండీ పిల్లల్తో చెప్తూనే ఉన్నాం. పిల్లలూ బాగానే చదువుతున్నారు .

ఇప్పటినుండి హాస్టల్ లో పెట్టి చదివించడం వినోద్ కి ఇష్టం ఉండదు . ఇప్పుడంత అవసరం లేదంటాడు . ఇంకో మాటలో చెప్పాలంటే కార్పొరేట్ బడులంటే అతనికి నచ్చదు.
గైడ్ చూసి చెప్పడం , మోడల్ పేపర్లు బట్టీపట్టించడం తప్ప నోట్స్ ఇవ్వరు . నిజానికి అది సిగ్గుపడే విషయం అనుకోరు . గైడ్ చూసి పరీక్షల ముందు ముక్కునపట్టి రాసేవాళ్ళే ఎక్కువ . పాఠం ప్రిపేర్ అయి చెప్పడం , చెప్పిన పాఠానికి నోట్స్ ఇవ్వడం ఏనాడూ చేయరు . విద్యార్థే నోట్స్ తయారు చేసుకునే స్వేచ్ఛ అవకాశం అసలే ఉండవు . అందుకే కార్పొరేట్ బడులంటే విముఖత . దానికి తోడు చిన్నప్పుడే తాను హాస్టల్ లో ఉండడం కూడా కావచ్చు .

తను ఆరో తరగతిలోనో ఏడో తరగతిలోనో సర్వేల్ హాస్టల్ కి వెళ్లి ఉండడం మొదలు పెట్టాడు . అప్పటి నుండి చదువంతా ఇంట్లో లేకుండా బయట ఉండి చదువుకున్నదే . తనకంటే అప్పుడు తప్పదు . సొంత ఊళ్ళో ఐదో తరగతి కూడా లేదు . రెండు మైళ్ళు నడిచి పొరుగూరు వెళ్లాల్సి వచ్చేది .
ఇప్పుడు అట్లా కాదు కదా .. స్కూల్ బస్ తమ క్యాంపస్ కు వచ్చి పిల్లల్ని ఎక్కించుకొని పోతుంది అంటాడు . ఇంటిని మిస్ అయిన వినోద్ ఇప్పుడు తన పిల్లల్ని మిస్ అవడానికి ఇష్టపడడం లేదు . ఇప్పటినుంచి హాస్టళ్లలో ఎందుకు ? కనీసం పది పూర్తయ్యే వరకూ అయినా మన దగ్గరే ఉంచుకుందాం అంటాడు .

అతని చిన్నప్పటి పరిస్థితులు వేరు . ఇప్పటి పరిస్థితులు వేరు . ఈనాటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే వారికి మంచి భవిష్యత్ అందించాలంటే తప్పదు. పిల్లలయినా పెద్దలయినా కొన్ని త్యాగాలు చేయక తప్పదు . కొంత సర్దుబాటు చేసుకోక తప్పదు . చాలా స్కూల్స్ లో ఫిబ్రవరి లోనే అడ్మిషన్స్ ప్రక్రియ మొదలు పెట్టేశాయి . ఇవ్వాలో రేపో ఒక నిర్ణయానికి వచ్చేయాలి . స్కూల్స్ ఏవి బాగున్నాయో తెల్సుకొమ్మని ఆడపడుచుకి చెప్పింది . అన్న వదినలకు చెప్పింది . ఎవరో ఒకరికి , వాళ్లకు కాస్త దగ్గరగా స్కూల్ ఉంటే హోమ్ సిక్ లేకుండా వాళ్ళ ఇళ్లకు వెళ్లిరావడానికి వీలవుతుందేమోనని ఆశపడుతున్నది రేఖ . .

ఇదే సమయం వినోద్ తో మాట్లాడ్డానికి . ఇంత తీరిగ్గా దొరకడు . నెమ్మదిగా కదిపి చూడాలి అనుకుంటూ ఫోన్ లో ఏవో కెలుకుతూ మధ్య మధ్యలో వినోద్ కేసి దృష్టి పెడుతున్నది రేఖ

“ఆలోచిస్తుంటే ఆమె మాటల్లో వాస్తవం అర్ధమవుతున్నది ” లేచి నుంచుని రెండు అడుగులేస్తూ అన్నాడు వినోద్ .
అతను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో రేఖకి ఏమాత్రం అర్ధం కాలేదు . తల తిప్పి క్షణంపాటు అతనికేసి నొసలు చిట్లించుకుని చూసింది. ఆ మోహంలో భావాలు పట్టుకోలేక మళ్ళీ మొబైల్ లో తల దూర్చింది .

“ఇప్పటివరకూ ఇంత తెలివి తక్కువగా ఎట్లా ఉన్నాను ?” కుర్చీలో కూర్చుంటూ నెమ్మదిగా తనను తాను ప్రశ్నించుకున్నాడు . ఆ వెంటనే
“మేం చేసే ప్రయోగాలు, ఫలితాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి?.

ఒక కిలో బియ్యం కావాలంటే కనీసం నాలుగు వేల లీటర్ల నీరు కావాలి . వరి పండించకుండా వాళ్ళు వాటిని ఆదా చేస్తున్నట్లే కదా .. ఇట్లా చూస్తే ఒక్క ఆ ఊళ్ళో 70 మంది అంటే డెబ్భై కుటుంబాలు .. వాళ్ళు రోజుకు ఎన్ని కిలోల బియ్యం వాడుతుండొచ్చు .. నెలకి ,సంవత్సరానికి లెక్క చూస్తే .. ఎంతవుతుండవచ్చు .. అదంతా ఆదాయే కదా ..” కుడి బుగ్గన చూపుడు వేలు నొక్కిపట్టి ఓ పక్కగా వంగి కూర్చుని స్వగతంలో అనుకున్న మాటలు పైకి ఎగదన్నుకొచ్చేశాయి వినోద్ గొంతులోనుండి

ఇకముందు ముందు నీటిమీద ఆధారపడడం అంటే మరీచిక వెంట పరుగులు పెట్టడమే . వాతావరణ మార్పులవల్ల వేడి పెరుగుతున్నది . సాగునీటి కొరతని తట్టుకుని , అధిగమించి ఏది నిలవగలదో అదే భవిష్యత్ పంట .
అవును .. ఆ మహిళలు ఆ పంటలే పండిస్తున్నారు .
అంటే అవే భవిష్యత్ పంటలు . పెట్టుబడి లేని పంటలు . వాళ్ళన్నట్టు గాలికి పెరిగే పంటలు.
విత్తనం వాళ్లదే. జ్ఞానం వాళ్లదే . తెలివి వాళ్లదే .

వాళ్లకి కావాల్సినవి వాళ్ళు పండించుకుంటున్నారు . సహజంగా చాలా సహజంగా పండించుకుంటున్నారు . ఆలోచిస్తున్న కొద్దీ వాళ్ళ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా తోస్తున్నది వినోద్ కి .
గాలివాటుగా వచ్చిన వేప పూత వాసన పలకరించి పోతున్నది. దాన్ని ఆస్వాదిస్తూ మొబైల్ చూడ్డం ఆపి భర్త వైపే చూస్తూ అతన్ని శ్రద్దగా గమనించడం మొదలు పెట్టింది రేఖ . అదను చూసి కొడుకు చదువు గురించి కదపాలని ఆమె ఆలోచన

“మేం అన్నీ మానిటరీ టర్మ్స్ లో చూస్తాం . కానీ అలా చూడాల్సిన అవసరం ఉందా .. లేదు కదా … పైసల్లేకుండా ఎవరు సంపన్నంగా ఉంటారని కళ్ళు మూసుకుని ఆలోచిస్తే…
కళ్ళు మూసినా తెరిచినా కళ్ళముందు ఆ సంఘం మహిళలే కనిపిస్తున్నారు .
ఎప్పుడు వ్యవసాయంలో వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉండదో.. అప్పుడు, ఎవరి మీద వాళ్ళు ఆధారపడతారు . అప్పుడు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం .. ? ఆ విధంగా విధి విధానాలు ఎందుకు ఉండడం లేదు “. బయట చెట్టుపైకి ఆకాశంలోకి స్వేచ్ఛగా గిరికీలు కొడుతున్న పక్షులనే చూస్తూ తనని తానే ప్రశ్నించుకుంటున్నాడు వినోద్

ఏంటో ఈ మనిషి… ఒకదానికి ఒకటి పొంతనలేకుండా ఈ మాటలు.. మనసులో అనుకుంటూ
“మరి మీ ప్రయోగాలు .. ఆవిష్కరణలూ .. ” ఆమె అర్ధోక్తిలో ఆగింది . నాలుగు మాటలకు తప్పదన్నట్లుగా ఒక మాట తూచి తూచి మాట్లాడే మనిషి ఇట్లా తనలో తానే మాట్లాడ్డం వింతగా తోచింది ఆమెకు.

జహీరాబాద్ వైపు వెళ్లి వచ్చి దాదాపు నెల అవుతున్నది . అయినా వినోద్ తలపుల్లోంచి అక్కడ చూసిన ముతక మహిళలు మాసి పోలేదు. వారి చుట్టూ , వారి వ్యవసాయం చుట్టూ , తన ప్రయోగాల చుట్టూ లోలోన ఘర్షిస్తూ తిరుగుతున్నాడతను అనుకుంది రేఖ.

కొన్ని క్షణాల మౌనం తర్వాత

“అంతేనా .. మీ ప్రయోగాలతో సృష్టించిన వరి వంగడాల దిగుబడి కోసం పెద్ద మొత్తంలో వాడే రసాయన ఎరువులు , క్రిమి సంహారక మందుల మాట ఏమిటి ” ప్రశ్నించింది రేఖ అతన్ని కవ్విస్తున్నట్లుగా . అతన్ని మాట్లాడించడం కోసం అట్లా కవ్విస్తూ అతనితో సంభాషణ పొడిగిస్తూ ఉండడం రేఖకి అలవాటే.
.
” మనం ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెడతామో అదే అంత మంచిది అనుకుంటాం . చాలా మంచి ఆహారం తింటున్నాం అనుకుంటాం . అన్ని ధాన్యాల్ని ధాన్యంగా చూడం. వాటిలో ఉండే సుగుణాలపరంగా మంచి అని అర్ధం చేసుకోము .. ” అప్పుడే నిద్రలేస్తున్నట్లుగా అన్నాడతను

“నేను అడిగినదేంటి ? నువ్వు చెబుతున్నది ఏంటి వినోద్ .. ఎక్కడున్నావసలు ? నేను మాట్లాడుతున్నది రసాయన ఎరువులు, క్రిమినాశినిల గురించి . ” కొద్ది క్షణాల వరకూ పిల్లల చదువుల గురించి అతనితో మాట్లాడాలనుకున్న విషయాలు ఎక్కడికెగిరిపోయాయో .. కానీ ..ఆ స్థానంలోకి నెమ్మదిగా చొరబడి తచ్చాడుతున్న ఆలోచనలతో అతన్నే చూస్తూ అన్నది రేఖ

“అవి వాడకం వల్ల పెరిగిపోతున్న రోగాలు… ముఖ్యంగా కాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు .. వాటి మీద కుమ్మరించే సొమ్ము , పని దినాల నష్టం , కుటుంబాలవేదన – ఆవేదన , సమయం … అదంతా ఒక విషవలయంలా ఉన్నది కదా .. ?” అన్నదామె తానూ బుర్రకు పదును పెడుతూ ..

“నిజమే .. రేఖా .. మనలో కొత్త కోణం నిద్ర లేచింది.
మొన్న ఆ సంతోషమ్మ వాళ్ళు రోగం పంటలు , రోగం తిండి అని మాట్లాడితే మనసు చివుక్కుమంది . మా పరిశోధనలు వాటి ఫలితాల విలువ తెలియక అట్లా మాట్లాడిందేమోనని సరిపెట్టుకున్నాను .

పుస్తకాల్లో చదివిందే జ్ఞానం అనుకుంటాం . చదువు ఇచ్చిన తెలివితేటలతో అవగాహనతో వాళ్ళే సమస్యలు పరిష్కరిస్తారు అనుకుంటాం . కానీ మనుగడ కోసం సాగించే పోరాటంలో జీవితమే పెద్ద బాలశిక్ష . వాళ్ళకి అక్షరంతో పనిలేదేమో…!
ప్రతికూల వాతావరణంలోనయినా పౌష్టికాహార , ఆహార భద్రతనిచ్చే పాతతరానికి చెందిన జ్ఞానం , అనుసరిస్తున్న విధానాల్లో రైతుల భావోద్వేగాలు , ఆచారాలు , సంస్కృతిలో ఈ వ్యవసాయం ముడిపడి ఉంది .

వర్షం ఉన్నప్పుడు ఏ పంటలు వేయాలి . కరువొచ్చినప్ప్పుడు ఏయే భూముల్లో ఏయే పంటలు కలిపి పండించుకోవాలన్న సాంప్రదాయ విజ్ఞానం , జీవవైవిధ్య సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయంలో అంతర్భాగం అని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS ) తదితర సంస్థల అధ్యయనం చెబుతున్నది .

కానీ మనం వ్యవసాయాన్ని జూదంగా మార్చేశాం . వ్యవసాయం జూదం కానప్పుడు అప్పులు ఆత్మహత్యలు ఉండవు . వ్యవసాయ సంక్షోభ నివారణకు ఆ మహిళల సేద్యమే అనుసరణీయం . నేను యూనివర్సిటీలో చదువని విజ్ఞానం ఎంతో ఆ మహిళల దగ్గర ఉన్నదనిపిస్తున్నది .

ఆ రోజు, ఆ ముతక మనుషుల మాటలకు అచ్చెరువొందాను. కానీ వాళ్ళ మాటల్లో చేతల్లో అంతర్లీనంగా ఉన్న తాత్వికత , జ్ఞానం, తర్కం, భవిష్యత్ వెలుగుల కోసం పడే తాపత్రయం, వాళ్లు చేస్తున్న కృషి అర్ధమై మోకరిల్లుతున్నానిప్పుడు…” మనసు లోపలి పొరల్లోంచి తోసుకొచ్చిన మాటల ఉద్వేగంతో అటూ ఇటూ పచార్లు చేస్తూ కొన్ని క్షణాలు ఆగాడు వినోద్ .

రేఖ అతని మాటల్ని చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నది .

“నీకు తెలిసే ఉంటుంది వాళ్ల పంటల్లో ఉన్న సుగుణాలు ఏంటో .. వాటిని ఆనాడు అర్ధం చేసుకోలేక పోయాను . కొంత నిర్లక్ష్యంగానే వ్యవహరించాను . వారి ఆహార అలవాట్లే వారి ఆరోగ్య రహస్యం కావచ్చు . వారు పండించే పంటలే వారిని పోషకాహారలోపం లేకుండా కాపాడి ఉండొచ్చు. అవే వాళ్ళకంత శక్తిని ఇచ్చి ఉండొచ్చు .

నిజానికి వాళ్ళు పండించేది విలువైన పంటలు . చాలా చాలా విలువైన పంటలు . వారివే భవిష్యత్ పంటలు . కరువు కాటకాలను తట్టుకునే పంటలు . అనేక వ్యాధులను తట్టుకుని ధీటుగా ఎదుర్కునే పంటలు . భూమికి జవజీవాలనిచ్చే పంటలు . తిండినివ్వడమే కాదు పర్యావరణానికి మేలుచేసే పంటలు
మొగులమ్మ అన్నట్లు విత్తనాల కంపెనీలకు, ఎరువుల కంపెనీలకు ఇచ్చే సహాయం , సపోర్టు , రాయితీలు వీళ్లకు ఇచ్చి ప్రోత్సహిస్తే .. విత్తనాలను వ్యాపారంగా మార్చకపోతే ” అంటుండగా మధ్యలో అందుకొని

“ఇన్ని రోగాలు .. ఇన్ని హాస్పిటల్స్ .. ఇన్ని మందులు .. అవి తయారు చేసే కంపెనీలు, వాటి వెనక ఉన్నబడా వ్యాపారం అన్నీ తగ్గిపోతాయోమో కదా .. ” ఏదో
ప్రకటనను అనుకరిస్తూ మొహంలో వెలిసిన సన్నని నవ్వు తో రేఖ

అవునన్నట్లు తల ఆడించాడు వినోద్ . కానీ అతని ఆలోచనలు ఎటెటో వెళ్లి వస్తున్నాయి.
మిత్రుడి కోసం పది రోజుల క్రితం తిరిగిన కాన్సర్ హాస్పిటళ్లు, చిన్నమ్మ కొడుక్కు వచ్చిన కిడ్నీ వ్యాధి చికిత్స కోసం కార్పొరేట్ హాస్పిటళ్ల చుట్టూ తిరిగిన వైనం .. , వాటిలో ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర ఉన్నట్టు కిటకిటలాడుతున్న రోగులు.., తమ ప్రాణాల్ని కాపాడుకోవాలనుకునే, నిలుపుకోవాలనుకునే వారికి ఆసుపత్రులు వేసే ఆశల వలల నిచ్చెనలు ..

తమ వాళ్ళని బతికించుకోవాలన్న కాంక్షని కొల్లగొట్టేసే వైద్యం, రోగుల తరపు వారి బంధాలు – అనుబంధాలు ఆసరా చేసుకుని చేదు నిజాలపై తీయటి తేనెల మాటలు కుమ్మరిస్తూ ఆఖరి క్షణం వరకూ జలగల్లా పీల్చి పిప్పి పిప్పిచేసి చివరికి మా ప్రయత్నం మేం చేసాం . ఇక లాభం లేదని చేతులెత్తేసే కార్పొరేట్ వైద్యులు కళ్ళముందు మెదిలారు.
అంచెలంచెలుగా పెరిగిపోతున్న మూడు నక్షత్రాల ఐదు నక్షత్రాల ఆసుపత్రుల అద్దాల మేడల్లో కుప్ప కూలిపోతున్న జీవితాల్ని తలచుకొని వినోద్ హృదయం భారమైపోయింది . మనసు మూగపోయింది .

లేచి వెళ్లి కళ్ళజోడు తీసి డైనింగ్ టేబుల్ పై ఉన్న టిష్యూ తో తుడిచి మళ్ళీ పెట్టుకున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకు కూర్చున్నాడు. రేఖ అన్నట్లు తను స్వప్నిస్తున్నాడా .. ఏమో .. అవన్నీ లేని లోకాన్ని స్వప్నిస్తున్నాడేమో ..!

“అవును, ఈ మధ్య జనానికి హెల్త్ అవేర్నెస్ పెరిగింది . చాలా హెల్త్ కాన్షియస్ గా ఉంటున్నారు.
ఖాదర్ వలీ మాటలు విని చదువుకున్న వాళ్లంతా చిరుధాన్యాలకు ఎగబడుతున్నారు. కానీ, సంఘం మహిళలు ముందు నుండీ అవే పండిస్తున్నారు . అవే తింటున్నారు . కొర్ర పాయసం , సామ పాయసం , పచ్చజొన్న రొట్టె , రాగి జావ , అరికెల బువ్వ వంటివి సాంప్రదాయ తిండి కావచ్చు . కేకులు , పుడ్డింగులు , స్నాక్స్ , లడ్డులు వంటి వంటలతో ఆధునికం అవడం లేదూ .. సాంప్రదాయం .. ఆధునికం చెట్టాపట్టాలేసుకుంటూ సాగడం నాకయితే చాలా గొప్పగా కనిపిస్తున్నది . అనిపిస్తున్నది ” అన్నది రేఖ

“ఆహార భద్రత కోసం మొదలైన ఈ సంఘాలు ఇప్పుడు ఆహార సార్వభౌమత్వం వైపు అడుగుతీస్తున్నాయి .
తక్కువ వర్షపాతం ఉండే జహీరాబాద్ ప్రాంతం అంటేనే పేదరికం విలయతాండవం చేసే ప్రాంతం. అటువంటి ప్రాంతపు మహిళలు తమ ఆకలిని తరిమికొట్టారు. పోషక విలువలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాల సాగు ఎంపిక చేసుకున్నారు. ఎన్నో తరాల నుండి వస్తున్న సాంప్రదాయ పంటల్ని పండిస్తూ సమష్టిగా ముందుకు తీసుకుపోతున్నారు.
ఎంత గొప్ప విషయం .. ?! తిండికోసం వీరు చేసిన యుద్ధంలో గెలిచారు రేఖా …గెలిచారు .
వెనుకంజ మాటే తెలియదు వాళ్లకు . కానీ .. భవిష్యత్ ఎటు తీసుకుపోతుందో ..?!” ఒకింత ఆందోళన వినోద్ గొంతులో వినిపించింది రేఖకు.

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply